అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం
కథ: అద్దంలో జిన్నా
రచన: దేవరకొండ బాలగంగాధర తిలక్
కథ రచనా కాలం: 1961
దేవరకొండ బాలగంగాధర తిలక్ (1921 - 1966) ప్రతిభావంతుడైన కవిగా, అమృతంకురిసిన రాత్రి తెలుగువారికి పంచి ఇచ్చిన మధుర కవిగా, ఆధునిక తెలుగు కవిత్వంతో పరిచయం ఉన్న వారందరికీ తెలుసు. ఇరవై ఏళ్ళు నిండకముందే తిలక్ తన కవిత్వాన్ని స్పష్టపరిచాడు:
“నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు,” అంటూ.
1941లో తెలుగు కవితాలోకానికి హఠాత్తుగా, తోకచుక్క వెలుగులా ప్రత్యక్షమై సమ కాలీన కవులందరినీ ఆకట్టుకున్న కవి, తిలక్. ‘రొమాంటిసిజం’ తిరిగి రాస్తున్నాడు అని అబ్బురపోయిన వాళ్ళూ ఉన్నారు; తరవాత ‘ఓస్ ఇంతేనా’ అని విమర్శించిన వాళ్ళూ ఉన్నారు. ఆ కవే, 1963లో తన “అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు” అన్న శపథం నిలబెట్టుకుంటున్నాడా అన్నట్టు, పరమ శక్తివంతమైన ‘ప్రార్థన’ రాస్తాడని ఎవరూ ఊహించి ఉండరు.
అలాగే తిలక్ అద్భుతమైన కథలు కూడా రాసేడు. 20 కథలతో ఒక సంకలనం మొట్టమొదటి సారి 1967లో ప్రచురితమయ్యింది. 1983లో రెండవ కూర్పు వచ్చింది. 29 కథలున్న ఈ సంకలనంలో చాలా చక్కని కథలున్నాయి. ఉదా: దేవుణ్ణి చూసిన వాడు, నల్లజర్ల రోడ్డు, సుందరీ - సుబ్బారావు, ఊరి చివర ఇల్లు, ఇలాంటివెన్నో. అయినా తిలక్ ప్రస్తావన వచ్చినప్పుడు, తిలక్ మంచి కథకుడు కూడా అన్న సంగతి మరిచిపోతాం. శ్రీశ్రీ విషయంలో కూడా అంతే. ఒక మహాప్రస్థానం మనకిచ్చిన మహాకవిగానే గుర్తుంచుకుంటాము కాని, చరమరాత్రి వంటి మంచి కథలు రాసిన కథకుడు అన్న సంగతి గుర్తుంచుకోము. కథకులుగా వీరిద్దరికీ రావలసిన పేరు రాలేదని నా అభిప్రాయం.
తిలక్ కథల్లో సూటిగా రాజకీయ ప్రస్తావన ఉన్న కథలు రెండు: తీవ్రవాదనాయకుడు, అద్దంలో జిన్నా.
నాకు నచ్చిన కథ అద్దంలో జిన్నా.
మొదటి కారణం: ప్యూర్లీ పర్సనల్. ఈ కథని, నేను, తంగిరాల సుబ్బారావూ కట్టుగా విన్నాం, తిలక్ చదువుతూండగా! కొన్ని కథలు, రచయితే చదువుతూ ఉంటే వచ్చే అనుభూతి ఒక రకం. అప్పటి అనుభూతి ఒక గుర్తు మాత్రమే. ఎప్పటికీ మరిచిపోలేని గుర్తు.
కొన్ని ఏళ్ళ తరువాత మళ్ళీ ఈ కథ చదివాను. నా అంతట నేనే, ఒకటికి రెండుసార్లు శ్రద్ధగా, ప్రతివాక్యం చదివితే వచ్చిన అనుభూతి వేరు. ఇది కథా? కవితా? అన్నప్రశ్నకి ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. అసలు ఇటువంటి ప్రశ్నకి సమాధానం ఉంటుందా? అని అనిపించింది.
మత రాజకీయాలని, విద్వేషాలనీ అవతలకి నెట్టి ఈ కథ చదవవలసిన అవసరం ఉన్నది. ఈ కథని చదవవలసిన నేపథ్యం కూడా వేరే! మహాత్మా గాంధీ అంటే సాధారణ భారతీయులకి ఎంత ఆదర్శమూర్తో, మహమ్మదాలీ జిన్నా పాకిస్థానీయులకి అంత ఆత్మీయుడు. గాంధీ భారత దేశాన్ని అఖండ భారతంగా ఉంచాలని విపరీతమయిన పట్టు పట్టాడు. నెహ్రూని పక్కకి తప్పించి జిన్నాని మొదటి ప్రధానిగా చెయ్యటానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. అయితే, జిన్నా గురించి హిందువులకి ఉన్న అభిప్రాయాలు వేరు. ఈ కథ చదివిన తరువాత జిన్నాని ఒకరకమైన సానుభూతితో చూడాలన్న అభిలాష కలగక మానదు. బహుశా కథకుడుకి ఆ దృష్టి ఉన్నట్టు కనిపిస్తుంది.
తిలక్ రాస్తాడు: “తాను (జిన్నా) వారిలో (ముస్లిములలో) అవ్యక్తంగా ఉన్న ఒక ఆశ. తన వ్యక్తతలో వాళ్ళందరూ మడతలు పడిపోయిన ఒక పెద్ద అవ్యక్తత.” In his distinctness, they are all folded into one huge indistinctness.
భారతదేశం మూడు పెద్ద ముక్కలుగా విరుగ్గొట్టటానికి ముందు సమయం, ఈ కథ నేపథ్యం. అయినప్పటికీ కొద్ది మార్పులు చేసి చదివితే ఈ కథ ప్రస్తుత ప్రపంచ వాతావరణానికి కూడా సజావుగా సరిపోతుంది.
“తనవెంట మహమ్మదీయులంతా వస్తారు. ఎందుకు వస్తారో వారికి తెలియదు. అజ్ఞానం. అజ్ఞానం క్రియకీ కర్మకీ కారణం. జ్ఞానం సమాధికీ నిదానానికీ కారణం. ఈ అజ్ఞానాన్ని తాను భద్రంగా కాపాడుతాడు.”
ఈ పైవాక్యాలు చదవంగానే, జిన్నా తన స్వప్రయోజనం కోసం, దేశాన్ని ముక్కలు ముక్కలుగా చెయ్యడానికి దోహదం చేశాడనిపిస్తుంది. పాఠకుడికి ఆ భావన స్ఫురిస్తుంది. నిజమే! కాని,
“తన మనస్సు తన భావాన్ని నిజానికి నమ్మలేదు. తనలో ఉండే అధికార వాంచ ఆ భావాన్ని తయారు చేసి యితరులని నమ్మమంది. తాను నమ్మినట్టుగా నమ్మించింది.”
జిన్నా ఇంగ్లండ్‌లో చదువుకున్నాడు. సెక్యులరిస్ట్ భావాలున్న న్యాయవాది. షేర్వానీ, సల్వార్ కమీజులు కాకుండా వెస్టర్న్ సూట్స్ వేసుకునేవాడు. సిగరెట్, మందు అలవాటున్నవాడు. నిజానికి జిన్నా ఖురాన్ చదివుంటాడా అని సందేహం వచ్చినా రావచ్చు. భారత స్వాతంత్ర్య సమర చరిత్ర సమగ్రంగా చదివినవాళ్ళకి తప్పకుండా గుర్తుండే విషయం: బాలగంగాధర తిలక్ (లోకమాన్య) పై బ్రిటీషు ప్రభుత్వం దేశద్రోహం మోపినప్పుడు, జిన్నా లోకమాన్య తిలక్ తరఫున వాదించిన న్యాయవాది. ముస్లిం లీగ్‌కి, అప్పటి కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమన్వయం సాధిండానికి కృషిచేసిన వాడు జిన్నా. ఈ విషయాలు రచయిత తిలక్‌కి క్షుణ్ణంగా తెలుసు.
అందుకే కాబోలు, అద్దంలో జిన్నా కథలో జిన్నాలో వచ్చిన విపరీతమైన మానసిక ఆందోళన, రోడ్ల మీద రక్తం, వేలకొద్దీ అమాయకుల రక్తం, హిందువుల రక్తం, ముస్లిముల రక్తం చూసిన తరువాత అద్భుతంగా చిత్రించబడింది. ‘తన భావం కోసం ఇంత ఘోరం జరిగింది,’ అన్న మానసిక ఆవేదన కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. అది కథకుని శిల్ప ప్రజ్ఞ.
అద్దంలో జిన్నా గుండెమీద రక్తపు మరక కనిపిస్తుంది. ఇది ఒక చిత్రమైన ప్రతీక. తనకు తప్ప ఇంకెవరికీ కనిపించదు ఆ రక్తపు మరక. ఆ రక్తపుమరక తనతో అంటుంది: ” నీ భావం అబద్ధం. నీ భావం అనవసరం,” అని. అంతే కాదు, ‘తనే నిజం’ అని ఘోషిస్తుంది, రక్తపు మరక.
కళ్ళు మూసుకుంటాడు జిన్నా. తన మనస్సుకి అతని మనస్సు కనిపిస్తుంది. జిన్నా మనస్సులో ఉన్న భయంకర పరమాణువు చూస్తాడు. చూసి, ఇలా అంటాడు: “నీ భావం నాకు వద్దు. నీ భావం అనేకమందిని చంపింది. నీ భావం అబద్ధం. కృత్రిమం. నిజమైనా కూడా నాకు వద్దు. నేను అందరితోనూ నిజం చెప్పేస్తాను. నాకు శాంతి కావాలి. నాకు మైత్రి కావాలి,” అని.
చేతులు కాలినాయి. ఇప్పుడు ఏం ప్రయోజనం? ‘అహం’ ఎర్రగా ఎదురు తిరిగింది. జిన్నా హడిలి పోయి తలవంచుతాడు, తన అహానికి. తను పురికొల్పిన మూర్ఖతకి తానూ తల ఒగ్గుతాడు. తప్పదు. బయట విలేఖరులకి ఇచ్చే సందేశం రాజకీయనాయకుడిగా ఇచ్చే సందేశం. ఈ సందేశం తాను నిజంగా నమ్మిన సత్యం కాదు. అది జిన్నాకి తెలుసు. చివరలో, తన గుండెమీద కనపడ్డ రక్తపు మరక అబద్ధం కాదు. ప్రతిబింబం అసలే కాదు. చెరిపినా చెరగదని గుర్తిస్తాడు.
ఒక అబద్ధాన్ని, నిజం అని చెప్పి నమ్మించవచ్చును. తర్వాత ఆ అబద్ధం అబద్ధమేనని చెప్పినా ఎవరూ నమ్మరు. నాయకుడెప్పుడూ నాయకుడి లాగానే ఉండాలి. అలా ఉండకపోతే నాయకుడినే చంపేస్తారు. సాంఘిక మతపరమైన ఒక మూర్ఖతని తాను పురికొల్పాడు. ఆ మూర్ఖతకి తానూ తల ఒగ్గాలి, చివరకి. నాయకుడు అజ్ఞానాన్ని అభివృద్ధి చెయ్యాలి. అజ్ఞానం బలమైనది. జ్ఞానం చురుకైనది. ఈ మాటలు రచయిత మనకి చెపుతున్నాడు; అయినా ఇది జిన్నా మనసులో పుట్టిన నిజమే!
మనిషిలో మంచి, చెడుల మధ్య పోరాటం - ఈ juxatapositionని - అతి చాకచక్యంగా తిలక్ చిత్రించాడు. ఇంత నిశితంగా వ్యక్తి మనస్తత్వాన్ని పరిశీలించి రాసిన పాత కథకులు పద్మరాజు, బుచ్చిబాబు, త్రిపురలు. అద్దంలో జిన్నా కథ చదివిన తరువాత, తిలక్ కూడా ఈ కోవకి చెందిన కథకుడే అనిపించక మానదు. కథలో ప్రతి పేరా ఒకటికి రెండు సార్లు చదివిస్తాడు రచయిత. కథాంతంలో, జిన్నా మీద కోపం, ద్వేషానికి బదులు అతనిపై కరుణ, దయ - compassion, pity - వస్తాయి.
మొదట్లో నేను ఇది కథా? కవితా? అన్న సందేహం వ్యక్తపరిచాను. కథలని కొన్ని లక్షణాల చట్రాలతో బిగించి కట్టుదిట్టంగా చూసే అలవాటున్న వారికి, ఇది ఒక స్కెచ్. సైకలాజికల్ స్కెచ్‌గా కనిపించవచ్చు. అది భవ్యమే కావచ్చు కూడాను. నా మటుకు నాకు ఇలా అనిపిస్తుంది: లబ్ధప్రతిష్టులైన కవులు కథ రాసినా, కవిత్వం రాసినా కవిత్వం లాగానే కనపడుతుంది. చదివితే కవిత్వంలా వినిపిస్తుంది. అయితే, ఈ వివరణని సాధాకరణీకరించను. ఇది అన్ని కథలకీ వర్తించకపోవచ్చును, కాబట్టి. (తిలక్ రాసిందే మరొక చిన్న కథ; కవుల రైలు అని. అదీ, నా ఉద్దేశంలో కవితే.)
ఈ కథ నచ్చటానికి మరో కారణం, ఇది నాకు కవితగా అర్థమయ్యింది కాబట్టి.
మీకు తెలిసే ఉండాలి; దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ‘మా ఊరు పోయింది’ అనే కథ రాసారు. అది నిజంగా కథ కాదు; కవిత. తిలక్ రాసిన అద్దంలో జిన్నా అదే కోవకి చెందుతుందని నా అభిప్రాయం.
[పుస్తకం వివరాలు: తిలక్ కథలు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, మూడవ ముద్రణ 1993, రూ. 35.00, అన్ని విశాలాంధ్ర బుక్ హౌస్‌లలో లభ్యం.]
Purnima అభిప్రాయం:
May 1, 2012 2:53 pm
నాలుగేళ్ళ కిందట తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేసుకునే రోజుల్లో తిలక్ కథలు చదివాను. అందులో నాకు ఈ ’అద్దంలో జిన్నా’ కథ బాగా నచ్చింది. మీరు రాసినదాంట్లో ఓ రెండు విషయాలు ’నా అభిప్రాయాలే’ అని అనిపించాయి.
>> కథలని కొన్ని లక్షణాల చట్రాలతో బిగించి కట్టుదిట్టంగా చూసే అలవాటున్న వారికి, ఇది ఒక స్కెచ్. సైకలాజికల్ స్కెచ్‌గా కనిపించవచ్చు.
ఈ కథ నాకు చాలా నచ్చటానికి ఇదే ముఖ్యకారణం. ఈ కథను చదివిన కొందరు ఇది చాలా అసంబద్ధమైన కథనీ, ఒక పట్టాన అర్థంకాదనీ అంటారు. కానీ నన్ను అడిగితే, కథాకాలంనాటి దేశరాజకీయ పరిస్థితులు అంతగా తెలియకున్నా కూడా ఈ కథ బలంగా తాకింది నన్ను.
తిలక్ ఏమంత గొప్ప కథకుడు కాదన్న వాదననూ విన్నాను. కానీ నేను చదివిన అతికొద్ది మంది తెలుగు కథకుల్లో తిలక్ కథలు ఒకట్రెండు నాకు చాలా నచ్చేవి ఉన్నాయి. నాకాయన కవిత్వంకన్నా కథలమీదే ధ్యాస ఎక్కువ.
>> లబ్ధప్రతిష్టులైన కవులు కథ రాసినా, కవిత్వం రాసినా కవిత్వం లాగానే కనపడుతుంది. చదివితే కవిత్వంలా వినిపిస్తుంది.
మీ మటుకు మీకే కాదు, నేను కూడా మీ జట్టే ఈ విషయంలో. జనరలైజ్ చేసే ఉద్దేశ్యం నాకూ లేదుగానీ, దాదాపుగా నేను చదివిన కవుల prose కూడా కవిత్వంలానే చదివిస్తుంది, వినిపిస్తుంది, అనిపిస్తుంది. తెలుగులో శ్రీశ్రీ, బైరాగి కథలు అలా అనిపించాయి నాకు.
Madhava Murthy అభిప్రాయం:
May 2, 2012 2:11 pm
ఏ కవిత కానీ, కథానిక కానీ కొన్ని సంవత్సరముల తరువాత మరల చదివినప్పదు, మనకు ఇంకా బాగా రచయిత భావాలు అర్థమవుతాయి. మాయాబజార్ సినిమా చూచిన ప్రతిసారి మనం కొంత కొత్తది తెలుసుకుంతాము. ఇక్కడ జిన్నా గురించి రాసిన కథలొ మార్పులేదు, మార్పు మన ఆలోచనలలొ.
Phaneendra అభిప్రాయం:
May 3, 2012 6:56 am
తిలక్ కవిత్వంలో కథా లక్షణాలూ, ఆయన కథల్లో కవిత్వ చాయలూ ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. మానసిక సంఘర్షణను ఇంత శక్తిమంతంగా చూపిన రచన నా పరిమిత పఠనా జీవితంలో తారసపడలేదు. రచయిత ఉద్దేశాలతో అభిప్రాయ భేదాలున్నా ఆ శైలిని మోహించకుండా ఉండలేను.
Saradhi Motamarri అభిప్రాయం:
May 4, 2012 2:49 am
Tilak’s ‘addaMlo jinnah’ is one of my favorite katha. I didn’t much bother whether it is kavita or essay or katha. But I haven’t come across any comparable artifact. Actually, it is high time to talk about this story to every Telugu person not just India but across the globe. Though he wrote about Jinnah, it looks not different to me from the current genre of politicians who want to break Andhra into pieces for their breakfast.
mallikarjuna sarma అభిప్రాయం:
May 7, 2012 6:20 am
ప్రధాన చర్చ నుండి ఈ నా deviation కు క్షంతవ్యుణ్ని. తిలక్ ‘నల్లజర్ల రోడ్డు’ radio నాటికగా వచ్చిందా! సందేహాన్ని విజ్ఞులు తీర్చగలరు.
lyla yerneni అభిప్రాయం:
May 24, 2012 3:19 pm
వేలూరి కొంత కాలంగా -అపరాధులను క్షమించే అమెరికా ప్రెసిడెంట్ మోడ్ లో ఉన్నారు. ఒక్కో కథ, కవిత చదివి -వీరిని క్షమించాలి, వారిని అర్థం చెసుకోవాలి, ఈ కథలో వారిని సానుభూతితో చూడాలి, అని ఉదారులై పోతుంటారు. వేలూరి తరుణ హృదయులు. తరచి చూస్తే, ఉదారత ఎల్ల వేళలా మంచిదే. క్షమాగుణం సర్వత్రా మంచిదే.
కాని,
” దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది ” - అనే విప్లవకవి చెఱబండ రాజు కవిత ఆయనకు ప్రార్థనా పద్యంలాగా వినిపిస్తుంది.
‘వేలూరి’ ఉద్దేశంలో - ” విపరీతమైన ప్రేమ అనురాగం ఉన్న వ్యక్తే ఇటువంటి పోలికలు ధైర్యంగా చెప్పగలడు.” (చూడు: “మూడు ప్రార్థనా పద్యాలు” ఈ మాట)
That’s one hell of a topsy turvy hypothesis. - I think.
The utterly selfish, give me give me, irresponsible, సోంబేరి graffiti in this poem makes my skin crawl.
ప్రేమ, అనురాగం భాష అదేనా? దేశాన్ని తల్లిగా ఊహిస్తూ, మళ్ళీ ఆ తల్లిని వేశ్యగా ఊహిస్తూ బూతులు తిడుతున్నది, ఈ కవితలో ఉన్న వ్యక్తి -ఒక చిన్ని బాలుడు కాదు. (శైశవ క్రీడగా తల్లి స్థనాలతో ఆడుకునే చిన్ని mythological వినాయకుడు కాడు.) అసలు చిన్ని బాలుడికి తల్లి గురించి అట్టి ఘటియా ఊహలు రావు. ఆ కవితలో ఉన్నది నిజమైన దేశంలో, ఒక ఎదిగిన పౌరుడు. దేశం మట్టీ కాదు. మశానం కాదు. తల్లీ కాదు తండ్రీ కాదు. దేశం పౌరులే.
“Ask not what the country had done for you, Ask what you have done for the country” - అన్న ధోరణిలో ఆలోచించే పౌరుడు, ఈ కవి కాడు. Entitlement మరిగిన ఒక మనిషి. దేశ వ్యవహారాలలో తన బాధ్యత ఏమిటి అని ఆలోచించకుండా - కవిత్వం లో దేశాన్ని personify చేసి - అందునా ఒక స్త్రీగా, కులటగా ఊహించుకుని, నీ గమ్యం ఏమిటి తల్లీ? - అని విచారపడి పోతూ ఉంటాడు.
ఇది చదివే నాకు; తల్లి పడుపు వృత్తి చేస్తూ సంపాదించుకు వస్తుంటే, ఆ సంపాదనకోసం నోరు తెరుచుకుని ఎదురు చూసే బడితె, -వాడెలాటి కొడుకు? అతడే పని చేస్తున్నట్టు లేదేం, దుష్టపు ఊహలు ఊహిస్తూ తల్లి మీదే రాళ్ళు విసురుతూ నోరు పారేసుకోటం తప్పించి.- అన్న ఆలోచన వస్తుంది. నాకు ఈ కవి నచ్చడు.
వేలూరికి ఈ కవీ నచ్చుతాడు. తిలక్ కవీ నచ్చుతాడు. అదెలా? అది నా కర్థం కాదు.
గమనిస్తే ఈ దిగంబర కవికీ , తిలక్ కూ ఆలోచనల్లో ఎంతో తేడా ఉంది. పాఠకులు గమనించవలసినది ఆ మానవత్వపు తేడాలే. తిలక్ కథలు చదివిన వారికి సవ్యమైన ఆలోచన తెలుస్తుంది. సంస్కృతి. సంప్రదాయము , చట్టుబండలు ఆలోచనలు కావతనివి. తిలక్ కథలూ కవితలూ కొన్ని చదివాక - ఇది కథా, కవితా, ఎలాటిదీ శైలీ, అన్న మీమాంస కాదు, అతను రాసే విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు పాఠకులు. ఇవ్వాలి.
Ron Paul (నాయకుడిగా ఎన్నిక అవడు) ఇటీవలి రిపబ్లికన్ డిబేట్లలో -ఒక డాక్టర్గా, యుద్ధమ్లో స్వయంగా పాల్గొన్న వాడిగా - మనిషి జీవితం ఎంత విలువైనదో, పదే పదే చెప్పాడు. సంవత్సరాల తరబడి -పగ, విద్వేషాలూ, యుద్ధాలలో ఇరుక్కుని ప్రాణ నష్టం, అంగ వైకల్యం పౌరులకు జరగరాదు అని మళ్ళీ మళ్ళీ చెపుతున్నాడు. నిజంగా యుద్ధానికి పంపబడే యువకులు గమనిస్తున్నారు. ఆలోచించుకుంటున్నారు. వారు తప్పక ఆలోచించుకోవాలి. జీవించవలసిన వయసులో జీవించాలి. శృంగారం అనుభవించవల్సిన వయసులో, విడదీయబడి, విరహ కావ్యాలు రాసుకుంటే వారికేం లాభం? వికలాంగులైతే ఏంటి దారి? ఎంత పెన్షన్ ధనం ఆ లోటు తీరుస్తుంది?
కానీ, కొందరు నాయకులు, ఇప్పటికీ, యుద్ధ సైనికులు హీరోలనీ, వీరులనీ, వీర మరణాలనీ, అమరులనీ - అదో పిచ్చికవిత్వ భాష మాట్లాడుతుంటారు. తిలక్ రచనలు - అట్టి nonsensical talk and thought నుండి liberate చేస్తాయి. విభజించి ఆలోచించటాలు, నాయకులను వెర్రిగా నమ్మటాలు, తిలక్ రచయితగా మానేశాడు. యుద్ధాలు, మనుషులకు చేటని తిలక్ కు స్పష్టం.
రాజకీయ నాయకుడు అనే పాత్ర ధరించిన వాడి జీవితం, ప్రవర్తన, evolution, progression, ఎలా ఉంటుంది అన్న ఒక చక్కని study- ‘అద్దంలో జిన్నా’ అన్న రచన. జిన్నా గుండెపై రక్తపు మరకలు - Macbeth చేతులపై రక్తపు మరకలు లాగానే ఎంత కడిగినా పోవు. ఈ తిలక్ కథలు చదివాక, ఏ జిన్నాల -కోట్లు చూస్తానికి, ఊరికే దేశం మీద పడి అరిచే ‘ దిగంబర కవిత్వం’ వింటానికీ - కొందరు ప్రజలు పోరు.
ఇది కవిత్వమా? కథా? అన్న ప్రశ్న తిలక్ కధ విషయంలో, విమర్శకుడికి ఎందుకు? తోటి ప్రజలను గురించిన ఆలోచన మాని, నాయకుడి పై సానుభూతి చూపుదామా - అంటూ - ఆలోచన దారి మళ్ళించటం ఎందుకు? I am sorry. నా కర్థం కాదు. Pardon me too.
లైలా
vrveluri అభిప్రాయం:
June 11, 2012 7:42 pm
What more can I say to your erudite comment, Laila garu! Except to request and remind you to accept the adage, ” de Gustibus non est Disputandum.” — Regards, Veluri Venkateswara Rao commenting not as Editor-in-Chief of eemaata.
ప్రసాద్ అభిప్రాయం:
June 13, 2012 2:47 pm
లైలా గారు లేవనెత్తిన సాంఘీక అంశాలని, “లోకో విభిన్న రుచిః” అనే ఆర్యోక్తితో, వేలూరి గారు ఎగర గొట్టడం సబబుగా లేదు. ఇదేమీ, “ఒకరికి బంగాళా దుంప ఇష్టమైతే, ఇంకొకరికి టొమాటో ఇష్టం” లాంటి విషయం కాదు. విప్లవ కవులు అని చెప్పుకునే వారు, స్త్రీలకు సంబంధించిన విషయాల్లో ఎంత బండతనంతో వుంటారో, వారిని అవమానించే మాటలను, వేరే ఆలోచన లేకుండా, ఎలా తమ విప్లవ కవిత్వంలో వాడుకుంటారో తెలియజేసే విషయం ఇది. దీని రుచి సమాజంలో అందరికీ ఒకేలాగా వుండాలి కదా? ఈ బూర్జువా సమాజంలో, పురుషులు ఇతర పురుషులను తిట్టే తిట్లు, ఎక్కువగా ఆ పురుషులకు సంబంధించిన స్త్రీలని అవమానం చేసే మాటలే. స్త్రీ వివక్షకి సంబంధించిన విషయాలు, అభ్యుదయ వాదులకు ఒకే రకంగా రుచించాలి.
ప్రసాద్
rama bharadvaj అభిప్రాయం:
June 13, 2012 9:35 pm
ప్రసాద్ గారూ! జయప్రభ, దిగంబరకవిత్వం మీద విపులమైన చర్చ చేసి వారి కవిత్వాన్ని విశ్లేషణ చేసి [1993 లోనే] రాసిన వ్యాసం ఉంది. [మార్గము- మార్గణము అన్న పుస్తకం లో అది చదవడానికి వీలుగా లభిస్తుంది కూడా!] అది రాసి దాదాపు ఇరవై ఏళ్ళు కావొస్తోంది కదా! అందులో ఆమె కూలంకషంగా దిగంబరుల దృస్టినీ.. వాటిని సమర్ధించిన విమర్శకుల దృస్టినీ సైతం విశ్లేషణ చేసి ఉన్నారు కదా! ఆ చర్చ తరవాత కూడా.. ఆమె ఆ వ్యాసం రాసిన తరవాత కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి ..వేలూరి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆయన దృస్టిని చెబుతోంది. వేలూరికి ఆ సాహితీ సందర్భం తెలియకుండా ఉంటుందని నేను అనుకోవడం లేదు. అందువలన ఆయన అభిప్రాయం రాసిన తీరు ఈ విషయంలో తప్పక గర్హించతగినదే !!
రమ.
lyla yerneni అభిప్రాయం:
June 17, 2012 3:05 pm
జయప్రభ, దిగంబరకవిత్వం మీద విపులమైన చర్చ చేసి వారి కవిత్వాన్ని విశ్లేషణ చేసి [1993 లోనే] రాసిన వ్యాసం ఉంది. [మార్గము- మార్గణము అన్న పుస్తకం లో అది చదవడానికి వీలుగా లభిస్తుంది కూడా!] -రమ.
Thanks for the information. I read this essay, in the above mentioned book. I like it.
The essayist’s ability to get her thoughts across to a reader with such clarity and coherence (especially, when the subject she has to deal with - itself is - muddled thought and its base expression in a particular period poetry,) is impressive.
I will proceed to read the other literary essays in that book by Jayaprabha. That will be a part of this summer reading of mine.
లైలా