ఈమాట » ఆషాఢస్య ప్రథమ దివసే

Expand to right
Expand to left

ఆషాఢస్య ప్రథమ దివసే

పరిచయము

ఆకాశము దట్టంగా కారు మబ్బులతో నిండి, ఉన్నట్లుండి కర్ణభేరి బద్దలయేట్టుగా ఉరుముల మ్రోతలు వెనుకంటి వస్తుంటే మెరుపుతీగలు మిరుమిట్లు గొలుపుతూ ఒక వైపునుండి మరోవైపుకు ప్రాకుతున్నప్పుడు, జడివాన మొదటి చినుకులు నేలపై పడి మట్టివాసనను రేపినప్పుడు నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చే పంక్తి మేఘదూతము లోని ‘ఆషాఢస్య ప్రథమ దివసే’. మహాకవి కాళిదాసు (నా ఉద్దేశములో అతడిని కాలిదాసు అని పిలవాలి, ఎందుకంటే అతడు కాలి అంటే శివుని భక్తుడు, కాళికాదేవి భక్తుడయితే అతని పేరు కాళీదాసుగా ఉండి ఉండేది) సంస్కృతములో మేఘదూతమును ఒక ఖండకావ్యముగా వ్రాసినాడు. వర్షము పడుతున్నప్పుడు తనకు ప్రియమైన వ్యక్తి తోడు లేక విరహపు వ్యధ బాధిస్తున్నప్పుడు జ్ఞాపకము వచ్చేది మేఘదూతమే. ఇందులోని పద్యాలు సుమారు 110కి పైగా పూర్వమేఘము, ఉత్తరమేఘము అనే భాగాలలో ఉన్నాయి. కాళిదాసు అన్ని పద్యాలను మందాక్రాంత వృత్తములో వ్రాసినాడు.


ఆషాఢస్య ప్రథమ దివసే
భారత్ తపాలా బిళ్ళ

మందాక్రాంత వృత్తములో ప్రతి పాదానికి 17 అక్షరాలు ఉంటాయి, దాని గణములు - మ భ న త త గగ. పాదమును మూడు భాగాలుగా విడదీయవచ్చును - UUUU - IIIIIU - UIUUIUU. సంస్కృతములో పదాలను వాడేటప్పుడు, పదాలను పై విధముగానే అమర్చాలి. నాలుగవ అక్షరము, ఐదవ అక్షరము, అదే విధముగా పదవ అక్షరము, పదకొండవ అక్షరము సంధి ద్వారా తప్ప మరే విధముగా కలుపబడవు. పాదాంతములో తప్పని సరి యతి ఉంటుంది. తెలుగు భాషలో ఈ నియమాలు లేవు. మందాక్రాంతానికి తెలుగులో ఒక యతి మాత్రమే నియమం. తెలుగు మందాక్రాంత పద్య పాదములో మొదటి అక్షరానికి, పదకొండవ అక్షరానికి అక్షరమైత్రి ఉండాలి, దీనినే వడి అంటారు. మనకందరికీ తెలిసిన ఒక మందాక్రాంత వృత్తము విష్ణుసహస్రనామము లోని క్రింది పద్యము:

శాంతాకారం - భుజగశయనం - పద్మనాభం సురేశం
విశ్వాధారం - గగనసదృశం - మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం - కమలనయనం - యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం - భవభయహరం - సర్వలోకైకనాథం

ప్రయాగ ప్రశస్తి

ఈ మందాక్రాంతవృత్తము కాళిదాసుకు సుపరిచితమే. కాళిదాసు రెండవ చంద్రగుప్తుని కాలములో నివసించాడు, అతని ఆస్థానకవి. ఈ చంద్రగుప్తుని తండ్రి సముద్రగుప్తుడు (క్రీ. శ. 335-380). సముద్రగుప్తుని ఆస్థానకవి హరిసేనుడు. గుప్తయుగములో సామ్రాజ్యాన్ని విస్తరించినది సముద్రగుప్త చక్రవర్తి. ఆ సామ్రాజ్యము కామరూపము నుండి యమున వరకు, హిమాలయము నుండి నర్మద వరకు ఉండినది. అది కాక దక్షిణ భారతదేశము లోని రాజులతోబాటు ఎందరో సామంతరాజులు ఉండేవారు. అతడి విజయాలను వర్ణిస్తూ ప్రయాగ (నేటి అలహాబాదు) దగ్గరి కౌశాంబిలో అశోకుని శాసనస్థంభముపై ఒక భాగములో ఈ హరిసేనకవిచే వ్రాయబడిన శాసనము ఒకటి ఉన్నది. దానిని ప్రయాగ ప్రశస్తి అంటారు. ఉత్తభారతమంతా దిగ్విజయయాత్రలో జయించి దక్షిణములో కంచివరకు వచ్చాడు సముద్రగుప్తుడు. కళింగ, విశాఖ, గోదావరి, పిఠాపురము మున్నగునవి కూడ ఈ శాసనములో ప్రత్యేకముగా పేర్కొనబడ్డాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, హరిసేనుడు వ్రాసిన ఆ ప్రయాగ ప్రశస్తిలో [1,2] ఒక మందాక్రాంత వృత్తము కూడ ఉన్నది. ఆ మందాక్రాంతవృత్తములో రెండు పంక్తులు మాత్రమే పూర్తిగా ఉన్నాయి. అవి:

సంగ్రామేషు - స్వభుజ విజితా - నిత్యముచ్చాపకారాః
తోషోత్తుంగే - స్ఫుట బహురస - స్నేహ ఫుల్లైర్మనోభిః

ఎవరు పరులకు అపకారము చేస్తారో వారిని తన భుజపరాక్రమముతో యుద్ధములో జయిస్తాడో / మనసులు ప్రస్ఫుటమైన బహురసములతో నిండి స్నేహముతో విరిసి చాల సంతోషముతో ఉంటుందో…

వియత్నాంలో మందాక్రాంతము

కాళిదాసు మేఘదూతాన్ని చర్చించడానికి ముందు మరో రెండు శాసనాలలోని మందాక్రాంత పద్యాలను తెలియబరుస్తాను. క్రీ. శ. నాలుగవ శతాబ్దానికే భారతదేశము నుండి నేటి ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి వలస వెళ్లి అక్కడి రాజులను జయించి హైందవ సిద్ధాంతాల పైన ఆధారపడిన సామ్రాజ్యాలనే నిర్మించారు కొందరు. నేటి వియత్నాం లోని మీసోన్ ప్రాంతము ఆనాడు చంపాదేశము అని పిలువబడేది. భద్రవర్మ మహారాజు (క్రీ. శ. 380-413) భద్రేశ్వరాలయము అనే ఒక శివుని గుడిని నిర్మించాడు. రెండు శతాబ్దాల తరువాత ఇది నిర్మూలించబడగా, శంభువర్మ (577-629) శంభు-భద్రేశ్వరాలయమని దీనిని పునర్నిర్మించాడు. నలభై యేళ్లకు ముందు జరిగిన వియత్నాం యుద్ధములో భద్రవర్మ కట్టిన కొన్ని గుడులు బాంబులు పడి ధ్వంసమయిన విషయము శోచనీయము. నేడు మీసోన్ ఒక world heritage site. ఈ శంభువర్మ శిలాశాసనాలలో[3] శివునిపైన ఒక మందాక్రాంత వృత్తము ఉన్నది. అది:

సృష్టం యేన - త్రితయ మఖిలం - భూర్భువస్స్వః స్వశక్త్యా
యేనోత్ఖాతం - భువనదురితం - వహ్నినేవాంధకారం
యస్యాచింత్యో - జగతి మహిమా - యస్య మాదిర్న చాంత
శ్చంపాదేశే - జనయతు సుఖం - శంభుభద్రేశ్వరోऽయం

ఎవడు భూర్భువస్సువర్లోకాలను సృష్టించాడో, ఎవడు వెలుగు చీకటిని తరిమివేసినట్లు సకలపాపాలను నిర్మూలిస్తాడో, ఎవడి మహిమలను ప్రపంచములో ఊహించుకోడానికి వీలుకాదో, ఆ శంభు-భద్రేశ్వరుడు చంపాదేశానికి సుఖములను ప్రసాదించుగాక!

క్రీ. శ. 653-687 మధ్యకాలములో విక్రాంతవర్మ చంపాదేశానికి రాజు. ఇతడు కూడ కొన్ని శాసనాలను మీసోన్‌లో చెక్కించాడు[3]. వాటినుండి ఒక మందాక్రాంతవృత్తమును క్రింద ఉదహరిస్తున్నాను:

యస్యాత్మానః - సకలమరుతాం - మానినాం మాననీయా
అష్టౌ పుణ్యా - వరహితకృతః - సర్వలోకాన్ వహంతి
అన్యోన్యస్య - స్వగుణవిధయా - గాఢసంబధ్యమానా
యోగ్యా యుగ్యా - ఇవ పథి పథి - స్యందనాన్ స్యందమానాన్

ఏ ఈశ్వరుని ఎనిమిది పుణ్యమూర్తులు మరుద్గణములచే నుతించబడుచున్నవో, ఏవి చక్కగా మంచి పనులచే ఎల్ల లోకములను భరించుచున్నవో, ఏవి తమలోతాము గాఢ సంబంధము గలిగి యున్నవో, ఏవి రథమును బాగుగా మార్గముపై నడిపించే గుఱ్ఱములవంటివో, ఆ ఈశ్వరుడు రక్ష నిచ్చుగాక!

మహాకవి కాళిదాసు నాలుగవ శతాబ్దపు అంత్యకాలములో జీవించాడు. ఇతడు పంచకావ్యాలలో రెండైన రఘువంశ కుమారసంభవములను, అత్యుత్తమ నాటకముగా పరిగణించబడే అభిజ్ఞానశాకుంతలముతోబాటు విక్రమోర్వశీయ మాళవికాగ్నిమిత్రములను, మేఘదూత ఋతుసంహార ఖండకావ్యములను రచించాడు. శృంగారతిలకము కాళిదాసు రచన అంటారు కొంతమంది. లాక్షణికగ్రంథమైన శ్రుతబోధ, దండకరాజమయిన శ్యామలాదండకము మాత్రము నిస్సందేహముగా ఇతని రచనలు కావు. మరే పుస్తకాన్ని వ్రాసినా, వ్రాయకపోయినా కాళిదాసు అద్వితీయ ప్రతిభకు ఒక్క మేఘదూతము చాలంటే అది అతిశయోక్తికాదు.

మేఘదూతము


మేఘదూత ప్రయాణ మార్గం

మేఘదూతము ఒక ఖండకావ్యము. ఇందులో మనకు కనబడే సజీవమైన పాత్ర యక్షునిది మాత్రమే. కుబేరుని కొలువులో ఉండే ఈ యక్షుడు రాజకార్యము చేయడములో ఏకాగ్రత చూపకపోయిన కారణాన శాపగ్రస్తుడై ఒక యేడు తన భార్యకు దూరముగా రామగిరి ప్రాంతములో విరహవేదనతో తపిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ సమయములో వర్షాకాలము ఆసన్నమయినది. గుంపులుగుంపులుగా కారు మేఘాలు గున్న ఏనుగులలా ఆకాశములో కనబడుతాయి. ఆ మేఘాన్ని చూచి నీవు నా దూతగా వెళ్లి అలకానగరములో ఉండే నా భార్యను కలిసి నా ప్రేమ సందేశాన్ని అందించమని ప్రాధేయపడుతాడు. అంతేగాక ఆ అలకానగరానికి ఎలా వెళ్ళాలో దారి కూడా చెప్తాడు. కాళిదాసు మేఘదూతములో సూచించిన స్థలములను ఆధారము చేసికొని జాఫర్ ఉల్లా గీసిన మేఘ మార్గాన్ని యిక్కడ చూడవచ్చును. క్లుప్తముగా యిది మేఘదూతపు కథ.

రఘువంశ రచయిత యయిన కాళిదాసుకు రామాయణ గాథ సుపరిచితమే. వర్షాకాలములో కిష్కింధలో రాముడు విరహబాధను అనుభవిస్తున్నాడు. అతడు లంకకు హనుమంతుని ద్వారా సీతకు సందేశాన్ని పంపిస్తాడు. రాముడికి బదులు యక్షుడు, లంకకు బదులు అలకాపురి, కిష్కింధకు బదులు రామగిరి, సీతకు బదులు యక్షిణి, హనుమంతుడికి బదులు మేఘము - ఇలా రామాయణానికి మేఘదూతానికి సాదృశ్యము ఉన్నది. గణితశాస్త్ర రీత్యా ఒకదానికి బదులు మరొకదానిని మనము ఉంచితే మనకు perfect isomorphism లభిస్తుంది. ఈ రామగిరి మధ్యప్రదేశములోని నేటి రాంటేక్ అంటారు. మహాభారతములోని నలోపాఖ్యానములో కూడ హంస ఒక దూత. నలునిచే పంపబడిన హంస తనకు “నలినసంభవు సాహిణములు వారువములు కులముసాములు మాకు కువలయాక్షి” అని దమయంతితో చెబుతుంది. దమయంతి హంసతో “అ నల సంబంధ వాంఛ నాకగున యేని అనల సంబంధ వాంఛ నాకగున చూవె” అంటుంది.

మేఘదూత కావ్య రచనకు కాళిదాసు ఎందుకు మందాక్రాంత వృత్తాన్ని ఎన్నుకొన్నాడు అనే ప్రశ్న మన కెదురవుతుంది. దుఃఖముతో బాధపడుతూ ఉండే మనిషి మాటలాడుతుంటే ఆ మాటలు ఆగి ఆగి ఆ వ్యక్తి నోటినుండి జారుతాయి, అవి విరామము లేకుండా ఏకధాటిన రావు. అంతే కాక మొదటి పదాలు దీర్ఘమైన అక్షరాలతో ఉంటాయి, ఉదా. అమ్మా, అబ్బా, అయ్యో, యిత్యాదులు. ఆ కాలములో సామాన్యముగా వాడబడిన పొడవైన వృత్తాలు శార్దూలవిక్రీడితము, స్రగ్ధర. శార్దూలవిక్రీడితపు పాదములోని విరుపు పన్నెండు అక్షరాల తరువాత వస్తుంది. కాబట్టి దీనికి ప్రయోజనము ఉందదు. స్రగ్ధరకు, మందాక్రాంతానికి ఉండే పోలికలను గురించి తరువాత చర్చిస్తాను. స్రగ్ధరలో పాదపు విరుపు ఏడక్షరాల తరువాత వస్తుంది. కాబట్టి యిది కూడ కాళిదాసుకు ప్రయోజనకారిగా కనబడలేదు.

కాళిదాసు తన భావాలను వెలిబుచ్చడానికి మందాక్రాంతమే సరియయిన వృత్తమని అనుకున్నట్టున్నాడు. అంతకుముండు ఈ వృత్తము రెండు మారులే వాడబడినది. పింగళఛందస్సులో ఇది సూత్రప్రాయముగా వివరించబడినది, నాట్యశాస్త్రములో దీనికి ఉదాహరణ శ్రీధరా అనే వృత్తరూపములో ఇవ్వబడినది. తరువాత హరిసేనకవి దీనిని ప్రయాగప్రశస్తిలో వాడాడు. ఈ హరిసేనుడు కాళిదాసుకు బహుశా గురుతుల్యుడై ఉండవచ్చును. ముఖ్యముగా మందాక్రాంతములోని విరుపులు తగిన మోతాదులో ఉన్నాయి తన కార్యానికి అనుకొన్నాడేమో కాళిదాసు. ఫలితము అంతవరకు ఛందఃశాస్త్రములో ఒక తాటాకుపైన మాత్రమే ఉన్న ఈ వృత్తానికి ఒక అజరామరమయిన ఖ్యాతి లభించినది. అంతేకాక కాళిదాసు మందాక్రాంతానికి మరో పేరుగా చలామణి అయ్యాడు. విప్రలంభ శృంగారాన్ని వర్ణించడానికి మందాక్రాంతము ఉచితమని కాళిదాసు అభిప్రాయపడ్డాడు.

అందుకే క్షేమేంద్రుడు సువృత్తతిలకములో[4] ఇలాగంటాడు:

సాక్షేప క్రోధ ధిక్కారే
పరం పృథ్వీ భరక్షమా
ప్రావృట్ ప్రవాసవ్యసనే
మందాక్రాంతా విరాజతే (3.21)

కోపాన్ని, ధిక్కారాన్ని సూచించడానికి పృథ్వీవృత్తము ఉచితమైనది, అది ఈ భారాన్ని మోయగలదు. వర్షాకాలములో ప్రవాసములో విరహానుభవాన్ని వివరించడానికి మందాక్రాంతము చక్కగా శోభిస్తుంది.

సువశా కాలిదాసస్య
మందాక్రాంతా ప్రవల్గతి
సదశ్వదమకస్యేవ
కాంభోజ తురగాంగనా (3.34)

కాళిదాసుకు బాగుగా వశమయిన మందాక్రాంతము మంచి గుఱ్ఱపురౌతుకు అధీనముగా ఉండే కాంభోజ దేశపు ఆడ గుఱ్ఱములా ప్రవర్తిస్తుంది.

మనకు సులభముగా అందుబాటులో ఉండే సందేశకావ్యములలో మేఘదూతము ఒకటి. సంస్కృత పద్యాల తెలుగు ప్రతి ఈమాటలో వున్నది. మూల సంస్కృతముతో విల్సన్ మహాశయుని ఆంగ్లానువాదమును ఇక్కడ చదువ వీలగును. మరొక ఆంగ్లానువాదము యిక్కడ ఉన్నది. తెలుగు టీకాతాత్పర్యాలతో శరత్ బాబు, శారదాపూర్ణ శొంఠి[5] ఒక ప్రతిని ప్రచురించారు. తెలుగులో రాయప్రోలు సుబ్బారావు మేఘదూతాన్ని యతిప్రాసలు లేని మత్తేభవిక్రీడిత వృత్తములో దూతమత్తేభముగా[6], శంఖవరం రాఘవాచార్యులు మాత్రాగణములతో షట్పదలుగా[7] అనువదించారు.

సంగీత మేఘదూతము

మేఘదూతమును ఒక సంగీత రూపకముగా సంస్కృతములో బాలాంత్రపు రజనీకాంతరావు నిర్దేశములో, వారి, బాలమురళీకృష్ణల గాత్రముతో ఇదే సంచికలో వినవచ్చును. మేఘదూతపు పద్యములను విశ్వమోహన్ భట్ సంగీత నిర్దేశకత్వములో హరిహరన్, కవితా కృష్ణమూర్తి (సుబ్రహ్మణ్యన్), రవీంద్ర సాఠే పాడిన కొన్ని పద్యములను ఇక్కడ వినవచ్చును. ఇంటర్నెట్‌లో మేఘదూతములోని కొన్ని పద్యాలను వినవచ్చును. (కశ్చిత్కాంతా విరహగురుణా; ఆషాఢస్య ప్రథమ దివసే; ధూమర్జ్యోతి సలిల మరుతాం; తత్రాగారం ధనపతిగృహా.)

అలాగే హేమంత ముఖర్జీ (కుమార్) పాడిన కొన్ని పద్యములు; వ్యాఖ్యలతో సంపూర్ణ మేఘదూతము ఆన్‌లైన్‌లో మనకు లభ్యమౌతున్నాయి. గుస్టాఫ్ హోల్స్ట్ (Gustav Holst) స్వరపరిచిన The Cloud Messenger మేఘదూతము యొక్క స్ఫూర్తియే.

కొన్ని మేఘదూత మందాక్రాంతములు

నేను క్రింద మేఘదూతములోని కొన్ని మందాక్రాంత వృత్తాలను పరిచయము చేస్తాను. వాటి తెలుగు అనువాదాలు కూడ యతి ప్రాసలు లేని మందాక్రాంతములో ఉన్నాయి. నేను ఉదహరించే పద్యాలను చదివేటప్పుడు ఎక్కడ ఆగాలనేది పాదముల విరుపును ఒక అడ్డగీతతో సూచిస్తున్నాను.

కశ్చిత్ కాంతా - విరహగురుణా - స్వాధికారాత్ప్రమత్తః
శాపే నాస్తాం - గమితమహిమా - వర్షభోగ్యేణ భర్తుః
యక్షశ్చక్రే - జనకతనయా - స్నానపుణ్యోదకేషు
స్నిగ్ధచ్ఛాయా - తరుషు వసతిం - రామగిర్యాశ్రమేషు (1.01)

శాపగ్రస్తుం - డయెగ నకటా - యక్షు డొక్కండు బాధన్
ఆజ్ఞాపించన్ - వరుస మొకటిన్ - వీడి భార్యన్ దనుండెన్
లేలేనీడల్ - తరువు లొసగన్ - రామగిర్యాశ్రమానన్
స్నానమ్మాడెన్ - జనకజ యటన్ - పుణ్యమౌ నీరమందున్

ఇది మేఘదూతములోని మొదటి పద్యము. యక్షుడొకడు ఏదో ఒక తప్పు చేసి తన ప్రభువైన కుబేరుని ఆగ్రహానికి గురి అయ్యాడు. కుబేరుడు యక్షుని ఒక సంవత్సరము యక్షలోకమునుండి మానవలోకానికి పంపాడు. కైకేయి వరము వలన ఎలా రాముడు వనవాసము చేసాడో అదే విధముగా యక్షుడు కూడ వనవాసము చేస్తున్నాడు. అతడు ఆ వనవాసాన్ని చేసే చోటు పేరు కూడ రామగిరియే. ఆ రామగిరి ప్రాంతములో ఒకప్పుడు శ్రీరాముడు కూడ సీతాలక్ష్మణులతో కాలము వెళ్లబుచ్చాడు. సీత అక్కడ ఉండే జలాశయములో స్నానము కూడ చేసిందంటాడు కాళిదాసు. ఒకే పద్యములో రామాయణానికి మేఘదూతానికి ఉండే సంబంధాన్ని కవి వివరిస్తాడు. రెండు కథలకు ఒక తేడా మాత్రము ఉన్నది, అదేమంటే కొన్నేళ్ళైనా సీతారాములు ఇద్దరూ అడవిలో కాలము గడిపారు. కాని యక్షుడు తన భార్యను తలుస్తూ సంవత్సరమంతా ఏకాంతముగా గడపాలి.

తస్మిన్నద్రౌ - కతిచిదబలా -విప్రయుక్తః స కామీ
నీత్వా మాసాన్ - కనకవలయ - భ్రంశరిక్తప్రకోష్ఠః
ఆషాఢస్య - ప్రథమదివసే - మేఘమాశ్లిష్టసానుం
వప్రక్రీడా - పరిణతగజ - ప్రేక్షణీయం దదర్శ (1.02)

బేలన్ వీడెన్ - గృశుడుగ నయెన్ - జారె నా కంకణమ్ముల్
ఆ శైలానన్ - నెలల గడిపెన్ - కామి యేకాంతమై తాన్
ఆషాఢంలో - మొదటి దిన మా - కొండపై మేఘమాలల్
మత్తేభమ్మా - పృథివి వడిగా - కొట్టి యాడినట్లుండెన్

నాకు నచ్చిన పద్యము ఇది. అందుకే ఈ వ్యాసానికి ఆషాఢస్య ప్రథమదివసే అని పేరుంచాను. ఎప్పుడు భార్యను తలుస్తూ ఆ విరహ వ్యధలను అనుభవిస్తూ యక్షుడు చిక్కిపోయాడు. కుబేరుని కొలువులో ఉండే అతనికి స్వర్ణాభరణాలకు తక్కువా? కాని ధరించిన బంగారు కడియాలేమో అతని చిక్కిపోయిన చేతులనుండి జారిపోతున్నాయి. శృంగారము రెండు విధాలు - సంభోగము, విప్రలంభము. వియోగశృంగారానికి పరాకాష్ఠ మేఘదూతము. కొండ చుట్టూ ఆషాఢమేఘాలు ఆవరించుకొన్నాయి. ఏనుగులు ఒక గోడను లేక భూమిని ఢీకొన్నట్లు మేఘాలు కొండను ముట్టుకొన్నాయంటాడు కవి యిక్కడ.

భర్తుః కంఠ - చ్ఛవిరితి గణైః - సాదరం వీక్ష్యమాణః
పుణ్యం యాయా - స్త్రిభువన గురో - ర్ధామ చండీశ్వరస్య
ధూతోద్యానం - కువలయరజో - గంధిభిర్గంధవత్యా
స్తోయక్రీడా - నిరతయువతి - స్నానతిక్తైర్మరుద్భిః - మేఘదూతం - 1.33

నీ వర్ణమ్మే - శివుని గళమం - చా గణమ్ముల్ దలంచన్
చేరేవంతన్ - త్రిజగపతియౌ - చండికేశాలయమ్మున్
దేవోద్యానం - బమరె గలువల్ - దెచ్చు గంధమ్ముతోడన్
స్నానంబాడన్ - సరసిఁ దరుణుల్ - గాలి మోసేను దావుల్

కాళిదాసు ఉజ్జయినీవాసి, అందువల్ల దూతమేఘాన్ని ఉజ్జయినీపురము చూస్తూ వెళ్లమంటాడు. ఉజ్జయినిలోని త్రిభువనపతియయిన చండికేశ్వరుని గుడిని చూడడము మరచిపోవద్దు. అక్కడ ప్రమథగణాలు నీలకంఠుని గొంతు నీలా (నీలమేఘములా) ఉంటుందనుకొని భక్తితో దేవుని పూజ చేస్తుంటారు. ఆ దేవోద్యానవనములో ఉండే కొలనిలో యువతులు స్నానమాడుతుంటే కలువ పూవుల పుప్పొడి సుగంధాన్ని గాలి మోసుకొని వస్తూ ఉంటుంది.

వాపీచాస్మి - న్మరకత శిలా - బద్ధ సోపానమార్గా
హేమైశ్ఛన్నా - వికచకమలైః - స్నిగ్ధవైడూర్యనాలైః
యస్యాస్తోయే - కృతవసతయో - మానసం సన్నికృష్టం
నాధ్యాస్యంతి - వ్యపగత శుచ - స్త్వామపి ప్రేక్ష్యహంసాః (2.13)

అందుండెన్‌గా - సరసొకటి య - ద్దాని మెట్ట్లేమొ పచ్చల్
స్వర్ణాంభోజ - మ్మచట విరిసెన్ - గాడ వైడూర్య మేమో
ఈదేనందున్ - జలము పయినన్ - శాంతిగా హంస లెన్నో
నిన్ జూడంగా - నవదు యవియున్ - మానసోత్కంఠతోడన్

కుబేరుడు పరిపాలించే యక్షలోకపు రాజధాని యయిన అలకాపురిని చేరిన తరువాత అక్కడ నా యింటి దగ్గర ఉండే ఒక నడబావిని చూడడము మరచిపోవద్దు. ఆ సరస్సు మెట్లు పచ్చలు, అందులో బూచిన బంగారు తామరల తూడులు వైడూర్యాలు, ఆ సరసిలో ఎన్నో హంసలు ప్రశాంతముగా ఈదుతూ ఉంటాయి, నీ నివాసమేమో మానససరోవరముగా ఉండవచ్చును, కాని అక్కడి హంసలు నిన్ను చూడగానే మానససరోవరానికి వెళ్లాలని ఆత్రపడవు, ఎందుకంటే ఆ సరస్సు ఆ మానససరోవరానికంటే యింకా గొప్పదైనది.

సందేశ కావ్యాలు


సందేశ కావ్యాల పట్టిక

కాళిదాసు మేఘదూత రచన పిదప ఎందరో కవులు సందేశకావ్యాలను వ్రాయడానికి ఉపక్రమించారు. అలాటి కావ్యాలు వందలాది సంస్కృతముతో సహా అన్ని భాషలలో ఉన్నాయి. అన్నిటిని గురించి యిక్కడ చర్చించడానికి వీలుకాదు. మందాక్రాంతవృత్తములో వ్రాసిన కొన్ని ఖండకావ్యాలలోని కొన్ని పద్యాలను మీకు పరిచయము చేస్తాను. వీటి నిర్మాణ పరికరాలు కాళిదాసు సృష్టించినవే. ఒక నాయకుడు, నాయిక ఎడబాటుతో ఉంటారు. ఒకరికొకరు సందేశాన్ని యే వాహకుని ద్వారానో పంపుకొంటారు. నేను చర్చించే దూత కావ్యాలను గురించిన వివరాలు పక్క చిత్రములో చూడవచ్చును. తెలుగులో అత్యుత్తమమ సందేశ కావ్యమయిన గబ్బిలమును గురించిన చర్చ ఈ వ్యాస శీర్షికకు పొందుపడనిది శోచనీయము. ఈ సందేశ కావ్యాలపైన ఒక సిద్ధాంత గ్రంథము కూడ తెలుగులో ఉన్నది[8]. సందేశ కావ్యాలపైన అప్పుడప్పుడు సమావేశాలు కూడ జరుగుతుంటాయి. అట్టి సమావేశ మొకటి షికాగో నగరములో కొన్ని నెలలముందు జరిగినది.

పవనదూతము :- కాళిదాసు తరువాత మందాక్రాంత వృత్తములో వ్రాయబడిన ఖండకావ్యము పవనదూతము. దీని రచయిత ధోయీ కవి. ఇతడు వంగదేశపు (గౌడ) రాజైన లక్ష్మణసేనుని (క్రీ. శ. 1179-1206) కొలువులో ఉన్నాడు. జయదేవుడు గీతగోవిందములో (గీతగోవిందము కూడ ఒక సందేశ కావ్యమే, రాధ చెలికత్తె రాధకు కృష్ణునికి మధ్య సందేశాలను అందజేస్తూ ఉంటుంది) తన సమకాలికుడైన ధోయీ కవిని కవిక్ష్మాపతి అని క్రింది పద్యములో ప్రస్తావించాడు.

వాచః పల్లవయ త్యుమాపతిధర స్సందర్భశుద్ధిం గిరాం
జానీతే జయదేవ ఏవ శరణం శ్లాఘ్యో దురూహద్రుతేః
శృంగారోత్తర సత్ప్రమేయరచనై రాచార్య గోవర్ధన
స్పర్ధీ కోऽపి న విశ్రుత శ్రు తిధరో ధోయీ కవిక్ష్మాపతిః (1.4)

పవనదూతము లక్ష్మణసేన చక్రవర్తిని గురించి వ్రాయబడిన కావ్యము. మలయపర్వత సానువులలో (నేటి కేరళ ప్రాంతము) ఉండే కువలయవతి అనే ఒక గంధర్వకన్య లక్ష్మణసేనుని శౌర్య పరాక్రమాలను గురించి విని, అతనిపైన అభిలాష పెంచుకొన్నది. మలయమారుతముతో గౌడ దేశానికి వెళ్లి లక్ష్మణసేనునికి తన ప్రేమ సందేశాన్ని తెలుపమని వేడుకొంటుంది. దక్షిణమునుండి పూర్వోత్తర దిశలో ఉండే ప్రదేశాల వర్ణన, వంగ రాష్ట్రపు వర్ణన ఇందులోని ప్రత్యేకతలు. అందులోనుండి మూడు పద్యాలను క్రింద ఇస్తున్నాను -

తస్మిన్నేకా - కువలయవతీ - నామ గంధర్వకన్యా
మన్యే జైత్రం - మృదుకుసుమతో - ప్యాయుధం యా స్మరస్య
దృష్ట్వా దేవం - భువనవిజయే - లక్ష్మణం క్షౌణిపాలం
బాలా సద్యః - కుసుమధనుషః - సంవిధేయీబభూవ (2)

పూర్వంబందున్ - కువలయవతీ - యంచు గంధర్వకన్యా
రత్న మ్ముండెన్ - మదన శరమౌ - స్నిగ్ధపుష్పమ్మువోలెన్
చూచెన్ రాజున్ - భువనవిజయున్ - లక్ష్మణక్ష్మామహేశున్
బాలన్ దాకెన్ - కుసుమశరముల్ - మన్మథుండేలె నామెన్

మేఘదూతములో మేఘాన్ని తన భార్యను చూడడానికి దూతవు కమ్మని పురుషుడైన యక్షుడు అడిగాడు, కాని యిక్కడేమో కువలయవతి అనే ఒక యువతి, లక్ష్మణసేనుని గుణగణాదులను విన్న తక్షణము ముగ్ధురాలై అతనిని వరించి, పవనుని దూతగా పంపింది. ఇది love at first hearing!

వీక్ష్యావస్థాం - విరహవిధురాం - రామచంద్రస్యహేతోర్
యాతః పారం - పవన సరితాం - పత్యురప్యాంజనేయః
తత్తాతస్యా -ప్రతిహతగతేర్ - యాస్యతస్తే మదర్థం
గౌడీక్షౌణీ - కతి ను మలయ - క్ష్మాధరాద్యోజనాని (5)

రామావస్థన్ - విరహ వ్యధలన్ - జూచి యా కారణానన్
దాటెన్ గాదా - పవనసుతు డా - యంబురాశిన్ బిరానాన్
నాకై నీవున్ - వడిగ పవనా - వెళ్లలేవా దయాత్మా
ఆ గౌడమ్మో - మలయ గిరికిన్ - దూర మేమో యెఱుంగన్

రాముని వియోగాన్ని తెలుపడానికై నీ కుమారుడు హనుమంతుడు సముద్రాన్ని దాటాడు, అలాగే నీవు నాకోసం గౌడదేశము వెళ్లి ఆ రాజుకు నా వలపుతలపులను తెలుపలేవా అని అడుగుతుంది. అంతే కాదు ఆమెకు మలయగిరినుండి వంగదేశము ఎంత దూరమో కూడ తెలియదు.

గంగావీచీ - ప్లుతపరిసరః - సౌధమాలావతంసో
యాస్యత్యుచ్చై - స్త్వయి రసమయా - విస్మయం సుహ్మదేశః
స్రోత్రక్రీడా - భరణపదవీం - భూమిదేవాంగణానాం
తాళీపత్రం - నవశశికలా - కోమలం యత్ర యాతి (27)

గంగాతీర - మ్మదియు నలలన్ - పొంగె సౌధాల నీడన్
సుహ్మాదేశ - మ్మతి సొబగుతో - విస్మయించున్ గదా నిన్
భూమీదేవీ - ప్రియ మహిళలున్ - రాణు లుంచేరు కమ్మల్
కర్ణాలందున్ - శశికళలతో - తాళపత్రమ్ము వోలెన్

లక్ష్మణసేనుడు ఉండే ప్రాంతానికి సుహ్మ అని పేరు, ఇది మహాభారతములో కూడ కనిపిస్తుంది. ఆ సుహ్మాదేశములో రాణులు ఎలా తాటాకులాటి కమ్మలను తొడుగుకొంటారో అనే విషయము పై పద్యములో వివరించబడినది.

హంస సందేశము :- హంససందేశ రచయిత వేంకటనాథుడు (1269-1370). ఇతనికి స్వామిదేశికన్ లేక వేదాంతదేశికన్ అని కూడ పేరు. ఇతడు రామానుజాచార్యుల పరంపరకు చెందినవాడు. ఇతడు కవి, పండితుడు, తార్కికుడు, మతప్రవక్త. సంస్కృత, ప్రాకృత, తమిళ, మణిప్రవాళ భాషలలో పుస్తకాలు వ్రాసినాడు. పాదుకాసహస్రము, యాదవాభ్యుదయము, హంససందేశాది కావ్యముల రచయిత. అల్లాఉద్ద్దీన్ ఖిల్జీ అరాజకాల కాలములో నివసించాడు. మతాచార్యులలో నిజమైన కవులు అరుదు, నా ఉద్దేశములో శంకరాచార్యులు, వేంకటనాథుడు, వాదిరాజయతి అట్టివారు.

హంససందేశములో కథానాయకుడు శ్రీరాముడు. హనుమంతుడు సీతను అశోకవనములో చూచి ఆమె యిచ్చిన ముద్రికను తీసికొని వచ్చి రామునికి ఇస్తాడు. కిష్కింధలో ఇంకా వర్షాకాలము. అట్టి వర్షాకాలములో రాముడు ఒక హంసను చూచాడు. ఆ హంసతో ఆకాశములో ఎగిరి సీత ఉండే లంకకు వెళ్లి ఆమెకు తన సందేశమును అందజేయుమని ప్రార్థిస్తాడు. హంస వెళ్లవలసిన మార్గాన్ని కూడ నిర్దేశిస్తాడు. అది హంపి, కర్ణాటక ఆంధ్ర సరిహద్దు, అహోబిలము, తిరుపతి, కాళహస్తి, కంచి, శ్రీరంగము, ఇత్యాదులు. అన్ని పద్యాలు మందాక్రాంత వృత్తాలే. క్రింద కొన్ని ఉదాహరణలు:

తస్మిన్ సీతా - గతిమనుగతే - తద్దుకూలాంకమూర్తౌ
తన్మంజీర - ప్రతిమనినదే - న్యస్తనిష్పందదృష్టిః
వీరశ్వేతో - విలయమగమ - త్తన్మయాత్మా ముహూర్తం
శంకే తీవ్రం - భవతి సమయే - శాసనం మీనకేతోః (1.03)

హంసన్ జూడన్ - గతుల సొబగుల్ - జీర యంచుల్ దలంచెన్
అందమ్మౌ యా - పలుకు వినగా - సీత పల్కుల్ స్మరించెన్
వీరుండైనన్ - క్షణము మఱచెన్ - రాముడో తన్ను దానే
ఔరా యా మ-న్మథుని బలిమిన్ - దాట శక్యమ్ము గాదే

హంసను చూడగానే సీత నడిచే తీరు జ్ఞాపకము వచ్చినది శ్రీరామునికి. సీతాదేవి హంసగమన అనడములో అతిశయోక్తి లేదు గదా! హంస ఆకారము సీత కట్టుకొన్న చీర అంచుల జ్ఞాపకమును తెచ్చాయి రామునికి. ఆడవాళ్ల చీరల అంచులలో హంసలు, నెమళ్లు, ఇత్యాదులు ఉండడము సహజమే గదా! హంసరుతమును విన్నప్పుడు సీత మాటలను విన్నటుండినది శ్రీరామునికి. ఇలా హంస రూపము, చలనము, మున్నగునవి సీతను సదా జ్ఞాపకానికి తెచ్చింది రామునికి. రాముడు గొప్ప వీరుడు, నిగ్రహము గలవాడు. ఐనా భార్యావియోగాన్ని తప్పించుకోవడానికి ఎవరివల్ల సాధ్యమవుతుంది? ఇందులో నాకు మరో రెండు విషయాలు గోచరిస్తున్నాయి. వాల్మీకి రామాయణములో కూడ సీతను వెదకుతూ వెళ్లుతున్నప్పుడు మార్గములోని ప్రకృతి దృశ్యాలను చక్కగా సహజముగా వర్ణించే ఘట్టాలు ఉన్నాయి. కాళిదాసు విక్రమోర్వశీయ నాటకములో ఊర్వశి వదలి వెళ్లిపోయిన తరువాత పురూరవచక్రవర్తి ఉన్మాదిలా సంచరిస్తూ ప్రకృతిలోని ప్రతి వస్తువులో ఊర్వశినే చూస్తాడు. ఇట్టివన్ని పై పద్యములో చక్కగా చిత్రించబడినాయి.

ఇక్షుచ్ఛాయే - కిసలయమయం - తల్పమాతస్థుషీణాం
సల్లాపైస్తై - ర్ముదిత మనసాం - శాలి సంరక్షికాణాం
కర్ణాటాంధ్ర - వ్యతికరవశాత్ - కర్బురే గీతిభేదే
ముహ్యంతీనాం - మదనకలుషం - మౌగ్ధ్యమాస్వాదయేథాః (1.20)

చూడా పాన్పుల్ - కిసలయముతో - బాలికల్ జేసిరందున్
సస్యమ్మున్ బల్ - చెఱకు మడులన్ - కాయుచున్నారు గాదా
కర్ణాటాంధ్రీ - పదముల సడిన్ - పాట బాడేరు గాదా
మధ్యాహ్నానన్ - గుసగుసలతో - మాటలాడేరు గాదా

స్థలము కర్ణాటాంధ్ర సరిహద్దులో ఉండే ఒక గ్రామము, సమయము మధ్యాహ్నము పూట. కొందరు బాలికలు చెఱకు తోటలను, వరి మడులను కాపలా కాస్తున్నారు. అక్కడ ఆకులతో తీగలతో పాన్పులు చేస్తున్నారు. అలాటి సమయములో ఆడుతూ పాడుతున్నారు. వీళ్లు సరిహద్దు ప్రాంతములో నివసిస్తున్నారు గనుక వీరు మాట్లాడేటప్పుడు రెండు భాషలలోని పదాలు మణిప్రవాళములోలా దొర్లిపోతున్నాయి. దానితో ఒకరితోనొకరు గుసగుసలాడుకొంటూ పెద్దగా నవ్వుతున్నారు. ఈ వర్ణన నాకు చాల సహజముగా ఉన్నట్లు అనిపిస్తుంది.

సంధ్యారాగం - సురభిరజనీ - సంభవైరంగరాగైః
కేశైజ్యోత్స్నా - కలహి తిమిరం - పాలికాపీడగర్భైః
ఆవిభ్రాణా - స్సరసిజదృశే - హంసదోలాధిరోహా
దాధాస్యంతే - మదకలగిర - స్తేషు నేత్రోత్సవంతే (1.37)

స్నానమ్మాడన్ - పసుపు నలదన్ - సాంధ్యరాగమ్ము వెల్గున్
కేశమ్మందున్ - సితకుసుమముల్ - రాత్రి చంద్రుండయేనో
మాట్లాడంగన్ - గలగల రొదన్ - యౌవనమ్మే కన్బడున్
ఊగన్ డోలల్ - నళినముఖులన్ - చూడ నేత్రోత్సవమ్మే

ఈ పద్యము చోళదేశములోని ఆడవారి సౌందర్యాన్ని చిత్రీకరిస్తుంది. స్నానము చేసేటప్పుడు పసుపు పూసుకొంటారు, ఆ సమయములో వారి దేహము సంధ్యారాగములా మెరిసిపోతుంటుంది. నల్లని వెండ్రుకలలో తెల్లని పూలను ధరిస్తారు, అప్పుడు అది నల్లని రాత్రి పూట వెలిగే చంద్రుడిలా కనబడుతుంది. ఇక పోతే వాళ్లు గలగలమంటూ పలికేటప్పుడు నిండు యౌవనము తొణికిసలాడుతూ ఉంటుంది. తరువాత వాళ్లు ఉయ్యాల లూగుతూ ఉంటే ఆ పద్మముఖులను చూడడము నీకు కన్నుల పండుగాగా ఉంటుంది అంటాడు శ్రీరాముడు హంసతో. ఇక్కడ కవి ఆ కాలములో ఉండే లేతవయసు ఆడపిల్లల దైనందిక చర్యలు, అలవాటులు, ఇత్యాదులను సునిశితముగా పరిశీలించి చక్కగా కవితాబద్ధము చేసినాడు.

ఇత్థం హృద్యై-ర్జనకతనయాం - జీవయిత్యా వచోభిః
సఖ్యం పుష్యం - దినకరకులే - దీప్యమానైర్నరేంద్రైః
స్వైరం లోకా - న్విచర నిఖిలాన్ - సౌమ్య లక్ష్మైవ విష్ణుః
సర్వాకారై - స్త్వదనుగుణయా - సేవితో రాజహంస్యా (2.48)

సందేశమ్మున్ - జనకజకు నీ - విచ్చి కాపాడు మామెన్
నాతో నాప్తుం - డయి మనెద వీ - సూర్యవంశమ్ముతోడన్
లోకమ్ముల్ నీ - వెగిరెదవుగా - నీదు యర్ధాంగితోడన్
లక్ష్మీవిష్ణుల్ - వలెను జగతిన్ - సర్వసౌఖ్యాలతోడన్

ఇలా నీవు వెళ్లి సీతను చూసి నా సందేశాన్ని ఆమెకు తెలియజేసి ఆమెకు నవజీవనాన్ని ప్రసాదిస్తే నాతో మాత్రమే కాదు తరతరాలకు సూర్యవంశములోని రాజులతో స్నేహము పెంచుకొంటావు. అంతే కాకుండా నీ భార్యతో హాయిగా ఎక్కడికైనా ఎగిరి వెళ్లగలవు. మీరిద్దరు లక్ష్మీదేవి విష్ణుమూర్తులలా వెలిగిపోతారు. ఈ పద్యము ఒక ఫలశ్రుతి లాటిది. నేను చెప్పినది నీవు చేస్తే నీవు మాలో ఒకడివై పోతావు అంటాడు శ్రీరాముడు.

ఉద్ధవసందేశము :- రూపగోస్వామి (క్రీ. శ. 1489-1564) చైతన్య మహాప్రభువు శిష్యుడు. ఇతని పూర్వీకులు నేటి కర్ణాటకరాష్త్రమునకు చెందిన గౌడసారస్వతులు. వంగదేశపు సుల్తాను దగ్గర అయిష్టముగా కొన్ని యేళ్లు పని చేసి, దానినుండి విరమించుకొని చైతన్యుని శిష్యుడయ్యాడు. బృందావనములో శేష జీవితాన్ని గడిపాడు. ఇతని స్థానము గౌడీయ వైష్ణవమతములో అతి ముఖ్యమైనది. ఇతడు ఎన్నో కావ్యముల రచయిత, ఉదా. భక్తిరసామృతసింధు, ఉజ్జ్వలనీలమణి, స్తవమాల, ఇత్యాదులు. ఇతడు రెండు సందేశ కావ్యాలను వ్రాసినాడు, హంసదూతం, ఉద్ధవసందేశము. హంసదూతము శిఖరిణీ వృత్తములో, ఉద్ధవసందేశము మందాక్రాంతములో వ్రాయబడినది. గోపికలకు హంస దూత అయితే, కృష్ణునికి అతని చెలికాడైన ఉద్ధవుడు దూత. ఇది భాగవతకథపైన ఆధారపడినది. గోపికలను వీడి మథురలో ఉండే శ్రీకృష్ణుడు వారికి ఉద్ధవుని ద్వార సందేశాన్ని పంపుతాడు.

వృందారణ్యే - మమ విదధిరే - నిర్భరోత్కంఠితాని
క్రీడోల్లాసైః - సపది యరిణా - హా మయా కిం విధేయం
జ్ఞాతం ధూర్తే - స్పృహయసి ముహు - ర్నందపుత్రాయ తస్మై
మా శంకిష్టాః - సఖి మమ రసో - దివ్యసారంగతోऽభూత్ (61)

కల్గెన్ నాలో - విరహ వ్యధలే - నే భరించంగ లేనే
నా కీ బృందా-వనమున మదిన్ - తాపముల్ హెచ్చె నయ్యో
పిల్లా నీలో - బెఱిగె నిజమై - వాంఛ కృష్ణుండనంగా
కాదే చెల్లీ - గనితి నదిగో - కృష్ణవర్ణంపు జింకన్

ఈ పద్యము ఇద్దరు గోపికల మధ్య జరిగిన సంభాషణను వ్యక్తము చేస్తుందని ఉద్ధవునితో కృష్ణుడంటాడు. నేను విరహబాధతో తపించిపోతున్నానంటూ ఒక గోపిక చెబుతుంది. మరో గోపిక నీకు కృష్ణుడంటే ఆశ ఎక్కువయినదని ఆమెను రెచ్చగొట్టుతుంది. మొదటి గోపిక కృష్ణ పదముపైన శ్లేష నుంచి అలా కాదు, నేను చూచినది నల్లని జింకను అని తన్ను తాను సమర్థించుకొంటుంది.

క్రీడాతల్పే - నిహితవపుషః - కల్పితే పుష్పజాలైః
స్మిత్వా స్మిత్వా - ప్రణయరభసాత్ - కుర్వతో నర్మభంగీం
విన్యస్యంతీ - తవ కిల ముఖే - పూగఫాలీ విధాస్యే
కుంజద్రోణ్యా - మహమిహ కదా - దేవసేవావినోదం (88)

శయ్యన్ జేతున్ - కుసుమములతో - పవ్వళించంగ దేవా
సిగ్గిల్లంగన్ - ప్రణయభరనై - నవ్వి నవ్వింతు నే నిన్
నీ నోరందున్ - రుచులమయమౌ - మంచి తాంబూల ముంతున్
కుంజమ్మందున్ - గృహము నొకటన్ - సేవలన్ జేతు నీకై

ఇంకొక గోపిక కృష్ణుని తలబోస్తూ నేను నీకు పూలతో పాన్పు చేస్తాను, సిగ్గుతో నవ్వుతూ ప్రణయరసాన్ని ఒలకబోస్తాను, నీకు సుగంధాలతో తాంబూలము ఇస్తాను, పొదరింటిలో నీ వినోదానికై సేవలను జేస్తాను అని అనుకొంటుంది. ఇలా వాళ్లు తమలో తామే కృష్ణునిగురించి ఆలోచిస్తుంటారని కృష్ణుడు ఉద్ధవునికి చెబుతాడు.

రాసోల్లాసా-న్నిశి నిశి చిరం - స్వప్నవృందాప్రదేశా
ద్వృందారణ్యే - సురభిణి మయా - సార్ధమాస్వాదయంతే
భూయో భూయ-స్తదపి చ పరి - త్యాగితో దూషణం మే
శంసంత్యః కిం - కుటిలహృదయా - న త్రపంతే భవత్యః (106)

రాసక్రీడన్ - రజని రజనిన్ - స్వప్నలోకాలలోనన్
మీరా బృందా-వని విడువకన్ - జేయుచున్నారు గాదా
వీడే నంచున్ - యనెదరుగదా - నింద లిట్లేల నమ్మా
మాటిట్లాడన్ - కుటిలమతితో - మీకు సిగ్గైన లేదే

మీరేమో మీ కలలలో బృందావనములో రాసక్రీడ చేస్తున్నారు, మళ్లీ కృష్ణుడు మిమ్ములను వదలివేసినాడు అని అంటారు. మీరు నిజముగా కపట హృదయులు, మీకు సిగ్గు కూడ లేదా అని గోపికలతో చెప్పమంటూ ఉద్ధవునికి కృష్ణుడు బోధిస్తాడు.

కోకిలసందేశము :- కోకిలసందేశమును వ్రాసిన ఉద్దండకవి 15వ శతాబ్దానికి చెందినవాడు. ఇతడు తమిళుడు, కాని నేటి కేరళలో చివరకు స్థిరపడ్డాడు. ఇతడు ఒకప్పుడు తన భార్యను వదలి కొద్ది కాలము ఉండవలసివచ్చింది. అప్పుడు ఆమెను తలుస్తూ వ్రాసిన ఖండకావ్యమే కోకిలసందేశము. మల్లికామారుతమనే ఒక నాటకమునుకూడ వ్రాసినాడు ఈ కవి. ఇందులో కోకిల తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలపైన ఎగిరి దక్షిణ ప్రాంతపు యాత్ర చేస్తుంది. అందులోనుండి కొన్ని మందాక్రాంత వృత్తాలు -

దివ్యైశ్వర్యం - దిశసి భజతాం - వర్తసే భిక్షమాణో
గౌరీమంకే - వహసి భసితం - పంచబాణం చకర్థ
కుత్స్నం వ్యాప్య - స్ఫురసి భువనం - మృగ్యసే చాగమాంతైః
కస్తే తత్వం - ప్రభవతి పరి - చ్ఛేతుమాశ్చర్యసింధో (1.54)

భిక్షుండైనన్ - గొలుతురు జనుల్ - దివ్యశక్తిప్రభావా
అంకమ్మందున్ - లలిత యమరెన్ - బంచబాణారి సాంబా
లోకమ్మెల్లన్ - వెలిగెదవుగా - నైన నన్వేషణమ్మే
కొల్వంగా ని-న్నెవరితరమౌ - నయ్య యాశ్చర్యసింధూ

సంపద్గ్రామము అనే చోట ఉండే శివాలయములోని ఈశ్వరునిపైన వ్రాసిన పద్యమిది. భక్తులేమో నిన్ను దేవుడని భజిస్తారు, కాని నీవేమో తిరిపెమెత్తుకొంటావు, ఎంతో ప్రేమతో గౌరీదేవిని నీ ఒడిలో కూర్చోబెట్టుకొన్నావు, కాని మన్మథుని కోపముతో బూడిద చేసినావు, నీవేమో లోకమంతా దేదీప్యమానముగా వెలిగిపోతున్నావు, ఐనా నిన్ను వెదకడము తప్పదు, అలాటివాడిని నిన్ను ఎలా అర్చించడమో? నీవు ప్రతి క్షణము దిగ్భ్రాంతిని కలిగిస్తుంటావు.

గేహే గేహే - నవనవసుధా-క్షాలితం యత్ర సౌధం
సౌధే సౌధే - సురభికుసుమైః - కల్పితం కేలితల్పం
తల్పే తల్పే - రసపరవశం - కామినీకాంతయుగ్మం
యుగ్మే యుగ్మే - స ఖలు విహరన్ - విశ్వవీరో మనోభూః (1.6?)

వీథుల్ నిండెన్ - నవనవముగా - తెల్లగా నిండ్ల తోడన్
సౌధాలందున్ - సురభిళముగా - పుష్పతల్పమ్ము లుండెన్
తల్పాలందున్ - పరవశముగా - జంటలే ప్రేమతోడన్
జంటల్ గూడన్ - హృదయములలో - నా మనోజుండు నిండెన్

ఇది కోళిక్కోడును (కాలికట్) గురించి వ్రాసినది. సంస్కృతములో కుక్కుటక్రోడ, అంటే కోడి ఒడి అని ఈ ఊరి పేరు. ఆ ఊరిలో ఇళ్ళన్నీ తెల్లగా వెల్లవేయబడి ఉన్నాయి, ఆ సౌధాలపైన పూల పానుపులు, వాటిపైన ప్రేమతో పవళించిన జంటలు ఉన్నాయన్నాడు కవి యిక్కడ. ఆ ఊరంటే అతనికి ఎంతో ప్రీతి, ఆ ఊరిలో ఇతడు ఎన్నో బిరుదులను గొని గొప్పవాడయ్యాడు. ఇతడిని పోషించిన 15వ శతాబ్దపు రాజు పేరు మానవిక్రమవర్మ.

తీర్ణప్రాయో - విరహజలధిః - శైలకన్యాప్రసాదాత్
శేషం మాస - ద్వితయమబలే - సహ్యతాం మా విషీద
ధూపోద్గారైః - సురభిషు తతో - భీరు సౌధాంతరేషు
క్రీడిష్యావో - నవజలధర - ధ్వానమంద్రాప్యహాని (2.61)

దేవ్యాశీస్సుల్ - గలుగ విరహాం - భోనిధిన్ దాటుదామా
ఇంకన్ రెండే - నెలలు మిగిలెన్ - ధైర్యమున్ వీడ నౌనా
సౌధమ్మందున్ - మనము నెనరున్ - ధూపముల్ తావి నీయన్
కార్మేఘమ్ముల్ - సడుల మెఱయన్ - హాయిగా నుంద మెప్డున్

ఈ ఉద్దండకవి తరచుగా ప్రయాణము చేసేవాడట. అప్పుడొకప్పుడు భార్యకు దూరముగా కొన్ని నెలలు గడపవలసి వచ్చింది. బహుశా అప్పుడు వ్రాసిన ఈ కోకిలసందేశములోని చివరి పద్యము ఇది. మనము ఇలా ఇంక రెండు నెలలే ఉండాలి, ధైర్యాన్ని కోల్పోవద్దు, ఆ గౌరీదేవి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. నేను వచ్చిన పిదప బయట ఉరుముతూ వర్షము పడుతుంటే లోపల మనము ధూపములు ఇచ్చే సువాసనతో హాయిగా ఉందాము అని ఆశాభావముతో ముగిస్తాడు కవి.

ఘనవృత్తము :- ఇది మేఘదూతమునకు తరువాతి కథ. శాపవశాత్తు భార్యనుండి వేరుపడి విరహ మనుభవిస్తున్న యక్షుడు వర్షఋతువులో మేఘమును చూచి తన సందేశమును తన భార్యకు అందజేయుమని ప్రార్థించి, అలకాపురికి మార్గమును కూడ చక్కగా తెలిపినాడు. అది మేఘదూతములోని కథ. ఇక ఇక్కడ ఒక ప్రశ్న మనకు ఉదయిస్తుంది. అదేమంటే పాపము తన బాధను మేఘునితో యక్షుడు మొర పెట్టుకొన్నాడు. ఐతే ఆ మొరలను ఆలకించిన మేఘుడు ఏమి చేసినాడు అన్నదే ఆ ప్రశ్న. అసలు ఆ నీలజీమూతము విన్నదా, వింటే ఏమి చేసింది? అలకాపురి చేరిందా, యక్షుని భార్యను చూసిందా? ఆమె ఏలాగుంది?

ఈ ప్రశ్నలకు జవాబు మనకు కోరాడ రామచంద్రశాస్త్రి వ్రాసిన ఘనవృత్తములో[9] లభిస్తుంది. వీరు పందొమ్మిదవ శతాబ్దపు ఉత్తరార్ధములో దీనిని వ్రాసినట్లున్నది. వీరు బందరు నోబుల్ కళాశాలలో సంస్కృతాధ్యాపకులు. తెలుగు భాషలో మొట్టమొదటి నాటకమును రచించిన ఘనత కూడ వీరికే దక్కినది. ఆ నాటకము 1860 ప్రాంతములో మంజరీమధుకరీయము అనే పేరుతో రచించబడినది.


యక్షుని చిత్రము (మాగంటి వంశీ)

యక్షుడు ఇచ్చిన ప్రయాణమార్గపు వివరాలు తీసికొని అలకాపురి చేరుకొంటాడు మేఘుడు. అక్కడ యక్షుని ఇంటిని కూడ కష్టము లేకుండ కనుగొంటాడు. కిటికిలోనుండి తొంగి చూడగా చిక్కిపోయిన యక్షుని భార్య దేవీపూజలో నిమగ్నమై యుంటుంది. శోకాకులయైన ఆమె మేఘునికి అశోకవనములో నున్న సీతను జ్ఞప్తికి తెస్తుందిది. హనుమంతుని వలెనే మేఘుడు సూక్ష్మరూపము దాల్చి సుందరాకారముతో ఆమె ముందు ప్రత్యక్షమయి యక్షుని విరహబాధను తెలియజేస్తాడు. యక్షుని ఇంద్రియనిగ్రహము, ఏకపత్నీవ్రతమును ఆమెకు విశదపరచినాడు.యక్షాంగన ఇది తాను దేవికి చేయు పూజాఫలము అని తలపోస్తుంది. శాపగ్రస్తుడైన యక్షుడు రామగిరిలో తపము చేసెడి సమయాన ఇంద్రుడు ఆతని తపోభంగము కోసం సురూప అనే అప్సరను పంపాడనీ, ఆమె నటనలకు, సౌందర్యమునకు బానిస కాక ఆమెను తూలనాడి ఆమెకు సద్బుద్ధిని కలిగించి తిరిగి దేవలోకానికి యక్షుడు పంపించాడనీ మేఘుడు చెబుతాడు.

“స్వర్గం గాయాః - పయసి విహరత్ - రాజహంసస్య కుల్యా
సిత్వం యాహి - ద్రుతతరమితో - యాహి కుంజాంతరం తత్”

నా భార్య ఆకాశగంగ వంటిది. నావంటి రాజమరాళం అట్టి ఆకాశగంగలో కాక నీవంటి పిల్లకాలువలో విహరిస్తుందా? నీ వృథాప్రయాస చాలించి ఇక వెంటనే వెళ్ళు అని యక్షుడు సురూపతో అన్న మాటలను ఆమెతో చెబుతాడు. తన భర్తను గురించి యక్షుడు చెప్పిన మంచి మాటలను విన్న యక్షవనిత ఆనందాధిక్యముతో మూర్ఛపోతుంది. ఆమెకు శైత్యోపచారములను జేస్తూ చెలికత్తెలు మేఘునికి ఆమె ఎలా యక్షుని వదలి కాలము గడిపినదో అనే విషయాన్ని వివరిస్తారు. కుబేరుడు తనకిచ్చిన శాపము మాట విన్న యక్షుడు బాధతో భార్యకు ఈ వార్తను తెలుపుట కిష్టము లేక ఇంటికి రాకుండ వెళ్లిపోయిన పిదప కుబేరుడు తన భార్యను యక్షవనిత వద్దకు పంపుతాడు. ఆమె కుబేరుడు తనకు బోధించిన అంబికామంత్రమును యక్షాంగనకు ఉపదేశించి దేవిని ఆరాధించమని ఓదార్చుతుంది. యక్షపత్ని అలాగే భక్తితో పార్వతిని పూజిస్తుంది. ఆమె పూజలకు తృప్తిబొంది పార్వతి ఆమెకు ప్రత్యక్షమై ఇలా అంటుంది - కుబేరుడు నా ప్రియమైన భక్తుడు. అతని శాపమును నేను తిరగజేయలేను. కాని శాపము త్వరలో ముగుస్తుంది, నీకు శుభము కలుగుతుంది. అదియును గాక యక్షుని శాపమునకు కారణము పూర్వజన్మలో అతడు తన కూతురిని అల్లుడిని కలువనీయకుండ దూరముంచుతాడు. నీవు కూడ నీ చెలికత్తెలను వారి పతులనుండి దూరము చేస్తున్నావు, అలా చేయకు అని చెప్పుతుంది. అప్పటినుండి ఆ యక్షవనిత దేవీధ్యానములో తన భర్తను తలచుచు కాలమును గడపుతున్నది. కొద్ది సేపటికి ఆమె మూర్ఛనుండి తేరుకొని మేఘుడిని ఆదరించి బహుమానముల నిచ్చి తన పతిని గూర్చి కొన్ని రహస్యములను తెలిపి ఒక సందేశాన్ని కూడ ఇస్తుంది. ఆ సందేశములను గొని మేఘుడు మళ్లీ రామగిరికి వెళ్ళి యక్షుని జూచి నీ ప్రియురాలు జీవించి వున్నది, నిన్నే తలుస్తూ ఉన్నది, త్వరలో మీరు శుభములను పొందగలరు అనే మేఘసందేశమును ఇచ్చి వెళ్ళిపోతాడు. వర్షఋతువు పిదప శరదృతువు వస్తుంది. యక్షునికి శాపము తీరుతుంది. అలకాపురికి వెళ్లి తన భార్యను మళ్లీ దర్శిస్తాడు. మేఘుడు వారిని కలిసికొని ఇద్దరిని శ్లాఘిస్తాడు. కుబేరుడు యక్షుని సన్మానించి తన సేవకావృత్తినుండి తొలగిస్తాడు. ఇది ఘనవృత్తపు కథ. ఈ కావ్యము నుండి రెండు పద్యాలను ఇక్కడ ఇస్తున్నాను:

యత్తే ప్రేయాన్ - మయి సదయయా - గ త్తనూజత్వభావం
దూరే తస్మి - న్నపిచ భవసి - ప్రేమ ధూర్మిర్భరాత్మా
సూనం తస్మా - దహముపగతో - న్యాయతస్త్యాతభావం
పుత్రం మత్వా - తవహృదయ సం - భాషణం నిర్విశంకా (1.21)

దూరంబున్నన్ - నెనరు మదిలో - నుంచుకొన్నావు నీవున్
ప్రేమన్ జూపెన్ - బ్రియ సుతునిగా - నన్ను నీ భర్త తానున్
నేనున్ దల్తున్ - గనుక నతనిన్ - దండ్రిగా దప్పకుండన్
నీవున్ నన్నున్ - సుతునివలెనే - యెంచుమా శంకలేకన్

యక్షుడి భార్యను చూచిన తరువాత మేఘుడు ఆమెతో, యక్షుడు నన్ను తన కొడుకులా ఆదరించాడు, నేను కూడ అతడిని పితృసమానముగా తలుస్తాను, నీవు నీ భర్త ఎంతో దూరములో ఉన్నా, ప్రేమతో అతనిని మరువకుండా సదా జ్ఞాపకము చేసికొంటున్నావు. నీవు కూడ సందేహాలను తొలగించి సంకోచ పడక నన్ను పుత్రసమానునిగా తలంచుకో, అని అంటాడు.

అన్యోన్యోద్యత్ - ప్రణయవశతా - జాతకందర్పదర్ప
క్రాంతక్రీడా - వశగమనసో - రర్హయోనోఃకయోశ్చిత్
ఆళీహిత్వం - స్వపదవినయం - బోద్దుకామావకాశం
వాదా ఏవం - తదసివిధురా - శాప ఏవప్రసహ్యః (2.17)

ఆనాడొక్కం - డెఱిగి తనయన్ - భర్తనున్ వేఱు జేసెన్
జ్ఞానంబున్నన్ - మతియు జెడగా - దానె గల్గించె బాధన్
తా నీ జన్మన్ - ధనపతి యిడన్ - శాపమందేను, నీవున్
వేఱుంచేవే - చెలుల పతులన్, - పాప మద్దాని వల్లన్

ఈ పద్యము పార్వతీదేవి యక్షుడికి శాపము ఎందుకు వచ్చిందో అని యక్షపత్నితో వివరించినప్పుడు చెప్పిన మాటలు. వయసులో ఉండే ప్రేమికులను వేరుజేయడము తప్పు. ఆ తప్పునే నీ భర్త పూర్వజన్మలో చేసినాడు, తన కూతురిని అల్లుడిని కలుసుకోకుండా అడ్డంకులు పెట్టేవాడు. దాని ఫలితమే కుబేరుడు ఈ జన్మలో తన శాపముచే మిమ్ములను విడదీసినాడు. నీవు కూడ నీకు పనిచేస్తూ ఉండే చెలికత్తెలను వారి భర్తలను కలిసికోకుండా వేరు చేస్తున్నావు, అది పాపకరమైన కార్యము, అలా చేయరాదు అని దేవి బోధిస్తుంది.

ఆత్మార్పణస్తుతి :- అప్పయ దీక్షితులు (క్రీ. శ. 1520-1593) ఆత్మార్పణములో 50 పద్యాలు ఉన్నాయి, అందులో సుమారు 40 మందాక్రాంత వృత్తాలు. ఈ ఆత్మార్పణస్తుతిని వ్రాయడానికి ముందు దీక్షితులు ఉమ్మెత్తకాయ రసాన్ని మ్రింగినాడట. అందువల్ల అతనికి ఉన్మత్తావస్థ ప్రాప్తించినది. తాను చెప్పినదల్లా అలాగే వ్రాయమని శిష్యులకు ముందుగానే చెప్పాడట. అట్టివేళలో అతని అంతరంగములో ఉండే భావాలు ఈ ఆత్మార్పణాస్తుతి రూపములో వచ్చాయట. ఈ స్తుతిని ఎందరో చక్కగా పాడారు. అందులో ఒకదానిని యిక్కడ వినవచ్చును. అందులోనించి ఒక మందాక్రాంత:

ఆనందాబ్ధేః - కమపి చ ఘనీ - భావమాస్థాయ రూపం
శక్త్యా సార్ధం - పరమముమయా - శాశ్వతం భోగమిచ్ఛన్
అధ్వాతీతే - శుచిదివసకృ - త్కోటిదీప్రే కపర్దిన్
ఆద్యే స్థానే - విహరసి సదా - సేవ్యమానో గణేశైః (4)

ఆనందాబ్ధుల్ - స్ఫటిక మవగా - నీదు రూపమ్మయేనో
నీతో నర్ధం - బగు నగజకున్ - మోద మందింతు వెప్డున్
లోకాతీతా - ప్రవిమల శివా - కోటిసూర్యప్రకాశా
ఆద్యా నిన్నే - గొలుతురు సదా - దేవదేవుల్ గణేశుల్

ఆనందసాగరాలు ఘనీభవించితే నీ రూపమవుతుందా? నీవెప్పుడు నీ అర్ధాంగి యయిన ఉమకు శాశ్వతమైన సంతోషాన్ని అందిస్తావు. అన్నిటికీ అతీతమయిన వాడవు నీవు, అతి విమలుడవు, కోటిసూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తావు. దేవతలు, ప్రమథగణాధీశ్వరులు నిన్నే ముందుగా పూజిస్తారు.

మందాక్రాంతపు ఛందస్సు

మందాక్రాంతవృత్తానికి పింగళుడు ఇచ్చిన సూత్రము - మందాక్రాంతా మ్భౌ న్తౌ త్గౌ గ్ సముద్రర్తుస్వరాః. అంటే మందాక్రాంతమునకు మ భ న త త గగ గణాలు ఉన్నవి, పాదపు విరుపులు నాలుగు (సముద్రము), ఆఱు (ఋతువులు), ఏడు (స్వరాలు). ఛందశ్శాస్త్రములో[10] ఈ వృత్తానికి ఇవ్వబడిన లక్ష్యము పింగళుని కాలము నాటిది కాదని అనుకొంటాను. కాని భరతుని నాట్యశాస్త్రములో[11] రెండు ప్రకరణాలు ఛందస్సుపైన ఉన్నాయి. అందులో మందాక్రాంత వృత్తపు లక్షణాలు ఉన్న పద్యానికి లక్ష్యము ఇవ్వబడినది, కాని నాట్యశాస్త్రకారుడు ఈ వృత్తాన్ని మందాక్రాంతానికి బదులు శ్రీధరా అని పిలిచాడు.

స్నానైశ్చూర్ణైః - సుఖ సురభిభిర్ - గండలేపైశ్చ ధూపైః
పుష్పైశ్చన్యైః - శిరసి రచితై - ర్వస్త్రయోగైస్చ తైస్తైః
నానారత్నైః - కనకఖచితై - రంగసంభోగసంస్థైర్
వ్యక్తం కాంతే - కమలనిలయా - శ్రీధరీవాతి భాసి (16.84)

ప్రియా, స్నానము చేసి సుగంధద్రవ్యాల నలదికొన్న చెక్కిళ్ళతో, నెత్తావితో, పూలతో విరాజిల్లే వెండ్రుకలతో, స్వర్ణభూషణాలతో అలంకరించుకొని కమలాలయ యైన ఆ శ్రీధరలా అందచందాలతో శోభిస్తున్నావు.

కాళిదాసుకు సమకాలికుడైన వరాహమిహిరుడు బృహత్సంహితలో[12] గ్రహగోచరాధ్యాయము అనే ప్రకరణములో వివిధ ఛందస్సులలో గ్రహముల స్థానములను గురించి వివరిస్తాడు. ఆ పద్యాలలో ఒక మందాక్రాంతము కూడ ఉన్నది:

దైన్యం వ్యాధిం - శుచమపి శశీ - పంచమే మార్గవిఘ్నం
షష్ఠే విత్తం - జనయతి సుఖం - శత్రురోగక్షయం చ
యానం మానం - శయనమశనం - సప్తమే విత్తలాభం
మందాక్రాంతే - ఫణిని హిమగౌ - చాష్టమే భీర్న కస్య (103.09)

చంద్రుడు జన్మరాశినుండి ఐదవ రాశిలో ఉంటే దీనత్వము, రోగము, శోకము, దారిలో విఘ్నాలు కలుగుతుంది. ఆరవ ఇంటిలో ఉంటే ధనార్జన, సుఖము, శత్రుక్షయము, ఆరోగ్యము కలుగుతుంది. ఏడవ యింటిలో ఉంటే వాహనము, పూజ, శయ్య, భోజనము, విత్తలాభము కలుగుతుంది. ఎనిమిదవ యింటిలో ఉంటే పాము భయపెట్టేటట్లు భయము కలుగుతుంది.

ఈ పద్యము నా ఉద్దేశములో చాల ముఖ్యమైనది. ఎందుకంటే యిందులో వరాహమిహిరుడు పద్యపు పేరైన మందాక్రాంతాన్ని ముద్రాలంకారముగా ఉపయోగించాడు. అంటే నాట్యశాస్త్రకారుని నామమైన శ్రీధరా చలామణిలో లేదని ఈ పద్యము స్పష్టముగా తెలుపుతుంది.

చాల శతాబ్దాలవరకు పింగళఛందస్సులో ఒక సూత్రముగా మాత్రమే నిలిచిందీ మందాక్రాంత వృత్తము. పింగళ ఛందస్సు ఛందశ్శాస్త్రములో ప్రథమ గ్రంథముగా పరిగణించబడుతుంది. నాట్యశాస్త్రము దాని తరువాత వచ్చినదని అంటారు. కాని యిందులో ఒక ఇబ్బంది ఉన్నది. లౌకిక ఛందస్సులో వృత్తాలకు సూత్రాలన్ని పింగళా ఛందస్సులో మగణాది త్రిక గణములచే నిర్మించబడినది. ఇంతకు ముందు చెప్పిన మందాక్రాంతవృత్త సూత్రమునే దీనికి ఉదాహరణముగా భావించవచ్చును. ఈ పద్ధతి అంత సులభమయిన పద్ధతి కాదు. కాని నాట్యశాస్త్ర కర్త గురులఘువులతో మాత్రమే వృత్త నిర్మాణాన్ని వర్ణించాడు, ఉదాహరణకు మందాక్రాంత (శ్రీధర) వృత్తములో మొదటి నాలుగు అక్షరాలు గురువులు, తరువాత పదవ, పదకొండవ, పదమూడవ, పదునాలుగవ, పదహారు, పదిహేడవ అక్షరాలు గురువులు, మిగిలినవి లఘువులు అని తెలిపాడు. ఇది చాల సులభమయిన పద్ధతి, త్రిక గణములను గురించిన జ్ఞానము దీనికి అవసరము లేదు. నా ప్రశ్న ఏమంటే సులభమయిన పద్ధతిని సామాన్యముగా మొదట ఉపయోగిస్తారు, తరువాత కష్టమయిన పద్ధతిని వాడుతారు. కాని పింగళ ఛందస్సు మొదట, తరువాత భరతశాస్త్రము జనించినవన్నది ఈ సిద్ధాంతముతో పొత్తు కుదరదు. పెద్ద పెద్ద వృత్తాలు పుస్తకాలలో నున్నంత మాత్రాన అవి వాడబడుతున్నవన్న మాట నిజము కాదు. శార్దూలవిక్రీడితము, స్రగ్ధర లాటి వృత్తాలు పింగళ ఛందస్సులో, నాట్యశాస్త్రములో ఉన్నాయి. కాని వీటిని క్రీస్తు శకము మొదటి శతాబ్దములో మాత్రమే మొట్టమొదట అశ్వఘోషుడు ఉపయోగించాడు. భాసుని నాటకాలలో ఈ వృత్తాలు వాడబడ్డాయి, కాని భాసుని కాలము ఇంకా నిక్కచ్చిగా మనకు తెలియదు.


మందాక్రాంత నిర్మాణ శిలలు

వైదిక ఛందస్సులో అనుష్టుభ్, ఉష్ణిక్, పంక్తి, త్రిష్టుభ్, జగతి ఛందాలకు చెంది కొన్ని నియమములను పాటించిన పద్యాలు మనకు పరిచితము. ఈ వైదిక ఛందస్సులో ఉచ్చరణకు (cadence) ప్రాముఖ్యత ఎక్కువ. లౌకిక ఛందస్సులో ఉచ్చరణకన్న హ్రస్వ దీర్ఘాదులు లేక గురు-లఘువులు ముఖ్యము. ఇది సంగీతాన్ని జనింపజేస్తుంది. ఇలా చేసినప్పుడు పుట్టిన వృత్తాలలలో కొన్ని నిర్మాణ శిలలు పదేపదే వాడబడ్డాయి. నేను వీటిని పిల్లలు ఆడుకొనే లెగోలవంటివి అంటాను. కొన్ని ముఖ్యమైన లెగోలు - IUIU, UIUI, UUUU, UUI UUI, UIU UIU, UIIU, IIIIIU మున్నగునవి. మందాక్రాంత వృత్తములో మూడు లెగోలు ఉన్నాయి, అవి - UUUU, IIIIIU, UIUUIUU. ఈ లెగోలను అదే క్రమములో కలిపితే మనకు మందాక్రాంతము లభిస్తుంది. మందాక్రాంతపు లెగోలు ఉండే కొన్ని వృత్తాలను పక్క చిత్రములో చూడవచ్చును. అందులోని కొన్ని విశేషాంశాలను క్రింద చర్చిస్తాను.

1. శాలినీవృత్తము - మందాక్రాంతములోని మొదటి, మూడవ లెగోలతో నిర్మించబడినది శాలినీవృత్తము. ఈ శాలినీవృత్తము కూడ బహు పురాతనమైనది. పింగళ ఛందస్సు, నాట్యశాస్త్రాలలో వివరించబడినవి. ఇది రామాయణములో లేదు, భారతములో ఉన్నది. కాని భారతములోని శాలిని తరువాత చేర్చినది అంటారు. శాలిని వంటి సమవృత్తాలు లేకున్నా లేక అరుదైనా, పాదానికి పదకొండు అక్షరాలు ఉండే త్రిష్టుభ్ ఛందముగా వ్రాయబడిన శ్లోకాలలో, కొన్ని పాదాలకు శాలిని వంటి వృత్తాల లక్షణాలు భగవద్గీతలో కూడ ఉన్నాయి. భాసుడు ప్రతిమానాటకంలో వ్రాసిన ఒక శాలినీ వృత్తాన్ని క్రింద ఉదాహరణగా ఇస్తున్నాను.

శాలిని - మ త త గగ, యతి (1, 5)
11 త్రిష్టుభ్ 289

భగ్నః శక్రః - కంపితో విత్తనాథః
కృష్టః సోమో - మర్దితః సూర్యపుత్రః
ధిగ్ భోః స్వర్గై - భీత దేవైర్నివిష్టం
ధన్యా భూమి - ర్వర్తతే యత్ర సీతా (5.17)

ఇంద్రుడు భంగపరచబడ్డాడు, కుబేరుడు వణికిపోయాడు, చంద్రుడేమో యీడ్చబడ్డాడు, యముడు త్రొక్కబడ్డాడు, భయకంపితులైన దేవతలతో ఉండేది అది స్వర్గమా, సీత ఉండే యీ భూమి ఎంత ధన్యమైనదో?

మనకందరికీ సుపరిచితమైన శాలినీవృత్తము విష్ణుసహస్రనామప్రారంభములో వచ్చే క్రింది పద్యము:

మేఘశ్యామం - పీతకౌశేయవాసం
శ్రీవత్సాంగం - కౌస్తుభోద్భాసితాంగం
పుణ్యోపేతం - పుండరీకాయతాక్షం
విష్ణుం వందే - సర్వలోకైకనాథం

త్రిష్టుభ్ ఛందానికి చెందిన శాలినిలాటి అమరికలు వైదిక ఛందమునుండి గ్రహించబడినవేమో?

2. శరభలలిత - నాట్యశాస్త్రమంతా ఒకే మారు వ్రాయబడలేదని పరిశోధకుల భావన. అందులో ఈ ప్రకరణాలు ఎప్పుడు వ్రాయబడ్డాయో మనకు తెలియదు, కాని అవి తప్పక క్రీస్తు పూర్వము వ్రాయబడి ఉండాలి. ఎందుకంటే మందాక్రాంతమును బోలిన మరొక పద్యము శరభలలిత. ఈ శరభలలిత పింగళ ఛందస్సులో లేదు, కాని నాట్యశాస్త్రములో ఉన్నది. శరభలలితకు, మందాక్రాంతానికి ఉండే తేడా ఏమంటే, శరభలలితలో మందాక్రాంతపు మ భ న త త గగ కు బదులు, మ భ న త గగ ఉంటుంది, అంటే మూడు అక్షరాలు తక్కువ. క్రింద శరభలలితకు నాట్యశాస్త్రమునుండి లక్ష్యము -

శరభలలిత - మ భ న త గగ, యతి (1, 5, 11)
14 శక్వరి 2545

ఏషా కాంతా - వ్రజతి లలితం - వేపమానా
గుల్మైశ్చ్ఛన్నం - వనమురునగైః - సంప్రవిద్ధం
హా హా కష్టం - కిమిదమితి నో - వేద్మి మూఢో
వ్యక్తం క్రోధా-చ్ఛరభలలితం - కర్తు కామా (16.72)

ఈ స్త్రీకయ్యెన్ - లలితగతులన్ - కంపనమ్ముల్
తానో వెళ్లెన్ - లతల వని కా - కొండపైనన్
మూర్ఖుండైతిన్ - గినుక నటనల్ - జూపుచుండెన్
వ్యక్తించెన్గా - శరభలలిత - మ్మైన కేళుల్

ఈ శరభలలితవృత్తమును అశ్వఘోషుడు సౌందరనందములో[13] రెండుమారులు ఉపయోగించాడు, అందులో ఒకటి -

తస్మాదేషా - మకుశలకరా - ణామరీణాం
చక్షుర్ఘ్రాణ - శ్రవణరసన - స్పర్శనానాం
సర్వావస్థం - భవతి నియమా - దప్రమత్తో
మాస్మిన్నర్థే - క్షణమపి కృథా - స్త్వం ప్రమాదం (13.56)

క్షేమకరము కాని ఆ శత్రువులను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండవలయును. కళ్లు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శ - వీటిని అణచుకొని అప్రమత్తుడవై ఉండవలయును. ఒక క్షణము కూడ ఏమరకూడదు.

అశ్వఘోషుడు క్రీ. శ. మొదటి శతాబ్దానికి చెందినవాడని అంటారు, కాబట్టి నాట్యశాస్త్రములోని ఛందస్సు అధ్యాయాలు అశ్వఘోషునికి ముందే వ్రాయబడి ఉండాలి

3. స్రగ్ధర - రెండువేల సంవత్సరాలకు ముండు వాడబడిన పొడవైన వృత్తాలలో స్రగ్ధర ఒకటి. అశ్వఘోషుడు, భాసుడు దీనిని వాడారు. స్రగ్ధరకు మందాక్రాంతాని కన్న నాలుగు అక్షరాలు ఎక్కువ. స్రగ్ధరలో 5-8 అక్షరాలను తొలగిస్తే మందాక్రాంత మవుతుంది. దీనివలన మనము మందాక్రాంతము నుండి స్రగ్ధర పుట్టినదా లేక స్రగ్ధరనుండి మందాక్రాంత పుట్టినదా అనే విషయాన్ని చెప్పలేము. కాని వీటికి సంబంధబాంధవ్యాలు ఉన్నాయని మాత్రము చెప్పగలము. దానిని నిరూపిస్తూ వ్రాసిన ఒక పద్యాన్ని క్రింద చదవండి:

స్రగ్ధర - మ ర భ న య య య, యతి (1, 8, 15)
21 ప్రకృతి 302933

శ్రీవాగ్దేవీ కరమ్మి - చ్చి చెలగు చదువుల్ - జెప్ప వేగమ్ము రావా
శ్రీవారాశీ వరమ్మి - చ్చి సిరుల ధరపై - జిందజేయంగ రావా
శ్రీవిశ్వాంబా శివమ్మి - చ్చి చిరసుఖములన్ - జిల్కి దీవించ రావా
కావన్ రారే దయల్ గ - ల్గ ఘనపదములన్ - గాఢమౌ భక్తి గొల్తున్

మందాక్రాంత

శ్రీవాగ్దేవీ - చెలగు చదువుల్ - జెప్ప వేగమ్ము రావా
శ్రీవారాశీ - సిరుల ధరపై - జిందజేయంగ రావా
శ్రీవిశ్వాంబా - చిరసుఖములన్ - జిల్కి దీవించ రావా
కావన్ రారే - ఘనపదములన్ - గాఢమౌ భక్తి గొల్తున్

4. కుసుమితాలతావేల్లిత - మందాక్రాంతములాగే మరొక వృత్తము ఉన్నది. దీనికి మొదటి లెగోలో మందాక్రాంతములోని నాలుగు గురువులకు బదులు ఐదు గురువులు ఉంటాయి. దీనిని కుసుమితాలతావేల్లిత అంటారు. ఈ వృత్తము కూడ పురాతనమైనదే. దీనిని కూడ అశ్వఘోషుడు సౌందరనందములో[13] ఉపయోగించాడు. ఆ పద్యమును క్రింద చదువవచ్చును -

తస్మాద్భిక్షార్థం - మమ గురురితో - యావదేవ ప్రయాతస్
త్యక్త్వా కాషాయం - గృహమహమిత - స్తావదేవ ప్రయాస్యే
పూజ్యం లింగం హి - స్ఖలిత మనసో - బిభ్రతః క్లిష్టబుద్ధేర్
నాముత్రార్థః స్యా - దుపహతమతే - ర్నాప్యయం జీవలోకః (7.52)

నా గురువు భిక్షకు వెళ్లిన తక్షణము నేను కాషాయ వస్త్రాలను విప్పి యిక్కడినుండి నా యింటికి వెళ్తాను. ఎందుకంటే పవిత్రమైన చిహ్నాన్ని చలించిన మనసుతో, వక్రబుద్ధితో, సడలిన గురితో ధరిస్తే ఉన్నతాశయాలు మాత్రమే కాదు, జీవకోటితో నిండిన ఈ ప్రపంచము కూడ ఉండదు.

కుసుమితలతావేల్లితను ఉపయోగించిన అశ్వఘోషుడు మందాక్రాంతవృత్తాన్ని ఎందుకు ఉపయోగించలేదో? ఈ రెంటితో గర్భకవిత్వాన్ని క్రింద చూడవచ్చును -

కుసుమితలతావేల్లిత - మ త న య య య, యతి (1, 6, 12)
18 ధృతి 37857

రా రాజీవాక్షా - రసికహృదయా - రాత్రి వేచేను నీకై
రా రాజిల్లంగా - బ్రణవరవముల్ - రమ్యమై పాడ రావా
రా రాజేంద్రా నా - రచన యది శ్రీ - రంగ నీకే నిజమ్మై
రారా జీవాత్మా - ప్రణయినియు నే - బ్రాణమిత్తున్ ముదానన్

ఇందులోని మందాక్రాంతము

రాజీవాక్షా - రసికహృదయా - రాత్రి వేచేను నీకై
రాజిల్లంగా - బ్రణవరవముల్ - రమ్యమై పాడ రావా
రాజేంద్రా నా - రచన యది శ్రీ - రంగ నీకే నిజమ్మై
రా జీవాత్మా - ప్రణయినియు నే - బ్రాణమిత్తున్ ముదానన్

ఇంకా ఎన్నో విషయాలను, గర్భకవిత్వములను తెలియజేయవచ్చును గాని, అవి ఈ వ్యాసపు పరిధిని అతిక్రమించగలదు.

తెలుగులో మందాక్రాంతము

నాగవర్మ రచించిన కన్నడ లక్షణగ్రంథము ఛందోంబుధిలో[14] మందాక్రాంతపు లక్షణాలు ఇలా చెప్పబడినవి.

కాంతం ధాత్రీ - హిమకృదమరా - కాశయుగ్మేశయుగ్మా
క్రాంతం తోర్కుం - పదదశకదోళ్ - విశ్రమం సంతతం తాం
కాంతే మత్త - ద్విరదగమనే - మల్లికామోదె మందా-
క్రాంతం వృత్తం - నెగళ్దుదిళెయొళ్ - నాగవర్మప్రణీతం (పుట 42)

భూమి (మ), చంద్రుడు (భ), స్వర్గము (న), రెండు ఆకాశాలు (త), రెండు ఈశ్వరులు (గురువులు) గలవియై తోచును మందాక్రాంతవృత్తము, పది అక్షరములతో పాదము ఎప్పుడూ విరుగుతుంది, గజగమనా, మల్లెలవలె సుకుమారీ, ఇలా భూమిపైన నాగవర్మ చెప్పాడు.

ఇక్కడ ఒక విశేషమేమంటే, పాదము పది, ఏడుగా విరుగుతుంది అని వ్రాసినా, ఉదాహరణలో నాలుగు అక్షరాల తరువాత పాదాలు విరిగేటట్లు వ్రాసినాడు నాగవర్మ. ఇంచుమించు ఇవే ప్రాసాక్షరాలతో రేచన కవిజనాశ్రయములో[15] మందాక్రాంతపు లక్షణాలను చెప్పి, పాదాలను నాలుగవ అక్షరము వద్ద అంతము చేశాడు. ఐదవ అక్షరముతో అక్షరసామ్య యతిని మాత్రము ఉంచలేదు. ఈ విషయము చాల ముఖ్యమైనది. నాలుగు అక్షరాల తరువాత కొత్త పదము ప్రారంభము అయితే ఈ వృత్తము అందముగా ఉంటుందని రేచన అనుకొన్నాడు. పదవ అక్షరము తరువాత మొదటి పాదములో కొత్త పదము ఆరంభమయినది. రెండవ పాదములో అలా ఆరంభము కాకపోయినా అది ఎబ్బెట్టుగా లేదు. కాని ఈ వృత్తమును తమ కావ్యములలో ఉపయోగించిన కవులు దీనిని పాటించక పోవడము శోచనీయము. ఆ పద్యము -

కాంతాకాంతా - మభనతతగా - కాంతిసంక్రాంతి మందా-
క్రాంతం బన్ పే - రమరు దశమా - శ్రాంత విశ్రాంతమైనన్ (పుట 25)

మనకు దొరికిన తెలుగు గ్రంథములలో మొట్టమొదట మందాక్రాంత వృత్తమును వ్రాసినది కుమారసంభవకర్త నన్నెచోడుడు. ఆ పద్యము -

ఫాలాభీలాం - బకు నురుజటా - బంధనాపీడ్యమాన
వ్యాళాధీశా - నన విగళితో - చ్ఛ్వాస నిర్ధూత గంగా
స్థూలోర్మీ శీ - కర సమితి పైఁ - దూలి శోభిల్లుఁ జూడన్
గైలాసోర్వీ - ధరపతికిని ము - క్తాఫలచ్ఛత్రలీలన్ (7.153)

తిక్కన తన భారతము స్త్రీపర్వములో ఎన్నో విశేషవృత్తాలను వాడాడు, అందులో మందాక్రాంతవృత్తము కూడ ఒకటున్నది. అది -

వీణానాద - ప్రతిమనిగమా-విర్భవత్సారపుణ్య
శ్రేణీ సంపా - దిత విమలతా - స్థేమనిర్లేపచిత్త
త్రాణక్రీడా - కలనసతతో - త్సాహవద్దివ్యభావా
ప్రాణాపానా - హరణనిపుణ - ప్రాపణీయానుభావా (2.185)

ఎఱ్ఱన నృసింహపురాణములో వ్రాసిన ఒక మందాక్రాంతము -

వేలాక్రాంత - త్రిభువన మహ - ద్విద్విషల్లక్ష్మ సూక్ష్మా
స్థులావిత్వ - స్ఫురితరచనా - దుర్నిరూపాత్మ ఖేలో
త్కోలాకార - క్షుభితవలయో - త్కూలకల్లోలమాలో
ల్లోలాబ్ధీంద్రో - ల్లుఠిత వసుధా - లోకరక్షా సమక్షా (4.188 )

ఆశ్వాసాంతములో విశ్వనాథ సత్యనారాయణ శ్రీరామాయణకల్పవృక్షము నుండి ఒకటి -

గౌరీపాదాం - బురుహ వినమ - త్కాంత లాక్షానురక్తా
పారావారో - న్మథన జనిత - ప్రౌఢకాకోలభక్తా
శారజ్యోత్స్నా - మృదుశశి శిశు - స్వచ్ఛ చూడాగ్రముక్తా
సౌర ప్రోద్య - జ్జగదవన ని - ష్ణాత గంగాభిషిక్తా (బాల - ఇష్టి - 435)

ఇటీవల భీమశంకరం వ్రాసిన రసస్రువు నుండి ఒక ఉదాహరణ -

వక్తల్, మేధా - వులు, కవులు, స - ర్వజ్ఞ సంగీత గానా
సక్తుల్, వేదాం - తులు, యతులు, సం - సార గాఢాంధికా ని
ర్ముక్తుల్, స్వాధ్యా - యులు, ఋషులు, ఆ - ముష్మికాలోచనా సం
పృక్తుల్, వేమూ - ద్వహు బహువిధిన్ - ప్రీతి చేయంగ నంతన్

పై పద్యాల రచనలో ఒక్క ఎఱ్ఱాప్రగడది తప్ప మిగిలిన వాటిలో మందాక్రాంతపు శోభ ఎక్కువగా లేదని నా ఉద్దేశము. ఇవి శార్దూల లేక మత్తేభ విక్రీడితములను చదివినట్లుంది, కాని మందాక్రాంతములోని సంగీతానుభవము వీటిని చదివినప్పుడు కలుగదు.

మరొక లయ

మందాక్రాంతపు గురులఘువుల అమరికను UU UU IIII IUU IUU IUU గా వ్రాస్తే మనకు మొదట మూడు చతుర్మాత్రలు, తరువాత మూడు ఎదురు నడకతో ఉండే పంచమాత్రలు లభిస్తాయి. చివరి మూడు య-గణాలు బృహతి అనే వృత్తమవుతుంది. తాళరీత్యా మూడు చతుర్మాత్రలు, మూడు పంచ మాత్రలు వినడానికి బాగుంటాయి. క్రింద అట్టి అమరికతో వాడుక భాషలో వ్రాసిన ఒక ఉదాహరణ -

కావ్యం వ్రాసా తలపుల -కలంతో మథించే ముదంతో
నవ్యం నవ్యం రసముల - నదమ్మౌ సుధాబుద్బుదమ్మౌ
దివ్యం దివ్యం ధర యిది - దివమ్మౌ నభీష్టాలయమ్మౌ
భవ్యంబౌ నీ బ్రదుకులు - వరాలౌ ప్రమోదస్వరాలౌ

మందాక్రాంతము తెలుగులో ఎందుకు అరుదు?

మందాక్రాంతవృత్తము తెలుగులో రాణించకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి: (1) తెలుగు భాషలో వరుసగా నాలుగు గురువులు వచ్చేటట్లు వ్రాయడము కష్టమే. అందుకే తెలుగు కవులు శార్దూలవిక్రీడిత వృత్తాన్ని మత్తేభవిక్రీడితానికన్న తక్కువగనే వ్రాసినారు. (2) మందాక్రాంతపు టందచందాలు పదాల విరుపు వలన ఏర్పడినది. అలా పదాలను నాలుగవ, పదవ అక్షరాలవద్ద విరగగొట్టకపోతే అందము చెడుతుంది.

ఒక గురువును రెండు లఘువులుగా లేక రెండు లఘువులను ఒక గురువుగా మార్చి కొత్త వృత్తాలను సృష్టించడము ఛందస్సులో సర్వసామాన్యమే, ఉదా. శార్దూల-మత్తేభవిక్రీడితములు, ఉత్పల-చంపకమాలలు, మత్తకోకిల-తరళములు, మానిని-కవిరాజవిరాజితములు, ఇత్యాదులు. అలా చేయాలని నాకు కూడ ఆలోచన వచ్చినది, దాని ఫలితమే మందాక్రాంతపు మొదటి గురువును రెండు లఘువులుగా మార్చి లలితాక్రాంతము అనే వృత్తాన్ని సృష్టించాను. ఇటీవల అట్టి వృత్తమును మందారమాల పేరిట జయకీర్తి ఛందోనుశాసనములో[15] ఉన్నట్లు కనుగొన్నాను. ఏది ఏమైనా, లలితాక్రాంత లేక మందారమాలకు ఒక ఉదాహరణ -

లలితాక్రాంత - స త న య య య, యతి (1, 6, 12)
18 ధృతి 37860

లలితాక్రాంతా - లయల సొబగై - లాస్య మాడంగ రావా
కలలో నీవీ - కలికి యెదలో - గారు చిచ్చుంచినావా
యలయై రావా - యలఘుతర మో - దాబ్ధిలో ముంచ రావా
తెలియందమ్మై - తెలుగు కవితై - తేనె లూరించ రావా

అదే విధముగా మందాక్రాంతపు రెండవ, మూడవ, నాలుగవ గురువును రెండు లఘువులుగా మార్చి కొత్త వృత్తములను సృష్టించాను. అవి వరుసగా కోమలకాంతా, రాగోత్కళికా, నిత్యానందము. వాటికి ఉదాహరణలు -

కోమలకాంతా - భ త న య య య, యతి (1, 6, 12)
18 ధృతి 37863

ఏమని జెప్పన్ - హృదయ మది ని-న్నెందుకో చూడ గోరెన్
శ్యామలమై యా - జలధరతతుల్ - జల్లగా నింగి దేలెన్
కామలతా నా - కవిత వినగా - కన్నులే మాటలాడున్
కోమలకాంతా - కొలనుదరి రా - కోర్కెలే కాటువేయున్

రాగోత్కళికా - త జ న య య య, యతి (1, 6, 12)
18 ధృతి 37869

ఆ నా డలలై - యమృత ధునితో - నందమై పాడినావే
గానోత్కళికా - కవిత గుళికా - కావ్యవారాధినౌకా
ఈ నా డిటులన్ - హృదయమున నా - కెంతయో బాధ గల్గెన్
రా నా మదిలో - రసము జిలుకన్ - ప్రాణమే లేచివచ్చున్

నిత్యానందము - మ న న య య య, యతి (1, 6, 12)
18 ధృతి 37881

నిత్యానందము - నిను గనుటయే - నీరజాక్షా ముకుందా
సత్యాకారము - సఖు డనుటయే - సచ్చరిత్రా మురారీ
అత్యాదర్శము - లగును కథలే - యప్రమేయా యనంతా
ప్రత్యేకత్వము - పరమపదమే - పాహిమాం ప్రత్యగాత్మా

జాతి పద్యముగా మందాక్రాంతము

మందాక్రాంతమును ఇలా వ్రాయవచ్చును - (UU UU) (IIIIIU) (UIU UIU U), అనగా (చ - చ) (త్రి -చ లేక చ - త్రి) (పం పం గురువు) (త్రి - త్రిమాత్ర, చ - చతుర్మాత్ర, పం - పంచమాత్ర). ఇలా మూడు మాత్రాగణముల లెగోలతో యతిప్రాసలతో మందాక్రాంతమును ఒక జాతి పద్యముగా వ్రాయవచ్చును. ఇట్టి జాతి పద్యమునకు మందాకిని అనే పేరును ఉంచాను. ఇట్టి అమరికతో కొన్ని వృత్తాలు కూడ ఉన్నాయి.

1. భూతిలక - భ భ ర స జ జ గ, యతి (1, 12)
19 అతిధృతి 186039

మందాకినిగా భూతిలక -

వాతపు శీతల - బాధ తగ్గెను - భాసిలెన్ రవి కాంతులన్
జేతన గల్గెను - జెట్టులన్, యవి - చెన్నుగా నిడె రంగులన్
భూతలిపైనను - బూచె బూవులు - బ్రోవులై కడు రమ్యమై
భూతిలకమ్ముగ - భూమి నామని - మోద మిచ్చెను ముగ్ధమై

2. హారిణి - మందాకిని - మ భ న మ య లగ, యతి (1, 5, 11)
17 అత్యష్టి 37361

ఈ నా డెందం - బెపుడు దలచున్ - హేమాంగి నిన్నే గదా
తేనెల్ చిందన్ - దెలుగు నుడులన్ - దివ్యమ్ముగా పాడవా
మేనుల్ రెండున్ - మిలన మవగా - మేళమ్ము లింకేలనే
రా నాచెంతన్ - రజని వెలిగెన్ - రావే మనోహారిణీ

3. శిశుశార్దూలము - మందాకిని - మ స న మ య ల గ, యతి (1, 6, 11)
17 అత్యష్టి 37337 (ఇది శార్దూలవిక్రీడితములో 6,7 అక్షరాలను తొలగించగా వచ్చిన వృత్తము.)

దూరమ్మందున - దోచె శిశుశా - ర్దూలమ్ము లెన్నో వనిన్
జేరంబోకుమ - చెంతగలదే - సిద్ధమ్ముగా దల్లియున్
వారిం జూడుమ - పల్విధములన్ - బర్వెత్తె నిట్టట్టులన్
స్వారస్యమ్ముగ - చారు గతులన్ - సానందమై యందమై

మందాకినిలో కొన్ని అనువాదాలు

మందాక్రాంతపు లయ కలిగిన జాతిపద్యమైన మందాకినిని ఉపయోగించి కొన్ని మందాక్రాంత పద్యములను అనువాదము చేసినాను. ఇందులో యతిప్రాసల నియమాలను పాటించాను. కొన్ని ఉదాహరణలను ఇక్కడ చదువవచ్చును -

సవ్యాపారా - మహని నతథా - పీడయే న్మద్వియోగః
శంకేరాత్రే - గురుతరశుచం - నిర్వినోదాం సఖీం తే
మత్సందేశైః - సుఖయితుమలం - పశ్య సాధ్వీం నిశీథే
తామున్నిద్రా - మవని శయనాం - సాధవాతాయనస్థః (మేఘదూతము - 2.25)

గడచును దినముల్ - గలుగు పనులన్ - గాన విరహమ్ము మఱచున్
పడుఁ దా బాధల్ - బాసి చెలులన్ - బాడు రాత్రుల్ దహించున్
విడిచిన నిద్రన్ - వెతల గలయున్ - బేల నేలన్ బరుండున్
పడ సంతోషము - వార్త దెల్ప గ-వాక్షమ్ములో జూడుమా

పత్యుర్దేవీ - ప్రణయసచివం - విద్ధి దీర్ఘాయుషో మాం
జీవాతుం తే - దధత మనఘం - తస్య సందేశమంతః
శూరాణాం య-శ్శరదుపగమే - వీరపత్నీవరాణాం
సమ్మానార్హం - సమయముచితం - సూచయేత్కూజితైస్స్వైః (హంస సందేశ - 2.28)

ఆతనికిని నే - నాత్మ సచివుడ - నాతండు వర్ధిలు సదా
సీతాదేవీ - చిర ముదమిడన్ - చెప్పెదన్ వాని వాక్కుల్
ఏతెంతురు వీ - రేంద్రులు రయ - మ్మింతు లాలాపించగా
నా తరుణమ్మును - హంసరుతితో - నలరి జెప్పేము తల్లీ


మాధుర్యేణ - ద్విగుణాశిశిరం - వక్త్రచంద్రం వహంతీ
వంశీవీథీ - విగలదమృత - స్రోతసా సేచయంతీ
మద్వాణీనాం - విహరణపదం - మత్తసౌభాగ్యభాజం
మత్పుణ్యానాం - పరిణతిరహో - నేత్రయో సమ్నిధత్తే
(లీలాశుక శ్రీకృష్ణకర్ణామృతము - 1.75)

మధురమధురమై -మసృణతరమై - మాధవాననము నిండెన్
నదిగా మురళీ - నాదసుధలన్ - నయముగా మున్గిపోతిన్
పదములతనివే - వఱలె నాల్కన్ - పరమభాగ్యమ్ము గాదా
యిది నా పుణ్య - మ్మెనగ కన్నుల - నిట్లు వానిన్ గనంగన్

మందం మందం - మధురనినదై - ర్వేణుమాపూ రయంతం
వృందం వృందా - వనభువి గవాం - చారయంతం చరంతం
ఛందోభాగే - శతమఖమఖా - ధ్వంసినాం దానవానాం
హంతారం తం - కథయ రసనే - గోపకన్యా భుజంగం (2.05)

మందమ్ముగ దా - మధుర రవముల్ - మంద్రమై నూదు మురళిన్
బృందావనిలో - ప్రియముగను గో - బృందమున్ గాచుచుండున్
ఛందమ్మున దు - ర్జనుల ఖలులన్ - జంపెనం చందురే యా
నందాత్మజు కథ - నాకు జెప్పవె - నాల్కతో నందవనితా

పాణౌ వేణుః - ప్రకృతిసుకుమా - రాకృతౌ బాల్యలక్ష్మీః
పార్శ్వే భాలః - ప్రణయసరసా - లోకితాపాంగలీలాః
మౌలౌ బర్హం - మధురవదనాం - భోరుహే మౌగ్ధ్యముద్రేऽ
త్యార్ద్రాకారం - కిమపి కితవం - జ్యోతిరన్వేషయామః (3.30)

చేతన్ వేణువు - చెలువు రూపము - చెన్నుగా సౌకుమార్యం
బాతని ప్రక్కన - ప్రణయభరితం - బైన లోలాక్షి బృందం
బా తలపైనన్ - బర్హిపింఛం - బంబుజానన మృదుత్వం
బీ తరుణమ్మున - వెదకుచుంటిమి - వెల్గు చిందించువానిన్

ముగింపు

పింగళ ఛందస్సు, నాట్యశాస్త్రములో ఒక బీజముగా మాత్రమే ఉన్న మందాక్రాంత వృత్తానికి ఒక కల్పవృక్షరూపమిచ్చి ఆ చెట్టులో ఎనలేని మందారకుసుమాలను పరిమళింపజేసిన మహాకవి కాళిదాసు. ఆ తావి నాటినుండి నేటివరకు భూగోళమంతా నిండియున్నది. ఈ వ్యాసము చదివిన పాఠకులు, కవులు, పండితులు మందాక్రాంతవృత్తమును, దాని ఆధారముగా సృష్టియైన మందాకిని జాతి పద్యాన్ని తెలుగు భాషలో విరివిగా ఉపయోగిస్తే నేను ధన్యుడినవుతాను. క్రింద ఒక మందాక్రాంతముతో, ఒక మందాకినితో ఈ వ్యాసాన్ని ముగించుచున్నాను.

వాణిశ్రీదా - వరము లొసగన్ - వందన మ్మిత్తు దేవీ
శ్రేణీఛందః - శిఖర సుకరా - చిన్మయా బ్రహ్మజాయా
ప్రాణత్రాణా - ప్రణవపద స-త్పద్యకావ్యాంబురాశీ
వీణాపాణీ - విమలహృదయా - వేదశాస్త్రార్థకారీ

ప్రేమనినాదము - ప్రియుల చెవులన్ - వేదవాక్కై వినబడున్
ప్రేమ నిజముగా - పెన్నిధి గదా - పేదకును మారాజుకున్
ప్రేమకు వేఱొక - పేరు దైవము - ప్రియముగా మాటాడుమా
ప్రేమాయణమే - విశ్వవీధిన్ - వెలుగు ధ్యేయమ్ము గాదా


(సృజనాత్మక వ్యాసాలను చదివి ఆనందిస్తే చాలదు. అందులోని బాగోగులను విమర్శించి రచయితకు ప్రోత్సాహమిస్తే అది రచయితకు, కవికి నవపథములో నడవడానికి చేయూత నిచ్చినట్లుంటుంది. నేను మందాక్రాంతముపై సందేశములు పంపినప్పుడల్లా స్పందించి నాకు చక్కని ప్రోత్సాహము నిచ్చిన శ్రీమతి లైలా యెర్నేని గారికి ఈ వ్యాసమును కానుకగా యిస్తున్నాను.)


గ్రంథసూచి

  1. Bahadur Chandra Chhabra - అభిలేఖసంగ్రహః - An anthology of Sanskrit Inscriptions - Sahitya Akademi - New Delhi - 1964.
  2. V.W. Karambelkar - Select Sanskrit Inscriptions - 1959.
  3. R.C. Majumdar - Ancient Indian colonies in the Far East - Champa - Punjab Sanskrit Book Depot - Lahore - 1927.
  4. క్షేమేంద్ర - పుల్లెల శ్రీరామచంద్రుని వ్యాఖ్య - ఔచిత్యవిచార, కవికంఠాభరణా, సువృత్తతిలక - సురభారతీ సమితి - హైదరాబాదు - 1983.
  5. రామవరపు శరత్ భాబు, శొంఠి శారదాపూర్ణల వ్యాఖ్య - మేఘదూతం - ఆనందలహరి - విశాఖపట్టణము - 1988.
  6. రాయప్రోలు సుబ్బారావు - దూతమత్తేభము - తిరుమల తిరుపతి దేవస్థానం ప్రెస్ - తిరుపతి - 1957.
  7. శంఖవరం సంపద్రాఘవాచార్య - మేఘసందేశము - నవోదయ పబ్లిషర్స్ - విజయవాడ - 2004.
  8. బాపట్ల రాజగోపాలశర్మ - తెలుగు సందేశకావ్య సమాలోచనం - గాయత్రి ప్రచ్రణలు - విజయవాడ - 1989.
  9. కోరాడ రామచంద్రశాస్త్రి - వ్యాఖ్య రామకృష్ణయ్య - ఘనవృత్తము - కోరాడ లక్ష్మీ మనోహరముచే ప్రచురితము - మచిలీపట్టణము - 1917.
  10. పింగలాచార్య - ఛందశ్శాస్త్రం - పరిమల పబ్లికేషన్స్ - ఢిల్లీ - 1994.
  11. భరతముని - నాట్యశాస్త్ర - English translation by Manmohan Ghosh - Asiatic Society of Bengal - Calcutta - 1951.
  12. వరాహమిహిర విరచితా బృహత్సంహితా - హిందీ వ్యాఖ్య అచ్యుతానంద ఝా శర్మ - చౌఖంభా విద్యాభవన్ - వారాణసి - 1959.
  13. అశ్వఘోషుని సౌందరనందము - సంపాదకుడు హరప్రసాద్ శాస్త్రి - Royal Asiatic Society of Bengal - Calcutta - 1939.
  14. Nagavarma’s Canarese Prosody - F. Kittel - Basel Mission Book and Tract Depository - London - 1875.
  15. మల్లియ రేచన - కవిజనాశ్రయము - వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ - మదరాసు - 1950.
  16. జయదామన్ - సంపాదకుడు హరి దామోదర వేళంకర్ - హరితోషమాలా - బొంబాయి - 1949.

(నా అభ్యర్ధన మేరకు, యక్షుని చిత్రాలని గీసి అందించిన శ్రీ మాగంటి వంశీమోహన్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను - మోహన.)


జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు (విద్వత్కవిభూషణ వేదం వేంకటకృష్ణ శర్మ తెలుగు పాఠాలు చెప్పారు).తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు.  ...

 

(31 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    May 4, 2012 12:02 am

    మోహన రావు గారూ,

    మీ వ్యాసం చాలా బావుంది. మీలా చందస్సులో పరిశోధన చేసి వ్యాసాలు రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు. దానికెంతో శ్రద్ధా, అభిరుచీ, కోరికా వుందాలి. అంతకుమించి కాలం కూడా వెచ్చించగలగాలి. చందస్సు అవసరం లేదనుకునే నేటి కవులు చందస్సు దాటి కవిత్వాన్ని ఆస్వాదించలేక పోతున్నారు. చందస్సు ఒక చట్రమనుకునే వారికి లయతో కూడిన చాలా అల్లికలున్నాయన్న సంగతి తెలీదు. చందస్సుని వాళ్ళు వదిలేసారు. కవిత్వం వాళ్ళనొదిలేసింది. అందుకే వచన కవిత్వంలో వచనం కవిత్వాన్ని రెండో స్థానానికి నెట్టేసింది.

    మీలా చెప్పే వారు ఆంధ్రాలో కూడా తక్కువే!

    “సృజనాత్మక వ్యాసాలను చదివి ఆనందిస్తే చాలదు. అందులోని బాగోగులను విమర్శించి రచయితకు ప్రోత్సాహమిస్తే అది రచయితకు, కవికి నవపథములో నడవడానికి చేయూత నిచ్చినట్లుంటుంది,” అని మీరు చెప్పింది నాకూ వర్తిస్తుంది. మీ వ్యాసాలు క్రమం తప్పకుండా చదువుతాను. బావుందని చెబుదామనుకుంటూ వాయిదా వేసిన సందర్భాలే ఎక్కువ. ఎందుచేతనో చాలామంది ( నాతో కలుపుకుని ) చదివి మంచీ చెడూ చర్చించరు. ముఖ్యంగా రచయిత బిళ్ళ మెళ్ళో వేసుకునేవారు. చెడు చెప్పాలంటే మొహమాటం అడ్డొస్తుంది. బావుందని చెప్పాలంటే అహం అడ్డొస్తుంది. ఇంకా గట్టిగా అంటే మరలా తమ రచనలమీద మిగతా వారెక్కడ విరుచుకు పడతారోనన్న భయం ఉంటుంది. పైగా పక్కవాణ్ణి పొగిడితే మనం ఒక మెట్టు క్రిందకి పడిపోతామన్న న్యూనతా భావం వుంటుంది. ఇంతకుమించి తమ రచనలని ప్రేమించినట్లుగా ఇతరుల రచనలని గౌరవించ లేకపోవడం వుంటుంది. ఇలా సవాలక్ష కారణాలు వెతక్కుండానే రోజూ కనిపిస్తూ ఉంటాయి.

    సెక్స్ శీర్షికలకీ, సినిమా వ్యాసాలకున్న గిరాకీ చందస్సు వ్యాసాలకుండదు సారూ! సాహిత్యమయినా, సంగీతమయినా సినిమా శంఖంలో పోస్తే కానీ తెలుగువారికి రుచించదు.

    -బ్రహ్మానందం గొర్తి

  2. vikas,vinnakota అభిప్రాయం:

    May 4, 2012 4:38 am

    గౌరవనీయులు జెజ్జాల కృష్ణ మోహన రావు మరియు సంపాదకులకు నామస్కారం

    నేను, అమెరికాకి వచ్చి రెండేళ్ళు అయ్యింది, చిన్నపుడు 10వ తరగతి నుంచి మొదలు పెట్టిన వృత్తి విద్యలొ పట్టా కోసం వేట ఈమధ్యే పూర్తి అయ్యింది. నాకు జెజ్జాల కృష్ణ మోహన రావు గారి వ్యాసాలు చదివినప్పుడు ఒక రకం ఐన depression వస్తుంది. Sir, మీ వ్యాసాలు నాకు అర్ధం కాక పోయినా, తెలుగు భాషలో నా తెలియనితనం అజ్ణానం తేటతెల్లం అవుతోంది. ఈమధ్య ఎందుకో, దూరంగా ఉంటున్నందుకో ఏమో భాష మీద మమకారం, నేర్చుకోవాలన్న తాపత్రయం పెరుగుతోంది, కాని మీరు రాసిన ఋతుపర్ణము, కామవేదం లాంటి కవితలు లేదా మీరు ఎంతో శ్రమకోర్చి, పరిశోధించి రాసే వ్యాసాలు ఐనా సరే, పూర్తిగా కాదు కదా పావు వంతు ఐనా నాకు అర్ధం కావడం లేదు. దయచేసి తప్పుగా అర్ధం చేసుకొకండి. భాష సంస్కృతి అంటూ పెద్ద మాటలు పక్కన పెడితే ఆఖరికి సినిమా పాటలు కూడా కొన్ని సార్లు అర్ధం కాని పరిస్థితిలొ ఉన్న నాలాంటి వాడు తెలుగు నేర్చుకోవాలి అంటే అసలు వీలు పడుతుందా?

    ఈ ఒక్క సందర్భమే కాదు ఎప్పుడన్న పైత్యమో భక్తో ప్రకోపించి ఏ రుద్రమో, శంకర భాష్యాల అనువాదాలో netలో వెతికి పట్టుకున్నా నాలాంటి వాడికి ‘ఒం” ‘నమహ్’ తప్ప ఇంకో ముక్క అర్ధంకావు. వాటికి అర్ధాలు తెలియవు.

    ఈసారి, India వెళ్ళినప్పుడు ఊరగాయలు కాకుండా, ఓ నాలుగు పుస్తకాలు కొనుక్కుంటే చాలు, కాని ఎక్కడ మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టలి అన్నదే ప్రశ్న? మీ వ్యాసానికి ఏరకంగాను సంబంధం లేక పొయినా దయచేసి నాకు దైవపరమైన పుస్తకాలు, భాష బాగు పడడానికి ఉపయుక్త కారమైనవి ఏమన్న సుచించమని మనవి.

    అలాగే పత్రికా ముఖంగా మరొక్క మనవి, ఈ-మాట గ్రంధాలయంలో కొంచం పురాణ వాఞ్ఙయాలని చేరిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం, నాబోటి వాళ్ళు ఏమన్న అర్ధం కాక పొయినా అనుమానాలు, అర్ధం కాని విషయాల వ్యక్తం పెద్దలు వివరించగలరు అని ఆశ పడుతున్నాను.

    పెద్దలు, నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే అది నా చిన్నతనం అని మన్నించగలరు.

    వికాస్ విన్నకోట

  3. chavakiran అభిప్రాయం:

    May 4, 2012 12:14 pm

    వికాస్ గారు,
    తెలుగు పుస్తకాలు చదవదానికి ఇండియా రాక కోసం ఆగక్కరలేదు. చక్కగా కినిగెలో చదువుకోవచ్చు. Visit kinige.com for more details!

  4. మోహన అభిప్రాయం:

    May 4, 2012 1:59 pm

    బ్రహ్మానందంగారికి, వికాస్ గారికి, మీ అభిప్రాయలకు కృతజ్ఞతాపూర్వక వందనాలు.

    వికాస్ గారు - మీరు ముందుంచిన విషయాలు చాల ముఖ్యమైనవి. నా అనుభవమువల్ల నేను నేర్చుకొన్న కొన్ని పాఠాలను మీముందు, అలాగే మిగిలినవారి ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. (1) ప్రతిరోజు ఒక గంట లేక గంటన్నర ఏదో ఒక సాహితీ పుస్తకాన్ని చదివితే ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. ఒక గంట చాల తక్కువ సమయములా తోచవచ్చును. కాని 20, 30, 40 యేళ్ల కాలములో ఇది తక్కువ కాదు. ఎన్నో కొత్త పుస్తకాలు చదవడానికి వీలవుతుంది, ఎంతో నేర్చుకోడానికి వీలుపడుతుంది. ఇలా చేస్తే ఒంటరిదనము కూడ మరచిపోవచ్చును. (2) చదివేటప్పుడు అర్థము కాని పదాలు కనబడినప్పుడు, నిఘంటువును సంప్రదించి అర్థాలు తెలిసికోవాలి. సుమారు ఒక వేయి పుటలకన్న తక్కువగా ఉండే నిఘంటువు చాలు ఈ కార్యానికి. మిగిలినవాటికి ఆంధ్రభారతివారి నిఘంటువు సైటును చూడవచ్చును. మొట్టమొదట పదాలకు అర్థాలు వెదకడములోనే సమయమవుతుందని బాధపడవచ్చును. కాని కొన్నాళ్లకు చాలా పదాలకు అర్థాలు తెలియడమువల్ల ఇలా వెదకడము తగ్గుతుంది. (3) పాత కవిత్వమయినా, కొత్త కవిత్వమయినా దేనినయినా చదవడానికి ఎన్నుకోవచ్చును. శ్రీశ్రీ కవితలలోని కొన్ని పదాలకు నిఘంటువు తప్పని సరి ఇప్పటికీ. కావ్యాలకన్నా, అందులోని కొన్ని భాగాలను పఠనీయాంశాలుగా ఎన్నుకోవచ్చును, ఉదా. నన్నయ దుష్యంతుని కథ, తిక్కన ఉత్తరగోగ్రహణము, శ్రీనాథుని హంసదూతము, పోతన రుక్మిణీ కల్యాణము, శ్రీరామచరిత్ర,, పాపరాజు కుశలవుల రామాయణ గానము, మున్నగునవి. (4) అంతర్జాలములో ఎన్నో పుస్తకాలు ఉచితముగా లభ్యము. టీకాతాత్పర్యాలతో చాల పుస్తకాలు ఉన్నాయి. వాటిని సులభముగా ఇక్కడినుండి, ఇక్కడినుండి దిగుమతి చేసికొనవచ్చును. ఇవి కొన్ని సలహాలు మత్రమే. మిగిలినవి ఆసక్తిపైన ఆధారపడినవి.

    విధేయుడు - మోహన

  5. jayaprabha అభిప్రాయం:

    May 4, 2012 2:53 pm

    బెజ్జాల కృష్ణ మోహన రావు గారూ !

    మందాక్రాంత వృత్తాన్ని గురించి మీరు రాసిన వ్యాసానికి మీరు పాఠకులనించి స్పందనని ఆశిస్తే నాకని పించిందీ ..మీకు తెలుగు పాఠకుల మీద ఎంతటి నమ్మకం ఉండి ఆశించి ఉంటారో కదా అని. నేను ఈ అభిప్రాయం ఎందుకని రాస్తున్నానంటే … నా అనుభవం మీకు ఏమన్నా ఉపయోగపడవచ్చునేమో అని మాత్రమే!

    ప్రతీ వ్యాసానికీ ప్రతీవారూ పాఠకులు కారు. కాలేరు కూడాను. వారి వారి స్థాయిని అనుసరించి మాత్రమే ఒక రచనని ఆయా పాఠకులు స్వీకరించగలుగుతారు. మీ వ్యాసాన్ని గురించి మీరు చందస్సుని సాధికారంగా తెలిసిన వారిన్నించీ గనక స్పందనని ఆశిస్తే బహుశా …మీ ఆశకి ఫలితం ఉంటుంది. వికాశ్ విన్నకోట నిజాయితీగా తన నిస్సహాయతని తెలియజేశాడు. అందుకు అతడిని అభినందించాలి. ఇంక గొర్తి బ్రహ్మానందం అన్నట్టు… రకరకాల కారణాలకి గానూ వ్యక్తులు “మౌనం” గా ఉంటూంటారు. నేను ఏనాడో చెప్పాను. చదువుకున్న పాఠకులు తెలుగులో వచ్చే మంచి రచనల పట్ల చూపించే ఉదాశీనత వలన … మంచి పుస్తకాలు రాసేవారు క్రమేపీ తెలుగున కనుమరుగౌతారని. మనం నిజంగా అసలు విషయాల మీద చర్చించడాన్ని ఏనాడో మాని వేశాము.

    నేను అన్నమయ్య పదపరిచయం చేస్తూ రెండు పుస్తకాలని ప్రచురిస్తే .. దానిమీద మామూలు పాఠకులు ఎక్కువగానూ “చదువుకున్న” పాఠకులు నిశ్సబ్దంగానూ స్పందించేరు. కొన్ని వేల సంకీర్తనలతో ఒక దశాబ్దం పాటు ఏకదీక్షగా పని చేస్తే..!!

    ఏతావతా నాకు అనుభవం అయ్యిందేమంటే .. తెలుగున ఒక పుస్తకం మీద స్పందన తెలియజేయడానికే శక్తి చాలని వారో లేదా ఆసక్తి చాలని వారో ఉన్నా .. నేను ఏనాడూ నిరాశ పడలేదు. ఎందుకంటే రేప్పొద్దున్న వికాస్ విన్నకోట లాంటి కుర్ర వాళ్ళు తెలుగు పట్ల నిజంగా ఆకర్షితులై .. విషయాలని తెలుసుకుందామని అనుకుంటే వాళ్లకి అక్కరకొచ్చే పుస్తకాలు ఉండాలి.

    అందుకని మీరు రాయవలసి ఉంది. పైగా మీకు చందస్సు అంటే ఉన్న ఇస్టం ..చందస్సుని గురించి మీకు చెప్పవలసిన విషయం బలంగా ఉండటమే ముఖ్యం!! మిగిలినవి కావు. ఆగామి కాలం ఏ రచనలని స్వీకరిస్తుందో.. వేటిని జారవిడుస్తుందో.. తెలిసిన వారేరీ?? ఉన్నారా నిజంగా ??

    అయితే గాఢమైన విషయాలని రాసేవారికి “ప్రోత్సాహం” తప్పకుండా అవసరమే !! కానీ అది కొరవడిన కాలమ్లో ఉంటున్నామన్న స్పృహ రాయడానికి మరింత ప్రేరణనే కలిగించాలని నేననుకుంటాను. మీవ్యాసం మందాక్రాంతం గురించి మరింత బాగా తెలిసిన వారికి చేరాలని మాత్రం ఆశిస్తాను.

    యాధాలాపమైన రచనలకి… అలాగే ఏ సాహితీ బలం చాలని రచనలకీ పనిగట్టుకుని అతిగా “ఒహోఓహోలూ” నిజంగా సాహితీ విలువ కలిగిన రచనల విషయమ్లో మాత్రం నిశ్సబ్దాలూ … ఉదాశీనతలూ… ఏ కాలమ్లోనూ ఏ జాతీ గర్వపడదగిన విషయాలు కానేరవని మాత్రం చెప్పగలను.

    జయప్రభ.

  6. lyla yerneni అభిప్రాయం:

    May 6, 2012 2:52 am

    A treatise on మందాక్రాంతవృత్తము. A treat indeed.

    Questions:

    విశ్వనాథ సత్యనారాయణ తన నవల “దూత మేఘము - chapter 9, page 83. లో - ఉజ్జయినీ పురాధిపతి విక్రమాదిత్య చక్రవర్తి అస్థానములో ” ధన్వంతరి, క్షపణకుడు, అమరుడు, శంకరకవి, భేతాళభట్టు, ఘటకర్పరుడు, కాళిదాసు, వరాహమిహిరుడు, వరరుచి అన్న నవరత్నములు - పెద్ద పండితులు, ఉన్నట్లు రాసారు.

    అదే నవల మరొక పేజీలో (135) విక్రమాదిత్యుడు, కాళిదాసు సమవయస్కులనీ, విక్రమాదిత్యుడు కలి ప్రవేశించిన తరువాత మూడువేల ఒకటవ సంవత్సరములో జన్మించినట్లు రాసారు. విక్రమాదిత్యుని తండ్రి పేరు ప్రవరసేనుడు అని రాసారు.

    ఈ వ్యాసములో - కాళిదాసు రెండవ చంద్రగుప్తుని కాలములో నివసించాడు, అతని ఆస్థానకవి. (క్రీ.శ .) నాలుగవ శతాబ్దపు అంత్యకాలములో జీవించాడు. చంద్రగుప్తుని తండ్రి సముద్రగుప్తుడు - అని ఇచ్చారు.

    ఏమిటీ తేడాలు. వివరించరూ.

    లైలా.

  7. రవి అభిప్రాయం:

    May 6, 2012 3:11 am

    మోహన గారు, మీ వ్యాసాన్ని సమీక్షించి లేదా విమర్శించే స్థాయి నాకు లేదు. చక్కగా ఉంది అంటే సరిపోదు, ఈ వ్యాసం అలా ఉబుసుపోక చదివి అభిప్రాయం చెప్పేదీ కాదు, అంచేత నాకు కలిగిన కొన్ని ఆలోచనలు పంచుకుంటున్నాను.

    >>కోపాన్ని, ధిక్కారాన్ని సూచించడానికి పృథ్వీవృత్తము ఉచితమైనది, అది ఈ భారాన్ని మోయగలదు. వర్షాకాలములో ప్రవాసములో విరహానుభవాన్ని వివరించడానికి మందాక్రాంతము చక్కగా శోభిస్తుంది.

    మీరు ఉటంకించిన క్షేమేంద్రుని వ్యాఖ్య సంస్కృతానికి సరిగ్గా సరిపోతుంది. అయితే అదే విరహాన్ని తెలుగులో వర్ణించాలంటే మందాక్రాంతము సరిపోగలదా అన్న అనుమానం కలుగుతోంది. అందుకు కారణం యేభై పైగా తెలుగు అనువాదాలున్న ఈ కావ్యానికి ఒక్క అనువాదం కూడా తెలుగు మందాక్రాంతం లో లేదు.

    భారతదేశంలో ఈ కావ్యానికి అత్యధికమైన అనువాదాలు తెలుగులోనే ఉన్నాయట. వీటిలో మొదటిది కొటికలపూడి వెంకటకృష్ణసోమయాజి గారి అముద్రితరచన (1864), మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తకాలయంలో ఉందట. అప్పటి నుండి నేటి వరకూ యేభై కి పైగా అనువాదాలు, గేయాలు, వచనాల రూపంలో కూడా వెలువడినాయి. వీటిలో కాస్త ప్రాచుర్యమైనవి రాయప్రోలు సుబ్బారావు గారి దూతమత్తేభము, విద్వాన్ విశ్వం గారి మేఘసందేశానువాదము, దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి రచనా మూడూ వరుసగా మత్తేభ, కంద, వృత్తాలలో వ్రాసి ఉన్నవి. ఇతర కవుల అనువాదాలు కూడా వృత్తాలలో, గేయాలలో ఉన్నవి. మందాక్రాన్తాన్ని యథాతథంగా తెలుగులో మేఘసందేశానువాదానికి వాడుకున్న కవులు కనిపించడం లేదు.

    నిడదవోలు వెంకటరావుగారు ’షట్పదీ మేఘసందేశం’ అన్న ఒక అనువాదానికి పీఠిక వ్రాసి ఒకమాట ఇలా అన్నారు. “భామినీషట్పది వృత్తం మందాక్రాంత వృత్తముతో సన్నిహిత సంబంధమున్నది.” బహుశా మందాక్రాంతాన్ని అనువదించడానికి లేదా మంద్రాక్రాంతములో చెప్పగలిగిన భావానికి తెలుగులో సరిపోలగల వృత్తం షట్పదీ వృత్తం అయి ఉండవచ్చునని ఆయన అలా అన్నారేమోనని నా అనుకోలు. ఈ కావ్యంలో మొదటి పద్యాన్ని ఉటంకిస్తున్నాను. (కశ్చిత్కాన్తా … శ్లోకానికి అనువాదం)

    “మునుపు యక్షుండొకఁడు తన ప్రియ
    వనిత తోడుత నుండి యింటను
    పనుపు సేయుట యందు నేమర వాంఛలకు లోఁగి
    కనలి ధనదుఁడు శాపమిచ్చెను
    వనజలోచనఁ బాసి వర్షము
    వనములంబడి బ్రతుకు మంచును పవి కఠోరముగ

    ఆననమ్మున గళలు దొరగఁగ
    దీనుడై మిథిలేశ తనయా
    స్నాన పుణ్యోదక వివర్ధిత సాంద్రతరుతతిని
    మేని బడలిక మనసు సడలిక
    మానుపంగల రామగిరిపై
    పూనె నాతడు గడుప దినములు పోడిమిని వీడి.”

    మీరు మందాక్రాంత లయకు దగ్గరగా ఉన్న మందాకిని అనువాదాలను సూచించారు. బావుంది. అయితే విరహానుభవం తెలుగులో ఉద్యోతించడానికి బహుశా షట్పదీ వృత్తం ఎక్కువగా పొసగవచ్చునన్న వెంకటరావు గారి అభిప్రాయం ఆలోచింపజేస్తున్నది.

    జిజ్ఞాసువు,
    రవి.

  8. కామేశ్వరరావు అభిప్రాయం:

    May 6, 2012 1:03 pm

    మోహనగారు,

    సంస్కృత తెలుగు యతులను రెండిటినీ పాటిస్తూ మీరు వ్రాసిన తెలుగు పద్యాలు బాగున్నాయి. అయితే వాటిలో మీరు చేసిన యడాగమ సంధుల గురించి చిన్న అనుమానం.
    “యలయై రావా - యలఘుతర మో - దాబ్ధిలో ముంచ రావా”
    వంటి చోట్ల యడాగమం చెయ్యవచ్చా అని.
    తెలుగులో మందాక్రాంతం ఎందుకు అరుదు అన్న మీ ప్రశ్నకి మీ, “వాణిశ్రీదా - వరము లొసగన్ - వందన మ్మిత్తు దేవీ” అన్న పద్యమే సమాధానం అని నాకనిపించింది. మిగతా మూడు పాదాలలో ఉన్న అందం మొదటిపాదంలో ఉందా?

    సంస్కృత యతుల గురించి నాకు చాలా రోజులుగా ఉన్న ఒక సందేహం ఇక్కడ అడగడం అసందర్భం కాదనుకుంటాను. సంస్కృతంలో యతి విరామస్థానం కదా. అంటే పద్యం చదువుతున్నప్పుడు అక్కడ కచ్చితంగా ఒక క్షణం ఆగాలి కదా. మరి అలాంటప్పుడు యతి స్థానంలోని అక్షరం సంయుక్తమైతే దాని ముందరి అక్షరం గురువవ్వడం సమంజసమెలా అవుతుంది? ఉదాహరణకి, “ఆషాఢస్య ప్రథమ దివసే” అన్నప్పుడు “స్య” అన్న అక్షరం “ప్ర” అక్షరం సంయుక్తం కావడం వల్ల గురువవుతోంది. కాని “ఆషాఢస్య” అని ఆపి తర్వాత “ప్రథమ దివసే” అని చదివేటప్పుడు “స్య” లఘువే కదా అవ్వాలి?

    రవీ,
    మీరుదహరించిన షట్పదికి “ఆధునిక”నామం ఏమిటో గుర్తించారా?:-)

  9. K.V.S. Ramarao అభిప్రాయం:

    May 6, 2012 6:13 pm

    మోహనరావు, బ్రహ్మానందం, జయప్రభ పాఠకస్పందన గురించి చాలా లోతైన విషయావలోకనకి దారితీసే అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఈ వ్యాసానికి నేరుగా సంబంధించకపోయినా ఈ “పాఠకస్పందన” గురించి నాకు కలిగిన కొన్ని సాధకబాధకాల్ని “ఈమాట” పాఠకుల ముందుంచుతాను.

    1. రచనలో రచయిత పాత్ర. మీరు ఒక సాంకేతిక పరిశోధనాపత్రం రాసి ప్రచురించదల్చుకున్నారనుకోండి. దాన్లో విధిగా మొదల్లోనో (కొన్నిట్లో చివర్లోనో) ఆ విషయం మీద అంతవరకు జరిగిన ముఖ్యమైన పరిశోధనల్ని క్లుప్తంగా వివరించి, మీరు చేస్తున్నపని వాటికన్నా ఏ విషయాల్లో భిన్నమైందో, ఎలా ఆ సమస్య పట్ల మన అవగాహనని విస్తృతం చేస్తుందో, మీరు చేస్తున్న ముఖ్యమైన contributions ఏమిటో ఏకరువు పెడతారు. అప్పుడు ఆ పత్రాన్ని పరిశీలించే పరిశీలకులు (reviewers) మిగిలిన వాళ్ల, మరియు మీసొంత contributions గురించి మీరు చెప్పిన విషయాలు ఎంతవరకు సత్యాలో కాదో నిర్ణయించి, మీ contributions విలువ మీరు ప్రచురించ ప్రయత్నిస్తున్న పత్రిక (journal, conference proceedings etc) స్థాయికి సరితూగుతుందా లేదా అని బేరీజు వేసి ఆ పత్రాన్ని ప్రచురణార్హమైందో కాదో తేలుస్తారు. ఆ పరిశీలకులు మీరు పనిచేస్తున్న అంశం లోనో, దానికి దగ్గరగా వుండే అంశాల లోనో ఉద్దండులు కనుక ఈ పని చెయ్యగలుగుతారు (ఎప్పుడూ కాకపోవచ్చు కాని అత్యధిక శాతం విషయంలో ఇది నిజం).

    కవితల్నీ కథల్నీ బావుందనో లేదనో చెప్పటానికి విస్తృతమైన పాండిత్యం పనికొస్తుందేమో కాని అవసరం మాత్రం కాదు, ఎందుకంటే వాటిని బేరీజు వెయ్యటం హృదయసంబంధి విషయం. వ్యాసాలు అలా కాదు. అవి మేధోసంబంధితాలు. (చాలా మంది తెలుగు కవులు ఈ తేడా తెలియక వ్యాసాల్ని కవితల్లా రాయటానికి ప్రయత్నించటమూ కవితలరూపంలో అప్రయత్నంగానే వ్యాసాలు రాయటమూ మనకు కొత్తకాదు గాని, అది ప్రస్తుతం అప్రస్తుతం.) కనుక ఒక వ్యాసాన్ని చదివినప్పుడు ఆ రచయిత contribution ఏమిటో ముందు మనకు తెలియాలి. ఉదాహరణకు, (అ) ఎవరో రాసిన విషయాన్ని తన మాటల్లో మళ్లీ రాశాడా, (ఆ) రకరకాల పుస్తకాల్లో ఉన్న విషయాల్ని క్రోడీకరించి ఒకచోట చేర్చాడా, (ఇ) అదివరకు ఉన్న విషయాల్ని తీసుకుని వాటికి కొంత కొత్త అవగాహనని కలిపాడా, (ఈ) ఇదివరకు ఎవరూ చూడని ఒక కొత్త కోణం చూపిస్తున్నాడా, (ఉ) ఇదివరకు ఎవరూ ఊహించని కొత్త ఊహతో అదివరకున్న అవగాహనని తల్లకిందులు చేశాడా, (ఊ) అదివరకు అవగాహనే లేని విషయానికి ఒక సిద్ధాంత ప్రాతిపదికని కల్పించాడా,.. ఇలా ఎన్నో levels ఉన్నాయి. ముందే అనుకున్నట్టు సాంకేతిక రంగాల్లో ఐతే తను చేసిన పని ఏమిటో ఈ విశాల రేఖ మీద దాని స్థానం ఎక్కడని తను నమ్ముతున్నాడో చెప్పటం రచయిత పని. అతని ఆ అవగాహన ఖచ్చితమైందో కాదో నిశ్చయించటం పరిశీలకుల పని.

    తను చేస్తున్న పని ఏమిటో చెప్పటం మన రచయితలకు అలవాటు లేదు. ఆ పని స్థాయి ఏమిటో చెప్పగలిగే పరిశీలకులు సాహిత్య ఔత్సాహికుల్లో చాలా కొద్దిమంది.

    2. దేని గురించి రచయితని అభినందించాలి? ఒక వ్యాసంలో రచయిత పాత్ర ఏమిటో తెలియనప్పుడు ఆ రచయితని దేని గురించి అభినందించాలి? ఉదాహరణకి ఒక రచయిత చేసిన పని ఎన్నో చోట్ల ఉన్న విషయాల్ని సంగ్రహించి క్రోడీకరించి సంక్షిప్తీకరిచటం అనుకోండి. అప్పుడు అవసరమైన అన్ని విషయాల్ని సంగ్రహించాడా లేక ఏవైనా ముఖ్యమైన వాటిని సంప్రదించలేదా, క్రోడీకరణమూ సంక్షిపీకరణమూ సరిగా ఉన్నాయా లేవా అని వాటి గురించి అభినందనలో చీవాట్లో అవసరాన్ని బట్టి ఇవ్వొచ్చు. రచయిత పాత్ర ఏమిటో తెలియనప్పుడు, అది తెలుసుకునే జ్ఞానం పాఠకుడికి లేనప్పుడు, చేసే వ్యాఖ్యలు గుడ్డివాడి చేతిలోని రాయి వంటివే ఔతాయి కదా.

    3. ఎవరు సరైన వ్యాఖలు చెయ్యగలరు? రచయితా, పరిశీలకులు పాఠకుడికి ఎలాటి సమాచారమూ ఇవ్వనప్పుడు బాధ్యతంతా పాఠకుడి మీదే పడుతుంది. పాఠకుడే ఆ రచనలో రచయిత తెచ్చిన కొత్త అవగాహన ఏమైనా వుందా? ఉంటే అదేమిటి? దాని విలువేమిటి? ఆ విలువ స్థాయి ఏమిటి? మిగిలిన వాటితో పోలిస్తే ఇది నేలబారుదా, సామాన్యమైందా, సగటుదా, ఉన్నతమైందా, అత్యున్నతమైందా, అద్భుతమైందా - అని బేరీజు వెయ్యగలగాలి. మామూలు పాఠకులకి ఇది సాధ్యం కాదు. కనుక ఏదో అనాలి కదా అనటమో లేకపోతే లేని పెద్దరికాన్ని మీద వేసుకుని తెలియని విషయాల్ని తెలిసినట్టు నటించటమో లేదా అలాటి నటన అలవాటైపోయి నిజంగానే పండితుణ్ణని భ్రమించటమో జరుగుతుంది.

    4. అందరూ ఔత్సాహికులే ఐనప్పుడు. “ఈమాట” లాటి పత్రికల్లో వ్యాసాలు రాసేవారు (ఏ నారాయణ రావు లాటి వారో తప్ప) ఔత్సాహికులు. అలాటి వారు తమకున్న అనేక ఇతర వ్యాపకాల నుంచి సమయం వెచ్చించి ఏదో ఒక విషయం మీద వ్యాసం రాయటమే గొప్ప విషయం. కనుక అలాటి వారు రాసే వ్యాసాలకి professional స్థాయి ప్రమాణాలు వర్తిస్తాయా? వర్తించాలా? అది సాధ్యమా? కొంత lenience అవసరం అని బహుశా అందరూ ఒప్పుకోవచ్చుననుకుంటాను. ఐతే, ఎంత? ఉదాహరణకు, ఒక professionalకి “ఉన్నత” స్థాయి ఔత్సాహికుడి “సగటు” స్థాయికి సమానం అనొచ్చా? అంటే, professional scale మీద “సగటు” స్థాయిని చేరే వ్యాసాన్ని ఒక ఔత్సాహికుడు రాస్తే, దాన్ని “ఉన్నత” స్థాయి అని లెక్కవెయ్యొచ్చా? మరోవిధంగా చెప్పాలంటే, professionalకి, ఔత్సాహికుడికి తేడా “ఒక స్థాయి” అన్నమాట. కాదు, అది మరీ దగ్గర, రెండు స్థాయిల తేడా ప్రమాణం ఐతే బాగుంటుంది అనొచ్చు. ఏదో ఒకటి, ఒక ప్రమాణం ఒప్పుకుంటే అప్పుడు professional scale ని కొలమానంగా తీసుకుని ఔత్సాహికుల రచనల విలువని అంచనా కట్టొచ్చు.

    చివరగా: మంచి రచనల్ని, మంచివి కాని వాటిని విడదియ్యలేనప్పుడు ఇటు వాసి రచయితలకూ అటు నాసి రచయితలకూ మరోవైపు పాఠకులకూ మంచి జరగదు. నాసి రచయితలు గొప్పవాళ్లమని విర్రవీగి విజృంభించటం, వాసి రచయితలు నీరుగారి నీరసించటం, పాఠకులు చెత్తలో కూరుకుపోయి ఆక్రందించటం జరుగుతాయి. తెలుగు సాహిత్యరంగంలో అలా విడదియ్యటానికి ఇప్పుడు కాలం అనుకూలం కాదు. ఈ జటిలసమస్యకి పరిష్కారం నాకు తెలియదు.

    ఎందరో పెద్దవాళ్లు చెప్పినట్టు, రాయగలిగిన వాళ్లు రాస్తూ వుండాలి. ప్రతివారు చేసే ప్రతి రచన కళాఖండం కాదు కాని అభ్యాసంతో ఎప్పుడైనా ఒకటి బయటకు వచ్చే అవకాశం వుంది. “అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు”. ఈ విషయం రచయితలూ పాఠకులూ గ్రహిస్తే అందరికీ హాయి.

    వారి వ్యాసంతో సంబంధంలేని విషయాల్ని రాసే అవకాశం ఇచ్చిన మోహనరావు గారి వ్యాసానికి అభినందనలు.

  10. మోహన అభిప్రాయం:

    May 6, 2012 7:20 pm

    1) బ్రహ్మానందం గారు, నచ్చిన విషయాలను ఎప్పుడు నచ్చాయి అనే చెప్పాలి. అందువల్ల మనము తక్కువ కాము. నేను చిన్నప్పుడు Yussouf by James Lowell లో చదివిన క్రింది పంక్తులు మెదడులో తేలుతున్నాయి -
    As one lamp lights another, nor grows less,
    So nobleness enkindleth nobleness.

    2) జయప్రభ గారు, మీరు చెప్పినది నిజమే. నాకు ఎంతో యిష్టము కాబట్టే, ఛందశ్శాస్త్రములో నేను పరిశోధనలు చేస్తున్నాను. ఇవి ఎవరు బావుంది, బాగా లేదు అని చెప్పినా, వ్యాసాలు వ్రాయకున్నా కూడ ఆపను. ఎందుకంటే ఈ శాస్త్రములో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి అర్థము చేసికోవడానికి, నన్ను జ్ఞానవంతుడిని గావించుకోడానికి. మీ సలహాలకు కృతజ్ఞుడిని.

    3) లైలాగారు, కాళిదాసు నివసించిన కాలమునుగురించి ఇంకా తర్జనభర్జనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఇతడు క్రీస్తు పూర్వమే ఉన్నాడంటారు. మరి కొందరు నేను తెలిపినట్లు నాలుగవ శతాబ్దపు వాడంటారు. ఇతని కవిత్వములో అశ్వఘోషుని కొన్ని అనుసరణలు, అనుకరణలు ఉన్నాయి. కాళిదాసులాటి కవికి మిగిలినవారిని ఎందుకు అనుసరించాలి అనే వాళ్లు ఇతడు అశ్వఘోషునికి పూర్వకవి అంటారు. నా ఉద్దేశములో మందాక్రాంతమును వాడిన మొట్టమొదటి కవి కాళిదాసు హరిసేనుడివల్ల ప్రభావితుడై ఆ వృత్తాన్ని మేఘదూత రచనకు ఎన్నుకొన్నాడని అనుకొంటాను. ఇక పోతే, సముద్రగుప్తుని ప్రయాగ ప్రశస్తి శిలాక్షరాలు కాబట్టి ఇందులో ఎట్టి సందేహము లేదు. కావున నేను కాలిదాసు నాలుగవ శతాబ్దపు వాడనే నమ్ముతాను. సముద్రగుప్తుడన్నది ఒక బిరుదు మాత్రమే. ఇతని అసలు పేరు వేరైనది.

    కాని నాకు ఒక సందేహము మాత్రము ఉన్నది. కాళిదాసు ఉజ్జయినీవాసుడు. కాని గుప్తుల రాజధాని పాటలీపుత్రము. ఇంత దూరము ఉన్నా కాళిదాసుకు చంద్రగుప్తునికి ఎలా సంబంధాలు ఉండినవో అన్నది చర్చనీయాంశమే. ఈ రెండవ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడా అన్న విషయము ఇంకా తేలలేదు. మీరు ఉదహరించిన ఘటకర్పరునికి పేరు అది కాదు, అదేమో తెలియదు. కాని సందేశకావ్యములలో ఇతడు వ్రాసిన ఘటకర్పరము ఉన్నది. ఇది ఒక యమక కావ్యము కూడ. కొందరు దీనిని చూచిన తరువాతే కాళిదాసు మేఘదూతాన్ని వ్రాసినాడంటారు.

    4) రవి గారు, రాజగోపాల శర్మ వ్రాసిన పుస్తకములో (గ్రంథసూచిలో ఎనిమిదవది, ఇది DLI - IISc లో లభ్యము) తెలుగులో కొటికలపూడి వేంకటకృష్ణ పండితులు 1790లో అనువదించారు, అది నేడు దొరకడము లేదు. లభ్యమయిన పుస్తకాలలో వడ్డాది సుబ్బరాయకవి 1884లో చేసిన అనువాదము మొదటిది. సుమరు 50 అనువాదాలు ఇందులో పేర్కొనబడ్డాయి.

    5) నిడదవోలు వేంకటరావుగారికి కన్నడ ఛందస్సుతో బాగుగా పరిచయము ఉన్నది. ఆందువలన వీరు భామినీషట్పదిని ఎన్నుకొన్నారేమో లేక కామేశ్వరరావుగారన్నట్లు ఈ ఛందస్సు తెలుగులో కూడ పరిచితము కాబట్టి ఎన్నుకొన్నారేమో? మిశ్రగతిలో సాగే ఈ ఛందస్సుకు ఒక తూగు ఉన్నది. వ్యక్తిగతముగా నా ఉద్దేశములో అది వ్యధకు, బాధకు, విరహానికి సముచితము కాదేమో? దానికి బదులు ఖండగతిలో ఐదు మాత్రలతో ఉంటే అది బరువును సూచించగలదు. ఈ విషయాలను నేను చర్చించలేదు, ఎందుకంటే నా గురి మందాక్రాంతవృత్తము మాత్రమే కావడమువల్ల. నా ఉద్దేశములో పాదాలలోని పదాలకు సరిగా విరుపును కలిగించి ఉంటే మందాక్రాంతములో కూడ పై 50మంది కవులలో ఏ కొందరైనా దీనిని తప్పకుండ సాధించి యుంటారు. నావంటి అల్ప భాషాజ్ఞానియే దీనిని ప్రయత్నము చేసినప్పుడు, సంస్కృతాంధ్రములలో పాండిత్యము ఉన్నవారికి ఇది నల్లేరుపై బండి నడకే.

    6) కామేశ్వరరావుగారు, సంస్కృత యతిని గురించి ఒక రెండు వాక్యాలు. నాట్యశాస్త్ర రచయితవంటివారు యతిని పూర్తిగా అంగీకరించలేదు. మిగిలినవారు కూడ మొట్ట మొదట తప్పకుండా పాటించినా, తరువాత పదాలను సంధితో యతిస్థానము వద్ద కలపడము ఒక ఆభరణములాటిది అనుకొన్నారు. దీనికి కాళిదాసాదికవులను పొగిడారు కూడ. నావరకు నేను యతి స్థానము వద్ద విరుపు లేక సంధి అవసరమని భావిస్తాను. పదాలను యతి స్థానములో దూసుకొని వెళ్లేటట్లు వ్రాయడము, పాదాంత యతి లేకుండ వ్రాయడము నాకు రుచించదు. పాదాంతయతి ఉపజాతులలో తప్పక అందరు పాటిస్తారు, కందములో రెండవ పాదానికి పాటిస్తారు. రగడలకు, ద్విపదలకు యిది నియతము. ఇక పోతే ఆషాఢస్య ప్రథమదివసే అనేటప్పుడు స్య గురుతుల్యమే. ఉదాహరణగా సంస్కృతములో పాదాంత లఘువును గురువుగా అంగీకరిస్తారు, ఎందుకంటే అక్కడ విరామము వస్తుంది కనుక. విరామము ఉన్నప్పుడు సంస్కృతములో లఘువు సామాన్యముగా గురుతుల్యమే.

    పాదాంత యతి ఉన్నప్పుడు, పాదారంభములో అచ్చులను వాడుతారు, సంధి లేకుండా కూడ. ఇక మధ్యలో సామాన్యముగా అచ్చులను య-కారముతో తెలుపుతారు.

    7) కామేశ్వరరావు గారు, నేను ఇంకా మందాక్రాంత వృత్తరచనను అభ్యాసము చేస్తున్నాను. ఇప్పటివరకు సుమారు 30 వ్రాసినాను, మందాక్రాంతపు లయతో సుమారు 15 పద్యాలు, జాతి పద్యముగా సుమారు 25 వ్రాసియున్నాను. ఇందులోని కిటుకులను ఇంకా నేర్చుకొంటున్నాను. వీలు దొరికినప్పుడు వీటిని అంతా ఒకే చోట ఉంచడానికి ప్రయత్నము చేస్తాను.

    ఇదే ఒక చిన్న వ్యాసములా తయారైనందులకు సంపాదకులు మన్నిస్తారనే ఆశతో

    విధేయుడు - మోహన

  11. మోహన అభిప్రాయం:

    May 6, 2012 11:22 pm

    రామారావుగారు, మీ అభిప్రాయలతో చాలవరకు నేను ఏకీభవిస్తాను. ఔత్సహికుల పరిశోధనలని మనము త్రోసివేయకూడదు. అన్ని పరిశోధన వ్యాసాలలాగే వాటిని కూడ పరీక్షించాలి. నా ఈ వ్యాసములోని కొత్త అంశాలను వ్యాసము చివర చెప్పి ఉండాలి, యిక మీద అలా చేస్తాను. ప్రస్తుతము వాటిని క్రింద విశదీకరిస్తున్నాను -

    (1) ఇది మందాక్రాంతముపైన ఒక సమీక్షవ్యాసము లేక రెవ్యూ లాటిది. ఇందులో ఇతరుల కృషిని సంక్షిప్తముగా తెలిపి నేను కనుగొన్న కొత్త విషయాలను చర్చించాను. నేను ఉపయోగించిన గ్రంథాలను కూడ అందరి సౌలభ్యానికోసం వివరాలతో చెప్పాను.
    (2) మందాక్రాంతపు జననము, శాసనాలలో ఆ వృత్తపు వాడుక ఈ రంగములో ఉండే కొందరికి తెలిసి ఉన్నా, అవి అంతగా అందుబాటులో లేనందువలన, ప్రయాగప్రశస్తి, వియత్నాం శాసనాలను సంగ్రహముగా తెలిపినాను.
    (3) మందాక్రాంతవృత్తము వాడబడిన ఐదు సందేశకావ్యాలను గురించి సంక్షిప్త వివరణ, అందులో ఉండే కొన్ని పద్యాలకు అదే వృత్తములో తెలుగు అనువాదమును తెలిపినాను. సందేశకావ్యాలకు మందాక్రాంతవృత్తములో (యతిప్రాసలు లేకున్నా కూడ) తెలుగు అనువాదాలు నాకు తెలిసి ఎక్కడా లేదు. అసలు అనువాదాలే లేనప్పుడు, ఈ అనువాదాలు ఉత్తమ స్థాయిలో ఉన్నదో లేదో అన్నది వేరే విషయము.
    (4) మందాక్రాంత వృత్తపు చర్చ చాలవరకు కొత్తదే. మందాక్రాంతమును బోలిన వృత్తాల పట్టిక చిత్రము పూర్తిగా కొత్తదే. చాల పుస్తకాలను తిరగవేసి ఈ వృత్తాలనుగురించి తెలిసికొని వాటి లక్షణాలను వివరించే ఈ పట్టికను వాటి నిర్మాణశిలలు లేక లెగోల ద్వారా తెలియబరచాను. వీటన్నిటికీ పద్యరూపముగా ఉదాహరణలను ఛందస్సు, రచ్చబండ గుంపులలో ఇచ్చి ఉన్నాను. ఇలాటి పట్టిక proteins, nucleic acids రంగములో amino acid or nucleotide sequence similarity వంటిది. ఛందశ్శాస్త్రములో కూడ వృత్తస్వరూపాలను ఇలా విశదీకరించడానికి వీలవుతుందన్నది ఒక కొత్త విషయమే.
    (5) ఒక గురువును రెండు లఘువులుగా మార్చి మందాక్రాంతపు లయ గలిగిన నాలుగు వృత్తాల సృష్టి కూడ నవీనమే. అందులో ఒకటి మాత్రమే పాత లక్షణగ్రంథాలలో ఉన్నది.
    (6) మందాక్రాంతపు లయను మందాకిని అనే ఒక జాతి పద్యముగా సృష్టించడము, వాటిని ఉపయోగించి సంస్కృత వృత్తాలను అనువదించడము కూడ సంపూర్ణముగా నూతనమే. ఇలాటి ప్రయత్నము మిగిలినవారికి మార్గదర్శి అవడానికి అవకాశము ఉన్నది.

    ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఈ మందాక్రాంతవృత్తముపై సుమారు ఐదారు సంవత్సరాలుగా చేసిన నా పరిశోధనల సారాంశాన్ని యిక్కడ పొందుపరచాను. ఇంకా ఎన్నో వివరాలను వ్యాసపు నిడివిని దృష్టిలో నుంచుకొని విడిచివేయవలసి వచ్చింది.

    విధేయుడు - మోహన

  12. బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    May 7, 2012 2:35 am

    రామారావు గారి స్పందన చూసాకా మరో రెండు మాటలు:

    1. సాంకేతిక పరిశోధనా పత్రాలకి ఒక వ్యవస్థ, పద్ధతీ ఉన్నాయి. సాహిత్యంలో, ముఖ్యంగా తెలుగు తీసుకుంటే మనకా వ్యవస్థా లేదు; పద్ధతి అంతకన్నా లేదు. ఏం రాసినా రచయిత ఆశ్రయించేడి పత్రికలనే! అంటే రచయిత వ్యాసాలకి స్థాయి ఆశించినట్లే పత్రికలకీ ఒక స్థాయి ఉండాలి. రచనలో వాసి ఆశించినట్లే, పత్రికలు తమ స్థాయిని పెంచుకునే మార్గాన వెళ్ళాలి. లేదా ప్రయత్నించాలి. కథలూ, కబుర్లూ రాస్తే వేయడానికి తెలుగునాట పత్రికలు సిద్ధమే కానీ వ్యాసాల వరకూ వస్తే ప్రచురించడానికి సిద్ధంగా ఉండరు - ముఖ్యంగా సాహిత్య పరిశోధనా వ్యాసాలు. వారి దృష్టిలో అది యూనివర్శిటీల బాధ్యత. ప్రస్తుతం యూనివర్శిటీలకి ఆ తీరికా, వెసులుబాటూ కరువయ్యాయి. చర్చించుకోడానికి అది వేరే విషయం. వదిలేద్దాం.

    ఇలాంటప్పుడు మోహన గారి వ్యాసం కానీ, జయప్రభ గారి అన్నమయ్య పుస్తకం గానీ పాఠకులకి చేరేదెలా? మీరు చెప్పినట్లు దాన్ని చదివి తప్పొప్పులు సవరించీ, కాస్త కూర్పులూ, మార్పులూ చేసే పరిశీలకులు ఏరీ? ఒకవేళ ఉన్నారనుకున్నా, దానికి ఒప్పుకునే రచయితలూ ఉండాలి కదా? రచనని బేరీజు వేసే స్థాయి పరిశీలకులకీ వుండనవసరం లేదా? అంటే పరిశీలకుల స్థాయి మీద రచయితలకీ నమ్మకం ఉండాలి. విశ్వాసం కుదరాలి. ఇవన్నీ రాగద్వేషాల మధ్య కుదిరే విషయాలా? తాము రాసిందే వేదమూ, ఎదుటివారి జ్ఞానం శూన్యమూ అనుకునే వాతావరణంలో ఇవన్నీ కుదరని విషయాలు. ఎవరికివారే పెద్ద మేధావులుగా చెలామణీ అవ్వడానికే ప్రయత్నించే నేటి సాహిత్య వ్యవస్థలో రామారావు గారు ఆశించేది జరగని పని.

    2. సాహిత్యంలో ప్రమాణాలు అవసరమని పత్రికలూ, పాఠకులూ, ముఖ్యంగా ఔత్సాహిక రచయితలూ భావించిన నాడు మంచి సరుకు పాఠకులకి రవాణా అయ్యే అవకాశం ఉంది. ఔత్సాహిక రచయితలు అని ఎందుకన్నానంటే చెయ్యి తిరిగిన రచయితలు వారేం రాసినా ప్రమాణంగానే భావిస్తారు కనుక. పత్రికలూ వీరి పట్ల సడలింపు ధోరణే అమలుపరస్తూ ఉండడం చూస్తూనే ఉంటాం. పేరొచ్చే వరకూ రాయి, అదొచ్చాక పత్రికలే మోస్తాయి అన్న సాహిత్య వాతావరణమ్లో కూరుకుపోయాం.

    3. పోనీ ప్రచురణ కర్తలూ లేదా సంస్థలూ అయినా పైన చెప్పిన విషయాలమీద శ్రద్ధ చూపిస్తున్నాయా అంటే అదీ లేదు. వాదాలూ, రాజకీయల ఊబిలో పీకల్లోతు అవి మునిగున్నాయి. అమ్మకాలకి అవకాశం ఉండే పుస్తకాల మీదే వారి గురి. ఇలాంటి సందర్భాల్లో రచయితలే పుస్తకాలు అచ్చేసుకునే దౌర్భాగ్యపు సాహిత్య సమాజంలో ఉన్నాం. రాయడమూ, దిద్దుకోవడమూ, ప్రచురించుకోవడమూ, ప్రచారం చేసుకోవడమూ, ఆ పైన పంచుకోవడమూ అన్నీ రచయిత బాధ్యతలే అవుతున్నాయి. పాఠకులూ అదే తీరులో ఉంటున్నారు.

    4. ఇహ వ్యాఖ్యలంటారా? ఎవరికి వారు పండుతులనీ, మేధావులనీ భ్రమించే నేపధ్యంలో అందరూ, అంటే ముఖ్యంగా రాసేవాళ్ళు, అన్నీ చదువుతారు. చదవనట్లు నటిస్తారు. వ్యాఖ్యానించడానికి సిద్ధంగా ఉండరు. అవే కారణాలు పునరావృత్తం అవుతాయి.

    5. రాయగలిగిన వాళ్ళు రాస్తూ ఉండాలి. కానీ అభిప్రాయాలు ఆలంబన అవుతాయి. ఊతం ఇస్తాయి. మరింత మెరుగ్గా రాయలన్న ప్రేరణ కలిగిస్తాయి. చేసిన పనికి ఆనందాన్నిస్తాయి. ఇది పేరున్న రచయితలకీ వర్తిస్తుంది. పేరున్న రచయితలు పేరులేని వారివి చదవరు. చదివినా నోరు మెదపరు. అవే సమస్యలూ; అవే కారణాలూ.

    సాహిత్య మార్జాలం గంట కట్టే వారికోసం వెతుక్కుంటోంది.

    -బ్రహ్మానందం గొర్తి

  13. vikas,vinnakota అభిప్రాయం:

    May 7, 2012 3:18 am

    మోహనగారు,
    మీ సలహాలకు క్రుతజ్ణతలు.
    వికాస్.విన్నకోట

  14. తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    May 7, 2012 9:45 am

    మోహనరావు గారి వ్యాసం చాలా బాగుంది నాకు.

    శ్రీవక్కలంక లక్ష్మీపతిరావు గారు కూడా మేఘసందేశానికి ఒక తెలుగు అనువాదం వెలువరించారు. గత 70వ దశకంలో డిగ్రీ విధ్యార్థులకు అది పాఠ్యగ్రంథంగా కూడా ఉండేది. నేను కూడా అది అలా చదివాను. అయితే నాకు అందులో మూలకావ్యంలోని సొగసు కనుపట్ట లేదు. నాకు గుర్తున్నంత వరకు, వక్కలంకవారు ‘ఆ కాళిదాసు మన తెలుగువాడైతే యెట్లా వ్రాసి యుండేవాడో నని అట్లాగు వ్రాసాను’ అనటం నాకు రుచించ లేదు.

    బహుకాలంగా తెలుగు కవులకు వృత్తచతుష్కం (ఉ., చం., శా, మ) తప్ప యిత వృత్తాలు కేవలం స్వల్పంగానే వాడాలన్న తప్పుడు స్పృహ ఒకటి సంప్రదాయంగా వచ్చింది. అలాంటిదే మరొక తప్పుడు స్పృహ సంస్కృత పాండిత్య ప్రదర్శన యెంత హెచ్చుగా చేస్తే అంత మంచిదీ, సమాసదైర్ఘ్యంతో అదరగొట్టటం ద్వారా కవిత్వానికి అందమూ కీర్తీ వస్తాయని భావించటం. ఇటువంటి పనులవలన తెలుగు కవిత్వంలో తెలుగు తరచుగా చులకనయింది, ప్రజలకు ఆ తెలుగు(?)కవిత్వం దూరంగా జరిగింది!

    మందాక్రాంతంలో పూర్వపాదాంత్యాక్షరంతో కలిపి వరసగా అయిదు గురువులు వచ్చేటట్లు తెలుగులో వ్రాయటానికి పెద్దప్రతిబంధకం. అలాగే మందాక్రాంతం అందమంతా పాదంలో నిర్దిష్టమైన చోట్ల మూడు విరుపులు రావటంలో ఉంది. మన తెలుగుకవిత్వంలో యతిని ఒక తప్పనిసరి తద్దినంగా మార్చేసుకున్నాం కాని విరామస్థానంగా పాటించటమే లేదు కదా. ఇక విరుపుల అందం మీద ఆధారపడిన వృత్తం వ్రాయాలని తెలుగుకవులు యెందుకు తాపత్రయ పడతారు?

    తెలుగుకవులకు వృత్తవైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం కూడా కద్దు కాబట్టి, అక్కడక్కడా వృత్తచతుష్కం బదులు మొక్కుబడిగా సందర్భానుసారం అన్నపేరుతో కొన్ని ఇతరవృత్తాలు గిలుకుతూ ఉంటారు. అంతే. అలాగే కొన్ని మందాక్రాంతాలూ ఉన్నాయి.

    అసలు యతి, ప్రాసల నియమాలు రెండు వదలి వృత్తసహజవిరామాలతో అందంగా తెలుగులో యెందుకు పద్యరచన చేయసాహసించమో బోధపడదు.

  15. jayaprabha అభిప్రాయం:

    May 7, 2012 3:41 pm

    కె.యెస్. రామారావు గారూ - నిజంగా ఇది మీరు భావించేటంతటి “జటిల” సమస్య కాదు. తెలుగు సాహిత్యానికి సంబంధించి నాకున్న అనుభవం పరిశీలన ఆధారంగా నాకు అనిపించిన విషయాలు ఇవీ! ఎప్పుడైనా కూడా ఏ రంగంలోనైనా పరిశోధనకి ఒక ప్రమాణం ఉండాలి. ఏది రాసినా అది పరిశోధన అవదు. దానికి సరి అయిన ఆకరాలు చూపిస్తూ ఆ పరిశోధన ఇతరుల దృస్టికన్నా ఎలా భిన్నమైనదో తన చూపు ద్వారా అదివరకూ తెలియని కొత్త విషయాలు ఏమున్నాయో అందుకు ఆ పరిశోధకురాలు/డు బాధ్యత వహించాలి. పరిశోధన చేసే వారికి అందుకు తగిన శిక్షణా, అలాగే చాలినంత అనుభవమూ ఉండాలి. తాను రాయదలుచుకున్న విషయం మీద అదుపు ఉండాలి.

    ఇది అటుంచితే, పుస్తకాన్నీ దాని బాగోగులనీ ఎంచే వాళ్లకి కూడా తప్పకుండా ఒక స్థాయి ఉండాల్సిందే! ఒక పని లోని సాధక బాధకాలు క్షుణ్ణంగా తెలిసిన వారూ అలాగే పరిశోధనా రంగమ్లో తగిన అనుభవం ఉన్న వారూ మాత్రమే కొంత వరకూ సరి అయిన అభిప్రాయాన్ని చెప్పగలరు. మిగిలిన వారి భావాలు లేదా స్పందనలూ వారికి ఆ వస్తువు నచ్చడం లేదా నచ్చక పోవడం, అర్ధం కావడం లేదా సరిగ్గా తెలియక పోవడం మీద ఆధారపడి బయటికి వచ్చేవే అవుతాయి చాలా సార్లు. అందుకు చేయగలిగింది ఏమీ లేదు. అయితే అభిప్రాయాలు చెప్పే వీలు ఉండాలి. ఎవరినించైనా మంచి సూచనలు లభించే అవకాశం సైతం లేకపోలేదు. వాటి సాధ్యాసాధ్యాలని బట్టి రచయిత వాటిని పాటించవచ్చు లేదా చదివి ఊరుకోవచ్చు. పుస్తక రచనలో ఎప్పుడూ కూడా రచయితదీ పరిశోధకులదే అంతిమ అభిప్రాయం అవుతుంది. అది తప్పదు. పుస్తకం బాగోగుల బాధ్యత వారిదే గనక!

    ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, కనీసం తెలుగు భాషా సాహిత్యాల వరకూ అయితే, పరిశోధనా రంగంలో తగిన అనుభవమూ శిక్షణా ఉన్నవారు క్రమంగా తగ్గి పోతున్న కాలం ఇది. అందువలన వేరే రంగాలలో స్థిరపడి తెలుగు మీద ప్రేమ లేదా ఇస్టం ఉన్నవాళ్ళు రాయక తప్పని ఒక పరిస్థితి వచ్చింది ఇవాళ. వారి భావ ప్రకటనకి అనువుగా ఉండే మాధ్యమం సైతం అందుబాటులో ఉంది. “అంతర్జాతీయ ప్రమాణాలు” అంటూ ఒక కొలమానాన్ని తెలుగున తెచ్చి పెట్టిన వాళ్ళు ఇంగ్లీషులో వచ్చే పుస్తకాలలో ఎన్ని అచ్చుతప్పులు ఉంటున్నాయో, ఎన్ని విషయాలు దేశీయమైన వాటినించి గ్రహించి వేరే భాష వారి వారికి తగిన విధంగా రూపొందుతున్నాయో మాట్లాడక పోవడం విడ్డూరం. నా దృష్టిలో ఆసక్తికరమైన రచన కాని రచన అన్నవే చిట్టచివరికి ముఖ్యమైనవి అవుతాయి. అవి ఎవరు రాసినా అంతకన్నా మించిన ప్రమాణం ఏదీ ఉండదు ఎప్పుడైనా! మిగిలినవన్నీ ఊరికే చర్చిందుకుందికి పనికొస్తాయి అంతే!

    తెలుగున వస్తువు మీద ఒక అదుపు ఉండి దానిలోని లోతుపాతులనెరిగి శ్రమ పడి పుస్తక రచన చేసేవారు నిజం చెప్పాలంటే లేరు. తెలుగులో పుస్తక రూపంలో కాల్పనిక సాహిత్యం కాక విమర్శలు రాకపోడానికి కారణం రాయగల సత్తా ఉన్న వాళ్ళు లేకపోవడమే! అలాంటప్పుడు వచ్చిన అరుదైన రచనల విలువనెరిగి పాఠకులు వాటి పట్ల స్పందించడం చేయదగిన పని. సకాలంలో రాని స్పందన ఆ తరువాత వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే! మీనమేషాలు లెఖ్ఖించడాలూ లౌక్యాలు ప్రదర్శించడాలూ ఆ రంగానికి మేలు చేయగలిగిన అంశాలు కాలేవు. ఎందుకంటే తమ విలువైన కాలాన్ని ఎవరు గానీ ఒక క్రమంలో ఒక వస్తువు మీద పెట్టడం అన్నది మామూలు విషయం కాలేదు ఎప్పుడైనా కూడాను. అందునా ఏ డబ్బులూ రాని తెలుగు సాహిత్యమ్లో అంటే మరీను! అలాగే అందరూ అన్ని రకాల రచనలూ చేయలేరు. అందువలన కొన్ని తరహా రచనలు చేయగలిగిన వారే చేయాలి. అలాంటి రచనలు అంటూ అసలు వస్తే, వాటి పట్ల ఒక కుతూహలం పాఠకులకి కనీసం సాహిత్యం గురించి తెలిసిన పాఠకులకి ఉండటం సముచితం! అయితే పాఠకుల స్థాయి ఇక్కడ చాలా ముఖ్యం.

    ఎందుకంటే ప్రతీ రచనకీ ప్రతీ వాళ్ళూ పాఠకులు కారు. ఆ వస్తువుని గురించి వారికి కనీశమైన స్పస్టత అయినా ఉండాలి. spoon feedingకి అలవాటు పడిన బధ్ధకస్తులైన పాఠకులు లాభం లేదు. కస్టపడగలిగిన స్వభావం ఉన్నవాళ్లై ఉండాలి పాఠకులు కూడా! అలాగే ఒక పుస్తకం అర్ధం చేసుకోవడం వేరు. అదే పుస్తకాన్ని గురించి వ్యాఖ్యానించడానికి తగిన పరిజ్ఞానం పుష్కలంగా ఉండి వారు ఆ పని చేయడం వేరు. రెండూ భిన్నమైన విషయాలు. దురదృష్టమైన విషయం ఏమంటే తెలుగున విమర్శ అరుదైన అంశం ఎలా అయిందో, అలాగే ఆ విమర్శ గురించి చేసే పాఠక వివేచన కూడా అరుదే అయిపోయింది. సూచనలు చేయడం రాసిన విషయాన్ని విశ్లేషణ చేయడం ఒకటి కాదు. ఎప్పుడైనా ఏ పుస్తకాన్నైనా ఎప్పుడూ అనేక తీరుల్లో రాసే వీలుంది. ఏదీ కూడా “perfect” కాదు. అవదు కూడా! ప్రతీ రచనకీ ఇది వర్తిస్తుంది. ఆ రాసిన వారెవరు అన్నదానితో సంబంధం లేకుండా! అందువలన అభిప్రాయాలు ఆ రచనని బేరీజు వేయడంలో అడుగు తప్పనివి అయి ఉండాలి. అంతే!

    ఇంక చివరగా తెలుగు వరకూ పుస్తక ప్రచురణ, దానికి సంబంధించిన ఇతర అంశాలు అనేకం దుస్సాధ్యమైనవి. అయినా తెలుగున కస్టమైన అంశాల మీద ఇంకా పని చేయడం జరుగుతూ ఉందంటే, పుస్తకాలు అచ్చు అవుతున్నాయీ అంటే అది కేవలం రచయితలకి భాషా సాహిత్యాల పట్ల ఉండే ప్రేమ వల్ల మాత్రమే! మరొక్క పదేళ్ళాగండి అప్పుడు ఈ వచ్చే పుస్తకాలూ రావు. ఇంతపాటి మాట్లాడే వాళ్ళూ ఉండరు: కొత్త పాఠక వర్గం తయారైతే తప్ప.-అలా నిజంగా అయితే గనక అప్పుడు నాకన్నా సంతోషించే వాళ్ళుండరు. తెలుగు సాహిత్యం వరకూ రాసే వారిని నిలుపోగలిగితేనూ, పాఠక వర్గాన్ని తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళ గలిగితేనూ తప్ప అది సాధ్యమయ్యే వ్యవహారంలా లేదు. కారణం తెలుగున ప్రవేశం ఉన్న వాళ్ళు క్రమంగా తగ్గిపోతున్నారు. దీన్ని ఏ రకంగా సరి చేయాలీ అన్నది ఆలోచించవలసిన విషయం. లేకపోతే తెలుగున పుస్తకాలు వచ్చే వీలే ఇటుపై ఉండదు. అలా జరగకుండా ఉండాలంటే ఇందుకు రచయితా పాఠకులూ విమర్శకులూ వీరందరూ తమ పాత్రలని సక్రమంగానూ నిజాయితీ గానూ పోషించాలి. సరుకున్న రచనలని దూరం పెట్టి తేలిక పాటి రచనలని గురించి బాకా కొట్టే ఒక తప్పుడు పాత్ర పోషించకుండా ఉంటే చాలు. అందులో భాగంగానే మంచి రచనలని గురించి మాట్లాడ వలసిన బాధ్యతని సైతం సాహిత్యం పట్ల మమకారం ఉన్న వారందరూ చూపించవలసి ఉంది. ఇదే మీరు మరి “జటిల”మంటారా? అయితే మరి సాహిత్యాన్ని ఏకంగా అటకెక్కించేస్తే చాలు:)

    జయప్రభ.

  16. K.V.S. Ramarao అభిప్రాయం:

    May 7, 2012 10:33 pm

    మోహన రావు గారు: మీ అనుస్పందన హర్షణీయం. “ఈమాట” వ్యాసకర్తలు అందరూ మీదారిలో నడిచి ప్రతివ్యాసానికి మొదల్లో abstract రాస్తారని, అలా ఆ వ్యాసం లో వారేం సాధించదల్చుకున్నారో వారి సొంత contributions ఏవిటో స్పష్టంగా పాఠకులకు ముందుగానే తెలియపర్చే అలవాటుని పాటిస్తారని ఆశిస్తాను.

    ఇక మీ వ్యాసం గురించి: నాకు ఛందస్సు ఏమీ తెలియదు కనుక దాన్లో ఒప్పుతప్పరయు రసజ్ఞుడిని కాను. ఐతే ఛందశ్శాస్త్రం మీద మీకున్న మక్కువ అభినందనీయం, మీ కృషి, పట్టుదల శ్లాఘనీయాలు. మీరు చెప్పినదాన్ని బట్టి ఈ వ్యాసం లో చాలా విశేషాలే వున్నట్టున్నాయి.

    జయప్రభ గారు: రచయితలకు, పాఠకులకు ఉండవలసిన అర్హతల గురించి మీరన్న మాటల్తో ఏకీభవిస్తాను. ఐతే, “తెలుగున వస్తువు మీద ఒక అదుపు ఉండి దానిలోని లోతుపాతులనెరిగి శ్రమ పడి పుస్తక రచన చేసేవారు నిజం చెప్పాలంటే లేరు. తెలుగులో పుస్తక రూపంలో కాల్పనిక సాహిత్యం కాక విమర్శలు రాకపోడానికి కారణం రాయగల సత్తా ఉన్న వాళ్ళు లేకపోవడమే! అలాంటప్పుడు వచ్చిన అరుదైన రచనల విలువనెరిగి పాఠకులు వాటి పట్ల స్పందించడం చేయదగిన పని.” అంటూ మళ్లీ “అరుదైన రచనల విలువనెరిగే” పని పాఠకుల మీదే వేస్తున్నారు. నా అభిప్రాయం ప్రకారం తమ రచన అరుదైనదైతే అది ఎందుకు అరుదైందో, దాని విలువ ఏమిటో చెప్పటం లో రచయితా భాగస్వామ్యం వహించటం అవసరం. (ఈ అభిప్రాయం వ్యాసాలకే పరిమితం) అందుకే సాంకేతిక పత్రాలలోలాగా ముందుగా ఒక abstract రాయమని కోరటం.

    కొత్త పాఠకుల విషయం లో మీ ఆవేదన న్యాయమైందే. ఐతే ఇంటర్నెట్ ఈ విషయం లో చాలా మేలు చేస్తున్నదని నేను భావిస్తాను. ఎందాకో ఎందుకు, మీ అభిప్రాయాల్నిప్పుడు ప్రపంచవ్యాప్తమైన తెలుగు జాతి అంతా చదవగలుగుతున్నది కదా. పదిహేనేళ్ల క్రితం వరకు ఇది అసాధ్యం. ఈ ఇంటర్నెట్ మూలాన ఇదివరకు ద్వీపాల్లా ఉండిపోయిన సాహిత్య ఔత్సాహికులు, professionals ఒకచోట అభిప్రాయాల్ని పంచుకోగలుగుతున్నారు కదా. ఎన్నో వెబ్ పత్రికలు, బ్లాగ్ లు వచ్చాయి. ఇవి తెలుగు సాహిత్యాన్ని బతికిస్తాయో లేదో తెలియదు కాని బతికే probability ని తప్పక పెంచుతున్నాయి.

    ఆసక్తికరమైన రచనలు కనిపిస్తే వాటికి పాఠకులూ తయారౌతారు. సాహిత్యాన్ని బతికించటం లో ప్రధానపాత్ర రచయితలది. “మమ్మల్ని మెచ్చుకునే పాఠకులు వుంటేనే మేం రచనలు చేస్తాం” అని వారు భీష్మించుక్కూచుంటే పాఠకులు ఎక్కడినుంచి వస్తారు?

    చివరగా - పుస్తకాల గురించి. నా ప్రగాఢ విశ్వాసం పుస్తక రూపానికి కాలం చెల్లిపోతోందని. బహుశా ముందుముందు “పుస్తకరచన” కూడ ఒక సామూహిక క్రియగా పరిణమిస్తుందని నేననుకుంటాను. ఒక పుస్తకాన్ని “రాసే” బాధ్యతని ఒకరే మోయాల్సిన అవసరం తీరిపోతున్నది. సైద్ధాంతికంగానే కాక ఆచరణలో సైతం పుస్తక రచయితా పాఠకుడూ రచనాబాధ్యతని సంయుక్తంగా నిర్వహించే రోజు వస్తుందని నా భావన. చూద్దాం.

  17. తఃతః అభిప్రాయం:

    May 7, 2012 10:41 pm

    జయప్రభ గారు అంత దీర్ఘం గా చెప్పింది ‘ఆషాఢస్య ప్రథమ దివసే’ మీద చెప్పిన అభిప్రాయమేనా? ఒక రచన మీద వచ్చినట్లుగా ప్రచురిత మైన అభిప్రాయాల్లొ యెన్ని నిజంగా ఆ రచన మీద ఉంటున్నాయి?
    అలా యేదైనా రచన మీద కాకుండా చెప్పే అభిప్రాయాలకు ‘ఈమాట’లో చోటు కలిగించే పద్ధతిని గురించి సంపాదకులు ఆలోచించాల్సిన సమయమాసన్న మైనదా?

    తఃతః

    [అటువంటి చోటు ఈమాట చర్చావేదికల పైన ఎప్పుడో కల్పించాము. కాని, పాఠకులు ఆ వేదికను సద్వినియోగం చేసుకోవడంలేదని చెప్పడానికి చింతిస్తున్నాము … సం]

  18. సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    May 8, 2012 12:16 pm

    Kudos to Mohana Rao gaaru for a scholarly essay!

    కాని నాకు ఒక సందేహము మాత్రము ఉన్నది. కాళిదాసు ఉజ్జయినీవాసుడు. కాని గుప్తుల రాజధాని పాటలీపుత్రము. ఇంత దూరము ఉన్నా కాళిదాసుకు చంద్రగుప్తునికి ఎలా సంబంధాలు ఉండినవో అన్నది చర్చనీయాంశమే. ఈ రెండవ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడా అన్న విషయము ఇంకా తేలలేదు.

    సముద్రగుప్తుని కొడుకైన రెండవ చంద్రగుప్తుడు శకులను ఓడించిన తరువాత ఉజ్జయినిని తన రెండవ రాజధానిగా చేసుకున్నాడని మనకు దొరికిన శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. కొన్ని బంగారు నాణేల మీద ఒకవైపు దేవశ్రీ మహారాజాధిరాజ శ్రీ చంద్రగుప్త అని మరోవైపు శ్రీవిక్రమాదిత్య అన్న ముద్రల ఆధారంగా రెండవ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడని చెప్పవచ్చు. రెండవ చంద్రగుప్తుని రాజ్యకాలం 380–413/415 CE అని కచ్చితంగా చెప్పవచ్చు కాబట్టి కాళిదాసు 4వ శతాబ్దానికి చెందినవాడనే చెప్పడం సబబు. ఇది ప్రస్తుతం పండితులంతా (Indologists) ఒప్పుకున్న వాదం.

    కాళిదాసు కాలనిర్ణయ వివాదంపై విస్తృత చర్చకు Kālidāsa: Date, Life, and Works (1969) by Vasudev Vishnu Mirashi, Narayan Raghunath Navlekar ను చూడవచ్చు.

  19. కామేశ్వరరావు అభిప్రాయం:

    May 9, 2012 2:35 pm

    శ్యామలరావుగారు,

    మీ వ్యాఖ్యలో కొన్ని విషయాలను మరికొంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.

    “బహుకాలంగా తెలుగు కవులకు వృత్తచతుష్కం (ఉ., చం., శా, మ) తప్ప యితర వృత్తాలు కేవలం స్వల్పంగానే వాడాలన్న తప్పుడు స్పృహ ఒకటి సంప్రదాయంగా వచ్చింది.”
    “తెలుగుకవులకు వృత్తవైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం కూడా కద్దు కాబట్టి, అక్కడక్కడా వృత్తచతుష్కం బదులు మొక్కుబడిగా సందర్భానుసారం అన్నపేరుతో కొన్ని ఇతరవృత్తాలు గిలుకుతూ ఉంటారు.”

    వృత్త వైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం సంస్కృత కవులలో కూడా ఉన్నదే. ఒక కావ్యంలో భిన్న భిన్న వృత్తాలు వాడడం సంస్కృత కావ్యాలలో కూడా కనిపిస్తుంది కదా. మీరన్న వృత్త చతుష్కం కన్నా కూడా కందాలు తెలుగు కవులు ఎక్కువ వాడారు. అలాగే ఆటవెలది తేటగీతులు కూడా. సందర్భానుసారంగానే సీస పద్యాలు, అక్కడక్కడ ఇతర దేశి ఛందస్సులూ కూడా వాడారు. ఇతర వృత్తాలను అరుదుగానే వాడారు. అయితే వాటిని విరివిగా ఎందుకు వాడలేదు అనే దానికి కారణాలను వెతికితే మనకి కొంత విషయ పరిజ్ఞానం కలగవచ్చు. కాని, వాళ్ళ తెలివితక్కువ తనం వల్ల, స్పృహ లేని కారణంగా మానేసారని సమాధాన పడితే దాని వల్ల ఒరిగే ప్రయోజనమేమీ లేదు. వాళ్ళు నిజంగా ఎందుకు వాడలేదో మనకి కచ్చితంగా తెలిసే అవకాశం ఎలాగూ లేదు.

    వృత్తౌచిత్యమన్నది రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి - చెప్పే విషయం, రెండు - చెప్పే భాష. ఉదాహరణకి మందాక్రాంత వృత్తాన్నే తీసుకుందాం. మొదటగా, చెప్పే విషయం. కాళిదాసు మందాక్రాంత వృత్తంలోనే మొత్తం ఒక కావ్యం వ్రాసాడంటే, ఆ కావ్యం ఎలాంటిది? అది కథా కావ్యమా? కాదు. అందులోని వస్తువూ, రసమూ, పాత్రలూ ఇంచుమించుగా మొదటి నుండి చివర వరకూ ఒకటే విధంగా ఉంటాయి. అంచేత ఆ కావ్యమంతా ఒకే వృత్తంలో రచించడంలో ఔచిత్యం ఉంది. అదే కాళిదాసు రఘువంశంలోనూ, కుమారసంభవంలోనూ అనేక వృత్తాలు ఎందుకు వాడవలసి వచ్చింది? అవి కథా కావ్యాలు కాబట్టి. అందులో వివిధ సన్నివేశాలు, పాత్రలు, రసభావాలు ఉంటాయి కాబట్టి.

    కాబట్టి, తెలుగులో మందాక్రాంత విరివిగా ఎందుకు వాడబడ లేదు అనే ప్రశ్న వేసుకొనే ముందు, తెలుగులో మేఘదూతం వంటి కావ్యాలు ప్రాచీన కాలంలో ఎందుకు రాలేదు అని ప్రశ్నించుకోవాలి. అది వేరే చర్చ, కాబట్టి దానిలోకి నేను వెళ్ళడం లేదు. అలాంటి కావ్యాలు రానందువల్ల, ఆ వృత్తం అంత విరివిగా వాడబడలేదు. అది మొదటి కారణం. ఇక రెండవ కారణం భాష. మోహనరావుగారు, మీరూ చెప్పినట్టుగా మందాక్రాంత వృత్తం మొదటి నాలుగు గురువులూ తెలుగుకి ప్రతిబంధకం. గురువు లఘువుల సంఖ్యే కాదు, వాటి క్రమంలో కూడా వివిధ భాషల స్వరూపంలో తేడా ఉంటుంది. వృత్త చతుష్కం కాక మిగిలిన వృత్తాలు తెలుగులో విరివిగా లేకపోవడానికి యిది కూడా కారణమేమో పరిశీలించాలి.

    “మన తెలుగుకవిత్వంలో యతిని ఒక తప్పనిసరి తద్దినంగా మార్చేసుకున్నాం కాని విరామస్థానంగా పాటించటమే లేదు కదా. ఇక విరుపుల అందం మీద ఆధారపడిన వృత్తం వ్రాయాలని తెలుగుకవులు యెందుకు తాపత్రయ పడతారు?”

    వృత్తాన్ని విరుపులతో వ్రాయాలనే తాపత్రయం లేదు కాబట్టే తెలుగులో యతి విరామ స్థానంగా కాక అక్షర సామ్యంగా మారింది. కావ్యం మొత్తమూ పద్యాల విరుపుల అందం ఒక్కటే ఉంటే సరిపోదని మీకు నేను చెప్పనక్కరలేదు. సంస్కృతంలో కూడా రామాయణ భారతం వంటి కావ్యాలు ఇంచుమించు పూర్తిగా, కేవల పాదాంత విరామం మాత్రమే ఉన్న అనుష్టుప్పుతో నడిపించారు. ఇతర కావ్యాలలో కూడా కథా గమనం కోసం అలాంటి ఛందస్సే వాడబడింది. మందాక్రాంత వంటి అనేక విరుపులున్న పద్యాలు మేఘదూతం వంటి కొన్ని కావ్యాలలో మాత్రమే ఇంత విరివిగా వాడబడింది. తెలుగులో కూడా సందర్భం వచ్చినచోట చక్కని విరుపులతో హొయలుపోయే కందాలూ, సీసాలు మొదలైన మన దేశి ఛందస్సులో వ్రాసిన పద్యాలు ఉన్నాయి. మందాక్రాంత, మత్తకోకిల, లయగ్రాహి మొదలైన పెద్ద వృత్తాలకి విరుపులు లేకుంటే పద్యం అందం చెడిపోతుంది. తెలుగు కవులు ఈ వృత్తాలను వాడిన కొన్ని చోట్ల యీ అందాన్ని దృష్టిలో పెట్టుకో లేదన్నది మాత్రం నిజమే. కథాగమనం కోసం వృత్త చతుష్కంలో పద్యాలు వాడినప్పుడు వాటికున్న ఒక్క విరామ స్థానం అవసరం మన కవులకి కనిపించ లేదు. అందుకే వాటిని పాటించలేదు. పైగా, వాటికి మందాక్రాంత వంటి నిర్దిష్టమైన (మూడు విరుపులతో కూడిన) నడక లేకపోవడం వల్ల, ఆ ఉన్న ఒక్క విరామాన్ని పాటించకపోవడం వల్ల పద్య సౌందర్యానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. అలా విరామ స్థానంలో విరుపు పాటించనవసరం లేని వృత్తాలనే తెలుగు కవులు ఎన్నుకున్నారనీ, అవే వృత్తచతుష్కమనీ నా ఊహ.

    కొంతమంది మరొక అభియోగం చేస్తూ ఉంటారు. కథా గమనానికీ సంభాషణలకీ సంస్కృతంలో లాగా చిన్న చిన్న పద్యాలు వాడకుండా యీ చాంతాడు వృత్తాలని తెలుగులో వాడారన్నది. ఇది కూడా అంత సమంజసంగా అనిపించదు. ఒకటి, తెలుగు కవులు కూడా చిన్న పద్యమైన కందాన్ని విస్తృతంగానే వాడారు. రెండు, సంస్కృతానికీ, తెలుగుకీ భాషా స్వరూపంలో చాలా తేడా ఉంది. పదాలలో, వాక్యాలలో సంక్షేపము (brevity) ఎక్కువగా సాధించే లక్షణం సంస్కృతానికి ఉంది. అది ఒక రకంగా formal language కాబట్టి దానికా గుణం ఉంది. తెలుగు భాషా స్వరూపం వేరు. ఇది పూర్తిగా వాడుక భాష. నిత్యవ్యవహారంలో సంక్షిప్తంగా మాట్లాడడం అన్నది సహజమైన విషయం కాదు. అందుకే సంస్కృత భాషలో సాధించ గలిగే సంగ్రహత్వం తెలుగులో సాధించడం సాధ్యం కాదు. అలా సాధించాలని చూస్తే అది సహజ సౌందర్యాన్ని కోల్పోయి కృతకంగా తయారవుతుంది. అంచేత కథ చెప్పడంలోనైతే నేమి, సంభాషణల్లోనైతే నేమి, కొన్ని చోట్ల మనకి పెద్ద వృత్తాలు అవసరం అవుతాయి. ఈ సంగతులన్నీ ఆలోచించకుండా, సంస్కృతంతో పోల్చి, తెలుగు కవిత్వంలో సంక్షిప్తత తక్కువ అని పెదవి విరిచెయ్యడం సరి కాదు.

    “అసలు యతి, ప్రాసల నియమాలు రెండు వదలి వృత్తసహజవిరామాలతో అందంగా తెలుగులో యెందుకు పద్యరచన చేయసాహసించమో బోధపడదు.”

    వృత్త విరామాల గురించి పైన చెప్పాను. ఇక యతి ప్రాసల నియమాలు వదిలి పద్య రచన చేసే సాహసం గురించి. ఎందుకు చెయ్యలేదూ, అలాంటి సాహసాలు కవులు చేసారు! ఈ వ్యాసంలోనే మోహనరావుగారు పేర్కొన్నట్టు రాయప్రోలు సుబ్బారావుగారు మేఘదూతానికి అనువాదమయిన దూతమత్తేభమనే కావ్యాన్ని యతిప్రాస నియమాలు లేని మత్తేభాలతో రచించారు. అలాగే మల్లవరపు విశ్వేశ్వరరావుగారు చిత్రాంగద అనే కావ్యాన్ని యతిప్రాస నియమాలు లేని పద్యాలతో రచించారు. యతి ప్రాస నియమాలు పాటించని కందాలు శ్రీశ్రీ సిప్రాలిలో కూడా మనకి కనిపిస్తాయి. ప్రాచీన కవులు ఎందుకలా రాయలేదు అంటే, బహుశా వాళ్ళకా ‘అవసరం’ కనిపించకపోయి ఉండవచ్చు. యతిప్రాసల నియమాలు పాటించడం వల్ల కవిత్వం పలచబడడం, వాటిని పాటించకపోవడం వల్ల గొప్ప పద్యాలు సృష్టింపబడటం జరిగిందనడానికి తగిన ఆధారాలు లేవు. అక్కిరాజు ఉమాకాంతంగారు అలా జరిగిందని అభిప్రాయపడ్డారు కాని, అది పైన చెప్పినట్టుగా సంస్కృతంతో పోల్చడం వల్ల ఏర్పడిన అభిప్రాయమే అని నేననుకుంటాను. యతిప్రాసల నియమాలు కవికి ఒకోసారి ఎలా ఉపయోగపడతాయో కూడా చక్కగా వివరించే వ్యాసం, ఈమాటలోనే యిక్కడ ఉంది.

  20. సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    May 9, 2012 4:52 pm

    తెలుగు ఛందస్సులకు సంస్కృత ఛందస్సులకు మధ్య ఉన్న తేడాలకు సంస్కృతానికీ, తెలుగుకీ భాషా స్వరూపంలో ఉన్న తేడాలు కారణమని, ఈ సంగతులన్నీ ఆలోచించకుండా, సంస్కృతంతో పోల్చి, తెలుగు ఛందస్సును తక్కువచేసి మాట్లాడటం సరికాదని కామేశ్వర రావుగారు చక్కగా చెప్పారు. విరామయతి, పాదాంత విరామం fusional భాష అయిన సంస్కృతానికి ఒప్పినట్టుగా poly-agglutinative భాష అయిన తెలుగుకు ఒప్పదనే నన్నయాదులు వృత్త ఛందస్సును విరామ నియమాలు లేకుండా అక్షరమైత్రితో స్వీకరించారని ఇంతకు ముందు నేను కూడా ఎక్కడో చర్చించినట్లు గుర్తు. ఛందస్సుపై పరిశోధనలు చేస్తున్న వారెవరైనా విరామయతి, పాదాంత విరామం తెలుగు వాక్యనిర్మాణానికి ఎందుకు అంతగా ఒప్పవని సోపపత్తికంగా విశ్లేషిస్తే చదవాలని నా ఆశ.

  21. TahaTaha అభిప్రాయం:

    May 9, 2012 6:45 pm

    “తిరుపతి తుంగ శృంగవసతీ! విన వచ్చెనుసుప్రభాతగీత రవము …” గుడిగంటల్లో కాటూరి

    “శ్రీకరశైవలింగ పరిషిక్త ఘృతస్ఫటికంబు కంటె కార్తీకము కంటె పూర్ణవిధు దీపిక కంటె కృపాంత నాటక శ్లోకము కంటె …” రెల్లు తెల్లదనాన్ని వర్ణిస్తూ చల్లా సీతారామాంజనేయులు

    “రాజా వీడు కోదండబాహావిధ్వస్త దిగంతరాహితధరాప్రాణేశచూడామణిగ్రీవామంజులహారరత్న రుచిర శ్రీ పాదకంజుండగున్ …”ఆంధ్ర ప్రశస్తి లో విశ్వనాథ

    మందాక్రాంత (నిర్మాణ వైవిధ్య) సౌందర్యాన్ని చూపిస్తూ శ్రీ మోహన రాసిన వ్యాసం తెలుగుయతులమీద చర్చకు దారి తీస్తే ఈ తెలుగు కవుల పలుకులు గుర్తుకు వచ్చాయి. పదంలో మధ్యలో ఉన్న అక్షరముతో యతి వేస్తూ విరామాలు లేకుండా — సంస్కృతాన్ని స్వతం చేసుకుని — వాళ్ళే పెట్టుకున్నపద్య నిర్మాణ నియమాలని నిర్వహిస్తూ ఇంత అందంగా రాయగలరా తెలుగుకవులు అని హాయిగా మరొక్క సారి ఆశ్చర్య ఆనందాలతో విస్తుపోతూ గర్వించాను.

    తః తః

  22. మోహన అభిప్రాయం:

    May 9, 2012 6:54 pm

    1) సంస్కృతములో కావ్యములను వ్రాసే పద్ధతి వేరు, తెలుగులో వ్రాసే పద్ధతి వేరు. సంస్కృతములో ఒక ఆశ్వాసాన్ని ఒకే వృత్తములో వ్రాస్తారు (ఉదా. ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, వీటి రెంటితో ఉపజాతులు, వియోగిని, శ్లోకము, స్వాగతము, ఇత్యాదులు). ఆశ్వాసాంతములో మాలిని మున్నగు విశేష వృత్తాలను వాడుతారు. సంస్కృతములో వృత్త వైవిధ్యాన్ని నాటకాలలో చూపుతారు, కావ్యాలలో కాదు. తెలుగులో సంస్కృతములా కాక ఒక ఆశ్వాసాన్ని అన్ని వృత్తములలో వ్రాసినారు.

    2) కన్నడ భాషలో మొట్ట మొదట చంపూ సంప్రదాయములో కావ్యాలు వచ్చాయి, దానినే తెలుగులో కూడ అనుసరించారు. ఏవో కొన్ని నిర్వచన కావ్యాలు తప్ప తెలుగులో చంపూ కావ్యాలే ఎక్కువ. ఇందులో గద్యపద్యములు రెండూ ఉంటాయి.

    3) కన్నడములో మొట్టమొదట అనుష్టుభ్ శ్లోకాలను వాడారు. కాని తెలుగులో పూర్వ కవులు శ్లోకాన్ని వాడలేదు. తెలుగు కన్నడ కవులు ఆ శ్లోకస్థానములో కందమును వాడారు. ఇది చిన్న పద్యము, కథను సాగించడానికి చక్కగా ఉంటుంది, అందువల్ల.

    4) తరువాత ఎక్కువగా వాడిన వృత్తాలు చంపకమాల, ఉత్పలమాల, మత్తేభవిక్రీడితము, శార్దూలవిక్రీడితము - ఈ క్రమములో. అందుకే నేనొక చోట అన్నాను, తెలుగులో శార్దూలానికన్న మత్తేభాన్ని ఎక్కువగా వాడుతారు అని, ఎందుకంటే అందులో ప్రారంభములో శార్దూలములా మూడు గురువులు ఉండవు. సంస్కృతములో ఉపజాతుల స్థానాన్ని తెలుగులో తేటగీతి, ఆటవెలది ఆక్రమించాయి.

    5) ఇక యతి విషయము. పదాన్ని యతి స్థానములో విరిచితే కొన్ని సమయాలలో బాగానే ఉంటుంది (ఉదా. లాస్యము లాడవా పలు వి-లాసములన్ …), కొన్ని చోటులలో బాగుండవు (ఉదా. టంగుమని మ్రోగె గంట ప-డతి వినంగ …). జాత్యుపజాతులలో సామాన్యముగా పాదాంత విరామమును వాడుతారు. ఇది ద్విపదలకు, రగడలకు తప్పక ఉండాలి.

    6) తెలుగులో పాదాంత యతి ఎందుకు లేదన్నదానికి, కోవెల సంపత్కుమారులు ఇలాగన్నారు. తెలుగులో ప్రాస ఉన్నది, అందువల్ల ఒక్కొక్కప్పుడు, పదములోని రెండవ అక్షరము ప్రాసాక్షరముగా అమరకపోవచ్చు. ముందటి పాదమునుండి పదము ఆరంభమయితే ప్రాసకు సౌలభ్యము దొరుకుతుంది. పదాన్ని ఇలా విరిచినప్పుడు, నా ఉద్దేశములో ముందటి పాదములో చివర పదానికి ఒక అక్షరముకంటె ఎక్కువగా ఉంటే వినడానికి అంత బాగుగా నుండదు.

    7) మొట్టమొదట ఉత్పలమాలను, మత్తేభవిక్రీడితమును సంస్కృతములో వ్రాసినప్పుడు వాటికి పాదాంతయతిని ఉంచలేదు మన కవులు. కొన్ని శాసనాలలో ఈ విషయాన్ని గమనించవచ్చును.

    8) మాత్రాగణములతో ఉండే రగడలలో కూడ తెలుగు కవులు కొన్ని సమయాలలో పదాలను గణాలకు తగ్గట్లు విరిచి వ్రాయకుండడము నిజముగా ఒక పెద్ద లోటే.

    విధేయుడు - మోహన

  23. రవి అభిప్రాయం:

    May 10, 2012 5:30 am

    యే భాషలోనైనా యేదైనా ప్రక్రియకు ఐనా మొట్టమొదట అనుసరించినవారి మార్గమే తర్వాతి వారికి అనుసరణీయమవుతుంది. ఆ తర్వాత మార్పు వచ్చినా ఆ మార్పు మొదటి మార్గానికి అనుబంధంగా ఉండడమే కద్దు తప్ప పూర్తి భిన్నంగా ఉండడం చాలా అరుదు. ’యతివిరామం’ పాటిస్తూ కావ్యరచన చేయడం తెలుగుకు నప్పదనో, అలా చేస్తే కావ్యసౌందర్యం సాధించటం కష్టమనో వ్యక్తిగతంగా నాకు నమ్మకం కలుగడం లేదు. వేమన ఒక చక్కని ఉదాహరణ. వేమన పద్యాలు ఒక కావ్యం తాలూకు భాగాలు కాకపోయుండవచ్చు, ప్రబంధవర్ణనలు లేకపోయుండవచ్చు, అయితే ’అక్షరసామ్యం’ లేదా ’ప్రాసయతి’ అనే తద్దినాన్ని అమలు జరుపుతూనే సాధ్యమైనంతవరకూ యతివిరామం పాటించి చూపించాడాయన. ఈ విషయం మీద వేమన వ్యాసాలలో రాళ్ళపల్లి వారు కొంత చర్చించారు. ఇక సంస్కృతసమాసాలతో, పదాడంబరత్వంతో ప్రయోగాలు చేసి, సమర్థించుకుందుకు ప్రౌఢివాదాలు చేసిన తెలుగు కవులు నాడూ నేడూ తప్పక కనిపిస్తారు.

    >>అదే కాళిదాసు రఘువంశంలోనూ, కుమారసంభవంలోనూ అనేక వృత్తాలు ఎందుకు వాడవలసి వచ్చింది? అవి కథా కావ్యాలు కాబట్టి.
    >>అందులో వివిధ సన్నివేశాలు, పాత్రలు, రసభావాలు ఉంటాయి కాబట్టి.

    మరి రామాయణాన్ని, బసవ చరిత్రను, భాగవతాన్ని తదితర కావ్యాలను ద్విపదకావ్యాలుగా లేదా ఒకే వృత్తంలో చివరివరకూ మలచిన వారున్నారు కదండి? వాటిలో రసం కొఱవడిందని చెప్పడానికి వీలులేదు. అలాగే తెలుగులో వృత్తాలు లేకపోతే సంగ్రహత్వం సాధించడం కష్టం అన్నది కొంతవరకూ నిజం అయినా, సంగ్రహంగా దేశీఛందస్సులలో చెప్పగలిగిన భావాలను క్లిష్టంగా, ప్రౌఢంగా తీర్చిదిద్దడానికో, పాండిత్యప్రకర్షకో కవులు వాడుకుని, సామాన్యులకు దూరంగా తీసుకువెళ్ళటానికి కంటికెదురుగా నిదర్శనాలు కనిపిస్తున్నా ఎలా కాదనగలం?

    ఈ పరంపర ఇలా కొనసాగడం వల్లే దేశీ ఛందస్సులలో సులభంగా ఇమడగల గాథాసప్తసతి వంటి కావ్యాలను శ్రీనాథుని తర్వాత ఇప్పటివరకూ ఎవరూ పట్టించుకోలేదు. (రాళ్ళపల్లి వారి అనువాదం 300 పద్యాలవరకే ఉంది. శ్రీనాథుని కావ్యం ఇప్పుడు అలభ్యం)

    >>యతిప్రాసల నియమాలు పాటించడం వల్ల కవిత్వం పలచబడడం, వాటిని పాటించకపోవడం వల్ల గొప్ప పద్యాలు సృష్టింపబడటం
    >>జరిగిందనడానికి తగిన ఆధారాలు లేవు.

    ఆ నియమం పాటించకపోవడానికి తగినంత స్వేచ్ఛాయుతవాతావరణం లేనప్పుడు, ఆధారాలు ఎలా వస్తాయండి?

  24. మోహన అభిప్రాయం:

    May 10, 2012 2:13 pm

    రవి గారు,

    1) సంస్కృత కవులు ఒకే విధమయిన వృత్తముతో ఆశ్వాసాలను వ్రాసారు, తెలుగు కవులు ఎన్నో విధములయిన పద్యాలతో వ్రాసారు. రెండు భాషలలో మంచి కవులు తమ ధ్యేయాన్ని సాధించారు. ద్విపదలో వ్రాయబడిన ఏకాంతసేవ టాగూరు గీతాంజలికి సమానమైనది కాదా?
    2) నాలుగు ద్రావిడ భాషలలో తెలుగు తమిళ భాషలలో మాత్రమే అక్షరసామ్య యతి లేక వడి ఉన్నది. తమిళములో నియమాలు తెలుగులోలా అంత కఠినమయినవి కావు. ఉదాహరణ - వ, మ లకు యతి చెల్లుతుంది. బహుశా మామ, మావ వంటి పదాలు దీనికి కారణము కావచ్చును. కన్నడములో విరామయతిని కూడ యతిని పాటించరు.
    3) ద్రావిడ ఛందస్సులో ముఖ్యమైనది ద్వితీయాక్షర ప్రాస. ఇది అన్ని భాషలలో ఉన్నాయి, తెలుగులో మాత్రము ఉపజాతులలో యిది లేదు.
    4) తమిళములో, కన్నడములో దేశి ఛందస్సులో కావ్యాలనే వ్రాసినారు. షట్పదులలో, సాంగత్యములలో (సీసములో చివరి సూర్యగణము సాంగత్యములో లుప్తము) సంపూర్ణ కావ్యములు ఉన్నాయి కన్నడములో. ఇది ఎందుకు చెప్పుతున్నానంటే వీటిని పాడుకోవచ్చును. అంటే కన్నడములో, తమిళములో పాడుకోడానికి అనుకూలముగా కావ్యాలు ఉన్నాయి. కాని తెలుగులో యిట్టివి అరుదు. తెలుగు కావ్యాలు చదువుకోడానికి మాత్రమే వ్రాయబడ్డాయి. పాడుకోడానికి ప్రాస బాగుంటుంది.
    5) వేమన పద్యాలు అందముగా నుండడానికి కారణము పదాల విరుపు, అందరికీ అర్థమయ్యే భాష. పాదాంత యతి ఉపజాతులలో ఎప్పుడూ ఉంటుంది.
    6) యతి తద్దినము మాత్రము కాదు. తెలుగుతో కూడ అన్ని ద్రావిడ భాషలలో సామెతలు ఆదినుండి ఉన్నవి. అవి మన సంస్కృతికి ఒక కాణాచి. ఈ సామెతలలో అక్షరయతియో లేక ప్రాసయతియో ఎప్పుడూ ఉంటుంది. యతి, ప్రాసయతి వీటినుండి పుట్టాయని ఒక ఊహ. ఈ సామెతలపైన సురేశ్ గారి వ్యాసాన్ని ఎదురుచూస్తున్నాను :-)

    విధేయుడు - మోహన

  25. TahaTaha అభిప్రాయం:

    May 10, 2012 9:13 pm

    మోహన గారికి నమస్కారాలు. గణాలకు తగ్గట్టుగా విరిచి రాయడమా రాయక పోవడమా అన్నది (ప్రతిభా వంతుడైన ) కవి ఇష్టం. ‘పీరులు’/ విమర్శకులు /అధ్యయనశీలురు, కవితా గుణావగుణాలను కాక ఛందస్సును మాత్రమే పరిశీలించటానికి పూనుకున్నప్పుడు ఆ పరిశీలనలో భాగంగా, ‘తెలుగులో సంస్కృత ఛందమయిన రగడను వాడినా కొన్ని చోట్ల గణాలకు తగ్గట్టుగా విరిచిరాయక పోవడం కూడా ఉంది’
    అని అనవచ్చేమో గానీ ‘పెద్ద లోటు’అన్న ఒక ‘విలువ’ ను ఆపాదించటం సబబేనా? ఇది ఛందానికి కూడా లోటు కాక పోవచ్చు దాన్ని తెలుగులో విరుపులు లేకుండా ఉపయోగించుకోవటంలో కవి కొన్ని కొత్త అందాలను కూడా తెచ్చిపెట్టి ఉండవచ్చు.

    మిత్రుడు
    తః తః

  26. కామేశ్వరరావు అభిప్రాయం:

    May 11, 2012 9:53 am

    సంస్కృత ఛందస్సు గురించిన ఒక ఆసక్తికరమైన పరిశోధనాపత్రం ఇది. మోహనగారీ వ్యాసంలో మందాక్రాంత ఛందస్సును గురించి చేసిన విశ్లేషణ వంటిదే ఈ పరిశోధనాపత్రంలో కూడా ఉంది. ఇందులో రచయిత ప్రతిపాదిస్తున్న కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఛందస్సు మీద ఆసక్తి ఉన్నవారికి (ముఖ్యంగా మోహనరావుగారికి!) యిది చాలా ఆసక్తికరమూ, ప్రయోజనకరమూ అవుతుందని భావిస్తున్నాను.

  27. మోహన అభిప్రాయం:

    May 11, 2012 11:09 am

    తఃతః గారు,

    రగడలు దేశి ఛందస్సు, అవి మొట్టమొదట రఘటాబంధమని నాగవర్మ ఛందోంబుధిలో పేర్కొన్నాడు. కన్నడములో వీటిని ఉత్సాహ (మూడు మాత్రలు), మందానిల (నాలుగు మాత్రలు), లలిత (ఐదు మాత్రలు) రగళె అంటారు. దాని సామాన్య లక్షణము -

    కం. గణనియమ విపర్యాసదొ-
    లేణెవడెదొళ్పెసెదు మాత్రె సమనాగె గుణా-
    గ్రణియ మతదింద తాళద
    గణనెగొడంబట్టు దదువె రఘటాబంధం (నాగవర్మ)

    ఇవి మాత్రాగణాలతో ఉంటాయి, ప్రతి పాదములో మాత్రల సంఖ్య సమానము, ఇది ద్విపద, ఇది తాళబద్ధమైనది. చివరి గుణము అంటే రగడ తాళబద్ధమైనదని చెప్పడము చాల ముఖ్యము. జయకీర్తి ఛందోనుశాసనములో ఇలాగంటాడు -

    స్వచ్ఛంద సంజ్ఞా రఘటా మాత్రాక్షర సమోదితా
    పాదద్వంద్వ సమాకీర్ణా సూశ్రావ్యా సైవ పద్ధతిః

    ఇది స్వచ్ఛందము, మాత్రాగణయుక్తము, ద్విపద, సుశ్రావ్యము, ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి పజ్ఝటికా (యశస్తిలక చంపువులో పజ్ఝటికా ఉన్నది) నుండి వచ్చినదని భావన. రగళెను (తెలుగులో రగడ) మొదట పంపకవి తన భారతములో ఉపయోగించాడు. కవిజనాశ్రయకర్త దీనిని ఉదహరించలేదు. అంటే తెలుగులో దీని వాడుక తరువాతి కాలములో. కానీ తెలుగులో రగడను పోలిన ఒక పురాతన శాసనము ఉన్నది. తెలుగులో తొమ్మిది రగడలు ఉన్నాయి. వృషభగతి రగడలాటి మిశ్రజాతి రగడ కన్నడములో లేదు, అది భామినీషట్పదిగా అందులో ఉన్నది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రగడలకు ముఖ్యప్రాణము అవి మాత్రాబద్ధము, తాళబద్ధము. అందుకే తెలుగులో ఇవి యక్షగానాలలో, ఉదాహరణకావ్యములలోని కళికోత్కళికలలో, కావ్యాలలో కొన్ని వర్ణనలలో వాడబడ్డాయి. త్యాగరాజకీర్తనలు మున్నగు వాటిని పదాలను విరిచి పాడితే బాగుండడము లేదని తరచుగా వింటూ ఉంటాము. రగడలు కూడ పాడదగినవే. అందుకే వీటిని విరిచి వ్రాయడము బాగుండదనే నా భావన. ముఖ్యముగా రెండు నాలుగు మాత్రలను ఒక ఎనిమిది మాత్రలుగా (ఉదా. IIIUIII) వాడడము సరికాదనే నా అభిప్రాయము. కవులు నిరంకుశులు, ఎలాగైనా వ్రాసికోవచ్చు. కాని అవి అన్నీ సరి కావు. ఉదాహరణగా, పాల్కురికి కొన్ని సంస్కృత ద్విపదలలో, విశ్వనాథ ఒక తెలుగు ద్విపదలో పాదాంత యతిని పాటించలేదు. వారిద్దరూ మహాకవులే. అంత మాత్రాన వారి ఈ దోషాన్ని గుణముగా అంగీకరీంచకూడదు అనే నా ఉద్దేశము. ఇవి వారి కవిత్వపు వాసినిగాని, వారి విద్వత్తును గానీ అవమాన పరచడము కాదు. వైయక్తికముగా, నేను కవిని గాను, ఒక లాక్షణికుడు మాత్రమే. లక్షణాలను వివరించడానికి పద్యాలను ఉదాహరణలుగా వ్రాస్తాను. మహాకవులను ఎత్తి చూపే పాండిత్యము, కవిత్వము నాలో లేవు.

    విధేయుడు - మోహన

  28. lyla yerneni అభిప్రాయం:

    May 11, 2012 11:45 pm

    “మేఘదూత కావ్య రచనకు కాళిదాసు ఎందుకు మందాక్రాంత వృత్తాన్ని ఎన్నుకొన్నాడు అనే ప్రశ్న మన కెదురవుతుంది. దుఃఖముతో బాధపడుతూ ఉండే మనిషి మాటలాడుతుంటే ఆ మాటలు ఆగి ఆగి ఆ వ్యక్తి నోటినుండి జారుతాయి, అవి విరామము లేకుండా ఏకధాటిన రావు.”

    It looks (at least for the duration of this essay.:-)) the essayist views Meghadutam primarily as a ‘viraha kavyam.’ And, Since he is thinking along those lines, he tries to attribute to the meter Mamdakramta, traits of -graveness, sadness.

    I do not buy into either premise.

    After reading all poems in Meghadutam, I do not think, over all, the poetry is about ‘viraham.’ I am not denying viraham’s presence in this writing. I am saying it is a smaller component of a bigger theme.

    Why should one ignore the recurring themes of cloud-earth, cloud-river. The cloud (who is continuously instructed by Yaksha himself, to be a ‘dakshina nayaka’ and enjoy himself, all the way.) - What about the mythical characters and lovely anecdotes about them, that come up in several Mandakranta poems and charm us.

    I really don’t think Kalidas has much interest to tell the readers, the story of Yaksha. Nor to make his grief the main focus of his writing. Did you look at the fastness with which he disposes off the outline of the story, in the very first poem. The poet could not wait to get out of it and get into the beautiful outdoors.
    Notice the poet did not even bother to complete Yaksha’s story, whether he is reunited with his beloved wife or not?:-)

    The Meghaduta kavyam is neither a Viraha kavyam nor a Samdesa kavyam, in the way the writer projects, in this essay. If there is a message in the kavyam, it is a bigger and broader message, and please! give me a break - it is not spiritual. :-) :-) in the sense, the Indian religious tend to use it. God! It is not Svami and Yogi spiritual. Kalidasa is more with clouds, daffodils, and woods, more with that Shelley, that Wordsworth, and that Frost here. The poetry is a Mapquest mapping of a scenic route -for the meandering, exploring, the nature loving, and erotic soul. People get on aeroplanes, get in cars, go trekking when they read stories and poetry such as this one.

    If one must catalogue :-) I would rather see the Meghadutam kavyam thrown under “Travel” section. Put it next to Peter Mayle’s book “A year in provence” - They will sit well together. And keep giving incredible happiness to millions of readers.

    లైలా

  29. lyla yerneni అభిప్రాయం:

    May 12, 2012 12:01 am

    సంస్కృత ఛందస్సు గురించిన ఒక ఆసక్తికరమైన పరిశోధనాపత్రం ఇది. - కామేశ్వరరావు

    చదివాను. నచ్చింది.
    లైలా.

  30. మోహన అభిప్రాయం:

    May 18, 2012 3:06 pm

    కావ్యాల నాయకుడు ఎప్పుడూ ధీరోదాత్తుడే. ఈ ధీరోదాత్తుడు, అతని పేరులా ధీరుడు, ఉదాత్తుడు. గొప్ప వంశానికి చెందినవాడు, ఇట్టి నాయకులు విరహముతో బాధపడుతున్నా సామాన్య మానవునిలా నిగ్రహమును కోల్పోరు. కిష్కింధ కాండలో రాముడు సీత విరహముతో బాధ పడుతున్నప్పుడు కూడ దారిలో కనబడే ప్రకృతి దృశ్యాలను వర్ణించడము మరువలేదు. నా ఉద్దేశములో రామాయణములోని యీ ప్రకృతి వర్ణనలు నిజముగా చాల అందమైనవి. అదే విధముగా ఇక్కడ యక్షుడు కూడ నిగ్రహవంతుడై కనబడుతాడు. అదియునుగాక, అతని ప్రధానమైన గురి తన భార్యకు తన సందేశమును అందజేయడము. ఆ కార్యములో కృతకృత్యుడు కావాలంటే దారిని చక్కగా వివరణలతో మేఘునికి తెలుపవలెను గదా! అందువల్ల ఇది ఒక యాత్రా మార్గదర్శిలా అనిపిస్తుంది. కాని ఇందులో ముఖ్యమైన రసము విరహమే. కావ్య లక్షణాలు, ధీరోదాత్తుల లక్షణాలను గురించి క్లుప్తముగా ఇక్కడ చదువవచ్చును. ఇది పాత తెలుసా పాఠకులకు Down the memory lane లాటిది. - మోహన

  31. మోహన అభిప్రాయం:

    July 1, 2012 9:38 am

    లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతములో రెండవ శతకములో కొన్ని మందాక్రాంతములున్నాయి. అందులో మందం మందం మధుర నినదైః … అనే పద్యాన్నిలవకుశ (1934) చిత్రములో యిక్కడ వినవచ్చును. విధేయుడు - మోహన.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)
Autosuggest?

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a