తెలుగులో మందాక్రాంతము
నాగవర్మ రచించిన కన్నడ లక్షణగ్రంథము ఛందోంబుధిలో[14] మందాక్రాంతపు లక్షణాలు ఇలా చెప్పబడినవి.
కాంతం ధాత్రీ – హిమకృదమరా – కాశయుగ్మేశయుగ్మా
క్రాంతం తోర్కుం – పదదశకదోళ్ – విశ్రమం సంతతం తాం
కాంతే మత్త – ద్విరదగమనే – మల్లికామోదె మందా-
క్రాంతం వృత్తం – నెగళ్దుదిళెయొళ్ – నాగవర్మప్రణీతం (పుట 42)
భూమి (మ), చంద్రుడు (భ), స్వర్గము (న), రెండు ఆకాశాలు (త), రెండు ఈశ్వరులు (గురువులు) గలవియై తోచును మందాక్రాంతవృత్తము, పది అక్షరములతో పాదము ఎప్పుడూ విరుగుతుంది, గజగమనా, మల్లెలవలె సుకుమారీ, ఇలా భూమిపైన నాగవర్మ చెప్పాడు.
ఇక్కడ ఒక విశేషమేమంటే, పాదము పది, ఏడుగా విరుగుతుంది అని వ్రాసినా, ఉదాహరణలో నాలుగు అక్షరాల తరువాత పాదాలు విరిగేటట్లు వ్రాసినాడు నాగవర్మ. ఇంచుమించు ఇవే ప్రాసాక్షరాలతో రేచన కవిజనాశ్రయములో[15] మందాక్రాంతపు లక్షణాలను చెప్పి, పాదాలను నాలుగవ అక్షరము వద్ద అంతము చేశాడు. ఐదవ అక్షరముతో అక్షరసామ్య యతిని మాత్రము ఉంచలేదు. ఈ విషయము చాల ముఖ్యమైనది. నాలుగు అక్షరాల తరువాత కొత్త పదము ప్రారంభము అయితే ఈ వృత్తము అందముగా ఉంటుందని రేచన అనుకొన్నాడు. పదవ అక్షరము తరువాత మొదటి పాదములో కొత్త పదము ఆరంభమయినది. రెండవ పాదములో అలా ఆరంభము కాకపోయినా అది ఎబ్బెట్టుగా లేదు. కాని ఈ వృత్తమును తమ కావ్యములలో ఉపయోగించిన కవులు దీనిని పాటించక పోవడము శోచనీయము. ఆ పద్యము –
కాంతాకాంతా – మభనతతగా – కాంతిసంక్రాంతి మందా-
క్రాంతం బన్ పే – రమరు దశమా – శ్రాంత విశ్రాంతమైనన్ (పుట 25)
మనకు దొరికిన తెలుగు గ్రంథములలో మొట్టమొదట మందాక్రాంత వృత్తమును వ్రాసినది కుమారసంభవకర్త నన్నెచోడుడు. ఆ పద్యము –
ఫాలాభీలాం – బకు నురుజటా – బంధనాపీడ్యమాన
వ్యాళాధీశా – నన విగళితో – చ్ఛ్వాస నిర్ధూత గంగా
స్థూలోర్మీ శీ – కర సమితి పైఁ – దూలి శోభిల్లుఁ జూడన్
గైలాసోర్వీ – ధరపతికిని ము – క్తాఫలచ్ఛత్రలీలన్ (7.153)
తిక్కన తన భారతము స్త్రీపర్వములో ఎన్నో విశేషవృత్తాలను వాడాడు, అందులో మందాక్రాంతవృత్తము కూడ ఒకటున్నది. అది –
వీణానాద – ప్రతిమనిగమా-విర్భవత్సారపుణ్య
శ్రేణీ సంపా – దిత విమలతా – స్థేమనిర్లేపచిత్త
త్రాణక్రీడా – కలనసతతో – త్సాహవద్దివ్యభావా
ప్రాణాపానా – హరణనిపుణ – ప్రాపణీయానుభావా (2.185)
ఎఱ్ఱన నృసింహపురాణములో వ్రాసిన ఒక మందాక్రాంతము –
వేలాక్రాంత – త్రిభువన మహ – ద్విద్విషల్లక్ష్మ సూక్ష్మా
స్థులావిత్వ – స్ఫురితరచనా – దుర్నిరూపాత్మ ఖేలో
త్కోలాకార – క్షుభితవలయో – త్కూలకల్లోలమాలో
ల్లోలాబ్ధీంద్రో – ల్లుఠిత వసుధా – లోకరక్షా సమక్షా (4.188 )
ఆశ్వాసాంతములో విశ్వనాథ సత్యనారాయణ శ్రీరామాయణకల్పవృక్షము నుండి ఒకటి –
గౌరీపాదాం – బురుహ వినమ – త్కాంత లాక్షానురక్తా
పారావారో – న్మథన జనిత – ప్రౌఢకాకోలభక్తా
శారజ్యోత్స్నా – మృదుశశి శిశు – స్వచ్ఛ చూడాగ్రముక్తా
సౌర ప్రోద్య – జ్జగదవన ని – ష్ణాత గంగాభిషిక్తా (బాల – ఇష్టి – 435)
ఇటీవల భీమశంకరం వ్రాసిన రసస్రువు నుండి ఒక ఉదాహరణ –
వక్తల్, మేధా – వులు, కవులు, స – ర్వజ్ఞ సంగీత గానా
సక్తుల్, వేదాం – తులు, యతులు, సం – సార గాఢాంధికా ని
ర్ముక్తుల్, స్వాధ్యా – యులు, ఋషులు, ఆ – ముష్మికాలోచనా సం
పృక్తుల్, వేమూ – ద్వహు బహువిధిన్ – ప్రీతి చేయంగ నంతన్
పై పద్యాల రచనలో ఒక్క ఎఱ్ఱాప్రగడది తప్ప మిగిలిన వాటిలో మందాక్రాంతపు శోభ ఎక్కువగా లేదని నా ఉద్దేశము. ఇవి శార్దూల లేక మత్తేభ విక్రీడితములను చదివినట్లుంది, కాని మందాక్రాంతములోని సంగీతానుభవము వీటిని చదివినప్పుడు కలుగదు.
మరొక లయ
మందాక్రాంతపు గురులఘువుల అమరికను UU UU IIII IUU IUU IUU గా వ్రాస్తే మనకు మొదట మూడు చతుర్మాత్రలు, తరువాత మూడు ఎదురు నడకతో ఉండే పంచమాత్రలు లభిస్తాయి. చివరి మూడు య-గణాలు బృహతి అనే వృత్తమవుతుంది. తాళరీత్యా మూడు చతుర్మాత్రలు, మూడు పంచ మాత్రలు వినడానికి బాగుంటాయి. క్రింద అట్టి అమరికతో వాడుక భాషలో వ్రాసిన ఒక ఉదాహరణ –
కావ్యం వ్రాసా తలపుల -కలంతో మథించే ముదంతో
నవ్యం నవ్యం రసముల – నదమ్మౌ సుధాబుద్బుదమ్మౌ
దివ్యం దివ్యం ధర యిది – దివమ్మౌ నభీష్టాలయమ్మౌ
భవ్యంబౌ నీ బ్రదుకులు – వరాలౌ ప్రమోదస్వరాలౌ
మందాక్రాంతము తెలుగులో ఎందుకు అరుదు?
మందాక్రాంతవృత్తము తెలుగులో రాణించకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి: (1) తెలుగు భాషలో వరుసగా నాలుగు గురువులు వచ్చేటట్లు వ్రాయడము కష్టమే. అందుకే తెలుగు కవులు శార్దూలవిక్రీడిత వృత్తాన్ని మత్తేభవిక్రీడితానికన్న తక్కువగనే వ్రాసినారు. (2) మందాక్రాంతపు టందచందాలు పదాల విరుపు వలన ఏర్పడినది. అలా పదాలను నాలుగవ, పదవ అక్షరాలవద్ద విరగగొట్టకపోతే అందము చెడుతుంది.
ఒక గురువును రెండు లఘువులుగా లేక రెండు లఘువులను ఒక గురువుగా మార్చి కొత్త వృత్తాలను సృష్టించడము ఛందస్సులో సర్వసామాన్యమే, ఉదా. శార్దూల-మత్తేభవిక్రీడితములు, ఉత్పల-చంపకమాలలు, మత్తకోకిల-తరళములు, మానిని-కవిరాజవిరాజితములు, ఇత్యాదులు. అలా చేయాలని నాకు కూడ ఆలోచన వచ్చినది, దాని ఫలితమే మందాక్రాంతపు మొదటి గురువును రెండు లఘువులుగా మార్చి లలితాక్రాంతము అనే వృత్తాన్ని సృష్టించాను. ఇటీవల అట్టి వృత్తమును మందారమాల పేరిట జయకీర్తి ఛందోనుశాసనములో[15] ఉన్నట్లు కనుగొన్నాను. ఏది ఏమైనా, లలితాక్రాంత లేక మందారమాలకు ఒక ఉదాహరణ –
లలితాక్రాంత – స త న య య య, యతి (1, 6, 12)
18 ధృతి 37860
లలితాక్రాంతా – లయల సొబగై – లాస్య మాడంగ రావా
కలలో నీవీ – కలికి యెదలో – గారు చిచ్చుంచినావా
యలయై రావా – యలఘుతర మో – దాబ్ధిలో ముంచ రావా
తెలియందమ్మై – తెలుగు కవితై – తేనె లూరించ రావా