ఆషాఢస్య ప్రథమ దివసే

2. శరభలలిత – నాట్యశాస్త్రమంతా ఒకే మారు వ్రాయబడలేదని పరిశోధకుల భావన. అందులో ఈ ప్రకరణాలు ఎప్పుడు వ్రాయబడ్డాయో మనకు తెలియదు, కాని అవి తప్పక క్రీస్తు పూర్వము వ్రాయబడి ఉండాలి. ఎందుకంటే మందాక్రాంతమును బోలిన మరొక పద్యము శరభలలిత. ఈ శరభలలిత పింగళ ఛందస్సులో లేదు, కాని నాట్యశాస్త్రములో ఉన్నది. శరభలలితకు, మందాక్రాంతానికి ఉండే తేడా ఏమంటే, శరభలలితలో మందాక్రాంతపు మ భ న త త గగ కు బదులు, మ భ న త గగ ఉంటుంది, అంటే మూడు అక్షరాలు తక్కువ. క్రింద శరభలలితకు నాట్యశాస్త్రమునుండి లక్ష్యము –

శరభలలిత – మ భ న త గగ, యతి (1, 5, 11)
14 శక్వరి 2545

ఏషా కాంతా – వ్రజతి లలితం – వేపమానా
గుల్మైశ్చ్ఛన్నం – వనమురునగైః – సంప్రవిద్ధం
హా హా కష్టం – కిమిదమితి నో – వేద్మి మూఢో
వ్యక్తం క్రోధా-చ్ఛరభలలితం – కర్తు కామా (16.72)

ఈ స్త్రీకయ్యెన్ – లలితగతులన్ – కంపనమ్ముల్
తానో వెళ్ళెన్ – లతల వని కా – కొండపైనన్
మూర్ఖుండైతిన్ – గినుక నటనల్ – జూపుచుండెన్
వ్యక్తించెన్గా – శరభలలిత – మ్మైన కేళుల్

ఈ శరభలలితవృత్తమును అశ్వఘోషుడు సౌందరనందములో[13] రెండుమారులు ఉపయోగించాడు, అందులో ఒకటి –

తస్మాదేషా – మకుశలకరా – ణామరీణాం
చక్షుర్ఘ్రాణ – శ్రవణరసన – స్పర్శనానాం
సర్వావస్థం – భవతి నియమా – దప్రమత్తో
మాస్మిన్నర్థే – క్షణమపి కృథా – స్త్వం ప్రమాదం (13.56)

క్షేమకరము కాని ఆ శత్రువులను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండవలయును. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శ – వీటిని అణచుకొని అప్రమత్తుడవై ఉండవలయును. ఒక క్షణము కూడ ఏమరకూడదు.

అశ్వఘోషుడు క్రీ. శ. మొదటి శతాబ్దానికి చెందినవాడని అంటారు, కాబట్టి నాట్యశాస్త్రములోని ఛందస్సు అధ్యాయాలు అశ్వఘోషునికి ముందే వ్రాయబడి ఉండాలి

3. స్రగ్ధర – రెండువేల సంవత్సరాలకు ముండు వాడబడిన పొడవైన వృత్తాలలో స్రగ్ధర ఒకటి. అశ్వఘోషుడు, భాసుడు దీనిని వాడారు. స్రగ్ధరకు మందాక్రాంతాని కన్న నాలుగు అక్షరాలు ఎక్కువ. స్రగ్ధరలో 5-8 అక్షరాలను తొలగిస్తే మందాక్రాంత మవుతుంది. దీనివలన మనము మందాక్రాంతము నుండి స్రగ్ధర పుట్టినదా లేక స్రగ్ధరనుండి మందాక్రాంత పుట్టినదా అనే విషయాన్ని చెప్పలేము. కాని వీటికి సంబంధబాంధవ్యాలు ఉన్నాయని మాత్రము చెప్పగలము. దానిని నిరూపిస్తూ వ్రాసిన ఒక పద్యాన్ని క్రింద చదవండి:

స్రగ్ధర – మ ర భ న య య య, యతి (1, 8, 15)
21 ప్రకృతి 302933

శ్రీవాగ్దేవీ కరమ్మి – చ్చి చెలగు చదువుల్ – జెప్ప వేగమ్ము రావా
శ్రీవారాశీ వరమ్మి – చ్చి సిరుల ధరపై – జిందజేయంగ రావా
శ్రీవిశ్వాంబా శివమ్మి – చ్చి చిరసుఖములన్ – జిల్కి దీవించ రావా
కావన్ రారే దయల్ గ – ల్గ ఘనపదములన్ – గాఢమౌ భక్తి గొల్తున్

మందాక్రాంత

శ్రీవాగ్దేవీ – చెలగు చదువుల్ – జెప్ప వేగమ్ము రావా
శ్రీవారాశీ – సిరుల ధరపై – జిందజేయంగ రావా
శ్రీవిశ్వాంబా – చిరసుఖములన్ – జిల్కి దీవించ రావా
కావన్ రారే – ఘనపదములన్ – గాఢమౌ భక్తి గొల్తున్

4. కుసుమితాలతావేల్లిత – మందాక్రాంతములాగే మరొక వృత్తము ఉన్నది. దీనికి మొదటి లెగోలో మందాక్రాంతములోని నాలుగు గురువులకు బదులు ఐదు గురువులు ఉంటాయి. దీనిని కుసుమితాలతావేల్లిత అంటారు. ఈ వృత్తము కూడ పురాతనమైనదే. దీనిని కూడ అశ్వఘోషుడు సౌందరనందములో[13] ఉపయోగించాడు. ఆ పద్యమును క్రింద చదువవచ్చును –

తస్మాద్భిక్షార్థం – మమ గురురితో – యావదేవ ప్రయాతస్
త్యక్త్వా కాషాయం – గృహమహమిత – స్తావదేవ ప్రయాస్యే
పూజ్యం లింగం హి – స్ఖలిత మనసో – బిభ్రతః క్లిష్టబుద్ధేర్
నాముత్రార్థః స్యా – దుపహతమతే – ర్నాప్యయం జీవలోకః (7.52)

నా గురువు భిక్షకు వెళ్ళిన తక్షణము నేను కాషాయ వస్త్రాలను విప్పి యిక్కడినుండి నా యింటికి వెళ్తాను. ఎందుకంటే పవిత్రమైన చిహ్నాన్ని చలించిన మనసుతో, వక్రబుద్ధితో, సడలిన గురితో ధరిస్తే ఉన్నతాశయాలు మాత్రమే కాదు, జీవకోటితో నిండిన ఈ ప్రపంచము కూడ ఉండదు.

కుసుమితలతావేల్లితను ఉపయోగించిన అశ్వఘోషుడు మందాక్రాంతవృత్తాన్ని ఎందుకు ఉపయోగించలేదో? ఈ రెంటితో గర్భకవిత్వాన్ని క్రింద చూడవచ్చును –

కుసుమితలతావేల్లిత – మ త న య య య, యతి (1, 6, 12)
18 ధృతి 37857

రా రాజీవాక్షా – రసికహృదయా – రాత్రి వేచేను నీకై
రా రాజిల్లంగా – బ్రణవరవముల్ – రమ్యమై పాడ రావా
రా రాజేంద్రా నా – రచన యది శ్రీ – రంగ నీకే నిజమ్మై
రారా జీవాత్మా – ప్రణయినియు నే – బ్రాణమిత్తున్ ముదానన్

ఇందులోని మందాక్రాంతము

రాజీవాక్షా – రసికహృదయా – రాత్రి వేచేను నీకై
రాజిల్లంగా – బ్రణవరవముల్ – రమ్యమై పాడ రావా
రాజేంద్రా నా – రచన యది శ్రీ – రంగ నీకే నిజమ్మై
రా జీవాత్మా – ప్రణయినియు నే – బ్రాణమిత్తున్ ముదానన్

ఇంకా ఎన్నో విషయాలను, గర్భకవిత్వములను తెలియజేయవచ్చును గాని, అవి ఈ వ్యాసపు పరిధిని అతిక్రమించగలదు.