ఆషాఢస్య ప్రథమ దివసే

మందాక్రాంతపు ఛందస్సు

మందాక్రాంతవృత్తానికి పింగళుడు ఇచ్చిన సూత్రము – మందాక్రాంతా మ్భౌ న్తౌ త్గౌ గ్ సముద్రర్తుస్వరాః. అంటే మందాక్రాంతమునకు మ భ న త త గగ గణాలు ఉన్నవి, పాదపు విరుపులు నాలుగు (సముద్రము), ఆఱు (ఋతువులు), ఏడు (స్వరాలు). ఛందశ్శాస్త్రములో[10] ఈ వృత్తానికి ఇవ్వబడిన లక్ష్యము పింగళుని కాలము నాటిది కాదని అనుకొంటాను. కాని భరతుని నాట్యశాస్త్రములో[11] రెండు ప్రకరణాలు ఛందస్సుపైన ఉన్నాయి. అందులో మందాక్రాంత వృత్తపు లక్షణాలు ఉన్న పద్యానికి లక్ష్యము ఇవ్వబడినది, కాని నాట్యశాస్త్రకారుడు ఈ వృత్తాన్ని మందాక్రాంతానికి బదులు శ్రీధరా అని పిలిచాడు.

స్నానైశ్చూర్ణైః – సుఖ సురభిభిర్ – గండలేపైశ్చ ధూపైః
పుష్పైశ్చన్యైః – శిరసి రచితై – ర్వస్త్రయోగైస్చ తైస్తైః
నానారత్నైః – కనకఖచితై – రంగసంభోగసంస్థైర్
వ్యక్తం కాంతే – కమలనిలయా – శ్రీధరీవాతి భాసి (16.84)

ప్రియా, స్నానము చేసి సుగంధద్రవ్యాల నలదికొన్న చెక్కిళ్ళతో, నెత్తావితో, పూలతో విరాజిల్లే వెండ్రుకలతో, స్వర్ణభూషణాలతో అలంకరించుకొని కమలాలయ యైన ఆ శ్రీధరలా అందచందాలతో శోభిస్తున్నావు.

కాళిదాసుకు సమకాలికుడైన వరాహమిహిరుడు బృహత్సంహితలో[12] గ్రహగోచరాధ్యాయము అనే ప్రకరణములో వివిధ ఛందస్సులలో గ్రహముల స్థానములను గురించి వివరిస్తాడు. ఆ పద్యాలలో ఒక మందాక్రాంతము కూడ ఉన్నది:

దైన్యం వ్యాధిం – శుచమపి శశీ – పంచమే మార్గవిఘ్నం
షష్ఠే విత్తం – జనయతి సుఖం – శత్రురోగక్షయం చ
యానం మానం – శయనమశనం – సప్తమే విత్తలాభం
మందాక్రాంతే – ఫణిని హిమగౌ – చాష్టమే భీర్న కస్య (103.09)

చంద్రుడు జన్మరాశినుండి ఐదవ రాశిలో ఉంటే దీనత్వము, రోగము, శోకము, దారిలో విఘ్నాలు కలుగుతుంది. ఆరవ ఇంటిలో ఉంటే ధనార్జన, సుఖము, శత్రుక్షయము, ఆరోగ్యము కలుగుతుంది. ఏడవ యింటిలో ఉంటే వాహనము, పూజ, శయ్య, భోజనము, విత్తలాభము కలుగుతుంది. ఎనిమిదవ యింటిలో ఉంటే పాము భయపెట్టేటట్లు భయము కలుగుతుంది.

ఈ పద్యము నా ఉద్దేశములో చాల ముఖ్యమైనది. ఎందుకంటే యిందులో వరాహమిహిరుడు పద్యపు పేరైన మందాక్రాంతాన్ని ముద్రాలంకారముగా ఉపయోగించాడు. అంటే నాట్యశాస్త్రకారుని నామమైన శ్రీధరా చలామణిలో లేదని ఈ పద్యము స్పష్టముగా తెలుపుతుంది.

చాల శతాబ్దాలవరకు పింగళఛందస్సులో ఒక సూత్రముగా మాత్రమే నిలిచిందీ మందాక్రాంత వృత్తము. పింగళ ఛందస్సు ఛందశ్శాస్త్రములో ప్రథమ గ్రంథముగా పరిగణించబడుతుంది. నాట్యశాస్త్రము దాని తరువాత వచ్చినదని అంటారు. కాని యిందులో ఒక ఇబ్బంది ఉన్నది. లౌకిక ఛందస్సులో వృత్తాలకు సూత్రాలన్ని పింగళా ఛందస్సులో మగణాది త్రిక గణములచే నిర్మించబడినది. ఇంతకు ముందు చెప్పిన మందాక్రాంతవృత్త సూత్రమునే దీనికి ఉదాహరణముగా భావించవచ్చును. ఈ పద్ధతి అంత సులభమయిన పద్ధతి కాదు. కాని నాట్యశాస్త్ర కర్త గురులఘువులతో మాత్రమే వృత్త నిర్మాణాన్ని వర్ణించాడు, ఉదాహరణకు మందాక్రాంత (శ్రీధర) వృత్తములో మొదటి నాలుగు అక్షరాలు గురువులు, తరువాత పదవ, పదకొండవ, పదమూడవ, పదునాలుగవ, పదహారు, పదిహేడవ అక్షరాలు గురువులు, మిగిలినవి లఘువులు అని తెలిపాడు. ఇది చాల సులభమయిన పద్ధతి, త్రిక గణములను గురించిన జ్ఞానము దీనికి అవసరము లేదు. నా ప్రశ్న ఏమంటే సులభమయిన పద్ధతిని సామాన్యముగా మొదట ఉపయోగిస్తారు, తరువాత కష్టమయిన పద్ధతిని వాడుతారు. కాని పింగళ ఛందస్సు మొదట, తరువాత భరతశాస్త్రము జనించినవన్నది ఈ సిద్ధాంతముతో పొత్తు కుదరదు. పెద్ద పెద్ద వృత్తాలు పుస్తకాలలో నున్నంత మాత్రాన అవి వాడబడుతున్నవన్న మాట నిజము కాదు. శార్దూలవిక్రీడితము, స్రగ్ధర లాటి వృత్తాలు పింగళ ఛందస్సులో, నాట్యశాస్త్రములో ఉన్నాయి. కాని వీటిని క్రీస్తు శకము మొదటి శతాబ్దములో మాత్రమే మొట్టమొదట అశ్వఘోషుడు ఉపయోగించాడు. భాసుని నాటకాలలో ఈ వృత్తాలు వాడబడ్డాయి, కాని భాసుని కాలము ఇంకా నిక్కచ్చిగా మనకు తెలియదు.


మందాక్రాంత నిర్మాణ శిలలు

వైదిక ఛందస్సులో అనుష్టుభ్, ఉష్ణిక్, పంక్తి, త్రిష్టుభ్, జగతి ఛందాలకు చెంది కొన్ని నియమములను పాటించిన పద్యాలు మనకు పరిచితము. ఈ వైదిక ఛందస్సులో ఉచ్చరణకు (cadence) ప్రాముఖ్యత ఎక్కువ. లౌకిక ఛందస్సులో ఉచ్చరణకన్న హ్రస్వ దీర్ఘాదులు లేక గురు-లఘువులు ముఖ్యము. ఇది సంగీతాన్ని జనింపజేస్తుంది. ఇలా చేసినప్పుడు పుట్టిన వృత్తాలలలో కొన్ని నిర్మాణ శిలలు పదేపదే వాడబడ్డాయి. నేను వీటిని పిల్లలు ఆడుకొనే లెగోలవంటివి అంటాను. కొన్ని ముఖ్యమైన లెగోలు – IUIU, UIUI, UUUU, UUI UUI, UIU UIU, UIIU, IIIIIU మున్నగునవి. మందాక్రాంత వృత్తములో మూడు లెగోలు ఉన్నాయి, అవి – UUUU, IIIIIU, UIUUIUU. ఈ లెగోలను అదే క్రమములో కలిపితే మనకు మందాక్రాంతము లభిస్తుంది. మందాక్రాంతపు లెగోలు ఉండే కొన్ని వృత్తాలను పక్క చిత్రములో చూడవచ్చును. అందులోని కొన్ని విశేషాంశాలను క్రింద చర్చిస్తాను.

1. శాలినీవృత్తము – మందాక్రాంతములోని మొదటి, మూడవ లెగోలతో నిర్మించబడినది శాలినీవృత్తము. ఈ శాలినీవృత్తము కూడ బహు పురాతనమైనది. పింగళ ఛందస్సు, నాట్యశాస్త్రాలలో వివరించబడినవి. ఇది రామాయణములో లేదు, భారతములో ఉన్నది. కాని భారతములోని శాలిని తరువాత చేర్చినది అంటారు. శాలిని వంటి సమవృత్తాలు లేకున్నా లేక అరుదైనా, పాదానికి పదకొండు అక్షరాలు ఉండే త్రిష్టుభ్ ఛందముగా వ్రాయబడిన శ్లోకాలలో, కొన్ని పాదాలకు శాలిని వంటి వృత్తాల లక్షణాలు భగవద్గీతలో కూడ ఉన్నాయి. భాసుడు ప్రతిమానాటకంలో వ్రాసిన ఒక శాలినీ వృత్తాన్ని క్రింద ఉదాహరణగా ఇస్తున్నాను.

శాలిని – మ త త గగ, యతి (1, 5)
11 త్రిష్టుభ్ 289

భగ్నః శక్రః – కంపితో విత్తనాథః
కృష్టః సోమో – మర్దితః సూర్యపుత్రః
ధిగ్ భోః స్వర్గై – భీత దేవైర్నివిష్టం
ధన్యా భూమి – ర్వర్తతే యత్ర సీతా (5.17)

ఇంద్రుడు భంగపరచబడ్డాడు, కుబేరుడు వణికిపోయాడు, చంద్రుడేమో యీడ్చబడ్డాడు, యముడు త్రొక్కబడ్డాడు, భయకంపితులైన దేవతలతో ఉండేది అది స్వర్గమా, సీత ఉండే యీ భూమి ఎంత ధన్యమైనదో?

మనకందరికీ సుపరిచితమైన శాలినీవృత్తము విష్ణుసహస్రనామప్రారంభములో వచ్చే క్రింది పద్యము:

మేఘశ్యామం – పీతకౌశేయవాసం
శ్రీవత్సాంగం – కౌస్తుభోద్భాసితాంగం
పుణ్యోపేతం – పుండరీకాయతాక్షం
విష్ణుం వందే – సర్వలోకైకనాథం

త్రిష్టుభ్ ఛందానికి చెందిన శాలినిలాటి అమరికలు వైదిక ఛందమునుండి గ్రహించబడినవేమో?