ఆషాఢస్య ప్రథమ దివసే

ఘనవృత్తము :- ఇది మేఘదూతమునకు తరువాతి కథ. శాపవశాత్తు భార్యనుండి వేరుపడి విరహ మనుభవిస్తున్న యక్షుడు వర్షఋతువులో మేఘమును చూచి తన సందేశమును తన భార్యకు అందజేయుమని ప్రార్థించి, అలకాపురికి మార్గమును కూడ చక్కగా తెలిపినాడు. అది మేఘదూతములోని కథ. ఇక ఇక్కడ ఒక ప్రశ్న మనకు ఉదయిస్తుంది. అదేమంటే పాపము తన బాధను మేఘునితో యక్షుడు మొర పెట్టుకొన్నాడు. ఐతే ఆ మొరలను ఆలకించిన మేఘుడు ఏమి చేసినాడు అన్నదే ఆ ప్రశ్న. అసలు ఆ నీలజీమూతము విన్నదా, వింటే ఏమి చేసింది? అలకాపురి చేరిందా, యక్షుని భార్యను చూసిందా? ఆమె ఏలాగుంది?

ఈ ప్రశ్నలకు జవాబు మనకు కోరాడ రామచంద్రశాస్త్రి వ్రాసిన ఘనవృత్తములో[9] లభిస్తుంది. వీరు పందొమ్మిదవ శతాబ్దపు ఉత్తరార్ధములో దీనిని వ్రాసినట్లున్నది. వీరు బందరు నోబుల్ కళాశాలలో సంస్కృతాధ్యాపకులు. తెలుగు భాషలో మొట్టమొదటి నాటకమును రచించిన ఘనత కూడ వీరికే దక్కినది. ఆ నాటకము 1860 ప్రాంతములో మంజరీమధుకరీయము అనే పేరుతో రచించబడినది.


యక్షుని చిత్రము (మాగంటి వంశీ)

యక్షుడు ఇచ్చిన ప్రయాణమార్గపు వివరాలు తీసికొని అలకాపురి చేరుకొంటాడు మేఘుడు. అక్కడ యక్షుని ఇంటిని కూడ కష్టము లేకుండ కనుగొంటాడు. కిటికిలోనుండి తొంగి చూడగా చిక్కిపోయిన యక్షుని భార్య దేవీపూజలో నిమగ్నమై యుంటుంది. శోకాకులయైన ఆమె మేఘునికి అశోకవనములో నున్న సీతను జ్ఞప్తికి తెస్తుందిది. హనుమంతుని వలెనే మేఘుడు సూక్ష్మరూపము దాల్చి సుందరాకారముతో ఆమె ముందు ప్రత్యక్షమయి యక్షుని విరహబాధను తెలియజేస్తాడు. యక్షుని ఇంద్రియనిగ్రహము, ఏకపత్నీవ్రతమును ఆమెకు విశదపరచినాడు.యక్షాంగన ఇది తాను దేవికి చేయు పూజాఫలము అని తలపోస్తుంది. శాపగ్రస్తుడైన యక్షుడు రామగిరిలో తపము చేసెడి సమయాన ఇంద్రుడు ఆతని తపోభంగము కోసం సురూప అనే అప్సరను పంపాడనీ, ఆమె నటనలకు, సౌందర్యమునకు బానిస కాక ఆమెను తూలనాడి ఆమెకు సద్బుద్ధిని కలిగించి తిరిగి దేవలోకానికి యక్షుడు పంపించాడనీ మేఘుడు చెబుతాడు.

“స్వర్గం గాయాః – పయసి విహరత్ – రాజహంసస్య కుల్యా
సిత్వం యాహి – ద్రుతతరమితో – యాహి కుంజాంతరం తత్”

నా భార్య ఆకాశగంగ వంటిది. నావంటి రాజమరాళం అట్టి ఆకాశగంగలో కాక నీవంటి పిల్లకాలువలో విహరిస్తుందా? నీ వృథాప్రయాస చాలించి ఇక వెంటనే వెళ్ళు అని యక్షుడు సురూపతో అన్న మాటలను ఆమెతో చెబుతాడు. తన భర్తను గురించి యక్షుడు చెప్పిన మంచి మాటలను విన్న యక్షవనిత ఆనందాధిక్యముతో మూర్ఛపోతుంది. ఆమెకు శైత్యోపచారములను జేస్తూ చెలికత్తెలు మేఘునికి ఆమె ఎలా యక్షుని వదలి కాలము గడిపినదో అనే విషయాన్ని వివరిస్తారు. కుబేరుడు తనకిచ్చిన శాపము మాట విన్న యక్షుడు బాధతో భార్యకు ఈ వార్తను తెలుపుట కిష్టము లేక ఇంటికి రాకుండ వెళ్ళిపోయిన పిదప కుబేరుడు తన భార్యను యక్షవనిత వద్దకు పంపుతాడు. ఆమె కుబేరుడు తనకు బోధించిన అంబికామంత్రమును యక్షాంగనకు ఉపదేశించి దేవిని ఆరాధించమని ఓదార్చుతుంది. యక్షపత్ని అలాగే భక్తితో పార్వతిని పూజిస్తుంది. ఆమె పూజలకు తృప్తిబొంది పార్వతి ఆమెకు ప్రత్యక్షమై ఇలా అంటుంది – కుబేరుడు నా ప్రియమైన భక్తుడు. అతని శాపమును నేను తిరగజేయలేను. కాని శాపము త్వరలో ముగుస్తుంది, నీకు శుభము కలుగుతుంది. అదియును గాక యక్షుని శాపమునకు కారణము పూర్వజన్మలో అతడు తన కూతురిని అల్లుడిని కలువనీయకుండ దూరముంచుతాడు. నీవు కూడ నీ చెలికత్తెలను వారి పతులనుండి దూరము చేస్తున్నావు, అలా చేయకు అని చెప్పుతుంది. అప్పటినుండి ఆ యక్షవనిత దేవీధ్యానములో తన భర్తను తలచుచు కాలమును గడపుతున్నది. కొద్ది సేపటికి ఆమె మూర్ఛనుండి తేరుకొని మేఘుడిని ఆదరించి బహుమానముల నిచ్చి తన పతిని గూర్చి కొన్ని రహస్యములను తెలిపి ఒక సందేశాన్ని కూడ ఇస్తుంది. ఆ సందేశములను గొని మేఘుడు మళ్ళీ రామగిరికి వెళ్ళి యక్షుని జూచి నీ ప్రియురాలు జీవించి వున్నది, నిన్నే తలుస్తూ ఉన్నది, త్వరలో మీరు శుభములను పొందగలరు అనే మేఘసందేశమును ఇచ్చి వెళ్ళిపోతాడు. వర్షఋతువు పిదప శరదృతువు వస్తుంది. యక్షునికి శాపము తీరుతుంది. అలకాపురికి వెళ్ళి తన భార్యను మళ్ళీ దర్శిస్తాడు. మేఘుడు వారిని కలిసికొని ఇద్దరిని శ్లాఘిస్తాడు. కుబేరుడు యక్షుని సన్మానించి తన సేవకావృత్తినుండి తొలగిస్తాడు. ఇది ఘనవృత్తపు కథ. ఈ కావ్యము నుండి రెండు పద్యాలను ఇక్కడ ఇస్తున్నాను:

యత్తే ప్రేయాన్ – మయి సదయయా – గ త్తనూజత్వభావం
దూరే తస్మి – న్నపిచ భవసి – ప్రేమ ధూర్మిర్భరాత్మా
సూనం తస్మా – దహముపగతో – న్యాయతస్త్యాతభావం
పుత్రం మత్వా – తవహృదయ సం – భాషణం నిర్విశంకా (1.21)

దూరంబున్నన్ – నెనరు మదిలో – నుంచుకొన్నావు నీవున్
ప్రేమన్ జూపెన్ – బ్రియ సుతునిగా – నన్ను నీ భర్త తానున్
నేనున్ దల్తున్ – గనుక నతనిన్ – దండ్రిగా దప్పకుండన్
నీవున్ నన్నున్ – సుతునివలెనే – యెంచుమా శంకలేకన్

యక్షుడి భార్యను చూచిన తరువాత మేఘుడు ఆమెతో, యక్షుడు నన్ను తన కొడుకులా ఆదరించాడు, నేను కూడ అతడిని పితృసమానముగా తలుస్తాను, నీవు నీ భర్త ఎంతో దూరములో ఉన్నా, ప్రేమతో అతనిని మరువకుండా సదా జ్ఞాపకము చేసికొంటున్నావు. నీవు కూడ సందేహాలను తొలగించి సంకోచ పడక నన్ను పుత్రసమానునిగా తలంచుకో, అని అంటాడు.

అన్యోన్యోద్యత్ – ప్రణయవశతా – జాతకందర్పదర్ప
క్రాంతక్రీడా – వశగమనసో – రర్హయోనోఃకయోశ్చిత్
ఆళీహిత్వం – స్వపదవినయం – బోద్దుకామావకాశం
వాదా ఏవం – తదసివిధురా – శాప ఏవప్రసహ్యః (2.17)

ఆనాడొక్కం – డెఱిగి తనయన్ – భర్తనున్ వేఱు జేసెన్
జ్ఞానంబున్నన్ – మతియు జెడగా – దానె గల్గించె బాధన్
తా నీ జన్మన్ – ధనపతి యిడన్ – శాపమందేను, నీవున్
వేఱుంచేవే – చెలుల పతులన్, – పాప మద్దాని వల్లన్

ఈ పద్యము పార్వతీదేవి యక్షుడికి శాపము ఎందుకు వచ్చిందో అని యక్షపత్నితో వివరించినప్పుడు చెప్పిన మాటలు. వయసులో ఉండే ప్రేమికులను వేరుజేయడము తప్పు. ఆ తప్పునే నీ భర్త పూర్వజన్మలో చేసినాడు, తన కూతురిని అల్లుడిని కలుసుకోకుండా అడ్డంకులు పెట్టేవాడు. దాని ఫలితమే కుబేరుడు ఈ జన్మలో తన శాపముచే మిమ్ములను విడదీసినాడు. నీవు కూడ నీకు పనిచేస్తూ ఉండే చెలికత్తెలను వారి భర్తలను కలిసికోకుండా వేరు చేస్తున్నావు, అది పాపకరమైన కార్యము, అలా చేయరాదు అని దేవి బోధిస్తుంది.

ఆత్మార్పణస్తుతి :- అప్పయ దీక్షితులు (క్రీ. శ. 1520-1593) ఆత్మార్పణములో 50 పద్యాలు ఉన్నాయి, అందులో సుమారు 40 మందాక్రాంత వృత్తాలు. ఈ ఆత్మార్పణస్తుతిని వ్రాయడానికి ముందు దీక్షితులు ఉమ్మెత్తకాయ రసాన్ని మ్రింగినాడట. అందువల్ల అతనికి ఉన్మత్తావస్థ ప్రాప్తించినది. తాను చెప్పినదల్లా అలాగే వ్రాయమని శిష్యులకు ముందుగానే చెప్పాడట. అట్టివేళలో అతని అంతరంగములో ఉండే భావాలు ఈ ఆత్మార్పణాస్తుతి రూపములో వచ్చాయట. ఈ స్తుతిని ఎందరో చక్కగా పాడారు. అందులో ఒకదానిని యిక్కడ వినవచ్చును. అందులోనించి ఒక మందాక్రాంత:

ఆనందాబ్ధేః – కమపి చ ఘనీ – భావమాస్థాయ రూపం
శక్త్యా సార్ధం – పరమముమయా – శాశ్వతం భోగమిచ్ఛన్
అధ్వాతీతే – శుచిదివసకృ – త్కోటిదీప్రే కపర్దిన్
ఆద్యే స్థానే – విహరసి సదా – సేవ్యమానో గణేశైః (4)

ఆనందాబ్ధుల్ – స్ఫటిక మవగా – నీదు రూపమ్మయేనో
నీతో నర్ధం – బగు నగజకున్ – మోద మందింతు వెప్డున్
లోకాతీతా – ప్రవిమల శివా – కోటిసూర్యప్రకాశా
ఆద్యా నిన్నే – గొలుతురు సదా – దేవదేవుల్ గణేశుల్

ఆనందసాగరాలు ఘనీభవించితే నీ రూపమవుతుందా? నీవెప్పుడు నీ అర్ధాంగి యయిన ఉమకు శాశ్వతమైన సంతోషాన్ని అందిస్తావు. అన్నిటికీ అతీతమయిన వాడవు నీవు, అతి విమలుడవు, కోటిసూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తావు. దేవతలు, ప్రమథగణాధీశ్వరులు నిన్నే ముందుగా పూజిస్తారు.