ఆషాఢస్య ప్రథమ దివసే

ఉద్ధవసందేశము :- రూపగోస్వామి (క్రీ. శ. 1489-1564) చైతన్య మహాప్రభువు శిష్యుడు. ఇతని పూర్వీకులు నేటి కర్ణాటకరాష్త్రమునకు చెందిన గౌడసారస్వతులు. వంగదేశపు సుల్తాను దగ్గర అయిష్టముగా కొన్ని యేళ్ళు పని చేసి, దానినుండి విరమించుకొని చైతన్యుని శిష్యుడయ్యాడు. బృందావనములో శేష జీవితాన్ని గడిపాడు. ఇతని స్థానము గౌడీయ వైష్ణవమతములో అతి ముఖ్యమైనది. ఇతడు ఎన్నో కావ్యముల రచయిత, ఉదా. భక్తిరసామృతసింధు, ఉజ్జ్వలనీలమణి, స్తవమాల, ఇత్యాదులు. ఇతడు రెండు సందేశ కావ్యాలను వ్రాసినాడు, హంసదూతం, ఉద్ధవసందేశము. హంసదూతము శిఖరిణీ వృత్తములో, ఉద్ధవసందేశము మందాక్రాంతములో వ్రాయబడినది. గోపికలకు హంస దూత అయితే, కృష్ణునికి అతని చెలికాడైన ఉద్ధవుడు దూత. ఇది భాగవతకథపైన ఆధారపడినది. గోపికలను వీడి మథురలో ఉండే శ్రీకృష్ణుడు వారికి ఉద్ధవుని ద్వార సందేశాన్ని పంపుతాడు.

వృందారణ్యే – మమ విదధిరే – నిర్భరోత్కంఠితాని
క్రీడోల్లాసైః – సపది యరిణా – హా మయా కిం విధేయం
జ్ఞాతం ధూర్తే – స్పృహయసి ముహు – ర్నందపుత్రాయ తస్మై
మా శంకిష్టాః – సఖి మమ రసో – దివ్యసారంగతోऽభూత్ (61)

కల్గెన్ నాలో – విరహ వ్యధలే – నే భరించంగ లేనే
నా కీ బృందా-వనమున మదిన్ – తాపముల్ హెచ్చె నయ్యో
పిల్లా నీలో – బెఱిగె నిజమై – వాంఛ కృష్ణుండనంగా
కాదే చెల్లీ – గనితి నదిగో – కృష్ణవర్ణంపు జింకన్

ఈ పద్యము ఇద్దరు గోపికల మధ్య జరిగిన సంభాషణను వ్యక్తము చేస్తుందని ఉద్ధవునితో కృష్ణుడంటాడు. నేను విరహబాధతో తపించిపోతున్నానంటూ ఒక గోపిక చెబుతుంది. మరో గోపిక నీకు కృష్ణుడంటే ఆశ ఎక్కువయినదని ఆమెను రెచ్చగొట్టుతుంది. మొదటి గోపిక కృష్ణ పదముపైన శ్లేష నుంచి అలా కాదు, నేను చూచినది నల్లని జింకను అని తన్ను తాను సమర్థించుకొంటుంది.

క్రీడాతల్పే – నిహితవపుషః – కల్పితే పుష్పజాలైః
స్మిత్వా స్మిత్వా – ప్రణయరభసాత్ – కుర్వతో నర్మభంగీం
విన్యస్యంతీ – తవ కిల ముఖే – పూగఫాలీ విధాస్యే
కుంజద్రోణ్యా – మహమిహ కదా – దేవసేవావినోదం (88)

శయ్యన్ జేతున్ – కుసుమములతో – పవ్వళించంగ దేవా
సిగ్గిల్లంగన్ – ప్రణయభరనై – నవ్వి నవ్వింతు నే నిన్
నీ నోరందున్ – రుచులమయమౌ – మంచి తాంబూల ముంతున్
కుంజమ్మందున్ – గృహము నొకటన్ – సేవలన్ జేతు నీకై

ఇంకొక గోపిక కృష్ణుని తలబోస్తూ నేను నీకు పూలతో పాన్పు చేస్తాను, సిగ్గుతో నవ్వుతూ ప్రణయరసాన్ని ఒలకబోస్తాను, నీకు సుగంధాలతో తాంబూలము ఇస్తాను, పొదరింటిలో నీ వినోదానికై సేవలను జేస్తాను అని అనుకొంటుంది. ఇలా వాళ్ళు తమలో తామే కృష్ణునిగురించి ఆలోచిస్తుంటారని కృష్ణుడు ఉద్ధవునికి చెబుతాడు.

రాసోల్లాసా-న్నిశి నిశి చిరం – స్వప్నవృందాప్రదేశా
ద్వృందారణ్యే – సురభిణి మయా – సార్ధమాస్వాదయంతే
భూయో భూయ-స్తదపి చ పరి – త్యాగితో దూషణం మే
శంసంత్యః కిం – కుటిలహృదయా – న త్రపంతే భవత్యః (106)

రాసక్రీడన్ – రజని రజనిన్ – స్వప్నలోకాలలోనన్
మీరా బృందా-వని విడువకన్ – జేయుచున్నారు గాదా
వీడే నంచున్ – యనెదరుగదా – నింద లిట్లేల నమ్మా
మాటిట్లాడన్ – కుటిలమతితో – మీకు సిగ్గైన లేదే

మీరేమో మీ కలలలో బృందావనములో రాసక్రీడ చేస్తున్నారు, మళ్ళీ కృష్ణుడు మిమ్ములను వదలివేసినాడు అని అంటారు. మీరు నిజముగా కపట హృదయులు, మీకు సిగ్గు కూడ లేదా అని గోపికలతో చెప్పమంటూ ఉద్ధవునికి కృష్ణుడు బోధిస్తాడు.

కోకిలసందేశము :- కోకిలసందేశమును వ్రాసిన ఉద్దండకవి 15వ శతాబ్దానికి చెందినవాడు. ఇతడు తమిళుడు, కాని నేటి కేరళలో చివరకు స్థిరపడ్డాడు. ఇతడు ఒకప్పుడు తన భార్యను వదలి కొద్ది కాలము ఉండవలసివచ్చింది. అప్పుడు ఆమెను తలుస్తూ వ్రాసిన ఖండకావ్యమే కోకిలసందేశము. మల్లికామారుతమనే ఒక నాటకమునుకూడ వ్రాసినాడు ఈ కవి. ఇందులో కోకిల తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలపైన ఎగిరి దక్షిణ ప్రాంతపు యాత్ర చేస్తుంది. అందులోనుండి కొన్ని మందాక్రాంత వృత్తాలు –

దివ్యైశ్వర్యం – దిశసి భజతాం – వర్తసే భిక్షమాణో
గౌరీమంకే – వహసి భసితం – పంచబాణం చకర్థ
కుత్స్నం వ్యాప్య – స్ఫురసి భువనం – మృగ్యసే చాగమాంతైః
కస్తే తత్వం – ప్రభవతి పరి – చ్ఛేతుమాశ్చర్యసింధో (1.54)

భిక్షుండైనన్ – గొలుతురు జనుల్ – దివ్యశక్తిప్రభావా
అంకమ్మందున్ – లలిత యమరెన్ – బంచబాణారి సాంబా
లోకమ్మెల్లన్ – వెలిగెదవుగా – నైన నన్వేషణమ్మే
కొల్వంగా ని-న్నెవరితరమౌ – నయ్య యాశ్చర్యసింధూ

సంపద్గ్రామము అనే చోట ఉండే శివాలయములోని ఈశ్వరునిపైన వ్రాసిన పద్యమిది. భక్తులేమో నిన్ను దేవుడని భజిస్తారు, కాని నీవేమో తిరిపెమెత్తుకొంటావు, ఎంతో ప్రేమతో గౌరీదేవిని నీ ఒడిలో కూర్చోబెట్టుకొన్నావు, కాని మన్మథుని కోపముతో బూడిద చేసినావు, నీవేమో లోకమంతా దేదీప్యమానముగా వెలిగిపోతున్నావు, ఐనా నిన్ను వెదకడము తప్పదు, అలాటివాడిని నిన్ను ఎలా అర్చించడమో? నీవు ప్రతి క్షణము దిగ్భ్రాంతిని కలిగిస్తుంటావు.

గేహే గేహే – నవనవసుధా-క్షాలితం యత్ర సౌధం
సౌధే సౌధే – సురభికుసుమైః – కల్పితం కేలితల్పం
తల్పే తల్పే – రసపరవశం – కామినీకాంతయుగ్మం
యుగ్మే యుగ్మే – స ఖలు విహరన్ – విశ్వవీరో మనోభూః (1.6?)

వీథుల్ నిండెన్ – నవనవముగా – తెల్లగా నిండ్ల తోడన్
సౌధాలందున్ – సురభిళముగా – పుష్పతల్పమ్ము లుండెన్
తల్పాలందున్ – పరవశముగా – జంటలే ప్రేమతోడన్
జంటల్ గూడన్ – హృదయములలో – నా మనోజుండు నిండెన్

ఇది కోళిక్కోడును (కాలికట్) గురించి వ్రాసినది. సంస్కృతములో కుక్కుటక్రోడ, అంటే కోడి ఒడి అని ఈ ఊరి పేరు. ఆ ఊరిలో ఇళ్ళన్నీ తెల్లగా వెల్లవేయబడి ఉన్నాయి, ఆ సౌధాలపైన పూల పానుపులు, వాటిపైన ప్రేమతో పవళించిన జంటలు ఉన్నాయన్నాడు కవి యిక్కడ. ఆ ఊరంటే అతనికి ఎంతో ప్రీతి, ఆ ఊరిలో ఇతడు ఎన్నో బిరుదులను గొని గొప్పవాడయ్యాడు. ఇతడిని పోషించిన 15వ శతాబ్దపు రాజు పేరు మానవిక్రమవర్మ.

తీర్ణప్రాయో – విరహజలధిః – శైలకన్యాప్రసాదాత్
శేషం మాస – ద్వితయమబలే – సహ్యతాం మా విషీద
ధూపోద్గారైః – సురభిషు తతో – భీరు సౌధాంతరేషు
క్రీడిష్యావో – నవజలధర – ధ్వానమంద్రాప్యహాని (2.61)

దేవ్యాశీస్సుల్ – గలుగ విరహాం – భోనిధిన్ దాటుదామా
ఇంకన్ రెండే – నెలలు మిగిలెన్ – ధైర్యమున్ వీడ నౌనా
సౌధమ్మందున్ – మనము నెనరున్ – ధూపముల్ తావి నీయన్
కార్మేఘమ్ముల్ – సడుల మెఱయన్ – హాయిగా నుంద మెప్డున్

ఈ ఉద్దండకవి తరచుగా ప్రయాణము చేసేవాడట. అప్పుడొకప్పుడు భార్యకు దూరముగా కొన్ని నెలలు గడపవలసి వచ్చింది. బహుశా అప్పుడు వ్రాసిన ఈ కోకిలసందేశములోని చివరి పద్యము ఇది. మనము ఇలా ఇంక రెండు నెలలే ఉండాలి, ధైర్యాన్ని కోల్పోవద్దు, ఆ గౌరీదేవి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. నేను వచ్చిన పిదప బయట ఉరుముతూ వర్షము పడుతుంటే లోపల మనము ధూపములు ఇచ్చే సువాసనతో హాయిగా ఉందాము అని ఆశాభావముతో ముగిస్తాడు కవి.