హంస సందేశము :- హంససందేశ రచయిత వేంకటనాథుడు (1269-1370). ఇతనికి స్వామిదేశికన్ లేక వేదాంతదేశికన్ అని కూడ పేరు. ఇతడు రామానుజాచార్యుల పరంపరకు చెందినవాడు. ఇతడు కవి, పండితుడు, తార్కికుడు, మతప్రవక్త. సంస్కృత, ప్రాకృత, తమిళ, మణిప్రవాళ భాషలలో పుస్తకాలు వ్రాసినాడు. పాదుకాసహస్రము, యాదవాభ్యుదయము, హంససందేశాది కావ్యముల రచయిత. అల్లాఉద్ద్దీన్ ఖిల్జీ అరాజకాల కాలములో నివసించాడు. మతాచార్యులలో నిజమైన కవులు అరుదు, నా ఉద్దేశములో శంకరాచార్యులు, వేంకటనాథుడు, వాదిరాజయతి అట్టివారు.
హంససందేశములో కథానాయకుడు శ్రీరాముడు. హనుమంతుడు సీతను అశోకవనములో చూచి ఆమె యిచ్చిన ముద్రికను తీసికొని వచ్చి రామునికి ఇస్తాడు. కిష్కింధలో ఇంకా వర్షాకాలము. అట్టి వర్షాకాలములో రాముడు ఒక హంసను చూచాడు. ఆ హంసతో ఆకాశములో ఎగిరి సీత ఉండే లంకకు వెళ్ళి ఆమెకు తన సందేశమును అందజేయుమని ప్రార్థిస్తాడు. హంస వెళ్ళవలసిన మార్గాన్ని కూడ నిర్దేశిస్తాడు. అది హంపి, కర్ణాటక ఆంధ్ర సరిహద్దు, అహోబిలము, తిరుపతి, కాళహస్తి, కంచి, శ్రీరంగము, ఇత్యాదులు. అన్ని పద్యాలు మందాక్రాంత వృత్తాలే. క్రింద కొన్ని ఉదాహరణలు:
తస్మిన్ సీతా – గతిమనుగతే – తద్దుకూలాంకమూర్తౌ
తన్మంజీర – ప్రతిమనినదే – న్యస్తనిష్పందదృష్టిః
వీరశ్వేతో – విలయమగమ – త్తన్మయాత్మా ముహూర్తం
శంకే తీవ్రం – భవతి సమయే – శాసనం మీనకేతోః (1.03)
హంసన్ జూడన్ – గతుల సొబగుల్ – జీర యంచుల్ దలంచెన్
అందమ్మౌ యా – పలుకు వినగా – సీత పల్కుల్ స్మరించెన్
వీరుండైనన్ – క్షణము మఱచెన్ – రాముడో తన్ను దానే
ఔరా యా మ-న్మథుని బలిమిన్ – దాట శక్యమ్ము గాదే
హంసను చూడగానే సీత నడిచే తీరు జ్ఞాపకము వచ్చినది శ్రీరామునికి. సీతాదేవి హంసగమన అనడములో అతిశయోక్తి లేదు గదా! హంస ఆకారము సీత కట్టుకొన్న చీర అంచుల జ్ఞాపకమును తెచ్చాయి రామునికి. ఆడవాళ్ళ చీరల అంచులలో హంసలు, నెమళ్ళు, ఇత్యాదులు ఉండడము సహజమే గదా! హంసరుతమును విన్నప్పుడు సీత మాటలను విన్నటుండినది శ్రీరామునికి. ఇలా హంస రూపము, చలనము, మున్నగునవి సీతను సదా జ్ఞాపకానికి తెచ్చింది రామునికి. రాముడు గొప్ప వీరుడు, నిగ్రహము గలవాడు. ఐనా భార్యావియోగాన్ని తప్పించుకోవడానికి ఎవరివల్ల సాధ్యమవుతుంది? ఇందులో నాకు మరో రెండు విషయాలు గోచరిస్తున్నాయి. వాల్మీకి రామాయణములో కూడ సీతను వెదకుతూ వెళ్ళుతున్నప్పుడు మార్గములోని ప్రకృతి దృశ్యాలను చక్కగా సహజముగా వర్ణించే ఘట్టాలు ఉన్నాయి. కాళిదాసు విక్రమోర్వశీయ నాటకములో ఊర్వశి వదలి వెళ్ళిపోయిన తరువాత పురూరవచక్రవర్తి ఉన్మాదిలా సంచరిస్తూ ప్రకృతిలోని ప్రతి వస్తువులో ఊర్వశినే చూస్తాడు. ఇట్టివన్ని పై పద్యములో చక్కగా చిత్రించబడినాయి.
ఇక్షుచ్ఛాయే – కిసలయమయం – తల్పమాతస్థుషీణాం
సల్లాపైస్తై – ర్ముదిత మనసాం – శాలి సంరక్షికాణాం
కర్ణాటాంధ్ర – వ్యతికరవశాత్ – కర్బురే గీతిభేదే
ముహ్యంతీనాం – మదనకలుషం – మౌగ్ధ్యమాస్వాదయేథాః (1.20)
చూడా పాన్పుల్ – కిసలయముతో – బాలికల్ జేసిరందున్
సస్యమ్మున్ బల్ – చెఱకు మడులన్ – కాయుచున్నారు గాదా
కర్ణాటాంధ్రీ – పదముల సడిన్ – పాట బాడేరు గాదా
మధ్యాహ్నానన్ – గుసగుసలతో – మాటలాడేరు గాదా
స్థలము కర్ణాటాంధ్ర సరిహద్దులో ఉండే ఒక గ్రామము, సమయము మధ్యాహ్నము పూట. కొందరు బాలికలు చెఱకు తోటలను, వరి మడులను కాపలా కాస్తున్నారు. అక్కడ ఆకులతో తీగలతో పాన్పులు చేస్తున్నారు. అలాటి సమయములో ఆడుతూ పాడుతున్నారు. వీళ్ళు సరిహద్దు ప్రాంతములో నివసిస్తున్నారు గనుక వీరు మాట్లాడేటప్పుడు రెండు భాషలలోని పదాలు మణిప్రవాళములోలా దొర్లిపోతున్నాయి. దానితో ఒకరితోనొకరు గుసగుసలాడుకొంటూ పెద్దగా నవ్వుతున్నారు. ఈ వర్ణన నాకు చాల సహజముగా ఉన్నట్లు అనిపిస్తుంది.
సంధ్యారాగం – సురభిరజనీ – సంభవైరంగరాగైః
కేశైజ్యోత్స్నా – కలహి తిమిరం – పాలికాపీడగర్భైః
ఆవిభ్రాణా – స్సరసిజదృశే – హంసదోలాధిరోహా
దాధాస్యంతే – మదకలగిర – స్తేషు నేత్రోత్సవంతే (1.37)
స్నానమ్మాడన్ – పసుపు నలదన్ – సాంధ్యరాగమ్ము వెల్గున్
కేశమ్మందున్ – సితకుసుమముల్ – రాత్రి చంద్రుండయేనో
మాట్లాడంగన్ – గలగల రొదన్ – యౌవనమ్మే కన్బడున్
ఊగన్ డోలల్ – నళినముఖులన్ – చూడ నేత్రోత్సవమ్మే
ఈ పద్యము చోళదేశములోని ఆడవారి సౌందర్యాన్ని చిత్రీకరిస్తుంది. స్నానము చేసేటప్పుడు పసుపు పూసుకొంటారు, ఆ సమయములో వారి దేహము సంధ్యారాగములా మెరిసిపోతుంటుంది. నల్లని వెండ్రుకలలో తెల్లని పూలను ధరిస్తారు, అప్పుడు అది నల్లని రాత్రి పూట వెలిగే చంద్రుడిలా కనబడుతుంది. ఇక పోతే వాళ్ళు గలగలమంటూ పలికేటప్పుడు నిండు యౌవనము తొణికిసలాడుతూ ఉంటుంది. తరువాత వాళ్ళు ఉయ్యాల లూగుతూ ఉంటే ఆ పద్మముఖులను చూడడము నీకు కన్నుల పండుగాగా ఉంటుంది అంటాడు శ్రీరాముడు హంసతో. ఇక్కడ కవి ఆ కాలములో ఉండే లేతవయసు ఆడపిల్లల దైనందిక చర్యలు, అలవాటులు, ఇత్యాదులను సునిశితముగా పరిశీలించి చక్కగా కవితాబద్ధము చేసినాడు.
ఇత్థం హృద్యై-ర్జనకతనయాం – జీవయిత్యా వచోభిః
సఖ్యం పుష్యం – దినకరకులే – దీప్యమానైర్నరేంద్రైః
స్వైరం లోకా – న్విచర నిఖిలాన్ – సౌమ్య లక్ష్మైవ విష్ణుః
సర్వాకారై – స్త్వదనుగుణయా – సేవితో రాజహంస్యా (2.48)
సందేశమ్మున్ – జనకజకు నీ – విచ్చి కాపాడు మామెన్
నాతో నాప్తుం – డయి మనెద వీ – సూర్యవంశమ్ముతోడన్
లోకమ్ముల్ నీ – వెగిరెదవుగా – నీదు యర్ధాంగితోడన్
లక్ష్మీవిష్ణుల్ – వలెను జగతిన్ – సర్వసౌఖ్యాలతోడన్
ఇలా నీవు వెళ్ళి సీతను చూసి నా సందేశాన్ని ఆమెకు తెలియజేసి ఆమెకు నవజీవనాన్ని ప్రసాదిస్తే నాతో మాత్రమే కాదు తరతరాలకు సూర్యవంశములోని రాజులతో స్నేహము పెంచుకొంటావు. అంతే కాకుండా నీ భార్యతో హాయిగా ఎక్కడికైనా ఎగిరి వెళ్ళగలవు. మీరిద్దరు లక్ష్మీదేవి విష్ణుమూర్తులలా వెలిగిపోతారు. ఈ పద్యము ఒక ఫలశ్రుతి లాటిది. నేను చెప్పినది నీవు చేస్తే నీవు మాలో ఒకడివై పోతావు అంటాడు శ్రీరాముడు.