ఆషాఢస్య ప్రథమ దివసే

భర్తుః కంఠ – చ్ఛవిరితి గణైః – సాదరం వీక్ష్యమాణః
పుణ్యం యాయా – స్త్రిభువన గురో – ర్ధామ చండీశ్వరస్య
ధూతోద్యానం – కువలయరజో – గంధిభిర్గంధవత్యా
స్తోయక్రీడా – నిరతయువతి – స్నానతిక్తైర్మరుద్భిః – మేఘదూతం – 1.33

నీ వర్ణమ్మే – శివుని గళమం – చా గణమ్ముల్ దలంచన్
చేరేవంతన్ – త్రిజగపతియౌ – చండికేశాలయమ్మున్
దేవోద్యానం – బమరె గలువల్ – దెచ్చు గంధమ్ముతోడన్
స్నానంబాడన్ – సరసిఁ దరుణుల్ – గాలి మోసేను దావుల్

కాళిదాసు ఉజ్జయినీవాసి, అందువల్ల దూతమేఘాన్ని ఉజ్జయినీపురము చూస్తూ వెళ్ళమంటాడు. ఉజ్జయినిలోని త్రిభువనపతియయిన చండికేశ్వరుని గుడిని చూడడము మరచిపోవద్దు. అక్కడ ప్రమథగణాలు నీలకంఠుని గొంతు నీలా (నీలమేఘములా) ఉంటుందనుకొని భక్తితో దేవుని పూజ చేస్తుంటారు. ఆ దేవోద్యానవనములో ఉండే కొలనిలో యువతులు స్నానమాడుతుంటే కలువ పూవుల పుప్పొడి సుగంధాన్ని గాలి మోసుకొని వస్తూ ఉంటుంది.

వాపీచాస్మి – న్మరకత శిలా – బద్ధ సోపానమార్గా
హేమైశ్ఛన్నా – వికచకమలైః – స్నిగ్ధవైడూర్యనాలైః
యస్యాస్తోయే – కృతవసతయో – మానసం సన్నికృష్టం
నాధ్యాస్యంతి – వ్యపగత శుచ – స్త్వామపి ప్రేక్ష్యహంసాః (2.13)

అందుండెన్‌గా – సరసొకటి య – ద్దాని మెట్ట్లేమొ పచ్చల్
స్వర్ణాంభోజ – మ్మచట విరిసెన్ – గాడ వైడూర్య మేమో
ఈదేనందున్ – జలము పయినన్ – శాంతిగా హంస లెన్నో
నిన్ జూడంగా – నవదు యవియున్ – మానసోత్కంఠతోడన్

కుబేరుడు పరిపాలించే యక్షలోకపు రాజధాని యయిన అలకాపురిని చేరిన తరువాత అక్కడ నా యింటి దగ్గర ఉండే ఒక నడబావిని చూడడము మరచిపోవద్దు. ఆ సరస్సు మెట్లు పచ్చలు, అందులో బూచిన బంగారు తామరల తూడులు వైడూర్యాలు, ఆ సరసిలో ఎన్నో హంసలు ప్రశాంతముగా ఈదుతూ ఉంటాయి, నీ నివాసమేమో మానససరోవరముగా ఉండవచ్చును, కాని అక్కడి హంసలు నిన్ను చూడగానే మానససరోవరానికి వెళ్ళాలని ఆత్రపడవు, ఎందుకంటే ఆ సరస్సు ఆ మానససరోవరానికంటే యింకా గొప్పదైనది.

సందేశ కావ్యాలు


సందేశ కావ్యాల పట్టిక

కాళిదాసు మేఘదూత రచన పిదప ఎందరో కవులు సందేశకావ్యాలను వ్రాయడానికి ఉపక్రమించారు. అలాటి కావ్యాలు వందలాది సంస్కృతముతో సహా అన్ని భాషలలో ఉన్నాయి. అన్నిటిని గురించి యిక్కడ చర్చించడానికి వీలుకాదు. మందాక్రాంతవృత్తములో వ్రాసిన కొన్ని ఖండకావ్యాలలోని కొన్ని పద్యాలను మీకు పరిచయము చేస్తాను. వీటి నిర్మాణ పరికరాలు కాళిదాసు సృష్టించినవే. ఒక నాయకుడు, నాయిక ఎడబాటుతో ఉంటారు. ఒకరికొకరు సందేశాన్ని యే వాహకుని ద్వారానో పంపుకొంటారు. నేను చర్చించే దూత కావ్యాలను గురించిన వివరాలు పక్క చిత్రములో చూడవచ్చును. తెలుగులో అత్యుత్తమమ సందేశ కావ్యమయిన గబ్బిలమును గురించిన చర్చ ఈ వ్యాస శీర్షికకు పొందుపడనిది శోచనీయము. ఈ సందేశ కావ్యాలపైన ఒక సిద్ధాంత గ్రంథము కూడ తెలుగులో ఉన్నది[8]. సందేశ కావ్యాలపైన అప్పుడప్పుడు సమావేశాలు కూడ జరుగుతుంటాయి. అట్టి సమావేశ మొకటి షికాగో నగరములో కొన్ని నెలలముందు జరిగినది.

పవనదూతము :- కాళిదాసు తరువాత మందాక్రాంత వృత్తములో వ్రాయబడిన ఖండకావ్యము పవనదూతము. దీని రచయిత ధోయీ కవి. ఇతడు వంగదేశపు (గౌడ) రాజైన లక్ష్మణసేనుని (క్రీ. శ. 1179-1206) కొలువులో ఉన్నాడు. జయదేవుడు గీతగోవిందములో (గీతగోవిందము కూడ ఒక సందేశ కావ్యమే, రాధ చెలికత్తె రాధకు కృష్ణునికి మధ్య సందేశాలను అందజేస్తూ ఉంటుంది) తన సమకాలికుడైన ధోయీ కవిని కవిక్ష్మాపతి అని క్రింది పద్యములో ప్రస్తావించాడు.

వాచః పల్లవయ త్యుమాపతిధర స్సందర్భశుద్ధిం గిరాం
జానీతే జయదేవ ఏవ శరణం శ్లాఘ్యో దురూహద్రుతేః
శృంగారోత్తర సత్ప్రమేయరచనై రాచార్య గోవర్ధన
స్పర్ధీ కోऽపి న విశ్రుత శ్రు తిధరో ధోయీ కవిక్ష్మాపతిః (1.4)

పవనదూతము లక్ష్మణసేన చక్రవర్తిని గురించి వ్రాయబడిన కావ్యము. మలయపర్వత సానువులలో (నేటి కేరళ ప్రాంతము) ఉండే కువలయవతి అనే ఒక గంధర్వకన్య లక్ష్మణసేనుని శౌర్య పరాక్రమాలను గురించి విని, అతనిపైన అభిలాష పెంచుకొన్నది. మలయమారుతముతో గౌడ దేశానికి వెళ్ళి లక్ష్మణసేనునికి తన ప్రేమ సందేశాన్ని తెలుపమని వేడుకొంటుంది. దక్షిణమునుండి పూర్వోత్తర దిశలో ఉండే ప్రదేశాల వర్ణన, వంగ రాష్ట్రపు వర్ణన ఇందులోని ప్రత్యేకతలు. అందులోనుండి మూడు పద్యాలను క్రింద ఇస్తున్నాను –

తస్మిన్నేకా – కువలయవతీ – నామ గంధర్వకన్యా
మన్యే జైత్రం – మృదుకుసుమతో – ప్యాయుధం యా స్మరస్య
దృష్ట్వా దేవం – భువనవిజయే – లక్ష్మణం క్షౌణిపాలం
బాలా సద్యః – కుసుమధనుషః – సంవిధేయీబభూవ (2)

పూర్వంబందున్ – కువలయవతీ – యంచు గంధర్వకన్యా
రత్న మ్ముండెన్ – మదన శరమౌ – స్నిగ్ధపుష్పమ్మువోలెన్
చూచెన్ రాజున్ – భువనవిజయున్ – లక్ష్మణక్ష్మామహేశున్
బాలన్ దాకెన్ – కుసుమశరముల్ – మన్మథుండేలె నామెన్

మేఘదూతములో మేఘాన్ని తన భార్యను చూడడానికి దూతవు కమ్మని పురుషుడైన యక్షుడు అడిగాడు, కాని యిక్కడేమో కువలయవతి అనే ఒక యువతి, లక్ష్మణసేనుని గుణగణాదులను విన్న తక్షణము ముగ్ధురాలై అతనిని వరించి, పవనుని దూతగా పంపింది. ఇది love at first hearing!

వీక్ష్యావస్థాం – విరహవిధురాం – రామచంద్రస్యహేతోర్
యాతః పారం – పవన సరితాం – పత్యురప్యాంజనేయః
తత్తాతస్యా -ప్రతిహతగతేర్ – యాస్యతస్తే మదర్థం
గౌడీక్షౌణీ – కతి ను మలయ – క్ష్మాధరాద్యోజనాని (5)

రామావస్థన్ – విరహ వ్యధలన్ – జూచి యా కారణానన్
దాటెన్ గాదా – పవనసుతు డా – యంబురాశిన్ బిరానాన్
నాకై నీవున్ – వడిగ పవనా – వెళ్ళలేవా దయాత్మా
ఆ గౌడమ్మో – మలయ గిరికిన్ – దూర మేమో యెఱుంగన్

రాముని వియోగాన్ని తెలుపడానికై నీ కుమారుడు హనుమంతుడు సముద్రాన్ని దాటాడు, అలాగే నీవు నాకోసం గౌడదేశము వెళ్ళి ఆ రాజుకు నా వలపుతలపులను తెలుపలేవా అని అడుగుతుంది. అంతే కాదు ఆమెకు మలయగిరినుండి వంగదేశము ఎంత దూరమో కూడ తెలియదు.

గంగావీచీ – ప్లుతపరిసరః – సౌధమాలావతంసో
యాస్యత్యుచ్చై – స్త్వయి రసమయా – విస్మయం సుహ్మదేశః
స్రోత్రక్రీడా – భరణపదవీం – భూమిదేవాంగణానాం
తాళీపత్రం – నవశశికలా – కోమలం యత్ర యాతి (27)

గంగాతీర – మ్మదియు నలలన్ – పొంగె సౌధాల నీడన్
సుహ్మాదేశ – మ్మతి సొబగుతో – విస్మయించున్ గదా నిన్
భూమీదేవీ – ప్రియ మహిళలున్ – రాణు లుంచేరు కమ్మల్
కర్ణాలందున్ – శశికళలతో – తాళపత్రమ్ము వోలెన్

లక్ష్మణసేనుడు ఉండే ప్రాంతానికి సుహ్మ అని పేరు, ఇది మహాభారతములో కూడ కనిపిస్తుంది. ఆ సుహ్మాదేశములో రాణులు ఎలా తాటాకులాటి కమ్మలను తొడుగుకొంటారో అనే విషయము పై పద్యములో వివరించబడినది.