మేఘదూత కావ్య రచనకు కాళిదాసు ఎందుకు మందాక్రాంత వృత్తాన్ని ఎన్నుకొన్నాడు అనే ప్రశ్న మన కెదురవుతుంది. దుఃఖముతో బాధపడుతూ ఉండే మనిషి మాటలాడుతుంటే ఆ మాటలు ఆగి ఆగి ఆ వ్యక్తి నోటినుండి జారుతాయి, అవి విరామము లేకుండా ఏకధాటిన రావు. అంతే కాక మొదటి పదాలు దీర్ఘమైన అక్షరాలతో ఉంటాయి, ఉదా. అమ్మా, అబ్బా, అయ్యో, యిత్యాదులు. ఆ కాలములో సామాన్యముగా వాడబడిన పొడవైన వృత్తాలు శార్దూలవిక్రీడితము, స్రగ్ధర. శార్దూలవిక్రీడితపు పాదములోని విరుపు పన్నెండు అక్షరాల తరువాత వస్తుంది. కాబట్టి దీనికి ప్రయోజనము ఉందదు. స్రగ్ధరకు, మందాక్రాంతానికి ఉండే పోలికలను గురించి తరువాత చర్చిస్తాను. స్రగ్ధరలో పాదపు విరుపు ఏడక్షరాల తరువాత వస్తుంది. కాబట్టి యిది కూడ కాళిదాసుకు ప్రయోజనకారిగా కనబడలేదు.
కాళిదాసు తన భావాలను వెలిబుచ్చడానికి మందాక్రాంతమే సరియయిన వృత్తమని అనుకున్నట్టున్నాడు. అంతకుముండు ఈ వృత్తము రెండు మారులే వాడబడినది. పింగళఛందస్సులో ఇది సూత్రప్రాయముగా వివరించబడినది, నాట్యశాస్త్రములో దీనికి ఉదాహరణ శ్రీధరా అనే వృత్తరూపములో ఇవ్వబడినది. తరువాత హరిసేనకవి దీనిని ప్రయాగప్రశస్తిలో వాడాడు. ఈ హరిసేనుడు కాళిదాసుకు బహుశా గురుతుల్యుడై ఉండవచ్చును. ముఖ్యముగా మందాక్రాంతములోని విరుపులు తగిన మోతాదులో ఉన్నాయి తన కార్యానికి అనుకొన్నాడేమో కాళిదాసు. ఫలితము అంతవరకు ఛందఃశాస్త్రములో ఒక తాటాకుపైన మాత్రమే ఉన్న ఈ వృత్తానికి ఒక అజరామరమయిన ఖ్యాతి లభించినది. అంతేకాక కాళిదాసు మందాక్రాంతానికి మరో పేరుగా చలామణి అయ్యాడు. విప్రలంభ శృంగారాన్ని వర్ణించడానికి మందాక్రాంతము ఉచితమని కాళిదాసు అభిప్రాయపడ్డాడు.
అందుకే క్షేమేంద్రుడు సువృత్తతిలకములో[4] ఇలాగంటాడు:
సాక్షేప క్రోధ ధిక్కారే
పరం పృథ్వీ భరక్షమా
ప్రావృట్ ప్రవాసవ్యసనే
మందాక్రాంతా విరాజతే (3.21)
కోపాన్ని, ధిక్కారాన్ని సూచించడానికి పృథ్వీవృత్తము ఉచితమైనది, అది ఈ భారాన్ని మోయగలదు. వర్షాకాలములో ప్రవాసములో విరహానుభవాన్ని వివరించడానికి మందాక్రాంతము చక్కగా శోభిస్తుంది.
సువశా కాలిదాసస్య
మందాక్రాంతా ప్రవల్గతి
సదశ్వదమకస్యేవ
కాంభోజ తురగాంగనా (3.34)
కాళిదాసుకు బాగుగా వశమయిన మందాక్రాంతము మంచి గుఱ్ఱపురౌతుకు అధీనముగా ఉండే కాంభోజ దేశపు ఆడ గుఱ్ఱములా ప్రవర్తిస్తుంది.
మనకు సులభముగా అందుబాటులో ఉండే సందేశకావ్యములలో మేఘదూతము ఒకటి. సంస్కృత పద్యాల తెలుగు ప్రతి ఈమాటలో వున్నది. మూల సంస్కృతముతో విల్సన్ మహాశయుని ఆంగ్లానువాదమును ఇక్కడ చదువ వీలగును. మరొక ఆంగ్లానువాదము యిక్కడ ఉన్నది. తెలుగు టీకాతాత్పర్యాలతో శరత్ బాబు, శారదాపూర్ణ శొంఠి[5] ఒక ప్రతిని ప్రచురించారు. తెలుగులో రాయప్రోలు సుబ్బారావు మేఘదూతాన్ని యతిప్రాసలు లేని మత్తేభవిక్రీడిత వృత్తములో దూతమత్తేభముగా[6], శంఖవరం రాఘవాచార్యులు మాత్రాగణములతో షట్పదలుగా[7] అనువదించారు.
సంగీత మేఘదూతము
మేఘదూతమును ఒక సంగీత రూపకముగా సంస్కృతములో బాలాంత్రపు రజనీకాంతరావు నిర్దేశములో, వారి, బాలమురళీకృష్ణల గాత్రముతో ఇదే సంచికలో వినవచ్చును. మేఘదూతపు పద్యములను విశ్వమోహన్ భట్ సంగీత నిర్దేశకత్వములో హరిహరన్, కవితా కృష్ణమూర్తి (సుబ్రహ్మణ్యన్), రవీంద్ర సాఠే పాడిన కొన్ని పద్యములను ఇక్కడ వినవచ్చును. ఇంటర్నెట్‌లో మేఘదూతములోని కొన్ని పద్యాలను వినవచ్చును. (కశ్చిత్కాంతా విరహగురుణా; ఆషాఢస్య ప్రథమ దివసే; ధూమర్జ్యోతి సలిల మరుతాం; తత్రాగారం ధనపతిగృహా.)
అలాగే హేమంత ముఖర్జీ (కుమార్) పాడిన కొన్ని పద్యములు; వ్యాఖ్యలతో సంపూర్ణ మేఘదూతము ఆన్‌లైన్‌లో మనకు లభ్యమౌతున్నాయి. గుస్టాఫ్ హోల్స్ట్ (Gustav Holst) స్వరపరిచిన The Cloud Messenger మేఘదూతము యొక్క స్ఫూర్తియే.
కొన్ని మేఘదూత మందాక్రాంతములు
నేను క్రింద మేఘదూతములోని కొన్ని మందాక్రాంత వృత్తాలను పరిచయము చేస్తాను. వాటి తెలుగు అనువాదాలు కూడ యతి ప్రాసలు లేని మందాక్రాంతములో ఉన్నాయి. నేను ఉదహరించే పద్యాలను చదివేటప్పుడు ఎక్కడ ఆగాలనేది పాదముల విరుపును ఒక అడ్డగీతతో సూచిస్తున్నాను.
కశ్చిత్ కాంతా – విరహగురుణా – స్వాధికారాత్ప్రమత్తః
శాపే నాస్తాం – గమితమహిమా – వర్షభోగ్యేణ భర్తుః
యక్షశ్చక్రే – జనకతనయా – స్నానపుణ్యోదకేషు
స్నిగ్ధచ్ఛాయా – తరుషు వసతిం – రామగిర్యాశ్రమేషు (1.01)
శాపగ్రస్తుం – డయెగ నకటా – యక్షు డొక్కండు బాధన్
ఆజ్ఞాపించన్ – వరుస మొకటిన్ – వీడి భార్యన్ దనుండెన్
లేలేనీడల్ – తరువు లొసగన్ – రామగిర్యాశ్రమానన్
స్నానమ్మాడెన్ – జనకజ యటన్ – పుణ్యమౌ నీరమందున్
ఇది మేఘదూతములోని మొదటి పద్యము. యక్షుడొకడు ఏదో ఒక తప్పు చేసి తన ప్రభువైన కుబేరుని ఆగ్రహానికి గురి అయ్యాడు. కుబేరుడు యక్షుని ఒక సంవత్సరము యక్షలోకమునుండి మానవలోకానికి పంపాడు. కైకేయి వరము వలన ఎలా రాముడు వనవాసము చేసాడో అదే విధముగా యక్షుడు కూడ వనవాసము చేస్తున్నాడు. అతడు ఆ వనవాసాన్ని చేసే చోటు పేరు కూడ రామగిరియే. ఆ రామగిరి ప్రాంతములో ఒకప్పుడు శ్రీరాముడు కూడ సీతాలక్ష్మణులతో కాలము వెళ్ళబుచ్చాడు. సీత అక్కడ ఉండే జలాశయములో స్నానము కూడ చేసిందంటాడు కాళిదాసు. ఒకే పద్యములో రామాయణానికి మేఘదూతానికి ఉండే సంబంధాన్ని కవి వివరిస్తాడు. రెండు కథలకు ఒక తేడా మాత్రము ఉన్నది, అదేమంటే కొన్నేళ్ళైనా సీతారాములు ఇద్దరూ అడవిలో కాలము గడిపారు. కాని యక్షుడు తన భార్యను తలుస్తూ సంవత్సరమంతా ఏకాంతముగా గడపాలి.
తస్మిన్నద్రౌ – కతిచిదబలా -విప్రయుక్తః స కామీ
నీత్వా మాసాన్ – కనకవలయ – భ్రంశరిక్తప్రకోష్ఠః
ఆషాఢస్య – ప్రథమదివసే – మేఘమాశ్లిష్టసానుం
వప్రక్రీడా – పరిణతగజ – ప్రేక్షణీయం దదర్శ (1.02)
బేలన్ వీడెన్ – గృశుడుగ నయెన్ – జారె నా కంకణమ్ముల్
ఆ శైలానన్ – నెలల గడిపెన్ – కామి యేకాంతమై తాన్
ఆషాఢంలో – మొదటి దిన మా – కొండపై మేఘమాలల్
మత్తేభమ్మా – పృథివి వడిగా – కొట్టి యాడినట్లుండెన్
నాకు నచ్చిన పద్యము ఇది. అందుకే ఈ వ్యాసానికి ఆషాఢస్య ప్రథమదివసే అని పేరుంచాను. ఎప్పుడు భార్యను తలుస్తూ ఆ విరహ వ్యధలను అనుభవిస్తూ యక్షుడు చిక్కిపోయాడు. కుబేరుని కొలువులో ఉండే అతనికి స్వర్ణాభరణాలకు తక్కువా? కాని ధరించిన బంగారు కడియాలేమో అతని చిక్కిపోయిన చేతులనుండి జారిపోతున్నాయి. శృంగారము రెండు విధాలు – సంభోగము, విప్రలంభము. వియోగశృంగారానికి పరాకాష్ఠ మేఘదూతము. కొండ చుట్టూ ఆషాఢమేఘాలు ఆవరించుకొన్నాయి. ఏనుగులు ఒక గోడను లేక భూమిని ఢీకొన్నట్లు మేఘాలు కొండను ముట్టుకొన్నాయంటాడు కవి యిక్కడ.