వేసంగి గురించి కవితను ‘వేసవి’ అని ప్రవేశపెడ్తున్నారు కవి; ఆదివారం మధ్యాహ్నాలు అని కవయిత్రి ఆదివారం మధాన్నాల్ని ప్రవేశపెట్టినట్లే.
కాలం కదలదు, గుహలో పులి
పంజా విప్పదు, చేపకు
గాలం తగలదు.
వేగంగా నడుపుకుంటూ వచ్చిన బండిని ఎదుట పెద్ద ఆటంకం ఉందని గ్రహించుకొని హటాత్తుగా బ్రేకులు వేసి ఆపినట్లుండే నడకను ఎంచుకున్నారు. ఆ బండరాయి వేసవి. ఇలా ఊహిస్తే మనసులో చప్పున స్ఫురిస్తుంది:
తానం తనతన, తందనాన
తానం తనతన, తకధిమి
తానం తనతన.
అతివేలము, పరాక్రమవంతమైన జాంతవ శక్తికీ, విజయానికీ ప్రతీక పెద్దపులి. ఆ పులి సైతం పంజా విప్పదు. ప్రపంచాన్ని, జీవితాన్నీ శాసించే కాలమే ఆగిపోయింది. గేలం వేసి చేప కోసం ఎదురుచూపులు చూసేది ఆశ. భవిష్యత్తు అగోచరం కాబట్టి మామూలు సమయాల్లో అయితే మానవ ప్రయత్నపు గేలానికి ఏ చేపైనా దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు అలాక్కాదు. కవి గేలానికి ఏ చేపా తగలదు సుమా అని ముందే ప్రకటిస్తున్నాడు. గొప్ప శక్తి, నిరంతరమైన ప్రయత్నం, కాల యంత్రం – ఈ మూడూ వేసంగి ధాటికి దాసోహమని కనీసం ప్రయత్నమైనా చెయ్యకుండా నిలబడిపోయేయి. ఈ కవితా శకలాన్ని మనో రంగం మీద మళ్ళీ నిర్మించుకుంటున్న దృశ్యానికి సరంజామా నా చిన్నప్పటి స్మృతుల్నుండే వస్తుంది. వందలేళ్ళు పాతది ఒక వీధి. అక్కడ బుగ్గి, మెట్లంగి దారి దూరానికి వెళ్ళి కాళ్ళు చుర్రుమనే తార్రోడ్డుతో కలుస్తోంది. ఆ దారి అలా మైళ్ళు మైళ్ళు పోతే అక్కడ బోర్లించినట్టు నిజంగానే ఒక ఎండల్లో మాడే బోడి కొండ, ఎండలో కాగిపోతూ ఆకాశం అంతా నిండిపోయి నున్నటి బండ, ఆ బండల కింద ఒక కొండ గుహ. ఆ గుహలో నిజంగానే పులుందని ప్రతీతి; అదే మాగన్నుగా పడుక్కున్నట్టుండి పంజా విప్పకుండా సోలిన పెద్దపులి. అడివికి వెళ్ళే దారిలో నీళ్ళు అడుక్కి ఇంకిపోతూ పెద్ద బంద. అక్కడ చెట్లకింద రోజంతా బుట్ట వలలు బోర్లించి జల్లిస్తూ చేపల కోసం పడిగాపులు పడుతున్న జాలారి గుంటలు.
ఈ పల్లవి కేవలం మూడు దృశ్య రేఖలతో మొత్తం కవిత ఔద్వేగిక ఆవరణను అద్భుతంగా నిర్మించి, కవిత పొడుగునా మళ్ళీ మళ్ళీ క్రమం తప్పకుండా ప్రత్యక్షమౌతూ చదువరికి వేసవి తెచ్చిపెట్టిన బలవంతపు నిలకడనూ, అతని అశక్తతనూ మరిచిపోనివ్వకుండా జ్ఞాపకం చేస్తుంది. మధ్యాన్నం మంటల జుత్తు విరబోసుకుని నగ్నంగా రోడ్లమీద తిరుగుతున్న పిచ్చిది. ఆ మంటల జుత్తు అదివరకటి పాదంలోని సూర్యుడి తలలో కదిలిన పెను మంటలనుండి అంటుకున్నది. ఆ మంటలు పల్లవిలో చరణాల్లో కవి వర్ణిస్తూ వస్తున్న నిశ్శబ్దాన్నీ, స్తబ్దతనూ పోనీ కనీసం వాటి మానాన్న వాటిని పడుండనివ్వకుండా ‘అంటించు’తున్నాయి. నిశ్శబ్దానికి అగ్గి అంటుకుంది. ఆ తరువాతి పాదంలో నిజంగానే ఇలాంటి పిచ్చి మనిషి కూడా ప్రత్యక్షమౌతుంది. ప్రతి ఊళ్ళో ఇలాంటి పిచ్చిది ఒకర్తే, వెర్రివాడొకడూ పరిచితమైన మనుషులు. బిచ్చగత్తె ఎండ దెబ్బకి వెర్రిగా అరిచింది. ప్రకృతిని శాసించే మానవ యంత్రాంగానికి ప్రతీక పంకా. ప్రకృతిని ధిక్కరించే మానవ ప్రయత్నానికి, వనరులకూ ప్రతీక శ్రీమంతుడు. సాక్షాత్తూ ఆ యంత్రం కింద అంతటి విజయుడూ వేసంగి పంజా దెబ్బకి చచ్చూరుకున్నాడు! సగటు కవికీ, అతని పాఠకులకూ మండు వేసవి తప్పనిసరిగా తీసుకువచ్చే బహుమతులు, ఆనందాలూ – శలవులూ, ఈతలు, మామిడి పళ్ళు, ఐసులు, తాటి ముంజెల్ని తిలక్ వేసవి తీసుకొని రాదు. ఆయన ఊహా వైచిత్రి, కల్పనా శక్తి అసాధారణమైనవి. వాటినుండి ఉద్భవించే తిలక్ వేసవి అశక్తతనూ, అర్ధంలేని నిశ్శబ్దాన్నీ, చావునూ, వెర్రి కేకల్నీ, మానవ ప్రపంచపు నిశ్చేష్టనూ ప్రతి పాదంలోనూ ‘ఎక్కడికక్కడ అలాగాగండి!’ అని అనుశాసిస్తూ ఎండ మంటల జుట్లు విరబోసుకుని, నగ్నంగా పిచ్చిదాన్లాగా వస్తుంది. ఇంతటి శక్తివంతమైన వేసవి వర్ణన ఇంకెక్కడైనా ఏ భాషలోనైనా ఉందా అని వెదుకుతున్నాను.
కాని ఇంత రమ్యమైన కవితలోను ఔచిత్య భంగం ఒకటి తోస్తుంది. తిలక్‌కు లయ చాల ఇష్టమని ఆయన కవిత్వం నుండి తెలుస్తుంది. పైన చెప్పినట్టు కావలసిన మూడ్‌కు అనువైన నడకను ఎన్నుకొని దానితో చాకిరీ చేయించుకుంటారు. కవితకు ఎంచుకున్న నడక ఏ కవికైనా ఏక కాలంలోనే గొప్ప వెసులుబాటు, గొప్ప ప్రతిబంధకం కూడా. ఈ భాగం:
కొండ మీద తారలు మాడెను
బండ మీద కాకులు చచ్చెను
అనేదాన్లో రెండు పాదాల్లోనూ, ముఖ్యంగా ‘బండ మీద కాకులు చచ్చెను’ అనే రెండవ పాదంలో ఇబ్బందిగా, కొట్టొచ్చినట్లు ధ్వనించేవి కవి తన వస్తువునూ, తన నిర్వహననూ తానే చులకన చేస్తున్నారేమా అని తోపించే నిర్మమత, ఒకలాంటి ఔద్వేగిక అశ్రద్ధ (cavalier attitude). ఈ చులకనపాటు అనవసరంగా ఎంతో సమున్నతంగా, ఉదాత్త గంభీరంగా నిర్మిస్తూ వస్తున్న ఔద్వేగిక ఆవరణను కవి చేజేతులా తనే ఫెడీమని తన్ని వికలం చేస్తున్నట్టు చిందర వందర చేస్తున్నాది. ఈ రెండు పాదాల్నీ అలా ఉంచెయ్యదానికి తిలక్ వంటి కవికి ఎలా మనసొప్పిందోనని ఆశ్చర్యంగా, అపనమ్మకంగా ఉంటుంది.
ఇప్పుడు తిలక్‌దే సంధ్య, ఏమీ ఎంచిపెట్టడానికి అవకాశం లేని కవిత. సాయంకాలపు సంధ్య చాల రమణీయంగా సంజె వన్నెల బాల అనే పాప పరికిణీ చెంగులా వచ్చి చీకటిని తాకిందట. రెండు కళ్ళూ విప్పార్చి చూస్తున్న ఆ బాల చెక్కిళ్ళు విరిసిన చెంగల్వ వన్నె ఎరుపు. ఆ సమయంలో గగనం ‘ఒక రేకు’. అది ఏం రేకు? ఎవరి కన్నుగవల సోకు? ఇవి కవి విడమరచి చెప్పరు. పాఠకుడే నిర్మించుకోవాలి. రేకు అంటే లోహంతో చేసిందనే కాదు; జలతారు, కాగితం, నేత బట్ట, పూల రెక్కా – ఇలా పల్చనిది ఏదయినా రేకే. నాకు – సంధ్యాకాశం ఒక రాగీ బంగారం కలనేసిన జలతారు రేకు. ఆ నేపధ్యంలో సూర్య చంద్రులను ఏకకాలంలోనే విప్పార్చుకొని చూస్తున్న సంధ్యా బాల రెండు కన్నుల సోకు. మండుటెండ, నీరెండ, మబ్బుటెండ, మబ్బు నీడ, క్రీనీడ, మునిమాపు, గుడ్డి వెలుతురూ, కటిక చీకటీ ఇలాగ చాల విభిన్నమైన దృశ్యాల్ని వాటితో పెనవేసుకొని ఉండే ఔద్వేగిక ఆవరణలనూ కొన్ని నిమిషాల వ్యవధిలో వెనువెంటనే తొందర తొందరగా ఆవిష్కరిస్తూ చీకటిగా తెర దింపడం కేవలం సాయంసంధ్యకు మాత్రమే ప్రత్యేకమైన అనుభవం. ఈ అనుభవాన్ని, contrastను యావత్తూ కొన్నే పాదాల్లో అందిపుచ్చుకొని, ఆవిష్కరించడం కవి సంకల్పం.
మొదటి పద్యం నెమ్మదైన నడకతో మొహమాటంగా సంధ్యా బాలను తెచ్చి పరిచయం చేసిన తరువాత, రెండవ పద్యం ఆ పాప పరికిణీ కుచ్చిళ్ళు ఎత్తి చెంగుచెంగున గెంతుతూ వస్తున్నట్టు:
వాలు నీడల దారి నీలి జండాలెత్తి
చుక్క దీపపు వత్తి సొగయు బాటలనల్ల
నిదుర తూలెడి నడక గదుము మైకపు కోర్కె
వచ్చు నిశిలో కరగి నవ్వు శశితో కలసి
సంజె వన్నెల బాల రంగు రంగు రుమాలవిసిరింది కలలల్లు
వెండి తోటల మధ్య
వ్రాలినది వ్రాలినది తావిగా
సోకినది సోకినది.
నిద్రకు తూలుతోందా అన్నట్టుండే నడకతో, అతిశయించిన మైకపు కోర్కెలతో వచ్చేది నిశి. ఆ రెండు చిత్రాల్లోనే కనుపట్టే రాత్రి ఒక మత్తురాలు. నక్షత్ర దీపం బాటల్ని వెలిగిస్తోంది. సంజె బాల నీలి నీలి నీడల జెండాలూపుతూ, రంగు రంగుల రుమాలు విసురుతూ ఆ బాటలవెంట పరుగెత్తి వచ్చి, అంతలోనే ఆ నిశిలో కరిగి – అంటే తానే నిశిగా పెద్దదైపోయి, నవ్వుతున్న శశితో కలసిపోతోంది. త్వరితమైన ఈ మార్పును సినిమాల్లో చాయాగ్రాహకులు పట్టుకునేటట్టుగానే సంధ్యా బాలను నిశి అనే యువతిలోనికి నెమ్మది క్రమంగా morph చేస్తూ, రంగు రంగుల వెలుతుర్లని నీడలుగా ‘వ్రాలినవి వ్రాలినవి సోలినవి సోలినవి’ అని అద్దినచోటే రంగులద్దుతూ పునరుక్తులతో పట్టుకుంటున్నారు కవి.
చాలు అంటే ధార. స్వర్ణది ఆకాశ గంగ. సంజె వన్నెల చాలు బంగారు గంగ (స్వర్ణ స్వర్ణది) ధారట. సంధ్య ఎర్రని పెదవుల ఎరుపు కడలి అంచుల్లో ప్రతిఫలిస్తోంది. ఆమె పరికిణి చెరగు చూపరుల గుండెల్లో మెరుస్తోంది. పొద్దుటంతా అలసిపోయి ఇళ్ళకు పోయే ఏటి కొంగల నిదుర కళ్ళ ఎరుపు సంజె ఎరుపు జీరల్లో కలసిపోతోంది. బాతులు ఎగరబోతే వాటి రెక్కల నీడ బరువు, బరువుగా నిశిలోకి వాలిపోతున్న సంధ్య నిష్క్రమణకు తెర తీస్తున్నాది. సంధ్య అనే చలాకీ అమ్మాయి కళ్ళు విప్పార్చుకొని రంగు రంగుల రుమాళ్ళతో ఆడుతూ త్రుళ్ళిపడుతూ వచ్చి చూస్తుండగానే పెరిగి పెద్దయిపోయి జాబిలి నవ్వుల్లో కలసి, నిశి అనే ప్రౌఢగా పరిణత అయ్యి చెప్పా పెట్టకుండా నిష్క్రమించింది. ఈ సంధ్యకు ఒక ఊరని లేదు. ఈమె అన్ని తరాలకూ, అన్ని కాలాలకూ మనుషులందరికీ బాగా దగ్గరగా పరిచయమైన సంజె బాల. రాత్రేమో నల్లగా వయసు మైకపు జీర కమ్ముకున్న మదవతి. ఈ బాల ఆ ప్రౌఢగా క్రమించి కళ్ళముందే నిష్క్రమిస్తే కవికి, ఆయన పాఠకుడికీ మిగిలేది చాల పరిచితమైన గుండె బరువు. ఇంట్లోన, చుట్టూ ఆడపిల్లలు ఇలాగే అమాయకంగా ఆడుతూ పాడుతూ అంతలోకే ఎలాంటి సూచనా లేకుండా పెద్దరికం లోనికి మాయం అవుతారు. అందరికీ పరిచితమైన ఈ జీవితానుభవాన్ని తను అల్లే సంధ్యా చిత్రపు ఔద్వేగిక ఆవరణకోసం నవ్యమైన ప్రతీకగా వాడుకుంటున్నారు. కవిత సాంతం స్పష్టాస్పష్టమైన చిత్రాలతో కట్టినది. మళ్ళీ మళ్ళీ చదివి లోతుగా ఆలోచించి, అన్వయం చేసుకుంటే తప్ప సంధ్యా బాల తెరచాటు స్నిగ్ధత, తుళ్ళిపడుతూ వచ్చే పెంకితనం గోచరించవు. పారదర్శకమైన పరదాల వెనుక వాస్తవంగానే పరిచితమైన సంధ్యా ‘బాలిక’ శిల్పం, ఆ తెరచాటు బాల పఠకుని కళ్ళెదుటే అలా పెరిగి పెద్దదయి కాంక్షల మైకపు జీరలు కమ్ముకున్న నిశిగా శలవు తీసుకొనే వైనాన్ని చెక్కి, ప్రాణ ప్రతిష్ట చేసి, సంధ్యా బాలను ప్రౌఢ నిశిగా క్రమంగా morph చేసే తీరు చాల హృద్యంగా ఉన్నాది. ఎన్నెన్ని కాగడాలు పెట్టి ఎంతగా వెదికినా ఈ అద్భుతమైన కవితలో ఎంచిపెట్టడానికి ఏమీ కానరాదు. ఈ తరహా కవితలు – అంటే కనీ కనపడనట్టు మెరిసి మాయమౌతూ వినీ వినపడనట్టు గుసగుసలు పోతుండే కవితా స్వరూపాలు – తెలుగులోన ఉన్నాయా అంటే ఏమీ తోచవు.
ఔచిత్య భంగాలు రెండు ప్రస్ఫుటంగా కనిపించే కవితకు ఇంగ్లిష్ నుండి ఒక ఉదాహరణ కార్న్‌ఫర్డ్ (Frances D. Cornford) కవిత Autumn Evening అని.
Just the shadows leaping up the wall,
The sparrows twittering; and that is all.
అని ఫ్రెష్‌గా ఉండే పద చిత్రాల్ని రెండిట్ని పక్క పక్కన పేర్చి, ‘అంతే, మరేం లేదు’ అని ముక్తాయించి, తిలక్ వేసవి కవిత మకుటం లాగానే ఈ రెండు వాక్యాల్నే మళ్ళీ మళ్ళీ వాడుకుంటూ శిశిరపు సాయంకాలాల్ని కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తారు. కాని రెండు చోట్ల కేవలం ప్రాస కోసమా అన్నట్టు అశ్రద్ధగా పాదాల్ని పూర్తి చేసి కవిత ఔద్వేగిక ఆవరణను భంగం కాదు కాని, బలహీనం చేస్తారు. ఇవి రెండవ పాదం And I upon the old red sofa lying అనేదీ, ఐదవది I thought to send my soul to far-off lands అని ఈ రెండూ. కవి పాత ఎర్ర సోఫాలో పడుక్కుని ఉండటం dying -lying అనే మాటలకు ప్రాసనయితే సాధిస్తున్నాది కాని, మిగతా మూడు పాదాల్లో వెలుతురు వాలిపోతూ నీడలు గోడల మీద పాకుతూ పిచికలు కిచకిచలాడుతూ రూపిస్తున్న దృశ్యపు ఉదాత్తతతో విభేదించి, moodని బలహీనం చేస్తాయి. కవి తన ఆత్మను దూర దేశాలకు పంపిద్దామని అనుకున్నాను అన్నది ఆ తరువాత వచ్చే మూడు పాదాల బలం వలన కొంత వరకు ఒప్పుతుంది కాని ఆ ఊహను ప్రకటించిన పద్ధతి send my soul to far-off lands అనేది ఎక్కడా కనీవినీ ఎరుగనిది, చులకనపాటుగా అనుచితమైన ప్రయోగం, కవితాత్మకంగా లేదు.
చివరిగా ఇంగ్లిష్ నుండి ఈ మూడు కవితలు, కవికి చాల వ్యక్తిగతం, ఆంతరంగికమైన దనిపించే ఔద్వేగిక ఆవరణను ప్రతిపాదించి, నిర్మించడంలో చాల నిపుణమైనవని అనిపించేవి: బ్రాడ్స్కీ కవిత The Song; డుగన్ కవిత Love Song: I and Thou అని; మూడవది ఇదివరకే చెప్పినది అడొనిౙయో కవిత What Do Women Want? అనీ. ఈ కవితలన్నీ నాకు మొదటిసారి చూడగానే మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపిస్తాయి. బలంగా కుదిపే సృజనలని, ముఖ్యంగా కవితల్ని చదివి, వటిని మనసులో నిలుపుకునేటప్పుడు ఆ కవిత ఆత్మను అంటే spiritను పరిపూర్ణంగా ప్రతిబింబించేలా ఒకే ఒక్క మాటను కట్టుకోవటం సాధ్యమౌతుంది. అంటే మనకు నచ్చిన దినుసులు, సామాన్లూ అలమరల్లో పేర్చుకునే ముందు వాటి మీద ఒక లేబిల్‌లాగ రాసి పెటుకున్నట్టు. ఇలా ఈ మూడు కవితలకూ పేర్లు పెట్టుకోవాలంటే నాకు తట్టే పేర్లు మొదటిదానికి వియోగంలోని బెంగ; రెండవదానికి వివాహ బంధం; మూడవదానికి కాంక్ష.
(ఇంకా ఉంది)