విజయ విలాసంలో సాయంకాల వర్ణనను చేమకూర వెంకటకవి అర్జునుడు, చిత్రాంగదల ప్రణయ సన్నివేశానికి వేదికను సమాయత్తం చేసే సందర్భంలో హృద్యంగా వాడుకుంటారు.
అంగజరాజు పాంథ నిచయంబులపై విజయం బొనర్ప నేఁ
గంగఁ దలంచునంత మునుఁగల్గఁగ దాసులు వట్టు జాళువా
బంగరు టాలవట్టముల భంగిఁ గనంబడెఁ బూర్వ పశ్చిమో
త్తుంగ మహీధరాగ్రములఁ దోయజశాత్రవ మిత్ర బింబముల్.
మన్మధుడనే రాజు పాంథ నిచయంబులు – అంటే విరహులనే మార్గస్థుల మీద విజయం సాధించడానికి సాయంత్రమే అనువైన సమయమని దండెత్తి వెళ్తున్నాడు. ప్రేమికుల మీదికి ఆయన దండయాత్రకు పోయే రధానికి ముందు సేవకులు పట్టుకుని నడిచే మేలిమి బంగారు ఆలవట్టములా అన్నట్టు తూర్పునా, పడమటా ఎత్తైన పర్వత సాణువుల మీద ఏక కాలంలోనే సూర్య బింబమూ, చంద్ర బింబమూ రెండూ ఎదురొస్తున్నాయట. ఆలవట్టములంటే ఛత్ర చామరముల వంటి రాజ చిహ్నాలు. బలవంతులైన రాజులు మార్గస్థుల సంపదల్ని యదేఛ్ఛగా కొల్లగొట్టుకోవటం కవి కాలంలో సకృత్తుగా ఉండేదట. మన్మధుడు ఈ దోపిడీకి సాయంకాలమే అదనైన సమయమని బయల్దేరుతున్నాడు. సూర్య చంద్ర బింబములు రెండూ అతని ఆలవట్టములు. అతను దోచుకొనేవి విరహుల హృదయాలను. కవి – పాఠకుల అంతరంగ లోకంలో మన్మధుడు ఎలాగయితే ప్రణయ దండయాత్రకు పోతున్నాడో ఆ వెనుకనే కావ్య రంగంలో అర్జునుడు నిజంగానే తన ప్రేయసిని కలుసుకోడానికి అలాగే రధం మీద పోబోతాడు. సాయంసంధ్య ప్రకృతినీ, విరహమనే ఆంతరంగికమైన హృదయావస్థనూ, ఎదటి సన్నివేశాన్నీ అనుసంధానం చేస్తూ చాల రమ్యంగా త్వరలో రానున్న ప్రణయ సందర్భానికి శయ్యను సిద్ధం చేస్తున్నారు కవి.
ఆముక్తమాల్యద లోని వర్షర్తు వర్ణన ఇంకా చాకచక్యంతో ప్రకృతి, ప్రవర్తన, అంతరంగాలు మూడింటినీ ఏకకాలంలో మార్చి మార్చి వర్ణిస్తూ పాఠకుని దృశ్యాభాసలోన వాన అనే ఔద్వేగిక అనుభవాన్ని గొప్ప పరాకాష్టకు తీసుకొనిపోతుంది. వానాకాలపు సాయంత్రాలకు నైసర్గికమైన వాతావరణం నుండీ, మనుషులు, పక్ష్యాదుల ప్రవర్తనల నుండీ వినూత్నమైనవి, మొత్తం వాన రాత్రిని కళ్ళకు కట్టించే పదచిత్రాలను చాల వివేకంతో ఏరుకొని, పక్క పక్కన పేరుస్తూ
ఎలగోలు జల్లు మున్ బెళబెళ నేటవా
ల్పడి గాలి నట్టిండ్లఁ దడిపి చనగ
నట్టె తో వడగండ్ల కట్టవులు దుమార
మావులు రేఁచి రెండవదియుఁ జన
మఱి మూఁడవది నిల్చి మెఱసి బిట్టుఱిమి శీ
కరవారి సృష్టిఁ జీకటిగ నలమ
నుయ్యెల చేరుల యోజఁ బై పై వెండి
జల్లుపై జల్లు పెల్లల్లుగొనఁగభూభిదాపాది దుర్భరాంభోభరంపు
వడి మరుజ్ఝంఝ దెరలక కడవ వంచి
నట్లు హోరని ధారౌఘ మైక్యమొంది
విన్ను మన్నును నొకటిగా వృష్టి బలిసె.తడితల డిగ్గి ముంప జడతం దుదఱెప్పలఁ గన్నువిప్పి పు
ల్పొడుచుచు నీరు ముంగరల పోలిక ముక్కునఁ గూడ నోటఁ గొం
తొడియుచు గూఁటికఱ్ఱ సగమొత్తుచు ఱెక్క విదిర్పి మున్నుగా
వడకుటెకాక చేష్టుడిగె పక్షులు వక్షము జానువుల్ చొరన్
ఎలగోలు అంటే మొదాట పడపళ్ళాడి వచ్చే వాన అనీ, ఏదో పెద్ద కోలాహలం అవుతుంటే వచ్చే గొడవనీ రెండర్ధాలున్నాయి. ఆ ఒక్క మాటతోనే రానున్న జడివాన ధాటిని, జబర్దస్తీనీ కళ్ళకు కట్టిస్తున్నాడు కవి. ఆ ఎలగోలు జల్లు ఫెళఫెళమని ఏటవాలుగా పడి నట్టిళ్ళలోకి జొచ్చి ఇల్లు తడిపి మరీ పోతోంది. పాత కాలపు నట్టిళ్ళలో కాపురం ఉన్నవాళ్ళెవరికైనా ఈ ఏటవాలు జడివాన దంపుళ్ళు పరిచయమే. తెరలు తెరలుగా దిక్కునూ, గతినీ మార్చి మార్చి కొట్టే జల్లుల్లో అది మొదటి జల్లు తీరు. ఆవులు అంటే ఆవిర్లు. వేడి నేల మీద ఒక్కసారిగా వడగండ్లు పడుతుంటే ఆ వడకు ఆవిరి దుమారాల్ని రేపి రెండవ జల్లు పోయింది. శీకరమంటే తుంపర. మూడవ జల్లు మొదలయ్యేటప్పటికి చీకటయ్యింది. ఆ చీకట్లో వడి వడిగా ఉఱుముతూ మెరుస్తూ ఆ జల్లు తుంపర మెరిసీ మాయమై చీకటిని మిగిల్చి పోతున్నాది. అలా జల్లులతో మొదలయ్యి, చివరికి మహా వృక్షాలు కూడా నిలదొక్కుకోలేనంతటి ప్రచండమైన గాలీ వానా ఆపకుండా నీటి మబ్బులు కడవలతో హోరుమని ధారలుగా నీళ్ళొంపుతున్నాయా అన్నట్టు ఆకాశం భూమీ ఒకటైపోయిందా అన్నంతగా విజృంభించింది వాన. ఉయ్యాల తాళ్ళంత లావు ధారల్లాగ ఒకదానిపైనొకటీ జల్లు మీద జల్లై మఱీ అల్లుకుంటున్నాయి.
ఆ వాన లోన పక్షుల దురవస్థను వర్ణిస్తున్నారు కవి. తడి బుర్రలు వేలాడేసుకుని, నీళ్ళ ధాటికి కళ్ళు అరమోడ్పులైతే, గడ్డీ గాదం విదిలిస్తూ నీటి బిందువులు ముక్కుల మీద ముక్కు పుడకల్లాగ కొంత, ఆ క్రిందుగా నోళ్ళలో కొంతా నిలుపుకొని ఉన్నాయి. అఱ్ఱ అంటే మెడ గూళ్ళలోకి సగం జార్చుకొని, ఱెక్కలు టప టపా విదిల్చుకుంటూ, వడ వడ వణుకుతూ, చేష్టలుడిగిపోయి నిలబడ్డాయట పక్షులు. అక్కడితో ఆపకుండా ఒకటి రెండు పద్యాల్ని మాత్రం తీసుకొని ఆ కాస్త నిడివిలోనే ప్రభుత్వంలోని రెడ్లు, అంతఃపురాల్లోని రాజులు, చివరికి చెట్టు చేమలూ ఆ జడివానకు ఎలా స్పందించేయో చాల సూక్ష్మంగా వర్ణిస్తూ, చదివేవాణ్ణి వానలో తడిపి, ఆ ప్రకృతిలో, పక్షుల్లో తనూ ఒక పక్షినా అని వణికించే ఈ వర్ణనలోని సొగసు, యాదార్ధ్యపరత కాకతాళీయకంగా సాధించుకున్నవి కాదు. కవి అంతర్గతంగా కొన్ని వందల నిర్ణయాలను వివేకంగా ఎంచుకుని సాధించుకున్నవి. అది వివరించి చూడటం సృజన వివేచనకు తప్పకుండా సహాయం అవుతుంది, అవసరం కూడాను; కాని అది చాల విస్తారము, శ్రమతో కూడిన పని. ప్రతి మాటను, సంధిని, పద బంధాన్నీ, సందర్భాన్నీ, ఔచిత్యాన్నీ, అలంకారాలనూ పట్టి పట్టి చూస్తూ చెయ్యవలసినది. అలాంటి వివేచననే ఇంగ్లిష్‌లోన How does a Poem Mean? అనీ, How does a Poem Work? అనీ విశ్లేషించే ఆధునిక సంప్రదాయం, ఇటీవలి కాలంలోనే మొదలయ్యి ఉంది. ఇందుకు కొంత ఎడంగా ఇప్పటికి ఔద్వేగిక ఆవరణను స్పృశించి మాత్రం విడిచిపెట్టవలసింది. పైన చెప్పిన రెండు కవితా ఖండికలలోనూ ఎంత పట్టుదలగా వెదికి చూసినా ఔచిత్య భంగం దొరకదు; సృజన ఏ ఔద్వేగిక ఆవరణను ఉద్దేశించిందో అది సాంతం రక్తికడుతున్నాది. ఔచిత్య భంగాల్ని వెదికే ‘అపరాధ పరిశోధన’ కోసం మరికొన్ని కవితల్ని పట్టి చూడాలి.
ఇప్పటికి ముగింపుగా ఈ వర్షర్తు వర్ణను గురించి ఇంకొక్క మాట – దీనిలోని సంక్లిష్టతను (Complexity) గురించి. కవి ఈ మొత్తం వాన దృశ్యావరణాన్నీ, ఔద్వేగిక ఆవరణనూ అల్లడానికి ఎంచుకొన్న దృశ్య చిత్రాలు, వస్తు సంచయము, ఆ చిత్తరువు విస్తీర్ణమూ కోరుండే చాల సంక్లిష్టంగా ఉంటాయి. అంతటి క్లిష్టతనూ సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఔచిత్యానికి భంగం రాకుండా జడివాన ఔద్వేగిక ఆవరణను దృశ్య చిత్రాలతో నిర్మిస్తారు కవి. ఇదివరకే చెప్పినట్లు, సృజన, సృజనానుభవమూ ఒక ఆట, ప్రదర్శన ప్రధానంగా ఉండే ఒక క్రీడ. ఇలాగని ప్రాచ్య పాశ్చాత్య సంస్కృతుల్లోనుండి బలమైన కళాకారులు చాలా మందే గుర్తించి, ప్రకటించుకున్నారు. ఏ ఆటయినా సులభంగా, సరళంగా ఉంటే ఆకట్టుకోదు, ఆసక్తికరంగా ఉండే ఆటలు, ప్రదర్శనలూ పోను పోనూ చాల సంక్లిష్టంగా ఉంటాయి. ఆ సంక్లిష్టతను అందిపుచ్చుకొని ఆస్వాదించటంలో తాము చూపే నేర్పరితనంలో కవికీ, పాఠకునికీ కూడా ఆనందం ఉంది. సృజనకారులు సృజన క్రీడలో రాటుదేలే కొద్దీ తాము చదివేవీ, రాసేవాటిలోనూ మరింత, మరింత సంక్లిష్టతను ఆశిస్తారు. బెకెట్, త్రిపురల సృజనలు ఒక తరహా సంక్లిష్టతలు అతివేలమైన ఉదాహరణలు. రాయల ఆముక్తమాల్యద వంటి కావ్యాల్లోని సంక్లిష్టతను వేరొక తరహా పాఠకులు, భాషలోని క్లిష్టతను, ఊహా శబలతను అందుకుని అన్వయించుకోగలిగిన శక్తిమంతులు ఎంతో ఆనందిస్తారు. చేపట్టిన పనిలోని జటిలతకూ పనిలో ఆనందానికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని గురించి చిక్సెన్ట్‌మిహాయీ (Csikszentmihalyi Mihaly) తన పరిశోధనల్లోన, ముఖ్యంగా Flow: The Psychology of Optimal Experienceలోన వివరిస్తున్నారు. ఛందస్సు, లయ వంటివి ఈ సంక్లిష్టతను ఉద్దేశ్యపూర్వకంగా పెంపు చేయటానికి కవులు నిర్మించుకున్న సాధనాలు. బలమైన కవి స్వాతంత్ర్యానికి అవి ప్రతిబంధకాలు కావు; ఉద్దీపనలు. “The fun of rhyme is to set one’s difficulties high and then to meet them skillfully. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి.” ఈ విషయాన్ని సూచిస్తూ Robert Frost కవి స్వాతంత్ర్యాన్ని “moving easy in harness” అన్నారు. అంటే కళ్ళేలు తెంచుకోకుండానే లాఘవంగా దౌడు. పైన చెప్పుకున్న చిన్నపాటి కావ్య ఖండికలు సైతం బలమైన కవి చందస్సు బంధనాలని చట్ ఫట్ మని ఏమీ తెంచుకోనక్కర్లేకుండానే ఔద్వేగిక ఆవరణను ఎంత శక్తివంతంగా చిత్రించవచ్చునో విశదం చేస్తున్నాయి.
శ్రీ శ్రీ కవిత ఒక రాత్రి లోన పంచమి గుడ్డి వెన్నెల పొగలాగ ఆకాశం అంతా కమ్మి కవిని భయపెడుతుంది. నోరెత్తి హోరుమని నొగిలే సముద్రం, చచ్చి పడిన ఏనుగు కళేబరంలా కదలకుండా పడున్న కొండా విశాఖపట్నం సముద్రాన్నీ, యారాడ కొండను జ్ఞప్తికి తెస్తాయి. ఆ రోజుల్లో సముద్రపొడ్డున ఊరికి దూరంగా కూర్చుంటే రాత్రి ఒంటరిగా జీబుజీబుమని తోచే ఔద్వేగిక స్థితిని “గాలిలో కనరాని గడుసు దయ్యాలు భూదివమ్ముల మధ్య ఈదుతున్నాయి” అని వర్ణిస్తారు కవి. దయ్యాలు దేవులాడే వేళ అని ఇలాంటి సాయంవేళలకు పేరు. దయ్యాలు ఈదుతాయా? దేవులాడ్డాన్నే తూగు కోసం అలా కుదించుకున్నారు. దయ్యాలు కనిపించకుండా భయపెడతాయి కాబట్టి వాటి దాగుడుమూతలు గడుసువి. ఆకాశం ఒక ఎడారి అని రెండుసార్లు – రేగుతున్న ఇసుక తుఫానులో, కాళ్ళు తెగిపడిన ఒంటరి ఒంటె లాగుంది జాబిల్లి అని. బహుళ పంచమి జ్యోత్స్న కల్పిస్తుందన్న గుడ్డి వెలుతురుకీ (dimness) మండుటెండల్లో రేగే ఎడారి ఇసుక తుఫానూ, ఎడారి ఒంటే పరికల్పించే గొప్ప వెలుగైన (bright) దృశ్యానికీ పొంతన కుదరటం లేదు; అది నిండు పున్నమికి సైతం నప్పదు. కవి కల్పిద్దామని ప్రయత్నిస్తున్న ఔద్వేగిక స్థితిని సంపూర్ణంగా, తన్మయంగా సాధించుకోవాలని నేను చేసే ప్రయత్నం – దృశ్యాభాస ఒక అనౌచిత్యమై అడ్డం పడుతుంది నాకు. కాని, ఇదివరకు గంజిబువ్వ గురించి చెప్పినప్పటిలాగానే ఈ సముద్రం, ఇదే కొండా, ఏ కారణం లేకుండానే కమ్ముకుని బాధించే ఇలాంటి సాయంత్రాల ఒంటరితనపు దిగులూ నాకు బాగా పరిచయమైనవి, అది మా ఊరు కాబట్టి. అందువలన కవి సంకల్పించిన ఔద్వేగిక స్థితి పాఠకునికి (నాకు) దాదాపు లభ్యమౌతుంది.