మేఘసందేశం – ఆడియో రూపకం

41:27
ఇక్కడ గంగావతరణమును గురించిన కథను యక్షుడు వివరిస్తాడు. రంతిదేవుని స్మరించమని బోధిస్తాడు. ఆరాధ్యైనం శరవణభవం అనే పద్యములో ఈ సంఘటన ఉన్నది. నీ మేఘగర్జనతో త్రిపురవిజయుని సేవించు.(1.49)
ఓ మేఘుడా, మనోహరమైన వేణునాదంతో కిన్నరగాయకులు శివుని త్రిపురవిజయ గాథను పాడుతుంటారు. నీ గర్జనలతో వారికి మృదంగ సహకారాన్ని అందించు.
42:11
విశ్వనాథుడైన శివుని నుతించే పాట యిది.
43:17
కైలాస శిఖరాన్ని గురించిన వర్ణన యిది. అది సురవనితాదర్పణమట. హంసలుండే క్రౌంచపదము, ఆ శృంగచ్ఛాయలను గురించిన వివరాలు యిక్కడ వినవచ్చును. ప్రాలేయాద్రేరుపతటమతిక్రమ్య (1.61), గత్వాచోర్ధ్వంద‌శముఖభుజో(1.62) పద్యాలలోని విశేషాలు యిందులో ఉన్నాయి.
43:53
ఇక్కడ అప్సరాంగనలు మేఘంతో ఆటలాడుతూ పాడుతారు.అతణ్ణి తమ చేలాంచలాలతో కట్టివేసి నీళ్ళు పిండుతుంటారు. అతడు గర్జనలు చేసి వాళ్ళని భయపెట్టి ముందుకు సాగుతాడని పాటలో తెలుస్తుంది.
45:28
తతదనంతరము కైలాసగిరికి ఉపరిభాగమున ఉన్నఅలకానగరిని గురించి యక్షుడు మేఘమునకు చెబుతాడని సూత్రధారు డంటాడు.
45:51
ప్రియుని ఒడిలో కూర్చున్న ప్రియురాలివలె కైలాసోపరిభాగములో అలకానగరము ఉన్నది. గంగ అనే వస్త్రం జారుతుండగా ఆ నగరం కామినివలె కనిపిస్తుంది. అక్కడి స్త్రీల చేతులలో విలాసవంతముగా తామరపూలు ఉంటాయి. కురువక, నీపా పుష్పాలను వెండ్రుకలలో ధరిస్తారు. ఇవన్నీ హస్తే లీలాకమల మలకే అనే పద్యములోనివి. (2.02)
అలకానగర స్త్రీలు తమ అలంకారాలను వర్ణిస్తూ పాడతారు.
47:48
అక్కడి బాష్పాలు ఆనందబాష్పాలు మాత్రమే. బాధంతా కుసుమబాణాలవల్ల కలిగినది మాత్రమే. ప్రణయకలహాలు వియోగాలవల్ల మాత్రమే. అందరికీ ఒకే వయస్సు, అది యౌవనము. ఆనందోత్థం నయనసలిలం అనే పద్యముపైన ఆధారపడిన గీతమిది. (2.04)
48:34
కిన్నరులు యక్షరాజైన కుబేరుని యశస్సుని కీర్తిస్తూ పాడతారు. యక్షేశ్వరుడు, రాజరాజైన కుబేరుడు కల్పవృక్షసమానము, నవనిధులను కాపాడేవాడు అంటూ కుబేరుని గురించిన పాట యిది.
49:28
తన యింటిని గురించి మేఘునితో యక్షుడు చెబుతాడు. ఈ పాటకు తత్రాగారం ధనపతిగృహాన్ (2.14), వాపీచాస్మిన్ మరకతశిలా (2.15) అనే పద్యములు మాతృక. నా యిల్లు కుబేరుని అంతఃపురానికి ఉత్తరదిశలో ఉన్నది. దాని ద్వారపు వంపు ఇంద్రధనుస్సులా ఉంటుంది. చేతితో కూడ తాకడానికి వీలయ్యేటట్లు ఉండే పూలతో నిండిన పొట్టి మందారపు చెట్టులు ఉన్నాయి అక్కడ. అక్కడి నడబావి మెట్టులు పచ్చలతో నిర్మించబడినవి. అందులో హాయిగా హంసలు ఈదుతుంటాయి.
51:05
ఇలా యక్షుడు తన యింటిని వర్ణించి తన భార్యనుగురించిన వివరాలను మేఘునికి చెప్పబోవుచున్నాడని సూత్రధారుడు వివరిస్తాడు.
51:39
తన్వీ శ్యామా శిఖరిదశనా పక్వబింబాధరోష్ఠీ
మధ్యే క్షామా చకితహరిణీప్రేక్షణా నిమ్ననాభిః
శ్రోణీభారాదలసగమనా స్తోకనమ్రా స్తనాభ్యాం
యా తత్రస్యా ద్యువతివిషయే సృష్టిరాద్యేవ ధాతుః||
సంస్కృతసాహిత్యములో అతి సుందరమయిన పద్యాలలో నిది యొకటి (2.21). బ్రహ్మ స్త్రీసృష్టికి ఇది పరాకాష్ఠ అంటాడు కాళిదాసు. తన్వీ అంటేసన్ననిది, శ్యామా అంటే యౌవనపు మధ్య దశలో నున్నది, శిఖరిదశనా అంటే వంకరలు లేని పళ్ళు గలది. పక్వబింబాధరోష్ఠీ అంటే మంచి దొండపండులాటి పెదవులు ఆమెకు ఉన్నాయి. మధ్యే క్షామా అంటే సన్నని నడుము గలది. చకిత హరిణీప్రేక్షణా అనగా భయపడిన లేడి కన్నులవలె ఉన్నాయి ఆమె కన్నులు అంటాడు కవి. నిమ్న నాభి అంటే లోతైన బొడ్డుగలది అని అర్థము, ఇది సౌందర్యసూచకము. శ్రోణీభారాత్ అలసగమన అంటే నితంబవతి కావున మెల్లగా నడుస్తుంది అని అర్థము. స్తోకనమ్రా అంటే వక్షోజద్వయభారముచే కొద్దిగ వంగినది అని అర్థము. బ్రహ్మదేవుని మొదటి శిల్పములా ఆమె ఉన్నది. (కవి పద్మినీజాతి స్త్రీ లక్షణాలను చిత్రీకరించాడు). తరువాతి పద్య మైన తాం జానీథాః (2.22) కూడ ఈ పాటలో నున్నది. నన్ను వదలి ఉండే ఆమె ఒంటరి చక్రవాకపు పక్షిలా కనబడుతుంది నీకు. శిశిరఋతువులో మంచులో వాడిన పద్మములా ఉంటుంది నా భార్య.
53:42
యక్షుడు అలకపురికి వెళ్ళే దారి, అక్కడ తానుండే యిల్లు, తన భార్య రూపము, ఇత్యాదులను గురించిన వివరాలు ఆ నీలజీమూతానికి తెలుపుతాడు, మేఘుడు ఆ గుర్తులతో అలకాపురిని చేరుకొంటాడు అని నటి చెబుతుంది.
54:30
ఇక్కడ అలకానగరంలో యక్షుని భార్య దుఃఖంతో పాడుతూ ఉంటుంది. దూరభూమిలో వనసీమలలో అక్కడ ఉంటున్నాడు భర్త, నేనో యిక్కడ ఒంటరిగా ఉన్నాను, ఒక జడ పదార్థములా కృశించి యున్నాను, అతని సుఖసౌఖ్యాలు ఏమియు తెలియలేదు. అరె, హటాత్తుగా దక్షిణపు గాలి అనుకూలంగా వీస్తున్నదే. నా మనోరథానికి శక్తి కల్పిస్తున్నదే. నా కోరిక త్వరలో ఈడేరుతుందా? శాపావసానకాలము సమీపిస్తున్నదా అని పాడుతుంది యక్షపత్ని.
56:22
ఇలా యక్షపత్ని వ్యధచెందుతుండగా , మేఘాన్ని పక్షి బృందము ఆహ్వానించి, యక్షుని ఇంటికి దారిచూపి, ప్రవేశింపచేస్తున్నదని సూత్రధారుడు చెబుతాడు.
56:58
పక్షులు పాడతాయి: ఓ జలధరా రా, ప్రవేశించు. కుబేరుని రాజభవనమున కుత్తరముగా ఉండే యక్షుని ఇల్లు ఇదే. ఇదిగో క్రీడాశైలం. తోరణమిదిగో. నీ విద్యుత్ దృష్టిని పరిహరించు. శరీరాన్ని గున్నఏనుగు ప్రమాణంలో తగ్గించుకో. ఇంటిలోపల ఆ యక్షిణి వాక్కులను వింటున్నావా?
57:58
యక్షపత్ని పాడుతుంటుంది: ఓ చిలుకా, రసికా, నా ప్రియుణ్ణి ఎప్పుడైనా గుర్తు చేసుకుంటున్నావా? నువ్వంటే ఆయనకి ఎంతో ఇష్టం కదా. ఇదిగో ఆయన బొమ్మ గీశాను. అందులో పోలికలు కనిపిస్తున్నాయా? వీణని వాయిద్దామనుకుంటే, నా కన్నీళ్ళు తంత్రులపైన పడి మూర్చనలు పలకడం లేదు.
59:14
పక్షులు మళ్ళీ పాడతాయి: ఓ విశాలాక్షీ, యక్షప్రేయసీ, ఎందుకమ్మా ఇంతగా దుఃఖిస్తున్నావు? దక్షిణపుగాలులు త్వరపెట్టగా, దక్షిణదిశ నుంచి వచ్చాడులే. ఇక నీ విరహబాధ చాలును.

(సశేషం)


జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి:

జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు.

 ...