మేఘసందేశం – ఆడియో రూపకం

13:45
యక్షస్వామి కుబేరునికి చంద్రశేఖరుని అర్చించే సమయము సమీపించింది. ఆ పూజకు కావలసిన స్వర్ణకమలాలను వేళకు కోసి తెచ్చి ఇవ్వడము యక్షుని పని. ఈ రోజు ఆ పనిలో అతడు ప్రమత్తుడైనాడేమని కుబేరుడు క్రుద్ధుడైనాడు.
14:23
రాజదూత ఆగమనాన్ని సూత్రధారుడు సూచిస్తున్నాడు. కాని యక్ష దంపతులు ఇంకా తమ ప్రణయక్రీడలో సర్వము మరచి పాట పాడుకొంటున్నారు.
ఓ ప్రియా అద్దాన్ని చూపించు, నా ముఖంపైన మకరికా పత్రాలు రచించుకుంటాను.
ఇదిగో అద్దము. నీ ముఖమనే చందమామ ఈ అద్దంలో నాట్యం చేస్తోంది చూడు.
కదలని నీ చేతులతో నాకు తిలకాన్ని దిద్దు.
నీ ముఖంపైన ముత్యాల్లాగా స్వేదబిందువులున్నాయి.
మకరికాపత్ర రచనలోని ముత్యాలని స్వేదబిందువులనుకొని తుడిచివేయవద్దు.
ఆ పత్రరచన తడి ఆరడానికి నీ బుగ్గలపైన నిశ్వసించనా?
వద్దు, వద్దు, అద్దం పైన మంచుకమ్మి నా ముఖం కనిపించడం లేదు.
16:40
దూత – ఓ హేమమాలీ, రాజాజ్ఞను విస్మరించితివేల?
యక్షుడు – ఓ ప్రియా, ఆ బంగారు కమలాలను ఇలా ఇవ్వు. శివపూజకై ప్రభువుకి పంపించాలి.
భార్య – అయ్యో, అపచారం జరిగింది. అయినప్పటికీ ఇవిగో పూలు.
యక్షుడు – దూతను పంపివేసి మరల నీవద్దకే వస్తాను
భార్య – అయ్యో పూజాసమయం మించిపోయినదే.
యక్షుడు – ఓ రాజదూతా, ఈ రోజు నేను అన్యమనస్కుడనై ఉన్నాను. ఈ పూలను నీవే ప్రభువుకి అందివ్వు.
దూత – పూజాసమయం గడిచిపోయింది. ఇంక ఇప్పుడు ఇవి ప్రభువుకి ఎలా ఇవ్వను? మీ ఇద్దరి గతి ఏమవుతుందో!
యక్షదంపతులు మరలా ప్రణయకేళిలో మునిగిపోతారు.
18:15
అరాళాలకా, స్వరోల్లాసికా, మృదులాంగుళికా, చతుర వైణికా, సఖీ, నీవు లేక ఎలా జీవించను అని యక్షుడు పాడుతాడు.
19:24
స్వర్గంతోగాని, నందనవనంతోగాని మనకి పని ఏమి? మన ఇద్దరి ప్రణయమే శాశ్వతమైనది.
ప్రణయ సముద్రంలో తేలియాడే మాకు ఈ అలకానగరపు పువ్వులతేనెతో పని ఏమి?
ఆనందడోలికలలో తేలియాడుతూ కాలాన్ని గడుపుతాము.
కోరినదే అయినప్పటీకీ ఆ పదవితో నాకిక సరి, మా ఇద్దరి కలయికయే లోకాతీతమైన పదవి అని యక్షుడు పాటలో అంటాడు.
20:48
కుబేరుని గొంతు వినిపిస్తుంది. దేవకార్యనిర్వహణలో జాగరూకత చూపకపోయిన కారణాన ఒక యేడు భూలోకములో వనవాసము చేయాలి అని కుబేరుడు ఆంక్ష విధించాడు.
21:24
యక్షపత్ని దుఃఖము, నిస్సహాయతతో నీవులేని నా యీ యౌవనము, సౌందర్యము ఎందుకు అని వాపోతుంది.
22:40
ప్రభువు శాపముతో నాయిక అలకాపురిలో, నాయకుడు దండకారణ్యములో ఒక సంవత్సరము ప్రవాసము. దివారాత్రములు లెక్కపెట్టుకుంటూ యక్షదంపతులు కాలం గడుపుతున్నారు.
23:25
సూత్రధారుడు కథను ప్రస్తుతానికి తీసికొనివస్తాడు. గాలిని కౌగిలించుకొంటూ అతిలోకసుందరియైన ప్రియతమను అయే ప్రియే అని తలచుకొంటాడు యక్షుడు.
25:20
సూత్రధారుడు యక్షుడు ఎలా ఆషాఢమాసములో మొదటిరోజు మేఘాన్ని చూసినాడో అనే విషయాన్నిగురించి చెప్పుతాడు. ఈ పద్యము ఆషాఢస్య ప్రథమ దివసే వ్యాసములో చర్చించబడినది. (1.02)
26:06
దర్శనీయమైన ఆషాఢమేఘం వచ్చింది, అది ఆదిశేషునివలె ఉన్నది.ప్రియావిరహంతో బాధపడుతున్న యక్షుడు ఒక్కక్షణం ఇక్కడ విశ్రమించు అని మేఘాన్ని ప్రార్థించాడు.
27:05
యక్షుడు మేఘాన్ని “జలధర తిష్ఠ సోదర” అని స్వాగతిస్తాడు. ఓ జలధరా, ప్రియసోదరా, ఆగు. నదులకు హృదయబాధను, విరహాన్ని కలిగిస్తూ నీవు వేసవిలో నింగికెగురుతావు. ప్రియులకు దూరమై విరహబాధతో కృశించే జీవులకు నీవు సోదరుడివే అవుతావు.
28:07
సామాన్య మానవుడయితే ఒక సజీవ ప్రాణి ద్వారా సందేశమును పంపిస్తాడు. పొగతో, వెలుగుతో, గాలితో, నీటితో (ధూమజ్యోతిస్సలిలమరుతాం) నిర్మింపబడిన ఒక మేఘము సబబైన వార్తాహరుడు కాదు, కాని యక్షుడు తానుండే స్థితిలో ఆ సంగతి మరచాడు, ఆ మొయిలురాజు సహాయంకోసం ప్రాధేయపడి, రామగిరినుండి అలకానగరానికి మార్గము కూడ తెలుపుతున్నాడని సూత్రధారుడు చెబుతాడు. ఈ ధూమజ్యోతి పద్యము కాళిదాసు భావచిత్రణకు, కల్పనావైచిత్రికి ఒక గొప్ప ఉదాహరణ. (1.05)
29:01
రామగిరినుండి అలకాపురికి వెళ్ళే దారిలో కనబడే నదీనదాలు, నగరాలు, గ్రామాలు, ఖగ మృగాలు, చెట్లు చేమలు, నరనారుల భావస్వభావములను కూడ మేఘునికి యక్షుడు చిత్రీకరిస్తాడన్నాడు సూత్రధారుడు.
30:20
’అమృతమధుర జీవనధర జలధర అలకానగరీం యాహి’ అని మేఘుని అభ్యర్థిస్తాడు యక్షుడు.
ఇక్కడ నుంచి యక్షుడు పాడుతూ దారిలోని ఒక్కొక్క దృశ్యాన్నీ వర్ణిస్తూ ఉంటాడు. అప్పుడూ ఆయా దృశ్యాలలోని వ్యక్తులు ఆయా విశేషాలని పాటలరూపంలో మన కళ్ళకి కట్టిస్తూ ఉంటారు.
యక్షుడు అంటాడు. నీవు గొప్ప వంశములో పుట్టావు, ఇంద్రుని కొలువులో ఉన్నావు, ఇష్టము వచ్చినట్లు రూపాన్ని మార్చుకోగలవు. దహించబడేవారిని నీవు చల్లబరచుతావు. వెన్నెలలో తడిసిన భవనాలతో నిండిన యక్షుల నగరమైన అలకాపురికి వెళ్ళు. జాతం వంశే (1.06), సంతాప్తానాం(1.07) మున్నగు వృత్తాలనుండి వాక్యాలు ఈ పాటలో ఉపయోగించబడ్డాయి.
32:50
నీవు వెళ్ళే మార్గములో గాలి నీకు అనుకూలముగా ఉంటుంది. చాతక పక్షుల ధ్వని వింటావు నీవు. ఆకాశములో బారులుగా వెళ్ళే బలాకపక్షులను కన్నుల పండువుగా చూస్తావు. మందం మందం నుదతి పవనః అనే పద్యముపైన ఆధారపడినది యిది. ఈ పద్యాల ప్రోత్సాహమువల్లనేమో, మహాకవి టాగూరు బలాక పద్యాలు అని ఒక ఖండ కావ్యాన్ని వ్రాసినాడు.(1.09)
33:10
చాతకపక్షులూ, కొంగలూ ఆనందంతో పాడుతూ మేఘానికి ప్రియవాక్యాలు పలుకుతాయి.
యక్షుడు పాడతాడు. మేఘమా నీ ఆగమనంతో నేరేడుపళ్ళ తోటలలో హంసలూ, కాకులూ విడిది చేస్తాయి.
హంసలు మేఘానికి స్వాగతం పలుకుతూ పాడతాయి.
కాకులు కూడా పాడుతూ అలకానగరమార్గాన్ని మేఘానికి తెలియజేస్తాయి.

35:03
ఓ మేఘుడా, రఘురాముని పాదముద్రలు కలిగిన చిత్రకూట పర్వతాన్ని కౌగలించుకో. ఆటవిక స్త్రీలు విహరించే పొదలలో ఒక క్షణం విశ్రమించు. అడవి ఏనుగుల మదస్రావంతో గుబాళిస్తున్న నర్మదాజలాన్ని సేవించు. జానపదులు తమ వ్యవసాయానికి ఫలితాన్ని తీసుకునివచ్చావని సంతోషంతో నీకు స్వాగతం పలుకుతారు.
35:53
మళ్ళీ నిన్ను చూచి స్వాగతమిస్తారు ఉల్లాసముగా పల్లీయులు.
36:46
అక్కడినుండి వేత్రావతీతటములో ఉండే విదిశానగరాన్ని దర్శించు. దశార్ణ దేశంలో నిర్వింధ్యానదినీ, సిప్రానదినీ సేవించు. తరువాత మాళవరాజ్యపు రాజధాని ఉజ్జయినిని చేరుకొంటావు. విశాలమైన మార్గాలతో, అందమైన భవనాలతో ఉజ్జయినీనగరము శోభిల్లుతుంది. అక్కడ మహాకాలుని ఆలయమును చూడడము మరవకు. కాళిదాసు స్వంత ఊరు ఉజ్జయిని, అతడు మహాకాలుని భక్తుడు, అందుకే అతని పేరు కాలిదాసు, కాళికి దాసుడయితే అతని పేరు కాళీదాసు అవుతుంది. చారిత్రకముగా ఉజ్జయిని ప్రసిద్ధమైనది. కాళిదాసు సమకాలికుడయిన ఖగోళ శాస్త్రజ్ఞుడు వరాహమిహిరుడు ఉజ్జయినిని నేటి లండన్ గ్రీనిచ్ వలె (సున్న డిగ్రీల రేఖాంశముగా) భావించాడు.
37:38
ఉజ్జయినీ ప్రజలు భవానీశివులకు నాట్య ప్రదర్శనాలు చేస్తుంటారు. దేవుని అతిసంబరముతో ఆరాధిస్తారు.
మహాదేవుని ఆరాధనలో తన గర్జనలతో మేఘము ఢంకారావము చేస్తున్నదని, మేఘాన్ని చూసి మహాదేవుడు తన గజచర్మంపైన మోహాన్ని విడిచిపెడతాడనీ, అది చూసి భవానీదేవి సంతోషిస్తుందనీ పాడతారు.
38:50
నదులను, గ్రామాలను దాటుతూ దారిలో గంభీరానదితో రమించు. పిదప విశాలనగరాన్ని చేరుతావు. ఒకప్పుడు వత్సదేశపు రాజైన ఉదయనుని ఖ్యాతి అవంతిలో ఆబాలగోపాలానికి తెలిసిన విషయమే. అతని గాథలను గ్రామాలలో వృద్ధులు గానం చేస్తూ ఉంటారు, విను.
ఇక్కడ వత్సరాజు చరిత్రను జానపదులు గానం చేస్తారు. వత్సరాజు మృగయావినోది, వీణావాది, వాసవదత్త ప్రియుడు. ప్రద్యోతస్య ప్రియదుహితరం అనే పద్యపు సారాంశము నిక్కడ గమనించవచ్చును. (1.34)
40:20
దేవగిరికి వెళ్ళు. అది గిరిజాతనయుడు, సురసేనాధిపతి, పక్షివాహనుడైన స్కందుని వాసస్థానము. అక్కడ సిద్ధదంపతులు వీణలతో పాడుతూ ఆయనని ఆరాధిస్తుంటారు. వారితో కలిసి ఆ కుమారునికి నమస్కరించు.
ఇక్కడ సిద్ధదంపతుల పాట వినిపిస్తుంది. కుమారసంభవ కర్తయైన కాళిదాసు సుబ్రహ్మణ్యస్వామిని చూడమని మేఘునితో చెప్పడము సహజమే కదా! ఇక్కడ ఒక విషయము చెప్పాలి. కుమారసంభవములోని కుమారస్వామి బ్రహ్మచారి. దేవకార్యము ముగిసిన పిదప ఒక్కడే తపస్సు చేసికొంటు ఉంటాడు. కాని దక్షిణాదిలో ఉండే కుమారస్వామికి (మురుగన్) యిద్దరు భార్యలు