హాబూ నిప్పు

ఒక ఏడాది, చలికాలపు రోజుల్లో పెద్దగా మెరుపు మెరిసింది. హాబూ అంతకు ముందు కూడా మెరుపుని చూసున్నాడు. మెరుపు మెరిసినప్పుడు కొద్దిసేపటికి వరకూ, చాలా దూరం మేరకు వెలుతురు కనిపిస్తుంది. అంతా పగలు కనిపించినంత స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆ ఏడాది, ఆ రాత్రి చెవులు బద్దలైపోయేంత గట్టిగా ఉరుము వినపడింది, ఆ వెంటనే ఒక మెరుపు మెరిసింది. తర్వాత అడవినిండా ఆ వెలుగు పడింది. కొంతదూరంలో ఒక ఎండిపోయిన చెట్టు మీద ఒక వింత జంతువు కూర్చుని, ఆ చెట్టుని తినేస్తూ కనబడింది. చెట్టు కొమ్మలు విరిగి కిందపడుతున్న కొద్దీ, ఆ జంతువు మెల్లిమెల్లిగా కిందకు దిగుతూంది. ఆ జంతువు శరీరం నుండి సూర్యుడి నుంచి వచ్చేలాంటి వెలుగు వస్తూ ఉంది. ఆ వెలుతురులో చాలా దూరం వరకూ అన్నీ కనిపించాయి. హాబూ తండాలోని అందరూ పరిగెత్తుకొని వెళ్ళి దాని చుట్టూ గుమ్మిగూడారు. ఇలాంటి జంతువుని ఇంతకు ముందు ఎవ్వరూ చూడలేదు. బాఖా ముందు తరాల వాళ్ళు కూడా చూడలేదు.

అది ‘నిప్పు.’

దీనికి ‘నిప్పు’ అని పేరు ఎప్పుడొచ్చిందో తెలీదు? అది ‘మగ’ నుండీ ‘ఆడ’గా ఎలా మారిందో కూడా తెలీదు. మొదట్లో దాన్ని ఒక మగ జంతువే అనుకున్నారు. ఆ చెట్టే చాలా పెద్దదంటే, దాని చుట్టూ ఇంకో రెండు మూడు ఎండిపోయిన చెట్లున్నాయి. అది వాటిని అందుకోటానికి దూకినప్పుడు తండాలోని వారంతా గొల్లుమన్నారు. “చూడు, చూడు అది దాన్ని కూడా పట్టేసుకుంటుంది.” ఆ ఇంకో చెట్టూ నిప్పుకి దొరికిపోయాక అది కూడా చిన్నగా అయిపోతూ ఉంది, జంతువు పెద్దగా అయ్యింది. మొదటి చెట్టు పైభాగమంతా మాయమైపోయింది. అందరి నోటా ఒకటే మాట.

“అదే తినేసింది. అదే తినేసింది.”

చెట్టు చెట్టునూ తినేసే జంతువుని మనిషి మొట్టమొదటిసారిగా చూశాడు. రాత్రంతా ఆ జంతువు చెట్లను తింటూనే ఉంది. తెల్లవారినా దాని కడుపు నిండనట్టుంది. వేరే జంతువులైతే తమ వేటను తిని వెళ్ళిపోతాయి. కానీ ఈ జంతువు మాత్రం కనీసం ఎక్కడికి వెళ్ళను కూడా వెళ్ళలేదు. వేటాడాక అక్కడే కూర్చుని తింటూ ఉంది. ఆ పక్కనే మరికొన్ని చెట్లున్నాయి. హాబూ అనుకున్నాడు, “ఆ పక్కనే చెట్లు కనిపించలేదో లేక దాని కడుపు నిండిపోయిందో” అని.

అతడు బాఖాను అడిగితే, బాఖా మంచి అభిప్రాయం చెప్పాడు: “ఈ జంతువు కేవలం ఎండిన చెట్లు తింటుందని నాకనిపిస్తోంది. కానీ మునుపెన్నడూ ఇలాంటి జంతువుని అడవిలో చూడలేదు.”

“దేవదూత ఎవరైనా పైనుండి వెళ్తూ ఎండిన చెట్లను చూసి కిందకొచ్చారేమో. కానీ ఇంతకు ముందు ఇది గాల్లో ఎగురుతూ వెళ్ళటం కూడా చూడలేదే?!” బాఖా తన అభిప్రాయంలో కొంత మార్పు చేశాడు.

“ఆకాశం నుండి వచ్చిన జంతువేమోనని నాకనిపిస్తుంది. దేవతల ఇంటినుండి కిందకు పడిపోయిందేమో. దాని ఒంటి రంగు చూస్తే తెలీడం లేదా?!” బాఖా మరికొన్ని మార్పులు చేశాడు.

ఇప్పుడు బాఖాకూ తన అభిప్రాయం మీద నమ్మకం కలగటం మొదలయ్యింది. తక్కినవారికీ కొంచెం కొంచెంగా నమ్మకం కలిగింది. అంతుపట్టని ప్రతీది దేవుని మహిమని అనుకోవటం ఈనాటికి పరిపాటి. కానీ హాబూని ఒక విషయం కలవరపరిచింది. అందరూ తినడం వల్ల లావైతే, ఈ జంతువు తినేకొద్దీ బక్కచిక్కిపోతుంది. ఎక్కడ కూర్చొని తింటుందో అక్కడంతా ఎర్రగా అయిపోతుంది.

జుంబీ ప్రకారం, సింహంలానే అది కూడా తిన్న చోటనే నిద్రపోతుంది. ఆకతాయితనం ఎక్కువైన టుంబా అన్నాడు కదా, “నిద్రపోతుందేం? అయితే నేను లేపి వస్తా..”

టుంబా చేత్తో దాన్ని లేపడానికి ప్రయత్నించగానే అరుస్తూ వెనక్కి తగ్గాడు. నిప్పు అతడి చేతిని కరిచేసింది.

‘కాలడం’ అనే అనుభవం అంతకు ముందు ఎవరికీ లేనే లేదు. ‘కాలడం’ అనే పదం నిప్పు తర్వాతే పుట్టింది. టుంబా చేతిమీద బొబ్బలు వచ్చాయి. అతడి చేతికున్న వెంట్రుకలు మాయమవ్వడం కూడా అందరూ చూశారు. ఆ బొబ్బలను చూస్తూ టుంబీ అంది – “దాని పంటి గుర్తులేమో ఇవి.”

“పళ్ళు కనిపించలేదే?!”

“మరి వెంట్రుకలెలా కత్తిరించింది?”

“కత్తిరించింది కాని రక్తం మాత్రం రాలేదు.”

టుంబాకు ఇంకా చిరాగ్గానే ఉంది. ఒక పెద్ద కొమ్మను విరిచి అతడు నిప్పుని కెలికాడు. అందరూ ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయారు. కాసేపటివరకూ నిప్పు గమ్మున ఉంది. ఎక్కడైతే దాని పొట్టలో కొమ్మ తగులుతూ ఉందో, అక్కడక్కడ అది నల్లగా అయిపోయింది. అంతలో ఒక్కసారిగా విరుచుకుపడింది. భయపడి టుంబా కొమ్మ పడేసేటప్పుడు, నడుంకి కట్టుకొన్న తోలు దానిలో చిక్కుకుపోయింది. తోలు కిందపడుతూనే నిప్పు దాన్ని పట్టేసుకుంది. మళ్ళీ కలకలం రేగింది, తండాలో. టుంబా నగ్నంగా నుంచుండిపోయాడు. చూస్తుండగానే నిప్పు తోలును కూడా తినేసింది. కొమ్మను కూడా తింటూ ఉంది.

“ఈ జంతువు మళ్ళీ పెద్దదైపోయింది. ఇది ఏదైనా తినేస్తుంది.” టుంబీ అంది.

ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద రాళ్ళను ఎత్తి విసిరి, ఎదురు చూశారు. కానీ నిప్పు రాళ్ళను తినలేకపోయింది.

“దానికి పళ్ళులేవు. అందుకనే రాళ్ళు నల్లగా అయ్యాయి గానీ, వాటిని కొరకలేకపోయింది.” హాబూ చెప్పాడు.

హాబూకి ఇంకో విషయం అర్థమయ్యింది. దానికి చాలా నోర్లున్నాయి. అది అన్ని వైపులా నుండీ తినగలదు. దానికి కాళ్ళు లేవు. అందుకని తనంట తాను నడుచుకుంటూ వెళ్ళి తినలేదు. ఎంత ఇస్తే అంత తింటూ ఉంటుంది. తినేది తరిగిపోయేకొద్దీ ఇది కూడా తరిగిపోతుంది.

ఏనుగుని మచ్చిక చేసుకున్నప్పటి నుండి హాబూకి ఒక సింహాన్ని కూడా మచ్చిక చేసుకోవాలని కోరికగా ఉండేది. ఇప్పుడీ నిప్పుని చూసి అతడి మనసు ఉవ్విళ్ళూరింది. దీన్నే సాకితే? నిప్పు చనిపోవటం చూసి, హాబూ అక్కడి-ఇక్కడి పుల్లలు ఏరుకొని తెచ్చి దాంట్లో వేశాడు. నిప్పు మళ్ళీ పెద్దదయ్యింది.

“నిప్పుని సాకటానికి ఒకటే మార్గం. దానికి తినిపిస్తూ ఉండాలి. తినకపోతే అది చచ్చిపోతుంది.” అతడు ఆ రాత్రి వాళ్ళమ్మకు చెప్పాడు.

“నువ్వేం చేస్తావ్, దాన్ని పెంచుకొని?” అమ్మ అడిగింది.

“చూశావ్ కదా, అది బతికుంటే వెలుగుంటుంది. రాత్రి కూడా అంతా కనిపిస్తుంది. క్రూరమృగాలూ దగ్గరకు రావు. వాటికీ భయం. మనం నిప్పుని పెంచుకుంటే ఏ జంతువూ మన తండా జోలికి రాదు.”

ఆ మాటా నిజమే! బాఖా కూడా ఆమోదిస్తూ తలపంకించాడు. నిజానికి హాబూ తెలివితేటల ముందు ఇంకెవ్వరి మాట చెల్లుబాటు కావటం లేదు.

హాబూ తండావాళ్ళు అతడి మాటను ఆనందంగా ఒప్పుకున్నారు. వాళ్ళు రోజూ వేటకెళ్ళినప్పుడు అడవిలో పడున్న ఎండిన పుల్లాపుడకా తీసుకొచ్చి దానికి మేత వేస్తుండేవారు. దాన్ని ఎత్తుకొని, ముద్దాడాలని వాళ్ళకి చాలా అనిపించేది గానీ, ప్రయత్నించినప్పుడల్లా అది కరిచేసేది.

హాబూ గురించి ఇప్పుడు తండా బయటవాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. వేరే తండాల వాళ్ళు కూడా నిప్పుని చూడ్డానికి వచ్చేవారు, కానీ ఒక రోజు ఒక దుస్సంఘటన జరిగింది.

ఒక రోజున పెద్ద వాన కురిసింది. ఆ రోజు హాబూ తండాలోని అందరి కళ్ళ ముందూ ఎరుపు, బంగారు ఛాయలో ఉన్న జంతువు చుయ్-చుయ్ అంటూ చచ్చిపోయింది. మొదటిసారిగా పొగను చూస్తూ అనుకున్నారు, ప్రాణం అయ్యుంటుంది, అందుకే ఆకాశానికేసి పైకి పోతుందని. వాళ్ళకిప్పుడు అది ఆకాశంలోని దేవతల ఇంటి నుండి వచ్చిందన్న నమ్మకం ఇంకా బలపడింది. కాసేపటికి, బూడిద పెద్ద గుట్టగా ఏర్పడింది. దాన్ని వాళ్ళు నిప్పు శరీరం అనుకున్నారు. డుంబీ ఒక వింత మాట అంది –

“ఈ లెక్కన చనిపోయిన అందరి ప్రాణాలు పైకే పోతాయేమో…”

“ఎప్పుడూ కనిపించదేం?” అన్నాడు హాబూ.

డుంబికి దీని జవాబు తెలీదు. కానీ ఈ ప్రశ్న శాశ్వతంగా మనుషుల మెదళ్ళో నిలిచిపోయింది. ఇప్పటికీ జనాలు అడుగుతుంటారు, చనిపోయాక మనిషి ప్రాణం ఎక్కడికి వెళ్తుందని?


రచయిత పూర్ణిమ తమ్మిరెడ్డి గురించి:

పుస్తకం.నెట్ నిర్వాహకుల్లో ఒకరైన పూర్ణిమ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు.

 ...


గుల్జార్

రచయిత గుల్జార్ గురించి:

చలనచిత్ర గీతాల రచయిత గుల్జార్, ప్రస్తుత పాకిస్తాన్ భూభాగంలోని దినాలో సిక్కు కుటుంబంలో జన్మించాడు. దేశవిభజన తరువాత అతని కుంటుంబం ఢిల్లీకి వలస వచ్చింది. హిందీ, ఉర్దూ, పంజాబీ భాషలలో రచనలు చేసి పేరు సంపాదించిన గుల్జార్ 2004 లో భారత ప్రభుత్వపు పద్మభూషణ్ అవార్డును, 2002లో సాహిత్య అకాడమీ అవార్డును పొందగా, ఇటీవల ప్రపంచ సినీ రంగంలో ప్రఖ్యాతమైన ఆస్కార్ అవార్డును బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో పొందినాడు.

 ...