జాతర

పాత కాలువలో దిగి మెయిన్ రోడ్డుకి ఎక్కి చెరుకు దుకాణం, బాల పాండియన్ మిఠాయి దుకాణం, వేల్ విలాస్ స్వీట్స్ అండ్ హాట్స్ అన్నీ దాటి తెప్పోత్సవం జరిగే చోటుకి వెళ్ళి చేరేసరికి ఇసుక వేస్తే రాలనంతగా జనం ఉన్నారు. ఎక్కడ చూసినా ఇనుప తొప్పిలు ధరించిన రిజర్వ్ పోలీసులు చేతిలో లాటీకర్రలతో. చూస్తేనే భయంగా అనిపించింది.
“నిలబడకు. ముందుకు వెళ్తూనే ఉండు.” అదిలింపులు.

ప్రధాన ద్వారం దగ్గర నిలబడడానికి కూడా చోటు లేదు. గుంపును రెండుగా విడదీసిన దారిలో చుట్టూ తిరిగి రావడం అయ్యింది. ఎక్కడా కూర్చోవడానికి జాగా లేదు. ఊరిలో అక్కడక్కడా లౌడ్ స్పీకర్లు పెట్టి ఉండడం వలన జనం గుంపులుగా కూర్చుని పాట కచ్చేరి వింటూ ఉన్నారు.

“పా… పా…. పా” అంటూ ఇంకా ఎంత సేపు రాగం తీస్తూ ఉంటాడు అనిపించింది మాణిక్యానికి. ఒక రౌండు చుట్టి వచ్చి గోవిందరాజన్ కంటికి కనబడేటట్టుగా ద్వారానికి పక్కన ఉన్న మండపంలో కూర్చున్న జనానికి మధ్యలో ఎలాగో చోటు చేసుకొని కూర్చున్నారు మాణిక్యం, అతని తండ్రి. సినిమా పాటలు పాడే సమయం ఆసన్నమయింది కాబోలు. జనం మధ్య నుంచి “సినిమా పాటలు.. సినిమా పాటలు..” అంటూ చేతులు పైకి లేచాయి. ఒక్క నిమిషం సుదీర్ఘమైన మౌనం.

“ఏడుకొండల వాడా ఎక్కడున్నావయ్యా” అంటూ పై స్థాయిలో పాట ఎత్తుకోగానే గోవిందరాజన్ గొంతు అగర్ బత్తి పొగలాగా సుడులు తిరిగి జనం మధ్య వ్యాపించింది. కచ్చేరి ముగియడానికి తొమ్మిదిన్నర అయ్యింది. గుంపులో ఒక భాగం వెళ్ళి పోయింది. షేక్ చిన మౌలానా నాదస్వరం, వలయపట్టి, వలంగ మాన్ స్పెషల్ తవిల్ వినడానికి ఇంకో గుంపు వచ్చి చేరింది. కచ్చేరికి ఒక గంట విరామం ఉంటుంది. ఈ విరామ సమయంలోనే సర్కస్, రికార్డ్ డాన్సులూ జోరుగా సాగుతాయి. దొరికిన విరామ సమయాన్ని వినియోగించుకుంటూ బాలపాండియన్ మిఠాయి, తానా బీనా సొక్కన్ లాల్ బీడీ ప్రకటనలు అదిరిపోయేటట్లు వేశారు. లౌడ్ స్పీకర్లలో నాగర్ కోవిల్ దుకాణాలకి నోరు మూయకుండా ప్రకటనలు వస్తూనే ఉన్నాయి.

ఒంటి గంట అయి ఉంటుంది. చల్లని గాలి మెల్లిగా వీయసాగింది. గుంపుకు మధ్యలో కూర్చుని ఉండటం వల్ల వెచ్చగా అనిపించింది మాణిక్యానికి. గుంపుకు మధ్యలో దారికి పక్కనే కూర్చుని ఉన్నందువలన స్టేజి మీద నాదస్వరం, తవిల్ బాగా కనిపిస్తున్నాయి. ఒక చేతి వేళ్ళకి కుప్పెలు పెట్టుకొని, ఇంకో చేతిలో చిన్న కర్రతో వాయించగానే ‘డు డు డుమ్’ అంటూ తవిల్ ఆక్రోశంగా అదిరింది.

మాణిక్యానికి నిద్ర వస్తున్నట్లు అనిపించింది. నిద్రపోతే నాన్న తిడతాడని భయం కూడా వేసింది. కచ్చేరి ముగియడానికి ఇంకో రెండు గంటలైనా అవుతుందని అనిపించింది. అంతవరకూ నిద్ర పోకుండా ఆపుకోవడం అసాధ్యం. బిత్తర చూపులు చూసుకొంటూ కూరున్నాడు మాణిక్యం. తనియావర్ధనం ముగియగానే, పది చింత చెట్లను ఒకేసారి కుదుపుతున్నట్లు టపటపమని చప్పట్లు చెరువు పక్కన ఉన్న రాళ్ళని తాకి ప్రతిధ్వనించాయి. గుంపులు గుంపులుగా జనం లేవసాగారు. ఖాళీ ఏర్పడిన జాగాలలో వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు.

గుంపుతో సహా లేచిన తండ్రితో చేరి మాణిక్యం నడవసాగాడు. బాగా ఆకలిగా అనిపించింది. సాయంత్రం ఐదు గంటలకి తిన్న అన్నం కడుపులో ఏ మూలకి పోయిందో తెలియలేదు. నోట్లో నీళ్ళు ఊరాయి. ఏదైనా తింటే గాని సరిపడేటట్లు లేదు. నాన్నని అడుగుదామా వద్దా అని ఆలోచించాడు. కాసేపు తిరునాళ్ళ దుకాణాలను వేడుక చూస్తూ తిరుగుతూ భగవతి విలాస్ క్లబ్ దగ్గరకి వచ్చారు. వేడి వేడి నూనెలో బజ్జీలు వేగుతున్న వాసన. నాన్న మాణిక్యాన్ని అడిగారు.

”ఏరా.. ఆకలిగా ఉందా?”

“అవును.” తల ఆడించాడు మాణిక్యం.

బయటికి వచ్చే వాళ్ళను తోసుకొని మరీ లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. డబ్బులు వసూలు చేసే బల్ల చుట్టూ ఒకే గుంపు. ఇద్దరూ చోటు చేసుకొని ఎలాగో కూర్చున్నారు. తలా నాలుగు దోశలు, రెండు రస వడలు, టీ నీళ్ళు. సుద్ద ముక్కతో బోర్డ్ మీద రాసి ఉన్న ధరల పట్టికను చూసి మనసులోనే కూడిక వేసుకున్నాడు మాణిక్యం. అంతా కలిపి ఇరవై ఐదు రూపాయల యాబై పైసలు అయ్యింది. ఎంగిలి ఆకును తీసి తొట్టిలో వేసి నోరు పుక్కిలించి, చేతులు కడుక్కొని తువాలతో నాన్న, షర్ట్ అంచుతో మాణిక్యం చేతులను తుడుచు కొని డబ్బులు ఇవ్వడం కోసం బల్ల దగ్గరికి వచ్చారు.

“కళ్ళజోడు పెద్దాయన ఐదు తొంబై.” “తరువాత మనిషికి పది అరవై.” “ముసలాయన ఖాతా ఐదు రూపాయలు.” అంటూ గొంతులు కలగాపులగంగా వినిపిస్తున్నాయి. గల్లా ముందు కూర్చున్న అతనికి తలెత్తి ఎదురుగా నిలబడిన మనిషిని చూసి, డబ్బులు లెక్కపెట్టి తీసుకొని, బాకీ చిల్లర డబ్బులు ఇవ్వడం పెద్ద ప్రయత్నంగా అవుతోంది. ఏమీ ఎరగనట్లు ముందుకు నడిచిన మాణిక్యం నాన్న నిదానంగా నిలబడి పంచె ముడిని విప్పి మూడు రూపాయలు తీసి బల్లమీద పెట్టారు. తలెత్తి చూసిన గల్లాదారుకి “రెండు టీ”; అని లెక్క చెప్పి మాణిక్యం చెయ్యిని గట్టిగా పట్టుకొని బైటికి నడిచారు.

కొంచం దూరం వెళ్ళగానే మాణిక్యం వెనకాల తిరిగి తిరిగి చూసాడు. నాన్న ముఖాన్ని కనుకొసలతో ఓరగా చూసాడు. ఒకవేళ నాన్న దీని కోసమే తిరునాళ్ళను వదలకుండా పాట కచ్చేరి వినడానికి వస్తున్నారేమో అని అనిపించింది. ఇకపై నాన్నతో రాకూడదని మనసులో నిశ్చయించుకున్నాడు.


నాంజిల్ నాడన్ కన్యాకుమారి తాలూకాలో జన్మించారు. అసలు పేరు సుబ్రహ్మణ్యం. నాంజిల్ ప్రదేశానికి చెందిన వాడు అని అర్థం వచ్చేట్టుగా తన కలం పేరు పెట్టుకున్నారు. ప్రస్తుతం కోయింబత్తూర్ లో పనిచేస్తున్న వీరి మొదటి కథ విరధం, 1975లో ప్రచురించబడింది. 2002లో వీరి నవల తలైకీళ్ విగితంగల్ సొల్ల మరంద కథై అనే సినిమాగా తంగర్ బచన్ తీశారు. 2010లో వీరి కథా సంకలనం ‘సూడియ పూ సూడర్క’కు సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. వీరి విస్తృత సాహిత్యం ఎన్నో యూనివర్సిటీలలో పాఠ్యాంశాలుగా ఉంది. జీవితాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నంగా, అసిత్త్వాన్ని వెతికి పట్టుకునే ఒక ప్రక్రియగా తన రచనల గురించి చెప్పుకునే నాంజిల్ నాడన్ రచయిత గురించి ఇలా వ్యక్తీకరిస్తారు: “మెచ్చుకోలుతో రచయిత పుట్టడు, కానీ రచయిత మళ్ళీ మళ్ళీ ఎదురుచూసేది ఆ మెచ్చుకోలు కోసమే.”


గౌరి కృపానందన్

రచయిత గౌరి కృపానందన్ గురించి:

గౌరి కృపానందన్ మాతృభాష తమిళం. తండ్రి ఉద్యోగరీత్యా తెలంగాణాలో స్థిరపడినా, వివాహానంతరం చెన్నైకి వెళ్ళిన తరువాతే తమిళ సాహిత్యం చదవడానికి అవకాశం లభించింది. సాహిత్యం అంటే మక్కువ. తెలుగులో తనకి నచ్చిన నవలలు, కధలు తమిళ పాఠకులకు, అలాగే తమిళంలో మనసుకు దగ్గరగా ఉన్న సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందించాలనే కోరికతో, ఆశయంతో అనువాద ప్రక్రియను ఎంచుకున్నారు. 1995లో మొదటి అనువాద కధ యండమూరి వీరేంద్రనాథ్ గారి “ది బెట్’ తమిళంలో ప్రచురం అయ్యింది. దాదాపు ఎనబై తెలుగు నవలలు తమిళంలో వెలువడి ఉన్నాయి. (యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి, D. కామేశ్వరి, ఓల్గా) తెలుగులో పెరుమాళ్ మురుగన్ గారి “పూనాచ్చి ఒక మేకపిల్ల కధ” ఈ మధ్యే వెలువడింది. 2015లో ఓల్గాగారు “విముక్త” కధా సంకలనానికి సాహిత్య అకాడమి అవార్దు అందుకున్న అదే ఏడాది, విముక్త తమిళ అనువాదం “Meetchi”కి గౌరీ కృపానందన్ సాహితి అకాడమి అనువాద పురస్కారం అందుకున్నారు. మూలానికీ, అనువాదానికీ ఒకే ఏడాది సాహిత్య అకాడమి అవార్డులు రావడం ఇదే తొలిసారి.

 ...