దీక్షా లాక్షా రాగ రేఖ
తారకల చిరువెల్గుల హారతితో
శుక పిక గీతావళితో
నా జీవన కుటీర ప్రాంగణం లోకి
ఈ చెట్ల చుట్టూ అల్లుకున్న
వేకువ నును చీకటి కొసన్నుంచుని
నిన్నాహ్వానిస్తున్నాను రసమయీ!
దరహాస చంద్రికా ధవళ రోచిర్మయీ!
ఇంతవరకూ ఉన్న
నిర్నిమేష నిరీక్షణా
ద్రాహిష్ఠ శిశిరమ్ము గడిచి
భవదాగమనా విష్కృత
సుహృల్లతా
వనాంతానిల పరీమళ వ్యాపృత
వసంతం వస్తున్న ఈ క్షణాల…
తారకల చిరువెల్గుల హారతితో
శుక పిక గీతావళితో
నా జీవన కుటీర ప్రాంగణం లోకి
ఈ చెట్ల చుట్టూ అల్లుకున్న
వేకువ నును చీకటి కొసన్నుంచుని
నిన్నాహ్వానిస్తున్నాను రసమయీ!
దరహాస చంద్రికా ధవళ రోచిర్మయీ!
నువ్వు
చైతన్య దీప శిఖవై
దీక్షా లాక్షా రాగ రేఖవై రావాలి
మనచుట్టూ నలిగి
ముడతలు పడిపోయిన బతుకులతో
మనమిక ముందు తరాలనైనా
ఉద్దరిస్తామన్న నమ్మకాలతో
ఎదురు చూస్తున్న
అశేషా శేష పాండుర నయనాంచలాల
నూతనాశాసృగ్ద్యుతులు
ప్రతిఫలించాలి!
మనిద్దరం కలిసి
సంధ్యా సమీర ప్రసారాల షడ్జమాన్నీ
ప్రత్యూష పవన వీచికల పంచమాన్నీ
పోగు చేసి రచించిన
భవిష్యద్గీతాలాపనలో
తూర్పున మందారాలు పూయాలి
పడమర పారిజాతాలు విరియాలి
ఉత్తర దక్షిణ ధృవాల
ఉదంతికా నీహారం కురవాలి!
మహర్వాటీ మహాద్వార తోరణంలో
పక్క పక్క ఆకులమై పలకరించుకొనే వరకూ
నింగీ నీరధీ కలుసుకుంటున్న
క్షితిజ నిశాంత నీలిమల మీద
చెలీ!
అవిశ్రాంతంగా మనం
నవ నవాలైన
ఉషః ఉదయాలు పరవాలి!
adviatam అభిప్రాయం:
May 1, 2012 4:40 pm
” క్షితిజ నిశాంత నీలిమల మీద
చెలీ!
అవిశ్రాంతంగా మనం
నవ నవాలైన
ఉషః ఉదయాలు పరవాలి”
అద్భుతంగా ఉంది అండి
rama bharadvaj అభిప్రాయం:
June 3, 2012 12:02 am
భాషా భేషజానికి పెద్ద ఉదాహరణ ఈ రచన. ఆడంబరం తప్ప ఇందులో ఇంకేమీ ధ్వనించడం లేదు. పైగా శ్రీనాధుని శీర్షిక లో అరువు తెచ్చుకున్న లౌల్యమొకటి. తిలక్ ని అనుకరించి నడవగలనన్న ధీమా ఒకటి. ఇలాంటి రచనని ఆ రాసిన వాళ్ళు తప్ప బ్రహ్మదేవుడు కూడా చదవలేడు :) :).
మహానీరసమైన పుట్టెడు రచనలకి మీ పత్రిక మాత్రం గొప్ప వేదిక. పైగా బోలెడంత మంది ‘పీరులు’ వీటినన్నిటినీ చదువుతూ ఔఔ నంటూ అచ్చువేసుకోవడం మీ పత్రికకి ఉన్న రచనల కొరతనీ, మీ పీర్ల (pun intended) శక్తి లేమినీ పట్టి ఇస్తోంది.
రమ.
తః తః అభిప్రాయం:
June 8, 2012 10:02 am
నా ప్రతిస్పందనలతో అభిప్రాయాల సంఖ్య పెంచటం ఇష్టం లేక అభిప్రాయాలు తెలిపిన వాళ్ళందరికీ ఒకేసారి జూన్ చివరలో జవాబులు రాద్దామనుకున్నాను. కానీ రమ భరద్వాజ్ తన అభిప్రాయంతో నన్ను ఉత్తేజపరిచారు.
అద్వైతం గారికి: ముందుగా మీకు నా ధన్యవాదాలు. ప్రచురణ వచ్చిన మరునాడే మీరు చదివి వెలిబుచ్చిన అభిప్రాయానికి నేను వెంటనే జవాబు -పైన చెప్పిన కారణాన- ఇవ్వనందుకు మన్నించండి. రమ గారి అభిప్రాయంలో మొదటి భాగం నా రచన మీద చెప్పినది. అదులో “ఇలాంటి రచనని ఆ రాసిన వాళ్ళు తప్ప బ్రహ్మదేవుడు కూడా చదవలేడు :) :)” అన్నది చూసినప్పుడు రమ గారిని ‘సరదాగా’, మీరు మీ అభిప్రాయాన్ని ఈ రచనని చదివి రాశారా, [బ్రహ్మదేవుడు కూడా చదవలేడు కాబట్టి] చదవకుండానే రాశారా అని అడగాలనిపిస్తోంది.
అద్వైతం గారు ఈ రచనని చదివిన తరవాతే తమ అభిప్రాయాన్ని తెలిపి ఉంటారనుకోవటంలో పెద్ద తప్పేమీ ఉండదు కాబట్టి [అద్వైతం గారికి క్షమాపణలతో] అద్వైతం గారు రమ గారన్నమాటకి [కనీసం] ఒక counter example ఈ మాటలు నేను, తః తః, అద్వైతం వేరు వేరు వ్యక్తులు అని చాటి చెపుతూ రాస్తున్నాను ఒకే వ్యక్తి అయితే రమ గారి మాట నిజమయే ప్రమాదం ఉంది.
అద్వైతంగారు వారు ఈ రచనని చదివిన తరువాతే చెప్పిన -అభిప్రాయం ముందు ఉండగా రమగారు ఈమాట అనడం రమగారు అద్వైతం గారి అభిప్రాయాన్ని చదవ కుండానే - కనీసం చూడకుండానే- ఈమాట రాశారానుకోవాల్సి వస్తోంది అయినా రమగారి మిగతా విమర్శావేశానికీ జవాబు రాస్తున్నాను.
శ్రీనాధుని శీర్షిక లో అరువు తెచ్చుకున్న లౌల్యమొకటి.: శ్రీనాథుడి పదబంధాన్ని అరువు తెచ్చుకోలేదు. అచ్చం గానే తెచ్చుకున్నాను. అరువు తెచ్చుకుంటే ఏదో రూపంలొ తిరిగి ఇచ్చేయాలి. పూర్వ కవుల భాషా సంక్రాంత ఋణాన్ని నేను తీర్చలేను. లాక్షా రాగరేఖ శ్రీనాథుడి నాయిక అపర్ణ పారాణి. ఈ కవితా వస్తువుకు తగినట్టుగా దీక్షను నా కవితా నాయిక లాక్ష గా చేసి ఆమెను దీక్షా లాక్షా రాగ రేఖ గా personify చేశాను.
కాళిదాసు ఇందుమతి సంచారిణీ దీపశిఖయై ఒక్క మొగాన్ని మాత్రం వెలిగించి మిగతా వాటినన్నిటినీ చీకట్లోకి నెట్టేస్తే ఇక్కడ నాయిక తన నాయకుడి జీవితాన్నీ ఆశయాన్ని పంచుకుని పలువురి పాలిపోయిన కళ్ళల్లో ఎర్ర జీరలు తేవటానికి చైతన్య దీపశిఖగా వస్తుంది.
‘మహర్వాటి’ ని పోతన నుంచి తెచ్చుకుని ఆ వాటికి మహాద్వారం నిర్మించి ఆ మహాద్వారానికి పలకరించుకునే పక్క పక్క ఆకులతో తోరణం కట్టాను. సంధ్యానిల[సంధ్యా సమీర ప్రసారాల] షడ్జమాన్ని శ్రీ శ్రీ నుంచి తెచ్చుకుని గీతాలాపనకు షడ్జమంతో పాటు పంచమం కూడా కావాలి కాబట్టి ఆ పంచమాన్ని ప్రత్యూష పవనాలనుంచి ఏరుకోండన్నాను.
తిలక్ నాయకుడు తన చెలి అభ్యంగానావిష్కృత వినీల శిరోజాల తమస్సముద్రాలు పొంగితే చూసి పొంగిపోతే ఇక్కడి వాడు తన నాయిక ఆగమనావిష్కృత సుహృల్లతా వనాంతానిల పరీమళ వ్యాపృత వసంతం వస్తున్న క్షణాలను ఆహ్వానిస్తున్నాడు ఇది తిలక్ కు శక్తివంతమైన అనుసరణే గానీ [బలహీనమైన] అనుకరణ కాదనే అని అనుకుంటున్నాను . ఇందులో ‘పరీమళ వ్యాపృత’ విశ్వనాథ ది ‘నాకుటీర మానంద వాయువీచీ ప్రసార శత సహస్ర పరీమళ వ్యాపృతమ్ము’ అంటాడు విశ్వనాథ ఒక చోట.
ఇలా’ పోగుచేసి రచించిన’ గేయం ఇది. ఇంకా రాయొచ్చు గానీ ఇక్కడితో ఆపేస్తాను .ఇందులో ఏమైనా స్వోత్కర్ష ధ్వనిస్తే అది మీరన్న ‘ధీమా’యే.
Ms Rama Bharadwaj: The piece is clearly utopian. It is extremely difficult if not impossible to give expression to utopia in words commonplace. In a way utopia is myth and it might at least serve an inspirational purpose if mythical images and characters appear in florid hues and flashy robes. If you choose to describe the work as verbose I do appreciate your aesthetic choice.
warmest regards
తః తః
తా.క. రమ గారు ఒక అభ్యర్ధన: మీ అభిప్రాయాలను చాలా చదివి ఉన్నాను. వాటినుంచి మీకు సాహిత్య వ్యాసంగం బాగానే ఉన్నట్టనిపిస్తోంది. ఏ వ్యాసంగాన్నయినా ఉదాహరణలూ (యెంత పెద్దవైతే అంత మంచిదన్న భావన ఒకటి బాహుళ్యం లొ ఉంది), ప్రత్యుదాహరణలూ (చిన్నదయినా ఒక్కటయినా చాలు) పరిపుష్ఠం చేస్తాయి. మీకు సందర్భం ఎదురయినప్పుడల్లా నా ‘దీక్షా లాక్షా రాగ రేఖని’ భాషా భేష జానికి ఒక పెద్ద ఉదాహరణగా పేర్కొనడం మరిచిపోకండి.
vrveluri అభిప్రాయం:
June 11, 2012 7:39 pm
Although, the poem #dIkshA laakshaa raaga rEkha# does not strictly fall under the category of Cento Poetry, I venture to say that the author has courageously took a bold step in almost creating a cento verse. Just like elegy, epic, epigram, ode and sapphic are poetic forms in western poetics, Cento is also a respectable poetic form. Usually, one uses lines from famous poets ( of course strictly speaking one has to use the entire line) and creates a valid poem. Cento verses are also known as patch verses.
To make a patch verse, you usually choose well-known poets and it is considered as a tribute.
One does not write a parody of poems or prose pieces by Tom Dick and Harry. A parody has its readability and value, besides providing enjoyment, if one chooses famous persons’ works. So, is the case with Cento verses.
I have nothing but admiration at the attempt by the author of dIkshaa laakshaa raaga rEkha.
I have been trying to write a few Cento Verses in Telugu for a long time and the present author has encouraged me with re-doubled vigor.
Regards.
Veluri Venkateswara Rao, commenting not as the Editor-in-Chief of eemaata.
rama bharadvaj అభిప్రాయం:
June 12, 2012 2:02 pm
వేలూరి గారూ !! మీరే కవిత్వం రాస్తానంటే ఇహనేం :) తప్పక ఎదురుచూస్తాను . కవులని వెక్కిరిస్తూ..స్తూ.. స్తూ.. మీరు కవిత్వం వేపు మళ్ళడం, ఇలా మీరు కవిత్వానికి లొంగడం ..ఆసక్తి దాయకమైన విషయమే కదా !! రాయండి రాయండి. నాలాంటి వారికి కాస్త కవిత్వాన్ని గురించి కొత్త సంగతులని చెప్పిన వారవుతారు :) ధన్యోస్మి !!
తహతహ గారూ !! నా ఉద్దేశ్యం లో ఏ కవిత అయినా దానికదే స్వతంత్రం గా నిలబడాలి. మంచికైనా ..కానిదానికైనా !! ఇంకొకరు మెచ్చినందువల్లా కాదు నొచ్చినందువల్లా కాదు. సమర్ధింపుకేమి . దేన్నైనా సమర్ధించవచ్చు. చివరగా ఏదైనా మాటల గారడీ వే కద :) అందువలన మీ కవితలోని భాషా భేషజానికి తిరిగీ నేను సిఫార్సు చేసే పని పడదు లెండి. ఈమాట పత్రికే చాలు . అన్ని సిఫార్సులకీ !! వేలూరి ఆ పనిని అప్పుడే మొదలెట్టారుగా !!
ఇంతకీ , నాకు అనిపించిన అభిప్రాయం నేను రాసేను. అలా కాకుండా మీ” భావావేశం” నా” విమర్శకావేశా”న్ని గనక మించినదే అయితే మంచిదే కద !! ఇలాగే రాస్తూండండి. అయితే నా అభిప్రాయం మాత్రం ఇప్పటికీ ఇదివరకటిదే !!
రమ.
ప్రసాద్ అభిప్రాయం:
June 13, 2012 7:21 pm
పై అభిప్రాయాల్లో, విషయాలు చాలా వరకూ అర్థమే కాలేదు. అసలు కవితే అర్థం కాలేదు నాకు. పోనీండి. ఈ కవిత, భాషా పండితులకే గానీ, నాలాంటి తెలివి తక్కువ వాళ్ళకి కాదు అని వదిలేశాను. అయితే, ఒక చిన్న తర్కం మాత్రం బాగా అర్థం అయింది.
“ఇలాంటి రచనని ఆ రాసిన వాళ్ళు తప్ప బ్రహ్మదేవుడు కూడా చదవలేడు :) :).” అన్న రమా భరద్వాజ్ గారి వ్యాఖ్యని, తః తః గారు చాలా యాంత్రికంగా అర్థం చేసుకున్నారు. అందువల్లనే, చదివిన వాళ్ళు కనీసం ఒక్కరని (వారు రాసిన అభిప్రాయన్ని బట్టీ) తేల్చి, రమా భరద్వాజ్ గారు తప్పని రుజువు చేసేశారు. ఇందులో యాంత్రికత్వం తప్పితే, వేరే తర్కం ఏమీ లేదు. మొదటగా, రమా భరద్వాజ్ గారు ఈ కవిత చదివే కదా, అలా విమర్శించిందీ? అంటే, రాసిన వాళ్ళు కాకుండా, ఇంకొకరు చదివినట్టేగా? ఆ వ్యాఖ్య అర్థం అలా యాంత్రికంగా తీసుకోకూడదు. “ఇలాంటి రచనని ఎక్కువ మంది చదవలేరు” అన్న అర్థాన్నే తీసుకోవాలి. విమర్శించేటప్పుడు, అలా వ్యంగ్యంగా అనడం, ఒక అతిశయోక్తికి చెందిన పద్ధతి. ఈ యాంత్రికత ఒక్కటే అర్థం అయింది, ఈ చర్చలో.
ప్రసాద్
మోహన అభిప్రాయం:
June 13, 2012 7:57 pm
ఇక్కడ ఒక విషయాన్ని వివరించడానికి అనుమతి ఇస్తారనుకొంటాను. సెంటో పద్యాలలాగే సెంటో కావ్యాలు కూడ ఉన్నాయి. తెలుగులో అట్టి అపూర్వమైన గ్రంథము ప్రబంధమణి భూషణము. ఇది ఒక సంకలన గ్రంథము. దీని సంకలన కర్త ఎవ్వరో తెలియదు. ఇతడు బహుశా క్రీ. శ. 1700 కు ముందు వాడు. ఎన్నో సంకలన గ్రంథాలు ఉన్నాయి. కాని ప్రబంధమణిభూషణపు విశేషము ఏమంటే ఇందులో కథ కూడ ఉన్నది. ఒక కథను అల్లుతూ దానికి సరిపోయే పద్యాలను వివిధ కావ్యలనుండి ఎన్నుకొన్నాడు కర్త. దీనిని చదివితే యిది ఒక సరికొత్త ప్రబంధమని తోచుతుంది కాని సంకలన మనిపించదు. దీని వివరాలు - ప్రబంధమణిభూషణము - పూర్వకవిసంచితము - సం. నిడుదవోలు వేంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1971.
విధేయుడు - మోహన
తః తః అభిప్రాయం:
June 14, 2012 12:52 pm
ప్రసాద్ గారూ:
అతిశయోక్తిలొ కూడా ఒక తర్కాన్నీ అందాన్నీ సాధించవచ్చు. ఒకరకంగా కవిత్వం చేసే పని అదే. విమర్శ తోట లోకి తీసుకుపోయే బాట లాగా లేకపోయినా లోపల ఏముందో చూడటానికి వీలు లేకుండా చేసే ముళ్ళ కంచెలా ఉండకూడదు. బాటసారులకు నీడనిచ్చే చెట్టులా లేకపోయినా దోవకు అడ్డమొచ్చే తుమ్మ మొద్దు లాగా ఉండకూడదు. అద్వైతం గారు తన అభిప్రాయం -అది ఎటువంటిదైనా - చెప్పిన తర్వాత, రమగారు తన అభిప్రాయం చెప్పిన పద్ధతి (“ఇలాంటి రచనని ఆ రాసిన వాళ్ళు తప్ప బ్రహ్మదేవుడు కూడా చదవలేడు”) ముఖ్యంగా ఒకరు భోజనం చేస్తున్నప్పుడు “చీ ఇలాంటి తిండి ఎవరు తింటారు” అన్నట్టుగా ఉంది. Fools tread where angels fear to step in అన్నట్టుగాఉంది
నేను చాలావరకూ నా వ్యాఖ్య అద్వైతం గారికి క్షమాపణలుగా రాసాను. నాకు తెలిసిన తర్క మొకటే- ‘కైత’వం.
తః తః అభిప్రాయం:
June 15, 2012 5:44 am
మోహనగారూ నమస్కారాలు. తెలుగు సాహిత్యంతో - ఇతరభాషా సాహిత్యాలతో మీ కున్న పరిచయాన్ని పక్కనబెట్టి - మీకుగల పరిచయం తలుచుకుంటే అసూయగా ఉంది. రవీ కవీ చూడలేని వాటిని కూడా మీలొ ఉన్న పరిశోధకుడు చూసేసి లొకానికి చూపిస్తున్నాడు.
మిత్రుడు
తః తః