పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి

5.56 అవ్యవేతం విగ్రహే విఘ్నకృద్భిః రేఫోష్మాణౌ సర్వపూర్వౌ యథోక్తం |

తాత్పర్యం: పూర్వపదం ఏదైనా రేఫ, షకారాలు మధ్యలో విఘ్నం కలిగించే స్పర్శాక్షరాలు లేని న-కారాన్ని, ణ-కారంగా మారుస్తుంది.

5.57 ఆనీత్ ను త్యం నోనువుః నోనుమః చ నయత్యర్థం చ ప్ర పరి ఇతి పూర్వౌ |

తాత్పర్యం: ప్ర- పరి- అన్న శబ్దాలు ఆనీత్, ను త్యం, నోనువుః, నోనుమః, మరియు నీ- ధాతువుగాగల శబ్దాలలోని న-కారాన్ని, ణ-కారంగా మారుస్తాయి.

ఉదాహరణలు:
ప్ర + ఆనీత్ + అమమన్ = ప్రాణీదమమన్ (ఋగ్వేదం 10.32.8)
ప్ర + ను + త్యం = ప్ర ణు త్యం (ఋగ్వేదం 5.1.7)
ప్ర + నోనువుః = ప్ర ణోనువుః (ఋగ్వేదం 6.45.25)
ప్ర + నోనుమః = ప్ర ణోనుమః (ఋగ్వేదం 7.31.4)
పరి + నీయతే = పరి ణీయతే (ఋగ్వేదం 3.2.7)
పరి + నయంతి = పరి ణయంతి (ఋగ్వేదం 3.53.24)

5.58 పురుప్రియా బ్రహ్మ సుతేషు నేషి ప్లుతాకారాంతం సషకారం ఇంద్ర
నతే సు స్మ ఇతి సవనేషు పర్షి స్వః అర్యమా ప్ర ఉరు పరి ఇతి తైః నః |

తాత్పర్యం: పురుప్రియా, బ్రహ్మ, సుతేషు, నేషి శబ్దాలు, ష-కారంతో ఉండి ప్లుత ఆ-కారంతో అంతమయ్యే శబ్దాలు, ఇంద్ర శబ్దం, మూర్ధన్యీకరించిన సు, స్వ శబ్దాలు, సవనేషు, పర్షి, స్వః, అర్యమా, ప్ర, ఉరు, పరి శబ్దాలు న-కారాన్ని ణ-కారంగా మారుస్తాయి.

ఉదాహరణలు:
పురు-ప్రియాః + నః = పురుప్రియా ణః (ఋగ్వేదం 8.5.4)
బ్రహ్మ + నః = బ్రహ్మా ణః (ఋగ్వేదం 7.28.1)
సుతేషు + నః = సుతేషు ణః (ఋగ్వేదం 1.10.5)
నేషి + నః = నేషి ణః (ఋగ్వేదం 1.129.5)
రక్ష + నః = రక్షా ణః (ఋగ్వేదం 1.18.3) (సేఏ 7.33)
ఇంద్ర + నః = ఇంద్ర ణః (ఋగ్వేదం 5.42.4)
తే + సు + నః = తే షు ణః (ఋగ్వేదం 1.169.5) (సేఏ 5.8)
ఆసు + స్మా + నః = ఆసు ష్మా ణః (ఋగ్వేదం 6.44.18) (సేఏ 5.7)
సవనేషు + నః = సవనేషు ణః (ఋగ్వేదం 3.41.4)
పర్షి + నః = పర్షి ణః (ఋగ్వేదం 2.33.3)
స్వః + నః = స్వర్ ణః (ఋగ్వేదం 1.70.9)
అర్యమా + నః = అర్యమా ణః (ఋగ్వేదం 3.54.18)
ప్ర + నః + దేవీ + సరస్వతీ = ప్ర ణో దేవీ సరస్వతీ (ఋగ్వేదం 6.61.4)
ఉరు + నః + తన్వే = ఉరు ణస్తన్వే (ఋగ్వేదం 8.68.12)
పరి + నః = పరి ణః (ఋగ్వేదం 2.33.14)

5.59 హేళః ముంచతం మిత్రాయ రాయా పూషా గధి అవిషత్ ఛకారవత్
నవ్యేభిః త్మనే వాజాన్ కృణోత ద్వే నయ ప్రతరం పరేషు న |

తాత్పర్యం: కానీ, హేళః, ముంచతం, మిత్రాయ, రాయా, పూషా, గధి, అవిషత్ శబ్దాలు, ఛకారం కలిగిన శబ్దం, నవ్యేభిః, త్మనే, వాజాన్ కృణోత శబ్దాలు, నయ ప్రతరం జంట పదాలు తరువాత వచ్చే న-కారం ణ-కారంగా మారదు.

ఉదాహరణలు:
పరి + నః + హేళః = పరి నో హేళః (ఋగ్వేదం 7.84.2)
ప్ర + నః + యచ్ఛతు = ప్ర నో యచ్ఛతు (ఋగ్వేదం 10.141.2)
ఉరు + నః + కృణోత = ఉరు నః కృణోత (ఋగ్వేదం 10.128.5)
ప్ర + నః + నయ + ప్రతరం = ప్ర నో నయ ప్రతరం (ఋగ్వేదం 6.47.7)
ప్ర + నః + నయ + వస్యః = ప్ర ణో నయ వస్యః (ఋగ్వేదం 8.71.6)

5.60 గోరోహేణ నిర్గమాణి ఇంద్ర ఏణా ఇంద్ర ఏణం స్వర్ణ
పరాణుదస్వ అగ్నే రవేణ వార్ణ శక్ర ఏణం |

తాత్పర్యం: గోరోహేణ, నిర్గమాణి, ఇంద్ర ఏణా, ఇంద్ర ఏణం, స్వర్ణ, పరాణుదస్వ, అగ్నే రవేణ, వార్ణ, శక్ర ఏణం ఈ పదాలలో న- కారం ణ-కారంగా మారుతుంది.

ఉదాహరణలు:
గోః + ఓహేన = గోరోహేణ (ఋగ్వేదం 1.180.5)
నిః + గమాని = నిర్గమాణి (ఋగ్వేదం 4.18.2)
ఇంద్రః + ఏనాః = ఇంద్ర ఏణాః (ఋగ్వేదం 10.19.2)
ఇంద్రః + ఏనం = ఇంద్ర ఏణం (ఋగ్వేదం 1.163.2)
స్వః + న = స్వర్ణ (ఋగ్వేదం 10.43.9)
పరా + నుదస్వ = పరా ణుదస్వ (ఋగ్వేదం 7.32.25)
అగ్నేః + అవేన = అగ్నేరవేణ (ఋగ్వేదం 1.128.5)
వాః + న = వార్ణ (ఋగ్వేదం 2.4.6)
శక్రః + ఏనం = శక్ర ఏణం (ఋగ్వేదం 8.1.19)

5.61 ఏషా నతిః దంత్యమూర్ధన్యభావః |
తాత్పర్యం: ఇది దంత్యాలను మూర్ధన్యాలుగా మార్చే నతి సూత్రం.

(ఈ అనువాదానికి నాకు సహాయపడ్డ గ్రంథం మోతీలాల్ బనారసీ దాస్ వారు ప్రచురించిన మంగళదేవశాస్త్రి గారి “The Rgveda-pratisakhya with the commentary of uvaṭa”. )

కళింగత్తుపరణిలో కరునాడు

తమిళసాహిత్యంలో యుద్ధవీరుని గాథలను వర్ణించే కావ్య ప్రక్రియకు ‘పరణి’అని పేరు. భరణి నక్షత్రం యుద్ధదేవతకు సంబంధించిందని భావిస్తారు కాబట్టి ఆ భరణియే తమిళంలో ‘పరణి’ అయ్యింది. వెయ్యి ఏనుగులను యుద్ధరంగంలో సంహరించిన వీరుడిని వర్ణిస్తూ వెయ్యి పద్యాల సమాహారంగా రాసే కావ్యం ఇది. యుద్ధగాథలను వర్ణించడమే కాక వీరత్వాన్ని ఉగ్గడించి రాజ్యం వీరభోజ్యమని అభివర్ణించడం ఈ కావ్యాలలో కనిపించే ఇతివృత్తం. మనకు లభ్యమౌతున్న పరణి కావ్యాలలో జయంకొండర్ రాసిన కళింగత్తుప్పరణి, ఒట్టక్కూత్తర్ రాసిన తక్కయాగప్పరణి (దక్షయాగభరణి) అతి ప్రాచీనమైనవి.

చోళరాజైన మొదటి కులోత్తుంగ మహరాజు (1070-1122 క్రీ.శ.) ఆస్థానకవి జయంకొండర్. ఆయన రాసిన ‘కళింగత్తుప్పరణి’ 1110వ సంవత్సరం కళింగ యుద్ధంలో విజయం సాధించి తెచ్చిన చోళ సేనాధిపతి కరుణాకర తొండమాన్‌ను కీర్తిస్తూ రాసిన కావ్యం. పదమూడు భాగాలుగా ఉన్న ఈ కావ్యంలో ఉపోద్ఘాతం తరువాత ద్వారోద్ఘాటన (తలుపు తెరవడం) విభాగంలో విజేతలుగా వెనుదిరిగి వస్తున్న వీరులకు తలుపులు తెరవమని ఉద్ఘోషించే పద్యాలు 50 దాకా ఉన్నాయి.

విశాలాంధ్ర ప్రచురణాలయం వారు ప్రచురించిన ఆరుద్ర అనువాద కావ్యం ‘వెన్నెల-వేసవి’కు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ‘ముదావహం’ అనే పేరుతో తొలిపలుకు రాసారు. అందులో ఆయన “కరునాడు” అంటే ఆంధ్రదేశమేనని ఉద్ఘాటిస్తూ అందుకు నిదర్శనంగా కళింగత్తుపరణిలోని ఒక పద్యం చూపించారు.

ఆసక్తికమైన విషయమేమిటంటే, దక్షిణాది భాషల్లో ఈ నతి సూత్రం ల-కారానికి కూడా వర్తించడం. తెలుగు, కన్నడ మొదలైన భాషలలో సంస్కృత పదాలలో కనిపించే “ళ” కారం చాలావరకు నతి సూత్రం ద్వారానే వివరించవచ్చు. ఈ కింది పదాలలో ర- కారం తరువాతే వచ్చే ల-కారం ళ-కారంగా మారింది, గమనించండి:
అరళము, కేరళము, ఖురళి, గరళము, తరళము, ధారళము, పరళులు, ప్రళయము, మురళి, విరళము, విరళి, సరళ వంటి పదాలలో ర-కారం తరువాత ళ-కారం కనిపిస్తుంది. అలాగే, ప్రక్షాళన, క్ష్వేళితము, క్షాళితము, ఇక్షునాళిక వంటి పదాల్లో ష-కారం తరువాత ళ-కారం కనిపించడం నతి వంటి ధ్వనిపరిణామమే.

అయితే, తెలుగులో “ళ” కారం కనిపించే కొన్ని పదాలు కన్నడ తమిళాలలో ళ-కారం కనిపించదు. ఉదహారణకు

కళ్యాణి (తెలుగు), కల్యాణి (కన్నడ, తమిళం);
కళ (art) కలా (కన్నడ, తమిళం);

అలాగే కన్నడలో “ళ” కారం కనిపించే కొన్నిపదాలు తెలుగులో మామూలు ల-కారంతో కనిపిస్తాయి:

మంజుళ (కన్నడ), మంజుల (తెలుగు);
తుళసి (కన్నడ, తమిళ), తులసి (తెలుగు).

ఈ పదాలలో ళ-కారాన్ని వివరించడానికి ఆరోజుల్లోని వివిధ ప్రాకృత భాషలను పరిశీలించవలసి ఉంటుందని నా అభిప్రాయం.

ఆనాడు తెలుగులూ- తమిళులూ – చాల సన్నిహితంగా బ్రతికినారు. ఆంధ్రదేశాన్ని వారు “కరునాడు” అనేవారు. తెలుగును “వడక్కు” అని పిలవటం వాడుక. ఆ సందర్భంలో మూలం ఇలా వుంది.

‘మజలై తిరుమొజియిల్ చిలవడకుం,చిలతమి జుం
కురిత్తరు,కరునాటియర్! క్కటై తిరమిన్’

దీని అనువాదం:
మురిపించుతూ కొన్ని ముద్దు తెలుగు పదాలు
అరవమ్ముతో కలిపి అచటచట తడబడుచు
చిరుతీపి పలుకులు చెవులు విందులు చేయ
కరునాడు యువతులు గడియ తీయండి …”

కళింగత్తుపరణి లోని అసలు పద్యం ఇది:

మఴలై తిరుమొఴియిల్
చిల వడుగుం చిల తమిఴుం
కుఴఱిత్తరు కరునాడియర్
కుఱుగి కడై తిఱమిన్

దానికి నా ముక్కస్య-ముక్క అనువాదం:

మురిపపు చిరునుడువులలో
కొంత తెలుగును కొంత తమిళమును
కలగలిపి పలుకు కరునాటి స్త్రీలు
వచ్చి గడియను తెఱువుడీ

కొంత తెలుగును, కొంత తమిళాన్ని కలగలిపి మాట్లాడే కరునాటి యువతులు అంటే కన్నడ మాతృభాషగా గల యువతులు కొంత తెలుగును, కొంత తమిళాన్ని కలగలిపి మాట్లాడుతారు అన్న అర్థమే ధ్వనిస్తుంది నాకు. ఇది అనాటి బహుభాషా సామాజిక పరిస్థితులను తెలియజేస్తుందేమో గానీ, కరునాడు అంటే ఆంధ్రదేశమని నిరూపించదని నా అభిప్రాయం. పుట్టపర్తి నారాయణాచార్యులు గారి విద్వత్తుపై నాకు సదభిప్రాయమే ఉన్నా కరునాడును ఆంధ్రదేశమని చెప్పడం నిరాధారమని నా నమ్మకం.