కొవ్వుపుంజి

కోర్నుడెట్ ఎందుకనో సాయంత్రమంతా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏదో ఆలోచనలో వుండి పోయాడు, గడ్డాన్ని నిమురుకుంటూ! ఆఖరికి మధ్య రాత్రి దగ్గరవుతుండా తడబడుతున్న అడుగులతో లూసో అతని దగ్గరికెళ్ళి వీపు మీద చరిచి, “నీ బాధేమిటయ్యా మిత్రమా?” అనడిగాడు నవ్వుతూ. కోర్నుడెట్ విసురుగా కుర్చీలోంచి లేచాడు. అందరి వంకా అసహ్యంగా చూసాడొకసారి.

“మీ అంత నీచులని నేనింతవరకూ చూడలేదు!” అన్నాడు. విసురుగా లేచి తలుపు తెరుచుకొని వెళ్ళబోతూ, ఒక్క క్షణం ఆగాడు. మళ్ళీ అసహ్యాన్నంతా గొంతులో నింపుకుని,

“నీచులు!” అని వెళ్ళిపోయాడు.

అందరూ నిర్ఘాంతపోయారు. లూసో కయితే అలేమయిందో కూడా అర్ధం కాలేదు. అంతలోకే తేరుకుని పెద్దగా నవ్వుతూ అందరి వైపూ చూసి “మీలాటి అమాయకులకసలేమీ తెలియదు,” అంటూ మొదలు పెట్టి, “రాత్రి రహస్యాలు చెప్పనా?” అని మూడు రోజుల క్రితం తను కారిడార్లో చూసిందంతా చిలవలూ పలవలూ నేసి అందరికీ చెప్పాడు. అందరూ పగలబడి నవ్వారు “ఒహో! ఇతనూ గ్రంథసాంగుడేనన్నమాట,” అంటూ.

“నిజమా? నిజంగా అలా జరిగిందా?” కొందరికింకా నమ్మకం కుదరలేదు.

“నిజంగా నిజం! నా కళ్ళతో నేను చూసాను, అతను బ్రతిమాలుతుంటే!”

“అది వొద్దంటుందా?”

“అవును! ఎందుకంటే పక్క గదిలో జర్మను అధికారి వున్నాడు కాబట్టి!”

“నువ్వేం పొరబడలేదు కదా?”

“అరె! నిజమేనంటుంటే!”

కౌంటు నవ్వాపుకోలేక పొర్లి పొర్లి నవ్వుతున్నాడు. లామడాన్ నవ్వీ నవ్వీ కడుపులో నొప్పి లేస్తుందన్నాడు. లూసో ఇంకా అన్నాడు, “ఇప్పుడర్థమైందా కోర్నుడెట్ కి అంత కోపం ఎందుకొచ్చిందో?”

మళ్ళీ అందరూ పగలబడి నవ్వసాగారు. అలిసి నిద్రకుపక్రమించారు. పడుకోబోతూ లూసోతో అతని భార్య, “ఆ చుంచు మొహం లామడాన్ పెళ్ళాం ఏడుస్తూనే నవ్విందీ రాత్రంతా. జర్మన్ అధికారి తనని పిలవలేదని దాని ఏడుపంతాను!” అంది.

“కొంతమంది ఆడవాళ్ళకి యూనిఫారం వేసుకున్న మగాడైతే చాలు! ఒళ్ళూ పై తెలియదు. ఛీ!ఛీ! సిగ్గూ ఎగ్గూ లేని వాళ్ళు.”


మర్నాడు అంతా లేచేసరికి తెల్లటి మంచు అంతటా కప్పేసినా పల్చటి సూర్యకాంతి వెచ్చగా ప్రసరిస్తూ వుంది. బగ్గీ, గుర్రాలు, బగ్గీ తోలే అతనూ అంతా ప్రయాణానికి సిధ్ధంగా వున్నాయి. బగ్గీ అతను పైపు కాలుస్తూ ప్రయాణీకుల కోసం ఎదురు చూస్తున్నాడు. అందరి మొహాల్లోనూ సంతోషం! గబగబా తమ తమ సామాన్లు బగ్గీ లోకెక్కించుకున్నారు. అంతా ఎలిజబెత్ కొరకు ఎదురు చూస్తున్నారు.

ఆఖర్న వచ్చింది ఎలిజబెత్. సిగ్గూ అవమానాలతో తల దించుకుని వుంది. మునుపట్లా ధైర్యంగా నడవటంలేదు. పిరికిగా, బెదురుగా వాళ్ళ వైపు అడుగేయబోయింది. కూడబలుక్కున్నట్టు అందరూ ఆమె వైపు అసహ్యంగా చూసి తలలు తిప్పుకున్నారు. అలాటి అపవిత్రురాలి గాలి తన భార్య వైపు సోకద్దన్నట్టు కౌంటు తన భార్యని గంభీరంగా పక్కకి తీసికెళ్ళిపోయాడు, ఆమె వైపు విషపు చూపులు చూస్తూ.

ఎలిజబెత్ మొహం వెల వెలా పోయింది. ధైర్యం తెచ్చుకుని శ్రీమతి లామడాన్‌ని పలకరించింది. ఆవిడా కేవలం తల పంకించి తల తిప్పేసుకుంది. వున్నట్టుండి అందరూ చాలా హడావిడిగా అక్కణ్ణించి వెళ్ళిపోయి బగ్గీలోకెక్కి కూర్చున్నారు. ఏదో అంటు వ్యాధి వచ్చిన వాళ్ళని వెలేసినట్టు ఎవరూ ఎలిజబెత్ వైపు చూడనైనా చూడటం లేదు.

లూసో సతీమణి కొవ్వుపుంజి వైపు అసహ్యంగా చూసి, భర్తతో, ” ఆ చవకబారు దాని పక్కన నేను కూర్చోలేను,” అని అంటుంది పెద్ద గొంతుకతో. అందరూ బగ్గీలో సర్దుకుని కూర్చొన్నారు.

ఎవరూ మాట్లాడటం లేదు. ఎలిజబెత్ తల వాల్చుకుని కూర్చుంది. ఆమెకి తనని బలవంతంగా జర్మన్ అధికారి కౌగిట్లోకి తోసినందుకు వాళ్ళందరి మీదా, వారి వూక దంపుడు మాటలకి మోసపోయినందుకు తన మీదా, మొత్తం ప్రపంచం మీదా పట్టరానంత ఆగ్రహం వస్తుంది. కోపమూ, అవమానమూ, ఉక్రోషమూ అన్నీ కలిపి ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

కౌంటెస్ శ్రీమతి లామడాన్ గారి వైపు తిరిగి సంభాషణ మొదలు పెట్టింది. “మీరు శ్రీమతి డెట్రిలీస్ నెరుగుదురా?”

“చాలా! ఆవిడ నాకు దగ్గరి స్నేహితురాలు!”

“అవునా? ఆడదంటే ఆమే! ఎంత చక్కని స్త్రీ!”

“అవును! ఆవిడకి రాని విద్య లేదనుకోండి. బొమ్మలేసినా, పాటలు పాడినా, అబ్బో, ఆవిడకావిడే సాటి!”

లామడాన్, కౌంటూ మాట్లాడుకుంటున్నారు. వారి మాటల్లో, షేర్లూ, డబ్బులూ, పన్నులూ పదాలు పదే పదే వినబడుతున్నాయి. లూసో సత్రం నించి తను కాజేసిన పేక ముక్కలతో ఆట మొదలు పెట్టాడు. సిస్టర్లిద్దరూ సంచీలోంచి రోజరీ తీసి ఆగకుండ ప్రార్థనలు చేస్తున్నారు. కోర్నుడెట్ ఏమీ మాట్లాడకుండ మౌనంగా వున్నాడు.

మూడు గంటల ప్రయాణం తరువాత లూసో ఆకలవుతుందన్నాడు. ఆయన సతీమణి సంచీ లోంచి ఒక చిన్న పార్సెల్ తీసి ఆయనకీ తనకీ భోజనం వడ్డించుకుంది. కౌంటు గారి భార్యామణీ, లూసో గారి శ్రీమతీ వారి వారి పాకెట్టులు విప్పి భోజనం వడ్డించుకున్నారు. సిస్టర్లిద్దరూ వాళ్ళ భోజనమూ ముగించారు. కోర్నుడెట్ తన కోటు జేబులోంచి నాలుగు ఉడకబెట్టిన కోడి గుడ్లని తీసి వలుచుకుని తినటం మొదలు పెట్టాడు.

దురదృష్టవశాత్తూ క్రితం రోజు జరిగిన సంఘటనలతో మనసు చెదిరి వున్న ఎలిజబెత్ తన తిండి సంగతి ఏమాత్రమూ ఆలోచించలేదు. తన సంగతి ఏ మాత్రం పట్టించుకోని ఆ కృతఘ్నులపైన కోపం ఆమెని కుదిపేసింది. వాళ్ళని పెద్ద గొంతుకతో తిడదామనుకుని గొంతెత్తింది, కానీ దుఃఖం ఆమె గొంతు కడ్డుపడింది. ఎవరూ ఆమె వైపు చూడలేదు, ఎవరూ ఆమె గురించి ఆలోచించలేదు.

తన పట్ల తనే అసహ్యంతో కుంచించుకు పోయిందామె. తనని తను సంబాళించుకునేందుకు శత విధాలా ప్రయత్నించి వెక్కిళ్ళను గొంతులోనే ఆపేసింది. అయినా ఆమె కంటి వెంట ధారలుగా కన్నీళ్ళు ప్రవహిస్తున్నాయి. అయినా ఆమె తలెత్తి నిటారుగా కూర్చుంది మొహాన్ని కఠినంగా మార్చుకుని.

ఆమె కన్నీళ్ళనాపుకునే ప్రయత్నాన్ని చూసి కౌంటు నా తప్పేం లేదన్నట్టు భుజాలెగరేస్తే, శ్రీమతి లూసో కిసుక్కుమంటూ నవ్వి, “సిగ్గూ లజ్జా లేని వాళ్ళకి ఏడుపే గతి,” అంది ఈసడింపుగా. సిస్టర్లిద్దరూ మిగిలిపోయిన భోజనాన్ని జాగ్రత్తగా పొట్లం కట్టుకుని ఆపైన తిరిగి ప్రార్థన మొదలు పెట్టారు.

కోర్నుడెట్ తిన్న గుడ్లని అరిగించుకుంటూ మనుషుల నైజాన్ని అర్థంచేసుకున్న వాడిలా నవ్వుతూ ఈల మొదలు పెట్టాడు. అతని ఈల పాట విన్న వాళ్ళందరి మొహాలూ పాలి పోయాయి. వాళ్ళ అసౌకర్యాన్ని చూస్తున్న కొద్దీ కోర్నుడెట్ ఈల పాట ఇంకా గట్టిగా వినిపిస్తున్నాడు. అప్పుడప్పుడు తనూ ఆ పాటలోని కొన్ని పంక్తులను గొంతెత్తి ఆలపిస్తున్నాడతను. రాత్రంతా కోర్నుడెట్ ఈల పాట, కొవ్వుపుంజి సన్నని ఏడుపు వినిపిస్తూనే ఉన్నాయి.

కోర్నుడెట్ పాడుతున్న ఆ పాట ఫ్రెంచి జాతీయుల ధైర్య సాహసాలను, నిజాయితీనీ, దేశభక్తిని ఉగ్గడించే ఫ్రెంచి జాతీయ గీతం: La Marseillaise!

(మొపాస 1880లో రాసిన బౌల్ ది సూ కథకు తెలుగు సేత)


శారద

రచయిత శారద గురించి:

బ్రిస్బేన్ నగరంలో నివసించే శారదగారు తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు వ్రాస్తూ వుంటారు. 1996 లో మొదలైన కథా రచనతో దాదాపు నలభై తెలుగు కథలు, ఇరవై అనువాద కథలూ ప్రచురించారు. “నీలాంబరి”, “మలయ మారుతం” పేర్లతో రెండు కథా సంపుటాలు వెలువరించారు. “వీలునామా” అనే అనువాద నవలా, “తమసోమా జ్యోతిర్గమయా” అనే తెలుగు నవలా “శంకరాభరణం” అనే అనువాద కథల సంపుటీ వెలువరించారు. త్వరలో రాబోతున్న “విజ్ఞాన శాస్త్రంలో వనితలు” అనే పుస్తకంలో ప్రపంచంలోని మహిళా శాస్త్రవేత్తలను పరిచయం చేస్తున్నారు. కథా రచనతో పాటు సంగీతం వీరికి చాలా ప్రియమైన వ్యాపకం. వీరి బ్లాగు రచనలు https://neelambari.blog/ లో చదవొచ్చు.

 ...


గీ డీ మొపాసా

రచయిత గీ డీ మొపాసా గురించి:

గీ డీ మొపాసా (1850 – 1893) ప్రసిధ్ధ ఫ్రెంచి రచయిత, ఆధునిక చిన్న కథల సాహిత్యానికి ఆద్యుడు. ప్రపంచ సాహిత్యంలో కథారచన అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లలో మొపాసా ఒకటి. వస్తువు, శిల్పం, విషయంలో సోమర్ సెట్ మాం కీ, ఓ హెన్రీకి కూడా మార్గదర్శకుడిగా కీర్తి సంపాదించేడు. అసామాన్యమైన సునిశితదృష్టి కనబరుస్తూ, మానవనైజంలోని అన్ని పార్శ్వాలూ స్పృశిస్తూ అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించాడు. అందులో Naturalism and Fantastic రెండూ ఉన్నాయి. అతని కథలని చిన్నచిన్న మార్పులతో చాలామంది అనుకరించేరు కూడా. మనోవిశ్లేషణాత్మక రచన అతని ముద్ర. లియో టాల్ స్టాయ్ కళ గురించి వ్రాసిన వ్యాసాలలో, మొపాసా సాహిత్యంలోని కళాత్మకతను ఆవిష్కరించేడు. అతని వచన రచన కొన్ని సందర్భాలలో పద్యరచనని మించిన కల్పనాశక్తితో, సందర్భానికి తగ్గట్టుగా ఉంటూ, దానికి విలువని జోడిస్తుంది. మోపాసా Joseph Prunier, Guy de Valmont, and Maufrigneuse అన్న మారు పేర్లతో రచనలు చేశాడు.

 ...