కొవ్వుపుంజి

కోటను ముట్టడిస్తున్న సైనికుల్లా వాళ్ళ వ్యూహాన్ని మళ్ళీ మళ్ళీ చర్చించుకున్నారు. ఎవరు చేయాల్సిన వాదనలూ, వ్యాఖ్యానాలూ వాళ్ళు మననం చేసుకున్నారు. కొన్ని మామూలు దాడులకీ, ఇంకొన్ని ఆకస్మిక దాడులకీ ప్రణాళికలు సిధ్ధం చేసుకున్నారు. కోర్నుడెట్ మాత్రం ఈ వ్యూహ రచనకి దూరంగా వున్నాడు. వాళ్ళు మాటల్లో పడి ఎలిజబెత్ చర్చి నించి తిరిగి రావటం గమనించనేలేదు. వున్నట్టుండి కౌంటు “హుష్” అని సైగ చేసాడు. ఆమెని చూసి అందరూ మాటలాపేసారు. ఒక్క క్షణం అందరూ తేలు కుట్టిన దొంగల్లా మౌనంగా వుండిపోయారు. అందరికంటే ముందు శ్రీమతి కౌంటు తేరుకున్నారు.

“బాప్టిజం బాగా జరిగిందా ఎలిజబెత్?” అనడిగింది స్నేహ పూర్వకంగా.

ఎలిజబెత్ తను చూసిన బాప్టిజంని వర్ణించి, “కొన్నిసార్లు ప్రార్థనతో మనసు కుదుటపడుతుంది కదూ?” అంది. అందరూ ఆమెతో అంగీకరించారు.

ఆ తరువాత భోజనాల సమయం వరకూ స్త్రీలందరూ ఆమెతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. భోజనాలకి బల్ల వద్ద కూర్చోగానే వాళ్ళ పథకం అమలులో కొచ్చింది. ముందుగా యధాలాపంగా ‘త్యాగం’ అన్న విషయాన్ని చర్చకి పెట్టారు. పురాణాల్లోవీ, చరిత్రలోవీ త్యాగధనుల కథలు ఏకరువు పెట్టారు. అందరికంటే శత్రు సైన్యాధికారులకి తన అందాన్ని ఎరగా వేసి తన ప్రజలని కాపాడుకున్న క్లియోపాత్రాని నోరారా పొగిడారు. అంతే కాదు, కేవలం వాళ్ళ ఊహల్లోంచి జనించిన కథని కూడా వాళ్ళు చెప్పుకున్నారు. హన్నీబాల్ రోమ్ నగరాన్ని ముట్టడించినప్పుడు ఆ నగరంలోని స్త్రీలందరూ అతన్నీ, అతని సైన్యాధికారులనీ, అతని సైనికులందరినీ తమ పడక గదుల్లోకాహ్వానించి రోమ్ నగరానికెదురైన ముప్పు తప్పించటానికి సిధ్ధపడ్డారట.

శత్రువులకి తమ శరీరాన్ని ఎరగా వేసి, ఆయుధంగా చేసి తమ ప్రజలని కాపాడుకోవటం కంటే స్త్రీ చేయగలిగే త్యాగం ఏముంటుంది అని వారు ఆశ్చర్యపోయారు! అయితే ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి! ఈ విషయాలన్నిటినీ వారు సూచన ప్రాయంగానే చర్చించారు. ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టే అసభ్య పదజాలమేదీ వారు వాడలేదు! చాలా నిగ్రహంతో, సభ్యతతో వాళ్ళు విషయం గురించి మాట్లాడుకున్నారు. వాళ్ళ మాటలు విన్న ఏ మనిషికైనా ఆడదాని శరీరం వున్నది అలా శత్రువులనించి తమ పురుషులని కాపాడటానికే అన్న నమ్మకం ఏర్పడుతుంది. అంత ఆవేశంగా వాళ్ళు మాట్లాడారు. ఇద్దరు సిస్టర్లూ, ఎలిజబెత్ మాత్రం ఏమీ మాట్లాడలేదు.

ఆ మధ్యాహ్నమంతా ఎలిజబెత్ ఆలోచిస్తూ వుండిపోయింది. కానీ తనని అందరూ ఇంతకు ముందులా ‘మీరు’ అనకుండా, ‘నువ్వు’ అంటున్నారు. సంఘంలో తన స్థాయి ఏమిటో తనకి తెలియజేస్తున్నారా?

మళ్ళీ సాయంత్రం భోజనాలకి బల్ల వద్దకి రాగానే ఫొలెన్వి క్రితం రోజులాగానే పెద్ద గొంతుకతో తన ప్రశ్న వేసాడు.

“ఎలిజబెత్ తన మనసు మార్చుకుందా అని జర్మన్ అధికారి తెలుసుకోగోరుతున్నారు.”

“లేదని చెప్పు!” ఎలిజబెత్ గంభీరంగా అంది.

భోజనాల వద్ద మళ్ళీ అందరిని నిస్పృహ కమ్ముకుంది. పైగా లూసో మూడు సార్లు తప్పటడుగులు వేసాడు. త్యాగాన్ని గురించి చెప్పుకోవటానికి తలలు బద్దలు కొట్టుకున్నా ఒక్కళ్ళకీ ఒక్క కథా గుర్తు రాలేదు. కౌంటు గారి శ్రీమతి వున్నట్టుండి మతాన్ని గురించీ, ధర్మాన్ని గురించీ సిస్టర్లతో మాటల్లోకి దిగింది. వాళ్ళ మాటలు మహాత్ముల జీవిత ఘట్టాల్లోకి దారి తీసాయి.

మామూలు మనుషులం పాపమని భావించే చాలా పనులని మహాత్ములు ఆపధ్ధర్మంగా చాలా సార్లు చేసారు. అయినా వారిని ఎటువంటి పాపమూ అంటుకోదు. ఎందుకంటే ఆ పాపపు పనులు వాళ్ళు స్వార్థం కోసం కాక పరుల హితం కొరకు చేసినవి కాబట్టి. అటువంటి పనులను చర్చి క్షమించి వారిని అక్కున చేర్చుకుంటుంది కూడా. అలా చెప్తూ ఇద్దర్లోకి పెద్దదైన సిస్టరు రంగం లోకి దిగింది. అది అమాయకత్వమో, అతి తెలివో తెలియదు కానీ మిగతా అందరికంటే ఆమె ఎక్కువ ఆవేశంగా మాట్లాడింది. అంతవరకూ ఆమెని వాళ్ళంతా ముభావి అనుకున్నారు, కానీ ఆమె వీళ్ళందరికంటే రెండాకులు ఎక్కువే చదివినట్టుంది. ఆమెకి తన చర్చీ, తన సంప్రదాయాలే జీవితం కాబట్టి ఆమె చెప్పేదంతా సాధికారికంగా, కాలాతీతమైన ధర్మం అనిపించేటట్టు చెప్పింది. ఉద్దేశ్యం మంచిదైనప్పుడు పాప కార్యాలని కూడా భగవంతుడు మన్నిస్తాడు అని అనర్గళంగా ఉపన్యసించి ఆమె అందరినీ ఒప్పించగలిగింది.

“అయితే సిస్టర్! నిజంగా భగవంతుడు పరుల హితం కొరకు మనం చేసే పాప కార్యాలనీ క్షమిస్తాడా?” కౌంటు శ్రీమతి అడిగింది.

“నిస్సందేహంగా!”

ఈ రకంగా వారు భగవంతుని అంతర్యాన్ని గురించీ, అతని తీర్పుల గురించీ చర్చించుకున్నారు. మిగతా వాళ్ళ మాటలకంటే ఈ సిస్టరు మాటలు ఎలిజబెత్ ని చాలా కదిలించాయి.

అక్కణ్ణించి సంభాషణ సిస్టర్లిద్దరి దైనందిన జీవితం వైపు మళ్ళింది. వారిద్దరినీ వాళ్ళ కాన్వెంటు హావ్రే నగరానికి క్షతగాత్రుల సేవ కోసమని పంపుతుంది. తనతో వున్న సిస్టరు క్షతగాత్రుల సేవలో నిష్ణాతురాలని చెప్పిందామె. ఆ తరువాత ఆమె తను చూసిన సైనికుల కష్టాలనీ, వారికైన గాయాలనీ, వారి దుర్భర వేదననీ కళ్ళకి కట్టినట్టు వర్ణించింది. వాళ్ళని వైద్య సహాయంతో సేద దీర్చాల్సిన తామిద్దరూ దురదృష్తవశాత్తూ ఇక్కడ చిక్కుకునిపోయారు. ఎంత మంది ఫ్రెంచి సైనికులు వైద్య సహాయం లేక అలమటిస్తున్నారో, ఎంత మంది చచ్చిపోతున్నారో, అనుకుని నిట్టూర్చిందామె. ఆవిడ మాట్లాడింతరువాత ఆ మాటల ప్రభావం పోతుందో ఏమో నన్న భయంతో ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడకుండ పక్కలు చేరారు.


మర్నాడు అందరూ తీరుబడిగా లేచారు. తాము నాటిన విత్తనం మొలకెత్తేంత వరకూ వేచి చూడాలనుకున్నారేమో, ఎవరూ మధ్యాహ్నం భోజనాల వరకూ ఏమీ మాట్లాడలేదు. భోజనానంతరం శ్రీమతి కౌంటు వ్యాహ్యాళి కెళ్ళాలని ప్రతిపాదించింది.

ముందే వారనుకున్న పథకం ప్రకారం కౌంటు కొవ్వుపుంజి చేయందుకుని అందరికీ కొంచెం దూరంగా నడవసాగాడు.

ఆయనలాటి గొప్ప కుటుంబీకులు తక్కువ స్థాయితో మాట్లాడేటప్పుడు ఉపయోగించే చనువూ అధికారమూ కూడిన గొంతుతో ఆయన వెంటనే విషయానికొచ్చాడు. “చూడమ్మా! మమ్మల్నిలా ఇక్కడ చిక్కుబడేలా చేయటం నీకేమైనా బాగుందా, ఒక్క సారి ఆలోచించు. ఇప్పుడు నీతో పాటు మా అందరి బ్రతుకులూ ఆపదలో పడ్డట్టే కదా? దీనికంటే ఆ అధికారి కోరిక మన్నించటం సబబేమో ఒక్కసారి ఆలోచించు! నువ్వెన్ని సార్లు ఎంత మంది కోర్కె తీర్చలేదు?”

ఎలిజబెత్ ఏమీ మాట్లాడలేదు. ఆయన సామ దాన భేదో పాయాలన్నీ ప్రయోగించాడు, తన హుందా ఏ మాత్రం చెడకుండానే. అప్పుడప్పుడూ, చనువుగా, అంతలోకే తండ్రిలా, అంతలోకే కొంటెగా, మళ్ళీ అంతలోకే గంభీరంగా ఆయన కొవ్వుపుంజిని ఉక్కిరి బిక్కిరి చేసాడు తన వాదనలతో. ఆమె చేయబోయే త్యాగాన్ని మెచ్చుకోవటానికి తనకున్న శక్తి చాలదన్నాడు. అంతలోనూ ఆయన స్వఛ్ఛమైన గ్రాంథిక భాష మాట్లాడటం మరిచిపోలేదు.

“అసలు, నువ్వు అతని కోరిక తీర్చిన తరువాత ఆ అధికారి గర్వానికి పట్ట పగ్గాలుండవేమో! నీలాటి అందగత్తెని వశ పర్చుకోవటమంటే మాటలా! బహుశ జర్మనీ అంతటా వెదికినా నీలాటి స్త్రీ కనపడదేమో అతనికి” అని ఆమెని మురిపించాడు. అంతా విని ఎలిజబెత్ ఏమీ మాట్లాడలేదు.

వ్యాహ్యాళి నించి తిరిగి రాగానే ఎలిజబెత్ తన గదికి వెళ్ళిపోయి మళ్ళి కిందకి రాలేదు. అందరిలో ఆతృత హెచ్చింది.

రాత్రి భోజనం సమయమైంది. అయినా ఆమె కిందికి రాలేదు.

ఇంతలొ ఫొలెన్వీ వచ్చి “ఎలిజబెత్ గారికి వంట్లో బాగుండనందున ఆమె ఇవాళ భోజనానికి రానన్నారు,” అని ప్రకటించాడు. కౌంటు మెల్లగా ఫొలెన్వీ దగ్గరకెళ్ళి గుస గుస లాడాడు.

“అంతా సర్దుబాటయినట్టేనా?”

“ఆహా!”

ఎవరితో ఏమీ చెప్పకుండా కేవలం అందరి వంకా చూసి తల పంకించాడాయన. అందరి మొహాలూ వెలిగిపోయాయి.

“హమ్మయ్యా!” అని అరిచాడు లూసో. “ఈ సత్రంలో షాంపేన్ వుంటే తీసుకు రావొయ్!అందరికీ ఇవాళ నా పేరు మీద షాంపేన్!” అని పురమాయించాడు ఫొలెన్వీని. ఫొలెన్వీ వెంటనే నాలుగు షాంపేన్ సీసాలతో వచ్చాడు. ఈ విషయం లూసో సతీమణి కెంత మాత్రమూ నచ్చలేదు. అందరి మనసులూ తేలిక పడటంతో అందరూ కబుర్లు మొదలు పెట్టారు. కౌంటు లామడన్ శ్రీమతి అంద చందాలని ప్రశంసిస్తే, లూసో కౌంటెస్ గారి రూప లావణ్యాలను పేర్కొన్నారు.

అందరూ హాయిగా, కులాసాగా నవ్వుతూ కబుర్లు చెప్పుకున్నారు. చాలా కొంటె మాటలూ, పడక గది జోకులూ చెప్పుకున్నా ఎవరూ కోపగించుకోలేదు. ఒకరకమైన హాయి, సంతోషం అందరికీ గుండెల నిండా నిండి పోయింది. పైగా జోకుల స్థాయి మరీ దిగజారిపోసాగింది, రాత్రవుతున్న కొద్దీ! ఆఖరికి స్త్రీలు కూడా రెండర్ధాల మాటలూ, మత్తెక్కించే చూపులూ మొదలు పెట్టారు. అందరూ షాంపేన్ తాగేరు. ఇద్దరు సిస్టర్లు కూడా. షాంపేన్ అచ్చం నిమ్మరసం లాగుంది, అన్నారిద్దరూ!

“ఛ!ఛ! ఇక్కడొక పియానో వుండి వుంటే ఎంత బాగుండేది! ఒకళ్ళం పాట వాయిస్తూ వుంటే మిగతా అందరమూ డాన్సు చేసే వాళ్ళం!” అన్నాడు లూసో.