లామడాన్ ఈ మాటల గురించి ఆలోచన మొదలు పెట్టారు. సైన్యాన్నీ, సైన్యాధ్యక్షులనీ అందర్లాగే గౌరవించినా, ఆయన ఆ మామూలు ఇల్లాలి మాటల్లో వున్న నిజాన్ని గురించి ఆలోచించాడు. వ్యర్థమవుతున్న ఆ సైనిక శక్తిని సరిగ్గా ఉపయోగిస్తే ఇంకా ఎంత ధనాన్ని సంపాదించవచ్చో లెక్కలు వేసాడు.
లూసో భోజనం ముగించి తన గదికి వెళ్ళే ముందర హోటల్ యజమానితో ఏకాంతంగా ముచ్చటించాడు. లూసో గారి మాటలకి యజమాని భారీ కాయాన్నంతా ఊపుతో పడీ పడీ నవ్వాడు. ఏం మాట్లాడాడో కానీ, లూసో దగ్గర ఆరు పెట్టెల వైన్ సీసాలు కొనటానికి ఒప్పుకున్నాడతను. భోజనానంతరం అందరూ అలిసి వారి వారి గదులు చేరుకున్నారు. లూసో మాత్రం తన భార్యని పడుకోమని చెప్పి తను తలుపు దగ్గర కూర్చొని తాళం చెవి రంధ్రం గుండా బయట కారిడార్లోకి తొంగి చూస్తూ కాలం గడిపాడు. ఆయనకదో సరదా! ఆ రకంగా తెలుసుకోవలసిన చాలా విశేషాలని తెలుసుకోవచ్చని ఆయన నమ్మకం!
ఒక గంట తరవాత ఆయన నిరీక్షణ ఫలించింది. ఎలిజబెత్ ఒక నీలిరంగు నైట్ గౌనులో చేతిలో కొవ్వొత్తి పట్టుకుని నడుస్తూ కారిడార్లోకి వచ్చింది. ఒక గదిలోకి వెళ్ళింది, కానీ రెండు నిమిషాల్లోనే బయటికొచ్చింది. ఆమె వెనకే దేనికో ప్రాధేయ పడుతూ కోర్నుడెట్. వాళ్ళు చాలా లోగొంతుకలతో మాట్లాడటం వల్ల వారి మాటలు లూసోకి వినిపించలేదు. కానీ చూస్తే కోర్నుడెట్ ఏదో బ్రతిమాలుతున్నట్టూ, ఎలిజబెత్ అతని ప్రార్థనలని నిరాకరిస్తున్నట్టూ అనిపించింది. కొంచెం సేపటికి అప్రయత్నంగా ఇద్దరి గొంతుకలూ హెచ్చాయి. కోర్నుడెట్ తనని ఆమె పడక గదిలోకి రానివ్వమని అడుగుతున్నట్టూ, ఆమె నిరాకరిస్తున్నట్టూ అర్ధమయింది.
“ఇదేం మూర్ఖత్వం? ఏమిటి నీ అభ్యంతరం?” అంటున్నాడు కోర్నుడెట్.
ఆమె కోపంగా, “చీ!చీ! జర్మన్లున్న ఈ ఇంట్లోనా.” అన్నది.
ఒక వేశ్య దగ్గరనించి అంత దేశభక్తినీ, నిబధ్ధతనీ ఊహించలేదేమో, కోర్నుడెట్ ఒక్క క్షణం నిరుత్తరుడయ్యాడు. అంతలోనే తేరుకుని ఆమె చెంపపైన ఒక చిన్న ముద్దు పెట్టి ఆమెకి అభివాదం చేసి అక్కణ్ణించి వెళ్ళి పోయాడు. అలసిపోయిన లూసో కూడా పక్క చేరాడు. అటు పిమ్మట అంతటా నిశ్శబ్దం రాజ్యమేలింది.
ఉదయం ఎనిమిది గంటలకి బయల్దేరాలని నిశ్చయించుకోవటం వల్ల అందరూ పొద్దున్నే కిందకి దిగారు. కానీ మంచులో కూరుకుపోయున్న బగ్గీ ఏ మాత్రం ప్రయాణానికి సిధ్ధంగా లేదు. అసలు బగ్గీ నడిపేవాడు కూడా ఎక్కడా కనిపించలేదు. అతని కోసం గుర్రపు శాలలూ, నౌకర్ల వసతీ అంతటా వెతికారు. ఎక్కడా కనపడలేదు.
అతని కొరకు వెతుకుతూ మగవాళ్ళంతా ఊర్లోకి నడిచారు. ఊరి మధ్య కూడలిలోకి రాగానే వింతైన దృశ్యాలు కంట బడ్డాయి. ఒక వైపు చర్చీ, రెండో వైపు ఇళ్ళూ ఉన్నాయి. ఆ ఇళ్ళల్లో జర్మన్ సైనికులు చిన్న చిన్న పనుల్లో నిమగ్నమై వున్నారు. ఒకడు ఆలుగడ్డలు తొక్కు తీస్తుంటే, ఒకడు నాగలి దున్నుతున్నాడు. ఇంకొకడు మంగలి దుకాణం చావిడి శుభ్రం చేస్తున్నాడు. ఇంకొక గుబురు గడ్డం సైనికుడు ఒక ఇంట్లో చంటి పాపాయిని లాలించి ఆడిస్తున్నాడు. ఇళ్ళల్లో మగవాళ్ళందరూ యుధ్ధానికి పోవటం వల్ల ఒంటరిగా పన్లు చేసుకుంటున్న స్త్రీ జనానికి ఈ జర్మన్ సైనికులు సహాయం చెయ్యటం కొంచెం వింతగా అనిపించింది. ఆ స్త్రీలు సైగల ద్వారా తమ విజేతలకి పనులు పురమాయిస్తున్నారు. కొందరిని కట్టెలు కొట్టివ్వమంటే, కొందరిని వంట పనిలో సహాయం చేయమనీ, ఇంకొకడిని కాఫీ పొడి కొట్టివ్వమనీ అడుగుతున్నారు. మరీ ఒకడైతే ఒక వృధ్ధురాలి బట్టలుతుకుతున్నాడు.
ఇదంతా చూసి కౌంటు మహాశయుడు ఆశ్చర్యం పట్టలేక పోయాడు. చర్చి నించి బయటికొస్తున్న ఒక ఉద్యోగిని పట్టుకొని ఈ వింతేమిటని అడిగాడు కూడా. దానికతను, “అయ్యా! నిజానికి వీళ్ళెవ్వరూ ప్రష్యన్లు కారట. వాళ్ళంతా చాలా దూరదేశంలో తమ తమ భార్యా బిడ్డలని వదిలి ఇక్కడకిచ్చారు. ఈ యుధ్ధమంటే మనకెంత అయిష్టత వుందో, వాళ్ళకీ అంతే పాపం! అందుకే ఇక్కడ స్త్రీలకి సహాయం చేసి, తమ స్త్రీలకి కూడా ఎవరో సహాయం చేస్తూ వుండి వుండొచ్చన్న ఆశా భావనతో కాలం వెళ్ళదీస్తున్నారు. ఎప్పుడైనా గొప్ప వాళ్ళూ, పెద్ద వాళ్ళే యుధ్ధాలు ప్రారంభిస్తారు. ఆఖరికి పేదలే ఒకరినొకరు కనిపెట్టి వుండేది.”
విజేతలకీ పరాజితులకీ మధ్య ఈ సహకార స్నేహాలు కోర్నుడెట్‌కి ఎంత మాత్రమూ నచ్చినట్టు లేదు. అతను తమ సత్రపు బసకి తిరిగి వెళ్ళిపోయి తలుపులేసుకున్నాడు. లూసో, “మనం దేశపు వాకిళ్ళు మళ్ళీ అందరికోసం తెరిచినట్టుంది,” అన్నాడు. లామడోన్, “ఇన్నాళ్ళూ చేసిన హానికి ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నట్టున్నారు,” అన్నాడు గంభీరంగా.
ఏమయితేనేం, బగ్గీ నడిపే సారధి మాత్రం ఎక్కడా కనబళ్ళేదు. ఆఖరికి వెతగ్గా వెతగ్గా, ఒక మూల చిన్న పాకలో కాఫీ తాగుతూ కనిపించాడు. అతన్ని చూస్తూనే కౌంటు మహోదయుడు,
“నీకు మేము ఎనిమిదింటికల్లా బయల్దేరాలని చెప్పామా లేదా?” అని అడిగాడు కోపంగా.
“అవును, కానీ నాకు పైనించి వేరే తాఖీదులొచ్చాయండీ,” అన్నాడు బండి వాడు వినయంగా.
“పైనించి వేరే ఉత్తరువులా? ఏమని?”
“అదే, మిమ్మల్ని ఎక్కడికి తీసికెళ్ళటానికీ వీల్లేదని!”
“ఎవరలా ఉత్తరువిచ్చింది?”
“నిన్న తనిఖీ చేసిన జర్మను అధికారి.”
“ఎందుకని?”
“ఏమోనండి! అతన్నే వెళ్ళి అడగండి. నన్ను బగ్గీ తీయొద్దన్నారు, నేను తీయలేదు. అంతే!”
“ఆయనే స్వయంగా చెప్పారా?”
“లేదండి. సత్రపు యజమాని చేత ఉత్తరువు పంపించారు.”
“ఎప్పుడు?”
“నిన్న రాత్రి.”
అందరూ దిగాలు పడి సత్రానికి తిరిగొచ్చి ఫోలెన్వీని అడుగుదామనుకున్నారు, కానీ నౌకరు ఆయన ఆయాసంతో పది గంటలకి ముందు ఎప్పుడూ నిద్ర లేవడని చెప్పారు. జర్మను అధికారిని కలుద్దామంటే అదీ సాధ్యం కాలేదు. ఆయన ఫోలెన్వీని తప్ప ఎవరినీ కలవడు. వేచి వుండటం తప్ప వేరే దారి లేదని అర్ధమైంది వాళ్ళందరికీ. ఆడవాళ్ళు వారి వారి గదులు చేరుకున్నారు.
కోర్నుడెట్ ఒక జగ్గు నిండా బీరుతో చలి మంట దగ్గర, ఒక పైపు కాలుస్తూ కూర్చున్నాడు. లూసో “కూర్చొని కాళ్ళు లాగుతున్నా”యంటూ కాస్త వ్యాయామానికి నడచుకుంటూ ఊళ్ళో కెళ్ళాడు. కౌంటూ, లామడాన్ రాజకీయాల గురించి ముచ్చటించుకోసాగారు. ఫ్రాన్సు దేశపు భవిష్యత్తు గురించి వారు గంభీరంగా చర్చించుకున్నారు. ఒకరి ఆర్లీన్స్ వంశం మీద ఆశలు పెట్టుకుంటే ఇంకొకరు ఒక పెద్ద నేత దేశాన్ని రక్షిస్తాడని అభిప్రాయపడ్డారు. వారి మాటలు వింటూ కోర్నుడెట్ భవిష్యత్ జ్ఞానిలా చిరునవ్వు నవ్వాడు.
సరిగ్గా పది గంటలయ్యేటప్పటికి ఫోలెన్వీ కిందికొచ్చాడు. అంతా వెంటనే ఆయన చుట్టూ మూగారు. అన్ని ప్రశ్నలకీ కలిపి ఆయన ఒకటే జవాబిచ్చారు.
“జర్మను అధికారి నాతో తన అనుమతి అయ్యేంతవరకూ మిమ్మల్నెవరినీ ఇక్కడనించి కదలనివ్వొద్దని నాతో అన్నారు. అంతే నాకు తెలిసింది.”
వెంటనే మగవాళ్ళందరూ జర్మను అధికారిని చూడటానికి అనుమతి కోరారు. అధికారి భోజనానంతరం ఇద్దరు మగవాళ్ళు వచ్చి తనని కలుసుకోవచ్చని అనుమతి ఇచ్చాడు. అంటే ఒంటి గంట తరువాతన్నమాట. భోజనాల సమయానికి ఆడవాళ్ళందరూ చేరారు. అందరూ ఏదో ఎంగిలి పడ్డామనిపించారు. ఎందుకనో ఎలిజబెత్ దిగులుగా, పరాకుగా అనిపించింది. వాళ్ళు భోజనం ముగించి కాఫీ తాగుతుండగా అధికారి గుమాస్తా వచ్చి “అయ్యగారు రమ్మంటున్నారని” చెప్పాడు.
లామడాన్, కౌంటూ వెళ్ళబోతుండగా, లూసో తనూ వాళ్ళతో బయల్దేరాడు. అందరూ కోర్నుడేట్‌ని కూడా తమతో రమ్మన్నారు, కానీ అతను కంఠంలో ప్రాణం వుండగా జర్మను అధికార్లతో మాట్లాడనన్నాడు. ముగ్గురు మగవాళ్ళు పైన అధికారి గదికి వెళ్ళారు. జర్మను అధికారి ఒక వాలు కుర్చీలో కూర్చొని పైపు కాలుస్తూ తీరికగా కనిపించాడు. వీళ్ళని చూసి కుర్చీ లోంచి లేవలేదు సరి కదా, కనీసం కళ్ళెత్తి పలకరించను కూడా లేదు. విజేతలకు సహజమైన అహంకారాన్నే అతను ప్రదర్శించాడు. రెండు మూడు నిమిషాలయ్యాక, తడుముకుంటూ ఫ్రెంచి భాషలో అడిగాడు, “ఎందుకొచ్చారు?” అని. “మేం మా ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాం.”
“వీల్లేదు!”
“మీరెందుకు మమ్మల్ని బంధించారో తెలుసుకోవచ్చా?”
“అది నా ఇష్టం.”
“అయ్యా! మేమంతా ఈ ప్రయాణానికి ముందే మీ పై అధికారి వద్ద అనుమతి తీసుకున్నాం. ఇప్పుడు మమ్మల్నే కారణంగా ఇక్కడ ఆపేసారో కూడా మాకర్థం కావటం లేదు. మా మీద ఇంత ఆగ్రహం చూపటం మీకు తగునా?”
“ఇన్ని మాటలనవసరం. మిమ్మల్ని పంపొద్దని నేను నిశ్చయించుకున్నాను. అంతే. మీరిక వెళ్ళొచ్చు.”