కొవ్వుపుంజి

ఆమె సాహసానికీ, పౌరుషానికీ,ధైర్యానికీ చుట్టూ వున్నవాళ్ళంతా నోళ్ళు వెళ్ళబెట్టారు. హఠాత్తుగా ఆమె విలువ వారి దృష్టిలో పెరిగిపోయింది. వాళ్ళంతా పిరికి వాళ్ళు మరి! ఒక్క కోర్నుడెట్ మాత్రం ఆమె వంక చిరునవ్వుతో, దేవుని ముందర భక్తుడు చదివే స్తోత్రపాఠాలను చిరునవ్వుతో వీక్షిస్తున్న జ్ఞానిలా, ఆమె వంక చూస్తూ కూర్చున్నాడు. ఆ తరువాత అతను అందుకుని గంభీరమైన కంఠంతో దేశభక్తిని గురించి సుదీర్ఘంగా ఉపన్యసించాడు. దురదృష్టవశాత్తూ అతను ఉపన్యాసం చివరిలో నెపోలియన్ని తీవ్రమైన పదజాలంతో విమర్శించాడు. కొవ్వుపుంజి ఎర్రబడ్డ మొహంతో ఆ విమర్శను అంతే తీవ్రంగా ఖండించింది.

ఆవిడ నెపోలియన్ బోనాపార్టీ భక్తురాలు మరి. కోపంతో ఆవిడ మాటలు తడబడ్డాయి. “అబ్బో! పెద్ద నెపోలియన్ని విమర్శించేవారు బయల్దేరారు. ఆయన స్థానంలో మీరుంటే ఏమయ్యేదో! మీవంటి వారే కదా ఆయనని వెన్నుపోటు పొడిచింది. మీవంటివారికి పదవి చేతికి వస్తే ఫ్రాన్సు నరకప్రాయమై పోతుంది.”

ఆ మాటలకి కోర్నుడెట్ ఏమీ చలించలేదు. అదే చిద్విలాసపు నవ్వుతో ప్రతి విమర్శ చేయబోయాడు. చూస్తుంటే ఇదేదో పెద్ద వాగ్వివాదం కాబోతున్నట్టనిపించింది. అది బాగుండదని కౌంటు కల్పించుకుని వాదనని ఆపేసారు. “నిజాయితీ నిబద్దతతో కూడిన ఏ అభిప్రాయాన్నైనా గౌరవించవలసిందే” అని ఆయన ఇద్దరికీ నచ్చచెప్పారు.

అయితే ఇతర స్త్రీలకి మాత్రం ఆవిడ వాదన చాలా నచ్చింది. వారికి సంఘంలో పెద్ద మనుషులకి సాధారణంగా రిపబ్లికన్ వామ పక్ష సిధ్ధాంతాల మీద వుండే అసహనమే వుంది. పైగా స్త్రీలవ్వటం మూలాన నిరంకుశ ధోరణుల్లో ఒక రకమైన అందం కనిపిస్తుంది. వాళ్ళందరికీ ఆ లావాటి స్త్రీ మీద ఆప్యాయత పెరిగిపోయింది. “తక్కువ కులంలో పుట్టినా ఈవిడ భావాలెంత హుందాగా, ఉదాత్తంగా వున్నాయో,” అని వాళ్ళందరూ మనసుల్లో అనుకున్నారు కూడా.

చలితో కొవ్వుపుంజి కొంచెం వణక సాగింది. కౌంటెస్ తన వెచ్చటి చెప్పుల జతని ఇచ్చిందావిడకి. శ్రీమతి లామడాన్, శ్రీమతి లూసో వారి చెప్పులని అప్పటికే సిస్టర్లకి ఇచ్చేసి వున్నారు. బగ్గీ బయట లాంతర్లు వెలిగించాడు బండితోలేవాడు. లోపలంతా అంధకారం. వున్నట్టుండి కోర్నుడెట్ వున్న మూల ఏదో కదలిక. లూసో కళ్ళు పొడుచుకుని చూసాడు. అతనికి కోర్నుడెట్ కొవ్వుపుంజి పైన చేయి వేసినట్టూ, ఆవిడ విసురుగా ఆ చేయిని తోసేసినట్టూ అనిపించింది.

దూరంగా టోట్స్ నగరపు దీపాలు కనిపించాయి. అప్పటికి వాళ్ళు ప్రయాణం ప్రారంభించి పద్నాలుగు గంటలైంది. బగ్గీ టోట్స్ నగరంలో వాళ్ళు బస చేయాల్సిన హోటల్ ముందు ఆగింది. ఉన్నట్టుండి బగ్గీ తలుపు తెరుచుకుంది. భయం రేకెత్తించే సుపరిచితమైన శబ్దాలతో వాళ్ళందరూ ఉలిక్కి పడ్డారు. జర్మన్ భాషలో ఏవో కేకలు!

బగ్గీ ఆగి వున్నా ఎవరూ కదలటానిక్కూడా సాహసించలేదు. కదిల్తే చస్తామేమోనని భయపడ్డట్టున్నారు! ఇంతలో లాంతరుతో బండి తోలేవాడు వచ్చి నిలబడ్డాడు. లాంతరు వెలుగులో అందరూ భయంతో పాలిపోయిన మొహాలతో దయ్యాల్లాగ అనిపించారు. తోలేవాడి పక్కన ఒక జర్మన్ అధికారి మొత్తం యూనిఫారంలో నిటారుగా నిలబడి కనిపించాడు. పొడవుగా సన్నగా వున్న అతని వయసంతేమీ ఎక్కువనిపించలేదు. అందుకేనేమో, పెద్ద పెద్ద మీసాలని పెంచి గంభీరంగా వున్నాడు.

“అందరూ కిందకి దిగండి,” జర్మన్ యాసతో కూడిన ఫ్రెంచి భాషలో భావరహితంగా అన్నాడు. వెంటనే సిస్టర్లిద్దరూ కిందకి దిగారు. ఆ తరువాత కౌంటూ, కౌంటెస్సూ, లామడాన్, ఆయన శ్రీమతీ, లాసో, ఆయనతో బాటు ఆయన భార్యా కిందకి దిగారు. దిగుతూనే లూసో “గుడ్-డే సార్!” అని పలకరించాడు. ఆ పలకరింపులో మర్యాద కన్నా లౌక్యమే ఎక్కువగా వుంది. జర్మన్ అధికారి అందరు అధికారుల్లాగే తిరిగి జవాబివ్వలేదు.

కోర్నుడెట్, కొవ్వుపుంజి ఆఖర్న దిగారు. భయపడ్డా వాళ్ళ మొహం మీద జర్మన్ అధికారి పట్ల నిరసన తప్ప ఇంకేమీ కనిపించటంలేదు. ఆవిడ అతి కష్టం మీద తన ఉద్రేకాన్నీ అణుచుకున్నట్టు కనిపించింది. కోర్నుడెట్ వణుకుతున్న చేతులతో తన గడ్డాన్ని నిమురుకుంటున్నాడు. తమ సహచరుల పిరికితనాన్ని చూసి చిరాగ్గా అందరి వంక చూసారిద్దరూ. అందరూ ఒకరి వెంట ఒకరు హోటల్ లోనికి నడిచారు. లోపలికి వెళ్ళగానే జర్మన్ అధికారి వారి పాస్పోర్టులను చూపమన్నాడు. అందరూ మౌనంగా వాటిని అందించారు. వాటిల్లో రాసి వున్న పేరు వృత్తి వివరాలను చదువుతూ ఫోటోలతో మనుషులని పట్టి పట్టి పోల్చి చూసాడు అధికారి.

“మీరు వెళ్ళొచ్చు,” అని వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అందరికీ ఆకలి విపరీతంగా వేస్తుండటంతో హోటల్ యజమానిని తొందరగా భోజనం వడ్డించమని వేడుకున్నారు. ఇద్దరు నౌకర్లు గబ గబా వంటకుపక్రమించారు. ఈ లోగా అందరూ ఎవరికి కేటాయించబడ్డ గదుల్లో వాళ్ళ సామాను పడేసారు. అన్ని గదులూ పొడవాటి కారిడార్ కి అటూ ఇటూ వున్నాయి. గదులు చూసుకొని వచ్చి అందరూ డైనింగ్ హాల్లో భొజనానికి కూర్చున్నారు. ఇంతలో హోటల్ యజమాని వచ్చి

“మీలో ఎలిజబెత్ రూసో ఎవరు?” అని అడిగాడు.

కొవ్వుపుంజి ఉలిక్కిపడి, “నేనే! ఎందుకు?” అంది.

“అమ్మా! జర్మన్ అధికారి మిమ్మలని అర్జంటుగా రమ్మంటున్నారు!మీతో మాట్లాడాలట.”

“నాతోనా?”

“ఎలిజబెత్ రూసో అంటే మీరేనా?”

“అవును! అయినా నేనతనితో మాట్లాడను.”

అందరూ ఇబ్బందిగా చూసారు. ఇప్పుడీమె ప్రతిఘటనతో మళ్ళీ ఏం ముంచుకొస్తుందోనని అందరి భయం. కౌంట్ ఆమె దగ్గరకొచ్చాడు.

“చూడమ్మా! మీ నిరాకరణ వల్ల అందరి ప్రాణాల మీదకొస్తుందో ఏమో! అధికారంలో వున్న వాళ్ళతో తగవులాడటం విజ్ఞత కాదు. బహుశా మీ పేపర్లలో ఏదో వివరం ఉండి ఉండదు. అందుకే పిలుస్తూ వుండి వుండొచ్చు కదా? కొంచెం ఆలోచించండి,” వీలైనంత మృదువుగా అన్నాడు.

అందరూ కౌంటు మాటను బలపర్చారు. అందరికీ అదే భయం వుండటంతో ఆవిడని వేడుకున్నారు, జర్మన్ అధికారితో తలపడొద్దని. ఆఖరికి ఆవిడ లేచి నిలబడింది.

“సరే, మీ అందరికోసం వెళ్ళి ఏం మాట్లాడాలో అడిగొస్తాను.”

కౌంటెస్ ఆవిడ చేయందుకుంది. “మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేం!” కృతఙ్ఞజ్ఞతగా అంది.

ఎలిజబెత్ గదిలోంచి బయటికెళ్ళింది. అందరూ భోజనం కూడా చేయకుండా ఆవిడ కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరికి వారే, “ఈ తలపొగరు మనిషిని కాకుండ నన్ను పిలిచినా అయిపోయేది కదా!” అని అనుకున్నారు. పది నిముషాల తర్వాత ఎలిజబెత్ తిరిగొచ్చింది. ఆమె మొహం కోపంతో ఎర్రబడి వుంది.

“దరిద్రుడు! దరిద్రుడని!” ఆమె కోపంగా గొణుగుతుంది.

అందరికీ ఉత్కంఠ పెరిగిపోయింది. కానీ వాళ్ళెంత అడిగినా ఆమె సంగతేంటో చెప్పలేదు.

ఎవరెన్ని రకాలుగా అడిగినా, “ఏమీ లేదు! మీకు సంబంధించిన విషయం కాదు. నన్ను నమ్మండి!” అని జవాబిచ్చింది. ఇక ఎవరేం మాట్లాడకుండా భోజనాలు మొదలు పెట్టారు. ఈ చిన్న చికాకు వ్యవహారం మినహా భోజనమంతా చాలా బాగుంది. ఆపిల్ పళ్ళ రసమూ, వైనూ, బీరూ అందరూ బాగానే పట్టించారు.

హోటల్ యజమాని ఫోలెన్వీ, అతని భార్యా కూడా వీళ్ళతో పాటే భోజనం చేసారు. ఆయనకి ఆయాసం లాగుంది, ఎక్కువ మాట్లాడలేదు, కానీ ఆవిడ మాత్రం ఆపకుండా మాట్లాడుతూనే వుంది. ఆవిడ ముందుగా జర్మన్ సైనికుల మీద విమర్శలు గుప్పించింది. ఆవిడకు వాళ్ళు కొంచెం కూడా నచ్చినట్టులేదు. వాళ్ళ రాక ఆమెకెంతో ధన నష్టాన్ని కలగజేసింది. పైగా ఆమె కొడుకులిద్దరూ ఫ్రెంచి సైన్యంలో వున్నారు. మరి జర్మన్ సైనికుల మీద ఆమెకి కోపం వుండటంలో ఆశ్చర్యమేముంది? ప్రధానంగా ఆమె కౌంటెస్ తోనే సంభాషించింది. ఆవిడకి అలా పెద్దింటి స్త్రీతో చనువుగా మాట్లాడే అవకాశం రావటం చాలా సంతోషంగా వుంది.

కొంచెం సేపటి తర్వాత ఆమె కొంచెం గొంతు తగ్గించి రహస్యాలు చెప్పసాగింది. “నువ్వూరికే ఎక్కువగా మాట్లాడకు!” ఆమె భర్త ఆమెని హెచ్చరించాడు కానీ ఆమె పట్టించుకోలేదు.

“నిజంగా మేడం! ఈ జర్మన్లు ఇరవై నాలుగ్గంటలూ పంది మాంసమూ, బంగాళా దుంపలూ తప్ప ఇంకేమీ తినరు! పంది మాంసం! కొంచెమైనా శుభ్రత తెలీని మృగాలు. రోజుల తరబడి అలా కవాతు చేస్తూనే వుంటారు. ఇట్నించి అటూ, అట్నించి ఇటూ! ఆ శ్రమంతా దండగ చేయకుండా పంటలు పండించటానికో, రోడ్లు వేయటానికో ఉపయోగిస్తే ఎంత ప్రయోజనం! ఈ సైనికులంత అప్రయోజకులు ఇంకొకళ్ళు వుండరంటే నమ్మండి! మనలాంటి బీదా బిక్కీ జనం కష్టపడి వాళ్ళని పోషిస్తుంటే వాళ్ళు ఎవరిని ఎలా చంపాలా అని సాధన చేస్తుంటారు. వాళ్ళనలా కవాతు చేస్తూ చూసినప్పుడలా నాకు ఇలానే అనిపిస్తుంది. పెద్దగా చదువూ సంధ్యా లేని దాన్ని, నా మాటలు మీకు నచ్చకపోవచ్చు. కానీ వాళ్ళ వల్ల సంఘానికి ఏం ఉపయోగమో చెప్పండి! బయట మిగతావాళ్ళు ఎన్నెన్ని గొప్ప పనులు చేస్తున్నారు? ఎవరినైనా సరే చంపటం మంచిదా మీరే చెప్పండి!సామాన్య జనం పగ తీర్చుకోవటానికో ఇంకేదో కోపం మీదో పరాయిలకి హాని కలగచేస్తే అది నేరం. సైనికులు ఎంత మందిని చంపితే అంత గొప్ప! యుధ్ధంలో మన పిల్లలు కూడా చచ్చిపోతున్నారు కదా! ఏమిటో నాకెంత ఆలోచించినా అర్ధం కాదు.”

కోర్నుడెట్, “అమ్మా! ఊరికే పక్క వాడి పైకి యుధ్ధం ప్రకటించటం అమానుషమే! కానీ మనని మనం రక్షించుకోవటానికి యుధ్ధం చేయక తప్పదు. అప్పుడదొక పవిత్రమైన ఆదర్శం అవుతుంది.” అన్నాడు గంభీరంగా. ఆమె అతని వంక చూసింది.

“అవును! ఆత్మ రక్షణకి యుధ్ధం అవసరమే! కానీ నిజానికి అసలీ రాజులందరినీ హత మారిస్తే అసలు యుధ్ధాలే వుండవు.”

ఆ మాటలతో కోర్నుడెట్ కళ్ళు మిల మిలా మెరిసాయి.

“మంచి మాట సెలవిచ్చారు!” అన్నాడు.