కొవ్వుపుంజి

ఆమె వేశ్యా కులానికి చెందినది. ఆమె స్థూలకాయం చిన్నప్పట్నించి ఊళ్ళో అందరికీ తెలిసిందే! అందుకే ఆమెనందరూ “కొవ్వుపుంజి” అని వెక్కిరిస్తారు. ఆమె బొద్దుగా, గుండ్రంగా ఉంది. ఆమె చేతి వేళ్ళూ పొట్టిగా లావుగా ఉన్నాయి. అంత లావున్నప్పటికీ ఆమె అందంగానే వుండటం వల్ల కాబోలు, ఆమెకి ప్రేమికులు ఎక్కువే. ఆమె మొహం ఎర్రగా ఆపిల్ పండులాగుంది. ఒత్తుగా రెప్పలు పర్చుకుని వున్న పెద్ద పెద్ద కళ్ళు, చిన్నని నోరు, మొత్తం మీద చూట్టానికి బాగుంది.

శత్రువు రాకతో ఏకమైన మిత్రుల్లాగా ముగ్గురు స్త్రీలు దగ్గరికి జరిగి ఎన్నడూ లేని స్నేహ భావంతో ముచ్చటించుకుంటున్నారు. ఇలాటి స్త్రీలందరి వల్లే స్త్రీజాతి గౌరవం మంటగలుస్తుంది. మనమంతా ఎలాగైనా ఒక్కటిగా వుండి కుల స్త్రీలందరి పరువూ కాపాడాలి అని నిశ్చయించుకున్నట్టుంది వాళ్ళా క్షణంలోనే.

వారి వారి భర్తలు కూడా, కోర్నుడేట్‌కి అసంకల్పితంగా వ్యతిరేకంగా ఏకమై, డబ్బు లేని వాళ్ళ వల్ల వచ్చే సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సంభాషణలో ఎన్నో విషయాలు దొర్లి పోతున్నాయి. వాళ్ళ వ్యాపర దక్షతలూ, డబ్బు సంపాదనా, జర్మనీతో యుధ్ధ సమయంలో కూడా వాళ్ళు తమ సంపదలనెలా కాపాడుకుందీ వగైరా వివరాలున్నాయి. ముగ్గురూ ఒకరివంక ఒకరు స్నేహ భావంతో చూసుకున్నారు. సాంఘికంగా వేరు వేరు వర్గాలకి చెందినా ప్రధానంగా డబ్బు కులానికే చెంది ఉన్నవాళ్ళవటంతో వాళ్ళ మధ్య ఇదీ అని చెప్పలేని ఆప్యాయత చోటు చేసుకుంది.

బగ్గీ మెల్లగా నడుస్తూ వుండటంతో ఉదయం పది గంటలైనా వాళ్ళు పన్నెండు మైళ్ళేనా దాటలేక పోయారు. మూడు సార్లు మగవాళ్ళూ బగ్గీ లోంచి దిగి కాస్త నడిచొచ్చారు. ప్రయాణీకులకి కొంచెం అసహనం మొదలైంది. మద్యాహ్నం భోజనం టోట్స్ నగరంలో చేయొచ్చని వాళ్ళనుకున్నారు కానీ, వాలకం చూస్తే రాత్రైనా టోట్స్ చేరేటట్టు కనపడలేదు.

దారిలో ఏదైనా తినటానికనువైన ప్రదేశం కనబడకపోతుందా అని అంతా ఆశతో చూసారు. ఏమీ కనిపించలేదు, సరి కదా, బగ్గీ మంచులో దిగబడిపోయి దాదాపు రెండు గంటల విశ్వ ప్రయత్నం మీద మళ్ళీ రోడెక్కింది.

ఆకలి పెరుగుతున్న కొద్దీ, ప్రయాణీకుల్లో ఉత్సాహం జారిపోసాగింది. దారిలో వున్న చిన్న చిన్న ఎస్టేటులలో కొంచెం తినటానికేదైనా తిండీ, తాగటానికి ఏదైనా వైనూ దొరుకుతాయేమోనని మగవాళ్ళు చాలా ప్రయత్నం చేసారు. కానీ ఊళ్ళ మీద పడుతున్న జర్మను సైనికుల భయంతో ఎవరి ఇంట్లోనూ కనీసం చిన్న రొట్టె ముక్క కూడా దొరకలేదు. దాదాపు ఒంటి గంట ప్రాంతంలో లూసో ఇక ఆకలి బాధని ఓర్చుకోలేనని ప్రకటించాడు. పేగులు కొరికేస్తున్న ఆకలితో సంభాషణ ఏమీ సాగలేదు.

మధ్య మధ్యలో ఎందుకో కొవ్వుపుంజి తన కుర్చీ కింద ఏదో వెతకి మళ్ళీ తలెత్తి అందరి వైపూ ఒక సారి చూసి మాట్లాడకుండా కూర్చుంటుంది. ఆకలితో, చలితో అందరి మొహాలూ పాలిపోయాయి. లూసో ఒక చిన్న రొట్టె ముక్క దొరికితే వెయ్యి ఫ్రాంకులైనా ఇవ్వటానికి తను సిధ్ధమేనని నవ్వులాటలా అన్నాడు. ఆయన భార్య ఆయన వైపొకసారి చురుగ్గా చూసింది. ఆమెకి డబ్బు వృధా చేయటమంటే ఎక్కడలేని కోపం! ఆ విషయంలో హాస్యాలెలా చేస్తారో కూడా ఆమెకి అర్ధం కాదు.

“నిజం చెప్పాలంటే నా ఆరోగ్యం ఈ మధ్య బాగుండటం లేదు! ఏమైనా తినటానికి తెచ్చుకోనుంటే ఎంత బాగుండేది!” కౌంట్ పెద్దగా అన్నాడు. అక్కడున్న అందరి మనసుల్లోనూ అదే ఆలోచన!

కోర్నుడేట్ తన సంచీలోంచి ఒక రమ్ము బాటిల్ తీసి పక్కవారికొక్క గుక్క తాగమని అన్నాడు. అందరూ మర్యాదగా తిరస్కరించారు, ఒక్క లూసో తప్ప. లూసో సీసా అందుకొని ఒక్క గుక్క తాగి ధన్యవాదాలు చెప్పకుండా తిరిగి ఇచ్చేస్తూ, “బాగుంది! కనీసం కొంచెం సేపైనా ఆకలి బాధ తెలియదు!” అని వ్యాఖ్యానించాడు. “వెనకటి రోజుల్లో దారి తప్పి తిండి దొరకని నావికులు అందరికంటే లావుగా వున్న స్నేహితులని తిని ఆకలి బాధ తీర్చుకునేవారట!” వున్నట్టుండి లూసో అదేదో పెద్ద జోకైనట్టు చెప్పి నవ్వ సాగాడు. అందరి చూపులూ ఒక్క సారే బొద్దుగా వున్న వేశ్య వైపు మళ్ళాయి. వెంటనే అసహ్యంతో తలలు తిప్పుకున్నారు. కోర్నుడెట్ ఒక్కడే జోకు అర్ధమైనట్టు చిరునవ్వు నవ్వాడు. సిస్టర్లిద్దరూ దేవుడిలా తమని శిక్షించటానికేదో కారణం వుండి ఉండాలన్నట్టు తలలు వంచుకుని ప్రార్థిస్తున్నారు.

మధ్యాహ్నం మూడు గంటల వేళ ఇక ఆకలి బాధ ఓర్చుకోలేక కొవ్వుపుంజి తన కుర్చీ కింద వున్న బుట్ట బయటికి తీసింది. బుట్టలోంచి ఒక చిన్న పళ్ళెం తీసి ఒళ్ళో పెట్టుకుని బుట్టలోంచి ఒక్కొక్క పదార్థమే తీసి వడ్డించుకుంది. ఒక వెండి మగ్గూ తీసి పెట్టుకుంది. ముందు రెండు పెద్ద చికెన్ ముక్కలు పెట్టుకుంది పళ్ళెంలో. బుట్ట నిండుగా వున్నట్టున్నాయి తినుబండారాలు. రొట్టెలూ, పళ్ళూ, కేకులూ, చిరు తిళ్ళూ, అబ్బో, మూడు రోజుల ప్రయాణానికి సరిపడేట్టు వున్నాయి. ఒక మూల బుట్టలోంచి నాలుగు వైన్ సీసాలు తొంగి చూస్తున్నాయి.

చిన్న చికెన్ ముక్క పట్టుకుని ఒక రొట్టెతో పాటు నాజూకుగా తినసాగింది ఆమె. అందరి దృష్టీ ఆమె పైనే వుంది. కమ్మటి వంటకాల వాసన బగ్గీ అంతా వ్యాపించింది. అందరికీ ఆకలి గుర్తొచ్చి నరాలు పట్టు తప్పాయి. ఆడవాళ్ళైతే ఆమె మీద అసహ్యాన్నీ కోపాన్నీ పట్టలేకపోయారు. వీలైతే ఆమెని అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరికేసి ఆ మంచులో ఆమె శవాన్ని పారేసి వెళ్ళాలనిపించింది వాళ్ళకు.

లూసో మాత్రం చికెన్ మీంచి తన కళ్ళు తిప్పుకోలేకపోయాడు.

“పర్వాలేదే! కనీసం మనలో ఒక్కళ్ళకైనా తెలివితేటలున్నాయి. ఈవిడ చూడండి! ఎంత ముందు చూపుతో తన తిండి సంగతి ఆలోచించిందో!” అన్నాడు. కొవ్వుపుంజి తలెత్తి లూసో వైపు చూసింది.

“మీరు కొంచెం తింటారా? రోజంతా పస్తు ఉండలేరు కదా?” అని మర్యాదగా అడిగింది.

“తప్పకుండా! కాదనే పరిస్థితిలో వున్నానా నేను? నేనింకొక్క నిమిషం కూడా తిండిలేకుండా వుండలేను. మొహమాటాలకి పోయే సమయం కాదిది.” ఒక్క సారి చుట్టూ అందరినీ పరికించి చూసి, జనాంతికంగా అన్నాడు, “ఇలాటప్పుడే తోటి మనిషి అవసరం తెలిసేది.”

ఒక వార్తా పత్రిక తీసి మోకాళ్ళ మీద పరచుకున్నాడాయన, పాంటు పాడవకుండా. జేబులోంచి ఒక చిన్న కత్తి తీసి చికెన్ ముక్కలోంచి ఒక భాగాన్ని నేర్పుగా కత్తిరించాడు. ఆ తరువాత ఇక దాని పని పట్టాడు.

కొవ్వుపుంజి కొంచెం మొహమాటంగా సిస్టర్లిద్దరినీ కొంచెం ఆహారం తీసుకోమని అడిగింది. వాళ్ళు ఇంకేం వాదించకుండా ఒప్పుకున్నారు. లోగొంతుకలతో ఆవిడకు ధన్యవాదాలు చెప్పి కళ్ళెత్తకుండా మౌనంగా తినసాగారు. కోర్నుడెట్ కూడా వాళ్ళతో చేరిపోయాడు.

గబగబా నములుతున్న శబ్దం తప్ప అంతటా నిశ్శబ్దం. వెనకాల లూసో మెల్లిగా తన భార్యనీ కొంచెం తినమని బ్రతిమాలుకుంటున్నాడు. ఆవిడ కొంచెం సేపు మొండికేసినా ఆకలి దాడికి ఓడిపోయింది. లూసో మెత్తటి గొంతుకతో, “ఏవమ్మా? కొంచెం మా ఆవిడ కూడా తినొచ్చా?” అని స్నేహ పూర్వకంగా అడిగాడు. ఆవిడ చిరునవ్వుతో, “అయ్యో! తప్పకుండానండీ” అంటూ చికెన్ గిన్నెని వాళ్ళకందించింది. వైన్ సీసా మూత తెరిచి ఒకటే మగ్గు వుండటంతో దానినే తుడిచి అందరూ వాడుకున్నారు.

చుట్టూ అందరూ హాయిగా భోంచేస్తూ వుండటం, ఆ కమ్మటి వాసనలూ తట్టుకోలేక కౌంటు, ఆయన శ్రీమతీ, లామడోన్, వారి భార్యామణీ చిత్రవధ అనుభవించారు. ఇంతలో శ్రీమతి లామడోన్ పెద్దగా నిట్టూర్చిన శబ్దం వినిపించింది. అందరూ ఆమె వంక తిరిగి చూసి ఆశ్చర్యపోయారు. ఆవిడ మొహం బయట కురుస్తున్న మంచులా తెల్లగా పాలిపోయి వుంది. ఆవిడ కళ్ళు మూసుకుని, తల ముందుకు వాలిపోయి వుంది. లామడోన్ అందరి వంకా దీనంగా చూసారు. ఎవరికీ ఎం చేయాలో తోచలేదు. ఇంతలో పెద్ద సిస్టరు ఆమె తలని వళ్ళోకి తీసుకుని మగ్గుతో ఆమెకి రెండు మూడు గుక్కలు వైన్ తాగించింది. శ్రీమతి లామడోన్ మెల్లిగా కళ్ళు తెరిచి ఒకసారి అందరి వైపూ చూసింది. మెల్లిగా చిరునవ్వు నవ్వి, తాను సరిగ్గానే వున్నానని లేవబోయింది. కానీ సిస్టరు ఆమెని అలాగే పొదివి పట్టుకుని ఇంకొంచెం వైను తాగించింది. “ఏమీ లేదు, ఆకలికి కళ్ళు తిరిగి పడిపోయారంతే!” చెప్పింది సిస్టరు.

కొవ్వుపుంజి కొంచెం మొహమాటంగా ఎర్ర పడ్డ మొహంతో, పస్తు వుంటున్న మిగతా నలుగురినీ ఉద్దేశించి, “మీరు కూడా కొంచెం ఎంగిలి పడితే…” అని ఆగిపోయింది. వాళ్ళంతా తనని హేళన చేస్తారన్న భయం ఆమెకి చాలా వున్నట్టుంది.

లూసో అందుకొని, “అవునండీ! ఇలాటి పరిస్థితులలో మనమంతా ఒక్కటే. ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిందే. మీరందరూ కూడా చాదస్తాలేవో పెట్టుకోకుండా సహకరించాలి. మనం టోట్స్ చేరేసరికి రేపు మధ్యాహ్నం కావచ్చు. అంతవరకూ ఏమీ తినకుండానే వుండదల్చుకున్నారా?” అని అందరినీ చీవాట్లేసారు. ఎవరికీ ఏమనాలో తోచలేదు. కౌంటు లేచి హుందాగా ఆవిడవైపు తిరిగి, “మేమంతా మీకెంతో ఋణపడి వుంటామమ్మా!” అన్నాడు. ఆ మాటతో అందరికీ మొహమాటం పోయింది. అందరూ తినుబండారాలున్న బుట్టపై పడ్డారు. దాని నిండా నోరూరుంచే ఎన్నో వంటకాలు, పళ్ళూ, కేకులూ! ఆవిడ చాలా భోజన ప్రియురాలిలాగుంది!

ఆవిడ తిండి తింటూ ఆవిడతో మాట్లాడకుండా వుండటం ఏం మర్యాద? అందుకని ముందు కొంచెం ఇబ్బందిగా సంభాషణ ప్రారంభించారు. ఆవిడ మాటల్లోనూ, ప్రవర్తనలోనూ వాళ్ళూహించిన వెకిలితనం ఏమీ లేకపోవటం చేత మాటలు తరువాత సాఫీగా సాగాయి. వాళ్ళు ఆమెతో లౌక్యంగా, తెలివిగా, మాట్లాడారు. వాళ్ళకు జన్మతః సంక్రమించిన తెలివితేటలూ, ప్రాపంచిక జ్ఞానమూ ఆ సంభాషణల్లో స్పష్టంగా తెలుస్తున్నాయి. కానీ లూసో సతీమణి మాత్రం మాట్లాడకుండా కేవలం భోజనం మీదనే మనసంతా కేంద్రీకరించారు.

సహజంగానే సంభాషణ యుద్ధం వైపు మళ్ళింది. జర్మన్ల నీచత్వాన్ని గురించీ, ఫ్రెంచి వారి సాహసాల గురించీ ఆసక్తిగా చెప్పుకున్నారు. ఎందుకు వారందరూ రూన్ వదిలి పారిపోతున్నారో చెప్పుకున్నారంతా.

కొవ్వుపుంజి చాలా ఉద్వేగంగా తనెందుకు రూన్ నగరం వదిలేయాలని నిశ్చయించుకోవలసి వచ్చిందో వివరించింది.

“ముందుగా ఇక్కడే వుండిపోదామనుకున్నాను. నాకు తిండికేమీ లోటు లేదు. బయట ఎలా వుంటుందో తెలియని పరిస్థితులలో కెళ్ళే కన్నా జర్మన్ సైనికులు అడిగినప్పుడల్లా వాళ్ళని పోషిస్తూ ఇక్కడ వుండటమే మంచిదనుకున్నాను కూడా. కానీ వాళ్ళని నిజంగా చూసే సరికి కోపంతో ఊగిపోయానంటే నమ్మండి! ఆ రోజంతా దుఃఖంతో ఏడ్చాను. నేను మగవాడినై పుట్టివుంటేనా! ఒక రోజు కిటికీలోంచి కింద జర్మన్ సైనికులు నడిచి వెళ్తుంటే చూసాను. నా నౌకరు నన్ను చేతులు గట్టిగా పట్టుకోవటంతో ఊరుకున్నాను కానీ, లేకపోతే ఒక్కొక్కడి నెత్తిన కుర్చీలు పడదోద్దామనుకున్నాను. తరువాత ప్రభుత్వం నన్ను కొంతమంది సైనికులని పోషించవలసిందిగా ఆదేశించింది. వాళ్ళు కొంతమంది మా ఇంటికొచ్చారు. మొదట గడపలో కాలు పెట్టిన వాడిమీద సివంగిలా పడ్డాను. వాణ్ణి గొంతు నులిమి చంపేసేదాన్నే, వాడు నన్ను జుట్టు పట్టుకుని ఈడ్చుకోకపోయి వుంటే! ఆ నేరం వల్ల నేను దాక్కోవలసి వచ్చింది. అందుకే వీలైనంత త్వరగా ఆ ఊరినించి బయట పడ్డాను.”