15.
సృజన, అంటే కావ్యపు ఆత్మకు ఆయువుపట్టు, అది పరికల్పించే ఔద్వేగిక ఆవరణ. ఇది ప్రధమంగా అప్రయత్నంగా, అసంకల్పితంగా వెలువడేది, ఆ పైన సంకల్పించి, ప్రయత్నించి మెరుగులు దిద్దుకొనేదీ. దీనికి ఆయువు పట్టు ఏమంటే సృజన శీలి, అంటే కవి సారస్వత మూర్తిమత్వం, అంటే Writer’s Self; ఆయన అంతరంగం – అంటే Writer’s Mind. సృజనలో ఔద్వేగిక వ్యవస్థ స్వరూపం, స్వభావాన్ని గురించి విశేషమైన పరిశోధన, చర్చ ఉన్నాయి. కవి భావావేశం అని వ్యవహరించే అతని సృజన తత్వం, అది ఒక్కొక్క సందర్భంలో ఒక్కో సృజనగా ప్రత్యేకమై వెలువడే ఔద్వేగిక స్థితి అతను ప్రయత్నం చేసి పొందేవీ, కొత్తగా సంపాదించుకొనేవీ కాదు. అదివరకు స్వభావతః తనలో ఉన్నదాన్నే తరచి చూసుకొని మళ్ళీ మళ్ళీ కనుక్కొంటూ వెలువరించుకొనేవి. నేను సృజనలో దేనికోసం చూస్తున్నాను? అని పైన అడిగినదానికి జవాబు ఏమంటే – సృజనను మచ్చు చూస్తూ నేను ప్రధమంగా ఈ ఔద్వేగిక ఆవరణపు స్వచ్చత కోసం, పటుత్వం కోసం, కాంతి కోసం చూస్తున్నాను. ముందుగా ఇది ఉంటే ఆ పైన ఇంకెన్నింటి కోసమో పట్టి చూడాలని అనిపిస్తుంది. ఇదివరకటి లక్షణ సిద్ధాంతాల్లో రస మతమని చెప్పేదానికీ, అది ప్రతిపాదించే నవ (దశ) రసాలకూ ఈ ఔద్వేగిక ఆవరణకూ సంబంధం ఉంది. అంతే కాక సంగీతంలో రాగానికీ, లయకూ ఈ ఔద్వేగిక స్థితిని కల్పించి, నియంత్రించే అద్భుతమైన శక్తి ఉంది. అందుకే సంగీతం నుండి రాగం, లయ సాహిత్యంతో కలసి పాటలోని ఔద్వేగిక ఆవరణను ఉద్దీపనం చేస్తాయి. ఈ రెండింటికీ నర్తన, హావ భావాలు తోడయితే అందివచ్చే నాట్య కళలోన ఔద్వేగిక స్థితిని అనుభవించే అవకాశం మరింత ప్రస్ఫుటంగా ఉంది. భరత ముని రస మతానికి నాట్యమే ప్రాతిపదిక అంటారు. కవులు కొందరు, నారాయణాచార్యులుగారి వంటి వాళ్ళు – కవిత్వంతో ఆగక, సంగీతం, నాట్యం నేర్చుకోవడం ఎందుకంటే మనుష్యుల సృజన అనుభవానికి సారస్వతం, సంగీతం, చిత్రలేఖనం కంటే ఈ అన్నింటి సృజన వ్యవస్థలనూ కలుపుకొని, పరాకాష్టకు తీసుకొని పోగలిగే శక్తి ఒక్క నాట్యానికే (Dance Drama) ఉంది. ఇది వరకు యక్షగానం, బుర్ర కధ, హరి కధ వంటి కళారూపాలు, ప్రస్తుతం సినిమాలూ విశేషంగా ప్రజాదరణ పొందటానికి ఇదే కారణం. సృజనకారుడికి చూస్తే సంతృప్తి లేదు, తనంత తానుగా దాన్ని నిర్మించాలి.
కాల్పనిక సృజన – అంటే కవిత్వం, కధ వంటి కళారూపాల్ని అనుభవిస్తున్న పాఠకుడూ, సృజిస్తున్న కవీ కూడా ఉద్వేగాలనూ, భావాల్నే కాదు, ఊహా చిత్రాలనూ, లయనూ, నర్తనను కూడా తామే చిత్రకారులూ, గాయకులూ, నర్తకులూ అయ్యి తమ మనోరంగం పైన సృష్టించుకుంటున్నారు. తమ ప్రదర్శనను తామే నిర్వహించుకుంటున్నారు. ఇదివరకే చెప్పుకున్నట్టు, కాల్పనిక సృజన పాఠకుని మనో రంగం పైన కవీ, పాఠకుడూ భిన్న కాలాల్లోన జట్టుగా నిర్వహిస్తున్న ప్రదర్శన. దీనికి ఒక నమూనా (Model) దృశ్యాభాస (simulation); రెండవది ప్రయాణం (Transportation); మూడవది కల (Dream). ఈ మూడింటిలో మొదట దృశ్యాభాసను గురించి. ఉదాహరణకు ఏదైన ఒక సినిమాను చూస్తున్నప్పుడు తెర మీద నటులు ఆ కధ అనుభవాన్ని ప్రేక్షకులకు ఆభాస అంటే simulate చేస్తున్నారు. మనకు వచ్చే కలలు ఇలాంటిదే దృశ్యాభాసకు ఇంకొక తరహా ఉదాహరణలు. ఓట్లీ (Keith Oatley) అనే శాస్త్రజ్ఞుడు, ఆయన అనుయాయులు గత పాతికేళ్ళుగా కాల్పనిక సృజనను గురించిన ఇలాంటి విషయాల్ని రక రకాలుగా పరిశోధిస్తున్నారు. Why Fiction May Be Twice as True as Fact: Fiction as Cognitive and Emotional Simulation అన్నది ఇందుకు ఒక ఉదాహరణ. స్థూలంగా ఆయన చెప్పిందేమంటే కాల్పనిక సృజనను చదువుతూ పాఠకుడు ఒక కల వంటి దృశ్యాభాసను తనకు తానుగా నిర్మించుకుంటున్నాడు. ఉద్వేగాలు (Emotions) ఈ సిమ్యులేషన్‌లో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి. ఈ ఉద్వేగాలకు మూలాలు పాఠకుల స్వీయ చరిత్ర (autobiographical past) లోన, వాళ్ళ సాంస్కృతిక అనుభవ సంచయాల్లోన, వాళ్ళ జీవితాశయాలు, అనుభవాల్లోనా నిక్షిప్తమై ఉంటాయి. అంటే ఒక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కాపీలు పదిమందిమి విడి విడిగా వాడి చూస్తుంటే దాని సిమ్యులేషన్ పదిమందికీ ఒక్కలాగనే అనుభవమౌతుంది; దాన్లో కల్పన ఏమీ లేదు కాబట్టి. అదే ఒకే సినిమా డీవీడీని పదిమందిమి విడి విడిగా సినిమా వేసుకొని చూస్తే ఆ పది అనుభవాలూ దాదాపు సమానంగానే ఉన్నా, బొమ్మలు, మాటలు, పాటలు ఎదురుగా ప్రతిపాదిస్తున్న దృశ్యాభాసను మనం కొంతవరకు మనదే ప్రత్యేకమైన ‘కధ’గా మన అంతరంగాల్లో పునర్నిర్మించుకుంటాము. కధ, కవితల వంటి సారస్వత కల్పనల్లో ఇలాంటి దృశ్యాభాసను మనం ఎవరికి వాళ్ళం మనకు మాత్రమే ప్రత్యేకము, ఆంతరంగికమైన మస్తిష్కపు ఔద్వేగిక యంత్రాంగం మీద run చేసుకుంటున్నాము. అందుకే చదవటం అనే ఈ దృశ్యాభాస ఒక్కొక్క పాఠకునికీ తనకే ప్రత్యేకమైనది. కాయితం మీద వాక్యాలుగా మనకు ప్రత్యక్షమయ్యే రచన, సృజన అనే ప్రక్రియ గొలుసు కట్టులో కేవలం చిట్టచివరి అంచె. ఆ ఒక్క రచననే పాఠకులు ఒక్కొక్కరి ఔద్వేగిక భూమిక మీదా ఒక్కోలాగ ఎంతో భిన్నంగా, తమకే ప్రత్యేకమైన దృశ్యాభాసగా ప్రదర్శించుకుంటున్నారు. ఈ భూమికను నిర్వచించేవి ఉద్వేగం (Emotion), సంకల్పం (Motive), లక్ష్యం (Goal).
ఓట్లీ మాటల్లోనే: “Emotions happen when events occur that relate to our goals (see the schema for stories offered above) — i.e. to those concerns that are important to us. So an emotion not understood means that something has happened with an obscure implication. Emotions are at the center of literature because they signal what is personally important, and because they often have this element of the mysterious. The simulations which are novels, plays, movies and so forth, can allow us to explore emotions and find out more about the intimate implications of these elements in our lives.”
పాఠకుడు, విమర్శకుడు వీళ్ళు సృజనను పరామర్శిస్తున్నప్పుడు వాళ్ళ స్వంత లక్ష్యాలు, ఆకాంక్షలూ (Goals) తప్పనిసరిగా వాళ్ళ సృజనానుభవాన్ని ప్రభావితం చేస్తున్నాయి. సృజన అనుభవం తీవ్రమైన, అనివార్యమైన స్వభావంగా ఉన్నవాళ్ళ గమ్యం, ఆకాంక్షా ఆ సృజనానుభవమే; దాని కోసమే వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఆ వెదుకులాట వాళ్ళ సంకల్పాన్ని, లక్ష్యాన్నీ నిర్దేశిస్తుంది. అంతే కాక, ఓట్లీ అవగాహనలోన ఈ సంకల్పమే వాళ్ళ ఔద్వేగిక ఆవరణనూ నిర్దేశిస్తున్నాది. బలమైన కవి సజ్జనుడూ, సచ్చీలుడూ ఇలాగేం కాడు; మహాత్ముడూ, సత్య హరిశ్చంద్రుడూ ఇలాగా కాడూ. బలమైన కవి ‘నిజాయితీ’కి ప్రాతిపదిక ఏమంటే తన సృజనకు మాత్రమే ప్రత్యేకము, మౌలికము, నైసర్గికమైన ఈ ఔద్వేగిక ఆవరణ ఒకటి ఉందని ఒప్పుకొని, దాన్ని కనుక్కొని, స్థిరం చేసుకొని, ఆ ఒక్క మర్యాదకు మాత్రం నిబద్ధుడై తన సృజనావరణంలో ప్రకటించుకోగలిగిన శక్తి. దీనికి విరుద్ధమైన ప్రవర్తననే నామిని ‘జూటా’ అని అంటున్నారని ఇప్పటికి ప్రతిపాదన మాత్రం చేసి, మీదటికి వివరించి రాస్తాను. ఈ నిబద్ధత ఒక విధమైన నిష్ట. కవి తనకు గత్యంతరం లేక – అంటే ఒక ఒదిలించుకోలేని జబ్బులాగయ్యి, ఇలా ఉంటున్నాడు. ఇంతకు మించి పాఠకుని ‘నిజాయితీ’కి ప్రాతిపదిక ఏమంటే, అతను కూడా సృజనను తను చదువుతున్నప్పుడు, అంటే simulate చేసుకొని, తన అంతరంగంలో పునర్నిర్మించుకుంటున్నప్పుడు – తన సారస్వత మూర్తిమత్వానికి మౌలికము, ప్రాకృతికము, నైసర్గికమైన ఔద్వేగిక ఆవరణను ప్రేరేపించడంలో, ఉద్దీపనం చేయటంలో ఆ సృజన ఎలా సఫలమౌతోందో, లేదూ విఫలమౌతోందో ముందుగా అనుభవించి, ఆ పైన వివేచించి కనుక్కొని, స్థిరం చేసుకొని, ఏ మర్యాదా లేకుండా తన సృజనావరణంలో ప్రకటించుకో గలిగిన శక్తి. ఈ రెండు వ్యాపారాల మీదా కవి, పాఠకుల జాతి, కులం, లింగం, మతం, ఆచారం, వ్యవహారం, చదువు, అంతస్తు ఇలాంటి సాంస్కృతిక కారణాల ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇవి కవి, పాఠకుల ఆకాంక్షలని, ఆపేక్షనూ, సంకల్పాన్నీ, తద్వారా ఔద్వేగిక స్థితినీ ప్రభావితం చేస్తున్నాయి. వీటిని అర్ధం చేసుకొని ప్రకటించుకోవడానికి ఆధునికులకు సంకోచం. లోక మర్యాద సృజన మర్యాదకు అడ్డం వస్తుంది.
పరిశీలించి చూస్తే, సినిమాలు చూసేటపుడు, పుస్తకం చదివేటప్పుడు, పాట వినేటప్పుడూ కూడా మనం ఆ సృజన ప్రతిపాదించే అనుభవాన్ని మనవైన గతానుభవాలతో ఔద్వేగిక సమన్వయం చేసుకొనే ప్రయత్నమే చేస్తున్నాము. ఈ సమన్వయం బొత్తిగా పొసగకపోతే ఆ సృజన ఆ పాఠకుని విషయంలో సఫలం కావటం లేదు; ఎక్కడో తేడా వస్తున్నాది – అంటే something has happened with an obscure implication. ఏమవుతోందంటే ఆ సృజన ప్రతిపాదించే అనుభవం ఆ పాఠకుడి వ్యక్తిగతమైన ఆకాంక్షలకు (Goals), గతానుభవానికీ అనువుగా లేదు, లేకుంటే అడ్డం వస్తోంది. ఈ విషయం పరిశీలించి చూస్తే వ్యక్తిత్వం, ప్రవృత్తి, ఆసక్తి వలన స్థిరపడే దృక్కోణం, సాంస్కృతిక అనుభవం, కులం, లింగం, ప్రాంతం, అంతస్తు వంటివి సృజన ఔద్వేగిక అనుభవాన్ని ఎంత ప్రబలంగా ప్రభావితం చెయ్యగలవో, పరిమితం చెయ్యగలవో అవగతమౌతుంది. ఎంతో వైవిధ్యం ఉన్న ఈ ఔద్వేగిక అనుభవాలు ముందుగా చాల వ్యక్తిగతమైనవి కాబట్టి సృజన లక్షణాలను గురించిన వివేచనకు వాటి పరిశీలన అవసరం.
ఔద్వేగిక ఆవరణను గురించి మరింత వివరించే ముందు, కొన్ని ఉదాహరణలు – తెలుగు, ఇంగ్లిష్ నుండి. ఒకటి స్వంతం అని ముకుంద రామారావు గారి కవిత. రెండవది ఆదివారం మధ్యాహ్నాలు అని రామినేని లక్ష్మీ తులసి గారి కవిత. మూడవది తిలక్ కవిత గగనమొక రేకు, కన్నుగవ సోకు అని. ఇంగ్లిష్ నుండి రెండు కవితలు: Alan Dugan కవిత Love Song: I and Thou అని; ఇంకా Kim Addonizio కవిత What Do Women Want? అని. ఈ కవితలన్నీ నాకు మొదటిసారి చూడగానే మళ్ళీ పట్టి చదవాలి అనిపించేయి. ఈ ఆహ్వానంలో, అనుభవంలో నా గతానుభవం, నావైన ఆకాంక్షలకూ చాలానే పాత్ర చాలా ఉంది. ఈ కవితలకు చాలా మందే పాఠకులు ఉండుంటారు. వాళ్ళలో ఏ ఒక్కరి అనుభవం నాకు వివరంగా తెలిసే అవకాశం లేదు. కాని నా స్వంత అనుభవమైతే నాకు తెలుస్తుంది. దృశ్యాభాస లోన ఔద్వేగిక ఆవరణ ఎలా నిర్మితమౌతుందో వివరించడానికి మాత్రమే, అంటే illustration కోసం వీటిని ఎత్తి రాస్తున్నది. అంతకు మించి ఇవి ‘మంచి’ కవితలు అని నిర్ధారణ, సిఫారసు ఏమీ లేదు.
స్వంతం కవిత నన్ను ఎందుకు ఆకట్టుకుందో చెప్పాలంటే ఈ కవితను నేను నా మనోఫలకం మీద – అంటే సినిమా తెర మీద – మొదటిసారిగా ఎలా దృశ్యాభాస చేస్తున్నాను అనేది వివరించాలి. ఇది చదివినప్పుడల్లా నాకు ఒకాయన జ్ఞాపకం వస్తారు. మాటవరసకి ఆయన పేరు అప్పల్రాజుగారు. ఆయనకి సుమారు ఏభయ్యేళ్ళుంటాయి. రెండంతస్థుల మేడ మీద మూడో అంతస్థును కట్టిస్తున్నారు. బనీను, లుంగీ కట్టుకొని నిలబడి కొళాయి నీళ్ళతో స్లాబులు, గోడలు దగ్గరుండి తడిపిస్తుంటారు – కూలీలతో, వాళ్ళావిడతోనూ. ఒక రోజు నేను, మా బావ దూరం నుండి చూస్తూ నడిచొస్తున్నాము, ఆయన ఇంటి ముందర స్వయంగా దగ్గరుండి ఆవుకి తిండి తినిపిస్తుంటే. “రాజుగారు ధర్మాత్ముడు! ఆవుకి చపాతీలు తినిపిస్తున్నారు దగ్గరుండి!” అని మా బావ అన్నాడు. దూరం నుండి చూసి చపాతీలనుకున్నాము. మా బావ అప్పటికే ఆయనకి నమస్కారం పెట్టి “ఏటండీ రాజుగారు? గోమాతకి చపాతీలు తినిపిస్తున్నారా దగ్గరుండి?” అని అనీసేడు. తీరా దగ్గిరసా చూసేసరికి ఆయన ఆవుకి తినిపిస్తున్నవి చపాతీలు కాదు, అట్ట డబ్బాల నుండి చింపిన కాయితాలు. ఆయన ‘ఎలాగూ ఈ ఆవు ఎప్పుడూ కాయితాలు తింటుంది, వృధాగా పారెయ్యటం ఎందుకు, తనే స్వయంగా తినిపిస్తే గోసేవ చేసిన పుణ్యం’ అన్నట్టు అనుకున్నారట. ఆ దృశ్యం నా జ్ఞాపకాల్లో అలా ఉండి పోయింది.
ఈ కవితలోని పెద్ద మనిషి మగవాడు అని స్థిరంగా చెప్పడానికి, ఆయన తన భార్యకే ఆ సూచనలన్నీ ఇస్తున్నాడనుకోడానికీ ఎలాంటి ఆధారాలూ లేవు. నిజానికి ఇది ఒక యజమాని కూలీతో, భార్యే భర్తతో, లేకుంటే ఒక స్నేహితుడు ఇంకొకనితో అంటున్నట్టూ, లేదంటే కవి తనలో తనే స్వగతంగా అనుకుంటున్నట్టూ రక రకాలుగా రూపించుకొనే ఆస్కారమయితే ఉంది. కానీ నా దృశ్యాభాసకు నాయకుడు మాత్రం రాజుగారు. ఆయనే ఆవుకి తినిపించడం అయిపోయేక మూడో అంతస్థు డాబా మీదికెళ్ళి తన భార్యతో మాట్లాడుతున్నారు. ఈ కవితలోని నాయకుడు లౌక్యుడు, పెద్ద మనిషి తరహాగా తన స్వంతాన్ని కాపాడుకొని, పోషించుకొని నెగ్గుకు వచ్చే సామాజికుడు. ఒక్క చుక్కని కూడా ఎటూ పోనీయడు. ఈ కవిత చదివే ప్రతీ సారీ నాకు కలిగించే ఉద్వేగాలు ఒకరకమైన వెక్కిరింత, తిరస్కారం – phonies అని సాలింజర్, మొగలాయీలు అని నామిని, ‘మనో రోగస్థుడై దేహి’ అని ధూర్జటి, Gugg అని Charles Bukowski వంటివాళ్ళు చేసినవంటి హేళన. ఈ విషయమంటే నాకు ఒక ఆర్తి అనిపించేలాగ చాల ప్రగాఢమైన ఆసక్తి, మమేకత్వం కాబట్టి ఈ కవిత నిర్మించే ఔద్వేగిక వ్యవస్థతో నా అంతరంగంలోని ఉద్వేగాలకు బలమైన సమన్వయం కుదిరింది. కవిత అన్ని రకాలుగా కనీసం నాకు ఒక్కడికి సఫలం కావటానికి సైతం కేవలం ఔద్వేగిక ఆవరణ ఒక్కటే చాలదు. ఇది వరకు అనుకున్నవి సృజన వ్యవస్థలు అన్నింటిని గురించీ ముందుగా చెప్పుకొని, మళ్ళీ ఈ కవితను అన్ని రకాలుగానూ పరామర్శించాలి. ఇప్పటికిది కేవలం ఈ కవిత కవి ఉద్దేశించిన ఔద్వేగిక ఆవరణను ఇంకొక పాఠకుని అనుభవంలో ఎలా పునర్నిర్మిస్తుందో ఆ ఒక్క పాఠకుని అభిప్రాయం మాత్రం.
స్వంతం కవిత నాకు అప్పల్రాజు గారి ప్రవర్తనను వర్ణిస్తోంది. ఇందుకు భిన్నంగా, ఆదివారం మధ్యాహ్నాలు ప్రకృతిని – కాలంలో అనువారంగా వచ్చే మార్పునూ, అంతరంగంపై ఆ కాలపు ప్రభావాన్నీ వర్ణిస్తున్నాది. దీన్లో మాట్లాడుతున్న గొంతు ‘అప్పల్రాజు ‘ గారిది కాదు. అది స్వయంగా కవయిత్రి గొంతు. అది పరికల్పించాలని ప్రయత్నిస్తున్న ఔద్వేగిక ఆవరణ, అనుభవం కవయిత్రి లాగనే వారం అంతా ఉద్యోగాలు చేసుకొంటూ వారాంతం లోని మార్పును అనుభవించే ఆధునికులందరికీ పరిచితమైనది. ఇలాంటి మనుషులందరికీ ‘ఆదివారం మధ్యాహ్నం’ అన్న మాట వినీ వినగానే ఈ ఔద్వేగిక ఆవరణ స్ఫురణకు వస్తుంది. ముందుగా ఈ ఒక్క మాటా – అంటే కవిత పేరు వినగానే నాకు ఏం స్ఫురించిందో చెప్తున్నాను.
(ఇంకా ఉంది)
