పెళ్ళయి మూడు నెలలకి పైనే అయ్యింది. పొద్దునే లేచి, సానుపు జల్లి, ముగ్గు పెట్టి, వంట చేసి ముసలాడికి వేడిగా పెట్టి మిగిలినదాన్ని కన్నెమ్మ తింటుంది. రోజూ ముసలాడు బయలుదేరి ఎక్కడికో వెళ్ళేవాడు. ఎక్కడి వెడుతున్నానని గాని, ఎందుకు అని గాని ఏమీ చెప్పడు. ఈమె కూడా దాని గురించి ఎక్కువగా దిగులు పడింది లేదు. మధ్యాహ్నం వస్తే వస్తాడు. లేకపోతే లేదు. రాత్రుళ్ళు కూడా కొన్ని రోజులు వస్తాడు. కొన్ని రోజులు రాడు. మొదట్లో రాత్రుళ్ళు ఒంటరిగా పడుకోవడానికి భయంగా అనిపించేది. పోను పోనూ అలవాటు చేసుకుంది. ఆమెతో ఎక్కువ మాటలు పెట్టుకోడు. ఏదైనా పని ఉంటేనే మాట్లాడతాడు. పెద్ద పిల్లకి సంబంధాలు చూస్తున్నట్లుగా ఒకసారి చెప్పాడు. సంబంధం కుదరగానే కన్నెమ్మకి చెప్పాడు.
“నా కూతురికి లగ్గం పెట్టుకున్నాను. ఆ సమయంలో నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండక్కర లేదు. బయలుదేరి మీ అమ్మ ఇంటికి వెళ్ళు. లగ్గం అయిన తరువాత ఇక్కడికి వస్తే చాలు. అర్థం అయ్యిందా?”
సరేనని తలాడించింది కన్నెమ్మ. మరునాడు పొద్దున్నే బయలుదేరి అమ్మ ఇంటికి వచ్చి చేరింది. ముందూ వెనకా కబురు పెట్టకుండా, ఒక్క మాట కూడా చెప్పా పెట్టకుండా ఉన్నట్టుండి కన్నెమ్మ రాగానే కురువమ్మ బెంబేలెత్తి పోయింది.
“ఏందే ఇది? ఉన్నట్లుండి పొద్దుగాలె ఊడిపడినవ్. మీ ఆయన్రాలేదె?”
“రాలే.”
“లొల్లి పెట్టుకున్నరేందె? నిన్నేమన్న గొట్టిండా? నువ్వట్ల లొల్లి జేసుకోవ్ గదానె. నీకు నోరున్న బాగుండేటిది. మాట్లాడవేందే. ఏమైంది జెప్పే.”
కురువమ్మ అడుగుతుండగానే చుట్టు పక్కన ఉన్న వాళ్ళు వచ్చి చేరారు. లగ్గమైన వెంటనే వెళ్ళిన మనిషి ఇప్పుడే వచ్చింది అంటూ వచ్చిన అంజలి కన్నెమ్మని సరామరిగా ప్రశ్నలు వేసింది.
“ఏందే కన్నెమ్మా? ఎట్లున్నవ్? నీ మొగుడు నిన్ను మంచిగ చూస్కుంటుండే? తిండి సరింగ పెడ్తున్నడా? ఏమైన ఇసేషం ఉందానె?”
“ఉంది.”
“ఉందా? గట్ల సెప్పు మరి. కురువత్తా, నీ బిడ్డ కేం తెల్వదంటవ్ గదనే. ఏం తెల్వకుండనే నీకు మనవడిని కంటున్నాది జూడు. పెండ్లై ఆర్నెల్లు గూడ గాలే.”
“గట్లనా! నా తాన జెప్పలేదేందే?”
“ఏందే నీ తాన చెప్పేడిది?”
“నీక్కడుపైనాదే?”
“నాకెక్కడైనాది కడుపు?”
“అదేందే, గంగిరెద్దు లెక్క తలూపినవ్?” అంజలి కలవరపడింది.
“ఎప్పుడు?”
“ఎప్పుడేంది? ఇసేషమున్నాదె అంటే ఔనంటివి.”
“ఆయన కూతురికి లగ్గం పెట్టుకుండు. అదే అనుకుంటి నేను గూడ. నువ్వడుగుతుందేందో నాకు తెల్వలే.”
“ఇంత తిక్కల్దానివేందే. నేనడుగుతుండేదేంది, నువ్వు చెప్పేడిదేంది. గద్సరె, మీ ఆయన కూతురికి లగ్గం పెట్టుకుంటే నువ్వెందుకు పోలే?”
“నన్ను రావొద్దని జెప్పిండు.”
“గదే ఎందుకంట? ముసలోనికి పెండ్లి చేస్కుంటె నామోషీ లేదు గాని, పెండ్లాన్ని పదిమందికు చూపిచ్చాల్నంటే సిగ్గయితున్నాదె? ఐన నువ్వెట్ల గమ్మునున్నవే, ఆయనెంట బోవద్దా లొల్లి లొల్లి జేసైన గాని.” అని సాగ తీసింది అంజలి.
“ఆయన బిడ్డలకి నన్ను సూడనికి గూడ మనసౌతలేదంట.” కన్నెమ్మ నిదానంగానే చెప్పింది.
“ఆల్లు సూడకుంటే ఏంబోతది గాని, ఆయనన్న నిను మంచిగ సూస్కుంటున్నాడె బిడ్డా?” కురువమ్మ అడిగింది.
“గిన్ని రోజులుగ నేను బతికిన్నా సచ్చిన్నా అని గూడ నీకు యాదికి లేదు. ఇప్పుడేమొకం పెట్టుకొని అడుగుతుండవే? బత్కాలే గాబట్టి బత్కుతున్న. ఇంకేం గావాలె నీకు?”
“కన్నెమ్మా! నేంజెప్పేది ఇనుకో. సప్పుడు సెయ్యకుండ ఒక బిడ్డను కన్నవంటే ఇగ దానితోటైన నీకు మంచిగ పొద్దు గడుస్తది. నీగ్గూడ తోడుంటది. నువ్వేం చెప్పవేందే కుర్వత్తా?” అంజలి అడగగానే కురువమ్మ అవునన్నట్లుగా తలాడించింది.
నాలుగైదు రోజుల తర్వాత రాజయ్య వచ్చి కన్నెమ్మను తీసుకెళ్ళాడు. వెళ్ళే ముందు కురువమ్మ అన్నది. “దీపావళి పండక్కి మీరిద్దరు కల్సొస్తే బాగుంటది గందా.”
“కూతురుకీ ఈ సారి మొదటి దీపావళి. కూతురు, అల్లుడు వస్తారు. నేను కూడా అక్కడికి వెళ్ళాలి. ఈమెను పంపిస్తాను. పండగ ముగిసిన తరువాత నిదానంగా వస్తే చాలు.”
కన్నెమ్మకి దీపావళి పండగ ఎప్పుడు వస్తుందా అని అనిపించింది. ఇంకా మూడు నెలలు ఉన్నాయనుకుంటే కాస్త దిగులు కూడా వేసింది. సరిగ్గా దీపావళికి ఒక వారం ముందుగానే రాజయ్య కన్నెమ్మను ఇంటికి పంపించాడు. కన్నెమ్మను చూడగానే కురువమ్మకి సంబరం పట్టలేనట్లయింది. కన్నెమ్మ నీరసంగా కనపడింది.
“ఏందే? పోయిన తూరి వచ్చినప్పుడు బాగానే ఉంటివి. ఈతాన ఏమే అట్ల చిక్కిపోయినవ్?”
“ఏమో, ఒంట్ల మంచిగుంటలే. గంజి గూడ లోపలికి బోతలేదు. అన్నం చూస్తెనే కక్కు అయితుంది.”
“ఉండు. పోయి మారెమ్మని పిల్చొకనొస్త” అంటూ వెళ్ళి మారెమ్మను పిలుచుకొని వచ్చింది కురువమ్మ. దీపావళి పండగకి ఇంటికొచ్చిన కూతురు కడుపుతో ఉందేమో అనిపించి కురువమ్మకు సంతోషం పొంగుకొచ్చింది.
ఆమెతో పాటు ఇంకా నలుగురైదుగురు అమ్మలక్కలు కూడా వచ్చారు. ముసలిది పరీక్ష చేసి కన్నెమ్మ కడుపుతో ఉన్నట్లు రుజువుగా చెప్పి వెళ్ళింది. చివరికి తన ఇంట్లోకి బిడ్డ రాబోతున్నదని కురువమ్మ సంబరపడింది. చూసిన వాళ్ళందరి తోటి చెప్పి మురిసి పోయింది. కూతురికి అప్పుడప్పుడూ ఇలా ఉండాలి అలా ఉండాలి అని జాగ్రత్తలు చెప్పింది. తనవల్ల చేతనైనంత వరకు పిండి వంటలు చేసి కూతురికి తినిపించింది.
ఒక వారం తరువాత రాజయ్య కన్నెమ్మను తీసుకొని పోడానికి వచ్చాడు. అతని దగ్గర కన్నెమ్మ కడుపుతో ఉందన్న విషయాన్ని చూచాయగా చెప్పి , ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పంపింది. విషయం వినగానే రాజయ్య ఉలిక్కి పడ్డా కప్పి పుచ్చుకున్నాడు. జవాబు ఏమీ చెప్పకుండా కన్నెమ్మను తీసుకొని వెళ్ళి పోయాడు.
ఇంటికి వచ్చిన మరునాడే కన్నెమ్మను పక్క ఊళ్ళో ఉన్న ఆస్పత్రికి తీసుకుపోయాడు. డాక్టరమ్మతో ఏదో మాట్లాడి కన్నెమ్మను డాక్టరమ్మతో లోపలి పంపించి వాళ్ళమ్మ కురువమ్మను ఆస్పత్రికి రమ్మనమని కబురు పంపించాడు.
కన్నెమ్మకి మనసులో సంతోషమనిపించింది. ఏది ఎలాగున్నా కడుపుతో ఉన్నానని తెలియగానే చెక్ చేపించనీకి వెంటనే డాక్టరమ్మ దగ్గరికి తీసుకొచ్చాడని రాజయ్య మీద అభిమానం పుట్టింది.
కురువమ్మ ఆసుపత్రికి వచ్చింది. రాజయ్య అప్పుడు అక్కడ లేడు. కూతురిని చూసి వివరం తెలుసుకుందామని వాళ్ళనీ వీళ్ళనీ అడుగుతూ లోనికి పోయింది. చీపురు పుల్లలా పడుకున్న కన్నెమ్మని చూసి బెంబేలెత్తి పోయింది. పేవులు తీసి బైట పడేసినట్లనిపించింది. ఏమయ్యిందే అని ఏడుస్తూ అడిగిన కురువమ్మకి బదులు చెప్పే స్థితిలో కన్నెమ్మ లేకపోయింది. తనకి ఏమైయ్యిందో ఆమెకే తెలియలేదు. బిత్తర బిత్తర జూసుకుంట పడుకుంది. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టరమ్మను కురువమ్మ అడిగింది.
డాక్టరమ్మ ఏం చెప్తుందోననని కన్నెమ్మ కూడా ఆమె వంక దీనంగా చూసింది.
“ఈమె భర్త మీకు ఏమీ చెప్పలేదా? ఆయనే ఈమెని ఇక్కడ అడ్మిట్ చేసి గర్బం తీయించ మన్నాడు.”
“ఏం జెప్తుండవ్ తల్లీ? బిడ్డను తీసేయమన్నడా?”” వణుకుతున్న గొంతుతో కురువమ్మ అడిగింది.
“అవును. గర్బం తీసి, ఇక బిడ్డలు పుట్టకుండ ఆపరేషన్ చేయించమన్నాడు. గర్భం తీసేసి ఆపరేషన్ కూడా చేసేసాము. ఇంకో వారంలో కుట్లు విప్పేస్తాము. దాని తరువాత ఇంటికి తీసుకొని పోవచ్చు.” సర్వ సాధారణంగా చెప్పిన డాక్టరమ్మ వెళ్ళి పోయింది.
తల్లీ కూతుళ్ళు పిచ్చి పట్టినట్లు అలాగే ఉండి పోయారు.

రచయిత్రి భామ ఎంతో మంచి పేరు , ప్రఖ్యాతులు తెచ్చుకున్న దళిత రచయిత్రులలో ఒకరు. ఆమె రచనలు, భాష ఆమె జీవిత అనుభవాలను ప్రకటిస్తాయి. ఆమె రచనలు విస్తారంగా ఇతరభాషల లోకి అనువదింపబడినాయి. ఆమె రచనల్లో, ఆమె ఆత్మకథ కరుక్కు (1992), సంగతి (1994) నవల, కిసుంబుకారన్ (1996) కథల సంపుటి ప్రముఖమైనవి. సంగతి నవలను ఇంగ్లిషు లోకి లక్ష్మి హోల్‌స్ట్రామ్ అనువదించారు. ఇది ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 2005లో ప్రచురించింది.
