నిను నే ముఖాముఖి గనినచో నా బాధ
మెలమెల్ల తగ్గి శమించు గాదె
తగ్గు నీ పోటులు తగ్గు నీ గాటులు
తగ్గు నీ బాధలు తగ్గు వెతలునిను నే ముఖాముఖి గనినచో జీవిత
వస్త్రమున్ గుట్టుదు వదలకుండ
ప్రతియొక్క దారమున్ ప్రతియొక్క కుట్టు నే
నతి జాగరూకతన్ నమరజేతుమొన్న నే వెదకినా నిన్న నే వెదకినా
మనసులో ప్రతి పుటన్ మానకుండ
ప్రతి పుటలో నీవె ప్రతి పంక్తిలో నీవె
ప్రతి పదములో నీవె ప్రాణ మీవె– తహిరి
ఆహార మగు దుఃఖ మశ్రువులె పానమ్ము
ఆహా విచిత్రమ్ము లగు మనికి నిత్యమ్ము
అనుభవమ్ముల జెప్పు టది తెలియకున్నాము
చిన చిత్ర మీ బ్రదుకు జీవించియున్నాము– దర్ద్
అందరూ అడుగుతూ ఉంటారు
ఓ కవీ ప్రేమంటే యేమని
ఎవరు చెప్పగలరు
కొందరు అది సురసరోవర మంటారు
మరికొందరు దేవుడే ప్రేమ అంటారు
కాని ప్రేమంటే బహు పరాక్!
అది అంతులేని వ్యధ కలిగిస్తుంది
దుఃఖము, బాధ, భయము, చిత్రహింస
ప్రేమకు యెన్ని పేరులో?
—
హృదయము, డెంద మంచు జను లెప్పుడు పల్కెద రెల్ల వేళలన్
హృదయ మనంగ నేమి యది యెంతయు చిత్ర విచిత్ర వస్తువో
హృదయపు క్షోభ యాకసపు టెల్లకు లేచు బృహత్తరంగమో
హృదయపు రక్తబిందు వది యెట్టుల దాచె పయోధి నొక్కటిన్
—
అక్కడ మసీదులో మతప్రచారపు ఘోషలు
అక్కడ మధుశాలలో మదిర తెమ్మని గోలలు
ఎక్కడ నీరవశాంతి లభిస్తుందని నా అన్వేషణ
చివరకు
ఇక్కడ ఈ గోరీలమధ్య నాకా ప్రశాంతి దొరికింది– మీర్ తాఖీ మీర్
చివరి ఘడియలలోన దర్శించినాను
చూచుటకు నిన్ను బాగుగా నోచనైతి
భూమిపై నాయు వదియు కాబోలు కొంత
చిందలేనైతి నే నశ్రు బిందువులను– జఫర్
నీరైతి నని దల్చ నేనెండమావి గద
నీరనిధి యని దల్చ నేనొక్క బుద్బుదము
నే జ్ఞాని యని దల్చ నే మతిభ్రంశుడను
జాగృతుం డని దల్చ జారితిని నిదురలో– బినవి బదక్షాని
మత్తెక్కించిన ప్రేమ మదిర
మౌనాన్ని వాంఛిస్తుంది
అందరూ కోరేది ప్రేమే గదా
వాళ్ళు చెవుల్లో గుసగుసలాడుకొనేది ప్రేమే
వాళ్ళ్ళ అంతరాంతరాలలో మెదిలేది ప్రేమే
ఆత్మ ప్రేమికునిలో కలిసిపోయిన తరువాత
ప్రేమలో నువ్వు నేను అనే భేదాలు ఉండవు
నేను ప్రేమ చుట్టూ ఉన్న తెర తీస్తాను
నా అంతరాంతరాలలో ఉండే
స్నేహితుడు ఎవరనుకొన్నావు – ప్రేమే
ఇహపరాల రహస్యాని తెలిసిన వాడికి
ఆ రెండింటి రహస్యాలు కూడ తెలుసు
అది ప్రేమే– ఫరీద్ ఉద్దీన్ అత్తార్
అది నాకు తెలుసు నీ యి-
ల్లది నాకు తెలుసు
అది నాకు తెలుసు నీ యి-
ల్లది చేరలేను
అది నాకు తెలుసు నా యి-
ల్లది చూడ రావు
అది నాకు తెలుసు
అది నాకు తెలుసు– అల్ కోజా హందానీ
ప్రేమకు నిబంధనలు లేవు
ప్రేమకు కారణాలు లేవు
ప్రేమకు మర్యాదలు లేవు
మనసు ప్రేమ అనే
బ్రహ్మానందాన్ని ఆస్వాదిస్తుంటే
తిథులను వారాలను
ఎవరైనా లెక్కపెట్టుతారా– కబీర్
నేను వ్రాసిన ఒక గజలుతో యీ సంకలాన్ని ముగిస్తాను –
వలపులు మృత మవ చంచల మతిలో వంతలు స్థిరము గదా
శలభము నైతిని తలపుల చితిలో చావొక వరము గదా – (1)మాటల నాడవు కారణ మేమో మౌనము శరము గదా
ఆటలు నీ కట పాటులతో నా కలతయు వరము గదా – (2)పలుకులు విన నే వేచితి నా కా స్వరమే చిరము గదా
కలలో గంటిని నొక నిశి ని న్నా కలయే వరము గదా – (3)నీ వుండని యా చెలువపు టామని నేడు శిశిరము గదా
రావేలా సంతసమున రమణా రాకయు వరము గదా – (4)పున్నమి రాత్రులు వెన్నెల వెలుగులు భువి దుర్భరము గదా
నిన్నటి స్మృతులను నెమరుచు నిలిచితి నిజ మవి వరము గదా – (5)కలకల పాటలు కిలకిల నవ్వులు కడు సంబరము గదా
తళతళ లాడెడు తమ్మి మొగ మ్మీ తరుణము వరము గదా – (6)ఈ విరహములో నిటుల తపించుట హృదయపు జ్వరము గదా
జీవిత మగు నొక పూవుల పాన్పుగ జేరిన వరము గదా – (7)సాకీ పోయుమ చల్లని మధువును చవి సుందరము గదా
నాకద్వారము నాకై తెఱచెడు నవమందిరము గదా – (8)హననము చాలుర మోహన రూప మ్మత్యవసరము గదా
ననవలె బూయును నిను గన మది నీ నాదమె వరము గదా – (9)
గ్రంథసూచి
- ఉమర్ ఆలీ షా – సూఫీ వేదాంతదర్శనము – ఉమర్ ఆలీ షా గ్రంథ మండలి, పిఠాపురం, 1977.
- దాశరథి – గాలిబ్ గీతాలు – ఎమెస్కో, మచిలీపట్నం, 1961.
- చిక్కాల కృష్ణారావు – మహార్ణవం – The voice of the masters పుస్తకానికి స్వేచ్ఛానువాదము – అరుణోదయ ప్రింటింగ్ ప్రెస్, విజయవాడ, 1994.
- ఆదిభట్ల నారాయణదాసు – Rubaiyat of Omar Khayyam – British India Press, Bombay, 1932.
- సి. నారాయణ రెడ్డి – తెలుగు గజళ్ళు, చేతన, గుంటూరు, 1986.
- A J Arberry – Persian Poems – An anthology of verse translations – Dent, London, 1969.
- Bankey Behari – Sufis, mystics and yogis of India – Bharatiya Vidya Bhavan, Bombay, 1991.
- Anthony Ferris – A second treasury of Kahlil Gibran – Citadel, New York, 1962.
- K C Kanda – Masterpieces of Urdu rubaiyat – Sterling paperbacks, Newe Delhi, 2005.
- Daniel Ladinsky – The gift – Poems by Hafiz, the great Sufi master – Penguin, Arkana, 1999.
- Magan Lal and Jessie Westbrook – The Diwan of Zeb-un-Nissa – John Murray, London, 1913.
- David Matthews – An anthology of Urdu verse in English – Oxford University press, Delhi, 1997.
- Reynold Nicholson – The mystics of Islam – Routledge and Kegan Paul, London, 1970.
- Reynold Nicholson – Translations of Eastern poetry and prose – Curzon press, London, 1987.
- Idries Shah – The way of the Sufi, E P Dutton, New York, 1966.
- Andrew Dib Sherfan – A third treasury of Kahlil Gibran – Citadel, 1975.
- Najib Ullah – Islamic literaure – An introductory history with selections, Washington square press, New York, 1963.
- Peter Wilson and Nasrollah Pourjavady – The Drunken Universe – Phanes press, Grand Rapids, 1987.
- Martin Wolf – A treasury of Kahlil Gibran – Citadel, New York, 1951.
