నీకు పుట్టిన పాపలు నీవి కావు
జీవితపు వాంఛలకు నవజీవ మివ్వ
జనన మొందిన వారలా తనయు లవని
నీవు ద్వారము వారి యా జీవములకు
కాని నీనుండి జన్మించ రా నిసుగులు
ఇత్తువా ప్రేమ యోచన లివ్వ లేవు
వారి భావము లెప్పుడు వారి వగును
తనువులకు చోటిత్తు వాత్మలకు గావు
వారి యాత్మలు వసియించు భవిత గుడిని
కలలలోకూడ కనరాదు కనుల కదియు
వారివలె నీవు జీవించవలెను గాని
వారు నీప్రతిబింబమ్ము కారు గాదె
ముందు సాగును జీవిత మెందు జూడ
వెనుక వెళ్ళదు నిన్నతో జనదు కలయ
నీవు విల్లైన పాపలు జీవముగల
యమ్ము లౌదురు సాగ వేగమ్ముతోడ
గురి యనంతమ్ము విలుకాడు సరిగ నెంచి
విల్లు వంచును శక్తితో వేగముగను
బాణములు చేరును సుదూర పథపు గురిని
వంగినను నీవు బాగుగా బాణ మదియు
సాగుచుండును బహు దూర మాగకుండ
అతడు కోరును మించుల యమ్ము నొకటి
అతడు కోరును స్థిర ధనుర్లతను కూడ
– జిబ్రాన్ (Your children are not your children)
మరి కొన్ని యితర కవుల అనువాదాలను క్రింద ఇస్తున్నాను. చదివి ఆనందించండి.
నీతో బంధము నిర్ఘృణ సంతస మొసగక నుండును గాదా
ఈ నయనమ్ములు సంతత మశ్రువు రాల్చుచు నుండును గాదానీ విరహ మ్మది మా హృదయమ్ముల చీల్చుచు నుండును గాదా
నిర్దయ హృదయుడు వీడుచు బోవును కటికుడు వాడే గాదాఒక కణమైనను కరుణయు లేదే నిను నమ్మగ మాకౌనా
పక్షుల వలె మము వేటాడుచు తను చూడక పోవును గాదామఱిమఱి వచ్చెద నను యా బాసలు వ్యర్థ మ్మాయెను గాదా
ఎందుకు వానిని వలచితినో ఆ మూర్ఖత నాదే గాదాఈ వ్యాపారములో నే నెందుకు దిగితినొ బదులుగ నాకో
దొరకెను వ్యసనపు విసములు వంతల బరువున గ్రుంగితి గాదా– బుల్లా షా
శ్రవణము, దృష్టియున్, రుచియు, స్పర్శయు నెల్ల నిజాన నాతడే,
భువి నిట నేను లేను, నలు మూలల నుండున దెల్ల నాతడే,
యవనిని నాదు యున్కి యొక యద్భుత సుందర స్వప్నమౌ గదా,
చివరకు స్వప్న భంగ మవ శేషపు జీవన మందు నాతడే!– బాబా అఫ్జల్
నే నెఱుంగుదు
జేరంగ లేననుచును
నీ గృహమ్ము
నీ జన్మలోనే నెఱుంగుదు
జేరంగ నా నెలవును
నీ కవదని
యీ జన్మలోనే నెఱుంగుదు
నీ వందునీ నెఱుంగుదు
నే నిందు– ఆయిన్ అల్ ఖోజాత్ హమదాని (1098 – 1131)
అవని కొక యద్ద మగు గాదె యణువు లన్ని
వేయి సూర్యు లణువులోన వెలుగుచుండు
వాన చినుకుల భేదించ గాన నగును
వంద వార్ధుల యలల ప్రవాహములను
సైకతపు చిన్న కణికలో సంభవించు
వేయి జీవాల సృష్టియు రేయి బవలు
సామజముకన్న పెద్దది చీమ పదము
రాలు జల బిందు వది పారు నైలు నదియె
వంద వరికోత లొక గింజ డెంద మగును
విశ్వ మొక రాగి గింజలో వెదుక దొఱకు
నీగ ఱెక్కలో నాశ్చర్య రాగ జలధి
కంటి పాపలో మిన్నేటి కాల్వ లూరు
నొక పిడికిలి హృదయమున సకల భువన
చక్రవర్తి వసించును సంతసాన– మహమ్మద్ షబస్తరీ (1250 – 1320)
ఆ దినము పొంగి లేచేను నాదు మదియు
కోరె కలము కాగితమును కులికి వ్రాయ
చూడ స్వర్గ నరకముల చోద్యములను
తుదకు పలికేను ప్రభువు తా మృదువుగాను
కలము కాగితము నీలోనె గలవు నిజము
స్వర్గ నరకాలు నీలోనె గలవు నిజము– ఒమర్ ఖయ్యాం
ఎవరు నేను? ప్రేమ హృదయు డతడె నేను
ఎవ్వ రతడు? నా ప్రియేశ్వరుండె యతడు
ఆత్మ లవియు రెండు, ఔర, దేహ మొకటె
చూడ నన్ను నీవు, చూతు వతని గూడ
చూడ నతని నీవు, చూతు వెపుడు మమ్ము!– అల్-హల్లాజ్
ఉదయకాలము, పాడె పక్షులు ముదముతో విను మో సఖా
నిదుర లెమ్ముర పానపాత్రయు నిందవేసెను మనలపై
సుధను బోలిన మదిర మధురము ముదము పుట్టును త్రాగగా
కదలకుండనివాడు యాడును ముదపు టలలో మురియగా– అబూ నువాస్
దివినుండి భువిజేరు దివ్యమౌ కానుక
లివి గులాబులు మోద మిచ్చు విరులు
నవముగా పాటల నందనమందు మా-
నవు లెల్ల వికసింతు రవనిపైనఈ గులాబుల రాశి నెంత కమ్ముచు నుంటి
వో గరీబు బెహారి యూరిలోన
ఈ గులాబుల కన్న యేమి దొఱకును మిన్న
యో గరీబు బెహారి యుర్విపైన– కిసాయీ మెర్వ్
ప్రేమికులకు నడుమ పెక్కు రహస్యముల్
వారు జెప్ప రన్ని పరుల కెపుడు
అక్కడిక్క డున్న యా మచ్చలను దాము
గణన జేయుచుంద్రు ప్రణయవేళ
చెప్ప రా రహస్య మెప్పుడు నొరులకు
దాచియుంతు రెదల దప్పకుండ
మాది దానికంటె మంచి రహస్యమ్ము
అది యొడంబడికగ నమరు నెపుడు
నగవు చిమ్ముచుండు నావాని మచ్చల
నే గణించ నెపుడు నిజము నిజము
—
నేను, నా దేవుడు
మేమిద్దరం రెండు గున్న యేనుగులం
మా నావ చాల చిన్నది
తరచుగా ఒకరినొకరు రాసుకొంటూ ఉంటాం
తరువాత
పక్కలు చెక్కలయ్యేటట్లు
నవ్వుతాం, నవ్వుతూ ఉంటాం– హఫీజ్
బానిస జగతి యబద్ధమున కయె
మనుజుల విడదీసి మనువా రహితులు
ద్వేషము లేకున్న దివియౌను భూమి
యేసు ముహమ్మదు లిర్వుర గొలువ
– అబూ అల్‌మారి