పూవు వేఱు కాదు, ముల్లు వేఱు కాదు
పూలు, ముళ్ళు ప్రేమమూర్తి కెప్పు డొకటె
యా కొరాను నమరు నమర వాక్కు లెల్ల
బ్రాహ్మణుడు వచించు ప్రణవ తుల్య మగును
పొగడి యతని పేరు ప్రోడగా నిలువకు
మతని ముందు మూర్ఖు డతి వివేకు డొకటె
చదివినాను నేను చక్కనైన గీతి
వినిన ప్రియ సఖుండు బిగ్గరగ హసించె
“పద్య మందు నన్ను బంధనమ్ము జేయ
నెంచి వ్రాసినావొ యిట్టి మధుర గీతి?”
“త్రుంచినా వదేల మంచి పద్యమాల?”
“యింత పెద్ద మూర్తి యిమడ జాల దందు,
తెగెను కాన నదియు”, మిగిలె నక్షరాలు!
—
ఎటుల హృదయమ్ము దెఱచెనో యీ గులాబి
ఎటుల నందమ్ము బ్రసరించె నీ జగాన
వెలుగు మేల్కొల్పె కాబోలు వెన్ను దాకి
వెలిగె నభయమ్ము నిండంగ బిఱికి మనసు
—
భూత కాలమునకు భువి గట్టి రొక గుడిన్
శోకమతులు వసుధ నేకముగను
ప్రతి దినమ్ము పూజ నతి భక్తి జేతురు
గుండెలోన వెతలు నిండ నందు
సంతసమ్ము నెటుల సాధించ వీలౌను
మతము నిండి యున్న మతుల గాదు
—
లేదు చిత్రించగా లేరెవ్వ రిలను
నాదు యీ హృదయమ్ము నతని రూపమ్ము
సర్మద్, దారా, జేబున్నీసా
పదిహేడవ శతాబ్దానికి చెందిన మొగలాయీ చక్రవర్తి ఔరంగజేబు సుమారు ఒక అర్ధ శతాబ్దమువరకు భారతదేశాన్ని పరిపాలించాడు. అశోకుని తరువాత భారతదేశపు ఎక్కువ భాగాన్ని పరిపాలించిన చక్రవర్తి ఔరంగజేబు. భువనవిజేతగా తన్ను తానే ఆలంగీరు పాదుషా అని ప్రకటించుకొన్నాడు. తండ్రిని చెరసాలలో ఉంచి, సోదరుడిని చంపి, కూతురిని కూడ చివరి రోజుల్లో బందీగా చేసినాడంటారు. షాజహాన్ చక్రవర్తి తన సామ్రాజ్యాన్ని పెద్ద కొడుకైన దారా షికోకు అప్పగించాలనుకొన్నాడు. కాని ఔరంగజేబు దారా నిజమైన మహమ్మదీయుడు కాడని ఒక పుకారు లేవదీసి దారాను ఓడించి, బందీగా ఊరేగించి చివరకు చంపి మొగలు సామ్రాజ్యాన్ని స్వాధీనము చేసికొన్నాడు.
పరమతసహనముతో భగవద్గీతను, వేదాలను పారసీకములో అనువదించిన దారా చక్రవర్తి అయి ఉంటే భారతదేశ చరిత్ర ఎలా మారి ఉండేదో అన్నది ఒక గొప్ప ఊహ. ఇక్కడ ఒక విచిత్రమేమంటే, ఔరంగజేబు కూడ సూఫీయే. కానీ అందులోని ఔదార్యము, సహనము అతనిలో లోపించింది. సర్మద్ అనే సూఫీ గురువు నిరంబరుడై ఉన్నాడని దానికి మహమ్మదీయ మతములో అనుమతి లేదనే వాదనను లేవనెత్తి వంచించి న్యాయస్థానములో శిక్షగా మరణదండన విధించి చంపించాడు. ఈ సర్మద్ దారాకు గురువు కూడ.
జేబున్నీసా
ఇక పోతే జేబున్నీసా మక్ఫీ (Jeb-un-Nisa) ఔరంగజేబుకు ప్రియమైన కూతురు. రాజకీయ విషయాలలో ఆమెను సంప్రదించేవాడు. ఆమె క్రీస్తు శకము 1639 నుండి 1689 వరకు జీవించినది. ఆమె తన పెద తండ్రి దారా షికోయొక్క ప్రభావము, ప్రోత్సాహము వలన కవిత్వము వ్రాయడానికి ఆరంభించినది. ఆమెకు అరబీ, పారసీక భాషలలో ప్రావీణ్యత ఎక్కువ. ఆరు ఏడు ఏళ్ళ వయసులో కొరాన్‌ను కంఠతా పట్టినదట. నాలుగేండ్లలో అరబీ భాష నేర్చినది. తన తండ్రి ఔరంగజేబ్‌వలె ఆమె భావాలు సంకుచితము కావు. ఆమె అవివాహిత. ఆమెను ఔరంగజేబ్ చెఱసాలలో ఉంచినట్లు కూడ కథలు ఉన్నాయి. ఆమె అజ్ఞాతముగా తెర మరుగున ఉండేదట. ఆమెయే తన్ను తాను మక్ఫీ అని పిల్చుకొనేది. మక్ఫీ అంటే ముసుగు వేసికొన్నదని, మరుగున ఉండేది అని అర్థము. ఆమెకు శివాజీలాంటి హిందూ రాజులపై సానుభూతి ఎక్కువ. ఆమె సమాధి లాహోర్ నగరములో ఉన్నది. ఆమె చనిపోయిన తరువాత ఆమె వేలాది గజలులను సేకరించి ఒక దివాన్‌గా ప్రచురించారట. ఆమె కవితలలో సూఫీ సిద్ధాంతములు కనబడుతాయి. సర్మద్, దారా, జేబున్నీసాల కొన్ని కవితలను యిక్కడ మీకు అందిస్తున్నాను. నాకు ప్రత్యేకముగా జేబున్నీసా కవితలు అంటే చాల యిష్టము.
సర్మద్
నన్ను జూడడు కడగంట నగుచు వాడు
యేడ్పు వలన ప్రయోజన మేమి లేదు
ఎడద గుడిలోన గూర్చుండు నెపుడు వాడు
యెఱుగ డేలకొ నా బాధ నేమి సేతు
—
మందిరమో మసీదొ యివి మాత్రము కావత డుండెడి చోటు భూమిపై
సందియ మేల నాకసము చారు వసుంధర వాని యిల్లుగా
సుందర విశ్వ మెల్ల పరిశుద్ధుని గాథను ప్రేమతో వినున్
వందల జ్ఞాను లందఱును వానినె గొల్తురు ప్రేమతో సదా
—
సర్మద్!
నమ్మిన వాడైతే తప్పక వస్తాడు అతడు
సాధ్యమైతే తప్పక వస్తాడు అతడు
ఎందుకిలా పిచ్చివాడిలా తిరుగుతున్నావు
నెమ్మదిగా కూర్చో,
దేవుడైతే తప్పక వస్తాడు అతడు
—
ఇక చాలు నీ స్వప్న మెదుట రావేలకో
యెవరు నీవంచు నే నిటుల వెదకుచునుంటి
నీ కౌగిలింతలే నిత్యమ్ము నా యాశ
కనిపింతు వొక క్షణము కనరావె యింతలో
తెర వెన్క నీ ఛాయ సరికాదు నీ మాయ
—
వందలుగ స్నేహితులు తొందరగ శత్రువులు
ఒకరితో స్నేహమే యొసగేనుగా శాంతి
ఒకరినే కోరినా నిక వద్దు నా కెవరు
నేనె యతడైతి, యతడయ్యె నే తుదకు
—
సిరుల గోరినావు ధరపైన నాశతో
అతని జగతి సిరుల నాశించ లేదాయె
రెండు జగము లిపుడు లేదాయె గద నీకు
బాధ మిగిలె నీకు బ్రదుకులో నికపైన
—
అప్రయోజకుడిని నేను, ఔను నిజము
ఫలము లీయని వృక్షము పఱగ నేను
చివర కెఱిగినా నేనొక చిన్న అణువు
లెక్క జేయక నుండెడు లేశ మగుదు
—
రంగుల మాయయె ప్రపంచ మంతయు
ఆమని శిశిరము లాశ నిరాశలు
ఏమని దలంచ కెగుడు దిగుడులను
ఆ మది వెతలకు నౌషధమే వెత