సూఫీ
The way of the Sufi అనే పుస్తకాన్ని పరిచయము చేస్తూ, దాని రచయిత ఇద్రీస్ షా ఇలాగంటాడు:
“The Sufi sages, schools, writers, teachings, humour, mysticism, formulations are all connected with the social and psychological relevance of certain human ideas. Being a man of ‘timelessness’ and ‘placelessness’, the Sufi brings his experience into operation within the culture, the country, the climate in which he is living.”
సూఫీ కవితలలో మదిర అంటే దివ్యానందము, ప్రియుడంటే దైవము, దివ్యత్వం, మధుశాల సూఫీల ఆశ్రమము, సాకీ హితుడు, స్నేహితుడు, మార్గదర్శి అని భావించాలి. అల్ గజలీ (8వ శ.), ఒమర్ ఖయ్యాం (11-12 శ.), అత్తర్, అల్ అరబీ, సాదీ (12వ శ.), రూమీ (13వ శ.), హఫీజ్ (14వ శ.), సర్మద్, దారా షికో (17వ శ.) మున్నగువారు కొందరు ప్రసిద్ధ సూఫీ కవులు, రచయితలు.
రూమి
ఇరువదియవ శతాబ్దములో హృదయానికి హత్తుకొనే విధముగా మధురమైన భావాలతో, మధురమైన పదాలతో, ప్రత్యేకముగా lyrical and mystic poetry వ్రాసిన కవులలో ముగ్గురు నన్ను ఆకర్షించారు. వారు- రబీంద్రనాథ టాగోర్ (Tagore), రేనర్ మరియా రిల్క (Rilke) మఱియు జిబ్రాన్ ఖలీల్ జిబ్రాన్ (Gibran). రిల్క, జిబ్రాన్‌లకు నోబెల్ బహుమతి రానిది చాల శోచనీయము. మహమ్మదీయ కవులలో ఆంగ్లములో తర్జుమా చేయబడిన కవులు ఇద్దరు ప్రసిద్ధులు. వారు జిబ్రాన్ మఱియు జలాలుద్దీన్ రూమి (Rumi). రూమి సూఫీ సిద్ధాంతములకు పెద్ద గురువు. రూమి క్రీ.శ. 1207 – 1273 కాలములో జీవించెను. ఇప్పటి ఆఫ్గనీస్తానములో పుట్టి తుదకు సిరియా దేశములో డమాస్కస్‌లో చాల కాలము నివసించెను. ఆ కాలములో సిరియా రోమనుల ఆధీనములో నుండుట వలన ఇతనికి రూమి అను పేరు వచ్చినది. రూమి ముఖ్యముగా పారసీక భాషలో తన కవితలను రచించెను. ఇతడు వ్రాసిన 26000 ద్విపదలతో నున్న మథ్నావి (మస్నావి) ఇస్లామీయ సాహిత్యములో కొరానుకు తరువాత అత్యున్నత గ్రంథముగా పరిగణించబడుచున్నది. ఇతడు 40000 పైగా దివ్య ప్రేమతో నిండిన కవితలను రచించెను. ఈ సేకరణ ఒక దివాన్ రూపము ధరించినది. ఒక రెండు రూమీ కవితల అనువాదాలను క్రింద చదవండి –
శిల్పముల నేను జెక్కెద శిలల పైన
చిత్రముల బలు గీచెద జింద కళలు
హృది యసంతృప్తితో నిండి చెదరి పోవ
బ్రద్దలుగ జేతు శిలల నీ పదము లందువంద చిత్రాల వ్రాసెద సుందరముగ
కలిపెదను వాని నా యాత్మ వెలుగు తోడ
నీదు చిత్రమును గనిన నిముస మందు
నాదు చిత్రాల నగ్నిలో బూది సేతునీవు నాతోడ ద్రాగుచు నెయ్యమాడు
హితుడవో, చతురుడగు యహితుడవో, ని-
జాన నేను సృష్టించు నవీన భువన
భవనమును నేల జేతువు భ్రమలు గలుగఆత్మ యిది నాది నీనుండి యవతరించె
నాత్మ యిది మెలిగొనెను నీ యాత్మ తోడ
హృదయ సౌరభా లబ్బె నా హృదికి, గాన
నా హృదయమును బ్రేమింతు మోహనముగప్రతి యొకటి రక్త బిందువు ప్రతి విఘడియ
నీ కరాల మృత్తిక తోడ నెగసి చెప్పె
వెలుగుచుంటి నీ యాశల వేడి వోలె
మధురమగు నీదు ప్రేమకై మాడుచుంటిజలమయము మృణ్మయము గృహమిలను నాకు
నీవు లేక హృదయ మిట నీల్గె నాకు
రమ్ము నా యిల్లు వేచె నీ రాక కొఱకు
నెలవు నాకేల నో ప్రభూ నీవు లేక
—
మురళి మేమైన యందలి స్వరము నీవు
పర్వతము మేము మఱి ప్రతిధ్వనియు నీవు
పావులం గడి నడిపించు నీవు మాకు
నొసగు టేమియొ నోటమియో జయమ్మొ
ఎగురు ధ్వజములపైన మృగేంద్రములము
వాని నూపు యదృష్ట పవనము నీవె
—
నేను క్రైస్తవుడను గాను
నేను యూదుడను గాను
నేను ముసల్మానుడను గాను
నేను హిందువుడను గాను
నేను బౌద్ధుడను గాను
నేను సూఫీ, జెన్ అనుసరించను
నేను ఏ మతమును, పద్ధతిని అనుసరించను
నేను పూర్వపశ్చిమ దేశములవాడిని గాను
నేను భూమినుండి జనించలేదు
నేను సముద్రగర్భములో పుట్టలేదు
నేను ప్రకృతినుండి గాని
ఆకాశమునుండి గాని ఆవిర్భవించలేదు
నా ఉనికి పంచభూతములు గావు
నేను లేను, ఇహములోగాని పరములోగాని లేను
నాకు మూలము ఆదాము ఎవాలు గాని, మరేదిగాని కాదు
నా ఉనికికి ఉనికి లేదు, నా మూలానికి మూలము లేదు
నాకు తనువు లేదు, మనసు లేదు
నేను నా ప్రియతమునికి చెందుతాను
రెండు భువనాలను ఒకటిగా చూసాను
అదొకటే మొదటిది, చివరిది, లోపలిది, బయటిది
ఆ ఊపిరి ఊపిరి పీల్చే మనిషిది