ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన
ఒకరి మీద ఒకరు విసురులు విసురుకునే ఈ కబుర్ల మాటున ఇంకో సంప్రదాయ రహస్యం ఇమిడి ఉంది. కుటుంబంలో ఎప్పుడూ ఆడవాళ్ళు తాము అందంగా ఉన్నామని చెప్పుకోరు. వాళ్ల అందాన్ని చూపించి మొగుణ్ణి వాళ్లు వశపర్చుకోలేదు. వాళ్లు ధర్మ పత్నులు. వెలయాళ్లు కారు. మొన్న మొన్నటి వరకూ, ఆడవాళ్ళు రాత్రిపూట అద్దం చూసుకుంటే అది తప్పుగా భావించేవారు. అలా చేస్తే వచ్చే జన్మలో వాళ్ళు వేశ్యలై పుడతారని ఇంట్లో పెద్దవాళ్ళు దెప్పిపొడిచేవాళ్ళు కూడా.
శాంత ఈ పరాచికాలని మొట్టమొదట తనే ప్రారంభిస్తుంది. అంటే ఆ రకమైన సంభాషణ కోడళ్ళెవరూ మొదలు పెట్టకూడదు. ఊర్మిళని పొగుడుతున్నట్టు కనిపిస్తూ శాంత, ఆమె అందానికి దిష్టి తగులుతుందనీ, దిష్టి తియ్యాలనీ అంటుంది. కోడళ్ళలో పెద్దదిగా సీత వెంటనే కల్పించుకొని మీ తమ్ములే లోకాన్నంతటినీ మోహింపజేసే సౌందర్యవంతులు, అంచేత వాళ్ళకే దిష్టి తీయమంటుంది. శాంత ఊరుకుంటుందా, ఆ మాటకి ఎదురు మాట చెప్పి, మీ అక్కచెల్లెళ్ళు నలుగురూ మా తమ్ముళ్ళని నలుగురినీ మీ అందాలతో కట్టి పడేసుకోలేదా అంటుంది. సీత టపీమని తిరుగు జవాబుగా, నీవేమైనా తక్కువ తిన్నావా శాంతమ్మా, అడివిలో ఏమీ ఎరుగని మా అన్నగారు ఋష్యశృంగుడికి అన్నీ నేర్పిన జాణవు నువ్వు అంటుంది. చివరికి శాంత గౌరవభావంతో, పద్మంలో ఉండే మహాలక్ష్మి మానవరూపంలో సీతగా అవతరించి తమ యింటికి కోడలవడం అదృష్టమని సీతని పొగుడుతుంది. ఆడబడుచు దెప్పడం పోయి, ఇలా గొప్పగా పొగడడం ఆడవాళ్ల ఊహల్లో ఉండే మాట. ఈ పాటలో పరాచికాలు చివరికి కుటుంబ సామరస్యాన్ని, పరస్పర ప్రేమల్ని పెంచేవిగా మిగులుతాయి. సమిష్టికుటుంబంలో ఆడవాళ్ళు సరిగ్గా కోరుకునేది అదే. హాస్యాలకీ, వ్యంగ్యానికీ జాగా ఉండాలి, అయినా ఎవరి మనసులూ ఏ మాటవల్లా నొవ్వకూడదు.
చివరికి కథ పడగ్గదిలోకి వస్తుంది. ఈ పాటలో ఈ భాగం ఎంతో ముచ్చటగా పాడుకుంటారు ఆడవాళ్ళు. తలుపులు మూసేస్తారు. ఎట్టకేలకు ఆలుమగలకి ఏకాంతం దొరుకుతుంది. అయినా అది నిజమైన ఏకాంతం కాదు. కిటికీలకు అవతల ఎత్తయిన కుర్చీలు వేసుకుని అత్తలూ ఆడబడుచూ చెవులు రిక్కించి వింటూ వుంటారు, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో అని. ఆ తరువాత వస్తుంది, ఆడవాళ్లు కోరుకునే అతి సుందరమైన దృశ్యం. లక్ష్మణుడు ఊర్మిళకి ముడి విప్పి, తల దువ్వి, సుతారంగా జడ వేస్తాడు. వేసి అందంగా జడలో మల్లెలూ, జాజులూ తురుముతాడు. లక్ష్మణుడికి అది బాగా చాతనయిన కళ. ఎంతోమంది భార్యలు తమ భర్తలనించి కోరుకొనే కానుక ఇది. ఆ తరువాత విశ్రాంతిగా తాంబూలాలు నములుతూ కూర్చుని ఉండగా ఊర్మిళ అడుగుతుంది. ఆ అడగడంలో కూడా ఒక చురుకుదనం ఉంది.
సింహవిక్రములు మీరూ ఉండగా సీతెట్లు చెరబోయెనూ?
ఇది విశేషమైన ప్రశ్న. లక్ష్మణుడి పరాక్రమం మీద ఊర్మిళకి అపారమైన విశ్వాసం ఉందని ఇప్పుడు చెప్పించడంలో కవయిత్రి ఉద్దేశించిన సూక్ష్మం ఒకటి వుంది. ఇంతవరకూ ఊర్మిళ అన్న మాటలవల్ల దెబ్బ తిని, కుంగిపోయిన అతని ఆత్మ విశ్వాసాన్ని, మళ్లా ఆవిడే పునరుద్ధరించగలదు. మొగవాళ్ల బలమూ బలహీనతా కూడా ఆడవాళ్ల చేతుల్లోనే వున్నాయని కవయిత్రికి తెలుసు.
ఆ తర్వాత వచ్చే భాగం మనకందరికీ తెలిసిన రామాయణానికి పునరుక్తి మాత్రమే అనిపిస్తుంది. కాని జాగ్రత్తగా వింటే అది పునరుక్తి కాదు అని తెలుస్తుంది. స్త్రీ రామాయణం చెప్తే ఎలా వుంటుందో తెలియడం కోసం ఈ భాగం మళ్ళా వినాలి. లక్ష్మణుడి హృదయాన్ని అర్థం చేసుకుని, దానితో స్త్రీ దృక్పథాన్ని సున్నితంగా జోడించి కవయిత్రి చేస్తున్న వ్యాఖ్యానం ఇది. రామాయణకథని లక్ష్మణుడి చేత చెప్పించేటప్పుడు కవయిత్రి ఏ భాగాలు వదిలేసింది, ఏ భాగాలకి ప్రాముఖ్యం ఇచ్చింది అన్న విషయం ద్వారా స్త్రీ హృదయం మనకి అర్థమవుతుంది. మారీచుడు ‘హా లక్ష్మణా! హా సీతా!’ అని అరిచాడట. మనకు తెలిసిన రామాయణంలో మారీచుడు హా లక్ష్మణా అని మాత్రమే అంటాడు. రాముడికోసం తాను వెళ్ళనంటే సీత లక్ష్మణుడిని నానా చెడ్డ మాటలూ అన్న సంగతిని లక్ష్మణుడు ఎంతో మృదువుగా చెబుతాడు. సీత మీద మరీ నేరం మోపడం ఈ పాట రాసిన కవయిత్రికకి ఇష్టం లేదు. వింటున్న ఆడవాళ్ళకీ ఇష్టం లేదు. సీత చుట్టూ లక్ష్మణుడు గీతలు గీసి ఆ గీతలు దాటొద్దని చెప్పి వెళతాడని మనకి తెలిసిన మొగ రామాయణాలు విశేషంగా చెప్తాయి. ఈ పాటలో ఆ ప్రసక్తి ఒక్క అర పాదంలో ముగిస్తుంది కవయిత్రి. రావణాసురుడు వచ్చి సీతని ఆమె నుంచున్న భూమిని పెళ్ళగించి ఎత్తుకుపోతాడు. మీకందరికీ తెలిసే ఉంటుంది, ఈ కథనం వాల్మీకంలో లేదనీ, దక్షిణాది రామాయణాల్లో ఉందనీ. అది ఆడవాళ్ళకి చాలా నచ్చే విశేషం. అందుకే అది ఈ పాటలో ఉంటుంది. లక్ష్మణుడు, సీతాదేవి నగలలో గుర్తు పట్టేది ఆమె కాలి అందెలు మాత్రమే అని రామాయణ కథకులు ఎంతో మర్యాదగా చెప్పారు మనకి. కాని ఈ పాటలో ఒక కొత్త విషయాన్ని చేరుస్తుంది కవయిత్రి. సుగ్రీవుడు రాముడికి బహుమానంగా ఇచ్చాడు ఈ నగలని. ఎందుకంటే ఆయన కౌసల్యాపుత్రుడు కాబట్టిట. ఒక తల్లికి కొడుకుగా రాముణ్ణి గౌరవించడం ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన మాట. ఆతరవాత కధని కవయిత్రి చాలా వేగంగా చెప్తుంది. సీతాన్వేషణ నాలుగు పంక్తుల్లో చెప్పేసినా, లంకలో సీత స్థితి హనుమంతుడు వర్ణించడంలో కవయిత్రి ఏ రామాయణకర్తా వాడని మాటలు వాడుతుంది..
తలలెల్ల జడలు గట్టె ఉదరమున వెదురు మొలచీయుండెను
తల్లి యుండేటి విధమూ తలచితే తాళ శక్యము గాదయా
ఉదరమున వెదురు మొలవడం అంటే ఏమిటో నాకు బోధపడలేదు. అదీకాక, వాల్మీకంలో సీత తల జడలు కట్టి ఉందనీ లేదు. ఇది అలా ఉంచి, రావణుడితో రాముడి యుద్ధం ఒక్క పంక్తిలో తెమిల్చేసింది కవయిత్రి. యుద్ధాల మీద ఆడవాళ్లకి ఆసక్తి లేదు. కాని సీత అగ్నిప్రవేశం మాత్రం బలంగా నడుస్తుంది. సీతని అలంకరించి తీసుకురమ్మని అడిగి, తీరా ఆవిడ అక్కడికి వొచ్చేక, “పదినెలలు చెర యున్నదీ భామతో భాషించ” నని అంటాడు రాముడు. అప్పుడు సీత “ఒట్టి సత్యములేటికీ ఓ రామ చిచ్చు గావించు” మంటుంది. లక్ష్మణుడి మాటల్లో ‘ఆకాశమంత పొడవు మంటలో మా వదిన మాటలాడింది. జగము నిండిన యట్టుల, ఆ మంట తటాకంలా అయింది.’ ఈ కథ చెప్పినవాడు లక్ష్మణుడు. పెద్ద రామాయణాల్లో లక్ష్మణుడు చెప్పుకోలేని సున్నితమైన విశేషాలు ఈ రామాయణంలొ వుంటాయి. రామాయణంలో స్త్రీ పాత్రలతో పాటు, లక్ష్మణుడు కూడా ఒక బలహీన పాత్రే అని కవయిత్రి ఉద్దేశం.
కథ పూర్తయ్యేటప్పటికి మనం కూడా పడగ్గది లోంచి ఆడవాళ్ళ గుంపు లోకి వస్తాం. అంటే ఇంటి పెరట్లోకి వస్తాం. అక్కడ అమ్మలక్కలు మగవాళ్ళ మీద ఎన్ని విసుర్లైనా విసురుకోవచ్చు. అందుకే కవయిత్రి రాసిన ఆఖరి మాట:
అక్కరో వింటిరటరే నేడు మన చక్రధరునీ బుద్ధులూ
ఇది ఊర్మిళాదేవి నిద్ర కథ. కాని నిజానికి ఈ పాట సమిష్టికుటుంబాలలో ఆడవాళ్ళు ఎలాంటి ఊహలు చేశారో, రామాయణం ఎలా జరిగితే బాగుణ్ణనుకున్నారో మనకు చెప్పే పాట. ఆడవాళ్ల మర్యాదల్నీ సమిష్టి కుటుంబ గౌరవాలనీ ఏమీ కాదనకుండా, చాల సాంప్రదాయికంగా, మొగ ప్రపంచాన్ని చితక్కొట్టేసే పాట ఇది. ఆడవాళ్ళ వ్యక్తిత్వాలని నిబ్బరంగా నిలబెట్టిన రచన ఇది. కవయిత్రికి కధ చెప్పడంలోనూ, అవసరమైనప్పుడు అవసరమైన మాట వాడడం లోనూ, కొన్ని సంగతులు చెప్పకుండా మానెయ్యడంలోనూ, అసాధారణమైన సంయమనం వుంది. మర్యాదల్ని పాటిస్తూన్నట్టు కనిపిస్తూనే మర్యాదల్ని తిరస్కరించే శక్తి ఉంది. ఇందులో పాత్రలకి వ్యక్తమైన మనస్సే కాకుండా సుప్తచేతన, అవ్యక్తభావాలు అనేకం ఉంటాయి. ఇలాంటివి ఫ్రాయిడ్ వొచ్చిన తరవాతే మన సాహిత్యంలో కనిపిస్తాయని విమర్శకులు అంటారు. అలా అనుకోవడం తప్పు అని ఈ పాట మనకి గుర్తు చేస్తుంది. సాహిత్యంలో ఆధునికత ఇంగ్లీషుతో సంపర్కం ఏర్పడిన తరువాత పందొమ్మిదో శతాబ్దిలోనే మొదలవలేదనీ - కావాలంటే ఈ ఆధునికతని వలసవాద ఆధునికత అనండి కాని - తెలుగులో ఇంతకు పూర్వమే ఇంకొక ఆధునికత దాదాపు పదహారో శతాబ్ది నాటికే ఏర్పడి ఉందని కొంతకాలంగా నా మిత్రులు డేవిడ్ షూల్మన్, సంజయ్ సుబ్రహ్మణ్యంలతో కలిసి వాదిస్తున్నాను. అందుకు మేము ఇంతవరకు చూపించిన అనేక ఆధారాలతో పాటు ఈ పాటని కూడా చేర్చుకోవాలి..
పాదసూచికలు
* ఏలూరులోని మంజువాణి ప్రెస్ నించి నందిరాజు చలపతిరావుగారు 1899లో స్త్రీల పాటలు అనే పుస్తకం ప్రచురించారు. తరవాత 1905లో మంగు జగన్నాథ రావుగారు నూరు హిందూ స్త్రీల పాటలు అనే పేరుతో 1905లో మరో పుస్తకం ప్రచురించారు. ఎన్నాళ్ళుగానో పెద్దకులాల వారి ఆడవాళ్ళు పాడుకునే పాటలకి ఈ ప్రచురణలతో అచ్చులో గుర్తింపు వొచ్చింది. ఈ పుస్తకాలు నేను చూడలేదు, అందులో ఈ పాట వుందో లేదో నాకు తెలియదు. అయితే నేను చూసినంత వరకు, ఈ పాట ఎన్నిసార్లు అచ్చయినా తప్పుల్తోనే అచ్చయింది. ముఖ్యంగా ఈ సంచికలోనే అందించిన ఎన్. వి. గోపాల్ అండ్ కో. ప్రచురణలో ఊర్మిళాదేవి నిద్రలేచి భ్రమజెందుట అని ఒక ఉపశీర్షిక కనిపిస్తుంది. అది అక్కడ ఉండకూడదు. ఎందుకంటే ఆ తర్వాతి ఉపశీర్షిక (పతి పాదములకు ఊర్మిళాదేవి మ్రొక్కుట) ముందు పాదంలో ‘అనుచు వాదము చేయగా | ఊర్మిళా గద్దిల్ల పడి లేచెనూ’ అని ఉంటుంది. అంటే, అప్పటిదాకా ఊర్మిళ నిద్రనుంచి లేవలేదనే మనం అర్థం చేసుకోవాలి. ఇలా సరిగ్గా పాట స్వరూపం తెలుసుకుని దీన్ని పరిష్కరించిన వాళ్లు లేకపోయారు. ఇప్పటికైనా ఈ పాట పాడుతూండగా విని, ఆ పాడే రీతికి తగిన అక్షరరీతిలో ఈ పాటని రాసి ప్రచురించాల్సిన అవసరం ఉంది. నేను ఈ వ్యాసంలో ఉదహరించిన చరణాలను ఆ విధంగా పరిష్కరించి చూపించాను. అంచేత అవి అచ్చుప్రతిలో ఉన్నట్టుగా ఉండవు.
ఊర్మిళాదేవి నిద్ర గురించీ, స్త్రీల రామాయణపు పాటల గురించీ, నేను ఆంగ్లంలో రెండు వ్యాసాలు రాశాను. వాటి వివరాలు, ఆసక్తిగల వారి కోసం ఈ కింద ఇస్తున్నాను.
- Velcheru Narayana Rao, “ A Ramayana of Their Own: Women’s Oral Tradition in Telugu, in Many Ramayanas, ed. Paula Richman. Berkeley: University of California Press, 1991, pp. 114-136.
- (ఈ వ్యాసానికి మొదటి రూపమైన నా ఆంగ్ల వ్యాసం మానుషిలో ప్రచురితమైంది. ఈ వ్యాసంలోనే ఊర్మిళాదేవి నిద్రకు నేను చేసిన ఆంగ్లానువాదం కూడా ఉంది). The song of Urmila’s separation. Manushi, No. 153.
రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్‌సిన్ లో కృష్ణదేవరాయ చైర్ ప్రొఫెసర్ గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాసారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని(Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు గారు ప్రస్తుతం ఎమరి యూనివర్సిటీ లో పనిచేస్తున్నారు. ... పూర్తిగా »
Krishna Rao Maddipati అభిప్రాయం:
January 2, 2012 1:01 pm
ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో అమ్మలక్కలు మండువా లోగిళ్ళలో పాడుతుండగా విన్న ఊర్మిళాదేవి నిద్ర పాటల శైలి ఇప్పటికీ ఇంకా నాకు బాగా గుర్తుంది. (ఎవరికైనా వినే దమ్ముంటే పాడగలను కూడా!). అవి ఉబుసుపోకకోసం పాడుకునే పాటలుగానే తెలుసుగానీ, ఇంత విశదంగా ఆలోచించే అవకాశం కలగలేదు. ఇందులోని కవితా్వని్ని, సామాజికస్పృహను విశదీకరించిన వెల్చేరు మాష్టారికి కృతజ్ఙతలు. ఈ పాటలు monotone లో పాడినా కవిత్వం గొప్పదనంతో ఎంతసేపు విన్నా విసుగనిపించదు. ఇదే శైలిలో బాలవర్ధిరాజు కథ కూడా పాడేవారు. ఇంకా వేరే కథలు కూడా పాడేవారు గానీ అవేవీ ఇప్పుడు గుర్తుకు రావడంలేదు. ఇలాంటి సాహిత్య సంపదను పరిష్కరించుకుని, పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
కామేశ్వరరావు అభిప్రాయం:
January 3, 2012 9:45 am
మరుగున పడిపోయిన (పడిపోతున్న) యిలాంటి సాహిత్యాన్ని పదిలపరుచుకోవడం, కొత్తతరాలకి పరిచయం చెయ్యడం చాలా మంచి పని. ఈ సాహిత్యాన్ని గురించి కొత్తగా ఆలోచించడం కూడా అవసరమే. అయితే యీ వ్యాసంలో నారాయణరావుగారు చేసిన ఆలోచనలో కొన్ని అంశాలపై నాకు అనుమానాలు అభ్యంతరాలు ఉన్నాయి. విజ్ఞులు పరిశీలించగలరు:
1.
శ్రీరాము తమ్ముండనే అతడనగ సృష్టిలో నొకరు గలరా?
జనకునల్లుని గానటే? భూమిలో జనకులనగా నెవ్వరు?
శతపత్రమున బుట్టినా చేడెరో సీతకూ మరిదిగానా?
సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ] సృష్టిలో నేను యెరుగ
ఇక్కడ లక్ష్మణుడు ఊర్మిళ భర్తనని చెప్పకుండా “డొంకతిరుగుడుగా” చెప్పాడని దానికి కారణం తాను పెరిగిన కుటుంబ మర్యాదలని నారాయణరావుగారు అన్నారు. ఇది నాకు సమంజసమని అనిపించలేదు. నాకు కనిపించిన విషయం ఏమిటంటే - ఊర్మిళ నిద్ర మగతలో లక్ష్మణుడు పరపురుషుడని భ్రమపడినప్పుడు అతన్ని ఎలా భయపెట్టింది?
మాతండ్రి జనకరాజూ వింటె మిము ఆజ్ఞసేయక మానడూ
మా యక్క బావ విన్నా మీకిపుడు ప్రాణముల హాని వచ్చూ
మాయక్కమరది విన్నా మిమ్మిపుడు బ్రతుకనివ్వరు జగతిలో
ఇక్కడ ఆమె ప్రస్తావించినది జనకుడు, రాముడు, సీత, సీత మరది అయిన లక్ష్మణుడు. అందుకే వారినే తన జవాబులో లక్ష్మణుడు పేర్కొన్నాడు. ఆమె మాటలే తీసుకొని తానెవరో వివరించాడన్న మాట. ఇది సహజ సంభాషణే కాని డొంకతిరుగుడు కాదు, కుటుంబ మరియాద కోసం చేసినదీ కాదు.
2.
పైనున్న లక్ష్మణుడి మాటల వాక్యాల చివరనున్న ప్రశ్నార్థకాలను నేను ఆశ్చర్యార్థకాలుగా చదువుకున్నాను (విన్నాను). నాకా వాక్యాలెలా అర్థమయ్యాయంటే - అవన్నీ లక్ష్మణుడు చెపుతున్నవే, వాక్యంలో సగభాగం లక్ష్మణుడు సగభాగం ఊర్మిళా అంటున్నవి కావు. నేను శ్రీరాముని తమ్ముడిని, శ్రీరాముడిలాంటి వారింకొకరు సృష్టిలో ఉన్నారా! నేను జనకుని అల్లుడిని. జనకులంటే ఎవరు, సామాన్యులా! అలాగే, సీతమ్మ మరదిని. ఆమెలాంటి స్త్రీని సృష్టిలో ఇంకెవిరిని నేనెరుగను!
నారాయణరావుగారి వ్యాసం చదవకముందు, చదివాక కూడా నాకలానే అర్థమయ్యిందా భాగం. ఆ అన్వయం చాలా సహజంగాను సరళంగాను ఉన్నట్టనిపిస్తోంది. నా పురుషాహంకారమేమైనా నేనలా అర్థం చేసుకొనేట్టు చేసిందేమోనని అనుమానం వచ్చి, నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు స్త్రీలనికూడా అడిగి చూసాను. నా అన్వయం కాని, నారాయణరావుగారి అన్వయం కాని చెప్పకుండా. వారికీ నాలాగనే అర్థమయ్యింది మరి! ఈ పాట గురించి వివరించిన మలయవాసినిగారు ఏ అర్థమిచ్చారో నాకు తెలియదు. అసలు నారాయణరావుగారికి నాకు తట్టిన అర్థం తట్టనే లేదో, తట్టినా అది తప్పనుకున్నారో తెలుసుకోవాలని ఉంది. ఒకవేళ ఆ అర్థం తడితే, దాన్ని కూడా ప్రస్తావించి, తాను చెప్పిన అన్వయమే ఎందుకు సరి అనుకుంటున్నారో వివరిస్తే బాగుండేది.
అసలు ఊర్మిళ ప్రస్తావన లేకుండా హఠాత్తుగా అలా ఆమె మాట్లాడిందని అనుకోవడం నిర్మాణ పరంగానూ, అర్థంచేసుకోడంలోను కూడా సంక్లిష్టత కలిగిన అన్వయం. సరళమైన అన్వయాన్ని వదిలి దాన్ని గ్రహించాల్సిన అవసరం ఏమిటి? ఆ తర్వాత నారాయణరావుగారు తన అన్వయానికిచ్చిన వివరణంతా విపరీత వ్యాఖ్యానమే అని అనిపించింది.
2.
మా తండ్రి జనకరాజూ మిమునమ్మి మరచి కళ్యాణమిచ్చే
మానవంతల్లుడనుచూ తెలియకా మదిని ఉప్పొంగుచుండే
చిత్తమొకదిక్కునుంచీ సమయమున చిన్నబుత్తురు యింతులా
దీనికిచ్చిన వివరణ నాకు సంతృప్తిగా లేదు. “చిత్తమొకదిక్కునుంచీ సమయమున చిన్నబుత్తురు యింతులా” అంటే, ఇంకొకళ్ళ మీద మనసుపెట్టి నన్ను నలుగురిలో చిన్నబుచ్చారని అర్థం తీసుకోవచ్చా? లక్ష్మణుడు ఎవరిపై మనసుపెట్టాడు? ఊర్మిళని నలుగురిలో ఎప్పుడు చిన్నబుచ్చాడు? అన్నమీద మనసుతో తనని విడిచి అడవికి వెళ్ళడం తనని చిన్నబుచ్చడమా? మరి “సమయమున” చిన్నబుచ్చడమేమిటి? ఇందులో “మానవంతుడు” కాకపోవడమేమిటి?
3. ఈ పాట ఏ కాలానికి చెందినదో తెలియదు. ఆ కాలంలో సాంఘికపరిస్థితులు అసలు తెలియవు. అలాంటప్పుడు, ఇందులో యిది ఊహ యిది వాస్తవమూ అని ఎలా నిశ్చయించగలం. ఉదాహరణకి,
“తెలుగు ఆడవాళ్ళు బావగారి పేరూ, భర్త పేరూ చెప్పకూడదు. ఒక పక్క తాను హింసపడే ప్రమాదం ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా తెలుగు కుటుంబాల ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా మసలవలసిన నిర్బంధంలో ఉన్నారో ఈ పాట సున్నితమైన మాటల్లో, కొరడాతో కొట్టినంత చురుక్కుమనిపించేలాగా చెబుతుంది.” అన్నారు. అది చెప్పకూడదనే నిర్బంధమో, అలా వరసలు పెట్టి చెప్పే అలవాటో ఎలా నిర్ణయించగలం? ఇంకొకటి - ఇవి నిజంగానే అచ్చంగా ఊర్మిళ మాటలో, లేదా పాడుతున్న స్త్రీ మాటలో కూడా చెప్పలేం. ఊర్మిళ రావణాసురుడు సీతనెత్తుకుపోవడాన్ని ప్రస్తావిండం అది అచ్చంగా ఆమె మాటలు కావని, అది కథ పాడుతున్న ఆడవాళ్ళ మాటలని సమర్థించారు కదా (ఇంతకీ యిలా కాలక్రమాన్ని అతిక్రమించడంలో “నిర్మాణదక్షత” ఏమిటో నాకర్థం కాలేదు!). అలానే ఇక్కడ కూడా యిలా వరసలతో బావగారిని భర్తని ప్రస్తావించడం పాడుతున్న ఆడవాళ్ళు అలవాటుగా చేసిన ప్రయోగమని ఎందుకు భావించకూడదు?
అలాగే, “తమకి పురుష శాస్త్రాలే ఇచ్చిన గౌరవాన్ని స్త్రీ మర్యాదని కాపాడడానికి, కుటుంబాలలో మొగాళ్ల మాటున బతికే అబలలైన స్త్రీలు అవసరం వొచ్చినప్పుడు బలంగా ఉపయోగించుకోగలరని ఈ పాటల కవయిత్రులు ఊహించడం వాళ్ల భావనా దక్షతకి నిదర్శనం.” అన్నారు. అవసరం వచ్చినప్పుడు బలంగా ఉపయోగించుకోగలగడం ఊహో నిజమో ఎలా నిర్ణయించగలం? అలాగే, “ఆడబడుచు దెప్పడం పోయి, ఇలా గొప్పగా పొగడడం ఆడవాళ్ల ఊహల్లో ఉండే మాట.” అన్నది ఆ కాలంలో ఊహో నిజమో మనకి తెలియదు కదా!
4.
“రామరాజ్య ధర్మం పటాపంచలై పోతుంది. ఊర్మిళ ఆ సందర్భంలో అనే మాటలు వింటే పరపురుషుడి చేత బలాత్కరించబడిన స్త్రీ ఎంత అసహాయ పరిస్థితిలో ఉంటుందో. తాను హింసకు గురై ఎలా చివరికి అపరాధిలా అందరిముందూ నిలబడాల్సి వస్తుందో గుండె చెదిరే లాగా బోధపడుతుంది.”
ఇక్కడ పటాపంచలమైన రామరాజ్య ధర్మమేమిటో నాకు బొత్తిగా బోధపడలేదు! అలాగే ఊర్మిళ మాటల్లో బలాత్కరింపబడిన స్త్రీ అసహాయ స్థితి కూడా నాకు కనబడలేదు. పరాయి పురుషుడు తన పడకమీదకి వచ్చాడని ఆమె భ్రమించింది. అందుకతన్ని నయానా భయాన పొమ్మని చెప్పింది. “హెచ్చయిన…” అనే రెండు వాక్యాలని పట్టుకొని ఆమె అపరాధిలా అందరిముందూ నిలబడాల్సిన పరిస్థితి గుండె చెదిరేలాగా చిత్రింపబడింది అనడం నాకు అతిశయోక్తిగా తోచింది.
5.
“సుగ్రీవుడు రాముడికి బహుమానంగా ఇచ్చాడు ఈ నగలని. ఎందుకంటే ఆయన కౌసల్యాపుత్రుడు కాబట్టిట. ఒక తల్లికి కొడుకుగా రాముణ్ణి గౌరవించడం ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన మాట.”
ఇది కేవలం విమర్శకుని ఊహ మాత్రమే. ఆ ఉద్దేశంతోనే ఆ మాట వాడబడినదని అనుకోడానికి ఎలాంటి బలమైన కారణమూ లేదు. ఈ పాటలో రామునికి చాలా పేర్లు వాడబడ్డాయి. కనీసం మరికొన్ని చోట్ల యిలా సార్థక ప్రయోగం జరిగిందని స్పష్టంగా తెలిస్తే అప్పుడీ ఊహకి కొంత బలం చేకూరుతుంది.
rama bharadwaj అభిప్రాయం:
January 3, 2012 1:56 pm
ఇధమిత్తంగా కర్తృత్వం తెలియని చోట్ల చాలా ఖచ్చితంగా ఆ పాట తాలుకు కర్తృత్వం ఒకానొక పేరు లేని పేరు తెలియని వారికి లింగనిర్దేశం చేసి అది ఒక “కవియిత్రి” రచనే నని అంటగట్టడం పరిశోధనలో కుదరదు. అవి స్త్రీల రామాయణపు పాటలు మాత్రమే !! స్త్రీలే రాసుకున్నారో స్త్రీల కోసం ఇంకెవరైనా రాసిపెట్టారో.. లేక కాలం రీత్యా వాటిలో అనేకమైన కర్తృత్వాలు కలిసాయో స్పస్టంగా విడదీసి చూడగల వీలు లేనప్పుడు నారాయణరావు వ్యాసమ్ అంతా “కవయిత్రి” అంటూ ప్రస్తావించడం లో అర్ధమ్ కనిపించదు.
ఊర్మిళాదేవి నిద్ర పాట చాలా మందికి తెలిసిన పాట. అమ్మమ్మల అమ్మల గొంతుల్లోంచి అనదిమంది తెలుగునాట విన్న పాట కూడానూ! ఇందులో నారాయణరావు” చూసిన” కల్పనలు ఆనాడు దానిని పాడిన వాళ్ళు చూసినట్టు లేదు. తెలుగు లోగిళ్ళలో ఖచ్చితంగా కొన్ని కొందరికి మాత్రమే ప్రవేశానికి అర్హ మైన ప్రాంతాలుగా పరిగణించడం “కొత్త” గా చెప్పేమని చెప్పుకునేదానికి పనికొస్తుందే గానీ ఇంటిని అన్ని విభాగాలు చేసే వీలు తెలుగు సినిమాకి సాధ్యమ్ గానీ.. తెలుగు సంసారాలకి సాధ్యమ్ కాదు.
ఇంక ఈ పాట “మగ ప్రపంచాన్ని చితక్కొట్టేసిన” పాటగా నిరూపించడానికి ఏ ఆధారమూ లేదు. అన్ని కాలాల్లోనీ అన్ని వర్గాల్లోనీ అన్ని ప్రపంచాలూ కనిపిస్తాయి. హాలుడి గాధా సప్తశతిలో ఆడవాళ్ళ కన్నా తెగించి శృంగారాన్ని అనుభవించిన వాళ్ళు ఈ ఆధునిక కాలంలోనీ కనిపించరే:) ఇంక ఊర్మిళా దేవి నిద్రకి ఇవాళ కొత్తగా “ఫెమినిస్టు” స్టేటసు ఇవ్వడం వల్ల గానీ దీనినేదో తెలుగుదేశాన ఫెమినిస్టులు పెద్దగా పట్టించుకోక వారి పరిశీలనా సామర్ధ్యాన్ని కుదించుకున్నారని గానీ రాసే వ్యంగ్యాలతోనీ పనిలేదు. ఆడవాళ్ల ప్రపంచాల మీద మగ విమర్శకుల అఖ్ఖరలేని సానుభూతి, అనవసరమైన ప్రయాసా తప్పిస్తే !!
ఇంతకీ ఈ విశ్లేషణ ఆధునికమో జానపద సాహిత్య చట్రమో, మౌఖిక సాహిత్య పరిధో లేక “ఆధునిక” దృక్పధమో ఎవరన్నా నాకు విశదీకరిస్తే వింటాను. ఇదివరలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఒక తాళ్లపాక తిమ్మక్కని తయారు చేసి పెట్టారు. ఇప్పుడీ వ్యాసంలో నారాయణ రావు గారు ఒక “ఆధునిక” మైన ఈ ఊర్మిళనీ ఆమె అంతరంగాన్నీ కొత్త కొత్తగా ఇలా నిర్మించిపెట్టారు.
కామేశ్వరరావు గారి అభిప్రాయమ్తో ఏకీభావం ఉంది నాకు.
రమ.
(This message has been edited - Ed.)
మోహన అభిప్రాయం:
January 3, 2012 3:16 pm
నేను విమర్శకుడిని గాను, నాకు కవిత్వతత్త్వవిచారములు అంతగా తెలియవు. ఊర్మిళనిద్ర పాటలోని ఛందస్సును గురించి మాత్రమే ఈ అభిప్రాయము. పాటంతా మాత్రాఛందస్సులో ఉన్నది. ప్రతి పాదములో (5-7)-(5)-(5-7) మాత్రలు ఉన్నవి. మొదటి భాగము, చివరి భాగము మాత్రల అమరికలో ఒకే విధముగా ఉన్నది. మధ్య ఉండే ఐదు మాత్రలు వీటిని కలుపుతుంది. ఏడు మాత్రల అమరిక 2-5 లేక 3-4 లేక 4-3 గా ఉంటుంది. మొదటి భాగపు, చివరి భాగపు చివరి అక్షరము లఘువైనా పాడేటప్పుడు అది గురుతుల్యమే. అందుకే భూపాలుడు పాడేటప్పుడు భూపాలుడూ అవుతుంది. మాత్రల అమరిక కోసం కొన్ని చోట్లలో దీర్ఘము కత్తిరించబడుతుంది, ఉదా. నిద్రాహారములకు బదులు నిద్ర హారము లెరుగనే. ఈ పాట అమరిక కస్తూరి రంగ రంగా నా యన్న కావేటి రంగ రంగా వంటిదే. ఛందస్సులో, పాదములో ఒకే అమరికతో ఉండే మొదటి చివరి భాగాలు మధ్యన ఉండే ఒక చిన్న గణముతో కలుపబడి ఉండుట మనకు తరచుగా కనబడుతూ ఉంటుంది. ఉదాహరణగా మత్తకోకిల, మానినీ వృత్తాలను తీసికొనవచ్చును. దీనిని గురించి అప్పుడప్పుడు ఛందస్సు, రచ్చబండ గుంపులో నేను ఎన్నో సందేశాలను వ్రాసి ఉన్నాను. విధేయుడు - మోహన
Krishna Rao Maddipati అభిప్రాయం:
January 4, 2012 12:45 am
రమ గారు,
మీ ప్రతి వాదనతో నాకేమీ పేచీ లేదు గానీ, పాట గొంతు స్త్రీలది (నాలాంటి వాడు పాడితే వింటే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి నాకే భయంగా ఉంది సుమండీ!), మీరన్నట్టుగా పాడినవారంతా స్త్రీలే. రాసిన వారెవరో పరమాత్మునికెరుక. ఉన్న పరిస్థితులను బట్టి నారాయణరావు గారు అది కవయిత్రి విరచితమేనని అభిప్రాయపడ్డారు. అది ఊహాజనితమే కావచ్చు. పరిశోధకులు సిద్ధాంతం చేయడానికి కొన్ని ఆధారాలు తీసుకుంటారు. కేవలం ఖండించాలి కాబట్టి సిద్ధంతాన్ని ఖండించడం కంటే తగిన ఆధారాలతో ఖండించడం సబబు అనుకుంటాను.
పురుషులు ‘ఆడవాళ్ళ ప్రపంచాల’ మీద ‘అఖ్ఖర్లేని సానుభూతి’ - damned if you do, damned if you don’t! నారాయణరావు గారు కాకుండా ‘నారాయణమ్మ’ గారు ఇదే వ్యాసాన్ని రాస్తే మీకు అభ్యంతరం ఉండదనిపిస్తోంది నాకు.
మీకు పల్లెటూటూరి స్త్రీల నర్మగర్భ సంభాషణలతో ఎంత పరిచయం ఉందో నాకు తెలియదు (తెలియకుండా ఊహించే సాహసం చేసే ధైర్యం కూడా లేదు!). అప్పట్లో తెలియలేదు గానీ, స్త్రీలు బహిరంగంగా వ్యక్తం చేయలేని అభిప్రాయాలని పరోక్షంగా (నారాయణరావు గారు ఉదహరించినట్టుగా) ఎంత స్పష్టంగా చెప్పుకునేవారో ఇప్పుడు తీరిగి ఆలోచిస్తే జ్ఞానోదయంతో ఒళ్ళు పులకరిస్తుంది. (మందమతిని, ఇంతకాలం పట్టింది, క్షంతవ్యుణ్ణి!). దీనికి ప్రత్యేకమైన ‘ఆధునిక దృక్పధం’ అంటూ నిరసన ప్రకటించడం కంటే, ఇప్పటికైనా ఆధునిక దృక్పధంతో వచ్చిన పరిజ్ఞానంతో అప్పటి స్త్రీల భాషను అర్ధం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా గుర్తించడం మంచిదేమో? మంచి పనికి ఆడవారైతేనేం, మగవారైతేనేం?
‘మంచియన్నది మాలయైతే మాల నేనవుతాను’ (నూట యాభై ఏళ్ళయినా మహాకవి మాటలు బ్రతికే ఉన్నాయనుకుంటున్నాను).
కృష్ణారావు
TahaTaha అభిప్రాయం:
January 4, 2012 2:23 am
“ఊర్మిళ గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారు అని వాల్మీకి రామాయణంలో ఉంది. ఆ తరువాత ఊర్మిళ గురించి వాల్మీకం మనకేమీ చెప్పదు.
వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. ఆవిడని గురించి ఒక అందమైన కథ అల్లారు. అడివికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతూంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది కాని లక్ష్మణుడు దానికి అంగీకరించలేదని మనకి తెలుసు.”
ఈ మనము ఎవరు? [ఈ మనము లోనేను లేను, ఎందుకంటే వాల్మీకి మనకేమీ చెప్పలేదు గనక] వారికి ఈ విషయము ఎలా తెలుసు? ఇది చూసింతర్వాత చదవ బుద్ధి వెయ్యలేదు గానీ చదివాను.
lyla yerneni అభిప్రాయం:
January 4, 2012 1:05 pm
చాలా బాగా రాసావ్ నారాయణరావ్! చాలా బాగా రాసావు. సెభాష్!
లైలా
rama bharadwaj అభిప్రాయం:
January 4, 2012 1:31 pm
కృష్ణారావు గారు , మీకు ఊర్మిళాదేవి నిద్ర అన్న పాటని గురించి పల్లెటూళ్ల ల్లోని స్త్రీల సంభాషణల గురించి ఎంత తెలుసునో నాకు అంత గానూ తెలుసును. దాని గురించి మీరు చింత పడనవసరం లేదు. నాకు పరిశీలనానుభవమూ పరిశోధనానుభవమూ సైతం పుష్కళంగానే ఉన్నాయి. అందువలన నా అభిప్రాయాలు నా విమర్శ కి కూడా బలమైన పునాది ఉంటుంది. మీ ఇతర మాటలలో నాకు జవాబు రాయవలసినంత బలమైన అంశం ఏదీ కనిపించలేదు గనక నేను ప్రతిస్పందించడం లేదు.
తహ తహ గారూ !! మీకు మల్లేనే ఆ వ్యాసం లోని ” మనం ” లో నేను కూడా లేను:)
రమ.
మోహన అభిప్రాయం:
January 4, 2012 6:37 pm
ఊర్మిళ నిద్ర గురించి మరో కథ :-) లక్ష్మణుడికి రాముడిపైన, సీతపైన ఎంతో అభిమానము, గౌరవము, ప్రేమ. వాళ్లిద్దరిని సేవ చేస్తూ తన్మయుడవుతూ ఉండేవాడు వనవాసములో. నిద్రనుండి పూర్తిగా దూరమయ్యాడు, ఇలా నెలలు, సంవత్సరాలు గడిచాయి. ఇతని దీక్ష నిద్రాదేవికి తెలిసింది. ఒక రోజు లక్ష్మణుడి ముందు నిద్రాదేవి ప్రత్యక్షమయింది. లక్ష్మణా, నీ దీక్ష, రాముడిపైన నీకుండే అపారమైన భక్తి, ప్రేమ నన్ను సంతోషపరచింది. నిద్రలేని నీకు అలసట కలగకుండా ఉండాలని నీకు వరమిస్తానని అన్నది. నాకు రాముడి సేవలో ఎప్పుడూ అలసట కలుగదు, నీ దగ్గర నేను వరము పుచ్చుకొంటే నా దీక్షలో, నా వ్రతముపై నాకే సందేహము కలుగుతుంది, అందువల్ల నీ వరము నాకు అక్కర్లేదు అన్నాడు లక్ష్మణుడు. ఇంత దూరము వచ్చాను, కాబట్టి నీకు వర మేదీ యివ్వకుండా నేను వెళ్లకూడదు, ఏ వరమైనా అడుగు, అది నీకిస్తాను అని చెప్పింది. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు - సరే, ఇక్కడ నాకు అన్నగారి నీడలో ఏ అపాయము లేదు, అక్కడ నా భార్య ఊర్మిళ ఏమి కష్ట పడుతున్నదో, ఆమెకు కష్టాలేమీ లేకుండా చేయమని అడిగాడు. నిద్రాదేవి సరేనని అయోధ్యకు వచ్చి ఊర్మిళ ముందు నిలిచింది తాను ఆమె భర్త లక్ష్మణుని చూచానని అతడు ఆమెకు కష్టాలేమీ లేకుండా, రాకుండా వరమివ్వ మన్నాడని చెప్పాడని తెలిపింది. అప్పుడు ఊర్మిళ, ఇక్కడ పెద్ద వారి సేవలో నేను నిమగ్నమై ఉన్నాను, నాకేమీ కష్టాలు లేవు, నన్ను తలబోస్తూ అక్కడ లక్ష్మణుడు తన స్వామి కార్యమును సరిగా చేయలేక పోతున్నాడో ఏమో, అండువల్ల లక్ష్మణుడు నన్ను సంపూర్ణముగా మరచిపోయేటట్లు వరమివ్వమని నిద్రాదేవిని అడిగింది. ఒకరికన్నా మరొకరు త్యాగశీలురు గదా ఈ రామాయణ కథలో.
ఊర్మిళను కేంద్రముగా నుంచుకొని హిందీకవి మైథిలీశరణ్ గుప్తా సాకేత్ అనే ఒక కావ్యాన్ని కూడా వ్రాసియున్నాడు. విధేయుడు - మోహన
PCS RAO అభిప్రాయం:
January 6, 2012 3:07 am
ఈ వ్యాసమును చూచిన తక్షణము నాకు నేను 8వ తరగతి చదువుచున్నప్పటి (1963) తెలుగు పుస్తములోని ఒక పద్యము జ్ఞాపకమునకు వచ్చుచున్నది.
“నలుగురు నంగనాచి గహనాలకుగాంతునిగెంటి ఇంటిలో గులుకుచు కూరుచున్నదటంచురందురని రవంతయేని చింతిలుకుము తల్లి”
ఈ సన్నివేశము: లక్ష్మణుడు అన్నగారితొ కలిసి అడవులకు వేళ్ళును.ఊర్మిళాదేవి ఒక్కటే అయోధ్యలో బాధపడు సమయములొ కవి ఆమెను అనునయించుచూ ఈ పద్యమును వ్రాశారు. దీనిని వ్రాసిన కవి, కావ్యము పేరు, ఆ కావ్యము ఎచ్చట దొరుకునో చెప్పగలరని నా సవినయ ప్రార్థన. బెంగళూరు (కర్నాటక)లో తెలుగు పుస్తకములు దొరుకుట దుర్లభము.
Sreenivas Paruchuri అభిప్రాయం:
January 6, 2012 5:01 am
మోహనరావుగారు: గతి, నడక, మాత్రాఛందస్సుల గురించి *ముఖ్యంగా మీకు* :) చెప్పనవసరంలేదు కానీ చాలా “స్త్రీల పాటలు”, ఉదా. “రాఘవ పరిణయం”, ఇలానే నడుస్తాయి (/పాడబడతాయి). కస్తూరి రంగ రంగ పాటని ప్రస్తావించారు కనుక, ఆపాటను “ఊర్మిళనిద్ర” పాడిన గాయని బి. సుబ్బులు గొంతులోనే యిక్కడ వినవచ్చు. పాడిన కాలం: 1930లు. నా దగ్గరున్న రికార్డు బాగా అరిగిపోయి ఉంది. So, please bear with the poor audio quality. — శ్రీనివాస్
[కస్తూరి రంగ రంగా పాటను అలనాటి పాట:ఊర్మిళ నిద్రలో ఆడియోగా ఉంచాము. గమనించగలరు. - సం.]
Sreenivas Paruchuri అభిప్రాయం:
January 8, 2012 7:40 pm
క్లుప్తంగా నేను కొన్ని విషయాలు చెప్పదలచుకున్నాను.
ముఖ్యంగా మౌఖిక సాహిత్యవిశ్లేషణ కేవలం లిఖిత సాహిత్యం చదివే పద్ధతుల్లో సాధ్యం కాదు. ఈ రకమైన సాహిత్యాన్ని విశ్లేషించడానికి కొన్ని శాస్త్ర పద్ధతులున్నాయి. ఈ పరిశోధనలన్నిటి వెనకా ఎంతో విస్తారమైన ఫీల్డ్ వర్క్ ఉంటుంది. మౌఖిక సాహిత్యం మీద విస్తారమైన పరిశోధనలు జరిగాయి కాబట్టి ఒకటీ అరా పుస్తకాల పేర్లు చెప్పడం కష్టం. తెలుగులో మొదటిగా ఈ రకమైన సాహిత్యాన్ని విశ్లేషించే పద్ధతుల గురించి నారాయణరావుగారు 1978లో “తెలుగులో కవితా విప్లవ స్వరూపాలు”లో చెప్పారు (3.ed. 2011). యూరోప్‌లోను, అమెరికాలోను మౌఖిక సాహిత్యంమీద పరిశోధనల్లో Albert Lord, Walter Ong లాంటివారి సిద్ధాంతాలు బలంగా వున్నాయి. 1970ల నుండి 80ల దాకా A.K. Ramanujan, Peter Claus, Brenda Beck, V. Narayanarao లాంటి చాలామంది భారతదేశంలో మౌఖిక సాహిత్యాల మీద పని చేశారు. పాశ్చాత్య మౌఖిక సాహిత్యానికోసం ఏర్పరుచుకున్న ఈ ప్రమాణాలు భారతీయ భాషల్లో మౌఖిక సాహిత్యాన్ని విశ్లేషించడానికి సరిపోవనీ, ఇందుకోసం కొత్త పద్ధతులు ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదనలు వీరి పరిశోధనలవల్లే బలపడ్డాయి.
ఇంత విస్తారమైన నేపథ్యం కలిగిన ఈ సాహిత్యం గురించి చర్చించబోయేముందు, ఇలాంటి వ్యాసాలను ఒక వ్యసనంగా, చులాగ్గా విమర్శించేవాళ్ళు కాకపోయినా, వీటి గురించి అర్థం చేసుకొనాలనుకునే వాళ్ళు, ముందుగా మౌఖిక సాహిత్యం మీద జరిగిన పనిని గురించి కొంచెం తెలుసుకుంటే బాగుండేది. పైన “ఊర్మిళనిద్ర” వ్యాసంలో చివరగా ఇచ్చిన రిఫరెన్సులు (రెండూ ఆన్‌లైన్‌లో దొరుకుతున్నవే.), కనీసం #A ramayana of their own# వ్యాసం, అందులో వివరంగా ఇచ్చిన పాదసూచికలు చదివినా చాలనుకుంటాను.
కామేశ్వరరావుగారు ప్రస్తావించిన అంశాలకు వస్తే:
1. భర్త తన పేరు భార్యకి చెప్పడం అనేది మనకు ముందునుంచీ ఉన్నదే అని మీరనుకుంటున్నారా? ముఖ్యంగా అగ్రవర్ణాలలో! మీ పెద్దవారిని అడిగి చూడండి ఒకసారి.
2. ఈ పాటను గురించి కొందరు స్త్రీలను అడిగినట్లు వాళ్ళు అలాగే ఈ పాటను అర్థం చేసుకున్నట్లు మీరు చెప్పారు. వారి నేపథ్యం తెలియని కారణంగా వారు అర్థం చేసుకున్న తీరుని గురించి నేను చర్చించను. కానీ ఇల్లిందల సరస్వతీదేవిగారు 1951లో రాసిన “జాతి రత్నాలు - స్త్రీల పాటలు, కథా వైచిత్రి” అన్న పుస్తకంలో ఈ పాటను గురించి చర్చించారు. అందులో మీరు ప్రశ్నిస్తున్న అంశానికి సంబంధించి ఒక్క పేజీని (72పే.) ఈమాటలో ఉంచుతున్నాను. (ఈ పుస్తకం DLI లో లభ్యం అవుతుంది.) అక్కడ మీరు ప్రశ్నిస్తున్న పంక్తులు విడకొట్టి మరీ ఎలా ఇవ్వబడ్డాయో చూడండి.
ల: శ్రీరాము తమ్ముండనే -
ఊ: అతడనగ - నొకరు గలరా?
ల: జనకునల్లుని గానటే -
ఊ: భూమిలో జనకులనగా నెవ్వరు?
…
2A. “చిత్తమొకదిక్కునుంచీ” అన్న పాదం దగ్గర మీరు మరొక వ్యాఖ్యానం చేసారు. “లక్ష్మణుడు ఎవరిపై మనసుపెట్టాడు? ఊర్మిళని నలుగురిలో ఎప్పుడు చిన్నబుచ్చాడు? అన్నమీద మనసుతో తనని విడిచి అడవికి వెళ్ళడం తనని చిన్నబుచ్చడమా? మరి “సమయమున” చిన్నబుచ్చడమేమిటి?” అని మీరు అడగడం మరీ అమాయకంగా వుంది. తనని చేసుకున్న లక్ష్మణుడు తనని వదిలేసి అన్నగారి సేవ చేయడానికి వెళ్ళిపోయాడు. ఆ అన్నగారు తన భార్యని తనతో రానిచ్చాడు. ఇది ఊర్మిళకి లక్ష్మణుడు తన చిత్తాన్ని అన్నగారిమీద పెట్టుకున్నట్టు, తన తోటికోడళ్ళ దగ్గర తనని చిన్నబుచ్చినట్టు అర్థమవ్వడంలో ఆశ్చర్యమేముంది.
3. ఆకొమ్మ తమకమున వణకదొడగే
…
హెచ్చయిన వంశానికీ అపకీర్తి వచ్చె నేనేమిసేతూ
కీర్తి గల ఇంట బుట్టీ అపకీర్తి వచ్చె నేనేమిసేతూ
వణకదొడగే , నేనేమిసేతూ, నేనేమిసేతూ అన్న మాటలలో మీకు స్త్రీ అసహాయ స్థితి కనబడలేదా?
3A. “కథ ఒక్కసారిగా మారుతుంది. అంతవరకూ ప్రశాంతంగా వున్న వాతావరణం చెల్లాచెదురైపోతుంది. రామరాజ్య ధర్మం పటాపంచలై పోతుంది.” దీనిమీద విమర్శగా “పటాపంచలమైన (sic) రామరాజ్య ధర్మమేమిటో నాకు బొత్తిగా బోధపడలేదు! ” అన్నారు మీరు. … రామరాజ్యం గురించి యుద్ధకాండ చివరి సర్గలో వాల్మీకి వర్ణించిన “సర్వం ముదితమేవ ఆసిత్ (అందరూ ముదితులై ఉన్నారు)”, “ఆసన్ .. నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి (నిరామయులై, శోకరహితులై రామరాజ్యంలో ప్రజలు ఉన్నారు)” వంటి శ్లోకాలు చదవండి. (verse 99-105).
4. మీరు కూడా “విపరీత వ్యాఖ్యానం”, “అతిశయోక్తి” లాంటి పదాలను వాడడం శోచనీయం.
ఇక పోతే కర్తృత్వం గురించి వచ్చిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నేనెక్కువ శ్రమపడక్కర్లేదు. ఆంధ్ర సాహిత్య పరిషత్తు వాళ్ళు ప్రచురించిన “స్త్రీల రామాయణపు పాటలు”లో (1.ed. 1955, 2.ed. 1986) “కౌసల్య వేవిళ్ళు, సీత సమర్త, సీత వసంతం”, లాంటి పాటలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా “కౌసల్య వేవిళ్ళు” అనే పాటలో కౌసల్య పురుటి నెప్పుల గురించి చాలా వివరమైన వర్ణన వుంది. A Ramayana of their own అన్న వ్యాసంలో ఈ విషయంపై వివరమైన చర్చ ఉంది. ఇవి స్త్రీలు రచించిన పాటలే అని చెప్పడానికి ఇంతకన్నా ఎక్కువ రుజువు అక్కర్లేదనుకుంటాను.
భవదీయుడు,
శ్రీనివాస్
rama bharadwaj అభిప్రాయం:
January 9, 2012 3:11 am
ఈ విషయం మీద నేను సైతమ్ ప్రతిస్పందించి ఉన్నాను గనక పరుచూరి శ్రీనివాస్ ఎవరికి జవాబు రాసినా లేక ఎవరి తరుపున జవాబు రాసినా నేను ఆయన రాసిన వైఖరి మీద నాకున్న సందేహాలని మళ్ళి వెలిబుచ్చుతున్నాను.
నేను నా ప్రతిస్పందనలో స్పష్టంగానే కొన్ని విషయాలని సూచించి ఉన్నాను. వాటిని పరుచూరి సరిగ్గా అర్ధం చేసుకున్నట్టు కనబడదు. బహుశా పరుచూరి కూడా ఒక పాఠకుడి గానే దీని మీద మాట్లాడుతున్నారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఈ మౌఖిక/ లిఖిత సాహిత్యాల మీద పరిశోధనని వెలయించిన వారు అయి ఉండరు.
స్త్రీల రామాయణపు పాటలు అని ఒక పుస్తకమ్ మీద అచ్చు వేసినంత మాత్రానికే వాటిని యధాతధంగా మనమ్ స్వీకరించనఖ్ఖరలేదు. అందులో స్త్రీల గొంతుకలున్నాయి. అవి స్త్రీలు రాసినవి అయి ఉండవచ్చు. ఒకానొక కవయిత్రి అని కాకుండా కాలక్రమేణా అనేకమంది స్త్రీలు ఆయా పాటలని తమ ఊహలతో విస్తరించుకుని ఉండవచ్చు. ఖచ్చితమైన కర్తృత్వం అన్నది మౌఖిక సాహిత్య లక్షణమ్గా పరిశోధకులు ఒప్పరు. ఒకటి కన్నా మించి దానికి పాఠాంతరాలు దొరికినప్పుడు కూడా అది దాని వ్యాప్తికి ముఖ్య ఉదాహరణగా పరిగణించడమ్ మౌఖిక జానపద రీతులని గుర్తు పట్టడంలో మరొక ఉదాహరణగా చెప్తారు. ఇంక ఆడవాళ్ళ కోసం మగవాళ్ళు సాహిత్యాన్ని సృష్టించిన ఉదాహరణలు కూడా మనకి మౌఖిక సాహిత్యంలో మెండుగానే దొరుకుతాయి. అప్పుడు ఆ పాట చివరి చరణం లో ఆ రాసిన కవి పేరు సైతమ్ వస్తుంది. స్త్రీలు పాడుకునే పాటలలో ఇటువంటివి కూడా ఉండటమ్ బహుశా పరుచూరికి తెలిసి ఉండదు.
లిఖిత సాహిత్యంలో క్షేత్రయ్య పదాలు దేవదాసీల కోసం రాజాస్థానమ్లో నృత్యమ్ చేసే స్త్రీల కోసమ్ రాయబడిన పాటలే! ఇలా అన్ని సంప్రదాయాలలోనూ అందరూ చేయి చేసుకోవడం స్పష్టం గానే కనిపిస్తుంది మనకి. అందులో గొంతుకలు స్త్రీల గొంతుకలే! వాళ్ళ వాళ్ళ మనస్సులోని ఈర్ష్యా ద్వేషాలే! వాళ్ళ వాళ్ళ అంతరంగాలే! అలాగే అన్నమయ్య నాయికలలో సైతం మనకి చాలా సందర్భాలలో స్త్రీల గొంతుకలు బలంగా వినిపిస్తాయి. కేవలం సమర్తలనీ ..పురిటి నొప్పుల్నీ వేవిళ్లనీ రాసిన కారణానికే అవి స్త్రీలు రాసేరని చెప్పనఖ్ఖర లేదు. రాసి ఉండవచ్చు. కాకపోయీ ఉండవచ్చు. ఒక మూల పదం ఉండగా వాటిని పాడుకునే క్రమంలో భిన్నమైన అంశాలు వచ్చి చేరడానికి సైతమ్ ఆస్కారం ఉంటుంది. ఇది కూడా మౌఖిక సాహిత్యపు ప్రధాన లక్షణమే! నేను ఖచ్చితంగా వ్యాసకర్త “కవయిత్రి” అంటూ ప్రస్తావన చేయడాన్ని అభ్యంతరం పెట్టడంలో ఇన్ని అంశాలూ ఇన్ని పరిశోధనలూ ఉన్నాయి. ఇక్కడే నేను వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ప్రస్తావన తెచ్చాను. అది ఎందుకు తెచ్చానో కూడా పరుచూరికి బోధపడినట్టు లేదు. వేటూరి గారు ఒక తాళ్లపాక తిమ్మక్కని ఈ సరికే “తొలి తెలుగు కవయిత్రి”గా తయారు చేసి పెట్టారు. అందుకు సరిపడా రుజువులు ఏవీ స్పస్టమ్గా లేకుండానే! అటు తర్వాత నించీ తెలుగులో మొదటి కవయిత్రి స్టేటస్సు అలా తాళ్ళపాక తిమ్మక్క ఆక్రమించుకుంది. అసలు అలాంటి ఆమె ఒకరున్నారొ లేరో తెలియకుండానే! అందువలన పండితులన్నవారేదో పొరపాట్లు చేయరన్న భ్రమలో తెలుగు వాళ్ళు కనీసమ్ తరచి చూసుకోకుండానే ఆమెని “తొలితెలుగు కవయిత్రి” అంటూ సంభావించేస్తున్నారు. ఇలాంటివి ఆయా పండితుల ఊహలు మాత్రమే! పరిశోధనలో తెలియనివాటిని అలాగే పేర్కోవడమ్ సముచితమని అనడమ్ “వ్యంగ్యం”గా శ్రీనివాస్ కి అర్ధమ్ కావడం వింత మరి.
నేను చాలా వరకూ నారాయణరావు వ్యాసాలని చదివినదాన్ని. ఆయన అభిప్రాయాలలో మొదటి రోజులలో కనిపించిన విలక్షణత క్రమంగా కనుమరుగవడాన్ని గమనించవచ్చు ఎవరైనా! ఆయన మాటల్లో ఇతర విమర్శకుల ప్రభావం కూడా గుర్తు పట్టవచ్చు. ఎ.కె. రామానుజన్ ప్రభావం లోంచి నారాయణరావు బయటకు రాలేకపోవడాన్ని ఆయన వ్యాస రచనలన్నీ తెలియజేస్తున్నాయి. ఇది తెలుగు సాహిత్యమ్ మీద పట్టు ఉన్న వాళ్లకి స్పస్టమ్ గానే తెలుస్తుంది. అయితే మన దగ్గర పొగడ్తలకి ఉన్న విశేషమైన విలువ.. ప్రాధాన్యమ్.. విబేధించడానికి ఉండదు. ఇది ఎక్కువగా తెలుగు వాళ్ళ లక్షణమ్ జాతి పరంగా! నారాయణరావు భావాలూ వ్యాసాలూ విమర్శకి అతీతమైనవా ఏమి??
మనం విమర్శని పట్టించుకోవాల్సిన స్థితి నించీ విమర్శ చేసిన వారి గొంతుకల్ని అణచివేయాలనే ధోరణి లోకి మళ్ళిపోతున్నాం . “మీరు కూడా” అంటూ పరుచూరి శ్రీనివాస్ కామేశ్వరావుగారిని ఉద్దేశ్యించి అనడం దీనికి మరొక ఉదాహరణ. ఆయన అభిప్రాయాలు రాసిన వారి మీద వివక్ష చూపడమ్ ఏమిటో?
ఇంక ఈమాట గనక కేవలం సాహిత్యానికి ఒక చర్చా వేదిక గనక అయితే అప్పుడు అన్ని రకాల అభిప్రాయాలకీ చోటు ఇస్తుంది. ఇస్తుందన్న నమ్మకం వల్లనే ఇక్కడ రాయడం. లేకపోతే అసలు రాయవలసిన పనేముందీ? ఈమాటకే రాయవలసిన అవసరమ్ ఏముందీ ఎవరైనా? నీతిబోధలూ, ప్రవచించడాలూ ఎదటి వారికి ఏమీ తెలియదన్నట్టు మాట్లాడటమ్ చేసినప్పుడే అటువంటి వాటికి జవాబుగా చురకలు గానీ వ్యంగ్యాలు గానీ రాయడమ్ అవసరమ్ అవుతుంది. సాహిత్య అభిప్రాయాలకి ఒక చరిత్ర తప్పక అవసరమని భావించే దానిని గనక నేను ప్రతిస్పదించడమ్. ఎందుకంటే ఏ అభిప్రాయానికైనా రాసే వాళ్ళు మాత్రమే కాక ఇతర పాఠక వర్గమ్ కూడా ఉంటుందనీ తెలిసిన దానినీ! పాఠక వర్గం మీద నమ్మకమూ గౌరవమూ ఉన్నదానినీను! తెలిసిన పాఠకులని ఆలోచించనిద్దామ్!
రమ.
కామేశ్వరరావు అభిప్రాయం:
January 9, 2012 12:56 pm
శ్రీనివాస్ గారు,
మీ వివరణకు కృతజ్ఞతలు.
1. “భర్త తన పేరు భార్యకి చెప్పడం అనేది మనకు ముందునుంచీ ఉన్నదే అని మీరనుకుంటున్నారా?”
మా పెద్దవాళ్ళని అడిగాను. ఇలాంటి ఆచారమేదీ (భర్త తన పేరు భార్యకి చెప్పకపోవడం) వారికి తెలియదు. రాజులలో ఉందేమో, లేదా కొన్ని ప్రాంతాలలో ఉన్నదేమో. అయినా నా పాయింటు అది కాదు. అక్కడ లక్ష్మణుడన్న మాటలని వివరించడానికి అసలు దాని ప్రసక్తే అనవసరం అన్నది నా అభిప్రాయం. “దశరథకుమారుడను” అనో, “సుమిత్రానందనుడను” అనో చెప్పుకొని ఉంటే ఆ వివరణ అవసరముండేదేమో. కాని అతను చెప్పిన విధానం చూస్తే, కచ్చితంగా ఊర్మిళ ప్రస్తావించిన వాళ్ళనే తాను ప్రస్తావించడమన్నదే ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. అది సంభాషణలో చాతుర్యం.
2. ఇక్కడ నేనిచ్చిన అన్వయం ఒక్కటే సరైనదని చెప్పడం నా ఉద్దేశం ఎంత మాత్రమూ కాదు. నారాయణరావుగారు కూడా తన అన్వయం గురించి అలా అంటారని నేననుకోను. ఎందుకంటే మీరన్నట్టుగా నేపథ్యాన్ని బట్టి, దృక్పథం బట్టి అన్వయించుకోడంలో తేడాకి చాలా అవకాశం ఉంది యిక్కడ. ఉదాహరణకి మీరు ప్రస్తావించిన ఇల్లిందుల సరస్వతీదేవిగారి పుస్తకంలో ఆ పాటకి వారిచ్చిన వ్యాఖ్యానం కూడా నారాయాణరావుగారి వ్యాఖ్యానం కన్నా చాలా వేరుగా ఉంది. 1940లో దేవేంద్ర సత్యార్థి యీ ఊర్మిళాదేవి నిద్ర పాటని ఇంగ్లీషులో అనువదించి Modern Review జర్నల్‌లో ప్రచురించారు (ఇల్లిందల సరస్వతీదేవిగారి పుస్తక పీఠికలో సురవరం ప్రతాపరెడ్డిగారు దీని గురించి ప్రస్తావించారు). ఆ అనువాదంలో వారు నాకు తోచిన అన్వయాన్నే తీసుకున్నారు. ఇది కూడా డిజిటల్ లైబ్రరీలో లభ్యమవుతోంది [ఈమాటలో అనుబంధంగా ఈ వ్యాసాన్ని ఇక్కడ చదవండి - సం.]
నేను చెప్పదలుచుకున్నదల్లా, సరళమైన అన్వయం ఉన్నప్పుడు దాన్ని కాకుండా క్లిష్టాన్వయాన్ని తీసుకోడం ఎంతవరకు సమంజసమో ఆలోచించమని. అందులోనూ అలాంటి అన్వయాన్ని ఒక సిద్ధాంతానికి ప్రాతిపదికగానో ఉదాహరణగానో తీసుకుంటున్నప్పుడు.
మీ 2A వివరణతో నేను ఏకీభవిస్తాను.
4. “విపరీత వ్యాఖ్యానం”, “అతిశయోక్తి” అనే పదాల వాడుకలో నాకు బాధపడాల్సిన అంశమేదీ కనిపించడం లేదు. ఒకరి వివరణో వ్యాఖ్యానమో విపరీతమనో అతిశయోక్తి అనో అనిపించడం నేరం కాదు కదా. అది చెప్పడం వారిని కించపరచడమూ అవ్వదు. (ఆ మాటకొస్తే నా అభిమాన కవి విశ్వనాథవారి వ్యాఖ్యానం కూడా కొన్ని చోట్ల అతిశయోక్తి, విపరీతమూ అనిపిస్తూ ఉంటుంది!). నాకు చేతనైనంత వరకూ నా అభిప్రాయానికి కారణాలుకూడా చెప్పాను.
వాల్మీకి రామాయణం ప్రసక్తి వచ్చింది కాబట్టి, తహతహగారి వ్యాఖ్య చూసాక నాకు కనిపించిన మరొక చిన్న గందరగోళం: “మారీచుడు ‘హా లక్ష్మణా! హా సీతా!’ అని అరిచాడట. మనకు తెలిసిన రామాయణంలో మారీచుడు హా లక్ష్మణా అని మాత్రమే అంటాడు.” అన్న వాక్యం. ఇక్కడ నారాయణరావుగారి ఉద్దేశంలో “మనకి తెలిసిన రామాయణం” ఏమిటో నాకు తెలియదు కాని, వాల్మీకిరామాయణంలో లక్ష్మణుడు “హా సీతా! హా లక్ష్మణా!” అనే అరుస్తాడు. అంచేత అది స్త్రీ హృదయానికి ఉదాహరణగా ఇవ్వడం సమంజసం కాదు. విశ్వనాథ కల్పవృక్షంలో మాత్రం మారీచుని పాత్రని ఔన్నత్యం పెంచడానికి, అతనికి అనృతదోషం కలగకుండా అతను “లక్ష్మణాగ్రజా!” అని అరిచాడనీ, అది దూరానికి “లక్ష్మణా” అని మాత్రమే వినిపించిందని ఒక తమాషా మార్పు చేసారు.
TahaTaha అభిప్రాయం:
January 10, 2012 5:07 am
కామేశ్వర రావు గారూ గందరగోళం ఏమీ లేదు. ఒక సిద్ధాంతాన్నో , ఆలోచననో ప్రతిపాదిస్తున్న వ్యాసకర్త /ఉపన్యాసకుడు నిరాధారంగా ‘మనం’, మనకు తెలుసు’ అనటం తార్కికంగా నేరం. ఏ మూడు వందల రామయణాలో కాక కేవలం వాల్మీకి రామాయణం మాత్రమే ఆధారంగా ఊర్మిళను గురించి వ్యాసకర్త రాస్తున్నట్టుగా తోపింప జేసేటట్లుగా వ్యాసోపక్రమణిక ఉంది కాబట్టి ‘వాల్మీకి మనకేమీ చెప్పలేదు’ అంటూనే వ్యాసకర్త ‘మనకు తెలుసు’ అనటం నిరాధారంగా ‘మనం’, ‘మనకు తెలుసు’ అంటే ఎంత నేరమో అంత కన్నా ఎక్కువ నేరం. ఈ విషయమే నేను మరో రకంగా చెప్పాను.[ఇది రమ (భరద్వాజ్) గారు గమనించారని ఆమె వ్యాఖ్య ద్వారా నాకు అర్థమయింది ]
రవి అభిప్రాయం:
January 10, 2012 8:30 am
కామేశ్వరరావు గారు సూచించిన అంశాలకు నా ఊహలు.
1. ఈ విషయం లో పరుచూరి శ్రీనివాస్ గారి భావనే సబబనుకుంటున్నాను.
పదునాలుగేళ్ళు నిద్రలో ఉన్న ఊర్మిళతో లక్ష్మణుడు ‘సంభాషణా చాతుర్యం’ చూపిస్తూ సమాధానాలు చెప్పాడనడం అంత బావోలేదు. ఏ మగవాడికైనా పదునాలుగేళ్ళ తర్వాత భార్యను నిద్రలేపి మాట్లాడించేప్పుడు నేను “నీ భర్తను ఫలానా వాణ్ణి” అని నేరుగా చెప్పుకోవడం ఊహాపరంగా ఇబ్బందికరమే.
ఇది కొన్ని ప్రాంతాల సాంప్రదాయం కూడానూ. మా ఇంట ఈ సాంప్రదాయం ఉంది. భర్త భార్యకు నేను నీ భర్తను అని చెప్పడు. సూచిస్తాడు. (దురదృష్టవశాత్తూ :)). మౌఖికము, పైగా స్త్రీల పాటలలో వస్తువైచిత్రి, సంభాషణాశబలత కన్నా స్త్రీ మనసుకు నచ్చిన ఊహలు కల్పించుకోవడంలో ఉన్న ఆనందమే గణనీయమని నేననుకుంటున్నాను.
2. శ్రీరాము తమ్ముండనే!
అతడనగ సృష్టిలో నొకరు గలరా?
జనకునల్లుని గానటే?
భూమిలో జనకులనగా నెవ్వరు?
శతపత్రమున బుట్టినా చేడెరో
సీతకూ మరిదిగానా?
సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ]
సృష్టిలో నేను యెరుగ
స్త్రీల పాటలకు, పురుషుల నిస్సహాయత ను వారు ఊహించి ఆనందించే మౌఖిక సాహిత్యం లో అన్వయాన్ని వస్తుతః లేదా రచనా సంవిధానపరంగా కాక, పాడుకునే వారికి కలిగే ఆనందాన్ని అనుసరించి ఊహించడం సబబేమో.
ఆ పాటలలో ఊర్మిళ ఆక్షేపణ ఇచ్చినంత ఆనందం, సరసమైన లక్ష్మణుడి సమాధానం వల్ల కలిగే అవకాశం పాడుకునే వారికి లేదనుకుంటున్నాను.
కామేశ్వరరావు అభిప్రాయం:
January 10, 2012 12:16 pm
రవి,
1. ఇక్కడ “సంభాషణా చాతుర్యం” అంటే మీరు “చమత్కారం” అని అర్థం చేసుకున్నట్టున్నారు. నా ఉద్దేశం అది కాదు, అవతలి వారన్నదానికి తగ్గట్టుగా మాట్లాడే నేర్పు అని. “స్త్రీ మనసుకు నచ్చిన ఊహలు” - ఇక్కడ స్త్రీ మనసుకు నచ్చిన ఊహ ఏమిటి? ఒక భర్త తన భార్యతో ఆమె మాటలకి అనుగుణంగా మాట్లాడడం స్త్రీల మనసుకు నచ్చని విషయమంటారా? :)
2. “స్త్రీల పాటలకు, పురుషుల నిస్సహాయతను వారు ఊహించి ఆనందించే మౌఖిక సాహిత్యం లో అన్వయాన్ని వస్తుతః లేదా రచనా సంవిధానపరంగా కాక, పాడుకునే వారికి కలిగే ఆనందాన్ని అనుసరించి ఊహించడం సబబేమో”
ఇది కాస్త ప్రమాదకరమైన ఆలోచన. ఒకటి - పురుషుల నిస్సహాయత స్త్రీలు ఆనందిస్తారని సాధారణీకరించి సూత్రీకరించడం చాలా తప్పు. అలా సూత్రీకరించడం “మగ”తనానికి సంతృప్తినిస్తుందేమో! రెండు - అలా సూత్రీకరించినా, అది పాట మొత్తానికి అన్వయం కావాలి కదా. మీరన్న ఆ స్త్రీలు తాము పరపురుషుడిని చూసి భయపడినట్టుగాను, తన భర్త కాళ్ళ మీద పడ్డట్టుగాను ఊహించుకోడానికి ఇష్టపడతారా? మూడు - ఇక్కడ వ్యాసంలో, పాటని బట్టి పాతకాలపు స్త్రీల స్థితిగతులని మనస్తత్వాన్నీ ఊహించే్ ప్రయత్నం జరుగుతోందా, స్త్రీ మనస్తత్వాన్ని బట్టి పాటని అర్థం చేసుకొనే ప్రయత్నం జరుగుతోందా?
HaTaHaTa అభిప్రాయం:
January 10, 2012 12:35 pm
తహతహ గారు ఇలా అన్నారు:
ఇది వెల్చేరుగారు రాసిన ఈ వాక్యాల గురించి:
తహతహ గారు: “మనం”, “మనకు తెలుసు”, “మనకేమీ చెప్పలేదు” అనడం ఒక రకమైన రచనాశైలి (writing style). కథను స్థూలంగా చెబుతూ, పాఠకుకుని ఆసక్తి తగ్గిపోకుండా ఉండడానికి “We”, “We know that”, “We will find out” అని వాడడం ఇంగ్లీషులో రాసే చాలామంది పండితులు ఉపయోగించే టెక్నిక్.
ఇక్కడ “మనకి తెలుసు” అన్నది రాముడు, సీత, లక్ష్మణుడు మాత్రమే అడవికి వెళ్ళారని రామాయణం గురించి ఏ మాత్రం తెలిసిన పాఠకునికైనా అర్థమయ్యే విషయమని చెప్పడం. ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తాననడం వాల్మీకి రామాయణంలో లేదు. తెలుగువాళ్ళు అల్లిన కథలో “ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది” అని చదవగానే రామాయణం తెలిసిన పాఠకుడు “కానీ లక్ష్మణుడు ఒప్పుకోడు” అని ఊహిస్తాడు. పాఠకుడు ఊహిస్తున్న విషయాన్ని రచయిత బలపరచడం ద్వారా రచన పాఠకునికి చేరువౌతుంది. ఇది నాకర్థమైన విషయం.
Krishna Rao Maddipati అభిప్రాయం:
January 10, 2012 11:35 pm
రమ గారు,
ఎంత మాట! నాకేదో తెలుసునని అపోహ కలిగించినట్టున్నాను, క్షమించాలి.
మీ పరిశోధనా వ్యాసాలు (peer-reviewed articles) ఎక్కడైనా ప్రచురించారా? వివరాలు తెలియజేస్తే చదవాలనుంది.
కృష్ణారావు
TahaTaha అభిప్రాయం:
January 11, 2012 3:45 am
హత హత గారూ మిగతా విషయాలు కాస్త పక్కన బెట్టి ఇప్పుడు మీరు రాసిన చివరి వాక్యం ఒకసారి చూద్దాం:
“పాఠకుడు ఊహిస్తున్న విషయాన్ని రచయిత బలపరచడం ద్వారా రచన పాఠకునికి చేరువౌతుంది”
పాఠకుడు రకరకాలుగా ఊహించుకొనే ఆవకాశం ఉంటుందా ఉండదా అప్పుడు ఎట్టి ఊహని రచయిత బలపరుస్తాడు? తన తలకాయలో ఉన్న ఊహనేనా, మరొకదాన్నా? కొచెం ఆలోచించండి. ‘మనకి తెలుసు’ అనే బదులు ‘మనం ఊహించుకోవచ్చు’ అంటే రచయిత కొంచం నిజాయితీ గా ఉన్నట్టు తెలుస్తుందా లేదా చెప్పండి. తః తః,శాస్త్ర జ్ణులు ఎప్పుడు “we know” అంటారో కాస్త తెలిసిన మనిషే . ఇక ‘టెక్నిక్’ అంటారా ఒప్పుకుంటాను.
రవి అభిప్రాయం:
January 11, 2012 5:39 am
కామేశ్వరరావు గారు,
ఊర్మిళ ప్రస్తావించిన వరుస ఇది - జనకుడు, సీత, రాముడు, లక్ష్మణుడు. వెంటనే లక్ష్మణుడి చెప్పిన సమాధానంలో వరుస ఇది - రాముడు, జనకుడు, సీత, సీత. సాధారణంగా ఒకవరుసలో ప్రస్తావించిన ప్రశ్నలకు వెంటనే అదే వరుసలో సమాధానం ఇవ్వడం లోకవ్యవహారం. మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు అంటే, మా అమ్మా నాన్న బావున్నారనడం సహజం. ఇక్కడ అది లేదు.
సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ]
సృష్టిలో నేను యెరుగ
పైన పంక్తులు కూడా లక్ష్మణుడు ఊర్మిళ భావానికనుగుణంగా చెప్పాడంటే సరిగ్గా పొసగట్లేదు.
ఇక “మనసుకు నచ్చిన ఊహలు” దీనికి సమాధానం పై పంక్తులు. అసూయ స్త్రీ సహజలక్షణం. సీత ఎవ్వరు అని అంటే ఆమె యెవరో నాకు తెలియదని అసూయచేత విసురుగా ఊర్మిళ చెప్పిందనడంలో అనౌచిత్యమేమున్నది?
2. >>ఇది కాస్త ప్రమాదకరమైన ఆలోచన. ఒకటి - పురుషుల నిస్సహాయత >>స్త్రీలు ఆనందిస్తారని సాధారణీకరించి సూత్రీకరించడం చాలా తప్పు.
ఇందులో ప్రమాదకరమూ, అసహజమేముంది? కొంతమంది స్త్రీలు ప్రత్యేకంగా గుమిగూడి (తమదైనలోకంలో మగవాళ్ళు రాని పెరట్లో) తమతమ సంసారం తాలూకు అచ్చట్లు, ముచ్చట్లు చెప్పుకునేప్పుడు (వాళ్ళు ఈ కాలం నాటి హైటెక్ స్త్రీలు కూడా కాదు) తమ మనసులో అణగారిన భావనలను ఉద్యోతిస్తూ చెప్పుకోవడం కద్దు.
అబ్బే, అలా స్త్రీలు ఉండరు, స్త్రీలెప్పుడు భర్తలను ప్రాణప్రదంగా ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఉంటారనుకోవడమే “మేల్ ఇగో” అని నేననుకుంటున్నాను. :)
>>పాటని బట్టి పాతకాలపు స్త్రీల స్థితిగతులని మనస్తత్వాన్నీ ఊహించే్ >>ప్రయత్నం జరుగుతోందా, స్త్రీ మనస్తత్వాన్ని బట్టి పాటని అర్థం చేసుకొనే >>ప్రయత్నం జరుగుతోందా?
రెండవది అవడంలో ఇబ్బందేముందండి? మీరు సూచించిన విశ్వనాథ మారీచుని ఉదాహరణ ఇందుకు ఉపయోగపడుతుంది. లక్ష్మణాగ్రజా అని ఒక రాక్షసుడు చస్తూ అరిచాడంటే సందర్భాన్ని బట్టి సాధారణ లౌకికార్థంలో అది అనౌచిత్యం. (ప్రాణబాధలో ఉన్నప్పుడు ఎదుటివాని పేరుతో కాక, లక్ష్మణాగ్రజా అని అనడం, అలా అనడం ద్వారా రావణున్ని మోసపుచ్చాలనుకోవడం తదితరాలు అనౌచిత్యకారణాలు) దాని ఔచిత్యం తెలియాలంటే మారీచుని స్వభావం, రామభక్తి తెలియాలి. అంటే అతని మనస్తత్వాన్ని బట్టి రచననుఅర్థం చేసుకోవాలి.
ఇక్కడా అలాంటిదే. స్త్రీ మనస్తత్వాన్ని బట్టి పాట అర్థం చేసుకోవాలి అనడంలో అసంగతం ఏమిటి?
కామేశ్వరరావు అభిప్రాయం:
January 11, 2012 12:46 pm
రవి,
ఇక్కడ ఊర్మిళ ప్రశ్నలడగలేదే! లక్ష్మణుడిని భయపెడుతూ వాళ్ళ పేర్లు ప్రస్తావించింది. మళ్ళీ అదే వరసలో వారిని ప్రస్తావించడమే సహజం అనడం నా ఉద్దేశంలో సమంజసం కాదు.
దీనికి చాలా పాఠాంతరాలున్నాయి. ఈ “చెప్పుడీ” అన్న పదం మలయవాసినిగారు పాడిన పాటలో కాని, అక్కడిచ్చిన పాట సాహిత్యంలో కాని, ఇల్లిందిల సరస్వతీదేవిగారి పాఠంలో కాని లేదని గమనించండి. సందర్భం వచ్చింది కాబట్టి మరొక విషయం. “అలనాటి పాట ఊర్మిళాదేవి నిద్ర”లో శ్రీమతి సుబ్బులు పాడిన పాటలో కూడా అక్కడ మాట్లాడేది ఒక్క లక్ష్మణుడే అన్నది స్పష్టంగా ఉంది.
స్త్రీలెప్పుడూ అలా ఉంటారని నేనెక్కడా అనలేదండి. మళ్ళీ నా వ్యాఖ్య ఒకసారి చదవండి. మీరలా స్త్రీలందరి గురించి సాధారణీకరించడం, దాని ఆధారంగా పాటని అన్వయించుకోడం సమంజసం కాదని మాత్రమే నేనన్నాను.
రెండూ కలిపి చెయ్యడంలో ఇబ్బంది ఉంది. అది circular inference అవుతుంది కాబట్టి. వ్యాసంలో చేసిన ప్రయత్నం మొదటిది కాబట్టి, దానితో రెండవది కలపడం సరికాదని నా ఉద్దేశం. అసలు రెండవ దానిలో విడిగా కూడా ఉన్న ఇబ్బంది “స్త్రీ మనస్తత్వము” అనే సాధారణీకరణ. మీరిచ్చిన విశ్వనాథ ఉదాహరణలో మారీచుడు ఒక పాత్ర. ఆ పాత్ర కల్పవృక్షంలో మనకి స్పష్టంగా గోచరిస్తుంది. ఆ పాత్ర చిత్రణకి అనుగుణంగా అక్కడ మారీచుని ప్రవర్తనని అర్థం చేసుకోడంలో ఇబ్బంది లేదు. కాని యిక్కడ మీరు చెపుతున్నది “స్త్రీ మనస్తత్వము” అనే ఒక బ్రహ్మపదార్థం (I mean an abstract thing) గురించిన సాధారణీకరణ! అదీ ఇబ్బంది.
ఇంతకు మించి యీ విషయంలో నేను చెప్పగలిగేదేదీ లేదు. చెప్పబూనితే, తెగే దాకా లాగడమే అవుతుంది. కాబట్టి యీ విషయంపై యిది నా చివరి వ్యాఖ్య.
rama bharadwaj అభిప్రాయం:
January 11, 2012 2:12 pm
కృష్ణారావు గారూ!! మీ అందరి ఉత్సాహమూ చూసి నేను సైతమ్ నాకు తెలిసిన సంగతులను ఈ స్థలంలో ప్రస్తావిస్తున్నాను. గానీ అంతకన్నా మెండుగా నాకేమీ తెలియదండీ! నేను ప్రచురిస్తే వెంటనే సదరు విషయాలని ముందుగా మీకే తెలియజేయగలదానను. అంతదాకా మీరు కాస్త ఓపిక పట్టాలి. అయినా ఈమాటలో వ్యాఖ్యలు రాయడానికే శక్తి సరిపోవడం లేదు. ఇంతకన్నా ప్రస్తుతానికి ఘనమైన వేమీ రాయలేను కూడాను. పైగా నాకేదో “చరిత్రకారిణినీ” జానపదవేత్తని, సాహితీ విమర్శకురాలినీ , అనువాదకురాలినీ అనే బహుముఖ ప్రజ్ఞా పాటవాలమీద అటువంటి ప్రదర్శనమీదా నమ్మకమూ లెదు. నాకంత తెలివితేటలూ లేవు. ఏదో మీలాంటి సహృదయులు చదువుతున్నారు కదా అని రాయడం తప్పిస్తే .. నాకు దేనిమీదనైనా రాసే “అర్హత” సైతం లెదు. నా అభిప్రాయాల వల్ల పెద్దగా ఒరిగేది కూడా ఏమీ లేదు గనక బుధజనులు మరీ కోరిన ఎడల నేను ఈ రాసే వ్యాఖ్యలు సైతం మానివేయుటకు నాకు ఎటువంటి అభ్యంతరమున్నూ లేదు కూడాను. అందరి నిశ్చింతే నా నిశ్చింత కూడానూ !!
కురుక్షేత్రమైతే కృష్ణుణ్నడుగు పానిపట్టైతే పీష్వాలనడుగు ..బుస్సీనడుగు వారినడుగు వీరినడుగు ఆ బ్రహ్మదేవుడినడుగు అని అన్నట్టు ఏదో నా చిన్నప్పుడెప్పుడో కొంచెం కొంచెం ..ఆ యూనివర్సిటీల్లోనీ ఈ యూనివర్సిటీల్లోని వాళ్ళు చెప్పినవీ వీళ్ళు చెప్పినవీ వినిప్పుక్కిటపట్టిన నాలుగు ముక్కలు తప్పితే నేనిప్పుడు అలెన్ డండిస్ నో.. స్టూవర్ట్ బ్లాక్బుర్న్ నో బ్రెండాబెక్ నో ..పీటర్ క్లాస్ నో ఇంకా ఇత్యాదులని ఫుట్ నోట్లలో ఎక్కడ ప్రస్తావించగలననీ గానీ, మీ కుతూహలాన్ని తీర్చేపని మటుకు చెప్పుకోదగినది ఏదీ నేను చెయ్యలేదు. చెయ్యను కూడాను. “హీరోవర్షిప్” లలో తెలుగువారు ఏ దేశంలో ఉన్ననూ వీరులే -అన్న నమ్మకం నాలో నిలిపిన మీకు వందనాలతో..
సెలవుకోరుతూ..
రమ.
lyla yerneni అభిప్రాయం:
January 11, 2012 3:44 pm
పాడండి. ఆకస్మిక ప్రసారం చెయ్యటం ఈ పత్రికకు సాధ్యమే అని తెలిసింది. కృష్ణారావ్! మీపాట ఎందుకు మమ్మల్ని విననీయరు. కవిత్వాలు వ్యాసాలు రాసుకుంటే, రాయటం వస్తుందేమో కాని సంగీతం రాదు. సంగీతం వింటే వస్తుంది. పాడితే వస్తుంది. అని రోహిణీ ప్రసాద్ చెప్పింది చాలా నిజమే.
మీరు పాడండి. నాకు వినాలని ఉంది.
కొత్త సంవత్సరం సందర్భంగా ఎక్కడో భారతంలో ఒక చలి ప్రాంతం నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆమె వైణికురాలు. ఏమి వాయిస్తున్నాదీ ఇప్పుడు అని నేను అడిగి తెలుసుకుంటుంటే, పినాక పాణి పుస్తకం నుంచి కొన్ని కీర్తనలు నేర్చుకుంటున్నా, నువ్వు రా, నేను వినిపిస్తానంది.
ఇప్పుడు ఫోన్లో వినిపించమన్నాను. అప్పుడు నాకు అర్థరాత్రి.
నీకు నిద్ర పోయే సమయం. ఇప్పుడు కాదు -అంది ఆమె.
లేదు నే వింటానన్నా.
ఆమెకు హఠాత్తుగా గుర్తు వచ్చింది. నా వీణకు ఒక తీగ తెగిపోయి ఉంది. మార్చాలి.-అంది
ఎంత సేపు పడుతుంది. తీగ మార్చటానికి? -నా ప్రశ్న
ఒక అరగంట ఇవ్వు. తీగ మార్చి కొంచెం సాధకం చేసుకుని వినిపిస్తా నంది.
నేను మళ్ళీ ఫోన్ చేసే లోపలే, తనే ఫోన్ చేసి,
“వందే వాసుదేవం, శ్రీ హరిం
వందే వాసుదేవం
బృందారకాధీక వందిత పదాబ్జం
వందే వాసుదేవం
ఇందీవరశ్యామ మిందిరా కుచకటీ
చందనాంకిత లసచ్చారు దేహమ్
మందార మాలికా మకుట సంశోభితం
కందర్ప జనక మరవింద నాభమ్…”
వీణతో, తన కంఠస్వరం కలిపి పాడితే, నే విని ఈమె నాకు తెలిసిన వ్యక్తేనా అని ఆశ్చర్య పోయాను. నిజంగా చెప్పాలంటే ఆమె నాకు తెలియదు. పదిహేను ఇరవయ్యి సంవత్సరాల పైగా సాధన చేసి వైణికురాలైన ఆమె నాకేం తెలుసు? ఏదో దగ్గిర చుట్టంగా ఆ చనువుతో తెలుసు. ఆమె ఇంకా ఏమేమిటో? నిజంగా నాకేం తెలుసు?
ఆమెకు తన వీణ నేను వినాలనీ, తను వేసిన బొమ్మలు నేను చూడాలనీ ఎంతో ఉబలాటం. ప్రకృతి అందమైన దృశ్యాలు తనతో పాటు నేను చూడాలని ఆమె ఆశ. వీణ వాయించుకోటం ఆమె నిత్యకృత్యం. ఆమెకు గుర్తింపు అంటే ఏమిటో తెలియదు. పద్మశ్రీల సెరిమొనీలు ఆమెకు పట్టవు.
మా సంభాషణలో, -అన్నమయ్య కీర్తనలలో మాటలు నాకు అన్నీ అర్థం కావు- అని తను అన్నప్పుడు, జయప్రభ రాసిన రెండు పుస్తకాలను నువ్వు తెప్పించుకుని చదువుకోవాలని తనకి చెప్పాను. తప్పకుండా చదవాలి. అప్పుడు నువ్వు ఇంకా బాగా వాయిస్తావు. నీ ఆనందం ఇంకా ఎక్కువవుతుంది, అని నేను చెప్పాను.
కృష్ణారావ్! మీ పాట “ఈమాట” లో ప్రసారం కోసం నేను ఎదురు చూస్తాను.
లైలా
రవి అభిప్రాయం:
January 12, 2012 1:46 am
నాది కూడా చివరాఖరు మాట.
ఈ వ్యాసం లో నారాయణరావు గారు, సుప్తచేతన, అవ్యక్తభావాల గురించి ప్రస్తావించినప్పుడు నాకు ఈ పాటలలో వాటి వెనుకనున్న స్త్రీ స్వభావం సహజంగానే కనిపించింది.
“లీలాపత్రాణి గణయామాస” అని ఒక కాళిదాసు అన్నప్పుడు స్త్రీ సిగ్గుపడుతుందనిఅది స్త్రీ సహజ లక్షణమని చెప్పనక్కరలేదు. ఊర్మిళకు సీతపైన, రాముడిపైన అసూయ కోపం ఉన్నై, పాటల్లో అవి ఉద్యోతించబడినాయి అంటే ఆ పాటల వెనుకనున్న స్త్రీ స్వభావం సహజంగానే నాకు కనిపించింది.ఒక ప్రత్యేకమైన విషయాన్ని అన్నిటికి అన్వయిస్తే అది సాధారణీకరణ అవుతుందే తప్ప, సహజంగా అర్థమవుతున్నదాన్ని పాటకు నేపథ్యంగా భావించడం సాధారణీకరణ లేదా సూత్రీకరించటం అని నేను భావించట్లేదు.
స్త్రీ మనస్తత్వం బ్రహ్మపదార్థమో మరొకటో కావచ్చు, కానీ ఈ వ్యాసానికి సంబంధించి అది ప్రధానమైన సబ్జెక్ట్ కాదు. ఆమె పాటల వెనుక, పాటలలో కనిపించే ఆక్రోశం,వెనుక ఉన్న అంతర్యం తెలుసుకోవడానికి ఉపయోగపడే సహజమైన ఉపకరణం.
ఏమైనా, ఈ వాదన ఇలా కొనసాగుతునే ఉంటుంది, ఎందుకంటే ఇందులో అర్థం చేసుకునే విధానం కూడా కొంతవరకు ఉంది కాబట్టి. అందువలన నా తరపున స్వస్తి.