ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన

ఒకడాలి కోరిగాదా ఇంద్రునికి ఒడలెల్ల హీనమాయే
పరసతిని కోరి గాదా రావణుడు మూలముతొ హతమాయెనూ

ఇంద్రుడికి అహల్యాజారత్వంలో వచ్చిన శాపం ఊర్మిళకి తెలుసునంటే మనకి అర్థమౌతుంది. కాని రావణాసురుడు సీతని ఎత్తుకుపోవడం వల్ల రాముడి చేతిలో మరణించడం ఆవిడకి ఎలా తెలిసిందా అని మనం తప్పు పట్టక్కర్లేదు. ఈ కథ పాట పాడే ఆడవాళ్ళకి తెలుసు. ఇక్కడ కావలిసినదల్లా తన గదిలోకి వచ్చిన ఆ ఆగంతకుడికి తెలివి తెచ్చుకోమని చెప్పడానికి అవసరమైన మాటలు. పూర్వాపరాల్నీ, కాలక్రమాన్నీ అతిక్రమించిన నిర్మాణదక్షత కవయిత్రిది. ఆ వరసలోనే

ఆడతోడా బుట్టరా మావంటి తల్లి లేదా మీకును

అని, నీ తల్లీ, నీ చెల్లెలూ కూడా నీలాంటివాళ్ళ చేతిలో హింసకి గురయ్యే ప్రమాదం ఉంది సుమా! అని ఆ అగంతకుడికి జ్ఞాపకం చేస్తుంది.

ఊర్మిళ ఇంకా నిద్రపోతోంది కదా, ఈ మాటలు ఎలా అనగలుగుతోందని ప్రశ్నించకండి. తాను స్త్రీగా పుట్టడం మూలంగా వచ్చిన ఆధిభౌతికబలహీనతని నిద్రలో కూడా మరిచిపోవడానికి వీలులేని కుటుంబంలో ఉంది ఆమె. మేలుకొని ఉండగా మళ్ళా మళ్ళా మననం చేసుకున్న ఈ మాటలు ఆవిడ అంతరాంతరాలలో గాఢంగా గూడు కట్టుకుని ఉన్నాయి. నిద్రలో కూడా ఆమాటలే పైకి వస్తాయి. అందుకనే నిద్రపోతున్న ఊర్మిళ చేత కూడా కవయిత్రి ఈ మాటలు కంఠతా పట్టిన మాటల్లా చెప్పిస్తుంది.

లక్ష్మణుడు తాను ఆమె భర్తనని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆమాట తిన్నగా చెప్పలేడు. తాను పెరిగిన కుటుంబ మర్యాదలు ఆమాట భార్యకి తిన్నగా చెప్పనియ్యవు. అందుచేత డొంకతిరుగుడుగా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. తను రాముడికి తమ్ముణ్ణనీ, సీతకి మరిదిననీ, జనకుడికి అల్లుణ్ణనీ, వగైరా, వగైరా. ఇప్పుడు ఇక పాటలో ఊర్మిళ అంతశ్చేతనలోని మరొక పొర వ్యక్తమౌతుంది. లక్ష్మణుడు అనే మాటలకి ప్రతిగా ఆమె అనే మాటలు వింటే మనకి ఒక్కసారిగా బుర్ర తిరిగిపోతుంది.

శ్రీరాము తమ్ముండనే అతడనగ సృష్టిలో నొకరు గలరా?
జనకునల్లుని గానటే? భూమిలో జనకులనగా నెవ్వరు?
శతపత్రమున బుట్టినా చేడెరో సీతకూ మరిదిగానా?
సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ] సృష్టిలో నేను యెరుగ

లక్ష్మణుడి మాటలూ, వాటికి ప్రతిగా ఊర్మిళ చెప్పిన ఎదురు మాటలూ, ఒకదాని తరవాత ఒకటి – మధ్యలో కవయిత్రి చెప్పే ‘అని అనెను, అని చెప్పెను’ లాటి ఆఖ్యాన పదాలు లేకుండా ఒకదానిని ఒకటి తరుముకుని వొస్తాయి, మనని ఉక్కిరిబిక్కిరి చేస్తూ, కథ పతాకస్థాయికి చేరుకుందని సూచిస్తూ.

ఎంతో మర్యాద గల కుటుంబంలో చాలా కట్టుబాట్ల మధ్య పుట్టిన శీలవతి యైన స్త్రీ ఇలా బరితెగించి మాట్లాడుతుందా! అందులోనూ జనకుడంటే ఎవడు, రాముడంటే ఎవడు, సీతంటే ఎవతె అని తృణీకారంగా మాట్లాడుతుందా!

ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. ఊర్మిళ కష్టాలకి కారణమైనవాళ్ళు వీళ్ళే. తన కూతుర్ని జాగ్రత్తగా రక్షించగలడో లేదో అనే ఆలోచనైనా లేకుండా ఈ చేతగాని లక్ష్మణుడి చేతిలో పెట్టాడు తనని తన తండ్రి. అధికార స్థానంలో ఉన్న తన బావగారు రాముడు, తన భార్యని తనతో తీసికెళ్తున్న పెద్ద మనిషి, తమ్ముడు బానిసలా తనతో పాటు అడివికి వచ్చేస్తుంటే, అయ్యో నీ భార్య ఏమయి పోతుంది, ఆమెను కూడా నీతో బాటు తీసుకొనిరా – అని అనలేకపోయాడు. సొంత అక్కగారు సీత కూడా తన చెల్లెలేమై పోతుందో అనే ఊహ లేకుండా సగర్వంగా మొగుడితో అడివికి పరిగెత్తింది. ఊర్మిళని ఒక్కత్తెనూ వదిలిపెట్టవద్దని లక్ష్మణుడికీ, రాముడికీ చెప్పగల స్థానంలో ఉన్నది ఆవిడే. ఈ విధంగా కుటుంబంలో తనని కాపాడగల వాళ్ళందరూ తన మానానికి తనని వదిలేశారు. దీన్ని బట్టి చూస్తే ఆ కుటుంబంలో ఊర్మిళ లోపల్లోపల ఎంత కుమిలిపోయి ఉంటుందో మనం ఊహించుకోచచ్చు. ఈ సమిష్టి కుటుంబ రాజకీయాలు ఊర్మిళలో నరనరానా జీర్ణించుకుపోయాయి. వాళ్ళ మీద ఆవిడకి పట్టరాని కోపం, చెప్పరాని కక్షా ఉండడంలో ఆశ్చర్యం లేదు. కాని ఆ కోపమూ, ఆ కక్షా గాఢమైన నిద్రలో కలవరింతగానే పైకొస్తాయి. వొళ్ళు తెలియని నిద్రలో కలవరింత రూపంలోనో, మరేదో దెయ్యంపట్టిన కారణం పేరుతోనో, ఏదో ఒక ముసుగులో తప్ప వాళ్ళ నిజ వ్యక్తిత్వం బయటకి రావడానికి వీల్లేని సమాజంలో వాళ్ళున్నారు. హిస్టీరియా పేరుతో – దాని మాటునే – సమిష్టికుటుంబపు స్త్రీలు తమమీద అధికారం చెలాయించే వారందరినీ నోటికొచ్చినట్టు తిట్టడం మనకి తెలుసు. స్త్రీలలో వుండే అలాంటి కక్షని, అలాంటి కోపాన్ని, ఊర్మిళాదేవి పాత్ర ద్వారా, ఆవిడ నిద్ర ముసుగులో, ఈ పాట రాసిన కవయిత్రి పరమ ప్రతిభావంతంగా చిత్రించింది. తెలుగులో ఇంత సమర్థంగా పరమ క్లిష్టమైన స్త్రీ మానసిక స్థితిని కూర్చి చెప్పిన చోటు మరొకటి లేదు.

లక్ష్మణుడు చేసేదేమీ లేక హఠాత్తుగా ఆవిడకి మెలకువ వచ్చే మాటలు చెప్పడం మొదలు పెడతాడు. నిన్ను ఊర్మిళ అంటారు, కనీసం ఆ మాట కాదనకు అని ప్రాధేయపడతాడు. అడివిలో సీతాదేవిని రావణాసురు డెత్తుకుపోయాడనీ, రాముడూ తనూ యుద్ధంచేసి సీతను రక్షించామనీ చెబుతాడు. ఇలాంటి విపత్కరమైన సంఘటన గురించి హఠాత్తుగా చెప్తే ఆవిడ నిద్ర లేచి మామూలుగా మాట్లాడుతుందని లక్ష్మణుడి అలోచన. కాని ఈ మాటలేవీ ఊర్మిళ మీద పనిచెయ్యవు. అప్పుడు లక్ష్మణుడు దీనంగా, ‘నువ్వు నన్ను వదిలేస్తే నాకు లోకంలో అపకీర్తి వస్తుంది,’ అంటాడు. ఇది ఆ సమాజంలో ఆడవాళ్ళు అనే మాట. మొగుడు వదిలేస్తే పెళ్ళానికి అపకీర్తి వస్తుంది. మగవాడు హాయిగా ఇంకో పెళ్ళి చేసుకుంటాడు. ఈ పాటలో ఆ పరిస్థితికి పూర్తిగా వ్యతిరేకమైన మరో సమాజాన్ని ఈ కవయిత్రి నిర్మిస్తోంది. స్త్రీ వదిలేస్తే పురుషుడికి అపకీర్తి వచ్చే సమాజాన్ని ఇంత స్పష్టంగా కోరుకోగలిగిన స్వేచ్ఛ స్త్రీలకి ఈ పాటలో ఉంది.

లక్ష్మణుడు ఊర్మిళను ఇంకా ప్రాధేయపడతాడు. తాను ఆమె భర్తనని ఇంకా ఆ డొంకతిరుగుడు మాటల్లోనే మళ్ళా మళ్ళా చెబుతాడు. నిద్రలో ఊర్మిళ కోపంగా మాట్లాడిన మాటలు తన కర్థమయ్యాయని, కోపాన్ని తగ్గించుకోమని తాను ప్రార్థిస్తున్నానని చెప్పడానికి ఈ పాటలో ఈ పునరుక్తులు సూక్ష్మ సూచికలు. ఊర్మిళ లేకపోతే తాను బ్రతకలేననీ ఈ పధ్నాలుగేళ్ళూ తనకి నిద్రాహారాలు లేవనీ మొరపెట్టుంటాడు.

నిన్ను బాసినది మొదలూ ప్రాణసఖి నిద్ర హారములెరుగనే
నీవు లేవకయున్ననూ ఓ సఖీ ప్రాణములు నిలుపలేనే

స్త్రీలు తమ భర్తల నించి వినాలని తపించే ప్రియమైన మాటలు ఇవి.

అప్పటికీ ఊర్మిళ కరుణించకపోతే లక్ష్మణుడు చివరికి ఏడుస్తూ తనని తాను చంపుకోడానికి కత్తి తీస్తాడు. ఆ చప్పుడుకి ఊర్మిళ హఠాత్తుగా నిద్ర లేస్తుంది. లేచి భర్త కాళ్ళ మీద పడుతుంది. ఆత్మహత్య వీరపురుష లక్షణం కాదు. కాని, ఈ కథలో లక్ష్మణుడు వీరపురుషుడు కాడు.

పాటలో నిద్ర మత్తులో ఉన్న ఊర్మిళ వేరు, నిద్ర మేల్కొన్న ఊర్మిళ వేరు. నిద్ర మేల్కొన్న ఊర్మిళ భార్య లాగ ప్రవర్తించాలి. అయినా ఆ ఊర్మిళ కూడా ఒక పక్క తను భర్త మీద చూపించవలసిన గౌరవాన్ని చూపిస్తూనే తన కోపాన్ని వ్యక్తపరుస్తుంది. ఇప్పుడు చుట్టుపక్కల మూడోవారు ఎవ్వరూ లేరని, తన పడకగదిలో భర్తతో మాట్లాడుతోందని ఒక్కసారి గమనించండి. ఈ సందర్భంలో సమిష్టికుటుంబం లోని స్త్రీలకు కూడా తమ భర్తలతో మాట్లాడటంలో కొంత స్వేచ్ఛ ఉందని మనకు తెలుసు.

మా తండ్రి జనకరాజూ మిమునమ్మి మరచి కళ్యాణమిచ్చే
మానవంతల్లుడనుచూ తెలియకా మదిని ఉప్పొంగుచుండే
చిత్తమొకదిక్కునుంచీ సమయమున చిన్నబుత్తురు యింతులా

“మా తండ్రి జనకుడు తెలియక, మీరు చాలా పౌరుషం గలవారని నమ్మి మీకు నన్నిచ్చి పెళ్ళిచేశాడు. మీరేమో ఇంకొకళ్ళ మీద మనస్సు పెట్టి, నన్ను నలుగురిలో చిన్నబుచ్చారు,” అని ఇప్పుడు ఊర్మిళ స్పష్టంగా తన భావాన్ని చెప్తుంది. ఈ ఆరోపణలన్నీ లక్ష్మణుడు తలవంచుకుని వింటాడు. లోపల బాధపడతాడు. మళ్ళా తనకి ఊర్మిళంటే ఎంత ప్రేమో ఆమె నిద్రపోతున్నప్పుడన్న మాటలే మరోసారి అంటాడు. మొత్తం అంతటినీ కర్మ పేర తోసేస్తూ తాము ఎప్పుడో పూర్వజన్మలో చేసిన పనికి ఇప్పుడు ఫలితం అనుభవించామంటాడు.

కథ ఇప్పుడు పెరటి వాకిలి లోంచి మధ్యగదుల్లోకి వస్తుంది. పొరపొచ్చాల్లేకుండా ఒకరితో ఒకరు పరిహాసోక్తులు చెప్పుకుంటూ ఉండే సమిష్టి కుటుంబం ఇక తరువాతి కథ లోది. మొట్ట మొదటి సారిగా ఊర్మిళ ఆ కుటుంబానికి కేంద్రమౌతుంది. కౌసల్య ఊర్మిళకీ, లక్ష్మణుడికీ తలంటి, జలకాలాడించి, కొత్త బట్టలు కట్టి షడ్రుచులతో రాజయోగ్యమైన భోజనం వడ్డిస్తుంది. ఒకళ్ళ మీద ఒకరు చెణుకులు విసురుకుంటారు. ఈ మాట్లాటలో సీతా, శృతకీర్తీ, మాండవీ (శృతకీర్తి, మాండవుల పేర్లు ఈ పాటలో లేవు. కానీ ఉన్నాయని మనం ఊహించుకోవచ్చు) ఒక పక్షమైతే శాంత ఇంకొక పక్షమౌతుంది.

రామాయణంలో శాంత చాలా అప్రధానమైన స్త్రీ పాత్రలలో ఒకటి. అయినా తెలుగు స్త్రీల పాటల్లో ఆవిడకి చాలా ప్రాధాన్యత ఉంది. రాముడికి అక్కగారుగా, సీతకీ ఊర్మిళకీ (మాండవికీ, శృతకీర్తికీ) ఆడపడుచుగా చాలా పెద్దరికం ఉంది ఆవిడకి. అవసరమైతే ఆవిడ రాముణ్ణి కూడా శాసించగలదు. ఈ పాటలో విషయం కాదు గానీ, స్త్రీల రామాయణపు పాటల్లోదే ఇంకొక సంగతి ఇక్కడ క్లుప్తంగా చెప్పాలి. గర్భవతి యైన సీతాదేవిని అడవులకి పంపించేసిన తరవాత, రాజగౌరవం కోసం అశ్వమేధయాగం తలపెట్టిన రాముడికి తనతో పాటు పీటల మీద కూర్చోడానికి భార్య కావలిసి వస్తుంది. మరొక భార్యని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోని రాముడు బంగారపు సీతను తయారు చేయించి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఆ బంగారపు సీతకి శాస్త్రోక్తంగా తన అక్క గారైన శాంతాదేవి తలంటు పొయ్యాలి. ఆ సీతకి తలంటు పోయమని రాముడు శాంత నడగ్గా, శాంత రాముడికి ‘నన్నడిగి నీ పెళ్ళాన్ని అడవులకి పంపించావా? ఈ బంగారు బొమ్మకి నేనెందుకు తలంటు పొయ్యాలి? పొయ్య’నని తీక్షణంగా జవాబు చెబుతుంది. తమకి పురుష శాస్త్రాలే ఇచ్చిన గౌరవాన్ని స్త్రీ మర్యాదని కాపాడడానికి, కుటుంబాలలో మొగాళ్ళ మాటున బతికే అబలలైన స్త్రీలు అవసరం వొచ్చినప్పుడు బలంగా ఉపయోగించుకోగలరని ఈ పాటల కవయిత్రులు ఊహించడం వాళ్ళ భావనా దక్షతకి నిదర్శనం.

తెలుగు సమిష్టికుటుంబాలలో ఆడబడుచుకి చాలా అధికారం ఉంది, ముఖ్యంగా కొత్తకోడలి మీద. కొత్తగా కాపరానికొచ్చిన కోడలికి భర్తతో ఏర్పడుతూ ఉన్న చనువుని పెంచడమో తుంచడమో చేయగల శక్తి ఉంది ఆడబడుచుకి. అంచేత కొత్తకోడలెప్పుడూ ఆడబడుచు పట్ల భయంగా, విధేయంగా, జాగ్రత్తగా ఉండాలి. తన మొగుడితో సమాన వయస్కురాలు కాబట్టి, తనకన్నా మరీ ఏమంత పెద్దది కూడా కాదు కాబట్టి, అత్తగారికన్నా ఆడబడుచు కొత్తకోడల్ని వేయి కళ్ళతో కనిపెడుతూ ఉంటుంది. ఎప్పుడు పోయి ఏ పుల్లవిరుపు మాట తన మొగుడితో అన్నా తన కాపురంలో చిక్కులొచ్చాయన్న మాటే. ఆడబడుచు అర్థ మొగుడని తెలుగులో సామెత ఉంది. కాని, ఈ పాటలో చూడండి, శాంతని ఎంత సున్నితమైనదానిగా, ఎంత ప్రేమ గలదానిగా చూపించిందో కవయిత్రి. ఆడవాళ్ళకి అలాంటి ఆడబడుచులు కావాలి. ఆ కోరిక ఈ పాటలో సున్నితంగా వ్యక్తమౌతుంది. మాటవరసకి, ఇంటి కోడళ్ళూ, ఆడబడుచులూ రెండు పక్షాలుగా విడిపోయినా, ఎంత పరాచికాలాడుకున్నా, చివరికి శాంత సీతని మెచ్చుకోవడంతోటే ఈ పరాచికాలు ముగుస్తాయి.