ఈమాట » కాల్వీనో కథలనుంచి - 1

Expand to right
Expand to left

కాల్వీనో కథలనుంచి - 1

తల తిప్పి చుట్టూ చూశాను. మళ్ళీ అన్నీ వేటి స్థానంలో అవి సహజంగానే కనపడుతున్నాయి. ట్రాఫిక్ లైట్లు, యూనిఫాములు, బిచ్చగాళ్ళు, సిటీబస్సులు, కూడలిలో విగ్రహాలు, చుట్టూ మనుషులు, చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ సంచులు - అన్నీ ఈ ప్రపంచంలో ఏవి వుండాల్సిన చోట్లో అవి సహజంగా, తమ చుట్టూ వున్న మిగతా వాటితో ఒక అవినాభావ సంబంధంతో సరిగ్గానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. దారి తప్పిన వాడికొచ్చే అయోమయంతో నేనక్కడే నిలబడిపోయాను, ఉలుకూ పలుకూ లేకుండా. చుట్టూ ఉన్న ప్రపంచం మళ్ళీ మామూలుగా అర్థవంతంగా కనిపించడం నాకేమీ ఊరట నివ్వలేదు సరిగదా, నా మనసులో ఏదో అలజడి మొదలైంది.

“నన్ను క్షమించండి.” అన్నాను వాళ్ళను సమాధానపరుస్తూ. “బహుశా సవ్యంగా లేనిది నేనేనేమో. తప్పు నాలోనే ఉందేమో. ఎందుకో ఒక్క క్షణం నాకలా అనిపించింది. ఇప్పుడంతా మళ్ళీ మామూలు గానే, బాగానే ఉంది. దయచేసి నన్ను క్షమించండి.” అని మెల్లిగా వాళ్ళ మధ్యనుండి తల దించుకొని బయటకొచ్చాను. వాళ్ళంతా ఇంకా నాకేసి కోపంగా చూస్తున్నట్టు నాకు తెలుస్తూనే ఉంది.

కానీ, ఎప్పుడైనా నాకేదైనా అర్థం కానప్పుడు, నాకు మళ్ళీ ఏమీ అర్థం కాకుండా పోయి అర్థరహితంగా ప్రపంచం కనిపిస్తుందనీ, ఆ రోజు కేవలం ఒక లిప్తలో తటిల్లుమని మెరిసి మాయమైపోయిన ఆ ప్రపంచపు జ్ఞానం మళ్ళీ నాలో సాక్షాత్కరిస్తుందనీ, ఒక ఆశ, ఒక నమ్మకం నన్ను ఇప్పటికీ, నిలువెత్తునా కదిలించివేస్తుంటుంది.

(మూలం: The flash, 1943.)

3. ఐకమత్యం

వాళ్ళని గమనించడం కోసమే ఆగాను.

నేను జోబుల్లో చేతులు పెట్టుకుని ఊరికే ఒక దారీ తెన్నూ లేకుండా నడుస్తున్నాను. అర్ధరాత్రి వేళ, నిర్మానుష్యంగా ఉన్న ఆ వీధిలో, ఒక దుకాణం తలుపు దగ్గర నిలబడున్నారు వాళ్ళు. ఒక గునపాన్ని షట్టరు కిందకి నెట్టి ఎత్తడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అదేమో అంగుళం కూడా కదల్లేదు. బాగా గట్టి షట్టరనుకుంటాను. సహాయం చేద్దామని నేనూ దగ్గరికి వెళ్ళి గునపం మీద చెయ్యేశాను. వాళ్ళు పక్కకు జరిగి నాక్కొంచెం చోటిచ్చారు. అందరం కలిసి ఒకేసారి ఎత్తడానికని కొంచెం పెద్దగా ‘ఐస్సా’ అని అన్నాను. వెంటనే పక్కనున్నోడు నా డొక్కలో మోచేత్తో పొడిచాడు. “మతేమైనా పోయిందేట్రా? ఆళ్ళుగానింటే మనపనింతే, ఎర్రెదవా!” అన్నాడు లోగొంతుకతో. తల అడ్డంగా ఊపాను తప్పయిపోయిందనట్టు.

బానే కష్టపడాల్సొచ్చింది ఆ షట్టరు కదలడానికి. అందరికీ చెమటలు పోసినై. చివరికి ఎలాగైతేనేం ఒక మనిషి దూరేంత సందు వచ్చింది. అందరమూ ఒకళ్ళ తరువాత ఒకళ్ళం లోపలికి దూరాం. నా చేతికో గోనె సంచీ ఇచ్చి పట్టుకోమని దాంట్లో దుకాణంలోని సామాన్లు అవీ ఇవీ తెచ్చి పడేయడం మొదలెట్టారు.

“ఉన్నట్టుండి ఆ పోలీస్ నాయాళ్ళు రాకపోతే బావుణ్ణు” మధ్యమధ్యలో వాళ్ళంటున్నారు.

“అవున్నిజంగానే దొంగనాయాళ్ళు.”

“ఉష్. ఏందో అడుగుల్చప్పుడు ఇనిపిస్తుళ్ళా?”

నేను చెవులు రిక్కించాను. “కాదు కాదు. పోలీసోళ్ళు కాదు,” అన్నాన్నేను కొంచెం భయంగా.

“అదాటునొచ్చి మీదపడిపోతారు ఎదవనాయాళ్ళు!”

“పోలీసోడని చూడకుండా లేపేస్తే సరి,నాయాళ్ళని!”

“సర్లేవో, వచ్చేడో పెద్ద మొనగాడు! అయ్యా, ముందరా కడదాకెల్లి ఎవడైనా ఇటేసి ఒస్తన్నాడేమో సూసిరా పో!”

సరేనని తలూపి నేను బైటికొచ్చి వీధి చివరికి నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడో మూసేసిన దుకాణం తలుపునానుకొని చీకట్లో ఇంకొందరున్నారు. నేను వాళ్ళ పక్కకెళ్ళి నిలబడ్డాను.

“అదిగో, ఆ కిరాణా కొట్టు పక్క షాపులోంచే చప్పుళ్ళొస్తున్నాయిరా,” అన్నాడొకడు చిన్నగా. నేను ముందుకొంగి మరీ చూశాను.

“ఛస్! నీయమ్మ! వాళ్ళు చూస్తే? ఏమాత్రం వాసనొచ్చినా లటుక్కున కలుగులో దూరిపోతారు. అసలే మహా కంతిర్నాకొడుకులైతే! ఈసారి కూడా తప్పించుకుంటే మనకు సున్నం బొట్లే,” లోగొంతుకలోనే నన్ను కసురుకున్నాడు. తప్పయిపోయిందన్నట్లు తల అడ్డంగా ఊపాను.

“అరేయ్, మనం విడివిడిగా పోయి షాపు ముందునుంచి, ఎనకమాల్నుంచి చుట్టుముడితే ఆ నాకొడుకుల్ని పట్టేస్కోగలం, అంతమంది ఉన్నట్టు లేరీసారి.” అన్నాడింకొకడు.

మేమందరం రెండు మూడు గుంపులుగా విడిపోయి ముంగాళ్ళ మీద చప్పుడు కాకుండా నడుచుకుంటూ కిరాణా కొట్టు వైపు నడిచాం. మా అందరి కళ్ళూ చీకట్లో మెరుస్తున్నై.

“ఈసారి తప్పించుకోలేరు నాకు తెలుసు,” అన్నాను.

“మరే! రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి పోతారు దొంగెదవలు.”

“టైమొచ్చిందిలే వీళ్ళగ్గూడా.”

“పోరంబోకు నాకొడుకులు గాకపోతే షాపుల్లో ఈ దొంగతనాలేందిరా ఈళ్ళకి?”

“నిజమే, పోరంబోకు నాకొడుకులు, నాకొడుకులనీ.” అన్నాన్నేను కోపంగా.

వాళ్ళు నన్ను ముందెళ్ళి ఓ చూపేసి రమ్మన్నారు. నేను మళ్ళీ షాపులోకి దూరాను.

“ఈపాలికొరే, మావలకి మనం చిక్కవంటే చిక్కం,” అంటున్నాడొకడు నిండిన గోనె సంచీ భుజానేసుకుంటూ.

“ఆ ఎనకమాల కిటికీనుండి సప్పుడ్నేకుండా బైటపడ్తిమంటే, ఆళ్ళ కళ్ళ ముంగట్నుంచే మాయమైపోవడం కాయం,” అన్నాడింకొకడు. అందరం మొహమొహాలు చూసుకున్నాం. అందరి మొఖాల్లోనూ చిర్నవ్వులొచ్చినై, సాధించామన్న తృప్తితో.

“వాళ్ళు కసితో ఉడుక్కొని చస్తారీసారి, నాకు తెలుసు.” అన్నాను. అందరం షాపు వెనకవైపున్న కిటికీలోంచి నిశ్శబ్దంగా పక్కనున్న గల్లీలోకొచ్చి పడ్డాం.

“మాఁవల్ని మళ్ళీ ఎర్నాకొడుకుల్ని చేసేం గదరా!” అంటున్నాడొకడు. ఇంతలోనే “ఎవర్రా అక్కడ!” అనొక అరుపూ, దాంతోటే కొన్ని టార్చ్ లైట్లు మావైపుగా వెలిగినై. మేమంతా చటుక్కున పాత డబ్బాలెనకాల నక్కి కూర్చున్నాం ఒకళ్ళ చేతులొకళ్ళు పట్టుకుని. అందరి చేతులూ చెమటతో తడిసి చల్లగా అయినై.

ఓ ముగ్గురు నలుగురు ఆ గల్లీలోకొచ్చి టార్చ్ లైట్లు అటూ ఇటూ తిప్పి చూసి మమ్మల్ని గమనించకుండానే తిరిగెళ్ళిపోయారు. మేం వెంటనే బైటకు దూకి బలమంతా పిక్కల్లోకి తెచ్చుకొని ఆక్కుండా పరిగెత్తాం. నేనొకట్రెండు సార్లు తట్టుకొని పడబోవటంతో కాస్త నిదానంగా పరుగెత్తుతూ వెనకపడ్డాను. కాసేపటికే వెనకాలనుంచి పరిగెత్తుకొస్తున్న వాళ్ళతో కలిశాను.

“కమాన్, పరిగెత్తండ్రా, పరిగెత్తండి, ఈసారి ఆ నాకొడుకుల్ని ఒదలకూడదు. ఇక్కడే ఎక్కడో ఉంటారాళ్ళు,” అనుకుంటూ ముందు వాళ్ళెంబడి పడ్డారు.

“రేయ్, ఈ సందులోంచి అడ్డం కొయ్యండి, ఇదిగో ఇటేపు నుంచి… కమాన్ కమాన్…” అరుచుకుంటూ అందరం పరిగెత్తాం. కాసేపట్లోనే ముందు పరిగెత్తుతున్న వాళ్ళు కనపడ్డారు. “అదిగో, అదిగో, వాళ్ళే! పట్టుకోండి, పట్టుకోండి. చూద్దాం ఎలా తప్పించుకుంటారో.”

నేను మళ్ళీ వేగం పెంచి పరిగెత్తి వాళ్ళల్లో ఒకడిని అందుకున్నాను. “సెబాశ్‌రా తమ్మీ. దొరికిపోయేవేమో అనుకున్నాను. ఆ చెత్తకుప్పెనకాల సందునుంచి ఎలితే ఇక పోలీసోళ్ళకి దొరికే చాన్సే లేదు. పద, పద.” అంటూ నా చేయి పట్టుకొని సందులోంచి పరిగెత్తాడు. ఇద్దరం అలా కాసేపు పరిగెత్తాం. కాసేపైంతర్వాత, మళ్ళీ నేనొక్కణ్ణే మిగిలిపోయాను. సందు చివర మెయిన్ రోడ్ పక్కగా ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చాడు.” పద పద! వాళ్ళనిటుగా రావడం చూశాను. ఎంతో దూరం పోయుండరు.” నేను అతని వెనకే పరిగెత్తాను.

కాసేపటికే నాకు ఆయాసంతో చెమటలు పోసి పరిగెత్తడం మానేశాను. చుట్టూ చూశాను, ఎవరూ కనిపించలేదు. ఏ అరుపులు గానీ, ఎవరూ పరిగెత్తుతున్న చప్పుడు కానీ ఏమీ వినిపించలేదు. నేను జేబుల్లో చేతులు పెట్టుకుని ఊరికే ఒక దారీ తెన్నూ లేకుండా నడవడం మొదలుపెట్టాను.

(మూలం: Solidarity, 1943. Numbers in the dark and other stories, Italo Calvino.)

ముందరి పేజీ(లు) 1 2
 

(3 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. మోహన అభిప్రాయం:

    January 6, 2012 3:31 pm

    చిన్న కథలు బాగున్నాయి, మూడవ కథ బలే బావుంది :-)
    విధేయుడు - మోహన

  2. TahaTaha అభిప్రాయం:

    January 7, 2012 3:19 pm

    మహీధర నళినీ మోహన్ కలంలో మౌల్వీ నజీరుద్దీన్ కధలు చదివినప్పుడు, పింగళి నాగేద్ర రావు మాటలు గుర్తొచ్చినప్పుడు వచ్చే ఒక అద్భుతమూ, అనిర్వచననయమూ అయిన ఆనందం వచ్చింది. మౌల్వీ నజీరుద్దీన్ కధలకూ వీటికీ పోలికలు ఉన్నట్టనిపిస్తున్నది. ఇటాలో కాల్వీనో నాకు ఇంతకు ముందు తెలియదు ఇలా జ్ఞాన- తిక్కని చెప్పే కథలు నాకు చాలా ఇష్టం మాధవ్, వీటిని ఇంత హాయిగా పరిచయం చేసిన మీకు కృతజ్ఞతలు.

    అన్నట్టు మరిచిపోయాను,Ed McBain పోలీసు నవల చదివినప్పుడు వచ్చే ఆనందాన్ని కూడా వీటితో చేర్చాలి.

  3. ఆర్.దమయంతి అభిప్రాయం:

    February 5, 2012 12:51 am

    గుండె గోడల మీద వ్రేలాడే చిత్ర పటాలు ఈ చిన్ని కథలు!
    ****
    అంతులేని శాఖోప శాఖలుగా భూమిన పరచుకున్న పేరు తెలీని ఓ మహా వృక్షం లాంటిది - ఈ సమాజము, ఈ జన సమూహమూ! విభిన్న మానవ మనుగడలను, జీవన వైవిధ్యాలను, విచిత్ర మనస్తత్వ విధానాలను గురించి తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ వుంటాం. ఐతే, ఈ అంశాలని రచయిత - ఏ దృక్కోణం నుంచి పరిశీలించి, పరిశోధించి, చెబుతున్నాడా.. అనేదే రచనలో ఆసక్తిని రేకెత్తించే అసలైన విషయం అవుతుంది. నిజమైన పాఠకుని ఉత్సకత, తపన కూడా ఇదే. సరిగ్గా ఇలాంటి సందర్భాలలోనే ఆ రచయిత సామాజిక శాస్త్రవేత్త గా మారిపోతాడు( మారాలి కూడా). ‘రచయిత కి సామాజిక బాధ్యత వుంటుంది.’ అనే ఒక నైతిక శాసనానికి బహుశా ఇదే పునాది అనుకుంటా!

    ఈ కథలు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక గొంతు వినిపిస్తూ వుంటుంది. పూర్తిగా చదివాక అదొక మనిషిదని గుర్తిస్తాం.

    మనం మనుషులం. సందేహాల చిచ్చులం. లేకపొతే - మనకింత జ్ఞాన, విజ్ఞాన శా స్త్ర భాండాగారాలు లభించి వుండేవి కావు. ఒక్కోసారి డౌటేస్తూ వుంటుంది. వాచీ సరిగ్గానే తిరుగుతోందా, లేదాని! అప్పుడప్పుడు ఓ గొప్ప చిక్కు ప్రశ్నెదురౌతూ వుంటుంది. అసలీ జీవితం నిజమా? అబద్ధమా? అని. నవ్వుతూ మాట్లాడుతున్న మన ఎదుటి వాడి మనసులో ఏముందో తెల్సుకోవాలనే కుతూహలం కలుగుతూ వుంటుంది. కానీ, ఎలా తెలుసుకోడం ఈ నిజాల్నీ? తెల్సుకోవాలనే జిజ్ఞాస, తెలియరాక నిరాశా కలుగుతూ వుంటాయి. ఐతే, మనిషికి ఈ తపనంతా ఎందుకంటే - ఒక నిజం తెలుసుకోడం కోసం. నిర్ధారించుకోడం కోసం. అంతే. అదెలాంటి విషయమైనా సరే మనకి సందిగ్ధాలుండకూడదు. సందేహాలకి శాస్త్రీయ పరమైన నిరూపణ వుండాలని కోరుకుంటాం.

    మనిషి తన నీడని చూసి తాను మొదట భయపడి పోయాడుట. ఆ తర్వాత కొన్ని క్షణాలకి.. ఆలోచనలో పడిపోయాడట. ఏమనంటే - తనకు కనిపించని ఈ నల్ల మనిషి తన వెనక మాత్రమే వస్తున్నాడా లేక అందరి వెంటా వస్తాడా అని. ఆ తక్షణమే తన తోటి వాళ్ళని తన పక్కనే నిలబెట్టుకుని, అందరి నీడల్ని పరిశీలించి ‘నీడ సహజమైన గుణమనీ, అది మనిషినుంచి విడ దీయ లేనిది’ అనీ కనుగొని తేలిక పడ్డాడట.
    బ్ర్హమల్ని తొలగించుకుని, వాస్తవాల్ని నిర్ధారించుకున్నాక, కలిగే స్థిమితం పేరే శాంతి! దీని వల్ల మనకేం తెలుస్తుందంటే - తను కలసి జీవిస్తున్న జాతి వారిలో ఏక గుణ లక్షణాలు, స్వభావాలూ (అవి సహజమైనవైనా సరె, అసహజమైనవైనా సరే ) వుండాలని - మనిషి వాంఛిస్తాడు. ఇప్పటికీ ఈ మనిషి వాంఛ తీరడం లేదు.
    పట్ట పగలే - కాగడాలు పట్టుకు తిరుగుతున్న ఓ ప్రఖ్యాత తత్వవేత్తని ‘నీకిదేం పిచ్చయ్యా?’ అని అడిగితే చెప్పాడట. ‘ఎక్కడైనా మనిషి కనిపిస్తాడేమో వెతుకుతున్నానని. ఆయన మాటల్లో - ఎంత గొప్ప అర్థం ద్యోతకమౌతుందో కదూ!?

    ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మాధవ్ గారి కాల్వినో అనువాద కథలు చదువుతున్నప్పుడు - గుప్ఫున గుర్తొచ్చాయి నాకివన్నీ!

    చిన్న చిన్న కథలెప్పుడూ పెద్ద పెద్ద సత్యాలే చెబుతాయి. ఇవీ అలాంటివే. మనకు అర్థమైనా, కాకున్నా - మన జీవితాలకున్న అర్థాలు కేవలం రెండు. రెండే రెండు. కథ కైనా అంతే. “The ultimate meaning to which all stories refer has two faces: 1. the continuity of life, 2. the inevitability of death.” అని అంటాడు ఈ రచయిత. ఎంత బాగా చెప్పాడూ!, అనిపించింది నాకు - చదవగానే!

    నాకీ కథలు బాగా నచ్చడానికి మరో కారణం. ఇవి అనువాద కథల్లా లేకపోవడం! కథల్లొ పూర్తిగా తెలుగు వాతావరణం నెలకొని వుండటం వల్ల.. మంచి తెలుగు కథలు చదువుతున్నఅనుభూతి కలిగింది. ‘ఇవి అనువాదాలు’ అని చెపితే తప్ప తెలీనంత సహజంగా వున్నాయి. ముఖ్యంగా చదివింపచేసే చక్కని శైలి వల్ల ఆసక్తి కరంగా వున్నాయి. కథలు చదవడమంటే నాకు చాలా ఇష్టం. మంచి కథలు - బాల్యం నాటి జ్ఞాపకాల్లా.. గుండె గోడల మీద ఫ్రేములు కట్టిన చిత్రాలై కూర్చుంటాయి. నిజానికి షార్ట్ స్టోరీస్ రాయడం కష్టం. చదవడం తేలిక. కాని, మర్చిపోవడం మాత్రం అంత సులభం కాదు.

    మాధవ్ గారూ! మీరు పరిచయం చేయడం వల్ల నేనీ రచయిత గురించి మరింతగా చదివి తెలుసుకోగలిగాను. ఈ సందర్భంగా మీకూ, ఈ మాటవారికి నా అభినందనలు తెలియ చేసుకుంటున్నాను. మరిన్ని కాల్వినో రచనలతో బాటు, మరెందరో మంచి రచయితలని మాకు పరిచయం చేయగలరని ఆశిస్తూ…
    శుభాభినందనలతో-
    ఆర్.దమయంతి.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)
Autosuggest?

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a