గోమెజ్ ఎప్పుడొస్తాడో!

ఆదివారం మూడు గంటలకి సుజాత, కేథరీన్‌ హాస్పటల్‌కి వచ్చారు. తిన్నగా గోమెజ్ గదికి వెళ్ళారు. గోమెజ్ గదిలో లేడు. అక్కడ ఉన్న నర్స్ స్టేషన్‌ కెళ్ళి గోమెజ్ గురించి అడిగింది. వాళ్ళు తమకేమీ తెలియదని చెప్పారు. ముందు ఆఫీస్‌ లో అడగమని సలహా ఇచ్చారు. పొద్దున్నే గోమెజ్ గదిలోనుంచి వెళ్ళిపోయాడని చెప్పాడు, పక్కనున్న పేషేంట్. ముందు ఆఫీస్ కెళ్ళి అడిగింది కేథరీన్‌. గోమెజ్ రిలీజ్ చెయ్యకముందే ఎవరికీ చెప్పాచెయ్యకండా పారిపోయాడని చెప్పింది. పోలీస్ రిపోర్ట్ ఇచ్చామని చెప్పింది కూడాను. కేథరీన్‌కి బోధపడింది; గోమెజ్ భయపడి పారిపోయాడని! పోలిస్ రిపోర్ట్ “చెప్పకుండా హాస్పటల్‌ నుంచి పారిపోయినందుకు చేశారా? మరెందుకైనా రిపోర్ట్ చేశారా?” అని అడుగుదామనుకున్నది కానీ, ఏ కళలో ఉన్నదో ఆ ప్రశ్నలు మాత్రం అడగలేదు, కేథరీన్‌.

తిరిగి వస్తూ సుజాత గోమెజ్‌కి ఫోన్‌ చేసింది. సమధానం లేదు. గోమెజ్ పోలీసులకి భయపడి పారిపోయాడేమో అన్న అనుమానం ఇద్దరికీ వచ్చింది. అయినా ఇంటికొచ్చే వరకూ ఇద్దరూ ఆ విషయం ఎత్తలేదు. మర్నాడు సాయంత్రం, గోమెజ్ ఇచ్చిన ఎడ్రస్‌ పట్టుకొని ఇద్దరూ ఆ ఇంటికెళ్ళారు. తలుపు కొట్టారు. ఇద్దరు లాటినో కుర్రాళ్ళు తలుపు తీసారు. ఇద్దరూ టీనేజర్స్‌! గోమెజ్ గురించి, మార్సిలీనో గురించీ అడిగింది, కేథరీన్‌. వాళ్ళు స్కూల్ కెళ్ళే పిల్లలు కాబోలు; ఇంగ్లీషులో అడిగితే, ఇంగ్లీషులోనే సమాధానం చెప్పారు; గోమెజ్, మార్సిలీనో ఇక్కడ లేరు, అని.

“గోమెజ్ ఎవరో మాకు తెలియదు.” అన్నాడు ఒకడు. “ప్లీజ్! గో” అని తలుపు మూశాడు రెండో వాడు.

గోమెజ్, మార్సిలీనో ఇద్దరూ ఇల్లీగల్స్‌ అయి ఉండాలి, అని నచ్చచెప్పుకున్నారు, సుజాత, కేథరీన్‌. వచ్చే మే నెల దాకా గడ్డి చెయ్యవలసిన అవసరం అంతగా ఉండదుగా! అప్పుడెవరినో చూసుకోవచ్చులే అన్నది, కేథరీన్‌. గోమెజ్ తిరిగి వస్తాడని గట్ఠి నమ్మకం ఉన్నది, సుజాతకి. అలాగని కేథరీన్‌తో అనలేదు, నవ్వుతుందేమోనని!


ఆ రోజు సోమవారం.

డిసెంబర్‌లో హాస్పటల్ నుంచి వెయ్యి అరవై డాలర్లకి బిల్లు వచ్చింది. సుజాత గుండె గుభేలు మన్నది. కేథరీన్‌తో చెప్పింది.

“గోమెజ్‌కి జరిగిన యాక్సిడెంట్ ఆ కార్నర్‌ ఇంటి ముందే కదా?” అన్నది కేథరీన్‌.

“యస్.”

“ఆ ఇంటి ఆవరణలోనే యాక్సిడెంట్ అయ్యిందా?”

“యస్.” చెప్పింది సుజాత. “నేను గోమెజ్‌ని వాళ్ళ లాన్‌లో నుంచే లేవదీసి నా కారులో హాస్పటల్‌కి తీసికెళ్ళాను.”

“మరయితే, ఈ మెడికల్‌ బిల్‌ వాళ్ళ బాధ్యత కాదూ?”

“యస్.”

“అయితే, వెళ్ళి ఆవిడతో మాట్లాడు.”

“నువ్వు కూడా వస్తావా?” అని అడిగింది, సుజాత.

“వత్తాసు కోసం వస్తాను, కానీ నేను యాక్సిడెంట్ చూడలేదుగా? అందుకని ఆవిడని నిలదీసి అడగలేను,” అన్నది, కేథరీన్‌. నయమే! కనీసం వస్తానన్నది, రాను పో అనలేదు, అని సంతృప్తి పడింది సుజాత.

మర్నాడు సాయంత్రం ఇద్దరూ మాలిని ఇంటికెళ్ళారు. మాలిని గుడినించి తెచ్చిన ప్రసాదం పెట్టింది. మసాలా టీ ఇచ్చింది. సుజాత జరిగిన విషయం పూసగుచ్చినట్టు చెప్పింది.

“యాక్సిడెంట్ అయిన రోజునే నీకు చెప్పి ఉండాలసింది. కానీ…” వాక్యం పూర్తి కాకముందే మాలిని గబ గబ హిందీ, ఇంగ్లీషు కలిపి మొదలెట్టింది.

“నేను గడ్డి చెయ్యమని అడగలేదే? అసలు ఆ రోజు ఎందుకొచ్చాడు? అడగకండా పెట్టకండా మా లాన్‌ ఎందుకు చేశాడు? నేను వాడితో కచ్చితంగా చెప్పాను. నేను పిలిచినప్పుడే వచ్చి మా లాన్‌ చెయ్యాలీ అని! ”

ఈవిడగారు తప్పుకొని పోతూన్నదని తెలిసిపోయింది. కేథరీన్‌, సుజాత తిరుగు ముఖం పట్టారు మళ్ళీ మాట్లాడకండా! ఇచ్చిన టీ అక్కడే వదిలిపెట్టి. బయటికి వస్తూ “గోమెజ్‌ని పిలిచి మాలిని ఏ భాషలో చెప్పిందో?” అని నవ్వింది, సుజాత. కేథరీన్‌ వంత పాడింది.

ఒక వారం రోజులు పోయిన తరువాత, హాస్పటల్‌కి వెళ్ళారు, కేథరీన్‌, సుజాతానూ! ఒక వంద డాలర్లు ఇచ్చి సరిపెట్టుకుందామని. హాస్పటల్‌ ఎడ్మినిస్ట్రేటర్‌తో అరగంట బేరం ఆడారు. మొత్తానికి బేరమాడి, మూడువందల అరవైకి ఒప్పించారు. “మీరు మంచి పనిచేసి ఆపదలో ఉన్న వాడికి సాయం చేశారు కాబట్టి బిల్లు తగ్గిస్తున్నాను,” అని చెప్పి ఏదో నీతిబోధ చెయ్యడం మొదలెట్టాడు. వంద డాలర్లు కేథరీన్‌ ఇస్తానన్నది. సుజాత భాగం రెండువందల అరవై.

“చావు తప్పి కన్ను లొట్టపోయిందిరా భగవంతుడా!” అని పైకి అనేసింది సుజాత. “వాట్! వాట్?” అంటూ గుడ్లు మిటకరిస్తున్న కేథరీన్‌ కేసి చూడకుండా.

“నౌఏడేస్ బీయింగ్ ఎ గుడ్ సమారిటన్‌ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్‌,” అన్నది కేథరీన్‌. ఇద్దరూ పకపక నవ్వుకున్నారు.

“ఐ థింక్‌ వుయ్ ఓ మోర్ టు గోమెజ్ ఫర్ హిజ్ సర్వీసెస్‌,” అని సరిపెట్టుకుంది సుజాత.

ఇవాళ శనివారం.

ఏప్రిల్లో కూడా ఇంకా చలి చలిగానే ఉన్నది. సుజాత, మోహన్లు రెండు వారాల పాటు ఫ్లారిడాలో మకాం చేసి తిరిగొచ్చారు, నెలాఖరుకి.

సుజాత రెండు వారాల మెయిల్‌ చూస్తున్నది. చాలా భాగం జంక్ మెయిల్. తట్టెడు బిల్లులు. రాఫిల్లో ఐదు మిలియన్లు నెగ్గటానికి చదవాల్సిన ఉత్తరాలు ఐదు; మోహన్‌ పేరున మూడు, తన పేరున రెండు! అంతా కల్సి ఓ రెండు పౌండ్ల బరువుంటాయి. అన్నీ పక్కకు బొత్తిగా పెడుతుంటే కనిపించింది ఒకే ఒక్క మాసిపోయిన కవరు. ఈ ఉత్తరం చాంద్రాయణం చేసి వచ్చినట్టుంది. ఉత్తరం చింపి చూసింది. తెల్లకాయితం మడతలో నలిగిపోయిన ఐదు డాలర్ల బిల్లులు మూడో నాలుగో. పైనున్న బిల్లు వాటర్‌ మార్క్‌ మీద పొడి పొడి ఇంగ్లీషు అక్షరాలు.

“tHAnks. mAm.” రిటర్న్‌ ఎడ్రస్‌ లేదు; ఎల్ పాసో పోస్టు ముద్ర తప్ప.

“మి పే! మి పే!” అని హాస్పటల్‌లో కలవరిస్తున్న గోమెజ్ గుర్తుకొచ్చాడు. సుజాత కళ్ళనిండా నీళ్ళు తిరిగాయి. ఒక్క చుక్క కూడా ఐదు డాలర్ల బిల్లు మీద పడలేదు.