గోమెజ్ ఎప్పుడొస్తాడో!

గోమెజ్ వస్తాడని చూసిచూసి చివరకి విసుగెత్తి, సోమవారం నాడు పొద్దున్నే యెల్లొ పేజీల్లో చూసి ఏదో సర్వీసు కంపెనీని పిలిచింది, కేథరీన్‌. ఆ విషయం సుజాతకి చెప్పింది. ఆ కంపెనీ వాళ్ళు యూనిఫారాలు వేసుకొని, పెద్ద ట్రక్‌లో వచ్చారు, మధ్యాన్నానికల్లా! మొత్తం ముగ్గురొచ్చారు. రెండు ఇళ్ళ ముందూ వెనకా లానులు పరీక్షగా చూశారు. ఒకడు టేపుతో కొలతలు కూడా తీసుకున్నాడు. మొట్టమొదటిసారి గడ్డి కోసి బుష్షులన్నీ కత్తిరించి పూల మొక్కలన్నింటికీ కుదుళ్ళు తవ్వి శుభ్రం చెయ్యడానికి ఒక్కొక్కళ్ళకీ నూటైయభై డాలర్లు అవుతుందని అంచనా ఇచ్చారు. వారానికొకసారి లాను పని చేయించుకుంటామని కాంట్రాక్ట్ రాస్తే, ప్రతివారం అరవై ఐదు డాలర్లకి లాన్‌ చేస్తామని, పూలపొదలు బుష్షులూ కత్తిరించడానికి వేరే నెలకి నలభై డాలర్లు అని చెప్పి రిబేట్‌ కాయితాలు, కాంట్రాక్ట్ కాయితాలూ అన్నీ కేథరీన్‌కి, సుజాతకీ ఇచ్చి రెండురోజుల్లో పిలిచి ఏ విషయం చెప్పండని వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరికీ గుండె ఆగినంత పని అయ్యింది. “ఇది నిలువు దోపిడీ” అని సుజాత, “హైవే రాబరీ” అని కేథరీన్ ఒకేసారి అనేశారు. వస్తానని చెప్పి, మాట నిలబెట్టుకోకండా మోసం చేసి ఎగగొట్టినందుకు, గోమెజ్‌ని నానా తిట్లూ తిట్టుకున్నారు: సుజాత తెలుగులోను, కేథరీన్‌ ఇంగ్లీష్‌లోనూ!

అయినా తప్పదుకదా!

ఈ దేశంలో, ఎవడి ఇల్లు వాడు లోపల ఎంత చెత్తగా పెట్టుకున్నా పరవాలేదు. శానిటరీ డంప్‌లా వున్నా నష్టం లేదు. ‘నా ఇల్లు. నా సొంతం’ అని దబాయించవచ్చు. ఇండివిడ్యువల్‌ ఫ్రీడం! కానీ, ఏ ఇంటి ముందు, వెనకా కాళీ స్థలంలో గడ్డి ముత్యంగా మూడంగుళాలకన్నా ఎత్తుగా పెంచకూడదు. ఏ ఇంటి ముందన్నా కాస్త గడ్డి గాదర దుబ్బుగా పెరిగితే, ఇంటి ధరలు అమాంతం పడిపోతాయని బెంబేలు ఎత్తిపోతారు, ఇక్కడి జనం! ఇరుగుపొరుగు వాళ్ళు టౌన్‌హాలుకి పిలిచి రిపోర్ట్ చేస్తారు కూడాను! టౌన్‌హాల్‌ వాళ్ళే గనక మీ ఇంటి ముందు గడ్డి కోయిస్తే తడిసి మోపెడవుతుంది. అంతేకాదు; అది అప్రతిష్ట కూడాను! పెద్ద న్యూసెన్స్! అందుకైనా గడ్డి కోయించి తీరాలి.


ఆ రోజు బుధవారం.

పొద్దున్నే సబ్‌ డివిజన్‌లో నడుస్తూ, కేథరీనూ, సుజాతా ఇవాళ సర్వీసు కంపెనీని పిలుద్దామని ఒప్పందం చేసుకున్నారు. మిట్టమధ్యాన్నం. జులై ఎండ మాడ్చేస్తూన్నది. కాసేపు కునుకు తీద్దామని సోఫాలో వాలింది, సుజాత.

అరగంట కూడా పట్టలేదు ఉలిక్కి పడి లేచింది, బయట లాన్‌ మోవర్‌ చప్పుడుకి! తలుపు తీసి చూసింది. అదేమీ మామూలు లాన్‌ మోవర్‌ కాదు. చక్కగా సీటు మీద కూర్చొని గడ్డి చేసుకునే మోవర్‌. కావి రంగు హాండా రైడింగ్‌ మోవర్‌. వెనక పెద్ద గోనె సంచీ; పక్కన మరో మనిషి నిలబడటానికి చిన్న ఇనప మెట్టు కూడా ఉన్నట్టున్నది. గోమెజ్‌ బండి నడుపుతున్నాడు; పక్కనే మరో అమీగో హుషారుగా చేతులూపుతున్నాడు. సుజాతని చూడగానే గోమెజ్‌ ఎడమచెయ్యి ఊపుతూ హాయ్‌ అని సైగ చేసి మోవర్‌ ఆపాడు. వాడి స్నేహితుడిని గుమ్మం దగ్గిరకి తీసుకొని వచ్చాడు. సుజాత సైగ చెయ్యకముందే, వాడికేసి చూపుడు వేలు చూపిస్తూ ‘మార్సెలీనో’ అని చెప్పాడు. చూస్తే వీడికి పదిహేను పదహారు ఏళ్ళకన్నా ఎక్కువ వయస్సుండదు. మార్సెలీనోని ‘ఇంగ్లీషు అర్థం అవుతుందా?’ అని అడిగింది, సుజాత. వాడు వెంటనే ‘లిటిల్‌, లిటిల్‌’ అని సమాధానం చెప్పాడు. వీడే నయం. ఆ గుజరాతీ ఆవిడయితే ‘థోడా థోడా’ అనేది. ఇంతలో ఎదురింటి కేథరీన్‌ కూడా బయటికొచ్చింది. చెప్పద్దూ! కేథరీన్‌కీ, సుజాతకీ మొహాలు విప్పారిపోయాయి.

గోమెజ్‌ మోవర్‌ ఎక్కి గడ్డి చెయ్యడం మొదలు పెట్టాడు; కేథరీను మార్సెలీనోతో మాట్లాడటం మొదలెట్టింది. రకరకాల ఆరాలు తీసింది. రైడింగ్‌ మోవర్‌, వాళ్ళు పని చేసే పూలకంపెనీ ఓనర్‌ది. రోజుకి ముప్ఫై డాలర్లకి అద్దెకి తీసుకున్నారట! ఒక్క రోజులో అధమ పక్షం అరడజను లానులు చెయ్యచ్చు. ఒక్క గంటలో రెండు లాన్లూ కత్తిరించేశారు. పాత తోపుడు బండి మోవర్ అయితే కనీసం రెండు గంటలు పట్టేది. మార్సెలీనో గడ్డి ప్లాస్టిక్‌ బస్తాల్లోకి పట్టి ట్రక్‌ వెనకాల పడేశాడు. డబ్బులిస్తూ కేథరీన్‌ ‘ఇప్పుడు కచ్చితంగా రెండు వారాలకొకసారి రావాలి,’ అని మార్సెలీనోతో చెప్పింది. వాడు, సీ సీ కి బదులు ‘షూర్‌ షూర్‌’ అన్నాడు. సుజాత చెరొకడికీ లీటర్ కోకు సీసాలిచ్చింది. మంచి ఎండగా ఉన్నదేమో, మార్సిలీనో సీసా మొత్తం ఒక్క గుక్కలో ఖాళీ చేశాడు.

ఇప్పుడు గోమెజ్ ఠంచనుగానే వస్తున్నాడు. అనుకున్నట్టుగానే రెండు వారాల కొక సారి శనివారమో, వీలు కుదరకపోతే ఆదివారమో గోమెజ్, మార్సిలీనో, ఇద్దరూ కొత్త మోవర్ని టొయోటా ట్రక్కులో కెత్తుకొని వచ్చే వాళ్ళు. ఒక గంటలో రెండు ఇళ్ళముందూ వెనకా గడ్డి కత్తిరించేసి పోయేవాళ్ళు. ఆరోజు ఇంట్లో ఎవరూ లేకపోతే, డబ్బులకోసం మార్సిలీనో సోమవారమో, మంగళవారమో సాయంత్రం బాగా చీకటి పడింతర్వాత వచ్చేవాడు.


ఆరోజు శనివారం.

సెప్టెంబర్‌ నెలాఖరయ్యింది. ఎండలు బాగా తగ్గాయి. బయట కాస్త చల్లబడుతూన్నది. తొందరగా చీకటి పడుతూన్నది కూడాను. సాయంత్రం గోమెజ్, మార్సిలీనో గుజరాతీ వాళ్ళ ఇంటిముందు గడ్డి చేస్తున్నారు. మార్సిలీనో మోవర్‌ తోలుతున్నాడు, గోమెజ్‌ మోవర్‌కి ఎడమ పక్కన మోవర్ని తప్పుకుంటున్నట్టుగా నటిస్తూ చక చక మోవర్ పక్కనే నడుస్తున్నాడు. మార్సిలీనో మోవర్ని ఎడమ పక్కకి, కుడి పక్కకీ వెంటవెంటనే అదొక ఆటలా తిప్పటం మొదలెట్టాడు. గోమెజ్ మోవర్ని తప్పించుకోవటం; మార్సిలీనో గోమెజ్‌ని మోవర్‌ తో తరమటం మొదలెట్టారు. కుర్రతనం చేష్టలు.

అప్పుడే సుజాత కారు ఎడమపక్కకి తిప్పుతూ కుడిచేతి వైపున ఉన్న మాలిని ఇంటి కేసి చూసింది. గోమెజ్‌ని, మార్సిలీనో ని చూసింది. ఒక్క క్షణం, అంతే! మోవర్‌ ఎత్తునుంచి పల్లంలోకి వస్తోందో ఏమో, మార్సిలోనోకి బేలెన్స్‌ దొరకలేదు. మోవర్ ఎడమపక్కకి పల్టీ కొట్టింది. పక్కనేఉన్న గోమెజ్ కుడి కాలి మీద పడింది. గోమెజ్ కింద పడ్డాడు. మోవర్ స్టీరింగ్ వాడి తలకి కొట్టుకుంది. మార్సిలీనో కుడిపక్కకి దూకాడేమో, వాడు నిలబడే ఉన్నాడు. ఇదంతా ఒక్క క్షణంలో జరిగింది. గోమెజ్ మార్సిలీనోని ఏదో తిడుతూ ఏడుస్తున్నాడు. మార్సిలీనో అతికష్టం మీద మోవర్ని లేపి నిలబెట్టాడు. అదృష్టం బాగుండి, ఇంజన్‌ ఆగి పోయింది.

సుజాత కారు ఆపి గోమెజ్ దగ్గిరకి పరిగెత్తుకొని వచ్చింది. వాడు కుడి కాలు మణిమ పట్టుకొని ఏడుస్తున్నాడు. మార్సిలీనో కళ్ళనిండా నీళ్ళు నిండాయి. గోమెజ్ తలకి దెబ్బ తగిలింది. నుదురు నుంచి రక్తం కూడా వస్తోంది. రక్తాన్ని ఎడం చేత్తో తుడుస్తూంటే సుజాత వాడిని వారించి, తన కారులోంచి టిష్యూ పేపర్ తెచ్చి తుడిచింది. రక్తం ఎక్కువగా లేదు కాని, నుదురు మీద పెద్ద బొప్పి బాగా కనిపిస్తోంది. కుడి కాలు నేల మీద అదిమిపట్టి ఎడమచెయ్యి ఒత్తు పెట్టుకొని లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. విపరీతమైన నెప్పి కాబోలు; లేవటం కష్టం అయ్యింది. మార్సిలీనో చెయ్యి ఊతగా పట్టుకొని అతికష్టం మీద లేచి నిలబడ్డాడు. సుజాత వాడిని తన కారులోకెక్కించింది, మార్సిలీనో సాయంతో. మార్సిలీనోని వెనక ట్రక్‌లో రమ్మంది. యస్ యస్ అన్నాడు మార్సిలీనొ.

“హాస్పటల్ ఎమర్జెన్సీకి తీసికెళ్ళాలి,” అంది.

“హాస్పటల్? నో! నో హాస్పటల్ మామ్! నో! నో!” అంటున్నాడు గోమెజ్.

సుజాత వాడి మాట ఖాతరు చెయ్యలేదు. మెడికల్ సెంటర్ ఎమర్జెన్సీకి తీసికెళ్ళింది. అరడజను కాగితాలిచ్చింది అక్కడి రిసెప్షనిస్ట్. వివరాలన్నీ పూర్తిచేసిన తరువాత డాక్టర్ చూస్తాడని చెప్పింది. మార్సిలీనో రావడంతో కాస్త ఇబ్బంది తప్పింది. పూర్తి పేరు, అడ్రెస్‌, వయస్సు, వగైరా వగైరా వాడే పూర్తి చేశాడు. ఈ తతంగం అవుతున్నంత సేపూ, గోమెజ్ నో నో హాస్పటల్ అని అరుస్తూనే ఉన్నాడు. ఆ కాగితాలు రిసెప్షనిస్ట్ తీసుకుంటూ ఇన్స్యూరెన్స్ భోగట్టా అడిగింది. గోమెజ్‌కి ఇన్స్యూరెన్స్ లేదు. ఈ లోగా మార్సిలీనో మాయమయ్యాడు. హాస్పటల్‌కి ఎవరోఒకరు హామీ ఇవ్వాలని రిసెప్షనిస్ట్ చెప్పింది, ఆ కాగితాలని సుజాత ముందుకి నెడుతూ. సుజాత హామీ పత్రం మీద సంతకం పెట్టింది, మోహన్‌తో చివాట్లు తినాలని అనుకుంటూ!

గోమెజ్‌ని డాక్టర్ ఒక ఐదు నిమిషాలు పరీక్ష చేసాడు. తలమీద బొప్పి చూసాడు. కాలు చివర పట్టుకొని గట్టిగా లాగాడు. గోమెజ్ బాధగా ఉన్నా అరవలేకపోయాడు. కాలికి ఎక్స్-రే తీయాలని చెప్పాడు. తలమీద దెబ్బ తగిలింది కాబట్టి గోమెజ్‌ సోమవారం వరకూ హాస్పటల్లో ఉండవలసి వస్తుందని చెప్పి ఏవో కాగితాలు పూర్తి చేసి, నెప్పికి మందు రాసి వెళ్ళిపోయాడు. నర్స్ గోమెజ్‌ని కుర్చీలో కూర్చోబెట్టి వార్డ్ లోకి తీసుకెళ్ళింది. నర్స్‌తో పాటు సుజాత కూడా గోమెజ్ బెడ్ దాకా వెళ్ళింది. మార్సిలీనో వెంటే ఉన్నాడు.

మార్సిలీనోతో సుజాత చెప్పింది, “రేపు వచ్చి చూస్తానని గోమెజ్‌కి చెప్పు. రాత్రికి మందు వేసుకొని పడుకోమను. సరేనా?” మార్సిలీనో యస్ యస్ అని తలకాయ ఊపాడు. ఈ లోగా సుజాత కేథరీన్‌ని పిలిచింది. అన్ని విషయాలూ పూసగుచ్చినట్టు చెప్పింది. గోమెజ్ విపరీతమైన నెప్పితో బాధ పడుతూ కూడా, ” మి పే, మి పే, మామ్‌ మి పే, యస్ యస్, మి పే,” అని కలవరిస్తున్నట్టు చెపుతున్నాడు. వాడు ఏమంటున్నదీ సుజాతకి బోధ పడలేదు. ఏమిటీ? అన్నట్టు మార్సిలీనో కేసి చూసింది. మార్సిలీనో చెప్పాడు హాస్పటల్ ఖర్చు తను ఇస్తానని అంటున్నాడు, అని.