పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు
ఇక ద్రావిడ భాషలలో కొన్ని ముఖ్యమైన బంధుత్వ పదాల వ్యుత్పత్తిని పరిశీలిద్దాం.
తండ్రి
అన్ఱు/-అద్ఱు/-అన్డు అన్న పదం ద్రావిడ భాషలలో మగవాడు అన్న అర్థం వచ్చే పదాలకు మూల ధాతువు. అవ+అన్ఱు > అవన్ఱు > వాన్ఱు > వాండు > వాఁడు అంటే ఆ మగవాడు అని, ఇవ+అన్ఱు > ఇవన్ఱు > వీన్ఱు > వీండు > వీడు అంటే ఈ మగవాడు వంటి ఎన్నో పదాలలో మగవాడు అని అర్థం రావడానికి -అన్ఱు అన్న ధాతుప్రత్యయం వాడడం మనకు తెలుసు. తన్- + -అన్ఱు అంటే తన(తమ) మగవాడు, అంటే నాన్న. ప్రాచీన తమిళంలో ఎన్-(=నా) + తై అంటే నా నాన్న, నన్- (=మా) + తై అంటే మా నాన్న, ఉన్ (=నీ/మీ) + తై అంటే మీ నాన్న, తన్- + తై అంటే తన నాన్న అన్న అర్థాల్లో వాడినట్టు ఆధారాలు ఉన్నాయి. అయితే, మిగిలిన పదాలన్నీ లుప్తమైపోయి ఇప్పుడు తన్- తో జత చేసిన తన్ఱు > తండ్రి, తంతై వంటి పదాలే నాన్న అన్న పదానికి సాధారణార్థంలో వాడే పదాలుగా మిగిలిపోయాయి.
ఇదే విధంగా తమ్ముడు అన్న అర్థంలో ఇప్పుడు తమిళంలో వాడే తంబి- (తన్- + -పి) అన్న పదమే కాకుండా ఎంబి-, నుంబి-, ఉంబి-, తంబి- అన్న నాలుగు పదాలు ప్రాచీన తమిళంలో వాడుకలో ఉండేవి. ఇప్పుడు తన్- తో జతచేసిన తంబి అన్న పదం తప్ప మిగిలిన పదాలు లుప్తమైపోయాయి. చెల్లెలు అన్న అర్థంలో తంగై (తన్ + కై) అన్న పదమే కాక ఎంగై, నుంగై, ఉంగై అన్న పదాలు వాడుకలో ఉండేవి.
ఈ రకంగా ద్రావిడ భాషలలో బంధుత్వ పదాలకు నాలుగు పూర్వ రూపాలు ఉండేవని ఎమెనో (Murray B. Emeneau) Dravidian Kinship Terms అన్న పరిశోధన పత్రంలో ప్రతిపాదించి సోదాహరణంగా వివరించారు.
తల్లి
ద్రావిడ భాషలలో అన్ఱు అన్న ధాతువు పురుష సంబంధమైన పదాలలో కనిపిస్తే, -అళు అన్న ప్రత్యయం స్త్రీ సంబంధమైన పదాలలో కనిపిస్తుంది. తళ్ళి అన్న పదానికి తన్ + అళ్ అన్న వివరణ సబబు గానే అనిపించినా, తన్- లో ఉండే అనునాసికం ఏ రూపాలలో కనిపించదు. కాబట్టి దీన్ని త- + అళ్ అనే వివరించడం కుదురుతుంది. అదీ కాక, మిగిలిన పదాలలాగా నాలుగు రూపాలు ఈ పదానికి కనిపించవు. –అళు అన్న స్త్రీ సంబంధమైన పదాలన్నింటిలో ళ- కారం, తెలుగులో ల- కారంగా మారిపోయింది.
చెల్లెలు: మిగిలిన ద్రావిడ భాషలలో చెల్లెలు అన్న అర్థంలో కనిపించే తంగ/తంగి/తంగై అన్న పదాలకు సంబంధించిన పదం తెలుగులో, ఇతర దక్షిణమధ్య భాషలలో కనిపించదు. దానికి బదులుగా చిల్- (చిన్న) + అళు (స్త్రీ) అన్న అర్థంలో చిల్లళు > చెల్లళు > చెల్లలు అన్న పదాలు కనిపిస్తాయి.
కొడుకు కోడలు
కొడుకు: కొೞು-/కోೞು- అన్న మూల ధాతువుకు కొత్త, లేత, పసివాడు, కొడుకు అన్న అర్థాలు ఉన్నాయి. ೞ- కారం తెలుగులో అచ్చుల మధ్య డ- కారంగా మారిందని “ఏడు” సంఖ్యాపదం గురించి చర్చించినప్పుడు అనుకున్నాం కదా. ఆ రకంగా కొೞು- > కొడు- అవుతుంది, అయితే, కొడుకు లో చివరి –కు కారాన్ని ఎలా వివరించాలో నాకు తెలియదు.
కోడలు: కోೞು- + అళ్ = కోడళు > కోడలు అని ఈ పదాన్ని సూటిగానే వివరింపవచ్చును.
అమ్మ, అయ్య తదితరాలు
అమ్మ: ప్రపంచంలోని చాలా భాషలలో తల్లికి సంబంధించిన పదాలు మ- కారంతోనే ఉండటం భాషావేత్తలను ఆశ్చర్యపరచింది. ఈ రకమైన పదాలద్వారా అన్ని ప్రపంచ భాషలు ఒకే ఒక మూల భాషనుండి ఉత్పన్నమయ్యాయని నిరూపించడంలో ఉపయోగపడుతుందని భావించిన భాషావేత్తలు కూడా ఉండేవారు. అయితే, ఈ రకమైన పదాలలోని సారూప్యతను చాలా సులభంగా వివరించిన భాషావేత్త యాకుబ్సన్ (Roman Jakobson). చిన్నప్పుడు శిశువులు ముందుగా నేర్చుకొనే ధ్వనులు ప, ఫ, బ, భ, మ అనే ఓష్ఠ్యాలు. ముఖ్యంగా మ- అన్న శబ్దం చాలా సులభంగా ఉచ్చరించ గలిగే ధ్వని. అందుకని, శిశువు మ, మ్మ- అని చప్పరిస్తూ ఉంటే ఆ ధ్వనిని మాతృ సంబంధిత శబ్దంగా ఆపాదించడంతో అన్ని భాషలలో అమ్మ-, మామా-, మమ్మీ అన్న శబ్దాలే తల్లిని సంబోధించడానికి ముఖ్య పదాలుగా నిలిచిపోయాయి.
అప్ప, అయ్య: మ- కారం తరువాత శిశువులు సులభంగా ఉచ్చరించగలిగే ధ్వని ప-/బ-. అందుకే చాలా భాషలలో అప్పా/అబ్బా-, పాపా-, బాబా- అన్న పదాలు పితృసంబంధిత పదాలుగా నిలిచిపోయాయి. అయ్య అన్న పదం ద్రావిడ పదమా? ఆర్య- అన్న సంస్కృత శబ్దం నుండి నిష్పన్నమైన పదమా? అన్నవిషయాన్ని సులభంగా వివరించలేం.
అన్న,అక్క: -అన్ఱు/-అద్ఱు/-అన్డు అన్న ధాతువుకు పురుష సంబంధమైన అర్థం ఉంది. అలాగే –క అన్న ప్రత్యయానికి స్త్రీ సంబంధమైన అర్థం ఉంది (తంకి, తంక). అయితే, అణ్ణ > అన్న, అక్క అన్న వంటి మూల పదాల వ్యుత్పత్తిని అంత సులభంగా వివరించలేం.
అత్త: ద్రావిడ భాషలలో స్త్రీ ప్రత్యయంగా –త కారం చాలా చోట్ల కనిపిస్తుంది. నెలత, గొల్లెత, గుబ్బెత, ముట్టుత అన్నపదాలలో చివరి త- ప్రత్యయం స్త్రీలింగ సూచకం. అత్త అన్న శబ్దం కూడా ఆ స్త్రీ లింగ ప్రత్యయాన్ని ఉపయోగించే సంబంధ విశేషం. ఆర్య భాష అయిన మరాఠీ భాషలోనూ మేనత్తను ద్రావిడ పదమైన అత్త అన్న శబ్దంతోనే సంబోధిస్తారు.
నాన్న: ద్రావిడ భాషలో మనుష్య సంబంధాలు కొన్నిస్వామిత్వ (possessive) రూపంలో ఉంటాయని ముందుగా అనుకున్నాం కదా. నాన్న అన్న పదానికి పూర్వ రూపం నాయినా < నాయన్న < నా + అన్న. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో తండ్రి యొక్క తల్లిని సంబోధించడానికి నాయినమ్మ (నాయిన + అమ్మ) అన్న పదమే వాడుతారు.
మఱఁది/మఱఁదలు: *మఱు- అన్న ధాతువుకు ఇతర, ప్రత్యామ్నాయమైన అన్న అర్థాలు ఉన్నాయి. మఱు + అన్ఱు > మఱందు > మరఁది అని, మఱ + అందు + అళ్ > మఱందళు > మఱఁదలు గా మారిపోయాయి.
వదిన: వధూనీ అన్న సంస్కృత పదం వదుని అన్న ప్రాకృత రూపం ద్వారా తెలుగులోకి వదిని, వదినె, వదినగా ప్రవేశించాయి.
బావ: భావక- అన్న సంస్కృత పదానికి రూపమైన ఈ పదం కూడా ఆర్వాచీనమే.
తాత: తాత శబ్దంలో మొదటి త- కారం ముందుగా చెప్పుకున్నట్లు తన- శబ్ద సంబంధమైనది కావచ్చు. తమిళంలో తంతయ్, కన్నడలో తందె శబ్దాలు నాన్నకు పర్యాయరూపాలు అయితే, తెలుగులోను, ఇతర భాషలలో ఈ పదాన్ని ఇంకో పై తరానికి ఆపాదించి పితామహులకు, మాతామహులకు ఉపయోగిస్తారు.
భాష మారినా, వ్యాకరణం, పదజాలం మారినా బంధుత్వ వ్యవస్థ ఒక సమాజంలో అంత తొందరగా మారదు. దీని గురించి మాట్లాడుతూ లూయి మోర్గన్ ఇలా అన్నారు:
“Language changes its vocabulary, not only, but also modifies its grammatical structure in the progress of ages; thus eluding the inquiries which philologists have pressed it to answer; but a system of relationships once matured, and brought into operation, is, in the nature of things, more unchangeable than language - not in the names employed as a vocabulary of relationships, for these are mutable, but in the ideas which underlie the system itself.”
అందుకే మహారాష్ట్రలోనూ, గుజరాత్ లోనూ ఇప్పటికీ కనిపించే మేనరిక వివాహాలు, మరాఠీ, గుజరాత్, మేర్ వంటి భాషలల్లో కనిపించే బంధుత్వ పదాలు ఆ ప్రాంతాలలో ప్రజలు ఒకప్పుడు ద్రావిడ భాషలు మాట్లాడుతూ ఉండేవారని, అక్కడ ద్రావిడ సంబంధమైన సామాజిక సంస్కృతే పరిఢవిల్లేదని మనం చెప్పుకోవచ్చు. అలాగే, మన ప్రాంతాలలో కనిపించే మేనమామ అక్క కూతురును పెళ్ళి చేసుకునే పద్ధతి ద్రావిడ సంస్కృతికి పూర్వం ఉన్న సమాజపు అవశేషం కావచ్చని నా ఊహాగానం. ఈ ఊహను ఇంకా విశ్లేషించి బలమైన ఆధారాలతో నిరూపిస్తే మన పూర్వ చరిత్ర గురించి ఇంకా తెలుసుకున్నవారమౌతాం.
Sowmya అభిప్రాయం:
January 2, 2012 5:02 am
ఓహో, ఇలా కూడా భాషల్ని వర్గీకరిస్తారా! చక్కటి పరిచయం అందించారు. ధన్యవాదాలు.
మీరు చెప్పిన వర్గీకరణలు గల భాషల ఉదాహరణ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. హవాయియన్, సుడానీస్,ఎస్కిమో వంటి వాటికి పేర్లోనే ఉదాహరణలు ఉన్నాయి కానీ, క్రో, ఇరుక్వా అంటే ఏమిటో తెలీని నా లాంటి వాళ్ళకి కొన్ని ఉదాహరణలు ఇచ్చి ఉంటే సౌకర్యంగా ఉండేదేమో.
మరొక్క సందేహం: ద్రవిడ బంధుత్వాలకి ఆంగ్ల పదం ఏదన్నా ఉందా?? ద్రవిడియన్ కిన్షిప్ అనే అంటారా?
ఇక, నాలాంటి పామర జనాలకి, మరింత సమాచారం కావాలి అంటే… ఆంగ్ల వికీ లంకె.
మోహన అభిప్రాయం:
January 2, 2012 10:09 pm
మంచి వ్యాసము, రచయితకు అభినందనలు. (1) మహమ్మదీయులలోని పెళ్లిగురించి ఒక విషయము. ఔరంగజేబు తన సోదరుడైన దారాను చంపి పాదుషా అయ్యాడు (సారా మానను చదవండి). దారాకు ఉండే కొడుకును బంధించి చంపాడు చిన్నాన్న ఔరంగజేబు. దారాకు జానీ అని ఒక కూతురు ఉండేది, ఆమె అంటే తాతగారైన షాజహానుకు కూడ ప్రీతి. ఆమెను తన సోదరియైన రోషనారావద్దకు పంపాడు ఔరంగజేబు, ఆమె జానీని కష్టపెట్టేదట. అది భరించలేక మరో సోదరి జహానారా ఆమెను తాను పెంచుతానని ఔరంగజేబుకు చెప్పి జానీని పెంచిందట. జానీ చాల మంచిదట. ఆ సుగుణవతిని చూచి కొన్నాళ్లకు ఔరంగజేబే మనసు మార్చుకొన్నాడట. అంతేకాదు ఆమెను తన కొడుకైన ఆజమ్‌కు ఇచ్చి పెళ్లి చేసాడట. పెదనాన్న చిన్నాన్న పిల్లల మధ్య జరిగే పెళ్లికి ఇది ఒక ఉదాహరణ. (2) అత్త అనే పదము ప్రాకృతమునుండి వచ్చినదని భావిస్తారు. ఈ పదము హాలుని గాథాసప్తశతిలో ప్రయోగించబడినది. మరాఠీ ప్రాకృతమునుండి జనించింది కనుక మరాఠిలో అత్త అనే పదము చేరి ఉంటుంది. అత్తె కన్నడములో కూడ తెలుగులోని అత్తవలె ఉంది. ఈ అత్త పదాన్నితెలుగు భాష ప్రాచీనతను నిరూపించడానికి ఒకప్పుడు వాడినట్లు గుర్తు. విధేయుడు - మోహన
రాజా పిడూరి అభిప్రాయం:
January 7, 2012 1:19 pm
సురేశ్ గారూ,
చాలా మంచి వ్యాసం. కృతజ్ఞతలు.
1) బ్రౌణ్యంలో తండ్రి, తల్లి are undoubtedly connected with the root “త” (తెచ్చు , to bring) and literally mean ‘he who brings’ or ‘she who brings’ అని ఉంది. ఈ మాటలు introduction లో ఉన్నాయి. మరి ఇది బ్రౌన్ గారే వ్రాశారో లేక తరవాత రివైస్ చేసిన వారు (వెంకటరత్నం / వీరేశలింగం / కాంప్ బెల్) వ్రాసారో నాకు తెలియదు. ఇది పూర్వపక్షం అయినట్లేనా? వాదనకు నిలబడేది కాదా?
2) అట్లానే ఈ ఇంట్రడక్షన్ లోనే ‘అల్లుడు’ signifies – one who weaves (i.e. relationships between two families) అని ఉంది. ఇది దేశ్య పదమే, తెలుగు అనే ఉంది. కానీ అల్లెము అనే పదం దగ్గర ఇచ్చిన entry ‘అల్లెము’ అనే మాటని సంస్కృతం నించి వచ్చిన తత్సమం లాగా చూపించారు. కానీ “అల్లెము (is) connected with అల్లుడు” అని ఉంది. ఇది పొరపాటు అయ్యుంటుందా?
**
వారానికి ఏడురోజుల విధానం గురించి ఎవరైనా రాస్తారని అనుకున్నాను. డాక్టర్ మహీధర నళీనీ మోహన్ గారు వ్రాసిన కేలండర్ కథ అనే పుస్తకం ప్రకారం: ఇది మెసపొటేమియాలో మొదలైంది. భూమి మీద మనుష్యుల జీవితాలను దిద్దేవి ఆకాశంలోని గ్రహాలేననే నమ్మకం వల్ల అప్పటికి గ్రహాలు అనుకుంటున్న ఏడింటినీ (సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని) ఒక్కొక్క రోజుకి అధిదేవతగా ఊహించి, ఆయా రోజులకు వరుసగా పేర్లు పెట్టారు. మొదట ఒక్కొక్క చాంద్రమాసంలో నాలుగేసి వారాలు ఉండేవి. 4×7=28 రోజులు పోగా మిగిలిన ఒకటి, రెండు రోజులకు వారాల పేర్లే ఉండేవి కావు. మళ్ళీ కొత్త నెల మొదటిరోజు ఆదివారంతో మొదలు అయేది. కొన్ని రోజులకు అసలు వారమే లేకపోవడం ఈనాడు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. బాబిలోనియను భాషలో షబ్బతు అనే మాటకు మొదట పూర్ణిమ అనే అర్థం ఉండేది. తరవాత నెలలోని ప్రతి ఏడవ రోజునీ (7, 14, 21, 28) షబ్బతు అనడం మొదలు పెట్టేరు. దానినే యూదులు శాబత్ అన్నారు. ఆ రోజున కొన్ని పనులు (మాంసం తినడం, తెల్లని దుస్తులు ధరించడం, వైద్యులు మందు ఇవ్వడం, జోస్యాలు చెప్పడం) చేయకూడదనే నియమం బాబిలోనియనులకు ఉండేదట. అవే యూదులు కూడా అవలంబించారట, సాహచర్య దోషం వల్ల. మరికొంత కాలానికి వార రహితమైన దినాలు తీసేసారు. 7 రోజుల వార చక్రం నెలలతోనూ సంవత్సరాలతోనూ సంబంధం లేకుండా అవిచ్ఛిన్నంగా సాగిపోయేటట్లు మార్చుకున్నారు. ఆనాటి బాబిలోనియను సప్తాహ చక్రాన్నే యూదులు, అరబ్బులు, రోమనులు, క్రైస్తవులు, హిందువులు యదాతథంగా పరిగ్రహించారట. బాబిలోనియనులు పెట్టిన పేర్లే తర్జుమా చేసుకుని, అదే క్రమంలో తక్కినవారంతా వాడుకుంటున్నారట.
వారం అనేది కృతకంగా ఏర్పాటు చేసుకున్నదే. దీనికి ఖగోళంతో ఏ విధమైన సంబంధమూ లేదు. కృతకమైన కాల విభజన కనుకనే వారం అని అర్థం వచ్చే మాటకు 4 నించి 10 రోజుల వరకూ వివిధమైన అర్థాలు వివిధ దేశాలలో ఉండేవట. మొట్టమొదట ఇది సంత రోజుగా ప్రారంభమైంది. సరుకూ చప్పరా కొనుక్కోడానికి చుట్టుపక్కల ఊళ్ళనించి జనం అంతా రావడానికి వీలుగా ఒక కూడలి స్థలంలో ఇన్నేసి రోజులకు ఒకసారి అని నిర్దిష్ట వ్యవధులలో సంతలు జరుగుతూ ఉండేవి. ఆ వ్యవధినే వారం అన్న అర్థం వచ్చే మాటతో వ్యవహరించారు (బ్రౌణ్యం లో వారం అంటే - తడవ, ఆవృత్తి అనే అర్థాలివ్వబడ్డాయి). ఆరోజున ఎవరూ ఏ పనులూ చేయకూడదన్నారు. అది అవసరమే కదా (సంత సరిగా సాగడానికి) సంతలో గాని, ఎవరి గూడెంలో వారు గాని సంబరాలు, దేవుళ్ళకు కొలుపులూ జరుపుకునే వారు ఆరోజున. రాను రాను ఆ రోజుకి పవిత్రత ఆపాదించబడింది. ఆ రోజున కొన్ని పనులు చెయ్యకూడదు అని నిషేధాలు ఏర్పడ్డాయి. 4, 5, 6, 8, 10 రోజుల వారాల్ని వాడిన జాతులని కూడా నళినీ మోహన్ గారు ప్రస్తావించారు.
సురేశ్ కొలిచాల అభిప్రాయం:
January 10, 2012 1:08 pm
రాజు గారు,
మీ ఆసక్తికి కృతజ్ఞతలు. బ్రౌణ్యం చాలా పాతది. బ్రౌణ్యంలో తండ్రి, తల్లికి “త” (తెచ్చు , to bring) అన్న అర్థం ఎలా పొసగుతుందో నాకు తెలియదు. బ్రౌన్ కు తమిళంలో తంగై, ఎంగై, తంబి, ఎంబి అన్న పదాల వివరాలు తెలియక పోవచ్చు. ఎమెనో గారు 20వ శతాబ్దంలో చేసిన పరిశోధనలు భాషావేత్తలందరూ ఒప్పుకున్నవి. మీకు వీలైతే ఈ కింది పేపరు చదవండి:
Dravidian Kinship Terms, M. B. Emeneau, Language, Vol. 29, No. 3 (Jul. - Sep., 1953), pp. 339-353 (Published by: Linguistic Society of America)
నేను అల్లుడు, వియ్యంకుడు, మనమడు, మగడు, పెళ్ళాం మొదలైన కొన్ని పదాలు వివరించడం మరచిపోయాను. వచ్చే వ్యాసంలో వివరిస్తాను. అల్లుడు అన్న పదానికి అల్లిక-, అల్లు- (weaving the relationship) అన్న పదాలకు సంబంధంలేదు. ఎందుకంటే కన్నడ, మళయాళం ఇతర భాషలలో అల్లుడు-కు సజాతి పదం అళియ- అని మూర్ధన్య ళ కారంతో ఉంటాయి. ఇది అళు-/చళు- అన్న ధాతువుకు దగ్గరని నా అభిప్రాయం.
వారం గురించి వివరంగా రాసినందుకు ధన్యవాదాలు. సూర్యుడు, చంద్రుడు కాక రాత్రి మనకు ఆకాశంలో కనిపించే నక్షత్రాల్లో 5 నక్షత్రాలు మాత్రమే కదులుతున్నట్టుగా కనిపిస్తాయి. కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని గ్రహాలు మనకు దగ్గరిగా ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే కదులుతున్నట్టుగా కనిపిస్తాయి. సూర్యుడు, చంద్రుడు, ఈ కదిలే అయిదు గ్రహాలు కలిపి మీరు చెప్పినట్లు సప్తగ్రహాలుగా పేరుపొంది, వాటి ఆధారంగా ఏడు రోజుల వారాలు ఏర్పడ్డాయి.
Sadroopananda swami అభిప్రాయం:
February 20, 2012 10:34 am
చాల చక్కగ వివరించారు. సంతొషం.