మూడు లాంతర్లు – 9

రూపకమే కాకుండా, సృజనకు మౌలికమైన మానసిక వ్యవస్థలు – స్ఫురణ, లయ, నర్తన, ఔద్వేగిక స్థితి వంటివి ఉన్నాయి. శరీర విజ్ఞానాన్ని చదువుకోడానికి శరీరాన్ని నాడీ వ్యవస్థ, కండర వ్యవస్థ, జీర్ణ మండల వ్యవస్థ ఇలా అనేక వ్యవస్థలుగా (Systems) ముందు అర్ధం చేసుకుని, ఆ పైన ఈ అన్నీ కలసి శరీరాన్ని నడిపే పద్ధతిని అర్ధం చేసుకుంటారు. అలాగే వాహనాలు నడిచే పద్ధతిని Transmission, Cooling, Steering, Suspension ఇలా అనేక వ్యవస్థల్ని పరిశీలిస్తూ అవగతం చేసుకుంటారు. అలాగే కాల్పనిక సృజన శరీరాన్ని పైన చెప్పిన మానసిక వ్యవస్థల వంటివి ఎన్నింటినో గుర్తించి, వాటి స్వరూపాన్నీ, స్వభావాన్నీ, కావ్య శరీరంలో వాటి పాత్రలనూ ఒక్కొక్కటీ విడి విడిగా పరిశీలించి, ఆ పైన అవన్నీ కలసి కావ్యపు ఆత్మను – అంటే The Gestalt of a Poem అనే దాన్ని నిర్మించడంలో ఎలా సఫలమౌతున్నాయో, లేదూ విఫలమౌతున్నాయో ప్రతి ఒక్క కవితనూ, కధనూ పరీక్ష చేసి మనందరం మనకు మనంగా నిర్ధారణ చేసుకొనే అవకాశం ఉంది. కావ్య వ్యవస్థల అవగాహన కేవలం లక్షణ చర్చకే కాదు, సారస్వతంలో స్త్రీవాదం, దళిత వాదం, మార్క్సిజం, ప్రాంతీయవాదం వంటి ఎన్నెన్నో రకాల అవగాహనల ఆవశ్యకతను, వాటి పాత్రను, పరిమితుల్నీ అవగతం చేసుకోడానికీ, వాటి అభివ్యక్తిని సృజనాత్మకంగా నిర్వహించుకొనే వీలుగా తమవైన లక్షణ సిద్ధాంతాల్ని నిర్మించుకొనే తోవలను వెదుక్కోడానికి కూడా తప్పనిసరిగా అవసరం అవుతుంది. నాలుక, రుచీ పనిచేసే పనిని అర్ధం చేసుకోవడం అనే పనికీ, పంజాబీ, ఆంధ్ర, తమిళ్, మళయాళీ ఇలాంటి రకరకాల వంట పద్ధతులకూ పరస్పరం ఎలాంటి సంఘర్షణా లేదు కదా! అలాగే సృజన వ్యవస్థ అవగాహనకూ దాన్ని అనువర్తించి – అంటే apply చేసుకొని నెరపే రక రకాల ప్రక్రియలకూ మధ్య సంఘర్షణ అక్కర్లేదు.

13

ప్రాచ్య, పాశ్చాత్య సంప్రదాయాల్లో సాధారణమైన, ఋజువైన తర్కానికి బద్ధం కాలేని అనుభవాలు ఉంటాయన్న అంగీకారం ఉంది. కళ, సృజనల అనుభవం ఇలాంటి అనుభవాల్లో కేవలం ఒక్కటి మాత్రమే. సాధారణంగా మనుషులందరికీ పరిచితమైనవి వాత్సల్యం, ప్రేమ, మోహం వంటివి కూడా ఈ కోవలోకే వస్తాయి. నేను ఈ మధ్య ఒక స్నేహితుల ఇంటికి వెళ్ళేను. వాళ్ళకి రెండేళ్ళ బాబు. వాడు నాన్న ఎత్తుకొని తిప్పుతుంటే, ముద్దు ముద్దుగా చాలా కబుర్లు చెప్తున్నాడు వాడి భాషలోన. అది ముచ్చటగా ఉంది గాని ఒక్క ముక్కా నాకు అర్ధం కావటం లేదు. కాని ఆ చిలక పలుకులు విని వాళ్ళ అమ్మ, నాన్న చాలా సంబరం పడుతూ వాడికి బదులిస్తున్నారు – ఇలాగ:

బాబు: దుఆ. దుఆ దుఆ …!
నాన్న: దుఆ వా?
బాబు: ఊం! దుఆ…! అచ్చీచేలు…!!
నాన్న: ధృవా ఒచ్చీసేడా? ఏడీ ..? ఎక్కడున్నాడు?
బాబు: అక్కున్నాలు!

నిజానికి ధృవ అక్కడ లేడు. వాడు ఉట్టుట్టికే ఇగటాలాడుతున్నాడు. ఆ బాబు కల్పనకు తనదైన తర్కం ఉంది. అది వాడి రెండేళ్ళ జీవితానుభవం లోంచి వచ్చింది. వాళ్ళమ్మ, నాన్న ఆ అనుభవాలు పంచుకున్నారు. వాళ్ళకి వాడి కల్పనంతా పరిచితంగాను, చాల సంబరంగానూ ఉన్నాది. అది చూసి చూసి నెమ్మదిగా నాకూ వాళ్ళ కల్పన అర్ధం కాసాగింది. ఆ తరవాత వారం ఒక విమానంలో నా పక్కన ఒక రెండేళ్ళ పాప, వాళ్ళమ్మ కూర్చున్నారు. వాళ్ళు Irish వాళ్ళు. అందరం బండి దిగుతుంటే ఆ పాప అంటున్నాది:

పాప: దుఆ. దుఆ దుఆ …!
అమ్మ: (సంబరంగా) Yes Sweetie! Du ..A…! Daddy is at the Du .. A!

వీళ్ళ భాషలో దుఆ అంటే Door. విమానం గుమ్మం దిగితే వాళ్ళ నాన్న ఉన్నాడు అని ఆ పాప కేరింతలు కొడుతోంది. ఈ పాప, బాబు ఇద్దరూ ఒకే మాటను వాడినా, వాళ్ళ భాషలకు, తర్కానికీ ప్రాతిపదిక వాళ్ళవే వ్యక్తిగతము, ఆంతరంగికమైన జీవితానుభవాలు. నాబోటివాడికి అవి అర్ధం చేసుకోవాలన్న ఆసక్తి ఉంటే వాళ్ళ భాషతో ప్రారంభిస్తే నిరాశ కలుగుతుంది. కోపం కూడా వస్తుంది. ‘దుఆ దుఆ ఏంటి అర్ధం పర్ధం లేకుండా?’ అని. ఇందుకు భిన్నంగా, ఈ మొత్తం చర్చలోన భాష కేవలం సంకేతప్రాయంగా ఉందనీ, ఈ పాప, ఆ బాబు, వాళ్ళ అమ్మా నాన్నలు ఆ చిలక పలుకులు గంటల తరబడి వింటూ కూడా అవి మాటల కంటె చాల గహనము, విస్తారము, వాత్సల్యపూరితమైన అనుభవానికి కేవలం సూచనలు మాత్రమని అర్ధం చేసుకున్నారనీ ఒప్పుకోగలిగితే వాళ్ళ సంబరంలో నేను కూడా పాలుపంచుకోగలను.

ఈ చిలక పలుకులు పలుకుతున్న వాళ్ళు మరీ పసిపిల్లలు. పైన వ్యక్తిత్వం (self) అని చెప్పుకున్నది మనందరికీ ఈ పాప, బాబుల్లాగే పసి మనస్సుగా ప్రారభమయ్యి జాంతవ, సాంస్కృతిక, రాజకీయపరమైన రక రకాల అనుభవాలు, శిక్షణ (Learning) వలన విశాలమై, మన వ్యక్తిత్వాన్ని – అంటే Adult personalityని నిర్దేశిస్తుంది. ఇదివరకే చెప్పుకున్నట్టు సృజన అనుభవం జీవితానుభవం లాగే ముందుగా జాంతవమైనది, ఆ పైన సాంస్కృతికమైన అనుభవం. రాజకీయం, ఆర్ధిక వాస్తవాలు అప్పటి – అంటే కవి, పాఠకుల సమకాలీన సంస్కృతిలోన భాగాలు. అంచేత, సృజనను అర్ధం చేసుకోవాలంటే ఈ చెప్పిన వ్యవస్థలన్నింటినీ ఈ క్రమంలో అర్ధం చేసుకోవాలి. దీన్ని ముందుగా, మౌలికంగా ఆంతరంగికమైన స్ఫురణ అనుభవపు మూలాలతో – అంటే Cognitive Fundamentalsతో ప్రారంభించాలి. సృజన అనుభవానికి రూపకం ఇలాంటి మౌలికమైన ప్రాతిపదిక. ఉదాహరణకు వంటల్లో, భోజనాల్లో రక రకాల పద్ధతులు, సిద్ధాంతాలున్నాయి. కొన్ని సంస్కృతుల్లో లొట్టలు వేసుకుంటూ తినే వంటలు ఇంకొన్ని సంస్కృతుల వాళ్ళకి వెగటుగా ఉంటాయి. కాని అందరు భోంచేసేదీ, రుచిని అనుభవించేది ఒక్కలాంటి నాలుకతోనే. ఒక సంస్కృతిలో నిషిద్ధం, అసహ్యమైన పదార్ధాలు – కుక్క మాంసం, పిల్లి మాంసం వంటివి, ఇంకొక సంస్కృతిలో కమ్మని పిండివంటలకి ముడి సరుకులు అవుతున్నాయి. ఎంచేత? వండేవాడి జిహ్వ, తినేవాడి జిహ్వ – ఈ రెండూ మనుషులందరికీ ఒక్కటే నాలుక. చారిత్రకము, నైసర్గికమైన కారణాలవలన ఒక్కో సంస్కృతీ కొన్ని రకాల దినుసుల్ని స్వీకరించి వంటలని, భోజనాన్నీ నిర్ణయించుకున్నాయి. కాని ఈ అన్నిరకాల భోజనాల ఆస్వాదన మౌలికంగా నాలుగైదు రుచులమీదనే ఆధారపడి ఉంది. జీవ శాస్త్రజ్ఞులు నాలుక గ్రహించగలిగే రుచులు నాలుగు రకాలేనని నిర్ధారించేరు; ఇవి తీపి, పులుపు, ఉప్పన, చేదు. ఇటీవల వీటికి కమ్మదనం (Umami) అని ఇంకొకటి జతచేసి మౌలికమైన రుచులు ఐదు అన్నారు. కారం (వఱ్ఱ) మౌలికమైన రుచుల్లోకి రాదు; అదొక ఉపరుచి (Flavor). అలాగే చిత్ర విచిత్రమైన దృశ్య ప్రపంచాన్నీ, దృశ్య ప్రధానమైన కళలన్నిట్నీ మనిషి కన్ను కేవలం మూడు రంగులే ప్రాతిపదికలుగా అనుభవిస్తున్నాది.

కాల్పనిక సృజన అనుభవానికి కూడా ఇలాంటి మౌలికమైన ఉపకరణాల వ్యవస్థ ఒకటి ఉంది. వీటిలో కావ్య శరీరానికి మొదటిది, ముఖ్యమైనదీ రూపకం (Metaphor), కావ్యాత్మకు మౌలికమైనది ఔద్వేగిక ఆవరణం లేదా స్థితి (Emotional climate or Mood). ఇవి కాక మిగిలిన వ్యవస్థలు అనేకం ఉన్నాయి కాని సృజన పనిచేసే పద్ధతికి – అంటే Mechanicsకు ప్రాణప్రదమైనవి ఈ రెండూ. కాల్పనిక సృజన అనుభవంలో రూపకపు స్వరూపాన్నీ, వివిధ రూపాల్నీ విడమర్చిచి చెప్తూ బిపిన్, ఇతరులూ చేసిన వివేచన ఇంగ్లీష్‌లో ఉంది.

ఇవి వివరించే ముందు మళ్ళీ ఒకసారి కొన్ని జాగ్రత్తలు చెప్పుకోవాలని ఉంది. ఇక్కడ నాణ్యమైనవని నేను ఎత్తిరాస్తూ వస్తున్న సృజనకారుల ఉదాహరణలు కేవలం నా అభిరుచిని మాత్రం సూచిస్తున్నాయి. ఇవి తమకు కూడా నచ్చే రచనలేనని ఇంకెవరైనా ఆమోదించేసే ముందు రెండు అవసరమౌతాయి. ఒకటి: అలా అనుకుంటున్నవాళ్ళు ఆసక్తి ఉన్నట్టయితేనే స్వయంగా ఆ కధల్ని, కవితనీ చదివి, మళ్ళీ చదివి తమ అనుభవాన్ని నేను ప్రకటించినదానితో పోల్చి చూసుకోవచ్చు. రెండు: ముందుగా మంచివని అంటున్నవాడు – అంటే కనక ప్రసాద్ – అవి ఎందుకు, ఏ కారణాల వలన నచ్చుకుంటున్నాడో వివరంగా చెప్పితీరాలి; ఆసక్తి ఉంటే. ఈ రెండో పని చెయ్యటానికి ముందు నాదైన లక్షణ సిద్ధాంతాన్ని ఒకటి నిర్మించి, ప్రకటించుకోవాలి. ఈ పని ముందు పూర్తికానిదే నాకు ఫలానావి నచ్చేయీ నచ్చలేదూ అని నిర్ధారించడానికి ఏ ప్రాతిపదికా సంతృప్తికరంగా ఉండదు. ఇలాంటి సిద్ధాంతం ఒకటి కట్టడమంటూ అయితే అది నా ఒక్కడికే కాదు, సృజనను అనుభవించే వాళ్ళందరి అనుభవానికీ వర్తిస్తుంది. అంటే – అభిరుచి వ్యక్తిగతమైనది; ఇందుకు భిన్నంగా లక్షణ సిద్ధాంతం అది చేసిన కాలంలో మాత్రం సార్వజనీనమైనది. దురదృష్టవశాత్తు అది సర్వకాలీనమైనది కాలేదు. ఎందుకంటే ప్రవర్తన, అంతరంగం, సామాజిక పరిస్థితులూ – ఇలా సృజన అనుభవాన్ని ప్రభావితం చేసేవన్నీ కాలంతో, తరాలు మారేకొద్దీ మారిపోయి కొత్తవి పనిముట్లు అందుబాటులోకొస్తాయి. అందుకే ప్రతీ తరం తమ లక్షణ సిద్ధాంతాన్ని మళ్ళీ ఎత్తిరాసుకోవాలి. వ్యక్తిగతమైన అభిరుచిని ప్రకటించడాన్ని గురించి లక్షణకారులు ఇంకా ఏమంటారంటే ‘ప్రశస్తమైనవని చెప్పినవాటికి భిన్నంగా నేను ఎత్తి చూపని కవితలు, కధలూ కూడా ఎన్నో ఉంటాయి. నేను కనీసం వాటిలో ఆసక్తికరమని నాకు అనిపించే వాటినైనా తప్పకుండా పరామర్శించి, అవి ఎందుకు, ఎక్కడెక్కడ, ఏ కారణాలవలన నాకు నచ్చలేదో కూడా వివరించవలసి ఉంటుంది’ అని. ఈ పని విస్తారంగా చెయ్యటం విమర్శకుల పని. ఉదాహరణల కోసం తప్ప, అంతకు మించి విమర్శ మీద నాకు ఆసక్తి లేదు. అయిష్టం. నా మనస్తత్వం తీరు ఇలాగ.

<ఇంకా ఉంది>


రచయిత కనకప్రసాద్ గురించి:

కవి, కథకుడు కనకప్రసాద్ ‘ఎక్కడెక్కడ తిరిగేవు నాయనా’ వంటి భావోద్వేగభరితమైన కవితలు, ‘బర్సాత్‌ మే బిల్లి’ వంటి కథనాలతో సాహిత్య వేదికలపై గుర్తింపు పొందారు. వీరి రచనలు సాధారణ కన్నడ/తెలుగు భాషా శైలిలో ఉంటాయి.

 ...