ఈమాట » భోగి తలంట్లు

Expand to right
Expand to left

భోగి తలంట్లు

వంటింట్లో మా అమ్మమ్మ అప్పటికే రెండు పెద్ద కుంపట్లు రాజేసి వంట మొదలు పెట్టేసేది. అమ్మ కాఫీ కలపడం కోసం కిరసనాయిల్ స్టవ్ అంటించే పనిలో వుండేది. ఇక్కడ మా అన్నలిద్దరూ వొంటికి నూనంటించుకుని, ఎంచక్కా కబుర్లలో కెళ్ళి పోయేవారు. అంతా సవ్యంగానే జరుగుతున్న దనుకుంటున్న సమయంలో వాళ్ళిద్దరి మధ్య వాదులాట మొదలయ్యేది. గుప్పిళ్ళు బిగించుకుని, మోచేతులు ముడిచి ‘నా కండలు గొప్పవంటే కాదు నా కండలు గొప్పవని’ ప్రగల్భాలు పోయే వాళ్ళు. నిజానికి ఇద్దరికీ కండలుండేవి కావు. అలా వారి వాగ్యుధ్ధం పెరిగి ఒకరితో ఒకరు కలియబడి విష్ణు చక్రాల్లా, కిందపడి భూచక్రాల్లా తిరుగుతూ మండుతున్న కట్టెపుల్లల దగ్గరికి పోయే వాళ్ళు. అప్పుడు, సరిగ్గా అప్పుడు ఫ్రంట్ పేజ్ బానర్ న్యూస్ దొరికినంత వేగంగా అమ్మ చెవిలో ఈ వార్తనూదేసే దాన్ని.

వినంగానే ఆవిడ తాగుతున్న కాఫీ గ్లాసుని అక్క డ పడేసి ఉన్న పళాన వచ్చేది. వెంఠనే కోపం, ఆవేశం పొంగు కొచ్చేవేమో, పళ్ళు బిగించి మూల పడున్న ఓ పొడుగాటి పుల్లని చేత పట్టుకుని, “పండగ పూట తిట్టటమెందుకూ, కొట్టడమెందుకనుకుంటే, ఉహు! మీరు ఇలా ఎందుకు వింటారు. నాలుగు తగిలించాల్సిందే,” అంటూ వాళ్ళ మీదకు దాడి చేయబోయేది. అమ్మకి కాదు కాని, దెబ్బలు పడతాయేమోనని భయంతో, దొడ్డి తలుపు గడియ తీసుకుని పారిపోయే వాళ్ళు. ఆవిడ రెచ్చిపోయి వెంట పడేది. ఆ వెనకే ( కెమెరా కన్నేసుకుని) నేనూ.

అక్కడ వాళ్ళ కథాకళి చూసి తీరాల్సిందే. పాపం అమ్మ తన ప్రయత్నలోపం లేకుండా పరుగులు తీసేదే కానీ, ఆవిడ వల్లేమవుతుందనీ! అట్నుంచి లోపలకొచ్చి, పెరటి గది తలుపు గడియేసి రొప్పుతూ నించునేది. వాళ్ళూ అంతే. పళ్ళన్నీ బయట పెట్టి, డొక్కలెగిరేలా రొప్పుకుంటూ ఎదురెదురుగా నిలబడేవాళ్ళూ. నాకూ, అమ్మమ్మకి టెన్షనేసేది. ఆ నూనె వంటి మీద వాతలు ఖాయం అని. ఇంతలో అమ్మమ్మ చెప్పేది, ‘పండగ పూట ఏం అనొద్దులే. ఆ తర్వాత నువ్వే బాధ పడతావ్. వూరుకో,” అంటూ. అమ్మ కదా, చల్లబడి పోయేది. చేతిలో ఈత బరికెని మూలకు విసిరేసేది. తనని తాను సంబాళించుకుని, తిట్లు కాని తిట్లు తిట్టి, వాళ్ళ మాడు మీద నూనె అద్ది, ఇంత ఆయుష్షు, అంత ఆయుష్షు, మార్కండేయుడంత ఆయుష్షు అంటూ దీవించి, వీపుకి నూనె రాసి, మిగిలిన నూనె వొంటికి ఇగర రాసుకోమని చెప్పి, మరో పన్లో కెళ్ళేది. ఓ గంట తర్వాతొచ్చి, నలుగులు పెట్టేది. ఆ తర్వాత, ఇద్దర్నీ పక్క పక్కనే కూర్చోబెట్టి కుంకుడుకాయ రసంతో తలంట్లు పోసేది. కాగుల్లోంచి పొగలు కక్కే నీళ్ళని బకెట్లలోకి దిమ్మరించి, పాళాలు చేసి, తలమీంచి చెంబుల కొద్దీ వేడి నీళ్ళని గుమ్మరించేది.

తరవాత నేను.

ఈ పెరటి గది వెనకానుకుని వున్న స్నానాల గదిలోకి అన్నీ చేరేసుకోవాలి. కుంకుళ్ళ డబ్బా, సున్ని పిండి డబ్బా, నూనె గిన్నె, నలుగు పిండి కలుపునే గిన్నె, పొడి పిండి కోసం మరో గిన్నె, సబ్బు పెట్టె, వొళ్ళు తుడుచుకునేందుకొక టర్కీ టవల్, తలకు చుట్టుకునేందుకొక పలచని నేత వస్త్రం - ఇవన్నీ నేను స్వయంగా చేరేసుకోవాల్సిన సరంజామా! వేడి నీళ్ళ బకెట్, చల్ల నీళ్ళ బకెట్లు చేరేస్తూ అమ్మ. మరో క్షణంలో తలంటికి సిద్ధం అనుకునే లోపు అమ్మమ్మ కేకేసేది. హారతి పట్టించి తీసికెళ్ళు అంటూ.

పండగలప్పుడు తలంటికి ముందు ఆడపిల్లకి హారతిచ్చి తలంటి పోయడం మా ఇంట్లో ఓ పద్ధతిగా వుండేది. నాకిప్పటికీ ఈ పధ్ధతి అంటే ఎంతో ముచ్చటగా వుంటుంది. తూర్పు వైపు ముఖం పెట్టుకుని కూర్చునే దాన్ని. అలా మా అమ్మ నాకు బొట్టు పెట్టి, కుడి చేతి వేళ్ళని నూనె లో ముంచి ‘అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా…’ అంటూ మూడు సార్లు తలమీద అద్దేది. ఆ పైన అమ్మమ్మ. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరూ కలిసి ఓ మంగళ హారతి పాడి, కళ్ళకి హారతద్ది, అక్షింతలు జల్లేవారు. కాగానే అమ్మ మూడు నేతి గిన్నెల నూనె మాడు మీదకి చేర్చేది.

కళ్ళల్లోకి నూనె పడకుండా కళ్ళు మూసుకుని కూర్చున్న నాకు మా అమ్మమ్మ మాటలు వినిపించేవి. “ఇదంతా బాగానే వుంటుంది కాని, దీనికి నీ చాయ రాలేదే, కమలా?!” అంటూ. కర్ణ కఠోరంగా వున్న ఆవిడ మాటలకు ఉన్న పళాన ఒక కన్ను తీక్షణంగా తెరుచుకునేది. అమ్మ మాత్రం నవ్వి, “అదేమిటే అమ్మా! అలా అంటావ్. నా తల్లికేం తక్కువా. మంచి కళ గలది కాదూ, అంతా వాళ్ళ నాన్న పోలిక. అదృష్టవంతురాలవుతుంది,” అనేది. అంతే. ఆటోమాటిక్‌గా కన్ను మూసుకునేది. కనుబొమలు మాత్రం కాస్తంత పైకి కదిలేవి.

అలా తలకీ, వొంటికీ నూనె పట్టించి అరగంట ఆరనిచ్చి, కచ్చూరాలేసి మర పట్టించిన పెసల పిండిలో వేడి వేడి నీళ్ళు పోసి ముద్దచేసి, చర్మానికంతా పట్టించిన తర్వాత అది ఆరుతుంటే వెన్ను లోంచి చలి పుట్టేది. పచ్చి పోకుండానే పొడి పిండితో నలుగు కార్యక్రమం మొదలయ్యేది. ఆ తర్వాత, మరగ కాగిన నీళ్ళల్లో నానేసిన కుంకుళ్ళ గిన్నెలో కాసిన్ని మందార రేకులు, మరిన్ని ముద్ద మందారాకులు వేసి పిసికి, చిక్కటి రసంతో తల రుద్దేది అమ్మ.

“ఆ జుట్టు పని నీ వొక్క దాని వల్లేమవుతుంది?, వుండు. నేనొస్తున్నా..” అంటూ మా అమ్మమ్మ వచ్చి, రసం పోస్తుంటే అమ్మ తల రుద్దేది.

నాలుగు కాగుల మరగ కాగిన నీళ్ళకు మరన్ని కాగుల చల్ల నీళ్ళు కలిసి ఎన్ని కాగుల, కాదు, వాగుల నీళ్ళయ్యేవో అవి. ఈ నాటికీ నాకు లెక్క తేలదు. తలకి పిడపతో ఇంట్లోకి అడుగు పెట్టగానే, ఎవ్వరూ తుమ్మకుండా నుదుట్న అమ్మవారి కుంకాన్ని బొట్టుగా దిద్దుకుని, పట్టు పరికిణి కట్టుకుని, కాళ్ళకు పసుపు రాయించుకుని, అది అంటకుండా కుచ్చిళ్ళు పైకి పట్టుకుని, మడమల మీద నడుచుకుంటూ నీరెండకి తల పెట్టుకుని వాకిట్లో కూర్చునే దాన్ని కుర్చీలో, సాంబ్రాణి పొగ వాసనలు పీలుస్తూ. తలంటుకున్న స్త్రీలు జుట్టు విరబోసుకుని ఆర బెట్టుకోకూడదట. అమ్మ చెప్పింది. అందుకే చెవుల పక్కనుంచి సన్నటి పాయలు తీసి జడ అల్లి ఆ ఈతచాప జడని పరుచుకున్న జుత్తులో కలిపి, కొసలకి ఎర్ర రిబ్బన్ కట్టి, కుచ్చు పెట్టేది.

ఇంతలో మా అన్నలు గుడినించి చెట్టపట్టా లేసుకొచ్చేవాళ్లు. ఇంతకుముందు మల్ల యుద్ధాలు చేసిందీ వీరిద్దరేనా, అనిపించేది. “ఏమిటే, తలంటైపోయిందా? ఐతే ప్రసాదం తిను.” అంటూ బాదమాకులోంచి నాలుగు పులిహోర మెతుకులు తీసి నా నోట్లో వేసే వాళ్ళు. గుళ్ళో ప్రసాదం ఇంటికి తీసుకు రావాలనీ, అది అందరికీ పంచాలని అమ్మ నేర్పిన పాఠం ఈరోజు వరకూ పాటిస్తునే వున్నాం.

అమ్మ తలంటుకోడం కూడా పూర్తయినట్టుంది. పట్టు చీరల పెట్టె తెరుస్తున్న శబ్దం వచ్చేది. ముక్కుపొడుం రంగు కంచి పట్టుచీరలో ధగధగ మంటూండేది అమ్మ. ఆవిడ క్షణమైనా ఆలస్యం చేసేది కాదు. చక చకా, టేబుళ్ళు, బల్లలు, పెట్టెలు, స్టూల్స్ అన్నీ మెట్లుగా చేసేది. వాటిపైన పట్టు వస్త్రాన్ని పరిచేది. బొమ్మల కొలువుకి అందరమూ సిద్ధమై పోయే వాళ్ళం. మగపిల్లలు అట్ట పెట్టెలు తెరిచి, జాగ్రత్త గా బొమ్మల్ని తీసి అందించే వాళ్ళు. పై మెట్ల మీద బొమ్మలు తాను అమర్చేది. నాకు అందే మెట్టు నుంచి నా చేత బొమ్మల్ని పెట్టించేది. గంటలో బొమ్మలు కొలువైపోయేవి. చివరిగా కొత్త బొమ్మకు బొట్టెట్టి నా రెండు చేతులను పట్టుకుని శ్లోకం చదువుతూ అక్కడ కొలువుంచేది.

మా అమ్మమ్మ వంటింట్లోంచి మహా నైవేద్యం సిధ్ధమైందంటూ కేక వేసేది. పెరట్లో తులసి కోటకి దణ్ణం పెట్టుకుందామని వెళ్తూ ఆగి చూస్తే పెరటి గది - గంట క్రితం కురుక్షేత్రంలా వున్న ఆ ప్రదేశం ఇప్పుడెంత శుభ్రంగా వుండేదో! ఎడ తెరిపి లేకుండా మండిన ఆ రెండు పొయ్యిలు ఇప్పుడు ప్రశాంతంగా చల్లబడి పోయుండేవి. వాటి మీద రాగి కాగులు ఖాళీగా సగం వొరిగి కనిపిస్తుండేవి. మరో మూల తొట్టి నిండా కొత్త నీళ్లు కొసలకల్లా తేలుతుండేవి. చూద్దామన్నా ఒక్క కుంకుడు గింజ కనపడేది కాదక్కడ. నూనె మరకలూ ఉండేవి కావు. గచ్చంతా అద్దంలా మెరుస్తుండేది, తెల్లటి ముగ్గులతో.

ఆ సాయంత్రం భోగి పళ్ళ పేరంటాలెన్నుండేవో! అమ్మ నాకు జడ గంటలేసి, పచ్చని చేమంతి చెండు ఈ జడ మీంచి ఆ జడ మీదకి అర్థ చంద్రాకారపు వొంపు తేల్చి జడలల్లేది. పేరంటాలలో అందరూ నా జడల్ని చూసి మెచ్చుకుంటూంటే నా కంటే అమ్మకే ఎక్కువ ఆనందమేసేది.

వంటింట్లో భోజనాల సమయంలో గమనించేదాన్ని; నాన్నగారు, అమ్మ, అన్నయ్యలు, నేను, ఇలా అందరం పండగ స్పెషల్ బొమ్మలుగా కనిపించే వాళ్ళం. నాసికపు టంచులూ, చెవి కొసలు నిగనిగమంటూ నిగారిస్తూ, చెంపలు కోమలంగా మెరుస్తూ, చర్మం కొత్త కాంతులీనుతూ, మొత్తానికి కొత్త చింత పండేసి తోమిన దేవతా విగ్రహాలకు మల్లే అందర్లోనూ భోగి ‘పండగ తలంటి’ కళ కొట్టొచ్చినట్టు కనిపించేది.

ఇదంతా జరిగి ఎన్నేళ్ళై పోయిందీ! కాని, ఎప్పుడు తలుచుకున్నా పండగ పులకింతగా వుంటుంది మనసుకి! కళ్ళకద్దిన ఆనాటి హారతి వెలుగులు - మదిలో ఇంకా వెలుగుతూనే వున్నాయి ప్రకాశవంతంగా!

గుండె గడపకి ముద్దబంతుల తోరణాలు కట్టి పోయే పండగ - సంక్రాంతి! వెచ్చని హృదయ కాంతి!!

ముందరి పేజీ(లు) 1 2

రచయిత ఆర్. దమయంతి గురించి: పుట్టింది బందరు, స్థిరపడింది హైదరాబాదులో. ప్రస్తుత నివాసం - బెంగుళూరు. ఎం.ఏ సోషియాలజీ చదువుకున్న వీరు జర్నలిస్ట్ గా పని చేసారు. ఇప్పటి దాకా25 కవితలు, 50 పైగా కథలు రాసారు.ప్రస్తుతం ఒక సీరియల్ రాస్తున్నారు. "చదవడం, రాయడం రెండూ ఇష్టాలే. ఐతే, ఎక్కువగా ఇష్టపడేది మాత్రం మొదటిదే. సాహిత్య విలువల్ని ప్రేమిస్తాను. సంస్కారవంతుల్ని గౌరవిస్తాను." అంటున్నారు ఈ రచయిత్రి. ...

 

(10 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. మోహన అభిప్రాయం:

    January 3, 2012 6:10 pm

    బాగుంది మీ జ్ఞాపికలు. కథ కాకపోయినా చదువుతుంటే కథలాగా racyగా ఉంది. ఈ వాక్యాలు నన్ను నిజంగా నవ్వించాయి: మొత్తానికి కొత్త చింత పండేసి తోమిన దేవతా విగ్రహాలకు మల్లే అందర్లోనూ భోగి ‘పండగ తలంటి’ కళ కొట్టొచ్చినట్టు కనిపించేది. విధేయుడు - మోహన

  2. ఆర్.దమయంతి. అభిప్రాయం:

    January 3, 2012 9:51 pm

    అవునండి! నాకలాగే అనిపించే వారు. ఇల్లు దేవాలయం అయినప్పుడు అమ్మా నాన్నలు మరి దేవతలే కదా ! .. అందుకని అలా అన్నా. కథ చదివి, మీ అభిప్రాయాన్ని వ్యక్త పరచినందుకు - థాంక్సండి.
    మీకు నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ…
    నమస్సులతో-
    ఆర్.దమయంతి.

  3. Prakash అభిప్రాయం:

    January 25, 2012 6:01 pm

    chala bagundandi. idi andari intlonu vude manchi sandarbham. naaku ippudu anipistundi. maa generation lo vunde ilanti muchchatlu, maa pillalu miss avutunnaremo ani.

    [దయ చేసి తెలుగు లేదా ఇంగ్లీష్‌లోనే మీ అభిప్రాయాలు తెలపండి. తెంగ్లీష్ వాడకండి. తెలుగు లిపిలో ఎలా టైప్ చేయాలో e-పలక వెబ్ సైట్‌లో నేర్చుకోగలరు. - సం.]

  4. ఆర్.దమయంతి. అభిప్రాయం:

    February 2, 2012 6:39 am

    నిజానికి, అప్పుడే కాదు..ఇప్పుడూ మనం ఆ ముచ్చట్లు తీర్చుకోవచ్చు. కానీ, మనకంత తీరికా, ఓపికలతో బాటు, అంత ముచ్చట్లూ మురిపాలకు - టైం కూడా వుంటం లేదు. కారణాలు అనేకం. కానీ, కుటుంబపు ఆప్యాయతానుబంధాల్ని పెంచే ఈ పండగ సంస్కృతీ సాంప్రదాయాల సెంటిమెంట్స్ మాత్రం చాలా గాఢమైనవని నా నమ్మకం!
    అవునూ! మీ ఇంట్లో ఎలా వుండేది, ఈ సందడి?! వీలుంటే తెలియచేయండి. సరదాగా!
    అభినందనలతో-
    ఆర్.దమయంతి.

  5. danny అభిప్రాయం:

    February 11, 2012 1:38 pm

    చాలా చాలా బాగుంది. నేనైతే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి పోయాను.

  6. ఆర్.దమయంతి అభిప్రాయం:

    February 14, 2012 11:19 am

    నా రచన చదివి మీ స్పందనని తెలియ చేసినందుకు థాంక్సండి danny గారూ! .
    థాంక్యూ!!!
    శుభాకాంక్షలతో-
    ఆర్.దమయంతి.

  7. vishnuvandana అభిప్రాయం:

    February 17, 2012 11:20 am

    చాలా బాగుంది దమయంతి గారూ. ఏదో లోకంలోకి తీసికెళ్ళారు. మా చిన్నతనం దాదాపుగా అలాగే ఉండేది. ఆ తలంటి పోయటము, ఆ రాగి కాగులో వేడి నీళ్ళు కాగటమూ, కంట్లొ కుంకుడు రసము పడితే రాళ్ళౌప్పు నోట్లొ వెయ్యటము… పేరంటానికి నేనే వెళ్ళి పిలిచేదాన్ని. బొమ్మల పేరంటము, భోగీపళ్ళు పోయించుకోవటం, ఆ బంతిపూల రెక్కలు, చిల్లర పైసలు ఏరటము, పెద్దవాళు కోప్పడటము అంత జ్ఞాపకము చేసారు. ధన్యవాదములు చిన్నతనాన్ని జ్ఞాపకం చేసినందుకు.

    విష్ణు వందన.

  8. ఆర్.దమయంతి అభిప్రాయం:

    February 17, 2012 10:21 pm

    అవును. కుంకుడు రసం కంట్లో పోవడం..ఉప్పు రాయిని బుగ్గనుంచుకోడం… ఒక చేత్తో కన్ను మూసుకునే.. .అలా ఒంటి కన్నుతో ఇల్లంతా తిరగడం… ఆ కథంతా ఒక్కసారిగా గుర్తుకొచ్చింది, మీరన్నాక! ! మరుగైన మరో జ్ఞాపకాన్ని గుర్తుచేసినందుకు, థాంక్సండి, విష్ణు వందన గారూ! మీ పేరు బాగుంది! గుర్తుపెట్టుకునేలా..
    శుభాకాంక్షలతో-
    ఆర్.దమయంతి.

  9. raadha pantula అభిప్రాయం:

    April 26, 2012 8:27 am

    మీ వ్యాసం చాల బాగుంది. అమ్మ, మా విజయనగరం గుర్తొచ్చాయి. నన్ను నా బాల్యం లొకి తీసుకుని వెల్లినందుకు చాల కృతజ్ఞతలు.

    రాధ.

  10. ఆర్.దమయంతి అభిప్రాయం:

    April 27, 2012 3:22 am

    అంత రంగాన పరచు కున్న అంబరం
    ఆత్మలో ఆత్మగా వెలిగే కిరణం -
    వెన్నెంటి వచ్చే వెచ్చని జ్ఞాపకం - మాతృ హృదయం.
    ఇది సత్యం!
    మననుంచి అమ్మని విడదీయలేం.
    ఇక బాల్యం -
    చిత్ర వర్ణాల సజీవ చిత్రపటం
    కలల తీరాన -
    కరగిపోని కమనీయ దృశ్యం.
    ఆకాశానెగిరే రంగుల పతంగం
    తళుకులీను జ్ఞాపకాల నక్షత్రం - బాల్యం!
    నా వ్యాసం చదివాక, మీకు - మీ అమ్మగారు, వున్న వూరు గుర్తొచ్చాయంటే..
    నాకూ ఆనందమేసిందండి!
    అద్భుతమైన బాల్యాన్ని అందించిన నా తల్లి తండ్రులకు నేనేమిచ్చి ఋణం తీర్చుకో గలననిపిస్తుంది!..
    నా మనసంతా లాగేసుకున్న సంక్రాంతి మీద రచనలు ప్రచురించిన ఈమాట వారికీ - ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియచే సు కుంటున్నా…థాంక్యూ ఈమాట!
    మీ స్పందనని తెలియచేసినందుకు, రాధ గారూ! ధన్యవాదాలు.
    శుభాకాంక్షలతో-
    ఆర్.దమయంతి.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)
Autosuggest?

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a