కవిత్వంలో శ్రీశ్రీ ప్రస్థానం, పరిణామం
గ్రంధంలో ద్వితీయభాగంగా ఉన్న ప్రసిద్ధుల అనువాద కవితలలో - ఎక్కడ సత్యం, ఫిడేల్ కోసం పాట, పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉండటం వల్లనే గొప్పవాళ్ళు గొప్పవాళ్ళుగా ఉన్నారు, మిగిలిన వలయాలు, టర్కీ, మరేముంది మరణం తప్ప, గీతం నా మేజోళ్ళకు, పేదవాళ్ళ ఆగ్రహం, చిరుతిండి, సృజన, సమరధ్యానం, విరాజకీయ మేధావులు: వీటిలో - అతి సామాన్య అభ్యుదయ భావనలు కూడా అక్కడక్కడ ఉండీ లేనట్లుగా ఉన్నా, ఆనందింపజేసే పంక్తులు బహుశా లేనేలేవని చెప్పవచ్చు. ఉటంకించాలనే ఆర్తి కలిగించే పంక్తులు లేనే లేవు. కంఠవశం కావు. కంఠవశం చేసుకోవాలనే కోరిక కూడా కలుగదు. వీటిని కవితలనడానికి ఎంతటి వామపక్ష రససిద్ధాంత పక్షపాతమున్నవారికి కూడా ధైర్యం చాలదు. అసలు మొదట తేల్చుకోవాల్సిన విషయం: విప్లవాచరణకుద్యుక్తుల్ని చేసేది కవి రచన ద్వారానా? లేక ప్రజలలో కలిసి మెలిసి వారి కష్టసుఖాలలో పాలు పంచుకుని, వారిని ప్రసంగాల ద్వారానూ ముఖాముఖి సంభాషణల ద్వారానూ చైతన్యవంతులను చేసి వారి సమస్యలకు పరిష్కారమార్గాలుగా ఉద్యమాలు నడపటం, తిరుగుబాటు పంధాలను చూపించటం, చిత్తశుద్ధితో, నిజాయితీతో, నిబద్ధతతో వాటిలో పాల్గొని వాటిని నిర్వహించటం ద్వారానా? కవిత్వాల వల్ల విప్లవాలు రావడం, విప్లవాలవల్ల కవిత్వాలు రావడమంత సులభం కాదు. విప్లవాలు వస్తే, అవి జయిస్తే, ఆ కీర్తి పూర్తిగా వానిలో ప్రాణాలు తెగించి పోరాడిన విప్లవవీరులకే గానీ, మీరు పోరాడండి అని ఎంత గొప్ప కవిత్వాలు వ్రాసినా ఆ కవిత్వాలు వ్రాసే సోకాల్డు విప్లవకవులకు కాదు.
మరి కవిత్వానికి ప్రయోజనం, ప్రాధాన్యతలు లేవా? ఒకమేరకు తప్పనిసరిగా ఉన్నవి. ఒక మేరకు ఉన్నవి అంటే వాటికి పరిమితులు వున్నట్లుగా చెప్పటమే. కవిత్వం అతి ప్రధానమైన కళారూపం. దాని ప్రభావం ప్రత్యక్షంగా రసానందం కలిగించటం. పరోక్షంగా అది కలిగించే కొన్ని స్థిరమైన అభిప్రాయాలు కార్యాచరణపర్యవసాయి అవుతాయన్న నమ్మకంలేదు. ఈ మాటలు అన్నిరకాల కవిత్వాలకు వర్తిస్తాయి. మనకెంతో నీతిని ప్రబోధించే కవిత్వముంది. మనం దానిని చదివి ఆనందిస్తాం. కానీ మనందరం నీతిమంతులమయ్యామా? అలాగే నైతికత జీవిత వాస్తవికత అయ్యిందా? అలానే భక్తిని ప్రచారం చేసే కవిత్వంతో నిజమయిన భక్తులమయ్యామా? నిజమైన భక్తులు, నిజమైన నీతివంతులు, నిజమైన విప్లవకారులు కవిత్వం వ్రాయడం కేవలం యాదృచ్ఛికం. వారు కవులు కాబట్టి కూడా వ్రాశారు. అలానే భక్తిని ప్రబోధిస్తూ వ్రాస్తే భక్తులు, నీతిని ప్రబోధిస్తే నీతివంతులు, విప్లవాన్ని ప్రబోధిస్తే విప్లవకారులు తప్పనిసరిగా కానవసరం లేదు.
చలసాని ప్రసాద్‌గారు మహాప్రస్థానానికి ముందు మాటలో, “ప్రజానీకాన్ని విప్లవాచరణకుద్యుక్తుల్ని చేసే విధంగా ప్రభావితులని చేయాలంటే కవితారూపాలు గుర్తుపట్టలేనంత మారిపోవాలి. నిజానికి శ్రీశ్రీలో అలా మారిపోయాయి కూడా. మహాప్రస్థానంలోని భాషాప్రవాహం, శైలీ విన్యాసం, శబ్దశక్తిని కొలబద్దలుగా తీసుకుని ఈనాటి కవిత్వాన్ని కూడా కొలవాలని చూస్తున్నారు.” అంటారు. మహాప్రస్థానంలోని అతి ముఖ్యమైన, కవిత్వానికే అతి ముఖ్యమైన, భావావేశం, అనుభూతి సాంద్రతల గురించి మాట్లాడలేదు. అసలు మహాప్రస్థానంలో విప్లవ కవిత్వపు బీజాలు మాత్రమే ఉండి విప్లవకవిత్వం లేకపోవటమేమిటి? విప్లవకవిత్వం బీజరూపంలో వున్నదంటే చాలా కళాత్మకంగానూ, గొప్ప సజెస్టివ్ పవర్‌తో విప్లవకవిత్వం ఉందన్నమాట. సామాన్య ప్రజానీకాన్ని విప్లవాచరణ కుద్యుక్తులని చేసే విధంగా ప్రభావితుల్ని చేయడానికి విప్లవావశ్యకతను ప్రబోధిస్తూ మహాప్రస్థానంలో వాడిన కవితా రీతిని కొనసాగించటం ఎలా నిరర్ధకమవుతుంది? అంటే శ్రీశ్రీ మహాప్రస్థాన రచనాకాలానికి మరోప్రస్థాన రచనాకాలానికీ మధ్య ఉన్న కొద్ది కాలంలోనే అవుట్‌డేటెడ్ అయ్యారా? పాతబడి అక్కరకు రాకుండా పొయెట్రీ మ్యూజియంకు మహాప్రస్థానం వెళ్ళిపోయిందా? కవితా రూపాలు గుర్తు పట్టలేనంత ఎందుకు మారిపోవాలి? బాహిరమైన రూపంలో నామమాత్రమైన తేడాలున్నా అది కలిగించవలసిన స్పందనలలో గుణాత్మకమైన మార్పు ఎందుకుండాలి? ఉండదు. ఉండకూడదు కూడాను. తేలిగ్గా వ్రాస్తూ, అందంగా వ్రాస్తూ ఉత్తేజం కలిగించలేరా? కమ్యూనికేషనే ప్రధానమైతే కవిత్వాన్ని ఆశ్రయించవలసిన అవసరం ఏముంది? కవిత్వం యొక్క ప్రధాన లక్షణం రంజింప జేయటమని ఖడ్గసృష్టి లోని ‘కవితాప్రయోజనం’ ఖండికలో కేవలం శ్రీశ్రీ, ఆరుద్ర లాంటి మేధావులు, మార్క్సిస్ట్ రస సిద్ధాంతకారులే ఈ క్రింది విధంగా సంవాదరూపంలో అన్న మాటలని పోగు చేస్తున్నాను.
ఆరుద్ర: ఎవరూ చెప్పంది చెప్పటం, ఇలా చెప్పి మెప్పించడం అదేనన్నమాట కవిత్వమంటే.
శ్రీశ్రీ: రుచీ, ఔచిత్యం ఇవీ ముఖ్యం మెప్పుకి/ అందుకే అసలైన కవిత్వం ఏకకాలంలో పండితపామర జనరంజకం ఎవరో అనగా విన్నాను.
ఆరుద్ర: ఏమిటి చెప్పడం ఎలా చెప్పడం/ అనేవి రెండూ రెండు చక్రాలు. చెవికింపుగా వినసొంపుగా కవి పలకడం ఖచ్చితంగా ఖాయం.
శ్రీశ్రీ: మెదడూ, హృదయం మిళితమయే గుణం/ అదే కావ్యానికి ఏకైక లక్షణం.
ఆరుద్ర: కావాలి కవిత హృదయానికి నరిష్మెంట్/ కారాదు ఏనాడు మెదడుకి పనిష్మెంట్.
శ్రీశ్రీ: ఎక్సలెంట్ ఆరుద్రా నీ స్టేట్‌మెంట్. రంజనం కలిగిస్తాడు/ సందేశం వినిపిస్తాడు.
ఆరుద్ర: రంజింపజేస్తూ సందేశమిచ్చేదే మహాకావ్యం.
శ్రీశ్రీ: ఛందస్సుల అశ్వహృదయం తెలియనివాడు/ సవారీకి తయారు కాకూడదు.
కవితాశక్తి కలిగిన వ్యక్తి యొక్క సహజస్వభావం లోంచి వచ్చిన ఆవేశం కవితగా ఆవిర్భవించే తీరుకు, నిబద్ధత తోనో, అనిబద్ధత తోనో ఒక సిద్ధాంతాన్ని నమ్మి దానికనుగుణంగా వ్రాయాలనే సంకల్పంలో వ్రాసే కవితకూ చాలా తేడా ఉంటుంది. రెండవ రకానికి చెందినది పత్రికా ప్రకటనకు కొంచెం అటు, ఇటుగా వుండేవి. మరుసటి రోజుకు మరచిపోయేది. మొదటి రకమైనది జీవితాంతం గుర్తుంచుకోవాలనే తపన కలిగించేదీ, గుర్తుంచుకోగలిగేది.
కవితాప్రయోజనం ఖండికలో శ్రీశ్రీ, ఆరుద్ర కవిత్వాన్ని గురించి చెప్పిన అతి ముఖ్యమైన విషయం పాఠకుడిని రంజింపజేయడం, రంజింపజేస్తూ సందేశాన్నివ్వడం. ఈ సందేశం కూడా కవితాస్వాదన లోనే అంతర్లీనమై పాఠకుడి అంతరంగంలోకి ప్రవేశించడం జరిగితే అది ఎక్కువ శక్తిమంతంగా ఉంటుంది. పాఠకుడి స్వభావం లోనే గుణాత్మకమైన మార్పు తెస్తుంది. 1968లో మొదట సారిగా సాహిత్యాభిలాష ఉన్న ఒక మిత్రుడు అక్కడక్కడా చదవగా విన్నాను ఖడ్గసృష్టి లోని ‘ఏవి తల్లీ’ లోని పంక్తులు. మార్క్సిస్ట్ సిద్ధాంతాలు, అభ్యుదయ భావాలుగా భావించేవేవీ అందులో లేవు. కానీ శ్రీశ్రీ ఎంత గొప్ప కవిత వ్రాశారు? ఆద్యంతం ఆకట్టుకుని, ఆనందం కలిగిస్తూ, మన ప్రాచీన వైభవాన్ని దానికి తగిన మహోదాత్తమైన శైలిలో, రీతిలో ఎంత రమ్యంగా కొనసాగిస్తారు! జీవితాంతం మర్చిపోలేని కవిత!
చక్రవర్తి అశోకుడెక్కడ/ జగద్గురు శంకరుండెక్కడ
ఏవితల్లీ నిరుడు కురిసిన/ హిమసమూహములు
కాళిదాస మహా కవీంద్రుని/ కవన వాహినిలో కరంగిన
ఉజ్జయని నేడెక్కడమ్మా/ ఉంది చూపించు
షాజహాన్ అంతఃపురంలో/ షట్పదీశింజానమెక్కడ
ఝాన్సిలక్ష్మీ దేవి యెక్కిన/ సైంధవం నేడేది తల్లీ ?
రుద్రమాంబా భద్రకాళీ/ లోచనోజ్వలరోచులేవీ
ఖడ్గతిక్కన కదన కాహళ/ కహకహధ్వనులెక్కడమ్మా?
ఎక్కడమ్మా కృష్ణరాయని/ బాహుజాగ్రద్బాడబాగ్నులు ?
బాలచంద్రుని బ్రహ్మనాయుని/ ప్రాణవాయువులేవి తల్లీ ?
జగద్గురువులు చక్రవర్తులు/ సత్కవీశులు సైన్యనాధులు
మానవతులగు మహా రాజ్ఞులు కానరారేమీ ?
పసిడిరెక్కలు విసరి కాలం/ పారిపోయిన జాడలేవీ
ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు?
పైనుదహరించినది శ్రీశ్రీ గేయాల్లోకల్లా అపురూపమైన జాతి వజ్రం. దీని మహోజ్వలమైన తేజోవలయానికి కేంద్రబిందువు “పసిడిరెక్కలు విసరి కాలం పారిపోయిన జాడలేవీ” అన్న పంక్తి. ఇలాంటి పంక్తులు ఎంత గొప్ప కవులైనా చాలా అరుదుగానే వ్రాయగలుగుతారు.
శ్రీశ్రీ కవితాప్రస్థానం మహాప్రస్థానంగా జరిగింది, సాగింది మహాప్రస్థానం లోనే. డైడాక్టిసిజానికి చోటివ్వని సాంద్రమైన అనుభూతులు భూమికగా ఉన్న కవితలే మరువలేని కవితలుగా మిగిలిపోయేవి. మార్క్సిస్ట్ సిద్ధాంతం అబ్సెషన్ అయ్యాక శ్రీశ్రీ వ్రాసిన కవితలు అతి స్వల్పసంఖ్యలో ఏవో కొన్ని మినహాయించి హృదయాన్ని తాకలేనివి. దాదాపు రీడబిలిటీ కూడా లేనివి. తత్ఫలితంగా ఆయన కవితాప్రస్థానం అవరోహణక్రమంలో దిగజారింది. పరిణామం విపరిమాణం అయింది. అయినా ఆయనకొచ్చిన లోటు లేదు. చాలా గొప్ప కవిగా ఆయనకు శాశ్వత స్థానం ‘మహాప్రస్థానం’ కల్పించడం జరగనే జరిగింది.
ఇప్పుడు చెప్పబోయే సంగతి శ్రీశ్రీపై వ్రాసిన వ్యాసంలో భాగం కాదు. దానికి ఎడెండంగా ఉండటానికి తగనిది కూడా కాదు, శ్రీశ్రీ వ్యక్తిత్వం లోని ఒక పార్శ్వాన్ని కొంత ప్రతిఫలింపజేస్తుంది కనుక మాత్రమే ఇక్కడ చెప్పదలచుకున్నాను. శ్రీశ్రీ దంపతులకు ఆతిధ్యం ఇచ్చే అవకాశం మాకు కలిగింది. చాలా సంతోషం వేసింది. శ్రీశ్రీ తప్పనిసరిగా సెలబ్రిటీయే. కాలేజీ ఏ.సి. గెస్ట్‌హౌస్‌లో వారి విడిది. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో భోజనానంతరం దాదాపు ఇరవైమంది లెక్చరర్లం వారిని కాలేజీలోని అశోక వృక్షాల మధ్య సోడియం లైట్ల కాంతిలో కలిశాం. ఆనాడు నాకనిపించింది ఆయన మృదుభాషి, స్మితభాషి, మితభాషి అని. మహాప్రస్థానం కవితలన్నిటిలోకి ‘నిజంగానే’ చాలా గొప్ప కవిత అని నాకనిపిస్తుందని నేనన్నాను. చిరునవ్వుతో చిన్నగా అన్నారు దానిమీద విమర్శ ఉందని. ఆ ప్రశ్నార్ధకాలు “పాడుకాలం లయిస్తుందా? మంచికాలం రహిస్తుందా? సాధుతత్వం జయిస్తుందా?” లాంటివి అవి విజయవంతంగా నిజమవడంపై తనకు అనుమానమున్నట్లు ధ్వనింపజేస్తాయని. “అదెలా అవుతుంది, ఈ స్నెయిల్ పేస్‌లో ప్రజలు ఉద్యమించటంపై మీ అసహనాన్ని ప్రకటిస్తాయి, మీరు వాటిద్వారా ఉద్యమస్ఫూర్తి, వేగిరవతావశ్యకతను కోరుతున్నారనుకోవాలి గాని,” అన్నాను. నవ్వి ఊరుకున్నారు.
తర్వాత నేనడిగాను: మీకింత పేరొచ్చింది, మీకింత ఫాలోయింగ్ ఉంది. మిమ్మలను అభిమానించే సామాన్య జనం, సాహితీ పరులు కోకొల్లలుగా దేశంలో ఉన్నారు. మిమ్మలను ఒక మహాకవిగా ఒక మహామనీషిగా చూసే వాండ్లు లెక్కకు మిక్కుటంగా ఉన్నారు. ఈలోకం, ఈ సంఘం మీ యెడల ఇంత ప్రేమ, గౌరవాలు చూపించాయి. మీ మరణసమయంలో వీరందరినీ వదలి పోతున్నందుకు మీకేమనిపిస్తుంది అని. చెరగని చిరునవ్వుతోనే అన్నారు: “ప్రత్యేకంగా అనిపించటమేముంది? అది సహజమైన టెర్మినేషన్ కదా”. నేను మరలా అన్నాను, “మీరొస్తున్నారని మేమెంతో హడావుడి చేశాం. మీ స్టే సుఖప్రదంగా ఉండేందుకు వీలున్న అన్ని ఏర్పాట్లు చేశాం. మిమ్మలను ఒక మహా వ్యక్తిగా భావించి ఇంతమందిమి వచ్చి మీరు చెప్పేది వినడం కోసం ఇంత ఉత్సాహంతో, గౌరవంతో మీతో గడిపాం. రేపు ఉదయం మీ అవసరాలన్నీ చూసి గౌరవంగా మీకు వీడ్కోలు పలుకుతాం. మమ్మలను వదలి మీరు వెళ్ళేందుకు కారు ఎక్కేప్పుడు మీకేమీ అనిపించదా?” అని.
వారే మన్నారో నాకు గుర్తులేదు, చెరగని చిరునవ్వు మాత్రం గుర్తుంది.
k s hareesh kumar అభిప్రాయం:
January 10, 2012 11:06 am
రావు గారు వ్రాసినది నిజము. Sri Sri కవిత ప్రస్థానము మహా ప్రస్థానముతొనె ఆగిపొయినది. I fully agree with the views of Sri Rao. We do not know much about his earlier works. So therefore, it can be safely concluded that other than Mahaprasthanam, there is vacuum pre- Mahaprasthanam and Post -Mahaprasthanam. It’s a great analaysis by Rao. It would have been useful for the readers had he analyzed the reasons for which Sri Sri could not or did not produce anything worth after Mahaprasthanam. I have read about the life journey of Sri Sri from various angles and the reasons for such a vacuum in my opinion are as under: (of course, everyone of us knew about it-but for recapitulation).
Sri Sri had struggled to make his both ends meet. Except for showering empty praises on him by the people, nothing has been done by any one to come to his rescue. He was being called as a Mahakavi when he was in terrible penury. If he were not born as a Telugu, probably he would have lived a dignified life. So, it is purely because of our Telugus that we could not get any thing more than Mahaprasthanam from Sri Sri. We have to blame ourselves for that. So, in the melee, he had lost himself and could not produce any literature that is worth. Sri Sri lived from hand to mouth before entering cinema field. He could make money on entering cinema industry but lost his poetic glory and had to confine himself to routine cinema stuff and involve himself in nitty gritty of film making. In the process, he had alienated himself from main stream poetry and has become a part-time poet.
The other reason for the downfall of Sri Sri was his staunch belief in Communism/Marxism etc., He thought them to be panacea for all problems. But, I believe, he was not a practicing communist. This conflict also added to his confusion. Mahaprasthanam had become a great work since it was an outcome of his heart felt feelings whereas Post-Mahaprasthanam, he was being identified as a Communist and not as a Poet. So, he stooped to the level of a communist from poet and therefore he did not contribute anything thereafter.
This is my opinion. I would request the author Mr.Rao himself to evaluate the reasons for his degeneration as a poet.
మోహన అభిప్రాయం:
January 10, 2012 12:05 pm
శ్రీశ్రీపైన ఈమాట ప్రత్యేక సంచికను ఇక్కడ చదువగలరు. విధేయుడు - మోహన