కవిత్వంలో శ్రీశ్రీ ప్రస్థానం, పరిణామం

శ్రీశ్రీ ఈ విధమైన ఈస్తటిక్ ప్రభావాలకు లోనై కవితాసౌందర్య భావనలకు, సుందరాత్మక కవిత్వావిర్భావతత్వానికి వ్యతిరేకంగా రియాక్షనరీగా తయారై తనలోని సహజమైన కవితాశక్తిని బలహీనపరచుకున్నారు. ఎక్కడో తన మనసులో ఒక చోట తనకు కవిగా ఎంతపేరు వచ్చిందో తనకు తెలుసు కాబట్టి ఇక తాను ఏమి వ్రాసినా కవిత్వంగా చెల్లుబాటవుతుందనే అపోహకు గురయ్యారు. పైపెచ్చు మార్క్సిస్ట్ భావనల అండ ఉండనే ఉంది. మార్క్సిస్ట్ భావనలు ఏ మాత్రం లేని కవితలలో కూడా ఒక నిర్లక్ష్య రచనా వైఖరి చాలాచోట్ల ‘ఖడ్గసృష్టి’లో, ‘మరోప్రస్థానం’లో కనిపిస్తవి. శ్రీ శ్రీ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా రచనా సామర్ధ్యం లేకుండా రచనా కండూతి ఉన్నవాండ్ల మీద పడి, దోపిడీనో, పెత్తందారీతనాన్నో నిరసిస్తూ, బూర్జువా లాంటి పడికట్టు పదాలను వాడుతూ, ఆకలి, అనారోగ్యం లాంటి వస్తువిశేషాల మీద ఇష్టమొచ్చినట్లు వ్రాసి కవిత్వంగా చదువరులను భ్రమింపజేయాలనే తహతహలో ఒక వ్యర్ధమైన వర్గం తయారయింది. దీనికి తోడు ఆయన పేరడీలు, ప్రాసక్రీడలు, లిమరిక్కుల జిమ్మిక్కులు తోడైనాయి. దీనినే వేటూరి, శ్రీశ్రీ మరణించినపుడు నివాళులర్పిస్తూ చేసిన రచన ‘చిరంజీవి శ్రీ శ్రీ’ (పునర్ముద్రణ ప్రజాసాహితి,జూన్ 2010) లో చూస్తాం: “అతడి పేరడీ, ప్రాసక్రీడలు, లిమరిక్కులు, పలుకుల జిమ్మిక్కులు ఎందరినో కవులను జేసి కాగితాలను కౌలుకిచ్చాయి.” పైన పేర్కొన్నబడిన సామర్ధ్యం, నిబద్ధత లేని వర్గం మీద వేటూరి ఈసడింపు ఈ వ్యాఖ్యలో స్పష్టంగా తెలుస్తుంది.

మహాప్రస్థానంలోని కవితలతో సరితూగగలిగిన కవితలు ఆయన ఇతర సంకలనాలలో చాలా అరుదుగా కనిపిస్తవి. నీరసమయిన రచనలు, శుష్కవచనప్రాయమైన కవితలు మాత్రమే ‘ఖడ్గసృష్టి’ ‘మరోప్రస్థానం’ సంకలనాలలో అత్యధికంగా కనిపిస్తవి. స్టేట్‌మెంట్స్ స్థాయిని దాటలేకపోయిన వాటిని ఎక్కువగా చూస్తాం. ‘ఖడ్గసృష్టి’లో ఖడ్గసృష్టి, శరశ్చంద్రిక, విషాదాంధ్ర, సదసత్సంశయం, మహాసంకలనం ఈ కవితల శీర్షికలన్నీ ఎంత అందమైన సంస్కృతపదబంధాలో చూడండి. కానీ అన్నీ ప్రొజాయిక్ రచనలే.

“మానవుడే నా సంగీతం/ మానవుడే నా సందేశం” – ఇది ఒక ప్రొజాయిక్ స్టేట్మెంట్. ఒక స్లోగన్ గా బాగా పనికివస్తుంది.

‘శరశ్చంద్రిక’లో – “ఎవడో చెబితే వినేరోజులు/ ఏనాడో వెళ్ళిపోయాయి/ ఇంకా ఏదో చెప్పాలని/ఎందుకీ ఉబలాటం.” – ఇది సుభాషితంగా బావుంది. కవిత్వంగా మాత్రం కాదు.

“వెళ్ళు జాబిల్లీ వెళ్ళు/ వినిర్మలమైన వెన్నెలని కురిపిస్తూ/ మనోహరమైన సంగీతం వినిపిస్తూ ప్రయాణించు/ శశీ ప్రయాణించు.” – ఏది కవిత్వం దీనిలో?

‘విషాదాంధ్ర’లో – “కొంగల్లారా జపం చెయ్యండి /పిల్లీ పఠించు మంత్రాలు/ ఎలుకల్లారా సభ జరపండి/ఎవరు గంటకట్టాలని?” – దీని గురించి చెప్పేదేముంది!

సామాన్యుని కామన, రుబాయత్, బొమ్మలాంతరు, ఆఖరిమాట, మొదటిమాట, విదూషకుని ఆత్మహత్య -వీటిలో అభ్యుదయమేది? కొంటెకోణాలలో ఎందుకంత ఫ్లిప్పన్సీ? అలానే ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ.

‘నగరంలో వృషభం’ ఎంత ప్రొజాయిక్!

‘వెండి పండుగ’లో – “ఈ స్వాతంత్ర్యంలో/ బాగుపడిన వాళ్ళు పదిమంది/ బాధలు పడుతున్న వాళ్ళు పదివేలమంది/ ఈబాధల స్వభావాన్ని/ బహిరంగపరచటమే ఈ నాటి కవుల ఏకైక కర్తవ్యం.” – దీనిలో కర్తవ్య బోధ ఉంది. కవిత్వం లేదు. ఈ కర్తవ్యాన్ని నిర్వహించడానికి కవిత్వం ఎందుకు? నిబద్ధత కలిగిన కార్యకర్తలుంటే చాలు. పిశాచి, శ్రీశ్రీ మార్కు పద్యాలనే వాడుడు, అవలీలగా’లలో అభ్యుదయం ఎక్కడుంది? విప్లవోన్ముఖులను జేసే విప్లవావేశం ఎక్కడుంది? ‘స్త్రీస్త్రీ’ లో ఎందుకంత ఫ్లిప్పన్సీ? ‘తులంవృశ్చికం’లో కేవలం తమాషా ఉంది.

కప్పవైద్యుడు, సీనూ-భానూ పిల్లల కవితలు. ఓ మహాత్మా ఓ మహర్షీ’ శరపరంపరలుగా సాగిన ప్రశ్నలు. ఆఖరున ఉన్న జవాబు కవితా మయంగా ఉంది. బావుంది.

“నిన్న స్వప్నం ,నేటి సత్యం/ నేటి ఖేదం,రేపు రాగం
ఒకే కాంతి ఒకే శాంతి/ ఓ మహర్షీ ,ఓ మహాత్మా”

‘అధివాస్తవికుల ప్రవేశం’ చందోపద్ధతిలో ఉంది.వదిలేసిన పద్య రచన మరలా ఎందుకు?

దాదాపు అన్ని ఖండికలూ ప్రొజాయిక్ రచనలు. ‘దీర్ఘాలు’ అడ్డదిడ్డంగా ప్రింట్ చేయటం జిమ్మిక్కుగా తోస్తుంది. ‘యువకవిత’లో వచనానికీ, కవనానికీ సరిహద్దులు చెరిగి పోయినాయంటే ఇక కవనం, వచనం అనే రెండు మాటలెందుకూ? విశ్వమానవాళి గురించే ఆలోచించే శ్రీశ్రీ ‘జగానికంతా సౌఖ్యం నిండగ’ అనే శ్రీశ్రీ ‘ఆంధ్రదేశంలో’ అంతటి ఆంధ్రాభిమానం ప్రదర్శిస్తే ఆశ్చర్యం వేస్తుంది.అది సైద్ధాంతిక వైరుధ్యం కాదు. కానీ ఆ పంక్తులు చక్కగా ఆకట్టుకుంటాయి.

“నీ దేహపు దుర్గం నేనై/ నా బాహువు ఖడ్గం నీవై
పరాంకోటి జనబాహుళ్యం/ చలాయించు రధ సౌరభ్యం
సమరంగా సముజ్వలిస్తే/ ప్రళయంగా పరిప్లవిస్తే
నిశాంధ్యముల నిర్మూలిస్తాం/ మహాంధ్రమని తీర్మానిస్తాం”

‘జన్మదినోత్సవం’లో మన పతాకంలో ‘అజ్ఞానం,అనారోగ్యం,నిరుద్యోగం కనబడతా’యన్నారు శ్రీశ్రీ . కానీ ‘సఖ్యం’లొ హిందీ, చీనీ భాయీ భాయీ అనడాన్ని మెచ్చుకుంటూ ఇరుదేశాల పతాకాల గురించి అంటారు:

“అవిచ్ఛిన్నమై అప్రతిహతమై
సాగిన చరిత్ర మనదేశాలవి.
సజీవ నాగరికతా పతాకం
ఎగరేస్తున్నవి ఈ దేశాలే”

ఎలా అర్ధం చేసుకోవాలి ఈ వైరుధ్యాలను? మహాప్రస్థానంలో అభ్యుదయకవిత్వం, విప్లవబీజాలు ఉన్నాయి. విప్లవసాహిత్యం లేదు అని ఆ తరువాత వచ్చిన ఖడ్గసృష్టి, మరోప్రస్థానం నిండా విప్లవసాహిత్యం ఉన్నట్లు మనల భ్రమింపజేస్తారు. వారి మాటల ప్రకారం చూసినా విప్లవసాహిత్యం ఎక్కడో తప్ప కానరాదు. అనువాద కవితలతో నిండిన తక్కిన గ్రంధభాగం (ఖడ్గసృష్టి) చాలా వచనంగా ఉండి రీడబిలిటీ లేకుండా ఉంటుంది. అభ్యుదయభావాలు కూడా పెద్దగా కానరావు. పుష్కిన్ కవిత ‘చలికాలపు ఉదయం’లో ఆఖరి మూడు పంక్తులు ఆకర్షణీయంగా ఉంటవి. కానీ అవి అభ్యుదయకవితా పంక్తులు కావు; అది ప్రణయ కవిత్వపు చరణం.

“ఎవరూ లేని ఎవరూ రాని పొలాలలో తిరుగుదాం
ఆకులు శూన్యమైన అరణ్యాల కరుగుదాం
నాకెంతొ సుఖమిచ్చే నది వొడ్డుకి కదులుదాం”

మయకోవ్‌స్కీ ‘గృహోన్ముఖంగా’లో అదేమి కవిత్వమో ఇలా ఉంటుంది:

“ప్రజారాజ్య మహా యంత్రంలో
ప్రత్యేకంగా నా చోట నిలబడి నేను
‘ఏమండోయ్ బాగున్నారా?’ అని నేను పలకరించను
పగలగొట్టటం నా కుశలప్రశ్న”

వాల్ట్ విట్మన్ ‘కామ్రెడ్’లో:

“అన్నింటినీ ఎదిరిస్తాను, శాంతినీ,క్షేమాన్నీ, చట్టాలను
కట్టుదిట్టాలను వాటిని ధిక్కరించటమే నా పని
అందరూ నాకెంత దూరమైతే అంత బిర్రబిగుస్తాను
అందరూ నాతొ ఏకీభవిస్తే ఇంత పట్టుదల నాకుండేది కాదేమో”

వీటిని చదవటం, కవిత్వంగా భావించటం సాధ్యమా?

కవితానువాదం ఎవరో చిన్నవాళ్ళు చేయవలసిన పని. మహాప్రస్థాన కవీశ్వరులు కాదు. ‘చేపలరాత్రి పాట’ అక్షర రహితమైన ఆ సరళరేఖలు, అర్ధచంద్రాకృతులు నాకసలు బోధపడలేదు. ఏదో మిస్టీరియస్ హైరోగ్లఫిక్స్ లాగా, పెద్ద బ్రెయిన్ టీజర్ లాగా ఉంది. ఏమిటి దాని అందం, దాని సందేశం? ఎందుకంత జిమ్మిక్కుల యెడ ఫాన్సీ? అభ్యుదయ, విప్లవ సందేశాలను ఏ ఎడారులకు వదలివేసినట్లు?

చలసాని ప్రసాద్‌గారు మరోప్రస్థానానికి ముందుమాట వ్రాస్తూ ఆశ బెట్టిన “నక్సల్బరీ నిప్పురవ్వలు, శ్రీకాకుళం విప్లవాగ్నులు, పీడితజనుల పోరాటాల పాటలు, విప్లవయోధుల బలిదానాల బాటలు, వెలుతురు బావుటాలు, మంటల చేత మాట్లాడించి/ రక్తం చేత రాగాలాపన చేయించిన సందర్భాలు” ఈ గ్రంధంలో చాలా చాలా అరుదుగా కనిపిస్తవి. విప్లవసాహిత్యం లేకపోయినా శాశ్వతంగా నిలచిపోయే గ్రంధం మహాప్రస్థానం మాత్రమే.ఈ సంకలనంలో కవితాకళ పరంగానూ, విప్లవచైతన్య ప్రేరకంగానూ చాలా మంచి చరణాలు ఉన్నది మరోప్రస్థానం లోని మొదటి కవిత.

“యిప్లవం యాడుందిరా/ఆడనే నీ కూడుందిరా,నీ గూడుందిరా
…యిప్లవమ్యేమందిరా/ మనిసికొకటే సావందిరా
కట్లుతెంచుకు రమ్మందిరా/ కత్తి దూసుకలెమ్మందిరా
యిప్లవం నీ దమ్మందిరా
యెర్రెర్రని రగతాల/ యేరుల్లో ఈదరా”

కదిలించే చరణాలు, ఎప్పటికీ గుర్తుండే చరణాలు.

మహాప్రస్థాన కవితలతో పోల్చడానికి వీలు లేకపోయినా అక్కడక్కడ మంచి చరణాలు కల కవితలు – తుదిపయనం, తొలివిజయం, కదలిరండి నవభారత నారీమణులారా, భూమ్యాకాశాలు, దూది, పులి మీద పుట్ర, ఓ మహాత్మా ఓ మహర్షీ, ఉగాది గీతి, పెద్దపండుగ, ఝంఝ. చాలా కవితలు వచనప్రాయంగా ఉండి, ఏ మాత్రం గుర్తు వుండకుండా ఉంటవి. ఉదాహరణకు: రాక్షస ఉగాది, మట్టిపులి, మనీషి, అరరే దమ్మిడీ, ఇప్పుడే ఇక్కడే కలగాపులగం (దీనిలో ఆఖరి రెండు లైన్లు పైన ఉండి వాటి ముందున్న లైన్లు ఆఖరి లైన్లుగా ఉంటే బావుండేది), ఉగాది గీతం, రావోయ్ నవకవీ, స్వకీయపురాణం, బాలలవత్సరం, ఉగాది స్వాగతాలు, మనమే సైన్యంగా మారిపోదాం, మెల్లమెల్లగా – జోరుజోరుగా, దైవప్రార్ధన, పంచరత్నాలు, సాధారణ ఉగాది పచ్చడి, సుప్రభాతం, ఎవరిది అహింస.