ఈమాట » ఆగవే రజనీ! విభావరి!

Expand to right
Expand to left

ఆగవే రజనీ! విభావరి!

పల్లవి:
ఆగవే రజనీ! విభావరి!
అనుపల్లవి:
సోగ కన్నుల సొగసు కాడు
సఖుడు రానే లేదు
ఆగవే రజనీ! విభావరి!
చరణం:
మసక మసకల సంజ కొసల
పొదల మాటున పెదవులద్ది
నడిమి రేయికి నదీ తటికి
వత్తుననెనే వ్రజకిశోరుడు
కదిలి పోదువె! వదిలి పోదువె!
నెచ్చెలివి గద విడిచి పోదువె
ఆగవే రజనీ! విభావరి!
చరణం:
నంద నందను డందగాడు
యెంతో జాలి గుండె వాడు
దారిలో ఏ దీనురాలినొ
ఆదుకొనుటలో ఆలస్య మాయెనొ
ఏమి చేతును ఎదురు చూతును
గడియ గడియగ గడిచి పోదువు
గడుసు దానివి ఆగవే
ఆగవే రజనీ! విభావరి!
చరణం:
విరిసిన వెన్నెలలో నడిచి
ముసిరిన చిరు చెమటలలో తడిసి
మోము నగవుతో మోహనుడు
నను జేరగనే
రాగ మాలికనై అతని ఎద నే జేరగనే
పులకరింతల పూల వల్లరిలొ చుట్టి
మము జలదరింతల
రాస ఝరిలో నెట్టి పోదువు
ఆగవే రజనీ! విభావరి!
చరణం:
రాకా శశి వదనవే
నీలాకాశ చికురవే
తళుకు తళుకుల తారలంచు
చీర గట్టిన సింగారివే
అందరికి తెలుసునే
నీ అందము
నా అందమో
ఒక బృందా విహారికే
ఆగవే రజనీ! విభావరి!

ఆగవే రజనీ! విభావరి!
సోగ కన్నుల సొగసు కాడు
స్వామి రానే లేదు

 

(5 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. మోహన అభిప్రాయం:

    January 5, 2012 10:18 am

    బాగుంది మీ ప్రయత్నము. మూడు, నాలుగు మాత్రల మిశ్రగతితో అందముగా ఆరంభించి మధ్యలో ఎందుకు నడక మార్చారు? బహుశా మీరు ఏదో మెట్టులో వ్రాసినారేమో? విధేయుడు - మోహన

  2. Parucuri Sreenivas అభిప్రాయం:

    January 5, 2012 1:32 pm

    కేవలం కుతూహలం కొద్దీ అడుగుతున్న ప్రశ్న. ఈ గేయరచనకీ బాలాంత్రపు రజనీకాంతరావు (రజని) గారు రాసిన “ఓ విభావరి ఓహో విభావరి” (సాలూరి రాజేశ్వరరావు గారు అద్భుతంగా పాడారు) అన్న పాటకి ఏమయినా సంబంధం, లేక స్ఫూర్తి పొందడంలాంటిది కానీ ఉందా!

    భవదీయుడు,
    – శ్రీనివాస్

  3. TahaTaha అభిప్రాయం:

    January 9, 2012 4:13 am

    మోహన గారికీ , శ్రీనివాస్ గారికీ నమస్కారాలు.

    మోహన గారూ - గోపిక మధ్యలో ఉద్విగ్న అయినట్టుంది కొంచెం అడుగులు అటూ, ఇటూ పడ్డాయి. మట్టు గురించి, ముందు నేను ‘ఆప్ కీ నజరోన్ నె సమ్ ఝా’ (అన్ పఢ్ ) మట్టుకు రాద్దా మనుకుని ‘ఆగవే రజనీ విభావరి ఎచటికే నీ పరుగులు” అని రాశాను ముందుకెళ్ళటం చేతకాలేదు. చివరికి అచ్చులో ఇలావచ్చి పెద్దల (మీ) దృష్టి కి వచ్చింది.

    శ్రీనివాస్ గారూ - రజని ” ఓ విభావరీ” ఒక గొప్ప పాట చిన్న తనం నుంచీ ఆ పాట చెవుల్లో మోగుతునే వుంది. ఈమధ్య కూడా రజని గొంతులో యూ ట్యూబ్ లో దొరుకుతున్న ఆయన పాట చాలా సార్లు విన్నాను. రజనీని విభావరినీ కలిపి ఒక పాట రాయాలనే కోర్కె అంతర్లీనంగా ఉన్న మాట నిజం. ‘రుక్ జా రాత్… ‘ (దిల్ ఏక్ మందిర్ ) పాట సాహిత్యం, ఎత్తుగడ గూడా కొంత స్పూర్తి .

    మీ
    తః తః

  4. మోహన అభిప్రాయం:

    January 10, 2012 3:06 pm

    మదన్మోహన్ సంగీత దర్శకత్వములో అన్‌పఢ్ చిత్రములోని ఆప్ కీ నజరోన్ నె సమ్ఝా నాకు నచ్చిన పాటలలో ఒకటి. మీరు చెప్పిన తరువాత నేను ఆ పాటను మళ్లీ వినే అవకాశం కలిగింది. ఆ పాటకు అదే మెట్టులో ఇంచుమించు అదే అర్థములో నా అనువాదాన్ని జత చేస్తున్నాను. తెలుగులో పాడుతూ ఆనందించండి-

    నీదు కన్నులు దెలిపె ప్రియ నా ప్రేమ నీ సంతసముగా
    ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా

    ఔను నీ సమ్మతి యది నాకు అతి ఆనందము
    చెప్పె చూపులు నిజముగా వందనమ్ముల దెలుపుచు
    నవ్వుతూ నా జీవితములో జేరితివిగద హాయిగా
    ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా

    నీకు గమ్యము నేనెగాదా నాకు గమ్యము నీవెగా
    నాకు లేదుగ భయము లేవియు నీవు పక్కన ఉండగా
    గాలివానకు తెలియజేయుడు నాకు ప్రియుడిట దొరికెగా
    ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా

    పడెగదా నా యెడదపైన నీదు నీడల మాయలే
    దిక్కుదిక్కుల మ్రోగెగా వంద నాదస్వరములే
    రెండు జగముల ముదము లన్నియు నేడె నాకే దొరికెగా
    ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా

    విధేయుడు - మోహన

  5. TahaTaha అభిప్రాయం:

    January 13, 2012 9:40 am

    ధన్య వాదాలు మోహన గారూ
    మిత్రుడు
    తఃతః

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)
Autosuggest?

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a