ఈమాట » మహాకవి తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యము’

Expand to right
Expand to left

మహాకవి తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యము’

ఆయుత నియుతుల కథ

తెలుగు భాషని సుసంపన్నం చేసిన మహానుభావుల్లో మహాకవి తెనాలి రామకృష్ణుడు ఒకడని నిస్సందేహంగా, నిర్ద్వందంగా చెప్పవచ్చును. ఆయుత - నియుతుల కథలోనుంచి మచ్చుకి రెండు పద్యాలు చూద్దాము. అగస్త్యమహర్షికి ఇద్దరు శిష్యులున్నారు. వారి పేర్లు: ఆయుతుడు, నియుతుడు. వాళ్ళు వేదాభ్యాసం ఎలా చేసేవారో చెబుతున్నాడు.

వాసోనిగ్రమెన్నరాఁకలియు నీర్వట్టున్ గణింపర్తలల్
మాసెంగా యన రంగముల్ బడలినన్ బాటింపరట్టుండనీ
యా సాయంబుగ నానిశాత్యయముగా నామ్నాయముల్ గ్రోల్చుచో
నాసీన ప్రచలాయితంబయిన లేదాహా వితర్కింపగన్

వాసస్ అంటే గుడ్డ. వాళ్ళు వేదాలు (ఆమ్నాయంబులు) అధ్యయనం చేసేటప్పుడు లేదా వల్లె వేసేటప్పుడు (గ్రోల్చుచోన్) వాళ్ళకి వొంటిమీద బట్టలు ఎలా వున్నాయో అనే ధ్యాస ఉండేది కాదట - అసలు ఉన్నాయా లేవా అనే స్పృహే ఉండేది కాదు; ఆకలియు, దప్పికయు (నీర్వట్టున్) లెక్క చేసేవారు కారట; జుత్తు బాగా పెరిగిపోయింది (తలల్ మాసెంగా) అనుకోరు - జడలు కట్టేస్తూన్న సరే ; అవయవాలు హూనం అయిపోయినా - అదే పనిగా కూర్చూడం వల్ల - పట్టించుకొనేవారు కారట; ఇవన్నీ అలా ఉండనీ - ఉదయం కూర్చుంటే సాయంకాలం అయ్యేవరకూ (ఆసాయంబుగన్) (ఆబాలగోపాలం, అసేతుహిమాచలం లాగ ఆసాయంబుగన్ అన్నాడు); రాత్రి కూర్చుంటే ఉదయం అయ్యేవరకు (ఆ + నిశః + అత్యయంబుగన్) కనీసం కూర్చుని కునుకిపాట్లు పడడం అనేది కూడా లేదే (అసీన ప్రచలాయితంబు అయినన్ లేదే) అహా చూడగా (వితర్కింపగన్). అంత శ్రద్ధగా చదువుకొనేవారట ఆ ఆయుత నియుతులు.

హుంకారములు లేవె యుప పురందర
         హఠోత్పాటనంబునకుఁ బాల్పడవుఁ గాక
భ్రూభంగములు లేవె యాభీల
         వింధ్య గర్వస్తంభనమునకు రావుఁగాక
చుళుకాకృతులు లేవె జలరాశి
         నిశ్శేష శోషణకుఁ జొరవు గాక
జాఠరాగ్నులు లేవె జటితాపి వాతాపి
         తనుదాహమున నెదుర్కొనవు గాక

నిష్ట నీ మాడ్కి లోక ప్రతిష్ఠ గుఱిఁచి
దుష్టనిగ్రహ శిష్ట సంతుష్టి హేతు
రోషభీషణ రేఖా నిరూఢ గాఢ
లీలఁ గ్రీడించు ప్రోడలు లేరుఁ గాక!

అగస్త్యుడు ఆయుత-నియుతులకోసం తగిన వధువుల్ని కుదర్చడంకోసం సాక్షాత్తు బ్రహ్మదేవుడి వద్దకే వెళ్ళాడు. బ్రహ్మ అగస్త్యుడికి అగ్రాసనమిచ్చి పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ సందర్భం లోనిది ఈ పద్యం.

లోకంలో ఎందరు హుంకరించడం లేదు? అవన్నీ ఇంద్రుడంతటివాణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసి హఠాత్తుగా క్రింద పడేలా చేస్తాయా? (నూఱు యజ్ఞాలు చేసిన నహుషుడు ఇంద్రపదవిలో ఉండగా శచీదేవిని మోహించి, తదుపరి మహర్షులని అవమానించిన సందర్భంలో అగస్త్యుడు హుంకరించగా - శపించగా - కొండచిలువ అయి భూలోకంలో వచ్చి పడ్డాడు).

చుళుకాకృతి అంటే పుడిసిలి పట్టడం - అంటే అరచేతిలో పట్టేటంతటి జలాన్ని స్వీకరించడం. లోకంలో ఎందరు పుడిసిళ్ళు పట్టడంలేదు? అవన్నీ అగస్త్యుడిలా సప్తసముద్రజలాల్నీ నిశ్శేషంగా త్రాగగలుగుతున్నాయా? (సముద్రంలో దాక్కొన్న కాలకేయులనే రాక్షసుల్ని బయట పడేయడం కోసం, అగస్త్యుడు సప్తసముద్రజలాలన్నిట్నీ పుక్కిట పుడిసిలి పట్టాడని ఐతిహాస్యం). అందరికీ ఆకలేస్తుంది, కానీ అందరూ అగస్త్యుడిలా వాతాపి లాటి మహా మంత్రశక్తులు కలిగిన రాక్షసుణ్ణి తిని హరాయించుకోగలుగుతారా?

ఇవన్నీ పేర్కొంటూ బ్రహ్మ అగస్త్యుడిని పొగుడుతున్నాడు. “మిత్రావరుణ కుమారా, ఓ అగస్త్యా! ఇలా నీవలె లోకకళ్యాణం కోసం దుష్ట శిక్షణ, శిష్ట సంతుష్టి కోరి రోషభీషణమైన పద్దతిలో క్రీడించే ప్రోడలు - ఇలాటి మహత్కార్యాల్ని క్రీడప్రాయంగా చేయగలిగే నేర్పరులు - లేరు గాక లేరు!

మంగళం

తెనాలిరామకృష్ణ మహాకవి గురించి ఆయన రచించిన కొన్ని ఆణిముత్యాల్లాటి పద్యాల్నీ, కవితా చమత్కారాల్ని మరికొంత మంది తెలుగు భాషాభిమానులతో పంచుకోవడమే ఈ చిరుప్రయత్నం. పాండురంగమాహాత్మ్యం అవతారికలో ఆయన ఇలా వ్రాసుకున్నాడు.

నను రామకృష్ణకవి గవి
జన సహకారావళీ వసంతోత్సవ సూ
క్తినిధి బిలిపించి యర్ధా
సనమున గూర్చుండ బనిచి చతురత ననియెన్

“కవులున్ బాఠకులున్ బ్రధానులు అలంకారజ్ఞులున్, ప్రాజ్ఞులున్” కొలువై ఉండగా నిండుసభలో విరూరి వేదాద్రి మంత్రి రామకృష్ణకవిని సగౌరవంగా పిలిపించి అర్ధాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ సందర్భంగా “కవిజన సహకారావళీ వసంతోత్సవ సూక్తినిధిని నేను” అని సగర్వంగా చెప్పుకున్నాడు రామకృష్ణుడు. కవిజనులు అనే మామిడితోపునకు వసంతోత్సవం కల్పించే సూక్తులకు నేను నిధిని అన్నాడు.

“సూక్తినిధి” అనే సమాసం నన్నయ్య తరవాత మళ్ళీ ఇక్కడే యథాతథంగా కనిపిస్తుంది. పాఠకహృదయాల్నే కాదు, కవిహృదయాల్ని కూడా ఆనందపరిచి చిగురింపచేసే సూక్తులకు నిధి ఆయన. సూక్తులు అంటే నీతి వాక్యాలు కావు. అలంకారమహితమైన ఉక్తులు. నన్నయ్యదగ్గరా ఇదే అర్థం. పరిపూర్ణ కవితామయోక్తులకు తాను నిధి కనుక కవి జనుల్ని పులకింప జెయ్యగలను అని ధీమాగా ప్రకటించాడు తెనాలి రామకృష్ణుడు. ఆయన కవులకు కవి. కవీనాం కవిః

ముందరి పేజీ(లు) 1 2 3 4 5 6 7 8
 

(5 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Rama అభిప్రాయం:

    January 3, 2012 5:45 am

    తెనాలి రాముని సూక్ష్మజీవితసంగ్రహం చాలా బాగుంది. కాశీపురవర్ణన కళ్ళకు గట్టినట్లుగ వుంది. వారకాంతల వర్ణన వారెవా!
    గాఢతపోనిధియైన అగస్త్యుని చూచి వింధ్యభూధరము..
    భూధరము అని పర్వతమునకు పర్యాయపదప్రయోగం ..
    రాజహంస, వేసవికాకకి ఓర్వలేక శిథిలమైన ఱెక్క చివర కలదియై చెరువు (పద్మిని) లో తామరాకు గొడుగు క్రింద (మిగతా చోటుకంటే అక్కడ ఇంకా ఎక్కువ చల్లగా వుంటుందిట) చేరిందిట. దవడ (తాలువు) నుండి జారుతున్న, కారుతున్న (స్రవత్) నురుగు సమూహముతో (ఫేనజాలమ్ముతో) పంది (ఘోణి) సమీపంలో (పంచల) బురదలో (రొంపి) పొర్లి (కలంచి) ఆడిందిట (యాడె). దూరం నుండి లేస్తున్న (దూర + ఉద్గమత్) దావాగ్ని పొగను (దావధూమ) మేఘమనుకొని (అంబుద బుద్ధిన్) నెమలి (నెమ్మి) - ఎండకు తాళలేక పొదలో ఎక్కడో లోపల దాక్కొని వున్నది, మెడ నిక్కించి చూసిందిట. కడుపులోపలనున్న (జఠరస్త) నీళ్ళను తొండంద్వారా (నాసా నాళమున) బయటకి పీల్చుకొని ఏనుగు తనమీద అటూ ఇటూ చల్లుకుందిట.
    అధ్భుత వివరణ..

    సురవేశ్యలు (అప్సరసలు)… ఇలా ప్రతిపదమును వివరంగా మెచ్చుకుంటూ పోతే యింకొక వ్యాసం అయిపోతుంది. చాలా రోజులతర్వాత ఇటువంటి వ్యాసం చదివే భాగ్యం కలిగించిన ఈమాట పత్రికకి ధన్యవాదములు..

  2. Arunachala అభిప్రాయం:

    January 3, 2012 10:23 pm

    పాండురంగ మాహాత్మ్యం కావ్యాన్ని నారికేళ పాకానికి ఉదహరిస్తారు. మీ వివరణ తో నారికేళ పానీయ రసమాధుర్యాన్ని చవి చూచాం. ధన్యవాదాలు స్వీకరించండి. ఒకచోట “మట్ట” మధ్యాహ్నం అనేది మిట్టమధ్యాహ్నం అనే పదానికి పర్యాయ పదం అయివుండవచ్చని చదివి నప్పుడు దాని వెనుక కూడ ఏదైనా రహస్యం దాగి ఉన్నదా అనే సందేహం కలిగింది. కారణం, తమిళం లో “మట్ట” అనే పదాన్ని “పట్ట పైన” అనే వాడుక విన్నాను. ఉదాహరణకి “మట్టమాడి” ( పైన ఏ అంతస్తులూ లేని మేడ పై భాగము) అనే పదం తరచుగ విన్నాను. ఈ సందర్భంలో “ఏ ఆచ్చాదనా లేని తలమీద మధ్యాహ్నపు సూర్యరశ్మి పడటం వల్ల కలిగిన తాపం” అనే అర్థం చెప్పుకోవచ్చా అనే సందేహం. దక్షిణాంధ్ర జిల్లాలలో ఈ జాతీయం “మట్ట” అనేది వాడుకలో ఉన్నదేమో తెలిసికొన గోరుతూ — అరుణాచల.

  3. Balantrapu Venkata Ramana అభిప్రాయం:

    January 5, 2012 2:08 pm

    రమ గారు, అరుణాచలగారు - చాలా చాలా కృతజ్ఞతాభివందనాలు. నా ఈ చిరు ప్రయత్నం మీకు నచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.

  4. Satyabhama Pappu అభిప్రాయం:

    April 9, 2012 11:37 am

    రమణ గారూ,

    ఎంతో హృదయంగమంగా సాగిందీ వ్యాసం. నారికేళ పాకాన్ని కదళీపాకం చేసి అందించారు. పుండరీకునికి లభించిన కృష్ణదర్శనం మాక్కూడా కళ్ళకు కట్టినట్టయ్యింది. పాండురంగ మహాత్మ్యం మీద ఇంకొన్ని వ్యాసాలు, అలాగే వసుచరిత్రను కూడా అందిస్తే ధన్యులమౌతాము.

    అగస్త్యుడు సప్తసముద్రాలను పుడిసిలి పట్టడం గురించి వ్రాసిన చోట ” లోకంలో ఎందరు పుడిసిళ్ళు పట్టడంలేదు? అవన్నీ అగస్త్యుడిలా సప్తసముద్రజలాల్నీ నిశ్శేషంగా త్రాగగలుగుతున్నాయా?” అని ఉంది. “వారంతా అగస్త్యుడిలా సప్తసముద్రజలాల్నీ నిశ్శేషంగా త్రాగగలుగుతున్నారా?” అని చిన్న సవరణ.

    ధన్యోస్మి
    సత్యభామ.

  5. lyla yerneni అభిప్రాయం:

    April 11, 2012 12:42 am

    “పుండరీకునికి లభించిన కృష్ణదర్శనం మాక్కూడా కళ్ళకు కట్టినట్టయ్యింది.”

    పాండురంగ మాహాత్మ్యం -తెలుగు సినిమా చూస్తే మొదటి సీనులొనే శివభక్తులై పోతారే!


    ఓం నమశ్శివాయః
    ఓం నమశ్శివాయః
    ఓం నమశ్శివాయః
    ఓం నమశ్శివాయః
    ఓం నమశ్శివాయః
    హర హర హర శంభో,
    శంభో!
    హిమగిరి శృంగవిహారీ
    ఉమానాథ శివ గంగాధారీ
    చంద్రచూడ చర్మాంబరధారీ
    ఈశ గిరీశ పురారీ
    శంభో!
    హర హర హర శంభో.
    శివ శివ అక్షయలింగా
    మహాలింగ స్మర గర్వవిభంగా
    భక్త శుభంకర కరుణాపాంగా
    త్రిశభ సురంగ సుభాంగా
    శంభో!
    హర హర హర శంభో
    శంభో! శంభో! శంభో!

    Loved the way this song is rendered. Not sure if I heard the lines starting with మహాలింగ and త్రిశభ correctly.
    సంగీతము, సాహిత్యము తెలిసిన వారు ఈ పాట విశేషాలు చెపుతారు కదా.

    Reading a book titled “Contrapuntal Technique - In The Sixteenth Century” by R.O. Morris.
    In the beginning of the chapter on Rhythm, Morris says - ” ..in the polyphonic music of sixteenth century a double system of accentuation is employed. The rhythmical accentuation of each individual part is free , that is to say, the accents do not occur at strictly regular intervals, where as the composition as a whole does conform to a fixed metrical scheme in which strong and weak accents succeed one another in a pre-determined order. This idea may seem difficult to grasp at first, but the student who gives it a few moments’ consideration will find that it is not really so unfamiliar as he may think. In the rhythm of poetry there is a precisely similar duality, as any one may quickly convince himself. Take the familiar opening of Milton’s paradise Lost: …)

    పై పాటను ఉదాహరణగా తీసుకుని, పై పేరాను కూడా విశదీకరించగలరా.

    USA residents -after you file your taxes, ofcourse. Enjoy!

    లైలా

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)
Autosuggest?

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a