మహాకవి తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యము’

నాదు సహోదరుండు సుజనస్తవనీయ నయ ప్రసక్తి బ్ర
హ్మాదుల మెచ్చఁడే నతని యజ్ఞమునం గడుఁ బూజ్యురాలనై
వేదియలంకరింతునని వేవురిలోపల నాడుకొందు నీ
వేదియు లేక సర్వగుణహీనుఁడ వౌట యెఱుంగఁ దమ్ముడా!

ఇక బాహాటంగా మందలించడం మొదలుపెట్టింది. “నేనేమో నా తమ్ముడు సుజనులందరూ మెచ్చుకుంటూ ఉండగా యజ్ఞం చేసి తనని అగ్రస్థానంలో కూర్చోపెట్టి గౌరవిస్తాడని అక్కడ పలుమందికీ సగర్వంగా చెప్పుకుంటూ ఉంటే, నువ్విలాగ ఏమీ లేకుండా గుణహీనుడవౌతా వనుకోలేదురా తమ్ముడా” అని వాపోయింది.

అక్కగారు ఇంత బోధించినా తమ్ముడు పెడచెవిన పెట్టాడు. ఆవిడ సొమ్ములతో సహా, ఇల్లంతా ఊడ్చి దోచుకొని ఉడాయించాడు. అతగాడు దొచుకుపోయిన వస్తువుల్ని ఈ చక్కటి పద్యంలో కవి చెబుతున్నాడు.

గోమేధికోపలాంకుర మానితంబులు
         పుష్యరాగచ్ఛటా పుంఖితములు
వైఢూర్య సంధాన వర్ణనీయంబులు
         హరినీల కీలనాభ్యంచితములు
కురవింద సందర్భ గురుతరంబులు చతు
         ర్విధ వజ్రదళ సమావేల్లితములు
మహనీయ తర హరిన్మణి పరీతంబులు
         నకలుష స్థూల మౌక్తిక యుతములు

పద్మరాగ పరీరంభ భాస్వరములు,
దంత విద్రుమకృత సముద్గక భృతములు
మాతృభూషలు నత్తికా మండనములు,
నిజయువతి దాల్చు సొమ్ములన్నియు హరించి

గోమేధిక ఉపల (మణుల యొక్క) అంకుర (మొలకలచే) మానితంబులు (కూర్చబడినవి); పుష్యరాగముల చ్ఛటా (గుంపులచేత) పుంఖితములు (పుంఖాను పుంఖలుగా చేయబడినవి); వైఢూర్యముల యొక్క సంధాన (కూర్పుచేత) వర్ణనీయంబులు (పొగడదగినవి); హరినీల (ఇంద్రనీలమణులయొక్క) కీలన (కూర్పుచేత) అభ్యంచితములు (ఒప్పిదమైనట్టివి); కురువింద మణుల; సందర్భ (కూర్పుచేత) గురుతరంబులు (గొప్పవైనట్టివి); రకరకాల వజ్ర దళ (రేకులతో) సమావేల్లితములు (బాగుగా ఆవరించిన ప్రకాశము కలవి); మహనీయతర (గొప్పవైన) హరిన్మణి (పచ్చలచే) పరీతంబులు (పొదగబడినవి); అకలుష (దోషము లేని) స్థూల మౌక్తిక (పెద్ద మంచి ముత్యాలతో; యుతములు (కూడినవి); పద్మరాగ మణులు, పరీరంభ (పొదుగుటచే) భాస్వరములు (వెలుగొందునట్టివి); దంతములతోనూ, విద్రుమ – పగడములతోనూ; కృత (చేయబడిన); సముద్గక (బరిణె లేక, మందసము – పెట్టెలో) భృతములు (ఉంచబడినవి); మాతృభూషలు (తల్లినగలు); అత్తికా మండనములు (అక్క నగలు); నిజ యువతి (తన భార్య) తాల్చు (ధరించు) సొమ్ములు – నగలు; అన్నియూ అపహరించి –

ఒకనాటి రాత్రి పడుకునే పడకకు కూడా చెప్పకుండా గాఢ తమోనికరము (చిమ్మ చీకట్ల సముదాయమే) తన తోడుగా ఒక్కడే పేరడవిత్రోవ (కారడవి దారి)లో పరిగెత్తుకుంటూ వెళ్ళాడట.

అడవిలో దొంగలు ఇతగాడిని చావబాది, ప్రాణావశిష్టంగా వదిలి అతని సొమ్మంతా దోచుకుపోయారు. ఆ దారిని పోతున్న కాపు ఒకడు దయతలచి అతడ్ని రక్షించి తన ఇంటికి తీసుకువెళ్ళి వైద్యం చేయించి బ్రతికించడమే కాకుండా సొంత కొడుకులా చూసుకొసాగాడు. ఈ కృతఘ్నుడు ఆ కాపు కోడల్ని లేవదీసుకు పోయి అడవిలో కాపురం పెట్టాడు. కొన్నాళ్ళకు ఆ కాపుస్త్రీ నిస్సంతుగా మరణించింది.

తదుపరి నిగమశర్మ వేరొకచోట రూపాజీవ (అందమే జీవనాధారంగా కలది – పడుపు వృత్తి చేసుకొనేది) అయిన ఒక ప్లవకన్యను (ఛండాలస్త్రీని) పెండ్లి యాడాడట. ఆ భార్యద్వారా పిల్లల్ని కూడా కన్నాడట. అడవికి వెళ్ళి వేటాడి మృగాలని చంపి తెచ్చేవాడట. ఆమెతో కలిసి కల్లు కూడా సేవించేవాడట. ఆ ప్రకారం ఆమెతో సంసారం సాగించాడు. ఒకనాడు అతడు యధాప్రకారం వేటాడి తిరిగి వెళ్ళేసరికి అతని ఇల్లంతా అగ్నికీలలచే ఆక్రమించబడి తగులబడి పోయింది. కల్లు మత్తులో ఉన్న అతని భార్యా పుత్రులు యావత్తూ ఆ మంటలకు ఆహుతి అయినారు.

ఈ కడజాతి నాతి కిహిహీ! మహిదేవుఁడు చిక్కెనంచు నన్
రాకకుఁ బోకకున్ జన పరంపర కెంపగు చూడ్కిఁ జూచి యం
బూకృతమాచరించుటకు బుద్ధి దలంకఁ గలంక ముక్త చం
ద్రాకృతిఁ బొల్చు నీ ముఖమునందమృత స్థితిఁ గాంచి మించుటన్

చనిపోయిన భార్య గురించి నిగమశర్మ దఃఖించిన పద్యం ఇది. ఇహిహీ అనడంలో వెక్కిరింత, నవ్వేవారి ఆక్షేపణ అంతా కనబడుతోంది. జనపరంపర – జన సమూహము. కెంపు అగు చూడ్కి – కెంపులా ఎర్రని చూపులతో – కోపానికి సూచన. అంబూకృతము – ఉమ్మి వేయుట. తలంకన్ – భయపడను. కలంక ముక్త చంద్రాకృతి – మచ్చ వదిలిపెట్టబడిన – మచ్చ లేని – చంద్రుని వలెనున్న నీ మొగమునందమృతముండుట చూచి. ఆ అమృతము అధరామృతము.

అలా దుఃఖించి, దుఃఖించి, నిర్భోజనుడై (భోజనము చేయనివాడై) నిరంబుభజనుండునై (నీరుత్రాగనివాడైన) ఆ కుజనుండు (ఆ దురాత్ముడు) పుండరీ క్షేత్రాన్ని చేరుకున్నాడు. మిక్కిలి పచేళిమమై (పరిపక్వమైనదై) తనను సమీపిస్తూన్న పూర్వ సంస్కార తపఃఫలము కారణంగా అతడు పాపసమూహములను నాశనం చేసేదైనట్టి సంగమ తీర్థంలో స్నానమాచరించి అక్కడ నరసింహస్వామిని దర్శించుకున్నాడు.

ఇక నిగమశర్మ సారూప్య మోక్షం పొందే దశ సమీపిస్తూందట. సారూప్యమోక్షం అంటే భక్తుడు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు యొక్క రూపాన్ని పొందడమన్నమాట. ఎడతెగని ఉపవాసాలతో అతని చెవులు గడియలు (దిబ్బళ్ళు) పడ్డాయట. మేను వణికిందిట. కాలము గడవక అతడు వడిగా చెడి (ఆరోగ్యం క్షీణించి) పుడమిని పడి విగత జీవుడయ్యాడట.

అతి హీనమైన యాతని దేహమును తీసుకెళ్ళడానికి నల్లగాఉన్న దండధరానుచరులు (యమభటులు) బయలుదేరి వచ్చారట. అదేసమయానికి విష్ణుదూతల సమూహం వచ్చి దివ్య విమానంపై కూర్చుండపెట్టి, విష్ణుసారూప్యం చెందిన నిగమశర్మను వైకుంఠపురానికి తీసుకువెళ్ళారట.

విష్ణుసారూప్యం చెందిన నిగమశర్మ మహద్భాగ్యాన్ని రామకృష్ణకవి ఈ అద్భుతమైన పద్యంలో వివరిస్తున్నాడు.

ఉత్తాల ఫణిభుగ్గరుత్తాల వృంతానిలా
         శాంత ఘర్మాంబు వయ్యె మేను
ప్రత్యుగ్ర ముక్తాతపత్త్రీ భవచ్చేష
         వారితా తపమయ్యె జారు మౌళి
సూత్రవతీశ దోర్వేత్ర దత్తావకాశా
         మరంబయ్యెఁ గటాక్ష విహృతి
భృగు భరద్వాజ ప్రభృతి కృత స్వస్తి వాగ్భర
         ముఖరములయ్యెఁ బార్శ్వతలము

లరుణ కిరణ సహస్రాభమభ్రగంబు
నగు విమానంబుపై నెక్కి నిగమశర్మ
తీండ్రఁ బుండ్రేక్షు కోదండ్రు తండ్రిఁ బోలి
పరమధామంబునకుఁ బోవు పథమునందు

ఫణి భుక్ – పాములను తినేవాడు – గరుత్మంతుడు. అతనియొక్క ఉత్తాల – ఎత్తైన, ఉన్నతమైన, గొప్ప. గరుత్ – ఱెక్కలు (అనెడి) తాలవృంత – విసనికర్రలచేత. అశాంత – మిక్కిలి చల్లగా చేయబడిన చెమటబిందువులు కలది అయినది అతని శరీరము (మేను). అంటే గరుత్మంతుడు తన రెక్కలతో ఇతని ఒంటికి పట్టిన చెమట ఆరిపోయేలా విసిరాడట. ఆదిశేషుడు (ప్రత్యుగ్రుడు) తన పడగలను ముత్యాలగొడుగులా పట్టి ఇతనికి ఎండ తగలకుండా చేశాడట. సూత్రవతీదేవి భర్త అయిన విష్వక్సేనుడు (విష్ణువు యొక్క సేనాపతి) విచోపులిస్తున్నాడట. అంటే వింజామర వీస్తున్నాడు. అలా వీస్తున్నప్పుడు ఆ వింజామర కంటి చూపుకి అడ్డం వస్తోంది, తొలగుతోంది. ఆ తొలగినప్పుడల్లా తనని చూడ్డానికి వచ్చిన అసంఖ్యాకమైన దేవతలు కనుచూపుమేరకి (కటాక్షవిహృతి) కనబడుతున్నారట. భృగువు, భరద్వాజుడు మొదలైన సప్తఋషులు ఇరుపక్కలా నిలబడి స్వస్తివచనాలు పలుకుతున్నారట.

అలా వారందరూ సేవిస్తూ ఉండగా వేయి సూర్యుల కాంతితో ప్రకాశించే దివ్య విమానాన్ని ఎక్కి, నిగమశర్మ చెరకువింటివాని (మన్మథుడి) తండ్రిని (విష్ణుమూర్తిని) పోలి – అనగా విష్ణు సారూప్యం చెంది – దివ్యధామమునకు – పరమపథానికి వెళ్ళాడట.

‘ఉత్తాల’, ‘గరుత్తాల’ అన్న పదాలు రెండూ ప్రాసయతి చెల్లించుకొని యమకముతో కూడి ఆ యమకము ‘గరుత్ + తాలవృంత’ అన్న పద విభాగంతో కూడిన కూర్పు యొక్క చమత్కారం చేత దిగ్భ్రమ కలిగిస్తోంది. ఇది సారూప్య సాలోక్యములోనిది. ఇలా యమకము చేయడం మాత్రం అన్యులకు సాధ్యం కాదు. ఎన్నో చోట్ల రామకృష్ణకవీంద్రుడు చేసిన సమాసాలచేత, ఇలాటి కూర్పులచేత ఆయనతో ఈ విద్యలో పోల్చదగినవాడు దరిదాపుల్లో ఎవరూ లేరని పండితుల ఉవాచ.