మహాకవి తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యము’

అలా ప్రత్యక్షమైన స్వామిని ఆపాదమస్తకం చూడగానే పుండరీకుని మనస్సు హర్షధారావిలం అయిపోయింది. హర్షం అనే వర్షధారలతో ఒక్క క్షణం వ్యాకులం (ఆవిలము) అయిపోయింది. పట్టరాని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. దానితో అతడు కృత్యవిమూఢుడయ్యాడు. కళ్ళు అప్పగించి చూస్తూ ఆ ఆనందంలో అలా స్థాణువులా ఉండిపోయాడు. లిఖించిన బొమ్మా? శిలాప్రతిమా? విస్మృతి (మరుపు) అనేది రూపం ధరించిందా? అన్నట్టు చలన విదూరుడై బిగుసుకుపోయాడు పుండరీకుడు.

పరమాత్మ భక్తపరాధీనుడు, పరమ దయాళువు. తానై వచ్చి అనుగ్రహించడమేకాదు, సంభాషణ కూడా తానే మొదలుపెట్టాడు.

నిచ్చలు నిచ్చలో బొదలు నీ పితృభక్తికి జ్ఞానశక్తికిన్
మెచ్చితి, నచ్చితిన్ గరము నీయెడ నీ యెడమేల? వేడుకొ
మ్మిచ్చెదఁ జెచ్చెరన్ వలయునీప్సితముల్ శతమేని, దీననే
పొచ్చెము నొచ్చెముం జొరదు భూసురకేసరి! నమ్ము నావుడున్

“భూసురకేసరీ!” అన్న సంబోధనలోనే స్వామి ఇతని తపస్సుకి ఎంత ప్రసన్నులయ్యారో తెలుస్తోంది. నిత్యమూ (నిచ్చలున్) నీ హృదయంలో (ఇచ్చలో) వృధ్ధి పొందే (పొదలే) నీ పితృభక్తికీ, జ్ఞానశక్తికీ మెచ్చుకున్నాను. ఇక ఆలస్యం ఎందుకు (ఈ ఎడ ఏల)? ఏంకావాలో కోరుకో! వెంటనే (చెచ్చెరన్) ఇచ్చేస్తాను. కావలసిన వరాలు (ఈప్సితాలు) ఎన్నైనా (శతమేని – అంటే లెక్కపెట్టి వంద అని కాదు). అలా కోరుకోవడం వల్ల తపోశక్తికి ఏమైనా భంగంకలుగుతుందనుకుంటున్నావేమో! అటువంటి ఇబ్బంది ఏదీ ఉండదు. దీనివల్ల (దీనన్) ఏన్యూనత (పొచ్చెమున్) ఏలోపమూ (నొచ్చెమున్) రాదు. నామాట నమ్ము! అని అభయం ఇచ్చాడు.

ఆప్పటికి పుండరీకుడిలో చలనం ఏర్పడింది. వెంటనే సాష్టాంగపడ్డాడు.

భస్మోధ్ధూళన పాండురాంగము – రమాప్రాణేశు పాదద్వయిన్
విస్మేరాంబుజగామి హంస మిదినాన్ వే వ్రాల్చుచున్, లేచి “దే
వాస్మాకం శరణం త్వమేవ, గతిరన్యాన్నాస్తి, దుర్వాసనా
పస్మారం హర” యంచు బల్కి మఱియున్ భక్తుండు భక్తి స్పృహన్

విభూతి పులుముకోవడం (భస్మ ఉధ్ధూళన) వల్ల తెల్లగాఉన్న తన శరీరాన్ని (పాండుర + అంగము) పుండరీకుడు భక్తి తన్మయత్వంతో స్వామివారి పాదాలమీద వెంటనే వాల్చేశాడు. వికసించిన పద్మం (విస్మేర + అంబుజ) దగ్గఱకు పయనించే (గామి) హంసము ఇది అన్నట్టు (నాన్) సాష్టాంగపడ్డాడు. (మునీశ్వరుల్లొ హంసలు, పరమహంసలు అనేస్థాయిలున్నాయి. ఉదా: రామకృష్ణ పరమహంస. పుండరీకుడు ఇప్పుడు హంస స్థితిని పొందాడన్నమాట.) దేవా, అస్మాకం = మాకు, త్వం ఏవ = నీవే, శరణం – దిక్కు. అన్యా = వేరొక, గతిః దిక్కు లేదా మార్గం, న+అస్తిః = లేదు. దుర్వాసనా = దుస్సంసార రూపమైన, అపస్మారం = అపస్మార రోగాన్ని (సంస్కార స్మృతి కోల్పోడం అనే రోగాన్ని) హర = తొలగించు.

ఆవేశం వచ్చినప్పుడు కొందరి భాష మారిపోతుంది. పుండరీకుడిది భక్త్యావేశం. హఠాత్తుగా దేముడు ప్రత్యక్షం అయ్యేసరికి ముందుగా స్తంభీకృతుడయ్యడు, తరువాత తాను అనుదినమూ చేసే పూజాపునస్కారాల్లోని భాష వచ్చేసిందనుకోవాలి. అటు పైని పుండరీకుడు దశావతారవర్ణనలతో స్వామిని సంతుష్టుణ్ణి చేసి – స్వామి అక్కడే వెలసేలా దివ్య వరం పొందాడు. స్వామిలో ఐక్యం అయ్యాడు.

నిగమశర్మోపాఖ్యానము.

వేదాధ్యయన సంపన్న, శిష్టాచార పరాయణ నిత్యాగ్నిహోత్రులైన పరమోత్తమవంశంలో జనించి, పండితోత్తముడు, సకలజనులచేత, రాజుచేత గౌరవింపబడిన తండ్రి కడుపున పుట్టి, తాను స్వయంగా సకల శాస్త్రాలు, వేద-వేదాంగాలు అభ్యసించి కూడా చెడు సావాసాలు చేసి, భ్రష్టుడై, చోరుడై, జారుడై, విశ్వాసఘాతకుడై అన్ని విధాలా పతనమైపోయిన పరమ నికృష్టుడు నిగమశర్మ. అంతటి పాపి కూడా పండరీపురంలో మరణించిన ఒక్క భాగ్యం చేత, దివ్య విమానం ఎక్కి వైకుంఠపురం చేరి ‘కుముదుడు’ అనే పేరుతో శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రుడుగా ఉంటున్నాడట!

ఉహ్వని హోమాగ్ని యూఁద నొల్లఁడుగాని
         విరహజ్వరార్తితో వెచ్చనూర్చు
సంధ్యకుఁ బ్రార్థనాంజలి ఘటింపఁడుగాని
        యెరఁగు నీర్ష్యాకషాయితల కర్థి
నాగమవాదంబు లౌఁగాదనఁడుగాని
        విటవాదములు తీర్చు వేగిలేచి
కంబుభృత్పాదోదకంబు గ్రోలఁడుగాని
        యౌవతాధర శీధువాని చొక్కుఁ

బుణ్యచిహ్నంబు లపఘనంబున ఘటింప
సిగ్గుపడుఁగాని కరనఖశిఖర లసిత
జాతనూత్నక్షతాంకముల్ సమ్మతించు,
నారజము మీరి యా దుర్విహార హారి.

నిగమశర్మ హోమాగ్నిని ఊదడట; కానీ విరహమనే జ్వరం యొక్క బాధతో వెచ్చని నిట్టూర్పులూరుస్తాడట. సంధ్యావందనం చేయడట; కానీ ఈర్ష్యాకషాయితలకు (తాను ఇతర స్త్రీల సాంగత్యం చేస్తున్నట్లు తెలుసుకొని ఈర్ష్యతో కళ్ళెర్రచేసే తన ఉంపుడుగత్తెలకు) మాత్రం మక్కువతో (అర్థిన్) నమస్కరిస్తాడట (ఎరగున్). వేద చర్చలలో (ఆగమ వాదంబులన్) ఔను-కాదు అనడు – పాల్గొనడు; కాని పెందలకడనే లేచి (వేగిలేచి) విటవాదములను తీరుస్తాడట (గత రాత్రి విటులకు, విటీజనమునకు ఏర్పడిన కలహాలను తీరుస్తాడన్నమాట). (ప్రత్యేకించి ఇలాంటి కలహాలని తీర్చడానికి ప్రాచీనకాలంలో జారధర్మాసనాలుండేవని వినుకొండ వల్లభరాయని ‘క్రీఢాభిరామం’ వలన తెలుస్తూంది. అవిలేని తావుల్లొ మన నిగమశర్మ లాటి వారే న్యాయమూర్తులు!) కంబువు (శంఖము), కంబుభృత్పాదోదకంబు – శంఖధారి అయిన విష్ణువు యొక్క పాద తీర్థమును త్రాగడు (గ్రోలడు); కాని యువతీజనం యొక్క అధర (యౌవత అధర) శీధువు (చెఱకురసపు కల్లు) ఆని (త్రాగి) చొక్కున్ – పరవసిస్తాడు.

పుణ్యచిహ్నంబులు – తిరుమణి, తిరుచూర్ణములు మొదలైనవి, అపఘనంబునన్ – శరీరం మీద, ఘటింప (ధరించడానికి) సిగ్గుపడతాడు; కానీ కరనఖ శిఖర లసిత జాత నూత్న క్షతాంకముల – (వారకాంతలు) తమ చేతిగోళ్ళ వాడిమొనలచే చేసే కొత్త గుర్తులను ప్రదర్శించడానికి సమ్మతిస్తాడట. ఆరజము మీరి – ఇంపుమీరగా; ఆ దుర్విహార హారి – చెడునడతకు ఓడిన (తల ఒగ్గిన) ఆ నిగమశర్మ!

దినవెచ్చమునకునై తన మేనఁ గల సొమ్ము
         కొదుకక బచ్చింటఁ గుదువవైచు
నీఁదు గీచినరీతి నించుకించుక చేరి
         గిలుబాడుఁ దల్లిపైఁగల పసిండి
తండ్రికి నిడ్డ పత్రములు దొంగిలించిపోయి
         పోయినంతకు నిచ్చి పొరయుఁగొంత
మిండవడ్డికి నోర్చి మృత్యురూపములైన
         సాహులచే ఋణగ్రాహియగుచు

గుడ్డవృత్తులు, వృత్తులుఁ గొలుచు గుత్త,
చేలు గ్రామాంశములు గాదినేలలెల్లఁ
జనవరుల కమ్మఁజూపు నిచ్ఛావిహార,
వర్తి వాఁడేమి కానున్నవాఁడో మీఁద.

దినవెచ్చములకు – అంటే రోజువారీ తన చిల్లర ఖర్చుకు, తన ఒంటిమీదనున్న సొమ్ము – నగలను, ఏమాత్రం సందేహించక (కొదుకక) కోమటింట (బచ్చింట) తాకట్టు పెడతాడు. చేరి – మెల్లమెల్లగా తల్లిని) సమీపించి, కొంచెం కొంచెంగా (ఇంచుకించుక) ఈదు గీచిన రీతి (ఈత చెట్టును కల్లు కొరకు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం గీస్తారట) – ఆ విధంగా తల్లి ఒంటిమీద గల బంగారు నగలు, గిలుబాడు – అపహరిస్తాడు. తండ్రికినిడ్డ – తండ్రికి ఇవ్వబడిన; తండ్రి దగ్గర ఋణం తీసుకొని ఋణపత్రాలు వ్రాసి ఇచ్చినవారి యొక్క పత్రాలను దొంగిలించి వారివద్దకే తీసుకెళ్ళి వారి పత్రాలు వారికిచ్చేసి ప్రతిఫలంగా ఎంతోకొంత (వారు ఇచ్చినంత) వారినుండి పొరయునట (పొందునట).

ఇక అతనెలా ఋణగ్రస్తమైపోయాడో వివరిస్తున్నాడు.

మిండవడ్డికిన్ – అధిక వడ్డీకి, చక్రవడ్డీకి, ఓర్చి – అంగీకరించి, యములాళ్ళవంటి వడ్డీవ్యాపారులవద్ద అప్పులు చేసి; పూర్వీకులకి వృత్తి పరంగా (పౌరొహిత్యం, యజ్ఞయాగాదులు చెసినందుకు ప్రభువులు మెచ్చి ఇచ్చిన, ఇంకా దానంవల్ల లభించిన భూములు) కొలుచు గుత్త చేలు (కౌలుకిచ్చిన వాటి మీద వచ్చే ఆదాయం); గ్రామాంశములు (తన తండ్రికి భాగం ఉన్న గ్రామస్తుల ఉమ్మడి ఆస్తి) – గాదెలలో ఉన్న ధాన్యం – ఇలాటి ఆస్తులన్నిటినీ ఇచ్ఛా విహారానికి అలవాటుపడ్డ నిగమశర్మ చనవరులకు – చనువున్న పరిచితులకు – అమ్మేసే వాడట. ఏమి కానున్నాడో అతడు భవిష్యత్తులో మరి.

నిగమశర్మ అక్కగారు తమ్ముడు చెడుతిరుగుళ్ళు మరిగి పిత్రార్జితం అంతా తగలేస్తున్నాడని తెలిసి తమ్ముడికి బుద్ధి గరపి సన్మార్గంలో పెడదామని వచ్చింది.

ప్రారంభించిన వేదపాఠమునకు బ్రత్యూహమౌనంచునో
ఏరా తమ్ముడ! నన్నుఁజూడఁ జనుదే వెన్నాళ్ళనో యుండి చ
క్షూరాజీవ యుగంబు వాఁచె నినుఁ గన్కోకుంకి మీ బావయున్
నీరాకల్ మదిఁగోరుఁ జంద్రు పొడుపున్ నీరాకరంబుం బోలెన్

ఏరా తమ్ముడా! (అలా పిలవడం మన సంసారాల్లో ఉండే చనువుని తెలుపుతుంది.) మొదలుపెట్టిన వేదపాఠాలకి విఘ్నం (ప్రత్యూహము) కలుగుతుందనా నువ్వు చాలా కాలంగా నన్ను చూడ్డానికి రాలేదు!? (వాడు భ్రష్టు పట్టిపోయాడన్న విషయం తనకి ఇంకా తెలియదని అతడనుకోవాలని). నిన్ను చూడక కలువ పువ్వుల్లాంటి నా రెండు కళ్ళూ (చక్షూరాజీవయుగంబు) వాచిపోయాయి. ఇక నీ బావగారు కూడా నీ రాక కోసం పున్నమి చంద్రుడి కోసం సముద్రుడు వేచి యున్నట్టు, మదిలో చాలా వేచి చూశారు. ఏరా తమ్ముడా, నీ కోసం చూసి చూసి కళ్ళు రెండూ వాచాయి – లాటి సామాన్య పదజాలంతో, చక్షూరాజీవయుగంబు, రాక అనే శ్లేషతో (రాక అంటే రెండర్థాలు; ఒకటి వచ్చుట, రెండు – పూర్ణిమ) సాహిత్య చమత్కారాలు చేశాడు కవి.