తదనంతరం పరమశివుడు ఇలా వివరించాడు.
ఆదికల్పమునందలి పద్ధెనిమిదవ ద్వాపరయుగపు చివరిభాగంలో శ్రీమహావిష్ణువు ఘర్మవీరానది భైమీ నదితో కలిసిన చోట పుండరీకుడనే ఒక పరమభక్తాగ్రేసరునికి ప్రత్యక్షమై ఆతని కోరిక మేరకు అక్కడే వెలశాడు. పుండరీకుడు గొప్ప వివేకి, సుగుణసంపన్నుడు, సత్యము, దయ, ఆర్జవము (సూటితనము), శాంతి, దాంతి (బ్రహ్మచర్యము మొదలుగాగల తమఃక్లేశములను తట్టుకొనే స్వభావము. “దాంతునికైనా వేదాంతుని కైనా – శాంతము లేక సౌఖ్యము లేదు” అన్నాడు త్యాగరాజస్వామి.) అనే గుణములచే వెలుగొందినవాడు. చలిచీమకైనా హాని తలపెట్టడు. ఎన్నడూ మృషాభాషణములు (అబద్ధపు మాటలు) పలుకడు. కలుషవర్తనులున్న దాపులకు కూడా వెళ్ళడు. కలిమికి పొంగిపోడు, లేమికి కుంగిపోడు. పరస్త్రీలను కన్నెత్తయినా చూడడు. ఎంతటి ఒడిదుడుకులు వచ్చినా ఏమాత్రం ధైర్యం వీడడు. ఇతరుల సంపదలను చూచి అసూయపడడు. ఎంతటి నీచుడినైనా మనసులోకూడా నిందించడు. ఆకలిగొన్న వారికి శుష్కప్రియాలు చెప్పి ఊరుకోకుండా తన చేతనైన సహాయం చేస్తాడు. సకలభూతముల యందునూ దయగలిగి వుంటాడు. వేదమార్గము ననుసరించువారిలో ప్రధానుడు. ఎట్టిలోపమూ లేని వేదాంత శాస్త్రవేత్త ఆ పుండరీకుడు. దేవగురువైన బృహస్పతితో సమానుడయిన ఆ బ్రాహ్మణోత్తముడి మనసులో బంగారానికి తావి అలదినట్లు ఎప్పుడూ అంబుజోదర చరణారవింద సతతస్మృతి (విష్ణు పాదపద్మముల నిరంతర స్మృతి) అనే వ్యసనమేనట !
సమాధిలో ఉన్నంతసేపూ అంతర్నయనంతో శ్రీకృష్ణుని మీదే మనస్సును లగ్నంచేసే పుండరీకుడు సమాధినుండి బయటకు రాగానే తల్లిదండ్రుల పాదసేవకే అంకితమైపోతాడు. తానే వేయిసేవకులపెట్టయి తన భార్య ఎదురుతిరగని బుద్ధితో సహకరిస్తూ ఉండగా, తన మాతాపితరులకు సకలసేవలూ చేసేవాడు.
ఆపాదమస్తంబు నంటు నూనియగాచి
స్వయముగా నుద్వర్తనంబొనర్చు
జలకమార్చు నఖంపచ స్వచ్ఛజలములఁ
గడు మెదుగుడులఁ బొదివి
లఘుధౌత వసనపల్లవములు గట్టించు
శిరసార్చు మృదులీల సురటి విసరి
చేయూఁత యొసఁగి వేంచేయించు లోనికి
ద్వారావతి గలంతిఁ దానె యొసఁగుఁదెలుపు సంధ్యా సమాధి విధి ప్రయుక్తి,
నగ్ని వేల్పించు విష్ణుసహస్రనామ
పాఠ మొనరించు తఱిఁదోడుపడు గురునకు,
గవలు వోకుండఁబుత్రుఁడో కలువకంటి.
శివుడు పార్వతితో ఇలా చెబుతున్నాడు: కలువలవంటి కన్నులుగల ఓ పార్వతీ! పుండరీకుడు తన తండ్రికి తానే స్వయంగా నఖశిఖపర్యంతం నూనెతో అంటి నలుగు (ఉద్వర్తనం) పెడతాడు. గోరువెచ్ఛని (నఖంపచ) స్వచ్ఛమైన నీళ్ళతో జలకమాడిస్తాడు. తదుపరి అతిమెత్తని గుడ్డలతో (కడు మెదు గుడుల) ఒళ్ళుతుడుస్తాడు. తేలికయిన (లఘు) తెల్లని (ధౌత) చిగురుటాకుల్లాటి వలువలు (వసనపల్లవములు) కట్టిస్తాడు. మృదువుగా విసనకర్ర (సురటి) తో వీస్తూ తలతడి ఆరుస్తాడు. చేయూతనిచ్చి లోపలికి తీసుకువెళ్తాడు. చెంబు (ద్వారావతి గలంతి) తానే అందిస్తాడు (ఆచమనం చేసుకోడానికి). తండ్రికి సంధ్య, సమాద్యాది విధులు తానే తెలుపుతాడు. తండ్రిచేత అగ్ని వేల్పించుతాడు. విష్ణుసహస్రనామం పఠించేటప్పుడు వృద్ధుడయిన తండ్రి తడబడి క్రమంతప్పకుండా (కవలుబోకుండా) ఉండేందుకు పుత్రుడైన పుండరీకుడు తోడ్పడేవాడు.
ఇక ఆ పుండరీకుడు విష్ణుపూజలేవిధంగా చేసేవాడంటే –
అభిషేకమొనరించు నాకాశవాహినీ
జననకారణ పాద జలరుహునకు
వైచుఁ దోమాలియ వైజయంతీకాంతి
వలయిత వక్షఁ కవాటునకును
గౌశేయమర్పించుఁ గాంచనమయ పటీ
పల్లవారుణ కటిబంధురునకుఁ
జందనం బలఁదు నీళేందిరా కుచకుంభ
సంగికుంకుమ పంకిలాంగునకునురత్నహారంబు సాతు నిర్యత్నసిద్ధ
కౌస్తుభోదర్చి రభిరామకంధరునకు
ధూపకల్పన మున్నుగా దీపమిచ్చుఁ
దెఱువ! యాతడు త్రైలోక్య దీపకునకు.
ఓ తెఱువా! (ఓ ఇంతీ! ఓ పార్వతీ!) పుండరీకుడు ఆకాశగంగ జననానికి కారణమైన పాద పద్మములుగలవానికి (జలరుహమంటే పద్మము) అభిషేకం చేస్తాడు. వైజయంతి అనే పూమాలయొక్క కాంతిచే ఆవరించబడిన తలుపువంటి రొమ్ముగలవానికి వనమాల (తొమాలియ) వేస్తాడు. చిగురువంటి బంగారు వస్త్రముచే ఎరుపెక్కిన మొలచే చక్కనైనవానికి పట్టువస్త్రాన్ని (కౌశేయము) అర్పిస్తాడు. నీళ (విష్ణుభార్యలలోనొకతె) మరియు ఇందిర (లక్ష్మీదేవియొక్క) కుచ చూచుకముల సాంగత్యముచే (రాపిడిచే) కుంకుమ అంటిన శరీరముకలవానికి మంచిగంధపు (చందనము) పూత పూస్తాడు. కౌస్తుభం లాటి మహామణినే అప్రయత్నంగా సిద్ధించుకొని దాన్ని ధరించిన కారణంగా దాని కాంతి పుంజములచే ఇంపైన మెడగలవానికి రత్నహారాన్ని సమర్పించును (చాతున్). ముల్లోకాల్నీ వెలుగొందింపచేసే (త్రైలోక్యదీపునకు) ఆ శ్రీమహావిష్ణువునకు ధూపమిస్తాడు పరమభక్తాగ్రేసరుడైన పుండరీకుడు!
తిరువారాధనమొనర్చి విష్ణువుకు అర్పించుట చేత పావనములైన వివిధ ఆహారపదార్ధములను పుండరీకుడు తన తల్లిదండ్రులకు ప్రియము మీరగా కొసరి కొసరి వడ్డించి తినిపించేవాడట. తల్లిదండ్రులు పరమపదించిన పిమ్మట కాశీకి వెళ్ళి వారి అస్తికల్ని పరమపవిత్రమైన గంగానదిలో నిమజ్జనం చేసి, గయకి వెళ్ళి అక్కడ వారికి పిండములు పెట్టాడట. పిత్రుదేవతల ఋణమును తీర్చుకొనుటకు అనుకూలవతి అయిన భార్య వలన విశేషజ్ఞానము, అణకువ కలిగిన పుత్రులను కన్నాడు. ఇక ఆయన భార్యాబిడ్డల్ని విడిచి, ఇల్లుమరచి, మదిలో శేషఫణిశయనుడయిన శ్రీమహావిష్ణువును ప్రత్యక్షం చేసుకొనే అభిలాషతో తపస్సు చేయడం ప్రారంభించాడు.
(మన పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు ఏమి చెప్పినా అన్యాపదేశంగా చెబుతాయి. కవులు ఏదైనా పాత్రగురించి చెప్పినప్పుడు ఆ పాత్ర లక్షణాలన్నిటినీ సమగ్రంగా వివరిస్తారు. అది సన్మార్గుడి పాత్ర అయితే మనం అందరం కూడా అలాగే నడుచుకోవాలి అనిన్నూ, దుర్మార్గుడి పాత్ర ఐతే మనం అలా ఉండకూడదనిన్నీనూ మనకి ఉపదేశాలు. అందుకే కవి పుండరీకుడి పాత్రని సకలసద్గుణాల ప్రోవుగా చిత్రీకరించాడు. తద్వారా మనకి ఉపదేశం – అలా నడుచుకోండి – అని. భాగవతంలో పోతనగారు బాలప్రహ్లాదుడి గుఱించి చెబుతూ “కన్నుదోయికి నన్యకాంత లడ్డంబైన మాతృ భావము సేసి మరులువాఁడు” అన్నాడు. అయిదేళ్ళ బాలుడికి స్త్రీల పట్ల వేరే భావనలేముంటాయి గనక? కానీ ఆ నీతి మనల్ని పాటించమని అన్యాపదేశంగా మనందరికీ ఉపదేశం! భారతీయుడైనవాడు అలా ఉండాలి, అలా ఉంటాడు – అని.)
పుండరీకుడు చేసిన ఘోరతపస్సుకి నందగోపబాలుని హృదయం వెన్నలా కరిగిపోయిందిట. గోపికలతో రాసక్రీడలో మునిగి తేలుతూన్న రాసవిహారి తన బంగారపుటందియలు ఘల్లుఘల్లున మ్రోగగా పరుగుపరుగున పుండరీకునివద్దకు వచ్చాడట. పుండరీకుడికి ప్రత్యక్షమయిన శ్రీకృష్ణుడి రూపాన్ని ఆపాదమస్తకం అపూర్వంగా దర్శించి అధ్భుతంగా వర్ణించాడు మహాకవి రామకృష్ణుడు.
యతీశ్వరుల హృదయంలో సంచరిస్తున్న గోవర్ధనపర్వతగుహలలో విహరించడం, కొండకొమ్మున నెమలిలా రాధికాహృదయం మీద వాలడం, మేఘాలనుతోలే ఇంద్రుడిలా రంగురంగుల ఆలమందలను మేపడం, పద్మవనంలో హంసలా స్నేహితులతో కేరింతలు కొట్టడం, చంద్రబింబానికి స్వరం నేర్పుతున్నట్టు తెల్లని శంఖాన్ని ఊదడం – ఇలాటి ఆటలన్నీ కట్టిపెట్టి ఆ దేవకీతర్ణకం (కోడెదూడ – బిడ్డ) పుండరీకుడి పర్ణశాలకువచ్చి ప్రత్యక్షం అయింది! ఆ తర్ణకం పాదపద్మాలకు బంగరుటందెలు మ్రోగుతున్నాయి. ఆ మ్రోతని కవి ఇలా ఉత్ప్రేక్షిస్తున్నాడు :
లలిత శిరీష పుష్పమృదులంబులు నీ చరణంబులక్కటా
ఇల ఇది రూక్షమిట్టులలయించుట కాదని ప్రార్థనా మృదూ
క్తులు సెలగంగ వేపొదివి తొల్చదువుల్ తగు విన్నపంబులన్
బలుమఱు జేయుచందమున బంగరుటందియలుగ్గడింపగన్
యదుబాలుని పాదపద్మాలకి బంగారపుటందెలున్నాయి. ఆ అందెలు మ్రోగుతుండగా (ఉగ్గడింపగన్) స్వామి నడచి వచ్చారు. తొలిచదువులైన వేదాలు ఆ పాదాలను పొదివి పట్టుకొని (వేదాలు విష్ణుపాదాలవద్ద జనించాయట) అడుగడుగుకీ మాటిమాటికీ (పలుమరు) తగిన విన్నపాలు చేస్తున్నట్టు ఉంది ఆ అందెల మ్రోత. “స్వామీ! నీ చరణాలు లలితమైన శిరీషపుష్పాల్లాగా మృదులమైనవి. అయ్యయ్యో, నేల ఇది అతికఠినం (రూక్షం) (‘రూక్షం’ అనడంలోనే కాఠిన్యమంతా ప్రస్ఫుఠమౌతోంది!) ఇట్లా నీ పాదాలని కష్టపెట్టడం (అలయించుట = అలసిపోయేలా చేయడం) తగదు” – అని ప్రార్థనా మృదు + ఉక్తులతో విన్నపాలు చేస్తున్నట్టు అందెలు మ్రోగుతుండగా స్వామి విచ్చేసాడు.
బాలక్రిష్ణయ్య మొలకి గోళీ సంచులు నాలుగు వ్రేలాడుతున్నాయి. ఆలమందలు గడ్డి మేస్తుంటే ఈయన సోదరుడు బలరాముడితో, ఇంకా మిత్రబృందంతో చెట్టుక్రింద గోళీలాడుకుంటారన్నమాట. అందుకని సంచీలో గోళీలు మొలకి కట్టుకుని సిద్ధంగా ఉంచుకుంటాడుకాబోలు!
మెత్తగ నూఱిన చుట్టుం
గత్తిన్ మధుకైటభోరు కంఠము లలనా
డొత్తిన హత్తిన చేదుం
తిత్తుల క్రియ దొడల నుడ్డ తిత్తుల్
మధుడు, కైటభుడు అనే రాక్షసుల్ని విష్ణుమూర్తి అలనాడు తన చక్రాయుధంతో సంహరించాడు. చుట్టుకత్తి – చుట్టుంగత్తి – గుండ్రటి ఆయుధం – సుదర్శనచక్రం. దాన్ని మెత్తగా నూరి (బాగ పదును పెట్టి), ఆ ఇద్దరు రాక్షసుల ఉరు కంఠాలను (బలిసిన మెడలు) ఒత్తేసాడు. ఒత్తడం అంటే చప్పుడు కాకుండా తెగెయ్యడం (మీసాలు వత్తుట, చంపలు వత్తుట అని వాడుక). అలా వత్తినప్పుడు వాళ్ళ ఊపిరితిత్తులు స్వామికి హత్తాయి – లభించాయి. చేదడం అంటే తోడడం. గాలిని చేదుకోడానికి ఉపయోగించే తిత్తులు కనుక శ్వాసకోశాల్ని “చేదుంతిత్తులు” అన్నాడు. ఇద్దరివీ చెరో రెండుగా నాలుగు ఊపిరితిత్తులు. ఆ తిత్తులో అన్నట్టుగా నాలుగుసంచులు – బహుశః అటురెండు ఇటు రెండు తొడలమీద వేలాడుతున్నయి. “ఉడ్డ” అంటే నాలుగు. ఉడ్డాముగ్గురు (ఏడుగురు) అనేది రాయలసీమ వాడుక.