వేసవి తాపవర్ణన చూడండి. ఇదే భావాన్ని బహుశః నాలుగు సీసపద్యాల్లో వ్రాయవచ్చు. ఇలా క్లుప్తంగా వ్వ్యక్తం చేయగలగడం ఒక మహా కళ.
పద్మినీ పద్మాత పత్రంబు శిథిల
పత్రాగ్రమై రాయంచ యాశ్రయించెఁ
దాలు స్రవత్ఫేన జాలుబుతో ఘోణి
పంచల రొంపి గలంచి యాడె
దూరొద్గమద్దావ ధూమ మంబుద బుధ్ధి
నెమ్మి లో పొదనుండి నిక్కి చూచె
జఠరస్త జలము నాసానాళమునఁ బీల్చి
సామజంబరుప్రక్కఁ జల్లుకొనియెసరసిపై నీరు సలసల తెరలె విపిన
సకల వీథులు నిర్మృగోఛ్ఛయములయ్యె
మట్టమధ్యాహ్నమిది సుధామథురవాణీ!
యర్హమిచ్చొఁ బథః శ్రమ మపనయింప.
రాజహంస, వేసవికాకకి ఓర్వలేక శిథిలమైన ఱెక్క చివర కలదియై చెరువు (పద్మిని) లో తామరాకు గొడుగు క్రింద (మిగతా చోటుకంటే అక్కడ ఇంకా ఎక్కువ చల్లగా వుంటుందిట) చేరిందిట. దవడ (తాలువు) నుండి జారుతున్న, కారుతున్న (స్రవత్) నురుగు సమూహముతో (ఫేనజాలమ్ముతో) పంది (ఘోణి) సమీపంలో (పంచల) బురదలో (రొంపి) పొర్లి (కలంచి) ఆడిందిట (యాడె). దూరం నుండి లేస్తున్న (దూర + ఉద్గమత్) దావాగ్ని పొగను (దావధూమ) మేఘమనుకొని (అంబుద బుద్ధిన్) నెమలి (నెమ్మి) – ఎండకు తాళలేక పొదలో ఎక్కడో లోపల దాక్కొని వున్నది, మెడ నిక్కించి చూసిందిట. కడుపులోపలనున్న (జఠరస్త) నీళ్ళను తొండంద్వారా (నాసా నాళమున) బయటకి పీల్చుకొని ఏనుగు తనమీద అటూ ఇటూ చల్లుకుందిట.
సరస్సులో నీళ్ళు సల సల తెరలుతున్నాయి. వీధులన్నీ ఎక్కడా మృగసంచారం కూడా లేకుండా ఉన్నాయి. మిట్ట మధ్యాహ్నమయింది. ఓ అమృతమయమైన పలుకులు పలికే దానా! ఇక్కడ మన ప్రయాణ బడలిక తీర్చుకుందాము – అని అగస్త్యుడు లోపాముద్రతో అన్నాడు. మిట్ట మధ్యాహ్నాన్ని ‘మట్ట’ మధ్యాహ్నం అని కూడా అనవచ్చని రామకృష్ణుడు తీర్మానించాడు.
కవి తన కత్యంత ప్రీతిపాత్రమైన తుంగభద్రానది నుండి వచ్చే పిల్లతెమ్మెరలెలా ఉన్నాయో వర్ణిస్తున్నాడు.
పంపాతరంగ రింఖణ
ఝంపా సంపాద్యమాన జలకణరేఖా
సంపాత శీతలానిల
సంపద వొదలించెఁ బరమశైవోత్తంసున్
పంపానది (తుంగభద్ర) లోని అలలయొక్క రింఖణ (పొరలికలతోకూడిన) ఝంపా (దూకుళ్ళచేత) సంపాద్యమాన (పుట్టించబడిన) జలకణరేఖా (నీటి తుంపరల సమూహము) సంపాత (పడుటవలన) శీతల (చల్లనైన) అనిల (గాలియొక్క) సంపద (కలిమి) ఆ పరమ శైవోత్తంసుని (శివభక్తులలో శ్రేష్టుడైన ఆ అగస్త్యమహర్షిని) పొదలించెన్ (సంతోషపెట్టెను).
గంగా సంగమమిచ్చగించునె? మదిన్ గావేరిఁ దేవేరిగా
నంగీకారమొనర్చునే? యమునతోనానందముం బొందునే?
రంగత్తుంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుండు నీ
యంగంబంటి సుఖించునేని గుణభద్రా తుంగభద్రా నదీ!
సముద్రుడు భర్త, నదులన్నీ ఆతని భార్యలు – అని కవిసమయం. తుంగభద్రా నది ఉపనది, అది సముద్రంలో కలవదు. అందుకని కవి చమత్కారంగా తుంగభద్ర అందాన్ని పొగుడుతున్నాడు. ఓ తుంగభద్రా! ఆ సముద్రుడు నిన్ను చూడలేదు కానీ, చూసి ఉంటే, గంగా, కావేరి యమునాదులతో సుఖించేవాడా ! ఉండేవాడు కాదు. నీ సౌందర్యం అంతగొప్పది!
అగస్త్యుడు, లోపాముద్ర మరియూ శిష్యబృందముతో దక్షిణాన తీర్థయాత్రలు చేస్తూ స్వామిమలలో కుమారస్వామిని దర్శించి వేనోళ్ళ స్తుతించాడు. అప్పుడు శరవణుడు (రెల్లుదుబ్బులో జన్మించినవాడు) వింధ్యసంస్థంభయుతుడైన అగస్త్యమునికి గంగ, పెన్న, విపాళ, చంద్రభాగ, శరావతి, వేత్రవతి, బాహుద, కృష్ణవేణీ, కావేరి, కపిశ, వంజీర (మంజీర) భవనాశని (సరయూనది), తుంగభద్ర, గౌతమి (గోదావరి) మొదలగు నదీతీర్థముల యొక్క దివ్య చరిత్రలను వినిపించాడు.
అప్పుడు అగస్త్యుడు కుమారస్వామితో, వేల్పు, తీర్థము మరియు క్షేత్రము సమాన ప్రాధాన్యతతో ఒకే చోటనున్నట్టి పరమ పుణ్యక్షేత్రమెక్కడ ఉన్నదో తెలుపమని ప్రార్థించాడు. దానికి కార్తికేయుడు తనకి కూడా అటువంటి పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందో తోచడంలేదు, మా తండ్రియైన పరమశివుణ్ణి అడుగుదాం, పదండి, అనగా అందరూ కలిసి రజతగిరికి (కైలాసానికి) బయలుదేరి వెళ్ళారు. కైలాసం చేరిన సుబ్రహ్మణ్య స్వామిని దేవవేశ్యలు (అప్సరసలు) పూజించారట.
స్మరశశి తటిదజ పవమా
న రవి సుధా సలిల మునిజన క్ష్మారిష్టా
సురమృత్యు జ్వలనజలగు
సురవేశ్యలు కొలిచిరపుడు సుబ్రహ్మణ్యున్
ఈ చిన్ని పద్యంలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి, వగైరా సురవేశ్యలు (అప్సరసలు) ఎవరెవరికి పుట్టారో తెలుపుతున్నాడు కవి. వారు పధ్నాలుగు జాతుల సంతానమట. అవి: స్మర – మన్మథుడు, శశి – చంద్రుడు, తటిత్ – మెరుపు, అజ – బ్రహ్మ, పవమాన – వాయువు, రవి – సూర్యుడు, సుధా – అమృతము, సలిల – నీరు, మునిజన – మహర్షులు, క్ష్మా – భూమి, అరిష్ట – దక్షప్రజాపతి కుమార్తెలలో ఒకతె, ఈమె పదమూడు మంది అప్సరసలను కన్నదట, సుర – దేవతలు, మృత్యు – మృత్యువు, జ్వలన – అగ్ని; జ – లు వీరందరికీ పుట్టిన వారు.
అదే సమయానికి పార్వతీదేవికి కూడా అదే సందేహం కలిగి పరమేశ్వరుడ్ని అడిగింది: “స్వామీ, క్షేత్రము-తీర్థము-దేవత యీ మూడిటికీ సమాన ప్రాధాన్యత కల పుణ్య ప్రదేశమేదో వివరింప ప్రార్థన అనగా, పరమేష్టి విష్ణుకథలు చెప్పుట యందిష్టము కలవాడై పార్వతికీ, అక్కడికి వచ్చిన కుమారస్వామి, అగస్త్యాదులందరికీ పాండురంగక్షేత్ర మాహాత్మ్యం గురించి సవివరంగా, సమర్మంగా వివరించాడు.
శివుడు ముందుగా పండరీపురంలో వెలసిన విట్టలాధీశుడనబడిన శ్రీకృష్ణావతారవిష్ణువును మదిలో తల్చుకున్నాడు.
వెడద కన్నులవాని వేయినామములవాని
వ్రేతలవలపించు వెరవువానిఁ
జిప్పఁకూకటివానిఁ జిన్ని నవ్వులవానిఁ
జెరివిన మంచి పింఛమువానిఁ
బులుగు తత్తడివానిఁ బొడవుల తుదివానిఁ
బొక్కిటి వెలిదమ్ముపూవువానిఁ
మినుకుటూర్పులవానిఁ మిసిమిమేఁతలవానిఁ
మెఱుఁగు జామనిచాయమేనివానిఁదిస్సమొలవాని, బసిఁగానఁ ద్రిప్పువానిఁ
మురళిగలవాని మువ్వంకమురువువానిఁ
విట్ఠలాధీశుఁ దలఁచి తద్విపులమహిమ
నొడువుఁ బ్రామఱ్రి క్రీనీడ విడిదిప్రోడ.
విశాలమైన (వెడద) కన్నులు కలవానిని, సహస్రనామములు కలవానిని; గొల్లస్త్రీలను (వ్రేతలన్) ప్రేమింపచేసే ఉపాయము (వెరవు) తెలిసినవానిని, కాకపక్షమని పిలువబడే పిల్ల జుట్టు నుదుటిపై కలవానిని (చిప్పకూకటి వాని), చిఱునవ్వు రాజిల్లెడువానిని, దోపిన (వెరివిన) అందమైన నెమలి పింఛము కలవానిని, పక్షిని (పులుగు) – గరుత్మంతుడిని – వాహనముగా కలవానిని, (తత్తడి అంటే వాహనం; అందుకే శుకవాహనుడైన మన్మధుణ్ణి, చిలుకతత్తడిరౌతు – అంటారు) ; ఉన్నతములకంటే ఉన్నతుడైనవానిని (పొడవుల తుదవాని); నాభియందు (పొక్కిట) తెల్లని (వెలి) తామరపూవు (తమ్మిపూవు) కలవానిని; మినుకు అంటే వేదం; వేదములే ఊర్పులుగ (నిశ్వాసములుగా) కలవానిని; వెన్న (మిసిమి) తినేవానిని (మేతలవాని) – మెరిసే నల్లని చాయగల దేహము కలవానిని; దిగంబరుని (దిస్సమొలవాని); గోగణముని (పసిన్) అడవియందు (కానన్) (మేతకై) త్రిప్పువాని; మురళిగలవాని ; మువ్వంక – మూడు వంకల; మురువు అంటే సౌందర్యం. శ్రీకృష్ణుడు మూడు వంకరలుగా నిలబడడం చేత అందము గూర్చువాడట. అలా నిల్చొనడాన్ని త్రిభంగి అంటారు. తద్విపుల మహిన్ – ఆ విఠలాధీశుని గొప్ప మహిమను; ప్రామఱ్ఱి క్రీనీడ – ప్రాత మఱ్ఱిచెట్టు నీడలో; విడిది – నివాసముగా కల, ప్రోడ – వివేకి అయిన శివుడు; నుడువున్ – చెప్పును.