మహాకవి తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యము’

కాశీలో మృతి చెందినవారికి – వారెటువంటివారైనా సరే – జన్మరాహిత్యమట. మరణసమయంలో శివుడే స్వయంగా వారికి చెవిలో పంచాక్షరీమంత్రం ఉపదేశిస్తాడట. వారికి కైవల్యప్రాప్తట. వారు శివసారూప్యంచెందుతారట. అంటే శివుని రూపాన్ని పొందుతారన్నమాట. అది ఎలాగో చెబుతున్నాడు కవి.

ఒకనాడుఁ దీర్థోపయోగిగాని శఠుండు
         నౌఁదల ధరియించు నభ్రగంగ
నాప్రొద్దు పొయిరాఁజనట్టి నిర్పేదయు
         భోగించు నైశ్వర్యములెనిమిదియుఁ
బుష్కరాక్షుల పొంతఁబోని వర్షవరుండు
         దేహార్ధమునఁ దాల్చుఁ తీగఁ బోఁడి
నాయుధ ప్రభఁగాంచి యలఁగు భీరువుఁ బూను
         వాఁడి ముమ్మోముల వేఁడి యలుగు

మలిన వర్తనుఁడును సుధాలలితమూర్తి
మించి వర్తించు, మతిలేని మేదకుండు
మౌనివర్యులఁ జదివించు మఱ్ఱి నీడఁ
బంచముఖువీట మేనోసరించెనేని.

పంచముఖుడు అంటే శివుడు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములనే ఐదూ శివుని ముఖాలు. పంచముఖుని వీట (పురములో) – అంటే కాశిలో – మరణిస్తే (మేనోసరిస్తే) – ఒక్కరోజు కూడా ఏ తీర్థమూ సేవించని మూఢుడు కూడా నెత్తిమీద గంగని ధరిస్తాడట. కాశీలొ మరణించగానే శివుడై పోతాడుగా మరి! ఆప్రొద్దు పొయి రాజనట్టి కటిక పేదవాడు కూడా కాశీలో మరణిస్తే అష్టైశ్వర్యాలూ అనుభవిస్తాడట. పుష్కర + అక్షులు – తామరపువ్వువంటి కన్నులుకలవారు – స్త్రీలు; ఏనాడూ స్త్రీల వద్ధకు వెళ్ళని నపుంసకుడు (వర్షవరుడు) కూడా శివునిలాగా అర్ధనారీశ్వరుడౌతాడు. ఆయుధముల కాంతిని చూస్తేనే భయపడిపోయే పిరికివాడు కూడా కాశీలో మరణించినంత మాత్రాన వాడియైన మూడు మొనలుగల తీక్షణమగు ఆయుధము (త్రిశూలము)ను చేబూనుతాడట.

చెడు నడత గలవాడు కూడా (మలినవర్తనుడు) కాశీలో మరణిస్తే అమృతమువలె స్వచ్ఛమైన దేహముకల చంద్రుని (సుధాలలితమూర్తి) మించి ప్రకాశిస్తాడట. మతిలేని స్తబ్ధుడు కూడా కాశీలో మరణిస్తే మఱ్ఱి చెట్టునీడన మౌనివర్యులకే విద్యాబోధ చేస్తాడట. (కైలాసంలో ఒక పురాతనమైన మఱ్ఱి చెట్టు నీడలో పరమశివుడు మునిగణానికి ఆధ్యాత్మికోపన్యాసాలిస్తూ ఉంటాడని ప్రతీతి.)

[దీనిమీద ఎవరో కవిగారు ఈ పారడీ వ్రాశారు: –

కాశిలో బట్టతలవాడు గంగమునిఁగి
జడముడి ధరించు దానిపై నవధరించు
ఫణిఫణారత్నరుచి దానిపై వహించు
మొలకజాబిలి జాజిపూమొగ్గవోలె
]

ఇక కాశీలో ఉన్న వార కాంతల సౌందర్యాన్ని రామకృష్ణుడు ఇలా వర్ణిస్తున్నాడు.

మొలక చీఁకటి జలజల రాల్పఁగా రాదె
         నెఱులు మించిన వీరి కురులయందు
కెరలించి యమృతంబు గిలకొట్టఁగా రాదె
         ముద్దుచూపెడి వీరి మోవులందు
పచ్చిబంగారు కుప్పలు చేయఁగా రాదె
         గుబ్బు మీఱిన వీరి గుబ్బలందు
పండు వెన్నెల తేటఁ బరిఢవింపఁగ రాదె
         నగవు గుల్కెడి వీరి మొగములందు

నౌర! కరవాఁడి చూపుల యౌఘళంబు,
బాపురే! భూరి కటితటీ భారమహిమ
చాఁగు! మదమందగమన లక్షణములనఁగ,
నేరుపుల మింతురప్పురి వారసతులు.

ఆ పురములోని వారసతులు (వేశ్యలు) వాళ్ళ నొక్కులు తిరిగిన (నెఱులు మించిన) శిరోజాల్ని విదిలిస్తే చిమ్మచీకటి జలజలా రాలుతుందిట. అంటే అంత నల్లటి కురులన్నమాట వాళ్ళవి. వాళ్ళ పెదవులనుండి అమృతాన్ని గిలకొట్టవచ్చట. అంటే వాళ్ళ పెదవులనుంచి అమృతం చిప్పిల్లుతూ వుంటుంది. మదించి, నిక్కిన వారి వక్షోజాలనుండి బంగారం కుప్పలు కుప్పలుగా తీయవచ్చట. పండు వెన్నెలలోని ప్రసన్నత నవ్వులొలికే వారి ముఖాలలో వెల్లివిరిస్తుందిట. ఇక మిక్కిలి వాడి అయిన వారి చూపుల తీక్షణత, పెద్దవైన పిరుదుల భారంతో మదించిన ఏనుగులవలె మెల్లనైన వారి నడకల సంగతా? భళీ! ఇక ప్రత్యేకించి చెప్పే పనేముంది? వారవిద్యలలోని నేర్పరితనంలో ఎంతో అతిశయించిన వారట – ఒకరిని మించిన వారు ఒకరట – ఆ పురంలోని వేశ్యకాంతలు.

సారథి ఛాందసుండు బడిసాగదు చక్రయుగంబు ప్రాత పం
చారపు గుఱ్ఱముల్ రథియు శౌర్యమునం దరమాని సాత్మ వి
స్తారము ఖండఖండములు తానఁట మాసరి” యంచుఁ దత్పురిం
దేరులు నవ్వు శంకరుని తేరిని గేతన కింకిణీ ధ్వనిన్

కాశీపురిలో ఉన్న రథాలు (తేరులు) శంకరుని రథాన్ని చూసి నీవా మాకు సాటి అని ఆక్షేపిస్తున్నాయిట. (త్రిపురాసుర సంహారానికి శంకరుడు వెళ్ళినప్పుడు, భూమి ఆయనకు రథం అయింది, బ్రహ్మ సారథిగా వ్యవహరించాడు, సూర్య చంద్రులు రథానికి చక్రాలయ్యాయి, నాలుగువేదములు ఆ రథానికి గుఱ్ఱాలు.) సారథి బ్రహ్మ ఛాందసుడట! ఈ పదం చాదస్తుడు అనే అర్థంలో వాడతారు. అసలు ఛాందసుడు అంటే వేదపండితుడు అని అర్థం. ఇక రథచక్రాలంటారా – సూర్యచంద్రులు. ఒకటి పెద్దది ఒకటి చిన్నది – రథం నడవదు! గుండ్రంగా తిరుగుతుంది. లేదా ఒకటి ఉన్నప్పుడు మరొకటి ఉండదు. ఎందుకంటే సూర్యుడు పగలు ఉంటే చంద్రుడు రాత్రి ఉంటాడు కదా. కట్టినవి ప్రాత పంచారపు గుఱ్ఱాలు. అంటే మార్పులేని పాతరీతి నడకలు కలిగినవని అర్థం. వేదాల్ని ప్రాత పంచారపు గుఱ్ఱాలంటారు. ఇక రథి సంగతి చూద్దామా అంటే అతడు శౌర్యంలో అరమానిసి అట. శివుడు అర్థనారీశ్వరుడు కదా! రథం భూమి కదా. ఆత్మ విస్తారము – అంటే రథం యొక్క స్వరూపము. అతుకులు బొతుకులతో కూడి ఉందట. ఖండఖండములు. మరి ఇలాటి లోపాలున్న రథం మాకు సరిసాటా? అని ప్రశ్నిస్తూ ఎగతాళిగా నవ్వుతున్నాయిట కాశీపురిలోని మేటి రథాలు వాటికి కట్టిన జెండాకి ఉన్న మువ్వలు కింకిణీ ధ్వనులు చేస్తుండగా.

కాశీమహాపుణ్యక్షేత్రంలో పవిత్ర గంగానది ఒడ్డున యోగులు నివసించే సిధ్ధాశ్రమంలో అపర సూర్యుడిలా వెలుగొందుతూ అగస్త్యమహర్షి తన భార్య లోపాముద్రతో కలిసి అనుకూలదాంపత్యం నెరుపుతూ వున్నాడు. కలశసూతియైన (కుండలో పుట్టినవాడునూ) తారకబ్రహ్మవిద్యా రహస్యజ్ఞాత (నరులను సంసారసాగరము నుండి తరింపచేసే తత్త్వ విద్యారహస్యముల నెరిగినవాడునూ), చుళుకితాంభోరాశి (తన పుడిసిట్లో – అరచేయిని కొంచెం గుల్లగా వంచితే దాన్ని పుడిసిలి అంటారు – సముద్రాన్ని పట్టి త్రాగినవాడునూ), అయిన అగస్త్య మహర్షి మునిజన సముదాయం సేవలందుకుంటూ వైభవంగా నివసించాడు.

అలా ఆయన కాశిలో పెక్కుకల్పంబులున్న తరువాత, ఒకప్పుడు వింధ్య పర్వతం మేరుపర్వతంపై అసూయ చెంది రోజురోజుకీ పైకి పెరుగుతూ సూర్యచంద్రుల గమనానికి అడ్డుగా నిలిచిందిట. దేవతలూ మునులూ దాని గర్వమణచడానికి అగస్త్యుడే సమర్ధుడని అతన్ని ప్రార్ధించగా, గొప్పవారు పరవిపత్ ప్రతికార తత్పరులు (ఇతరులకు ఆపదలు కలిగించిన వారికి ప్రతీకారము చేయుట యందు మిక్కిలి ఇష్టము కలవారు) కావున, వింధ్య యొక్క గర్వమణచేందుకు కాశీపురిని వదలి భార్యాసమేతుడై బయలుదేరాడు.

గాఢతపోనిధియైన అగస్త్యుని చూచి వింధ్యభూధరము (పర్వతము) పొంకము, బింకము దక్కి (కోల్పోయి) భయకంపితమై కలుగులోనికి చొరబడే కుళీరము (ఎండ్రకాయ) లాగ నేలకి శిరస్సువంచి వినమ్రంగా అణిగిపోయింది. ఆప్పుడు అగస్త్యుడు వింధ్యతో ‘నేను దక్షిణాపథానికి వెళుతున్నాను, నేను తిరిగి వచ్చేదాకా ఇలాగే వుండ’మని ఆదేశించి, సపత్ని లోపాముద్రతో సహా దక్షిణాపథానికి తరలివెళ్ళి అక్కడే ఉండిపోయాడు. వింధ్యాచలము అలాగే వొదిగి ఉండిపోయిందిట.

ఓ లలితాంగి! ఇందు సుఖముండు మృకండు కణాదగాధి వా
థూలస ముఖాతిరిక్త చరితుండు మతంగ మహాతపస్వి ని
ష్కాళగళుండు నిర్యువతిగాత్రుఁడు నిర్నిటలేక్షణుండు ని
ర్వ్యాళ విభూషణుండు నగు నంబర కేశుఁడనంగఁ బెంపుగన్

అగస్త్యుడు లోపాముద్రతో చెబుతున్నాడు. ఓ సుకుమారమైన శరీరము కలదానా! ఇది మతంగమహాముని నివసించే చోటు. ఆయన మృకండుడు, కణాదుడు, గాధి, వాథూలస మొదలైన ఋషులను మించిన చరితము కలవాడు (అతిరిక్త చరితుడు). ఈతడు కంఠమున విషమును ధరించినవాడు కాదు; శరీరంలో నారిని సగభాగంగా ధరించినవాడు కాదు; నుదుట మూడవ కన్ను లేనివాడు; సర్పములని ఆభరణంగా ధరించినవాడు కాదు. ఈ తేడాలు తప్ప అపర శివుడు అనదగ్గవాడు!