పొదుపు సమీకరణాలు

ఈ పొదుపు మహోత్సవం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుండగా, మూడు నెలల తరువాత, ప్రద్యుమ్నుడికి బల్బ్ వెలిగింది. ఆశ్చర్య పోయాడు. ఔరా! అనుకున్నాడు. ఈ విషయం తేల్చుకోవాల్సిందే అనుకున్నాడు. ఇందుకు తగిన ధైర్య స్థైర్యాలను, చాకచక్యాలను ప్రసాదించమని ఆ భగవంతుడిని ప్రార్ధించాడు.

ప్రద్యుమ్నుడు పొదుపు ఉద్యమం, దాని పుట్టు పూర్వోత్తరాలను గురించి లైబ్రరీలో కూచుని చదివాడు. దైనందిన జీవితంలో పొదుపు పాత్ర, గృహస్థు ధర్మాలు అన్న విషయంపై విశ్లేషాత్మక వ్యాసాలు చూశాడు. ‘ఈ వేళ పొదుపు చేయండి, రేపు చీకు చింతా లేకుండా ఉండండి’, అనే భీమా వాళ్ళ వ్యాసాలు, ‘రేపటి సుఖం కోసం ఈ వేళ కాలిపొండి’, లాంటి వ్యంగ్య వ్యాసాలు కూడా పరికించాడు. సైంటిస్టు ఉద్యోగానికి కూడా ఇంత శ్రమ పడలేదు పాపం.

తగు విధంగా సమాయత్తుడై ఒక శనివారం సాయంకాలం ప్రభావతి దేవికి చర్చలకు సంబంధించి నోటిస్ జారీ చేశాడు. రేపటి నుంచి మొదలయ్యే వారంలో ఎప్పుడైనా తమకు వీలైన రోజున ‘మన ఇంట్లో పొదుపు’ అనే అంశం మీద చర్చలకు ఆహ్వానిస్తున్నాను అని. మీరు తగు విధంగా సమాయత్తమై తేదీ నిర్ణయించగలరు అని వినతి చేసుకున్నాడు. సమాయత్తం దేనికి, ఇప్పుడు కూర్చుందామా అన్నది ప్రభావతి. రేపు ఉదయం కూర్చుందాం అన్నాడు ప్రద్యుమ్నుడు. ప్రభావతి ధైర్యానికి ముచ్చటపడి పోయాడు ప్రద్యుమ్నుడు, ఏ విధంగానూ తయారు కాకుండా చర్చలకు సిద్ధం అయిందని.

ఆదివారం ఉదయం చర్చలకు కూర్చున్నారు. ప్రద్యుమ్నుడు ఉపన్యాసం మొదలు పెట్టాడు.

“గత నాలుగు నెలలగా మన ఇంట్లో పొదుపు ఉద్యమం సక్రమంగానూ, సవ్యంగానూ సాగిపోతోంది. రేపు మనం నవ్వుతూ బతకడానికి ఈ వేళ ఏడ్చినా ఫరవాలేదు అనే పొదుపు ధర్మ సూత్రం ఆధారంగా, రేపు మనకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు బంగారంలా ఉండాలని, అబ్బాయి ఇంజినీరు, అమ్మాయి డాక్టరు కావటానికి, ఇంత చదివినా ఒక వేళ ఉద్యోగం దొరకపోతే, బతకడానికి కూడా, ఈ వేళ సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా ఉద్రేకంతో పొదుపు చేసేస్తున్నాం. ఏ తల్లి తండ్రులైనా కోరుకునేదేముంది, పిల్లల బంగారు భవిష్యత్తు కాక అనుకుంటూ ఆనంద బాష్పాలు రాలుస్తూ పొదుపు కార్యక్రమంలో నిమగ్నమయి పోయాం. అప్పుడప్పుడు ఇస్త్రీ చేసేటప్పుడు నా కళ్ళముందు ఒక 20-22 ఏళ్ళ తరువాత జరగబోయే సన్నివేశాలు కనిపిస్తున్నాయి కూడా.

అబ్బాయి ఇంజినీరింగ్‌లో దేశం లోనే ఫస్ట్ వచ్చేసి, ‘అమ్మా నేను పాస్ అయ్యానమ్మా!’ అంటూ వీధి చివరనుంచి అరుస్తూ పరిగెత్తుకు రావడం, ఇక్కడ నువ్వు వంటింట్లోంచి చెయ్యి తుడుచుకుంటూ ‘బాబూ కన్నా పాస్ అయ్యావా, నాకు తెలుసు నువ్వు పాస్ అవుతావని బాబూ’ అంటూ పరిగెత్తడం, అమ్మా అంటూ వాడు, బాబూ అంటూ ఆనంద బాష్పాలు కారుస్తూ నువ్వూ వీధి మధ్యలో కలుసుకోవడం, ఒక రెండు మూడు నిముషాలు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఆనంద బాష్పాలు మళ్ళీ మళ్ళీ రాల్చడం, వాడు నీ కాళ్ళమీద పడి, ‘అమ్మా ఆశీర్వదించు ప్రపంచం లోనే ఫస్ట్ వచ్చేటట్టు ఆశీర్వదించు మాతా’ అనడం, నువ్వు వాడిని లేవదీసి, హత్తుకొని ‘బాబూ నా కలలు నిజం చేశావు, నా కష్టానికి ఈ వేళ ఫలితం చేకూర్చావు’ అంటూ, వీధిలో వాళ్ళంతా చప్పట్లు కొడుతుండగా, డ్రమ్ములు మోగిస్తుండగా, తూతూబాకాలు ఊదుతుండగా వాడిని ఇంట్లోకి తీసుకొస్తావు. ఇదంతా నా కళ్ళకు కట్టినట్టుగా డెబ్భై మిమీ సినిమాగా కనిపిస్తోంది.

ఆ సమయంలో కూడా నేను ఇంటిలో ఒక మూల నుంచుని ఇస్త్రీ చేసుకుంటూ నిలబడే ఉన్నాను.”

“అదేం, మీరు కూడా నాన్నా అంటూ పరిగెత్తుకు రావచ్చు కదా?”

“నేను పరిగెత్తుకు వస్తే ఇస్త్రీ ఆగిపోతుంది, పొదుపు ఆగిపోతుంది, అమ్మాయి డాక్టరీ ఆగిపోతుంది.”

“మీ ఉద్దేశ్యం ఏమిటి, మీరు చెప్పదలచుకొన్నదేమిటి? సూటిగా చెప్పండి.”

“నా కాఫీలతో మొదలైన పొదుపు, నా ఇస్త్రీలతో సాగి, నా పుస్తకాలు పోగొట్టి, నా సిగరెట్ల మీద రేషన్ పడి, నెలకోమారు చేసుకునే పార్టీలు ఆగి, అంతా అంతా అంతా నాచుట్టే పొదుపు ఎందుకు సాగుతోందని ప్రశ్నిస్తున్నాను. నీకు ఏ మాత్రం బాధ్యత లేదా? ఎందుకు! ఎందుకు!! ఎందుకు!!!” ముమ్మారు ఆక్రోశించాడు ప్రద్యుమ్నుడు.

“నేనేం ఖర్చు చేస్తున్నాను కనుక, పొదుపు చేయటానికి?” నింపాదిగా ప్రశ్నించింది ప్రభావతి.

“పని మనిషిని మానిపిస్తే 125 నెలకి, అంటే 1500 ఏడాదికి, ఆదా అవుతాయి కదా?!”

“హుఁ, హూఁ!!” అని దీర్ఘంగా నిట్టూర్చింది ప్రభావతి.

“పని మనిషిని పెట్టింది నా కోసం కాదండీ. మీ పరువు నిలబెట్టడానికి. అంట్లు తోముతూ, వంట చేస్తూ, బట్టలుతుకుతూ, ఇల్లు ఊడుస్తూ ఉండగా, ఎవరైనా తలుపు తట్టితే, వెళ్ళి తలుపు తీస్తే, జుట్టు మొహం మీద పడి, చేతుల మీదా మొహం మీదా మసితో, సబ్బు నురగతో, చేతిలో చీపురుతో ఉన్న నన్ను చూసి వారేమనుకుంటారు? ఈ స్త్రీ రత్నం, ఈ భార్యామణి, ఈ పతివ్రతా శిరోమణి, ఇంత కష్టపడుతోందా? ఆ ప్రద్యుమ్నుడు భార్యను ఇన్ని ఇడుముల పాలు చేయుచున్నాడా? 3000 కిమీలు దాటి, ఆంధ్రా నుండి అస్సాము వచ్చి భర్త సేవలో ఈ సతీతిలకం ఒంటరిగా ఇంత శ్రమిస్తోందా?! అనుకుంటే మీ పరువేమి కావాలి? చూసిన వారు ఊరుకుంటారా? నలుగురికీ చెబుతారు. కాలనీలో అంతా మీ గురించి చెడ్డగా చెప్పుకుంటారు. మీకు చెడ్డ పేరు తెచ్చిన దానిగా నేను చరిత్రలో నిలచి పోలేనండి, లేను! లేనండీ లేను!” కనుల నీరు చిప్పిల్లి గద్గదస్వనంతో అంది.

కలకంఠి కన్నీరు చూడగానే ప్రద్యుమ్నుడు జాలి చెందాడు. ఎక్కడో హృదయంలో ఐసు గడ్డ బీటలు తీసింది. నిజమేమో ననిపించింది. తనే తొందరపడ్డాడేమో అనే అనుమానం పొడవడం మొదలెట్టింది. పోనీలే పాపం అనే జాలి ఊడలేయడం మొదలెట్టింది. కానీ బింకంగా అన్నాడు.

“వారం రోజుల క్రితం, ఎంత నీ పుట్టిన రోజు అయినా, 1500 పెట్టి చీర కొనడం అవసరమా? 1200ది సరిపోయేది కదా?”

“పెళ్ళైన తరువాత వచ్చే మొదటి పుట్టిన రోజు ఎల్లుండే. మీ కిష్టమైన రంగులోని కొత్త చీర కట్టుకొని, మీ కిష్టమైన మల్లెలు, విరజాజులు జడలో తురుముకొని, మీకు నచ్చే విధంగా పొడుగు జడలో చామంతులు అమర్చి, మీ పాదాలకు నమస్కరించి, మీ కన్నులలో మెరిసే ప్రేమ, అభిమానం, ఆప్యాయత చూసుకుందామనే నా ఆశతో మీ తృప్తి కోసం చేసిన పని అది. మీ సేవ కోసమే నేను జీవిస్తున్నాను ప్రాణనాధ్!! మీరే నన్ను అపార్ధం చేసుకున్నారా స్వామీ!?” గొంతు మళ్ళీ డగ్గుత్తిక పడింది.

చేతులారంగ మిమ్ము సేవించుకొరకు
కోడికూయంగనే మేలుకొందు, షవర్ కింద
చన్నీటి స్నానమొనరించి చేరెద వంటిల్లు
మీకు కాఫీ టిఫిన్లు విందులమర! ఆ… ఆ ఆ… ఆ అఅఆ ఆ… ఆ అ అ అ ఆ ఆ ఆ ఆయ్

ప్రభావతి గద్గద నిశాత నిషాదం ప్రద్యుమ్నుడి మనసులో విషాదం నింపింది. ప్రభావతి కన్నులలో విస్తరిస్తున్న ఆషాఢ మేఘాలని గుర్తించి, కంట కన్నీరు గోదావరి వరదలాగా ఉప్పొంగే సూచనలు గమనించిన ప్రద్యుమ్నుడి హృదయంలో మూడవ నంబరు ప్రణయ సూచిక ఎగరవేయబడి, ఆ ప్రేమ వడదెబ్బకి ఐసుగడ్డ పగిలి, కరిగి తనూ పూర్తిగా నీరై ఆవిరైపోయాడు.

తన ప్రియ సఖి కంట కన్నీటికి తన జీవితం పణంగా పెట్టి, ద్విగుణీకృతోత్సాహంతో భార్యా, పుట్టబోయే పిల్లల కోసం పొదుపు ఉద్యమం కొనసాగిస్తానని, తన జీవితం జీవనం తన భార్యాబిడ్డల కోసమేననీ శపథం చేసినట్టి ఆ ప్రద్యుమ్నుడు తన సంతోషం ప్రభావతికి సంతోషంగా పునరంకితం చేశాడు.

పాపం ప్రద్యుమ్నుడు, వెఱ్ఱి నాగన్న, నోట్లో వేలు పెట్టినా కొరకలేనివాడు.


రచయిత బులుసు సుబ్రహ్మణ్యం గురించి:

హాస్యరచయితగా బ్లాగ్లోకంలో ప్రసిద్ధులు. ఇటీవలే వారి రచనల సంకలనం “బులుసు సుబ్రహ్మణ్యం కథలు” ప్రచురించారు.

 ...