ఇక కంబరామాయణంలో అహల్యాపటలము ఇలా సాగుతుంది. (కంబరామాయణంలో అహల్యా వృత్తాంతానికి తెలుగుసేత పూతలపట్టు శ్రీరాములురెడ్డి చేసిన తెలుగు అనువాదం నుండి తీసుకున్నాను – సు.కొ.)
హర్షమొందుచు విదేహారామములఁ జూచి, వెలలి ప్రాకార సంవేష్టితమగు
మిథిలా నగరికొక్క మేటి యలంకార మైపొడవైన ధ్వజాలి వెలయు
బయటి ప్రహరికి వెల్పల వచ్చి నిల్వగా ర్హస్థ్యోచితము పతివ్రత గుణంబు
పదరి పాడోనరించి భర్తృ శాపంబున రాయియై పడియున్న రామ యపుడురామపదధూలి సోక పూర్వంబు మనసు
నలము నజ్ఞాన మత్తత దొలఁగ నెఱుక
తేఱ రూపాంతరం బొంది దేవునెదుటఁ
బొలుచు జని పోల్కిఁ దొలిరూపు దొలఁక నిలిచెక్రిందికి గంగఁ దెచ్చిన భగీరథు వంశమునం జనించు నో
సుందర! తృప్తిమై మెఱుపు చొప్పునఁ గ్రేవ నొదింగి నిల్చు నీ
చెందొవకంటి యిష్టపడి చెడ్డ యొనర్చిన పాకవైరికిన్
గ్రందుగ వేయి కన్నులిడు ఘౌతమ పత్ని యహల్య నాఁ జనున్కెంజడ లుల్లసిల్లు ముని కేసరి యట్టులు పల్క విన్న శ్రీ
కంజనివాసినీపతి వికస్వర పద్మదళాక్షుడిట్లనున్
నెంజలి యిట్టులౌట తన నెక్కొను పూర్వ కృతాపరాధమా?
యంజక యప్పుడొప్పిన స్వయంకృతమా? యెఱుఁగంగఁ బల్కవే?అనవిని భూరి విజ్ఞుడగు నమ్ముని యిట్లను సద్గుణాలయ
విను మును వజ్రియూర్ధ్వగత వీర్యుడు గౌతముఁడింట లేని వే
ళను హరిణాక్షి చంద్రముఖి లాలిత లక్షణ లక్షితాంగి యౌ
వనిత యహల్యతోఁ గలయ వాంఛ వహించె మనంబు లోపలన్తొలఁగ కహల్య చూపులను తూపులు మార నిశాత సాయకం
బులు మది గాఁడ విజ్ఞతయు బోవ మదిం గల యూరటంబుచే
నలయుచునున్న యింద్రుఁడొక యప్పుడు సాహసవృత్తి నాగృహ
స్థులకు వియోగముంగొలిపి చొచ్చెను గౌతమవేషియై యటన్ఇరువురు చేరి కామమను నింపగు నాసవమానుచుండు నా
తరి నితఁ డింద్రుఁడంచెఱిగి ధర్మమధర్మము మానసంబునం
తరయక సమ్మతించి చెలి యంగజ సౌఖ్యములందు దేలె న
త్తరుణమునన్ మునీశ్వరుఁడు తత్తఱ వచ్చె గృహంబు చేరఁగన్విలుపని లే కమోఘముగఁ బెంపఱఁ దిట్ట వరంబులిచ్చి వే
ల్పుల యెకినీనిఁ జేయఁగల ప్రోడఁడు గౌతమమౌని డాయ రాఁ
దలఁగక లోక మొల్లెడ సదా చెడకుండెడు నిందఁగొన్న య
వ్వెలఁది వడంకి నిల్చె బల భేది చనందోడఁగెన్ బిడాలమై.అనుపమ నీలిశాలియగు నమ్ముని కన్నుల నిప్పులుర్లఁగాఁ
గని కథ యంతయుం దెలిసి కార్ముకవీర! భవత్కరచ్యుతో
గ్ర నిశిత కాండముం జెనయు ఖండిత వాక్కులతో శపించె వ
జ్రిని పది నూర్ల యోనుల శరీరము నొందుము యంచు నత్తఱిన్క్షణములో శాపఫలమొంది జంభభేది
యెల్లిదంబగు లజ్జతో నేగుపిదపఁ
జెలువఁ గని వెలవెలఁది చేష్టలను పొంది
నట్టి నీవును శిలవగుమని శపించెమౌనికాళ్ళం బడి మడఁతి యో మునినాథ మన్నిపు మీ తప్పు నన్ను గావు
పిన్నల తప్పులఁ బెద్దలు సైఁచుట తగునని నీతివేత్తలు వచింత్రు
రని వేఁడ జ్వాలల నార్చు రుద్రుని పోలెఁ గ్రుద్ధుడై కను మునీంద్రుడు నంత
సతియెడ దయతో బ్రసన్నుఁడై వనమాలి రాముని శ్రీపాద రజము సోఁకనీ యథారూపమెందుదో నెలఁతయనియె
నింద్రుఁకొని నిలింపులు ముని యెడకు వచ్చి
వేఁడ నతని యోనుల మాన్చి వేయి కనుల
నిచ్చి పంపె నహల్య రాయిగను పడియె.
ఈ రెండు కథనాల మధ్య తేడాలు కొన్ని: వాల్మీకి కథలో ఇంద్రుని విషయం అహల్యకు ముందుగానే తెలుసు. కంబరామాయణంలో వచ్చింది భర్త కాదని అహల్య మధ్యలో గ్రహించినా, ఆ నిషిద్ధ సుఖాన్ని వదలలేకపోతుంది. అదికాక కంబరామాయణంలో అహల్య భర్త పూర్తిగా జపతపాదులలో మునిగినట్లు మనకు ముందుగా సూచించడం కూడా కథకు సంక్లిష్టతను జోడిస్తుంది. తమిళకథలో ఇంద్రుడు పిల్లి రూపంలో పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. జానపదంలో లోకప్రియమైన ప్రసక్తి ఇది. కథా సరిత్సాగరంలో కూడా ఉంది. గౌతముడు ఇంద్రునికి ఒళ్ళంతా సహస్రయోనులు కలగాలని శాపమిచ్చి, తరువాత దాన్ని సహస్రనయనాలుగా మారుస్తాడు; అహల్యను సుఖస్పందనలేని రాయిలా మారుస్తాడు. వాల్మీకి కథలో కనిపించని ఈ వివరాలు, దక్షిణ భారతంలో జానపదుల కథల్లో, తమిళ శాసనాల్లోనూ, ఇతర దక్షిణ భారత భాషల రామాయణాల్లోనూ కనిపిస్తాయి. అంటే, వాల్మికి కథను ఉపయోగించుకోవడమే కాక, కంబకవి తన నివసిస్తున్న ప్రాంతంలోని జానపద సంప్రదాయాలను తనలో కథలో గుప్పించాడన్నమాట. ఈ కథలు ఇతర రామాయణాల్లో కనిపించడానికి కూడా కంబ రామాయణమే ఆధారం కావచ్చు.
కథాశిల్పం విషయంలో కూడా కంబ రామాయణంలో నాటకీయత ఎక్కువ. కంబరామాయణంలో ముందుగా రాముని పాదధూళి తాకి నల్లరాయి అహల్యగా మారుతుంది. ఆ తరువాతే ఆమె కథ మనకు తెలుస్తుంది. నల్లరాయి, ఎత్తైన ప్రదేశంపై రాముని రాకకు ఎదురుచూస్తూ ఉండటమే అద్భుత దృశ్యావిష్కారానికి ప్రతీక. అహల్య శాపవిమోచనం, జడమైన రాయి రక్తమాంసాలున్న మనిషిగా మారడం, పరమాత్మ స్వరూపానికి భక్తిభావం చూపే ఆత్మ ప్రతిస్పందనలా అనిపిస్తుంది. అంతేకాక, కంబరామాయణంలో అహల్య వృత్తాంతానికి అంతకు ముందే చెప్పిన తాటకి వృత్తాంతానికి కూడా సంబంధం చూపుతుంది. తాటక కథలో రాముడు పాపభంజనుడు. శత్రువులకు జడత్వాన్ని, మృతిని కూర్చేవాడు. అహల్య కథలో జడత్వానికి ప్రాణం పోసేవాడు; వరాల ధార కురిపించే ఘన నీల మేఘం. కంబని కథలో రాముడు అచ్చమైన తమిళ కథానాయకుడు. అరిభంజనుడు, భక్తప్రియరంజనుడు. అహల్య శాపవిమోచనం, లోకంలోని సకల జనులకు వారి పాపాలనుండి విముక్తి కలిగించడమే రాముని అవతార లక్షణంగా చూపిస్తుంది.
వాల్మీకి రామాయణంలోని రాముడు సంపూర్ణ మానవుడు. మానవరూపంలో కష్టసుఖాలనుభవిస్తూ, ఎలా ధర్మబద్ధమైన జీవితం గడపాలో రాముడి ద్వారా లోకానికి చెప్పబడింది. బాలకాండలోనూ, రావణుని సంహరించే సమయంలో రాముడిని పరమాత్మ స్వరూపంగా, అవతారపురుషుడిగా వర్ణించే సంఘటనలు, తరువాత జత చేసిన ప్రక్షిప్తాలని పండితుల వాదన. కంబరామాయణంలో మాత్రం రాముడు కథలో ఆసాంతం భగవత్ స్వరూపమే. కాబట్టి అహల్య కథ వంటి సంఘటనలలో భక్తి, ఆరాధనా ప్రకటనలు గాఢంగా కనిపిస్తాయి. కంబరామాయణం పన్నెండవ శతాబ్దంలో భక్తి ఉద్యమ ప్రభావంలో రాసినది. కంబ కథనంలో రాముడు చెడుని తొలగించి, మంచిని సంరక్షించే క్రమంలో అహల్యతో మొదలుకొని, రావణుడి వధించే వరకూ తన ధర్మాన్ని నిర్వర్తించినవాడు. వైష్ణవ భక్తి సంప్రదాయపు నమ్మాళ్వార్ ప్రతీకలు ఇందులో కనపడుతాయి. నమ్మాళ్వార్ రాసిన ఈ పాశురాన్ని చూడండి:
కఱ్పార్ ఇరామ పిరానై అల్లాల్ మట్ఱుం కఱ్పరో?
పుఱ్పా ముదలా పుల్లెఱుంబాది ఒన్ఱ్ ఇండ్రియే
నఱ్పాల్ అయోద్దియిల్ వాళుం చరాచరం ముట్రవుం
నఱ్పాలుక్కు ఉయ్‌త్తనన్ నాన్ముగనార్ పెట్ఱ నాట్టుళే. నమ్మాళ్వార్ 7.5.1
ఎఱిగి రామ ప్రభువును వేరొకరినెఱుగనేల?
గడ్డి మొదలు పాకే చీమవరకు ఎవరినొల్లక
శుభ అయోధ్యలో వసించు చరాచరమెల్లరికి
శుభమును కూర్చె బ్రహ్మసృష్టికిలలోన్
నమ్మాళ్వారు చూపిన ఇటువంటి భక్తిభావనలే కంబ రామాయణపు కావ్యమంతటా మనకు ప్రత్యక్షమవుతాయి.
పైన చూపిన విధంగా అహల్య కథ ఒకటే అయినా, భిన్నమైన కథనాలతో, రంగులతో ఎలా వేర్వేరుగా అల్లబడిందో, అలాగే వివిధ రామాయణాల్లో తరువాతి కవులు పూర్వకవుల కథకు తమవైన మెరుగులు దిద్దడం ద్వారా తమ సృజనాత్మకతను చాటుకోవడం కనిపిస్తుంది. ఒక రకంగా తరువాతి రామాయణాల కథనాలు, పూర్వ రామాయణ కథనాలకు అధి-చిత్రీకరణలు. ఉదాహరణకు, 16వ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మ రామాయణం వంటి కథల్లో రాముడు వనవాసం వెళ్ళేటప్పుడు సీత తనతో రాకూడదంటాడు. సీత రామునితో వాదిస్తుంది. ముందుగా మామూలు జవాబులే చెబుతుంది: ధర్మపత్నిగా అతని కష్టసుఖాలలో పాలు పంచుకోవాలి. అతడు వనవాసం చేస్తే తాను కూడా వనవాసిగా మారాలని చెబుతుంది. రాముడు కూడదంటాదు. సీత అప్పుడు రోషంతో, “ఇంతవరకూ లెక్కలేనన్ని రామాయణాలు వచ్చాయి. ఏ ఒక్క రామాయణంలోనైనా రామునితో అడవికి వెళ్ళని సీతను ఎక్కడైనా చూశామా?” అని ప్రశ్నిస్తుంది. దాంతో రాముడు ఒప్పుకుంటాడు; సీత రామునితో అడవికి వెళ్తుంది. ఇటువంటి కథనం వేరే రామాయణాల్లో కూడా కనిపిస్తుంది.
కంబ రామాయణం కూడా తరువాత వచ్చిన రామాయణాలపై తన ప్రభావాన్ని చూపించింది. తెలుగుదేశంలో వచ్చిన తెలుగు రామాయణాలలో, మలయాళ దేశపు దేవాలయాల్లో వేసే రామాయణ రూపకాల్లోను ఈ ప్రభావం మనం చూడవచ్చు. ఆగ్నేయాసియాలో వచ్చిన రామాయణాలపై కూడా కంబ రామాయణ ప్రభావం కనిపిస్తుంది. కంబరామాయణమే థాయి భాషలో వచ్చిన రామకిఎన్ ఆధారమని పరిశోధకులు నిరూపించారు. ఉదాహరణకు, థాయి భాషలో పాత్రల పేర్లకు సంస్కృతపు పేర్లు కాక తమిళ రామాయణంలో వాడిన కొన్ని పేర్లు వాడడం: థాయి రామాయణంలో ఋష్యశృంగుడి పేరు కలైక్కోటు. తులసీదాసు రాసిన రామచరితమానస్ లోనూ, మలేషియన్ భాషలోని ‘హికయత్ సేరి రామ్’ అన్న కథలోనూ కంబరామాయణ ప్రభావాలు కనిపిస్తాయి (సింగరవేలు, 1968).
భిన్న మార్గాల ద్వారా రామాయణం ఉత్తరం దిశగా పంజాబ్, కాశ్మీర్‌ల గుండా చైనా, టిబెట్ మరియు తూర్పు తుర్కిస్థాన్‌కీ, సముద్రం మార్గం ద్వారా దక్షిణ దిశలో గుజరాత్, దక్షిణ భారతం గుండా జావా, సుమత్రా మరియు మలయాదేశాలకి, భూమార్గం ద్వారా తూర్పు దిశలో బెంగాల్ గుండా బర్మా, థాయిలెండ్ మరియు లావోస్‌కి వెళ్ళాయి (దేశాయి 1970, 5).