గాన సూర్యకాంతి: బాలమురళి

త్రిశక్తి (సర్వశ్రీ) రాగం మాదిరిగానే గణపతి (స, గ, ప), సిద్ధి (స, రి, ధ) రాగాల్లో కూడా మూడు స్వరాలే ఉంటాయి. గణపతి రాగ కృతి రచన ఈ క్రింది విధంగా ఉంటుంది.

గం గం గణపతిం భజేహం
గంగాపతి సుతం

గణనీయ గణ గణనీయం
సదా వందనీయం

త్రిభువన సర్వం త్వదీయ రూపం
త్రికాల కూలం త్రిలోక దీపం
శుభకర మురళీ గానలాపం
సిద్ధి బుద్ధి సంతోష కలాపం

ఈ కృతి సూర్యకాంతి పుస్తకం మొదటి ముద్రణలో లేదు. సూర్యకాంతి-2 వస్తోందని బాలమురళిగారే అన్నారు. బహుశా అందులో పొందుపరిచే అవకాశం వుంది.

బాలమురళికి గణపతి ఇష్ట దైవం. వినాయకుడి మీద పదికి పైగా కృతులు కట్టారు. పాహి ప్రభో గణరాజ (హంసధ్వని), మహనీయ నమస్సులివే (సుముఖం), మహాదేవ సుతం (ఆరభి), సిద్ధి నాయకేన (అమృత వర్షిణి), శ్రీ సకల గణాధిపా (ఆరభి), పరి పరి నీ పదమే (హంస ధ్వని), గణాధిపం సతతం (నాట) వంటివి కొన్ని ఉదాహరణలు. నిను నెరనమ్మితి గణనాయక (ఖరహర ప్రియ) అన్న కృతి బాల మురళి రచనల్లో చాలా పెద్దది. కృతులూ, వర్ణాలూ, తిల్లానాలలో మహా ఉంటే నాలుగు చరణాలు మించి లేవు. ఇదొక్క కృతిలో మాత్రం ఆరు చరణాలు పైగా ఉన్నాయి. ఆఖరి రెండు చరణాలూ మరింత పెద్దవి. సాధారణంగా కచేరీల్లో వర్ణం పాడి గణపతి ప్రార్థన చేసాక వినాయకుడిపై పాటలు పాడరు. ఈ పద్ధతికి బాలమురళి వ్యతిరేకం. “గణపతి మీద కొన్ని వందల కృతులున్నాయి. అవన్నీ ఎందుకు పాడరు? కచేరీ మొదట తప్ప పాడకూడదని ఏ శాస్త్రం చెప్పింది? ఈ కచేరీలన్నీ మనం ఏర్పరుచుకున్నవే కదా? వినాయకుడి పాట ఎప్పుడైనా, ఎక్కడైనా పాడుకోవచ్చు. ఈ ఉద్దేశ్యంతోనే నేను కచేరీ మధ్యలో వినాయకుడి పాటలు పాడతాను,” అని ఈ మధ్య కలిసినప్పుడు అన్నారు.

వర్ణములు

కర్ణాటక సంగీతంలో అతి ప్రాముఖ్యత వున్న ఒక ప్రక్రియ వర్ణం. ఈ వర్ణ సంప్రదాయం అనాదిగా వుంది. ఒక రాగాన్ని పూర్తిగా వర్ణంలోనే విస్తరించడానికి అవకాశముందని పండితుల అభిప్రాయం. సంగీతం నేర్చుకునే ప్రారంభ దశలో వర్ణాలు కనీసం ఏడెనిమిది వస్తే కానీ కృతులకి వెళ్ళరు. దాదాపు సంగీతకారులు అందరూ వర్ణాలు కట్టినవారే. త్యాగరాజు మాత్రం వర్ణాల జోలికి పోలేదు. ఆయన శిష్యులు వర్ణాలు స్వర పరిచారు. బాలమురళి కూడా సుమరు పదిహేను వర్ణాలు కట్టారు.

వీటిలో – ‘సరగున గావుము వరగుణ నిలయే’ అన్న తోడి రాగ వర్ణం బాలమురళి స్వరపరిచిన మొట్టమొదటి వర్ణం. దీని వర్ణం అనేకంటే పదవర్ణం అంటే బావుంటుంది. మామూలు వర్ణానికీ, పద వర్ణానికీ చిన్న తేడా వుంది. వర్ణంలో పల్లవీ, అనుపల్లవి, ముక్త్యాయి స్వరం, ఒక చరణం వుంటాయి. చరణం తరువాత నాలుగైదు ముక్త్యాస్వరాలతో కూడిన చరణాలుంటాయి. ఇదీ వర్ణం యొక్క రీతి. సాధారణంగా వర్ణంలో చరణం తరువాత వచ్చిన చరణాల్లో సాహిత్యం వుండదు. కేవలం స్వరాలే ఉంటాయి. అలాగే పాడుతారు కూడా. కానీ పదవర్ణాల్లో ప్రతీ చరణానికి సాహిత్యం వుంటుంది. స్వరాలు పాడరు.

బాలమురళి వర్ణాలూ, పదవర్ణాలూ కూడా కట్టారు. ‘చలము చేసిన నీకేమి ఫలమురా గోపాల’ అన్న రామప్రియ రాగ వర్ణం కూడా పదవర్ణం క్రిందకే వస్తుంది. కృష్ణుడిపై కట్టిన ఈ వర్ణానికి రామప్రియ రాగం ఎన్నుకోవడం గమ్మత్తుగా అనిపించింది. ఖరహర ప్రియలో నిను నెర నమ్మితి గణనాయక, షణ్ముఖప్రియలో ఓంకార ప్రణవ నాదోద్భవ, కమాస్‌లో వేసారితినే వెదకి, అమృతవర్షిణిలో ఆబాల గోపాలమూ, శంకరాభరణంలో ఎంత సుదినమే నేడే ఏమని తెల్పుదునే, స్వరాష్ట్రంలో సాకార సద్గుణ, నాటలో ఏ నాదములో, వంటివి బాలమురళి వర్ణ సృష్టిలో మరికొన్ని.


ఆనందదాయని

ఆయన తరచుగా కచేరీల్లో పాడే అమ్మా ఆనంద దాయినీ గంభీర నాట వర్ణం అతి ప్రసిద్ధి చెందినది. ఈ వర్ణ రచనపై ఓ నలుగురికి పిహెచ్.డీలు వచ్చాయని ఈ మధ్య కలిసినప్పుడు చెప్పారు. ఈ వర్ణాన్ని వివిధ కాలాల్లో పాడానని చెబుతూ, ఇది ఫ్యూజన్ సంగీతంలో కూడా పాడటానికి అనువుగా ఉంటుందనీ, ఇంతవరకూ కృతులే తప్ప వర్ణాన్ని ఫ్యూజన్ సంగీతంలో వాడలేదని చెప్పుకొచ్చారు.

తిల్లానా

పూర్వం అంటే పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల్లో యక్షగానాలు అత్యంత ప్రజాదరణ కలిగిన అంశం. యక్షగానంలో నృత్యమూ, సంగీతమూ, వాచకమూ, అభినయమూ ఇవన్నీ కలబోతగా ఉంటాయి. కొంతకాలానికి నృత్యనాటికలొచ్చాయి. ఈ నృత్యనాటికల్లో కూడా సంగీతానికి ప్రధాన పాత్రుంది. సంగీతానికీ, నాట్యానికీ ఉన్న పెద్ద లంకె లయ. పాడినా, ఆడినా లయబద్ధంగా ఉంటేనే రాణిస్తుంది. ఈ లయ ఆధారంగా జతి స్వరాలుండేవి. జతిస్వరాల్లో స్వరం తప్ప సాహిత్యం వుండదు. ఈ జతిస్వరాలకి సాహిత్యం జతపరిచి దాన్నే తిల్లానాగా మలిచారని ఒక వాదనుంది. హిందూస్తానీ తరానాల నుండే తిల్లాన వచ్చిందని మరొక వాదనుంది. హిందూస్తానీ తిల్లానాలకీ, కర్ణాటక సంగీత తిల్లానాలకీ చట్రం ఒకటే అయినా లోపలి రూపం మాత్రం భిన్నంగా ఉంటుంది.


తిల్లానా – కుంతలవరాళి

ఈ తిల్లానాలు భరతనాట్యంలో ఒక ముఖ్య అంశం. వేగంగా సాగే లయ విన్యాస రచనకి అనుగుణంగా నృత్యం చెయ్యడం భరతనాట్యంలో ఒక అంశం. మామూలు సంగీత రచనల్లాగానే ఈ తిల్లానాల్లో కూడా పల్లవీ, అనుపల్లవీ, చరణాలుంటాయి. కాకపోతే చివరి చరణంలో మాత్రమే సాహిత్యం ఉంటుంది. పల్లవీ, అనుపల్లవీ, మొదటి చరణాల్లో లయ విన్యాసానికి సంబంధించిన తకిట తధిమి వంటివి ఉంటాయి. స్థూలంగా తిల్లానా అంటే ఇది. ఈ భరతనాట్యానికి కట్టిన తిల్లానాలు కాలక్రమేణా సంగీత కచేరీల్లో కూడా భాగమయ్యాయి. వేగంగా మధ్యమ కాలంలో పాట సాగడం వల్ల వినసొంపుగా ఉంటుంది.

తిల్లానాలు ప్రాచుర్యం పొందడానికి రాజాస్థానాలు కూడా ఒక కారణం. మహారాజా స్వాతి తిరుణాల్ నాలుగైదు తిల్లానాలు స్వరపరిచాడు. ఆనందభైరవి, ధన్యాస్రి, కళ్యాణి, పూర్వి కళ్యాణి రాగాల్లో కొన్ని తిల్లానలు కట్టారు. వీటిలో ఆనందభైరవి రాగంలో కట్టిన ‘ధిరనం తన తిల్లానా’ చాలా ప్రసిద్ధి చెందిన తిల్లానా. ఆనందంభైరవి రాగం నృత్యానికి అనుగుణంగా ఉంటుంది.


తిల్లానా – కదనకుతూహలం

ప్రముఖ సంగీతకారులైన త్యాగరాజూ, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి వారు ఈ తిల్లానాల జోలికి పోలేదు. ఆ తరువాత వారి శిష్యగణంలో కొంతమంది తిల్లానాలు కట్టినా, ఈ మధ్య కాలంలో వాటికి మరింత ప్రాచుర్యం తెచ్చింది బాలమురళే! ఈయన తిల్లానాలు అటు భరతనాట్యంలోనూ, ఇటు సంగీతంలోనూ చాలా పేరు తెచ్చుకున్నాయి. బాలమురళి అంటే తిల్లానాకి మారుపేరుగా చెప్పుకునేంత రీతిలో మారిపోయాయి. సంగీత కచేరీల్లో కూడా తిల్లానాలు ఒక భాగం అయ్యాక, ఇదీ ఒక తప్పనిసరి అంశంగా మారింది. భరతనాట్యంలో తిల్లానాలు ఆఖరి అంశంగా ఉంటాయి. కానీ కచేరీల్లో చివర్లో పాడినా, మంగళం పాడి ముగించడం ఆనవాయితీ. బాలమురళి అయితే తిల్లానాలు పాడిన తరువాత తత్వాలు వంటివి కూడా పాడతారు.

బాలమురళి సుమారు పదికి పైగా తిల్లానాలు కట్టారు. తిల్లానాలకి కాస్త హుషారు గొలిపే రాగాలు ఎన్నుకోవడం కద్దు. హిందోళం, బృందావని, కుంతల వరాళి, ద్విజావంతి, ఆహిరి భైరవి, కదనకుతూహలం, బేహాగ్, గరుడ ధ్వని రాగాల్లో తిల్లానాలు రచించారు. కేవలం ఒకే రాగంలో తిల్లానాలు కట్టడమే కాదు; వాటిని రాగమాలికగా మలిచారు. ఇంతకుముందు ఎవరూ రాగమాలికలో తిల్లానాలు కట్టలేదు. పైన చెప్పిన కొన్ని గతిభేద ప్రియ రాగమాలిక, ఠాయ రాగమాలికలు నిజానికి తిల్లానాలు. ఒక్క తిల్లానాల్లోనే రాగమాలిక చెయ్యడం, అలాగే అందులోనే గతిభేదం చెయ్యడం వంటి ప్రయోగాలు కేవలం బాలమురళికే సాధ్యం. ఇవన్నీ స్వరపరచడం ఒక ఎత్తు. జనరంజకంగా పాడడం ఒక ఎత్తు. బాలమురళి తిల్లానాలకి సాటి ఏవీ రావు. ఒక్క తిల్లానాలే కాదు; నాలుగైదు జావళీలు కూడా కట్టారు. జంఝాటి రాగంలో నాయికా నాయకులపై రెండు విడివిడిగా జావళీలు రచించారు.