చిత్రకవితలో ఒక భాగము బంధకవిత్వము, ఈ బంధకవిత్వములో వివిధ ఆకారాలకు సరిపోయేటట్లు అక్షరాలను ఉంచి పద్యాలు వ్రాస్తారు. ఇది పద్యముతో crossword puzzle లాటిది. తొలి బంధకవిత్వాలు (చక్రబంధము, గోమూత్రికాబంధము, మురజబంధము మున్నగునవి) మాఘుని శిశుపాలవధలో, భారవి కిరాతార్జునీయములో, కుమారదాసుని జానకీహరణములో ఉన్నాయి. గోమూత్రికాదులను ఏడవ శతాబ్దపు దండి తన కావ్యాదర్శము[6]లో ఉదహరించాడు. కాని అందులో నాగబంధము లేదు. ఈ దండి కావ్యాదర్శానికి తండి యలంగారం[7] అని ఒక తమిళ అనువాదము వుంది. అందులో ఇరట్టై నాగబందం (రెండు పాములతో బంధము)అని ఒక నాగబంధము ఉన్నది.
దండి దక్షిణ దేశస్థుడైనా (కాంచీపుర నివాసి అంటారు), ఈ తండి యలంగారం దండి వ్రాసినది కాదు, దండి అలంకారానికి అనువాదము కాబట్టి దీనికి తండియలంగారం అని పేరు వచ్చిందని తమిళ ఛందస్సు నెరిగిన పొన్ పశుపతి తెలిపారు. ఏది ఏమైనా, సంస్కృతములో మొట్ట మొదట కుండలినీ నాగబంధము కృష్ణకవి మందారమరంద చంపువులో కనబడుతుంది. ఈ కృష్ణకవి క్రీ.శ. 1650 కాలము నాటివాడు అంటారు[8].
కన్నడములోని కవిరాజమార్గములో కూడ నాగబంధము లేదు. కాని తెలుగులో నన్నెచోడుని కుమారసంభవములో ఒక నాగబంధము ఉన్నది. ఆ పద్యాన్ని 12వ చిత్రములో చూడగలరు. నన్నెచోడుడు బహుశా నన్నయకు సమకాలికుడని యింతకు ముందే నేను చర్చించాను.
నన్నెచోడునికి ఈ తండి యలంగారపు నాగబంధ చిత్రాలు పరిచితములై ఉండవచ్చును. దానిని, దక్షిణ దేవాలయాల స్తంభలను చూచి యితడు తన నాగబంధాన్ని కల్పించి ఉంటాడని నా ఊహ. ఎఱ్ఱ నైలాను తాడుతో చేసిన నాగబంధ ఏకరేఖ చిత్రాన్ని 13వ చిత్రములో చూడ వీలగును. దీనిని కత్తిరించి తలను, తోకను పెట్టితే అది నాగబంధపు చిత్రము అవుతుంది. సంస్కృతములో నాగబంధాన్ని 21 అక్షరాల స్రగ్ధరావృత్తములో వ్రాస్తారు, తెలుగులో సామాన్యముగా అదే 21 అక్షరాల చంపకమాలలో వ్రాస్తారు దీనిని ఇతర వృత్తాలలో కూడ వ్రాయవచ్చును. నేను ఈ మధ్య వ్రాసిన ఒక కొత్త విధమైన నాగబంధ కవిత ప్రార్థనా చిత్రాన్ని 14వ చిత్రములో చూపుతున్నాను.
9. ముగింపు
సుమారు వంద సంవత్సరాలకు ముందు సామాన్యముగా కులీనుల యిండ్ల స్త్రీలకు కూడ చదువు రాదు. చరిత్రలో ఆతుకూరి మొల్లలు, అవ్వయ్యారులు అరుదు. సామాన్య స్త్రీ పని వంటిల్లు, పిల్లల పెంపకము, పూజలు పునస్కారాలు, పండుగలు పబ్బాలు, యిత్యాదులే. చదువు లేకపోయినా మిగిలిన లలితకళలలో కూడ నాట్యము వారు చేయకూడదు. సానులు తప్ప సంసారుల యిళ్ళల్లో ఆడపడుచులు నాట్యమాడరు. ఇక మిగిలిందల్లా పూజ పాటలు, పెళ్ళి పాటలు, లాలి పాటలు పాడడము, దేవతాగృహములో, యింటి ముంగిలిలో, అరుగులపైన ముగ్గులు వేయడము. కాని యీ రెండు లలితకళలలో వారు ఎంతో ప్రావీణ్యతను గడించారు. తరతరాలుగా స్త్రీలు పాడిన పాటలు కొన్ని మరుగుబడిపోయినా, మరి కొన్ని యింకా చెలామణిలో ఉన్నాయి.
ముగ్గులు స్త్రీల సొత్తు, నాటికీ నేటికీ కూడ. ఆ కాలములోని కవయిత్రుల వలెనే ఈ కాలములోని పురుష రంగవల్లి కళాకారుల సంఖ్య తక్కువే. సుప్రసిద్ధ కళాకారుడు మనోహర్ దేవదాస్ Greenwell Years[9] అనే పుస్తకములో ముగ్గులపైన ఆసక్తి చూపే ఒక కుఱ్ఱవాడిని మిగిలిన వాళ్ళు పొట్టయ్యన్ అని ఎగతాళి చేసేవారని రాశాడు. ఈ పొట్టయ్యన్ పదము మన ఆడంగి వంటిది. మిగిలిన దేశాలలో మగవాళ్ళు ముగ్గులవంటి కళలలో ప్రవీణులైనా, మన భారతదేశములో యిప్పుడు కూడ యిది ఆడవాళ్ళ సొత్తే. ముగ్గులు వేయడానికి నేర్పు మాత్రమే కదు, ఓర్పు కూడ కావాలి. ముగ్గులు పెట్టడము నా ఉద్దేశములో ఒక తెరపీ (therapy) లాటిది. మనస్సుకు శాంతిని యిస్తుంది, మెదడుకు ఏకాగ్రతను యిస్తుంది. నేను ఎరిగి ఉన్నవారిలో కొందరు ఉదయము నాలుగున్నరకు లేచి గంట, గంటన్నర ముగ్గులు పెడతారు. మంచి ముగ్గులను వేసి సంతోషించడము మాత్రమే కాదు, దానిని తుడిచేటప్పుడు కష్టమవుతుంది. కాని పాత ముగ్గు ఉన్నచోట మరొక కొత్త ముగ్గు సృష్టించబడుతుంది. కాలచక్రములో దైనందినము జరిగే మార్పులలో యిదొకటి.
10. ముగ్గుపై కవితలు
ఒక రెండు కవితలతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను. మొదటిది ముగ్గుపొడి పైన, రెండవది (మత్తకోకిల ద్విపద) ఎన్ని విధాలైన ముగ్గులున్నా అవన్నీ ఆ సర్వేశ్వరునికి సమర్పించే ప్రార్థనాచిత్రాలే.
- ముగ్గుపొడీ, నువ్వొక పిడికెడు తెల్లటి పొడివి
నా తలపైన ఉండే ముగ్గుబుట్టకు తోడు నువ్వు
ఇంతలో ఆమె నిన్ను తన చేతిలో తీసికొంటుంది
మెల్లగా తన వ్రేళ్ళ ద్వారా నిన్ను రాలుస్తుంది
నువ్వు ఆశతో నిరీక్షించే చుక్కలయ్యావు
నువ్వు గీత లయ్యావు, వంపు లయ్యావు, గుండ్రటి వృత్తాలయ్యవు
నువ్వు భావా లయ్యావు, రూపా లయ్యావు, చిత్ర లయ్యావు
నువ్వు పువ్వు లయ్యావు, భ్రమరా లయ్యావు
నువ్వు నెమ ళ్ళయ్యావు, పాము లయ్యావు
నువ్వు కల లయ్యావు, ఆనందపు టల లయ్యావు,
నువ్వు ఆట లయ్యావు, పాట లయ్యావు
నువ్వు నవ్వు లయ్యావు, దివ్వె లయ్యావు
నువ్వు చైతన్య మయ్యావు, నువ్వు జీవంత మయ్యావు
వాడి చేతిలోని వెదురు పిల్లనగ్రోవి అయింది
ఆమె చేతిలో నువ్వు ప్రార్థనాచిత్రమై
స్వర్గానికే నిచ్చెన వేశావు - చిన్న ముగ్గులు పెద్ద ముగ్గులు చిక్కు ముగ్గులు చూడ రా
సన్న ముగ్గులు మెలిక ముగ్గులు సంజ ముగ్గులు నీకెరావన్నె ముగ్గులు పూల ముగ్గులు పాము ముగ్గులు గాంచ రా
కన్నె ముగ్గులు రవల ముగ్గులు కావి ముగ్గులు నీకెరాపూస ముగ్గులు పొడుల ముగ్గులు పూజ ముగ్గులు కనగ రా
కాసు ముగ్గులు గింజ ముగ్గులు గవ్వ ముగ్గులు నీకెరాపిండి ముగ్గులు నిడివి ముగ్గులు పీట ముగ్గులు వేడ్కరా
పెండ్లి ముగ్గులు రంగు ముగ్గులు ప్రేమ ముగ్గులు నీకెరాతట్ట ముగ్గులు సుద్ద ముగ్గులు తమ్మి ముగ్గులు సొంపురా
మట్టి ముగ్గులు పట్టె ముగ్గులు మణుల ముగ్గులు నీకెరాపసుపు ముగ్గులు తీగ ముగ్గులు పలక ముగ్గులు చెలువురా
యిసుక ముగ్గులు తాడు ముగ్గులు యెఱుపు ముగ్గులు నీకెరానవత ముగ్గులు రేకు ముగ్గులు నగల ముగ్గులు భళిభళీ
కవిత ముగ్గులు ఆకు ముగ్గులు కమ్మి ముగ్గులు నీకెరా
గ్రంథసూచి
- క్రీడాభిరామము, వినుకొండ వల్లభరాయడు, ఎమెస్కో బుక్స్, విజయవాడ, 1997.
- ఆంధ్రుల సాంఘిక చరిత్ర, సురవరము ప్రతాపరెడ్డి, ఆంధ్ర సాహిత్య పరిషత్తు, హైదరాబాదు, 1950.
- ఆముక్త మాల్యద, శ్రీకృష్ణదేవరాయలు, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 1995.
- విజయవిలాసము, చేమకూర వేంకటకవి, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 1995.
- శ్రీవర్ణనరత్నాకరము, 1,2, దాసరి లక్ష్మణస్వామి, శ్రీ విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురము, 1928; శ్రీవర్ణనరత్నాకరము, 3,4, దాసరి లక్ష్మణస్వామి, శ్రీ విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురము, 1930.
- కావ్యాదర్శః, దండి, వ్యాఖ్య పుల్లెల రామచంద్రుడు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1981.
- తండి యలంగారం, సుబ్రమణ్య దేశికర్ వ్యాఖ్య, తిరునెల్వేలి తెన్నిందియ శైవ శిత్తాంద నూర్పదిప్పు కళగం, తిరునెల్వేలి, 1943.
- చిత్రం – చిత్రబంధ, V. బాలసుబ్రమణ్యం, రాష్ట్రీయ సంస్కృత సంస్థానం, న్యూ ఢిల్లీ, 2010.
- Green Well Years, Manohar Devadoss, East-West Books, Madras, 1997.
